Friday, September 7, 2012

రామాయణం - అరణ్యకాండ 2


ముందు రాముడూ, వెనక సీతా, సీత వెనకగా అస్త్రాలు చేపట్టి లక్ష్మణుడూ నడుస్తూ మునులను వెంటబెట్టుకుని అనేక పర్వతాలూ, నదులూ, సరస్సులూ, కొలనులూ, పక్షుల సమూహాలూ, ఏనుగుల మందలూ, ఎనుబోతుల మందలూ, అడవి పందుల మందలూ చూశారు. సూర్యాస్తమయ సమయూనికి వారు ఒక అందమైన సరస్సు చేరుకున్నారు. సరస్సు అడుగు నుంచి చక్కని గీతవాద్య ధ్వనులు రావటం చూసి రామ లక్ష్మణులు ఆనందాశ్చర్యాలు పొంది, ధర్మభృత్తనే మునిని, ‘‘ఏమిటీ వింత? రహస్యం కాని పక్షంలో చెప్పండి, విని ఆనందిస్తాము,'' అని అడిగారు.
 
వారికి ధర్మభృత్తు ఆ సరస్సు పుట్టు పూర్వోత్తరాలు తెలిపాడు: ఆ సరస్సు పేరు పంచాప్సరం. దానిని మాండకర్ణి అనే మహాముని తన తపశ్శక్తి చేత నిర్మించాడు. ఆ మహాముని వాయుభక్షణ చేస్తూ పదివేల సంవత్సరాలు అతి దారుణమైన తపస్సు చేసే సరికి, అగ్ని మొదలుగాగల దేవతలు భయపడి, ఆ ముని తమలో ఎవరిస్థానమో కాజేస్తాడని రూఢి చేసుకుని, తపోభంగం చెయ్యటం కోసం మెరుపుతీగల్లాంటి అయిదుగురు అప్సరసలను ఏరి మాండకర్ణి వద్దకు పంపారు. వారి ఎత్తు పారింది.
 
మాండకర్ణి వారి వ్యామోహంలో పడి, తన తపశ్శక్తి ధారపోసి ఈ సరస్సు సృష్టించి, తాను యౌవనదేహం ధరించి, నీటి అడుగున అప్సరసల నిమిత్తం అదృశ్య హర్మ్యాలు నిర్మించి, వారిని భార్యలుగా చేసుకుని నృత్యగాన వినోదాలతో కాలక్షేపం చేస్తున్నాడు.

ధర్మభృత్తు చెప్పిన ఈ కథ వింటూ సీతా రామ లక్ష్మణులు ఆశ్రమ సమూహాలను చేరుకున్నారు. ఆశ్రమవాసులు రాముడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చారు. రాముడు తన భార్యతోనూ, తమ్ముడితోనూ ఒక్కొక్క ఆశ్రమంలోనూ తన ఇష్టానుసారం ఒక సంవత్సరమో, ఎనిమిది మాసాలో, ఆరు మాసాలో, మూడు మాసాలో ఉంటూ సుఖంగా పది సంవత్సరాలు గడిపాడు.
 
పది సంవత్సరాల అనంతరం రాముడు సీతా లక్ష్మణులతో తిరిగి సుతీక్ష్ణ మహాముని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఉంటూ అతను ఒకనాడు మహామునితో, ‘‘ఈ మహారణ్యంలో ఎక్కడో అగస్త్యుల వారు ఉంటున్నారని వారూ వారూ అనగా విన్నాను. కాని స్పష్టంగా వారి ఆశ్రమం ఎక్కడ ఉన్నదీ చెప్పినవారు లేరు. మీరు తెలిపినట్టయితే మేము ముగ్గురమూ వెళ్ళి వారి దర్శనం చేసుకుంటాము. ఆయనకు శుశ్రూష చేయూలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది,'' అన్నాడు. ఈ మాట వినగానే „సుతీక్ష్ణుడు, ‘‘నేను కూడా నీకు అదే సలహా ఇవ్వాలనుకుంటున్నాను.
 
ఇంతలో నీవే అడిగావు. ఇక్కడికి దక్షిణంగా నాలుగామడలు పోతే అగస్త్యుడి తమ్ముడి ఆశ్రమం వస్తుంది. అక్కడికింకా ఒక ఆమడ దూరంలో అగస్త్యుడి ఆశ్రమం ఉన్నది. అవి చాలా అందమైన ఆశ్రమాలు. అక్కడ మీ ముగ్గురికి చాలా ఆనందంగా ఉంటుంది. వెళ్ళాలని ఉంటే వెంటనే బయలుదేరండి,'' అన్నాడు. రాముడాయనకు నమస్కారం చేసి సీతా లక్ష్మణులతో బయలుదేరి అగస్త్య మహాముని తమ్ముడి ఆశ్రమానికి చేరాడు. ఆ సమయంలోనే రాముడు లక్ష్మణుడికి అగస్త్య మహిమ చెబుతూ వాతాపి ఇల్వలుల వృత్తాంతం చెప్పాడు: ఇల్వలుడూ, వాతాపీ అని ఇద్దరు రాక్షసులుండేవారు. వారు ఎందరో బ్రాహ్మణులను మోసగించి చంపేశారు. ఇల్వలుడు బ్రాహ్మణ వేషం ధరించి, సంస్కృత భాషలో మాట్లాడుతూ బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి, ‘‘అయ్యూ, ఇవాళ మా ఇంట శ్రాద్ధం. తమరు భోక్తగా దయచెయ్యూలి,'' అని కోరేవాడు. నిజమే ననుకుని బ్రాహ్మణులు వచ్చేవారు. ఈ లోపుగా వాతాపి మేకరూపం ధరించేవాడు.

ఇల్వలుడా మేకను కోసి బ్రాహ్మణులకు పెట్టే వాడు. బ్రాహ్మణులా మేకను పూర్తిగా తిన్నాక ఇల్వలుడు, ‘‘వాతాపీ, ఇక వచ్చెయ్యి,'' అనేవాడు. అప్పుడు వాతాపి మేకలాగా అరుచుకుంటూ ఆ బ్రాహ్మణుల పొట్టలు చీల్చుకుని వచ్చేవాడు. ఈ విధంగా వారు అనేక వేల బ్రాహ్మణులను చంపిన మీదట ఇల్వలుడికి అగస్త్య మహాముని తటస్థపడ్డాడు. ఇల్వలుడి కోరికపై ఆయన భోజనానికి వచ్చి అతడు పెట్టిన మేక మాంసం తిన్నాడు.
 
ఆయన తృప్తిగా భోజనం చేశానన్న అనంతరం ఇల్వలుడాయనకు హస్తోదకం ఇచ్చి, ‘‘ఇక రా వాతాపీ!'' అని కేకపెట్టాడు. అగస్త్యుడు నవ్వుతూ, ‘‘ఇంకెక్కడి వాతాపి? వాడప్పుడే జీర్ణమై, యముడి ఇంటికి చేరుకున్నాడు!'' అన్నాడు. ఇల్వలుడు తన తమ్ముడు చచ్చాడని తెలిసి మండిపడి అగస్త్యుడి పైకి లేచి ఆయన చూపుల వేడికే బూడిద అయిపోయూడు. రాముడీ కథ చెప్పి లక్ష్మణుడితో, ‘‘అంత శక్తిమంతుడైన అగస్త్యులవారి తమ్ముడి ఆశ్రమం ఇది,'' అన్నాడు. అప్పటికే సూర్యాస్తమయ మయింది.
 
అగస్త్యుడి తమ్ముడు సీతా రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చాడు. వారా రాత్రి అక్కడే గడిపి, మర్నాడు ఉదయం ఆయన వద్ద సెలవు పుచ్చుకుని అగస్త్యాశ్రమానికి బయలుదేరారు. దారిలో ఎత్తయిన చెట్లు కనబడ్డాయి, మనోహరంగా పక్షులు పాడే పాటలు వినపడ్డాయి. అగస్త్యాశ్రమం పరిసరాలు అరణ్యంలాగా లేక ప్రశాంతంగానూ, అందంగానూ ఉండటం రామ లక్ష్మణులు గమనించారు. రాముడు లక్ష్మణుడితో, ‘‘అగస్త్యుడు మహిమాన్వితుడు.
 
సూర్యుడి మార్గానికి అడ్డంగా పెరుగుతూ వచ్చిన వింధ్య పర్వతాలను నిగ్రహించాడు. ఆయన దక్షిణ దేశానికి వచ్చి స్థిరపడినాక, దక్షిణానికి అగస్త్యుడి దిక్కనే పేరు వచ్చింది. ఆయన ఆశ్రమం అతి పవిత్రమైనది; అందులో క్రూరులూ, వంచకులూ, పాపులూ నివసించలేరు. అలాటి చోటికి చేరుకున్నాం. లక్ష్మణా, నీవు ముందు వెళ్ళి, నేనూ సీతా వస్తున్నామని అగస్త్యులవారితో చెప్పు,'' అన్నాడు.

లక్ష్మణుడు ఆశ్రమం ప్రవేశించి, అగస్త్యుడి శిష్యులలో ఒకణ్ణి పట్టుకుని, ‘‘నేను దశరథమహారాజు కొడుకును, లక్ష్మణుడనే వాణ్ణి. నేనూ, మా అన్న అయిన రాముడూ, ఆయన భార్య అయిన సీతా అగస్త్యులవారి దర్శనార్థం వచ్చాం. కనుక వారితో ఈ సంగతి చెప్పు,'' అన్నాడు. అగ్నిహోత్ర గృహంలో ఉన్న అగస్త్యుడికి శిష్యుడీ వార్త చెప్పాడు. వెంటనే అగస్త్యుడు, ‘‘వారు వస్తారని అనుకుంటూనే ఉన్నాను.
 
వారు ఆశ్రమంలోకి రాదగిన వారే; నీవు అప్పుడే తీసుకురావలిసింది. వెంటనే వెళ్ళి వారిని లోపలికి తీసుకురా,'' అన్నాడు. శిష్యుడు గబగబా వచ్చి లక్ష్మణుడితో, ‘‘ఆ సీతారాములెక్కడ ఉన్నారు? వెంటనే రమ్మనండి,'' అన్నాడు. ఇద్దరూ కలిసి ఆశ్రమ ద్వారం వద్దకు వెళ్ళారు. శిష్యుడు అతి వినయంగా సీతా రాములకు స్వాగతం చెప్పి లోపలికి తీసుకువచ్చాడు. అగస్త్యుడు సూర్య తేజస్సుతో వెలిగిపోతూ శిష్యులతో సహా ఎదురు వచ్చాడు.
 
అగస్త్యుణ్ణి రాముడు ఆ తేజస్సు చేతనే గుర్తించాడు. సీతారామ లక్ష్మణులాయన కాళ్ళకు వందనం చేసి, చేతులు మోడ్చి నిలబడ్డారు. అగస్త్యుడు వారిని అతిథులుగా స్వీకరించి, ఆసనాలూ, అర్ఘ్యపాద్యాలూ ఇచ్చి, కందమూల ఫలభోజనం వారికి పెట్టాడు. అగస్త్యుడి వద్ద ఒక అపూర్వమైన ధనువున్నది. అది విష్ణువుది; బంగారు నగిషీలు కలిగి, రత్నాలు పొదిగినది. దానిని విశ్వకర్మ తయూరుచేశాడు. బ్రహ్మదేవుడిచ్చిన ఒక అపూర్వమైన బాణమూ, ఇంద్రుడిచ్చిన రెండు అక్షయబాణ తూణీరాలూ, బంగారు ఒరగల ఒక ఖడ్గమూ ఉన్నాయి. వీటినన్నిటినీ అగస్త్య మహాముని రాముడికి కానుకగా ఇచ్చేశాడు.
 
తరవాత ఆయన రాముడితో, ‘‘నాయనా, నాకు నమస్కారం చెయ్యటానికి మీరు ఇంత దూరం వచ్చారు. చాలా సంతోషం. మీరంతా బడలి ఉంటారు. అతి సుకుమారి, కష్ట సమయంలోకూడా భర్తను విడవని మహా పతివ్రత, సీత మరింత అలసి ఉంటుంది. కనుక మీరంతా విశ్రాంతి తీసుకోండి,'' అన్నాడు. ‘‘నా అరణ్యవాస దీక్ష పూర్తి అయ్యేదాకా మేము ఆశ్రమం నిర్మించుకుని నివసించటానికి యోగ్యమైన స్థలం ఉంటే చెప్పండి,'' అని రాముడు అగస్త్యుణ్ణి అడిగాడు. ‘‘ఇక్కడికి రెండామడల దూరంలో పంచవటి ఉన్నది.

నీరూ, దుంపలూ సమృద్ధిగా ఉన్నాయి. లేళ్ళుకూడా జాస్తి. అక్కడ నీవు ఆశ్రమం ఏర్పరచుకోవచ్చు. నీ వనవాసం చాలాభాగం అయ్యేపోయింది. ఆ మిగిలినది కాస్తా పూర్తి కాగానే తిరిగి అయోధ్యకు వెళ్ళి సుఖంగా రాజ్యం చేసుకుంటావు. కావలిస్తే నీవు నా ఆశ్రమంలోనే ఉండవచ్చు. కాని నీకు వేరే ఆశ్రమంలో ఉండాలని ఉన్నట్టున్నది. అందుచేత పంచవటి పేరు చెప్పాను. అది చాలా అందమైన చోటు, సీతకు చాలా బాగుంటుంది. అదుగో, ఆ కనిపించే ఇప్పచెట్ల సమూహానికి ఉత్తరంగా వెళితే ఒక మర్రిచెట్టు వస్తుంది.
 
దాన్ని దాటి మరి కొంతదూరం పోతే ఒక ఎత్తు ప్రదేశం వస్తుంది. ఆ మిట్ట ఎక్కి చూస్తే ఒక పర్వతమూ, దాని పక్కన గోదావరీనదీ, దాని ఒడ్డున పంచవటీ కనిపిస్తాయి,'' అని అగస్త్యుడు చెప్పాడు. సీతారామ లక్ష్మణులు అగస్త్యుడికి నమస్కరించి ఆయన అనుజ్ఞ పొంది ఆయన చెప్పినదారినే పంచవటికి బయలుదేరారు. దారి మధ్యలో వారికొక బ్రహ్మాండమైన గద్ద కనబడింది. దాన్ని చూసి రామ లక్ష్మణులు ఎవరో రాక్షసుడనుకుని, ‘‘ఎవరు నీవు?'' అని ప్రశ్నించారు. ఆ గద్ద వారితో చాలా మంచిగా, ‘‘నాయనలారా, నేను మీ తండ్రి దశరథ మహారాజు స్నేహితుణ్ణి.
 
నా కులగోత్రాలు చెబుతాను. దక్షప్రజాపతికి అరవైమంది కూతుళ్ళు. వారిలో ఎనిమిది మందిని కశ్యపుడు పెళ్ళాడాడు. వారిలో తామ్ర అనే ఆమె అయిదుగురు ఆడపిల్లలను కన్నది. వారిలో ఒకతె శుకి. శుకి కూతురు నత, నత కూతురు వినత. వినతకు గరుడుడూ, అరుణుడూ అని ఇద్దరు కుమారులు.

అరుణుడు మా తండ్రి, శ్యేని మా తల్లి. నాకు సంపాతి అని అన్న ఉన్నాడు. నా పేరు జటాయువు. ఇది చాలా భయంకరమైన అరణ్యం. ఎన్నో క్రూరమృగాలు, ఎందరో రాక్షసులు. అందుచేత మీ కభ్యంతరం లేకపోతే మీ వెంట ఉండి మీరిద్దరూ ఎటైనా వెళ్ళినప్పటికీ సీతకు నేను అండగా ఉంటాను,'' అన్నది. జటాయువు వృత్తాంతం విని రాముడు చాలా సంతోషించి, తన తండ్రిని గురించి కబుర్లాడుతూ, సీతా లక్ష్మణ జటాయువులతో సహా పంచవటి చేరుకున్నాడు.
 
పంచవటి విషసర్పాలతోనూ, క్రూర మృగాలతోనూ, బాగా పూచిన చెట్లతోనూ నిండి ఉన్నది. ‘‘లక్ష్మణా, ఇదే పంచవటి. నీకూ, నాకూ, సీతకూ సుఖంగానూ; నీటికీ, ఇసుక దిబ్బలకూ, దర్భలు మొదలైన వాటికీ దగ్గిరగానూ ఉండే చోటు చూసి పర్ణశాల నిర్మించు,'' అన్నాడు రాముడు. ‘‘అన్నా, నీవే అలాటి చోటు చూసి, పర్ణశాల నిర్మించమని ఆజ్ఞ ఇవ్వు. నీ ఆజ్ఞ నిర్వర్తిస్తాను,'' అన్నాడు లక్ష్మణుడు. రాముడు ఒక సమప్రదేశం చూసి అక్కడ పర్ణశాల నిర్మించమని లక్ష్మణుడికి చెప్పాడు.
 
ఆ ప్రదేశం గోదావరికి సమీపంగా ఉన్నది. లక్ష్మణుడు మట్టి తవ్వి గోడలు పెట్టాడు; వెదురు స్తంభాలు బలమైనవి నిలబెట్టి, వాటిపైన జమ్మికొమ్మలు పరిచి, తాళ్ళతో గట్టిగా కట్టి, వాటిపైన రెల్లుతోనూ, దర్భలతో మంచి కప్పు వేశాడు; పర్ణశాల అందంగా కుదిరింది. లక్ష్మణుడు పర్ణశాల లోపలి నేల అంతా చక్కగా చదునుచేశాడు. రాముడు గోదావరికి వెళ్ళి, స్నానం చేసి పద్మాలూ, మధురమైన ఫలాలూ తెచ్చాడు.
 
లక్ష్మణుడు పర్ణశాలకు పుష్పబలి చేసి శాంతి జరిపాడు. ఇంతపనీ చేసినందుకు రాముడు లక్ష్మణుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకుని, ‘‘లక్ష్మణా, నీవు నన్ను ఇలా కనిపెట్టి ఉంటే నాకు మన తండ్రి జీవించి ఉన్నట్టే ఉన్నది,'' అన్నాడు. ఆ పర్ణశాలలో సీతారామలక్ష్మణులు సుఖంగా నివసించారు.

No comments:

Post a Comment