Thursday, September 6, 2012

విఘ్నేశ్వరుడు - 5


పార్వతి క్షణంలో తన దుఃఖమంతా మరిచిపోయి, పిల్లవాణ్ణి ఎత్తుకుని దిష్టి తీసింది. శివుడు చేతులు చాచి పిలిచాడు. మళ్ళీ ఏం చేసిపోతాడో అని భయం భయంగా తప్పట డుగులువేస్తూ వెళ్ళిన విఘ్నేశ్వరుడి ముద్దు చేష్టకు అంతా ముచ్చటపడ్డారు.
 
‘‘నాయనా, విఘ్నేశ్వరా! నిన్ను పుత్రుడిగా పొంది ధన్యులం అయ్యాము. చిరంజీవ!'' అని శివుడు ఎత్తి ముద్దాడుతూంటే విఘ్నేశ్వరుడు కిందకు దూకి, ‘‘తండ్రీ! ఎంతమాట, నేను మీ కొడుకును, ధన్యుణ్ణి నేను!'' అంటూ పార్వతీ శివుల పాదాలను చిరుతొండంతో చుట్టి, కళ్ళకద్దుకొని ప్రణామాలు చేశాడు. తరవాత బుల్లిబుల్లి అడుగులతో వెళ్ళి, విష్ణువును సమీపించి ఆయనకు ప్రణామం చేశాడు. విష్ణువు, ‘‘రావోయి ముద్దుల మేనల్లుడా!'' అని దగ్గరకు తీసుకొని, ‘‘కళ్యాణమస్తు!'' అని దీవించాడు.
 
అప్పుడు విష్ణువు కాంతిలో విఘ్నేశ్వరుడు నీలాకాశం రంగులో కనిపించాడు. విష్ణువుకూ, విఘ్నేశ్వరుడికీ ఏవో పోలికలున్నట్లు అందరికీ తోచింది. అదే మేనమామ పోలిక అంటే! అని అనుకున్నారు.

వినాయకుడు బ్రహ్మకు నమస్కరించాడు. బ్రహ్మ, ‘‘తొలిపూజలందుకోవయ్యా బొజ్జ గణపయ్యా!'' అని అంటూ అతని ఏనుగు బుగ్గలు చిదిమి చిటిక వేశాడు. తర్వాత విఘ్నేశ్వరుడు లక్ష్మికి, సరస్వతికి మ్రొక్కాడు. వాళ్ళిద్దరూ కలిసి అతణ్ణి ఎత్తుకుని చెరో చెంపా ముద్దాడి, ‘‘మేము విఘ్నేశ్వరుడి ఇరుపక్కలా అత్తాకోడళ్ళ పొరపొచ్చాలు మాని ఇలాగే సఖ్యంగా ఉంటాము!''

అని పార్వతిని చూసి, ‘‘ముగ్గురమూ ఒకే ముగ్గురమ్మల మూలపుటమ్మ నుంచి వచ్చిన సంగతి పుత్రగణపతి చెప్పనే చెప్పాడు. తర్వాత మళ్ళా విడివిడిగా క్షరసాగరం నుంచి లక్ష్మి, బ్రహ్మ నాలుక నుంచి సరస్వతిగా వాణి, మొదట దక్షుని కుమార్తె  సతీదేవిగాను, ఇప్పుడు హిమవంతుని పుత్రి పార్వతిగా ఉమ అవతరించాము. జయలక్ష్మి అనే సిద్ధి, విద్యా వతి అనే బుద్ధి వినా…ుకుడికి తగిన వధువులు. ఇహ  విఘ్నేశ్వరుని పెళ్ళి ముచ్చటే చూడాలి!’’ అని అన్నారు.

లక్ష్మి,‘‘లక్ష్మీకరుడైన విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన వారిని స్థిరంగా అంటిపెట్టుకొని ఉంటాను! సిద్ధిస్వరూపిణి జయలక్ష్మి నా అంశ. వినాయకుడికి  కానున్న భార్య!’’ అని చెప్పింది.

సరస్వతి, ‘‘విఘ్నేశ్వరుడు జ్ఞానప్రదాత, విజ్ఞానదాయకుడు.  అక్షరాభ్యాసానికి ముందు పిల్లలచేత పసుపు ముద్ద విఘ్నేశుడి పూజ జరిపించి, విఘ్నేశ్వర పరిపూర్ణ స్వరూపంగా గుండ్రంగా చుట్టించి మరీ ఓనమాలు దిద్దించాలి; నా అంశగల విద్యావతి బుద్ధి రూపిణి, వినాయకుడి నాయకి!’’ అని చెప్పింది.

అప్పుడు విఘ్నేశ్వరుడు  బేలముఖం పెట్టి, అందరినీ కలయజూచి, ‘‘చూశారా! పెద్దల తీరు ఎలా ఉందో! పెళ్ళిచేసుకొని, వారు పడ్డ అవస్థలే పిల్లలు కూడా పడాలని పెళ్ళి తొందర పెడతారేగాని, కొంతసేపు హాయిగా ఉండ నివ్వరు. అందునా అమ్మలకు మరీ ఆరాటం!’’ అన్నాడు.

అప్పుడు విష్ణుమూర్తి, ‘‘లేదురా  బాబూ! అణిమాది సిద్ధులకు,అష్టైశ్వర్యాలకు మూలమైన సిద్ధులు ఎనమండుగురు, చక్కనిచుక్కలై నిన్ను పూర్ణచంద్రుణ్ణి  కొలిచినట్లు సేవిస్తూంటే చూడాలని  తొందరగానే ఉంది, సుమీ!’’ అన్నాడు.

విఘ్నేశ్వరుడు, ‘‘ఓహో! అలాగా, నువ్వు కృష్ణావతారంలో అష్టమహిషులతో వేగుతూ  ఆనందిద్దువుగానిలే!’’ అన్నాడు. విష్ణువు మందహాసం చేసి, ‘‘నీమాటకు తిరుగులేదు గాని, నీకుమాత్రం పదిమంది వధువుల పెళ్ళి తప్పదు!’’అన్నాడు.

‘‘అలాగైతే విఘ్నేశ్వరుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అన్న సామెతగా, నేనే విఘ్నాలు కల్పించుకోకతప్పదు!’’అన్నాడు విఘ్నేశ్వరుడు చిరుకోపంతో.

‘‘వెయ్యికాదు, కోటి విఘ్నాలు వచ్చినా విఘ్నేశ్వరుడి పెళ్ళి ఆగదు!’’ అని బ్రహ్మతో గొంతులు కలిపి అందరూ  ఒక్కసారిగా అన్నారు. 

అప్పుడు నారదుడు ముందుకు వచ్చి, ‘‘విజ్ఞానేశ్వరా! వాచాలతలో నన్ను మించావు కాని, పెళ్ళి తప్పించుకోవడం ఎవరితరం! నేను సంసార సాగరం ఈదడం చాతగాకనే కదా మునినై తిరుగుతున్నాను.  జ్ఞానేశ్వరా! కళ్యాణం, ఉద్యోగం పురుషలక్షణం అని పురుషోత్తములూ,  ఆదిదేవుళ్ళూ అనిపించుకున్న ప్రముఖులంతా పెళ్ళిళ్ళు చేసుకొని సృష్టి, స్థితి, లయాది ఉద్యోగాలు  హాయిగా చేస్తున్నారు. నీవూ, నేనూ అనగా ఎంత!’’ అన్నాడు.

విఘ్నేశ్వరుడు నవ్వి, ‘‘ఓహో! నీకూ పెళ్ళి పిచ్చి తగిలేలాగుందే! స్వయంవరానికి కూడా వెళ్ళేవులాగుంది!’’ అన్నాడు.
.
నారదుడు, ‘‘త్రికాలవేదిని నేనేననుకుంటే అనంతకాలవేదివి నీవు. నీతో వాదించటం నా తరమా? మాటకారితనంలో నీ తర్వాతనే నేను. అందరి జాతకాలూ నీ చేతుల్లోనే ఉన్నాయి. నిన్ను విస్మరించిన ఎలాంటి ఉద్దండ జ్యోతిష పాండిత్యమూ ఫలించదు. మనం ఇద్దరం మేలురకం వాగుడుకాయలం! మాటలకు దిగితే అనంత కాలం చాలదుగాని, నీవు పూర్ణ జ్ఞానివి. మాలాంటి అర్ధజ్ఞానులు  ఎలాంటి పిచ్చిలోపడ్డా నీలాంటివాళ్ళు తామరాకు మీద నీటిబొట్టులాగ దేనికీ లొంగిపోరు. నీవు మాయకు అతీతుడివి.కాబట్టి సిద్ధిబుద్ధులూ, అష్టసిద్ధులూ నిన్ను వరించుతాయని, నన్ను కూడా శ్రీరస్తు, శుభమస్తు, శీఘ్రకళ్యాణ సిద్ధిరస్తు! అని పలికించనియ్యి,’’ అని అంటూ మహతి వీణపై కళ్యాణిరాగం మొదలుపెట్టి  సామరాగం అందుకొని సౌరాష్ట్ర రాగంతో మంగళ గీతాన్ని పలికించాడు.‚

దేవతలంతా ఎవరి తావులకు వారు వెళ్ళారు. విఘ్నేశ్వరుణ్ణీ, పార్వతినీ, వెంటబెట్టుకుని శివుడు తన నివాసమైన  కైలాసానికి వెళ్ళాడు. నారదుడు తిన్నగా వజ్రదంతుడి దగ్గరికి బయలుదేరాడు.

ఆనాడు పుత్రగణపతి తోకపట్టి గిరగిరా తిప్పి విసిరితే పడ్డ పాటుకు వజ్రదంతుడి ఒళ్ళునొప్పులింకా తీరనేలేదు. ధవళ, భర్తకు పరిచర్యలు చేస్తున్నది. వచ్చిన నారదుణ్ణి చూసి, మళ్ళీ ఏం గొడవ తెచ్చిపెడతాడో అని అనుకుంటూనే లోనికి  వెళ్ళింది.

నారదుడు మూషికాసురుడితో, ‘‘నిన్ను ఘోరంగా పరాభవించిన గణపతి విఘ్నేశ్వరుడిగా వర్థిల్లుతున్నాడు, మరి...’’ అంటూ   ఆగాడు.


పరాభవాగ్ని రగిలి, వజ్రదంతుడు, ‘‘ఇప్పు డేం చెయ్యమంటావు, నారదా?’’ అని బిక్క మొహం పెట్టాడు. నారదుడు, ‘‘వరాల దేవుడు బ్రహ్మ ఉండనే ఉన్నాడు గదా! వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి! ప్రతీకారం సాధించు. గణపతి విఘ్నేశ్వర నామం ధరించాడు, గజముఖుడు! గుర్తుంచుకో!’’ అని చెప్పి చల్లగా వెళ్ళాడు.

మహాశ్వేత అనే నామాంతరం గల ధవళ ఎంత చెప్పినా వినకుండా, వజ్రదంతుడు, ‘‘మహాశ్వేతా! నీ పసుపుకుంకాల పుణ్యమా అని నాకెలాగూ చావు భయం లేదు గద! ప్రతీకారం చేసి మనశ్శాంతిని పొందనివ్వు!’’ అని చెప్పి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. ‘‘ ఏం కావాలి ఇంకా?’’ అని బ్రహ్మ అడిగాడు.

‘‘విఘ్నానికి రూపం కల్పించి, నా  ఆజ్ఞానువర్తిగా చెయ్యి!’’ అని మూషికాసురుడు కోరాడు. బ్రహ్మ విఘ్నాన్ని  ఆవాహన చేసి వజ్రదంతుడి ముందుంచాడు. అతడికేమీ కనిపించ లేదు. బ్రహ్మ అతనికి సూక్ష్మదర్శన దృష్టి ఇచ్చాడు. విఘ్నం మామూలు కంటికి కనిపించని కారునల్లని సూక్ష్మక్రిమి రూపంలో  అతడికి కనిపించింది.

మూషికాసురుడు ఆశ్చర్యంతో, ‘‘ఇదేమిటి!  ఈ నలుసును ఏం చేసుకోను?’’ అన్నాడు. బ్రహ్మ నవ్వి, ‘‘విఘ్నం పెనుభూతం లాగ ఉంటుందనుకున్నావు కాని, విఘ్నబీజం కంటికి కనిపించని సూక్ష్మాణువు. సూక్ష్మ క్రిమివల్ల భయంకర వ్యాధి వ్యాపించినట్లే, అనర్థదాయకమైన విఘ్న కారణం ఎంత చిన్నదైనా, ఎంతటి భీషణాకృతినైనా ధరించి సర్వనాశనం చేయగలదు! కామరూపి, ఏ రూపాన్నైనా ధరించి, అనర్థాలు కలిగించటమే దాని పని. ఏం చేసుకుంటావో  చేసుకో!’’ అని చెప్పి అంతర్థానమయ్యాడు.

మూషికాసురుడు విఘ్నంతో, ‘‘నువ్వు వెంటనే మహాగజాసుర రూపంతో వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి నాశనం చెయ్యి!’’ అని ఆజ్ఞా పించాడు. విఘ్నం ఏనుగు శరీరమూ, ఏనుగు కాళ్ళూ, భయంకరమైన చిన్న తలా, పెద్ద కోరలూ, నిప్పుల్లాంటి కళ్ళూ గల గజాసుర రూపం పొంది, మహాపర్వతం లాగ కత్తి ఝళిపిస్తూ ఆకాశానికి ఎగిసి ఎగురుతూ వెళ్ళాడు.


 కైలాసంలో విఘ్నేశ్వరుడు అల్లారుముద్దుగా పెరిగి, తలిదండ్రుల అనుమతితో తానుపుట్టిన విశ్వకర్మ నిర్మించిన భవనానికి బయలుదేరాడు.   ఎదురుగా వస్తూ మన్మథుడు రూపంతో కనిపించాడు. విఘ్నేశ్వరుడు ఆశ్చర్యంగా, ‘‘కనిపించనివాడివి కనిపించావు, ఏమిటి విశేషం? నా మీద  నీ విలువిద్య చూపకు సుమీ! అర్భకుణ్ణి,’’ అన్నాడు.

మన్మథుడు వినయంగా తలవంచి, ‘‘గజేంద్రా!  నీవు నా బాణాలకు అతీతుడివి. నాకు కనిపించాలని ఉంటే కనిపించే వరం శివుడు ఇచ్చినదే గదా. దగ్గిర పోలికలున్న దగ్గిరవాళ్ళం గనుక కనిపించాను. అంతే! నీవు ఎద్దునెక్కిన శివుడి కొడుకువైతే, నేను గ్రద్ద నెక్కిన విష్ణువు కుమారుణ్ణి. నన్ను శివుడు దహించి బ్రతికించాడు. నిన్ను ఖండించి బతికించాడు.

నా వాహనం చిలుక, నీ వాహనం  ఎలుక. మనస్సును  చలింపజేసే పూలమ్ములు  నా ఆయుధాలైతే, మనో నిగ్రహాన్ని ఇచ్చే పాశాంకుశాలు నీ ఆయుధాలు. మరి నీకు తమ్ముడు కుమారస్వామి పుట్టాలి గదా? పార్వతీపరమేశ్వరుల పరస్పర అనురాగ తేజస్సే కుమారస్వామిగా అవతరించాలి! తారకాసుర  నిర్మూలన జరగాలి. అందుకే గదా నన్ను దేవతలు బూడిద కూడా చేయిం చింది. కైలాసం చేరబోతున్నాను, అనుజ్ఞ ఇవ్వు!’’ అన్నాడు.

విఘ్నేశ్వరుడు, ‘‘మన్మథా! అందుకే నేనూ  కైలాసం దిగి వెళ్తున్నదీను. నీ పని నిర్విఘ్నంగా నెరవేర్చు, జయప్రదమవుతుంది!’’ అన్నాడు. మన్మథుడు అదృశ్యుడై   ఆక్షణమే పార్వతీ శివులున్న  అద్భుతమైన కైలాస మంటపాన్ని చేరుకున్నాడు.


విఘ్నేశ్వరుడు భవనాన్ని చేరుకుని, సింహద్వారానికి చేరువగా చంద్రశిలా వేదికపై సుఖంగా కూర్చుని పరిసర ప్రకృతిని ఆనందంగా చూస్తున్నాడు. మెరుగుపెట్టిన వెండి హిమగిరి శిఖరాలు సంధ్యకాంతుల్ని తళతళ ప్రతిఫలిస్తున్నాయి. హిమానీ జలపాతాలు  మంద్ర గంభీరంగా సరిగమలు వినిపిస్తున్నాయి. అలాంటి ప్రశాంత సమయంలో, ‘‘విఘ్నేశ్వరుడనే వాడు ఎక్కడ?’’ అనే భీకర  గర్జనదిక్కులు మారుమోగుతూ వినిపించింది.

మహాగజాసుర రూపం ధరించిన  విఘ్నం, విఘ్నేశ్వరుడి ఎదురుగా వాలింది. భూమి కంపించింది. గజాసురుడు, ‘‘నేను మహా గజాసురుణ్ణి. నువ్వు గజముఖుడివైతే, నేను గజకారుణ్ణి! నిన్ను హతమార్చ వచ్చాను!’’ అంటూ రంకె  వేశాడు.

విఘ్నేశ్వరుడు చెవిటివాడిలాగ అమాయకంగా చూస్తూ, ‘‘అబ్బీ, ముక్కలు నరుక్కొని చెరుకుగడ తినాలనుంది. గొడ్డలి కాస్త పదును పెట్టి ఇస్తివా నీకు కుడుములు పెడతాను,’’ అని అంటూ పరశువును వాటంగా విసిరాడు. గజాసురుడి కాళ్ళు తెగి పర్వతంలా కూలాడు. విఘ్నేశ్వరుడు ఎక్కి  తాండవం  చేస్తూ  మర్దిస్తూంటే, ‘‘మహాప్రభో! నేను విఘ్నాన్ని! బ్రహ్మ ఇచ్చిన వరం మేరకు మహాగజాసుర రూపంలో వచ్చాను. శాస్తి అయింది!’’ అని విఘ్నం భీకరంగా అరిచింది.

విఘ్నేశ్వరుడు, ‘‘నేను విఘ్న వినాశకుణ్ణి! అదీగాక నువ్వు ఇప్పుడు మాయదారి గజాసురుడివి. నిన్ను తుత్తునియలు చేయక తప్పదు. నీ తునకలు నన్ను, నిన్ను ఏమర్చిన వాళ్ళను మాత్రమే పట్టి పీడిస్తాయి. నువ్వు కాళీయ నాగుడవై కాళింది మడుగున దాగి ఉండు. బాలకృష్ణుడు నిన్ను మర్దిస్తాడు. అతని పాదాలు నీ తలలమీద పడి నీ పాప పరిహారం అవుతుంది; జాతి సర్పాల పడగలపై విష్ణు పాదముద్రలు అది మొదలు అలంకారంగా శోభిస్తాయి!’’ అని చెప్పి, పరశువును పట్టి విఘ్నాన్ని ఛిన్నాభిన్నం చేశాడు. ఆ రేణువులు అంతటా వ్యాపించి అదృశ్యమయ్యాయి. విఘ్నం అణురూపంతో మిగిలింది. దేవతలు విఘ్నేశ్వరుడిపై పూలజల్లు కురిపించారు.



No comments:

Post a Comment