ఖర దూషణులూ, త్రిశిరుడూ మొదలైన రాక్షసవీరులు తమ పధ్నాలుగువేల రాక్షస
బలగంతో రాముడి ప్రతాపాగ్నిలో మాడి మసి అయిపోగా అకంపనుడనే రావణుడి చారుడు
ప్రాణాలతో తప్పించుకుపోయి రావణుడి దర్శనం చేసుకున్నాడు. ‘‘రావణరాజేశ్వరా,
జనస్థానంలో ఉండే మన రాక్షసులందరూ యుద్ధంలో వధ అయ్యూరు.
నేను మాత్రం ఎలాగో ప్రాణాలతో బయటపడి ఈ వార్త చెప్పటానికి వచ్చాను,''
అని అకంపనుడు అంటూండగానే రావణుడు కళ్ళెరజ్రేసి అగ్నిహోత్రుడులా అయిపోయి,
‘‘ఎవడికి కాలం మూడింది? నేను తలుచుకుంటే అగ్నినే దగ్ధం చేస్తాను,
మృత్యువునే చంపగలను.సూర్యచంద్రులు కూడా నేను ఆగ్రహిస్తే భస్మమైపోతారు,''
అని రంకెలు పెట్టాడు. ఈ అట్టహాసం గమనించి అకంపనుడు ముందుగా రావణుడి వద్ద
అభయం పొంది, రాముడు జనస్థానంలోని రాక్షసులందరినీ ఎలా చంపిందీ వివరించి
చెప్పాడు.
రావణుడంతా విని బుసకొడుతూ, ‘‘ఆ రాముడికి దేవతలందరూ సహాయం వచ్చారు
కాబోలు?'' అన్నాడు. ‘‘లేదు, లేదు. రాముడు పరాక్రమంలో దేవేంద్రుడికి
తీసిపోడు. అగ్నికి వాయువు తోడైనట్టు రాముడికి తోడుగా అతని తమ్ముడు
లక్ష్మణుడొకడున్నాడు. జనస్థానంలో ఉండే రాక్షసులను చంపినవాడు రాముడొక్కడే!''
అన్నాడు అకంపనుడు.
‘‘అలా అయితే నేను జనస్థానానికి వెళ్ళి ఆ రాముణ్ణీ, లక్ష్మణుణ్ణీ
చంపేస్తాను,'' అన్నాడు రావణుడు. అకంపనుడు లబలబలాడుతూ, ‘‘ఆ రాముడి
బలపరాక్రమాలు నేను సరిగా చెప్పలేకపోయూను. అతడికి చెలియలికట్టను భేదించి
ప్రపంచమంతా సముద్రంలో ముంచే శక్తి ఉన్నది. ఆకాశాన్ని నక్షత్రాలతో సహా నాశనం
చెయ్యగలడు. మూడు లోకాలూ నిర్మూలించి, కొత్తసృష్టి ప్రారంభించగలడు.
రాముడు నీ చేతిలో ఎన్నటికీ చావడు. అతడు చావటానికి ఒక్కటే ఉపాయం: అతడి
భార్య సీత అప్సరసలను మించిన సౌందర్యవతి. ఆమె అంటే ఆ రాముడికి ప్రాణంతో
సమానం. ఆమెను ఎత్తుకువస్తే ఆ రాముడు కుమిలి కుమిలి చస్తాడు!'' అని సలహా
ఇచ్చాడు. రావణుడు కొంచెం ఆలోచించి తల పంకించి, ‘‘మంచిది, రేపు ఉదయమే వెళ్ళి
ఆ సీతను తీసుకువచ్చేస్తాను,'' అన్నాడు. మర్నాడు ఉదయూనే అతను ప్రకాశవంతమైన
రథానికి గాడిదలను పూన్చిదానిలో ఎక్కి మారీచుడి ఆశ్రమానికి వెళ్ళాడు. తాటక
కొడుకైన మారీచుడు రాక్షసరాజుకు చక్కగా భోజనం పెట్టి, ‘‘ఇలా తలవని తలంపుగా
వచ్చారు, రాక్షసులందరూ క్షేమమే గదా?'' అని అడిగాడు.
ఆ మాటకు రావణుడు, ‘‘మారీచా, జనస్థానంలో ఉన్న నా బంధువులందరినీ రాముడు
వధించాడు. అతడి భార్యను ఎత్తుకుపోదామని వచ్చాను. నీ సహాయం కావాలి,''
అన్నాడు. ‘‘అయ్యో, హితం కోరినవాడిలాగా వచ్చి నీకు సీత మాట చెప్పిన
దుర్మార్గుడెవరు? నీ నాశనం కోరే, వాడు నిన్ను సీతాపహరణానికి ప్రేరేపించి
ఉంటాడు.
ఈ పిచ్చి ఆలోచన కట్టిపెట్టి, లంకకు వెళ్ళి నీ భార్యలతో సుఖంగా ఉండు; ఈ
దండకారణ్యంలో ఆ రాముణ్ణి తన భార్యతో సుఖంగా ఉండనీ. ఆ రాముడి జోలికి పోవటం
నిద్రించే సింహాన్ని లేవగొట్టటమే!'' అన్నాడు మారీచుడు. మారీచుడింతగా
చెప్పిన తరవాత రావణుడు తన యత్నం మానుకుని లంకకు వెళ్ళి పోయూడు. ఇంతలో
శూర్పణఖ కూడా లంకకు వెళ్ళింది.
నిండు కొలువులో ఉన్న రావణుడి వద్దకు వెళ్ళి, పరుషంగా మాట్లాడుతూ,
‘‘భోగలాలసుడవై మదించి నీకు వచ్చిపడే ఘోరాన్ని కూడా తెలుసుకోకుండా ఉన్నావు!
నీ కన్న పసిపిల్లలు నయం! జనస్థానంలో రాముడు ఋషుల కోరికపై నీ వాళ్ళనందరినీ
చంపి, దండకారణ్యంలో రాక్షసపురుగు లేకుండా చేస్తే నీకా సంగతి చెప్పటానికి
చారులు కూడా లేరు; నీవింకేం రాజ్యం చేస్తావు? ఈ రాజ్యం ఉండదు; నీవు
త్వరలోనే నశిస్తావు!'' అన్నది. రావణుడీ మాటలు సహించలేక రోషంతో, ‘‘ఎవడీ
రాముడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఉంటాడు? ఏపాటి పరాక్రమం గలవాడు?'' అని
శూర్పణఖను అడిగాడు.
‘‘రాముడు దశరథుడి కొడుకు. ఆజాను బాహువు. నవమన్మథుడు. అతడు యుద్ధం
చెయ్యటం నేను కళ్ళారా చూశాను. వర్షం లాగా బాణాలు వచ్చిపడటం నాకు
కనిపించిందేగాని, అతను బాణాలు తీయటమూ, ఎక్కు పెట్టటమూ, విడవటమూ నాకు
కనిపించలేదు. ఒక్కడే క్షణంలో పధ్నాలుగు వేలమంది రాక్షసులను చంపేశాడు.
ఆడదాన్ని గదా అని నన్ను చంపక అవమానించి పంపాడు. రాముడి తమ్ముడు లక్ష్మణుడు
ముక్కోపి.
మహాబలశాలి. అన్నకు కుడిభుజం. ఇక రాముడి భార్య సీత! ఇంతంత కళ్ళు! నిండు
చంద్రుడులాటి ముఖం! బంగారువంటి శరీరచ్ఛాయ! సన్నటినడుము! ఆ సీతను ఎలాగైనా
ఇక్కడికి తీసుకువచ్చి నీకు భార్యను చేతామని ప్రయత్నించేసరికి లక్ష్మణుడు
నన్నిలా ముక్కు చెవులు కోశాడు. సీతను ఒక్కసారి చూస్తే నీవు మరవలేవు. ఆ
రాముణ్ణి చంపేసి నీవాళ్ళ కోసం పగతీర్చుకో, సీతను తెచ్చుకుని భార్యగా ఏలుకో.
వెంటనే బయలుదేరు!'' అని శూర్పణఖ రావణుణ్ణి రెచ్చగొట్టింది.
రావణుడు సభ చాలించి ఒంటరిగా కూచుని సీతాపహరణం గురించి వివరంగా
ఆలోచించాడు. సీతను పరాక్రమంతో తీసుకురావటం కన్న దొంగతనంగా తీసుకురావటమే
మేలని అతనికి అనిపించింది. ఎందుకంటే అంతమంది రాక్షసులనూ, రాక్షసవీరులనూ
చంపినవాణ్ణి ఓడించి సీతను ఎత్తుకురావటం మాటలు కాదు. అయితే, రావణుడు తన
ఆలోచనను మండోదరికి గాని మంత్రులకు గాని చెప్పలేదు; వారు నివారిస్తారని
భయపడ్డాడు.
రథం సిద్ధం చెయ్యమని రావణుడు తన సారథితో చెప్పి, అందులో ఎక్కి, కామగ
ునం చేత సముద్రాన్నిదాటి మారీచుడి ఆశ్రమానికి వచ్చిచేరాడు. మారీచుడు
అతనికి అతిథి సత్కారాలు చేసి, ‘‘ఇంతలోనే మళ్ళీ రావటాని కేమి కారణం? లంకలో
అందరూ క్షేమమా?'' అని అడిగాడు. ‘‘రాముణ్ణి క్షమించటానికి వీల్లేదు. వాడు
దుష్టుడు, క్రూరుడు, మూర్ఖుడు, లుబ్ధుడు. మన రాక్షసులనందరినీ నాశనం
చెయ్యటమేగాక నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోయించాడు.
సీతను అపహరించదలిచాను. నాకు నీ సహాయం కావాలి. నీవు పరాక్రమం గలవాడవు,
యుక్తిపరుడవు. నీకు మాయలు తెలుసు. నీవల్ల కావలిసిన సహాయం చెబుతాను విను.
నీవు వెండిచుక్కలు గల బంగారు లేడి రూపం ధరించి రామాశ్రమంలో సీతకు కనపడేలాగా
తిరుగు. నిన్ను పట్టితెమ్మని సీత రామలక్ష్మణులను తప్పక పంపుతుంది. ఆ
సమయంలో నేను సీతను ఎత్తుకుపోతాను. సీత పోయినాక రాముడు విచారంతో
కృశించిపోతాడు. ఆ స్థితిలో అతను యుద్ధానికి వచ్చినా సునాయూసంగా
ఓడించేస్తాను,'' అని రావణుడు చెప్పాడు. ఈ మాటలు విని మారీచుడికి భయంతో
నోరెండిపోయింది.
అతను చేతులు జోడించి, ‘‘రాక్షసరాజా, ఈ లోకంలో ఇష్టమైన మాటలు
చెప్పేవారు కొల్లలు. నచ్చక పోయినా హితమైన మాట చెప్పేవారుండరు, ఒకవేళ
చెప్పేవారున్నా వినేవారుండరు. రాముణ్ణి గురించి నీవనుకునేదంతా అబద్ధం. అతను
దుష్టుడూ, మూర్ఖుడూ, లుబ్ధుడూ, క్రూరుడూ ఎంత మాత్రమూ కాడు. అతను ఎవరి
జోలికీ వెళ్ళలేదు. శూర్పణఖ సీతను తరిమితే పరాభవించి పంపాడు. ఖరదూషణులు తన
పైకి వచ్చిపడితే వారిని చంపాడు; తప్పా? ఈ రాముడు మీసకట్టు కూడా రానివయసులో,
వెయ్యి ఏనుగుల బలంగల నన్ను వెయ్యి యోజనాలు వెళ్ళి సముద్రంలో పడేలా
కొట్టాడు.
అంతటితో బుద్ధిరాక నేను మరి ఇద్దరు రాక్షసులతోబాటు జింకరూపు దాల్చి,
మునిలాగా ఉన్నాడు కదా, ఏం చెయ్యగలడు లెమ్మని అతని ఆశ్రమం మీద పడి అతన్ని
చంపబోయూను. రాముడు మూడు బాణాలు ఎక్కు పెట్టాడు. వాటిని చూడగానే నేను
తప్పుకుని పారిపోయూను; కాని నా వెంట జింకల రూపంలో ఉన్న రాక్షసులిద్దరూ
చచ్చారు. నాకు బుద్ధి వచ్చింది.
నాకిప్పుడు రాముడంటే సింహ స్వప్నం. ఎక్కడ చూసినా నాకు రాముడే
కనిపిస్తాడు. రకారంతో ప్రారంభమయ్యే మాటలు వింటేనే గుండె లవిసిపోతాయి. నేను
తపస్సు చేసుకుంటున్నాను. నీకు కాలంమూడి రాముడితో తలపడాలని ఉంటే తలపడు.
నన్ను ఇందులోకి ఈడవకు. నీ మేలు కోరి నేను చెప్పేది వినకపోతివో నీకు సర్వ
నాశనం తప్పదు,'' అన్నాడు. రావణుడికీ మాటలు తల కెక్కలేదు.
అతను మారీచుడితో, ‘‘దేవతలంతా వచ్చి చెప్పినా నా నిశ్చయం మారదు. నా
నిర్ణయం మంచిదా, చెడ్డదా అని నేను నిన్నడిగానా? అడగని మాటలెందుకు చెబుతావు?
నేను నిన్నొకటి చెయ్యమని అడిగినప్పుడు నీవు చెయ్యవలిసిందే గాని
బదులాడరాదు. నేను చెప్పినట్టు బంగారు లేడి రూపం ధరించి సీతను ఆకర్షించి, ఆ
తరవాత నీదారిన నువ్వు వెళ్ళిపో. నిన్ను పట్టటానికి రాముడు ఒక్కడే వస్తే
అతని కంఠధ్వనితో, ‘‘అయ్యో! సీతా! లక్ష్మణా!'' అని అరు.
అప్పుడు లక్ష్మణుడు కూడా కదులుతాడు. సీత నాకు దక్కుతుంది. ఈ ఉపకారం
చేస్తివా నీకు నా అర్ధరాజ్యమిస్తాను. నిరాకరించావో, ఇప్పుడే నీ ప్రాణాలు
తీస్తాను. రాముడు నిన్ను చంపటం అబద్ధమూ, నేను చంపటం నిజమూ అవుతుంది,''
అన్నాడు. మారీచుడికి మండిపోయింది.
‘‘నన్ను చంపుతానంటున్నావు గాని, నీకీ ఆలోచన చెప్పిన దుర్మార్గుల
నెందుకు చంపవు? ఇటువంటి మతిలేని ఆలోచన చేస్తూంటే నీ మంత్రులు నిన్నెందుకు
నివారించలేదు? దైవికంగా ఇది వచ్చిపడటంచేత నేను చస్తే అంత ప్రమాదంలేదు. కాని
నా తరవాత నువ్వూ, రాక్షసవంశమూ, లంకానగరమూ కూడా నాశనంకాక తప్పదే, అది ఎంత
ఘోరం!'' అని మారీచుడు రావణుడితో అని, పోదాం పదమన్నాడు.
అనరాని మాటలన్నీ అన్నప్పటికీ చివరకు తన మాట పాటించాడన్న ఆనందంతో
రావణుడు మారీచుణ్ణి ఆలింగనం చేసుకుని, విమానంలాటి తన రథంలో అతన్ని
ఎక్కించుకుని, అరటిచెట్ల మధ్యనున్న రామాశ్రమం దగ్గిర అతన్ని దించాడు.
వెంటనే మారీచుడు ఒక ఆకర్షవంతమైన, అపూర్వమైన లేడిరూపం ధరించి, గరికమేస్తూ
మెల్లిగా రామాశ్రమం ప్రవేశించి అక్కడే తారట్లాడాడు.
ఈ మాయూలేడి శరీరం బంగారు రంగులోనూ, దాని మీది చుక్కలు వెండిరంగులోనూ,
పొట్ట తెల్లగానూ, గిట్టలు నిగనిగలాడే నలుపు రంగులోనూ, తోక పంచవర్ణాలలోనూ,
కొమ్ముల చివరలు నీలం రంగుగానూ, నోరు కెంపురంగుగానూ ఎంతో అందంగా ఉన్నాయి.
అది కాస్సేపు మేస్తూ, మధ్య మధ్య పచ్చికపై పడుకుంటూ, ఆ ప్రాంతంలోనే చాలాసేపు
తిరిగింది. చివరకు సీత పూలు కోయటానికి చెట్ల మధ్యకు వచ్చి ఆ లేడిని చూడనే
చూసింది. చూసి పరమాశ్చర్యం చెంది, ఆమె రామలక్ష్మణులను కేకపెట్టింది. ఆమెను
సమీపిస్తూ వారుకూడా మాయలేడిని చూశారు. చూస్తూనే లక్ష్మణుడు రాముడితో, ‘‘ఈ
లేడి చూస్తే మారీచుడి లాగుంది. వాడు మాయూరూపంలో, వేటకువచ్చిన రాజులను
తిన్నాడు.
ఎందరో మునులను తిన్నాడు. ఇలాటి లేడి ఎక్కడా ఉండదు,'' అన్నాడు. సీత
లక్ష్మణుణ్ణి ఊరుకోమని, రాముడితో, ‘‘ఆ లేడి నాకు కావాలి. తీసుకురా. చక్కగా
ఆడుకుందాం. దాని అందం ఏమందం! దాన్ని ప్రాణాలతో తేస్తే, మనతో బాటు అయోధ్యకు
తీసుకుపోదాం; భరతుడూ, అత్తలూ చూసి ఎంతో మురిసిపోతారు. ఒకవేళ అది ప్రాణంతో
చిక్కకపోతే చంపి అయినా తీసుకురావాలి. దాని చర్మాన్ని నేను ఉంచుకుంటాను,''
అన్నది.
No comments:
Post a Comment