Friday, September 7, 2012

రామాయణం - కిష్కింధా కాండ 4


రాముడు దుఃఖంతో మూర్ఛపోయి ఉన్న తారను చూశాడు. అది గమనించి వానరులు తారను వాలి శరీరం మీది నుంచి పట్టి లేవదీశారు. తార రాముణ్ణి చూసి అతణ్ణి సమీపించి, ‘‘రామా, నా భర్త ప్రాణాలు తీసిన బాణంతోనే నన్ను కూడా చంపి, నా భర్త వద్దకు చేర్చు. సీత కోసం నువ్వు ఎలా తపిస్తున్నావో, వాలి నా కోసం ఆ లోకంలో అలా తపిస్తాడు.
 
భార్యా వియోగం ఏమిటో నీకు తెలుసుగదా! వాలి పోయూక నేను జీవచ్ఛవాన్నే గనక స్ర్తీ హత్యాదోషం నిన్నంటదు,'' అంటూ ఏడ్చింది. రాముడు తారనూ, సుగ్రీవుణ్ణీ యథోచితంగా ఊరడించాడు. వాలి దహన క్రియల పని చూడమని లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి హెచ్చరించాడు. తారుడు కిష్కింధకు వెళ్ళి వాలిని మొయ్యటానికి ఒక పల్లకీ తెచ్చాడు.
 
సుగ్రీవుడూ, అంగదుడూ వాలిని ఎత్తి పల్లకీలో పడుకో బెట్టారు. బలిష్ఠులైన వానరులు పల్లకి మోస్తూ వెళ్ళారు. ఒక వాగు ఒడ్డున ఇసుక ప్రదేశంలో వాలికి చితి ఏర్పాటయింది. అంగదుడు శాస్ర్తోక్తంగా చితికి నిప్పు పెట్టాడు. వానరులు వాలికి జలతర్పణాలు విడిచారు. ఉత్తరక్రియలు పూర్తి కాగానే సుగ్రీవుడు తడి బట్టలతో, తన మంత్రులను వెంటబెట్టుకుని రాముడి వద్దకు వచ్చాడు.
 
అప్పుడు హనుమంతుడు రాముడితో, ‘‘మీ అనుగ్రహం చేత సుగ్రీవుడు వానర రాజ్యాన్ని పొందగలిగాడు. అతనిక రాజ్యభారం వహించవలిసి ఉన్నది. మీరు వచ్చి అతనికి సక్రమంగా పట్టాభిషేకం చేయించండి,'' అన్నాడు.

దానికి రాముడు, ‘‘హనుమంతుడా, తండ్రి ఆనతి ప్రకారం నేను పధ్నాలుగేళ్ళ పాటు గ్రామాలలోకీ, నగరాలలోకీ అడుగు పెట్ట వీలులేదు. అందుచేత మీరంతా సుగ్రీవుణ్ణి కిష్కింధకు తీసుకుపోయి శాస్ర్తప్రకారం పట్టాభిషిక్తుణ్ణి చెయ్యండి,'' అన్నాడు. రాముడు సుగ్రీవుడితో అంగదుణ్ణి యువరాజును చెయ్యమనీ, వర్షాకాలం ఆరంభం కాబోతున్నది గనుక వానలు పోయేదాకా తానూ, లక్ష్మణుడూ ఋశ్యమూకం మీది గుహలో ఉంటామనీ, కార్తీకమాసం ఆరంభమయ్యేటప్పుడు సుగ్రీవుడు రావణుడిపై యుద్ధ యత్నాలు ఆరంభించవలసి ఉంటుందనీ చెప్పాడు.
 
సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి యధా విధిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. కిష్కింధ వాసులందరూ సంతోషించారు. గజుడూ, గవాక్షుడూ, గవయుడూ, శరభుడూ, గంధమాదనుడూ, హనుమంతుడూ, జాంబవంతుడూ, నళుడూ బంగారు కలశాలతో సుగ్రీవుణ్ణి అభిషేకించారు. తన పట్టాభిషేకం పూర్తి కాగానే సుగ్రీవుడు అంగదుడికి యౌవరాజ్య పట్టాభిషేకం చేసి, అంగదుడిపై ఆదరాభిమానాలు గల కిష్కింధ పౌరులకు ఆనందం కలిగించాడు.
 
తరవాత అతను రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి, కిష్కింధకు తిరిగి వచ్చి తన భార్య అయిన రుమతో సుఖంగా కాలం గడపసాగాడు. సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడైనాక రామలక్ష్మణులు తమ నివాసాన్ని ప్రస్రణ పర్వతం పైన ఉండే ఒక విశాలమైన గుహకు మార్చుకున్నారు. ఈ గుహ అన్ని విధాలా సౌకర్యంగా ఉన్నది.
 
గుహలోకి వానజల్లు రాదు, ఈదురుగాలి రాదు. పరిసరాలు ఎంతో అందంగా ఉన్నాయి. సమీపంలోనే నది ఉన్నది. అదీకాక ఈ గుహ కిష్కింధకు చాలా దగ్గిర; కిష్కింధలోని గీత వాద్య ధ్వనులూ, వానరుల కేకలూ ఆ గుహకు వినిపిస్తున్నాయి. ఇలాటి గుహలో రాముడు అహోరాత్రాలు సీతకై విరహం పొందుతూ, లక్ష్మణుడి చేత హెచ్చరించబడుతూ, సుగ్రీవుడు ప్రత్యుపకారం చెయ్యకపోతాడా అని ఆశ్చర్య పడుతూ, ఈ నాలుగు మాసాలూ గడిచి శరత్కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు.

వానాకాలం వచ్చింది, వెళ్ళింది. సుగ్రీవుడు తన భార్య అయిన రుమతో కలిసి సుఖభోగాలలో మునిగి తేలుతూ, రాజ్యభారం మంత్రులపై వేసి, రామకార్యం నిర్వర్తించే సమయం వచ్చిందన్న మాటకూడా తలపెట్టలేదు. అందుచేత హనుమంతుడు సుగ్రీవుడి వద్దకు వచ్చి, ‘‘నీకు రాజ్యమూ, కీర్తీ లభించాయి. శత్రుభయం ఏమీలేదు. కాని మన మిత్రుల పని చూడవలిసిన బాధ్యత అలాగే ఉండిపోయింది.
 
ఇలాటి పనులలో జాప్యం కూడా తప్పే. అందుచేత వెంటనే సీతను వెతికే పని ప్రారంభించు. నీ సహాయం కోసం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నప్పటికీ, భార్యా వియోగంతో ఎంతగా తపించి పోతున్నప్పటికీ రాముడు నీ బాధ్యతను జ్ఞాపకం చెయ్యటం లేదు. అతను అడగక ముందే మనం పని ప్రారంభిస్తే మనకు అలక్ష్యదోషం ఉండదు.
 
నీ మాట నువ్వు నిలబెట్టుకుంటావనే ఉద్దేశంతో అతను ఎదురు చూస్తున్నాడు. ఇంక ఆలస్యం చెయ్యటం భావ్యం కాదు,'' అన్నాడు. ఈ హెచ్చరికతో సుగ్రీవుడు చైతన్యం పొందాడు. అతను నీలుణ్ణి పిలిచి సైన్యాలన్నిటినీ రప్పించమని ఆజ్ఞాపించాడు; ఏ వానరుడు గాని పదిహేను రోజుల లోపుగా కిష్కింధకు చేరకపోతే వాడికి మరణదండన విధించమన్నాడు; జాంబవంతాదుల దగ్గిరికి అంగదుణ్ణి వెంట బెట్టుకుని నీలుణ్ణి స్వయంగా వెళ్ళమన్నాడు.
 
ఒకనాడు లక్ష్మణుడు ఫలాల కోసం కొండ కోనలన్నీ చెడతిరిగి వచ్చేసరికి రాముడు అగాధమైన దుఃఖంలో మునిగి ఉన్నాడు. అతనికి శరత్కాలంతోబాటు సీతా వియోగ బాధ కలిగి దుఃఖం ముంచుకొచ్చింది. లక్ష్మణుడు తన అలవాటు ప్రకారం రాముణ్ణి ఊరడించి, దుఃఖం నిరుపయోగమనీ, కర్తవ్యం నెరవేర్చటానికి ధైర్యమూ, ఉపాయమూ కావాలనీ జ్ఞాపకం చేశాడు.
 
అంతా విని రాముడు, ‘‘లక్ష్మణా, వానాకాలం వెళ్ళి శరత్కాలం వచ్చింది. ఈ నాలుగు నెలలూ ఎంతో బాధతో గడిపాను. రాజులు యుద్ధాలకు బయలుదేరే సమయం వచ్చినా సుగ్రీవుడి జాడలేదు. అతను ఏ ప్రయత్నంలోనూ ఉన్నట్టు కనపడడు. అతనికి నా మీద ఇంకా దయ రాలేదు. ‘రాముడు దిక్కులేనివాడు, రాజ్యభ్రష్టుడు, అడవుల పాలై, భార్యను రావణుడపహరించగా దైన్యంతో మన శరణు జొచ్చాడు,' అని సుగ్రీవుడు నన్ను అనాదరంగా చూస్తున్నట్టున్నాడు.

లేక తన పని గడిచిందిగదా అని తాను చేసిన వాగ్దానాన్ని మరిచాడో! నువ్వు కిష్కింధకు వెళ్ళి నేను చెప్పినట్టుగా అతనితో చెప్పు: అన్న మాట నిలబెట్టుకోని వాడు పురుషాధముడు. ప్రత్యుపకారం చెయ్యని వాడి శవాన్ని కాకులూ గద్దలూ కూడా ముట్టవు.
 
అతనికి నా బాణంయొక్క ధ్వని మళ్ళీ వినాలని ఉన్నదేమో! ఇందుకేనా ఈ సుగ్రీవుడితో నేను స్నేహం చేసి, వాలిని చంపింది? వాలిని ఒక్కణ్ణే చంపాను, ఈ సుగ్రీవుణ్ణి బంధువులతో సహా చంపగలను. అందుచేత నువ్వు సుగ్రీవుడితో ఎలా చెప్పాలో అలా చెప్పు,'' అన్నాడు. లక్ష్మణుడికి కూడా సుగ్రీవుడిపై పట్టరాని ఆగ్రహం వచ్చింది.
 
అతను రాముడితో, ‘‘నీ మూలానే తనకు రాజ్యప్రాప్తీ, భార్యాప్రాప్తీ కలిగిందని కూడా తలచకుండా ఆ సుగ్రీవుడు, తాగి భార్యలతో తల కిందులై పోతున్నాడు. ఇలాటివాణ్ణి రాజుగా ఉండనివ్వరాదు. ఇప్పుడే వెళ్ళి వాణ్ణి వాలి దగ్గిరికి పంపించేస్తాను; సీతను వెతకటానికి అంగదుడున్నాడు, వానర వీరులున్నారు,'' అన్నాడు బాణాలు తీసుకుని బయలుదేరుతూ. రాముడు లక్ష్మణుడితో శాంతంగా, ‘‘లక్ష్మణా, తొందరపడకు.
 
మిత్రవధ చేసి నిష్కారణంగా పాపం అంటగట్టుకోకు. సుగ్రీవుడు అన్న సమయూనికి రాకపోవటం తప్ప వేరే మహాపరాధం ఏం చేశాడు? నువ్వు వెళ్ళి అతనితో మృదువుగానే మాట్లాడు,'' అని అతణ్ణి పంపేశాడు. లక్ష్మణుడు కిష్కింధ చేరి సుగ్రీవుడి ఇంటికి బయలుదేరాడు. అణగని కోపంతోనూ, అతి వేగంతోనూ పోతున్న లక్ష్మణుణ్ణి చూసి పెద్ద పెద్ద వానర వీరులు, అతనెవరో శత్రువనుకుని, అతని పైన వెయ్యటానికి చెట్లు పీకారు.
 
అది చూసి లక్ష్మణుడు వారి కేసి నిప్పులు కక్కుతూ చూశాడు. దానితో వారు భయపడి దూరంగా తొలగారు. కొందరు సుగ్రీవుడి ఇంటికి వెళ్ళి లక్ష్మణుడు వస్తున్నాడని చెప్పారు. కాని భార్యతో సరస సల్లాపాలలో ముణిగి ఉన్న సుగ్రీవుడా మాట వినిపించుకోలేదు. ఈలోపల సుగ్రీవుడి మంత్రులు, లక్ష్మణుడు నిజంగా వస్తున్నాడేమో చూసి రమ్మని కొందరు వానరులను పంపారు.

వాళ్ళతో బాటు వచ్చిన అంగదుణ్ణి చూసి లక్ష్మణుడు, ‘‘నేను వచ్చానని సుగ్రీవుడితో చెప్పు, నాతో మాట్లాడతాడో లేదో, తెలుసుకుని వెంటనే రా!'' అన్నాడు. అంగదుడు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి, నమస్కారం చేసి, లక్ష్మణుడు చెప్పమన్నట్టే చెప్పాడు. కాని సుగ్రీవుడు తాగిన మత్తులో ఉండి ఏమీ వినిపించుకోలేదు. అయితే, లక్ష్మణుడి రౌద్రాకారం చూసి వానరులు చేసిన కలకలానికి సుగ్రీవుడి మత్తు కొంత వదిలింది.
 
అంగదుడు అవతలికి వెళ్ళి ప్లక్షుడూ, ప్రభావుడూ అనే మంత్రులతో సుగ్రీవుడి వద్దకు తిరిగి వచ్చేసరికి అతను కొంత స్పృహలో ఉన్నాడు. వారు అతనితో లక్ష్మణుడు మాట్లాడటానికి వచ్చాడని చెప్పారు. లక్ష్మణుడు ధనుర్బాణాలతో సహా వచ్చాడనీ, చాలా కోపంలో ఉన్నాడనీ సుగ్రీవుడికి తెలిసింది. సుగ్రీవుడు మంత్రులతో, ‘‘నేనేమీ తప్పు చేయలేదే, లక్ష్మణుడికి ఆగ్రహం ఎందుకు కలిగి ఉంటుందీ?
 
నా శత్రువు లెవరో అతనితో నాపై చాడీలు చెప్పి ఉంటారు. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి అతని కోప కారణం తెలుసుకోవాలి. రామలక్ష్మణులంటే నాకు భయమని కాదు, కాని మిత్రుడికి కోపం వచ్చినప్పుడు ఆందోళన చెందటం సహజం. రాముడు చేసిన ఉపకారానికి ప్రత్యపకారం చెయ్యటం నాకు సాధ్యంకాదు,'' అన్నాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో, ‘‘రాజా, రాముడికి నీ మీద అలక వచ్చి ఉంటుందేగాని నిజమైన ఆగ్రహం రాదు.

నువ్వు ఏమరుపాటున శరదృతువు రావటం గమనించలేదు. అందుకే లక్ష్మణుడు వచ్చి ఉంటాడు. అతను కాస్త పరుషంగా మాట్లాడినా నువ్వు సహించాలి, ఎందుకంటే తప్పు నీదే. రాముడికి ఆగ్రహం తెప్పించటం ఎవరికీ మంచిది కాదు; అతని వల్ల లాభం పొందిన నీకు అది బొత్తిగా అనుచితం,'' అన్నాడు. ఈలోపుగా లక్ష్మణుడు సుగ్రీవుడి అంతఃపురం దాకా వచ్చి, లోపల ఆడవాళ్ళ అలికిడి విని అక్కడే ఆగిపోయూడు.
 
లక్ష్మణుడు చేసిన ధనుష్టంకార ధ్వని విని సుగ్రీవుడు అతని ఎదట పడడానికి జంకి, లక్ష్మణుడితో మాట్లాడమని తారను పంపాడు. తార లక్ష్మణుడున్న చోటికి వచ్చి, ‘‘మీకు కోపం వచ్చిందిట, దేనికీ? మీ మాటను ఎవరైనా అతిక్రమించారా?'' అని అడిగింది. ‘‘సుగ్రీవుడు అస్తమానమూ తాగి ఉండి రాచకార్యాలు చూడడు, మా సంగతి ఆలోచించడు, నీకు తెలియదా? యుద్ధ సన్నాహానికి నాలుగు మాసాలు వ్యవధి తీసుకున్నాడు.
 
గడువు దాటిపోయింది. మా పని ప్రారంభం కాలేదు. మేమేం చెయ్యూలో నువ్వే చెప్పు,'' అన్నాడు లక్ష్మణుడు. తార అతనితో, ‘‘సుగ్రీవుడు భోగలాలసుడై ఉన్నందుకు ఆగ్రహించ వద్దు. అతను మీ పని మరవలేదు. ఇదివరకే అతను మీ పనికి వానరులను హెచ్చరించాడు. ఎక్కడెక్కడి పర్వతాల నుంచో వానరులు లక్షల, కోట్ల సంఖ్యలో వచ్చి చేరారు,'' అని చెప్పి అతన్ని తన వెంట అంతఃపురంలోకి తీసుకుపోయింది.
 
కాని తీరా లక్ష్మణుడు లోపలికి వెళ్ళే సరికి సుగ్రీవుడు, తాగిన మత్తులో ఎరబ్రడిన కళ్ళతో, అనేకమంది స్ర్తీల నడుమ కనిపించాడు. లక్ష్మణుడికి అతన్ని చూడగానే మండిపోయింది. అతను సుగ్రీవుణ్ణి చూసి, ‘‘తనకు ఉపకారం చేసిన మిత్రులకు అబద్ధపు ప్రతిజ్ఞ చేసేవాడు పరమపాపి. కృతఘు్నడు. వాణ్ణి ఎవరైనా చంపవచ్చు. రాముడి చేత నీ పని పూర్తి చేయించుకుని సీతను వెతికే ప్రయత్నం ప్రారంభించని నువ్వు కృతఘు్నడవు. వాలి వెళ్ళిన దారి జ్ఞాపకం ఉంచుకుని సీత కోసం వెతికించు,'' అన్నాడు.

No comments:

Post a Comment