Friday, September 7, 2012

రామాయణం - అరణ్యకాండ 5


ఆ మాయలేడిని చూస్తుంటే రాముడికి కూడా సీతకు కలిగినట్టే దాని పైన భ్రమ పుట్టుకొచ్చింది. అతను లక్ష్మణుడితో, ‘‘నువ్వూ, జటాయువూ సీతను చూసుకోండి. నేను ఈ లేడిని పట్టి తెస్తాను,'' అని కత్తీ, విల్లంబులూ పుచ్చుకుని బయలుదేరాడు. మారీచుడు తన పని శక్తి వంచన లేకుండా నిర్వహించాడు. అతను లేడి రూపంలో కనిపిస్తూ, మాయమవుతూ, ఒక సారి దూరమవుతూ, ఒకసారి దగ్గిరలోనే ఉంటూ రాముణ్ణి ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకుపోయూడు.
 
ఇక ఆ లేడి తనకు ప్రాణాలతో చిక్కదని తోచి రాముడు ఒక తీవ్రమైన బాణం ఎక్కుపెట్టి ఆ లేడి గుండెలో దూసుకు పోయేటట్టు కొట్టాడు. మారీచుడు వెంటనే లేడి రూపు వదిలి తన రాక్షసరూపుతో కిందపడిపోతూ, ‘‘అయ్యో! సీతా! లక్ష్మణా!'' అని రాముడి గొంతుతో అరిచి ప్రాణాలు వదిలాడు. ఆ అరుపు రాముడి చెవికి అశుభంగా తోచింది.
 
మాయలేడి మారీచుడే! అస్పష్టమైన భయూలు మనసును ఆవరించగా రాముడు మరొక లేడిని చంపి, దాని మాంసం తీసుకుని వేగంగా తమ పర్ణశాల కేసి నడవసాగాడు.‘‘లక్ష్మణా, అది నీ అన్న చేసిన ఆర్తనాదం. నా కేమో భయంగా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళి రాముణ్ణి కాపాడు,'' అన్నది సీత ఆశ్రమంలో.

సీత ఎంతగా విలవిలలాడుతున్నప్పటికీ చలించక లక్ష్మణుడు, ‘‘దేవ మానవ గంధర్వ రాక్షసులలో అన్నను భయపెట్టగలవారెవరూ లేరు. ఇది రాక్షస మాయ. అన్న నన్ను నీకు తోడుగా ఉండమన్నాడు. నేను వెళ్ళను,'' అన్నాడు. ‘‘ఆయన ఆపదలో ఉంటేకూడా పోనంటావే, నువ్వాయనకు మిత్రుడవా, శత్రుడవా? నువ్వు కోరేది రాముడి నాశనం లాగుందే! రాముడికి నిజంగా ఆపదే కలిగితే నేను మరుక్షణం నశిస్తాను.
 
నన్ను నీవు రక్షించేదేమిటి?'' అన్నది సీత. లక్ష్మణుడు ఎన్నో విధాల సీత భయూన్నీ, అనుమానాన్నీ పోగొట్ట యత్నించాడు. కాని అతని ప్రయత్నం ఫలించలేదు. ఆమె అతన్ని బాగా ఎత్తి పొడిచింది. చివరకు లక్ష్మణుడు చిరాకుపడి, ‘‘అనరాని మాటలనటం స్ర్తీలకు సహజమే. నన్నిన్ని మాటలన్నందుకు నీకు కీడు తప్పదు. నేను వెళ్ళినాక నీకు దేవతలే దిక్కు,'' అంటూ అయిష్టంగా అన్న కోసం బయలుదేరాడు. అతను అలా వెళ్ళాడో లేదో, రావణుడు సన్యాసి రూపంలో ఒంటరిగా ఉన్న సీత వద్దకు వచ్చాడు.
 
అతను సన్నని కాషాయ వస్ర్తం ధరించి, గొడుగు వేసుకుని, పావుకోళ్ళు కాళ్ళకు ధరించి, దండానికి కమండలం తగిలించి ఎడమ భుజానికి ఆన్చి, వేదాలు చదువుతూ వచ్చి, కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తున్న సీతను పరిశీలించి చూశాడు. ఆమె పచ్చని పట్టుచీర కట్టుకొని ఉన్నది. ఆమె మెడలోని రత్నహారాలు మెరుస్తున్నాయి. రావణుడు సీతను పలకరించి, ‘‘అమ్మాయీ, నీ వెవరు? పార్వతివా? అప్సరవా? లక్ష్మీదేవివా? కాంతిదేవతవా? మానవ దేవ యక్ష కిన్నర గంధర్వులలో నీ వంటి సుందరిని నేనెన్నడూ చూడలేదు.
 
ఇంత సుకుమారివి, సుందరివి, చిన్నదానివి ఈ రాక్షస మయమైన చోట ఏం చేస్తున్నావు? ఒంటరిగా ఎందుకున్నావు?'' అని అడిగాడు. సీత రావణుణ్ణి చూసి నిజమైన సన్యాసి అనుకుని అర్ఘ్యపాద్యాదులిచ్చి అతిథి సత్కారాలు చేసి, పీట వేసి, వంట సిద్ధంగా ఉన్నది, భోజనం చెయ్యమని ఆహ్వానించింది.

ఆమె ఆ సన్యాసి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, తన వివాహం జరగటమూ, తాను పన్నెండేళ్ళు కాపురం చేసిన అనంతరం తన మామగారు తన భర్తకు పట్టాభిషేకం తల పెట్టటమూ, కైకేయి ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి తన భర్తను అడవులకు పంపటమూ. మొదలైన వృత్తాంత మంతా చెప్పింది. అంతా చెప్పి ఆమె రావణుణ్ణి, ‘‘మీ పేరేమిటి? గోత్రమేమిటి? మీరీ దండకారణ్యంలో ఒంటిగా ఎందుకు తిరుగుతున్నారు?'' అని అడిగింది. సీత ఈ ప్రశ్న అడగగానే రావణుడు, ‘‘నేను రాక్షసరాజును, రావణుణ్ణి.
 
నాకు ఎందరో భార్యలున్నారు గాని, ఒక్కరూ నీతో సమానం కారు. నేనుండే లంకా పట్టణం సముద్రం మధ్య ఎత్తయిన పర్వతం మీద ఉన్నది. ఈ అరణ్యం వదిలిపెట్టి నాతో వచ్చెయ్యి. ఉద్యాన వనాలలో విహరింతాం. నీకు అయిదువేల మంది దాసీలను ఏర్పాటు చేస్తాను,'' అన్నాడు. ఈ మాటలు విని సీత భయపడటానికి బదులు మండిపడింది. రావణుణ్ణి తిట్టింది, బెదిరించింది. రాముడి పరాక్రమం వివరించింది.
 
అంతా విని రావణుడు తన పరాక్రమం చెప్పుకున్నాడు. తాను కుబేరుడి తమ్ముణ్ణనీ, కుబేరుడి పుష్పక విమానాన్ని లాక్కొన్నాననీ, తన పేరు చెబితేనే సమస్త దేవతలూ భయపడతారనీ అన్నాడు. రాముడు అసమర్థుడు గనకనే రాజ్యం వదిలిపెట్టి అడవులలో అష్టకష్టాలూ పడుతున్నాడన్నాడు. ‘‘నువ్వు రాముడికి భయపడి నాతో వచ్చెయ్యటానికి జంకుతున్నావేమో, నా వెంట ఉన్న నిన్ను రాముడేమీ చేయలేడు. అతడు నా గోటికి చాలడు,'' అన్నాడు. ‘‘కుబేరుడి తమ్ముణ్ణని చెప్పుకుంటూ ఇలాటి పాపపు బుద్ధు లేమిటి? నీకీ పరస్ర్తీ వాంఛ పోకపోతే నువ్వూ, నీ రాక్షసులూ నాశనం కాక తప్పదు,'' అన్నది సీత.

రావణుడు మండి పడి చేతులు చరిచి తన నిజ రూపం ధరించి భయంకరంగా సీత ఎదుట ప్రత్యక్షమయ్యూడు. అతని కళ్ళు చింత నిప్పుల్లాగున్నాయి, శరీరం నల్లగా ఉన్నది. చెవులకు బంగారు పోగులున్నాయి. అతను సీతతో, ‘‘పిచ్చిదానా, నీకు నా కన్న ఖ్యాతి గల భర్త ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు నన్ను నిరాకరించి తరవాత పశ్చాత్తాప పడతావు,'' అంటూ ఆమెను పట్టుకుని రథంలోకి ఎక్కించి, రథంతో సహా పైకి ఎగిరాడు. సీత రాముణ్ణి కేక పెట్టింది, లక్ష్మణుణ్ణి పిలిచింది.
 
‘‘రావణుడు సీతను ఎత్తుకు పోయినాడని రాముడితో చెప్పండి,'' అని చెట్లతో మొరపెట్టుకున్నది. ఇంతలో ఒక చెట్టు పైన సీతకు జటాయువు కనిపించాడు. సీత జటాయువుతో దీనంగా, ‘‘నాయనా, జటాయూ! నన్నీ రాక్షసుడు బలాత్కారంగా తీసుకు పోతున్నాడు. ఈ మాట రాముడికి చెప్పు,'' అన్నది. చెట్టు మీద కునికిపాట్లు పడుతున్న జటాయువు, ఈ మాటలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసి రావణుడితో ఇలా అన్నాడు: ‘‘రావణా, నువ్వు చేసేది చాలా తప్పు పని.
 
మామూలు మనుషులు తమ భార్యలను పర పురుషుల నుంచి ఎలా కాపాడుకుంటారో రాజైనవాడు ఇతరుల భార్యలను కూడా అలా కాపాడాలి. నేను సౌమ్యుణ్ణి, వృద్ధుణ్ణి, నిరాయుధుణ్ణి. నువ్వు యువకుడివి, ఆయుధాలు కలవాడివి. అయినా నిన్ను సీత నెత్తుకు పోనివ్వను. రామలక్ష్మణులు దూరాన ఉన్నప్పుడు పిరికిగా నీవీ పని చేస్తున్నావు.''

ఈ మాట లంటూనే జటాయువు రావణుడిపై తలపడ్డాడు. రావణుడు తన రథంలో ఉండి ధనుర్బాణాలతో పోరాడుతుంటే మహా బలశాలి అయిన జటాయువు తన గోళ్ళతోనూ, కాళ్ళతోనూ, ముక్కుతోనూ కలియబడి రావణుడి కవచాన్ని నిర్మూలించాడు. అతని శరీరాన్ని చీరాడు, అతని ధనువులను విరిచాడు, రథపు గాడిదలనూ, సారథినీ కూడా చంపాడు. చివరకు రథాన్నే విరిచాడు.
 
రావణుడు విరథుడై సీతను ఎత్తుకుని భూమి పైకి దిగవలిసి వచ్చింది. ఇంత చేసిన మీదట జటాయువు అలిసి పోయూడు. అది గమనించి రావణుడు సీతతో సహా మళ్ళీ ఆకాశానికి ఎగిరాడు. కాని జటాయువు ఎగిరి వెళ్ళి రావణుడికి అడ్డు తగిలాడు. అతను రావణుడితో, ‘‘ఛీ,ఛీ! నువ్వు వీరుడివి కావు, పిరికిపందవు. వీరుడివైతే రామలక్ష్మణులు వచ్చినదాకా ఉండి వారితో యుద్ధం చెయ్యి,'' అన్నాడు. రావణుడు వినిపించుకోక ముందుకు సాగిపోయూడు.
 
జటాయువు రావణుడి వెన్నంటి, అతని వీపుమీద వాలి తన గోళ్ళతో గీరసాగాడు, రావణుడి వెంట్రుకలు పీకాడు. రావణుడు మండిపడి సీతను నేలపై దించి జటాయువుతో కలియబడ్డాడు. చివరకు రావణుడు కత్తి దూసి జటాయువు రెక్కలూ, పక్కలూ, పాదాలూ నరికేశాడు. జటాయువు కొన ఊపిరితో నేల మీద పడిపోయూడు. సీత వలవలా ఏడుస్తూ జటాయువు దగ్గిరికి పరిగెత్తింది.

జటాయువును కౌగలించు కుని భోరున ఏడ్చింది. ‘‘రామా, లక్ష్మణా! ఇప్పుడన్నా వచ్చి నన్ను రక్షించండి!'' అని కేక పెట్టింది. రావణుడు తన కేసి రావటం చూసి సీత లతలను పట్టుకునీ, చెట్లను పట్టుకునీ వేళ్ళాడింది. ‘‘చాలించు ఈ వేషాలు,'' అంటూ రావణుడు ఆమె నెత్తుకుని తిరిగీ ఆకాశ గమనం సాగించాడు. రావణుడు అతివేగంగా పోతూంటే సీత యొక్క ఆభరణాలు కొన్ని భూమి మీద పడి పోయూయి.
 
సీత రావణుణ్ణి పిరికివాడని అవమానించింది, దొంగ అన్నది, తిట్టింది, ఇప్పటికైనా తనను వదిలేస్తే రాముడు క్షమిస్తాడని ఆశ పెట్టింది; ‘‘ఏది కోరి నన్ను ఇలా తీసుకు పోతున్నావో అది నీకు ఒనగూడదు; ఎందుచేతనంటే నేను రాముణ్ణి విడిచి ఎంతో కాలం బతకను,'' అని కూడా చెప్పి చూసింది. రావణుడీ మాటలేవీ పట్టించుకోలేదు. ఆకాశంలో పోతున్న సీతకు ఒక కొండ శిఖరం మీద అయిదుగురు వానరులు కనిపించారు.
 
‘‘వీరు నా సంగతి రాముడితో ఒక వేళ చెబుతారేమో,'' అనుకుని సీత తన పసుపుపచ్చని పైబట్టలో తన ఆభరణాలు కట్టి ఆ వానరుల మధ్య పడేలాగా వేసింది. ఈ సంగతి రావణుడు గమనించలేదు. కాని వానరులు మాత్రం సీతను చాలాసేపు కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయూరు. రావణుడు పంపా సరస్సు దాటి, సముద్రాన్ని చేరి, దాన్నికూడా దాటి తనపాలిటి మృత్యువైన సీతతో సహా లంకను చేరాడు.
 
లంకాపురం అతి అందమైన నగరం. అక్కడి రాజమార్గాలు తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి. అనేక ప్రాకారాలతో కూడి ఉన్న అంతఃపురంలోకి రావణుడు సీతతో సహా ప్రవేశించాడు. అతను భయంకరాకారాలు గల అక్కడి రాక్షస స్ర్తీలను పిలిచి, ‘‘నా అనుమతి లేకుండా ఒక పురుషుడు గాని, స్ర్తీగాని ఈ సీతను చూడరాదు. ముత్యాలో, రత్నాలో, బంగారమో, బట్టలో-ఈమె ఏమి కోరితే అది ఎల్లా నాతో చెప్పకుండానే ఈమెకు ఇచ్చెయ్యూలి. ఈమె మనస్సుకు కష్టం కలిగించే మాట ఒక్కటి ఎవరైనా అన్నారో తక్షణం వాళ్ళ ప్రాణాలు తీస్తాను,'' అని గట్టిగా హెచ్చరించాడు.

No comments:

Post a Comment