Saturday, September 8, 2012

రామాయణం - ఉత్తరకాండ 3


మర్నాడు రాముడు కొలువుతీరి ఉండగా, ఒక కుక్క వచ్చి బయట మొరిగింది. లక్ష్మణుడు, ఆ కుక్క, రాజుతో ఏదో ఫిర్యాదు చేయగోరుతున్నదని తెలుసుకుని, దాన్ని సభలోకి తీసుకువచ్చాడు. తల పగిలి ఉన్న ఆ కుక్కను చూసి రాముడు, ‘‘నీకు కలిగిన కష్టం గురించి నాతో నిర్భయంగా చెప్పు,’’ అన్నాడు. ‘‘సర్వార్థసిద్ధి అనే భిక్షువు నా తల పగులగొట్టాడు. నేనతనికే అపకారమూ చెయ్యలేదు,’’ అన్నది కుక్క.

రాముడు వెంటనే ఆ భిక్షువును పిలిపించి, ‘‘నీవీ కుక్క తల ఎందుకు పగలగొట్టావు? అది నీకేం అపకారం చేసింది?’’ అని అడిగాడు.

‘‘రాజా, నేను భిక్షకోసం ఇల్లిల్లూ తిరుగుతున్నాను. నా కెక్కడా భిక్ష దొరకలేదు. ఈ స్థితిలో ఈ కుక్క నా దారికి అడ్డంగా నిలబడి, ఎంత అదిలించినా పోలేదు. కోపం అణుచుకోలేక దాన్ని తల మీద కొట్టిన మాట నిజమే. దానికే దండన  విధిస్తారో విధించండి’’ అన్నాడు సర్వార్థసిద్ధి.

అతనికి ఎలాటి శిక్ష విధిస్తే బాగుంటుందని రాముడు సభలోని వాళ్లను అడిగాడు. సభలో ఎందరో పండితులుండి కూడా ఏ ఒక్కరూ సూటిగా సమాధానం చెప్పలేదు.

అప్పుడు కుక్క రాముడితో, ‘‘రామా, ఇతనికి నేను చెప్పిన శిక్ష వెయ్యి. కాలంచర మనే చోట కులపతిగా అతనికి ఉద్యోగమివ్వు,’’ అన్నది.


రాముడతనికి ఆ ఉద్యోగం ఇచ్చి, ఏనుగుమీద ఎక్కించి పంపేశాడు. భిక్షువు కూడా పరమానందం చెంది వెళ్లిపోయాడు.  తరవాత  రాముడూ, మంత్రులూ ఆ కుక్కను, ‘‘ఆ భిక్షువుకు ఇలాంటి శిక్ష ఎందుకు వేయించావు? దీనికేదో కారణం ఉండాలి,’’ అన్నారు. ‘‘నేను కిందటి జన్మలో ఆ ఉద్యోగమే చేశాను. ఆ పదవిలో నాకు చక్కని భోజనమూ, దాసదాసీలూ, సమస్తమూ అమరి ఉండేవి. ఎంతో భూతదయ కలిగి, వినయమూ, శీలమూ కలవాడిననిపించుకున్నాను. దేవ బ్రాహ్మణ పూజ చేశాను.

అయినప్పటికీ ఆ పదవిలో ఉండినందు వల్ల నాకు  నీచజన్మ కలిగింది. మహా కోపీ, దయారహితుడూ అయిన ఈ భిక్షువు ఆ పదవి నిర్వహించాడో జన్మజన్మలకీ ఘోర నరకం పాలు అయితీరతాడు,’’ అన్నది కుక్క. కుక్క వెళ్లిపోయూక, ఒక గుడ్లగూబా, గద్దా తగాదాపడి తీర్పు చెప్పమని రాముడి వద్దకు వచ్చాయి. ఒక వనంలో ఒక ఇల్లున్నది. ఆ ఇల్లు నాదంటే  నాదని  రెండు పక్షులూ తగాదా పడుతున్నాయి. ఈ తగాదా తీర్చేటందుకు గాను రాముడు పుష్పక విమానం మీద తన మంత్రులతో సహా ఆ ఇల్లున్న చోటికి వెళ్లాడు. ‘‘ఈ ఇంటిని నువ్వెప్పుడు కట్టుకున్నావు?’’ అని రాముడు గద్ద నడిగాడు. ‘‘భూమి మీద మనుషులు పుట్టిన కాలంలో నేనీ ఇల్లు కట్టుకున్నాను.’’ అన్నది.

వెంటనే రాముడి మంత్రులు ఆ ఇల్లు గుడ్లగూబదేనని తేల్చారు. ఎందుచేతనంటే సృష్టిలో మొదట వచ్చినవి వృక్షజాతులు. గుడ్లగూబ ఇంటిని కాజెయ్యాలని చూస్తున్నది గనక గద్దను శిక్షిస్తానన్నాడు రాముడు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది. ‘‘రామా అసలే శాపం తిని ఉన్న ఈ గద్దను ఇంకా ఎందుకు శిక్షిస్తావు? ఈ గద్ద బ్రహ్మదత్తుడనే రాజు, మహా ధనికుడు, శూరుడు, సత్యవ్రతుడు. ఇతని ఇంటికి గౌతముడు వచ్చి అతిథిగా ఉన్నాడు. గౌతముడికి రాజు స్వయంగానే ఆర్ఘ్యపాద్యాలిచ్చాడు. గౌతముడు బ్రహ్మదత్తుడి ఆతిథ్యం స్వీకరిస్తున్న సమయంలో ఒకనాడు ఆయన భోజనంలోకి పొరపాటున మాంసం వచ్చింది. అది చూసి గౌతముడు కోపించి, రాజును గద్దవు కమ్మని శపించాడు. ఆ తర్వాత, ఇక్ష్వాకు వంశంలో పుట్టే రాముడు తాకినప్పుడు శాపవిముక్తి కలుగుతుందని గౌతముడన్నాడు. ’’


 ఆకాశవాణి పలికిన ఈ మాటలు విని రాముడా గద్దను తాకాడు. వెంటనే గద్ద ఒక దివ్యపురుషుడుగా మారింది. ఆ పురుషుడు రాముడికి కృతజ్ఞత తెలుపుకుని వెళ్లిపోయూడు.

యమునాతీర వాసులైన మునులు నూరుమందికి పైగా రాముడి దర్శనార్థం ఒకనాడు వచ్చారు. వారు కలశాలతో తెచ్చిన నీరూ, పళ్లూ మొదలైన కానుకలు స్వీకరించి, వారందరినీ సుఖాసీనులను చేసి రాముడు, వారు వచ్చిన పని అడిగాడు. లవణాసురుడనేవాడు తమని మహాబాధ పెడుతున్నాడని, వాడి బాధ నుంచి విముక్తి కలిగించమనీ మునులు రాముడిని కోరారు.

 లవణాసురుడనేవాడు మధువనే రాక్షసుడి కొడుకు, మధువు రుద్రుడిని గురించి బహుదీర్ఘమైన తపస్సు చేసి, ఆయనను మెప్పించాడు. దాని ఫలితంగా రుద్రుడు తన త్రిశూలంలో నుంచి మరొక త్రిశూలం చేసి మధువుకిస్తూ, ‘‘అది వెంట ఉన్నంత కాలమూ నిన్నెవరూ జయించలేరు.’’ అని చెప్పాడు. ఆ త్రిశూలాన్ని వంశపరంపరగా తన ఇంటనే ఉండేటట్టు అనుగ్రహించమని మధువు శివుడిని వేడుకున్నాడు. ‘‘నీ అనంతరం ఈ త్రిశూలం నీ కొడుక్కి మాత్రమే ఉంటుంది. అటుపైన ఉండదు’’ అన్నాడు శివుడు.

 మధువు రావణుడికి చెల్లెలు వరస అయిన కుంభీనసను పెళ్లాడాడు. వారికి లవణుడు పుట్టాడు. వాడు పసితనం నుంచీ మహాపాపీ, వాడిని మంచిదారిన పెట్టడం మధువు వల్ల కాలేదు. మధువు వరుణలోకానికి వె ళ్లి అందరినీ బాధిస్తున్నాడు, మునులను మరింత వేపుకు తింటున్నాడు.

మునులు చెప్పిన విషయాలు ఆలకించి రాముడు వారితో ‘‘లవణాసురుడిని నేను చంపిస్తాను. మీరు నిర్భయంగా ఉండండి’’ అని అభయమిచ్చాడు. తరవాత అతను తన తమ్ములను చూసి ‘‘లవణాసురుడిని చంపే పనికి ఎవరు పూనుకుంటారు?’’ అని అడిగాడు.

భరతుడు తానా పని చేస్తానన్నాడు. కాని శత్రుఘ్నుడు భరతుడిపైన పోటీకి వచ్చి, తానే లవణాసురుడిని చంపుతాననీ, తానుండగా భరతుడు శ్రమపడటం భావ్యం కాదనీ, పడవలసిన శ్రమలన్నీ భరతుడు లోగడ నందిగ్రామంలో ఉన్నప్పుడే పడ్డాడనీ అన్నాడు. రాముడందుకు ఒప్పుకుని, శత్రుఘ్నుడిని మధుపురానికి రాజుగా అభిషేకించే ఏర్పాట్లు చేశాడు. ఒక రాజు చ చ్చిపోతే మరొకడు వెంటనే రాజ్యభారం వహించడానికి సిద్ధంగా ఉండాలి.


శత్రుఘ్నుడు  రాజ్యాభిషేకోత్సవం ముగియగానే రాముడు అతని కొక బాణం ఇచ్చి, ఇలా చెప్పాడు. ‘‘ఈ బాణం మధుకైటభులను చంపినది. దీన్ని నేను రావణుడిపైన కూడా ప్రయోగించలేదు. దీనితో నీవు లవణాసురుడిని చంపు. మరొక సంగతి, లవణుడి వద్ద శివుడి త్రిశూలానికి సమమైన శూలం ఉన్నది. అది వాడి చేతిలో ఉండగా ఎవరూ వాడిని జయించలేరు. అందుచేత నీవేం చేస్తావంటే - లవణుడి త్రిశూలం వాడి ఇంటనే ఉంటుంది. వాడు నగరం వదిలి ఎటైనా వెళ్లి ఉన్న సమయంలో నీవు నగరద్వారం ముట్టడించి, వాడు తిరిగి వచ్చినప్పుడు ద్వారం వద్దనే అటకాయించి చంపు. ఏ పరిస్థితిలోనూ వాడు నగరం లోకి వెళ్లరాదు, త్రిశూలం వాడి చేతికి చిక్కరాదు.’’
అంతేకాదు, శత్రుఘ్నుడు ముందుగా సేనను పంపి, తరవాత తాను ఒంటరిగా వెళ్లాలి. తనను చంపటానికెవరో వస్తున్నట్లు లవణుడికి తెలియగూడదు. గ్రీష్మర్తువులోనే సేనలు గంగ అవతలి ఒడ్డు చేరి అక్కడ విడియాలి. శత్రుఘ్నుడు వర్షాకాలారంభంలో విల్లుబాణాలు తీసుకుని బయలుదేరి వెళ్లి లవణాసురుడిని వధించాలి. ఈ విధంగా రాముడు యుద్ధగతి నిర్ణయించాడు.

ఆ ప్రకారమే శత్రుఘ్నుడు ముందుగా తన సేనలను పంపి, ఒక మాసం గడిచాక తాను బయలుదేరాడు. దారిలో రెండు రోజులపాటు అతను వాల్మీకి ఆశ్రమంలో నిలిచాడు. వాల్మీకి అతనికి ఆతిథ్యమిచ్చి, ఆ ఆశ్రమం ఒకప్పుడు రఘువంశం వారిదే నంటూ దాని కథ ఇలా చెప్పాడు. రఘువంశంలో ఒకప్పుడు సుదాసుడనే వాడుండేవాడు. ఆయన కొడుకు వీరసహుడు. చిన్నతనంలోనే వేటకు వెళ్లి వనంలో ఇద్దరు రాక్షసులను చూశాడు. ఆ రాక్షసులు పులుల రూపంలో తిరుగుతూ కనిపించిన మృగాన్నల్లా తినేస్తూ, అరణ్యమంతా పాడుపెట్టేశారు. ఎక్కడా ఒక మృగం లేదు. అది చూసి వీరసహుడికి చాలా కోపం వచ్చింది. అతనా రాక్షసులిద్దరినీ చూస్తూనే వారిలో ఒకడిని చంపేశాడు. అప్పుడు రెండో వాడు, ‘‘పాపీ, అకారణంగా నా అనుచరుడిని చంపావు కదూ? నిన్నేం చేస్తానో చూడు,’’ అంటూ అదృశ్యుడయిపోయాడు.

కొంత కాలం గడిచింది. ఆ రాజు ఇదే ఆశ్రమంలో ఒక బ్రహ్మాండమైన అశ్వమేథ యాగం చేశాడు. వశిష్టుడే ఆ యాగం చేయించాడు. యాగం పూర్తి అయేసరికి వెనకటి రాక్షసుడు, రాజుపైన పగబట్టి ఉన్న వాడు గనక, వసిష్టుడి రూపంలో వచ్చి, ‘‘రాజా యజ్ఞం పూర్తి అయింది. నాకు చక్కని మాంసభోజనం పెట్టు,’’ అని అడిగాడు.

రాజు సంతోషించి వంటవాడిని పిలిచి ‘‘గురువుగారికి హవిస్సు మాంసంతో రుచిగా భోజనం తయారుచెయ్యి,’’ అన్నాడు. ఈ లోపుగానే రాక్షసుడు వంటవాడి రూపంలో నరమాంసంతో వంట సిద్ధం చేసి, రాజుకు చూపించి, ‘‘హవిస్సుతో చక్కని వంట చేశాను,’’ అన్నాడు. రాజు వసిష్టుడికి తన భార్య అయిన మదయంతి చేత ఆ నరమాంసం వడ్డింపించాడు. నిజ వసిష్టుడు తనకు వడ్డించినది నరమాంసమని గుర్తించి, ఆగ్రహించి, ‘‘నువు నరభక్షకుడివైపో!’’ అని రాజును ఘోరంగా శపించాడు. రాజుకు కూడా కోపం వచ్చి, వసిష్టుడిని శపించడానికి నీరు చేతిలోకి తీసుకున్నాడు. కాని, అతను శపించే లోపుగా మదయంతి అడ్డుపడి, ‘‘ఆయన మనకు దేవుడిలాటివారు. ఆయనను శపించరాదు.’’ అన్నది. అప్పుడు రాజు చేతిలో నీళ్లను తన పాదాలమీదనే పోసేసుకున్నాడు. ఆ నీటివల్ల రాజు పాదాలకు కల్మషం కలిగింది. అప్పటినుంచి అతనికి కల్మషపాదుడనే పేరు వచ్చింది.

తరవాత వసిష్టుడు జరిగిన సంగతి గ్రహించి, కల్మషపాదుడికి శాఫఫలం పన్నెండేళ్లు ఉండేటట్టు అనుగ్రహించాడు. రాజు పన్నెండేళ్ల పాటు నరభక్షకుడుగా జీవించి, శాపం తీరి మామూలు మనిషి అయి, ఎప్పటిలాగే రాజ్యపాలన చేశాడు. ఈ కథను వాల్మీకి వల్ల విని శత్రుఘ్నుడు పర్ణశాల ప్రవేశించే సమయానికి సీత కవలపిల్లలను కన్నది.

ఈ వార్త మునికుమారుల ద్వారా వినగానే వాల్మీకి వెళ్లి, బాలచంద్రుల్లాగా ప్రకాశించే పిల్లలను చూసి, రక్షలు కట్టి, పెద్దవాడికి కుశుడనీ, రెండోవాడికి లవుడనీ పేర్లు పెట్టాడు.

ఇది జరిగింది సరిగా అర్ధరాత్రి వేళ. ఆ సమయంలోనే శత్రుఘ్నుడు సీత వద్దకు  వెళ్లి, ‘‘అమ్మా అదృష్టం,’’ అని ఎంతో సంతోషించాడు. మర్నాడు అతను వాల్మీకి వద్ద సెలవు పుచ్చుకుని, పడమరగా ప్రయూణిస్తూ, అక్కడి మునుల ఆశ్రమాలలో సత్కాలక్షేపం చేస్తూ ఆ రాత్రి గడిపాడు. మర్నాడు తెల్లవారగనే శత్రుఘ్నుడు చ్యవన మహామునిని లవణాసురుడిని, వాడి త్రిశూలం గురించి అడిగాడు. చ్యవనుడు మాంధాత వృత్తాంతం వివరించి చెప్పాడు. అయోధ్య రాజైన యవనాశ్వుడి కుమారుడు మాంధాత, మహాబలవంతుడైన ఆ మాంధాత భూమిలో ఉండే రాజులనందరినీ జయించి, స్వర్గానికి వెళ్లి దాన్ని కూడా జయించ నిశ్చయించాడు. ఆ సంగతి తెలిసి, ఇంద్రుడు మొదలైన దేవతలు భయపడ్డారు.

ఇంద్రుడి అర్ధాసనమూ, దేవతల సేవా కోరి వచ్చిన మాంధాతతో ఇంద్రుడు మంచిగానే, ‘‘ముందు భూలోకాన్ని జయించి రా, అప్పుడు దేవలోకాన్ని నీకిచ్చేస్తాం.’’ అన్నాడు.

‘‘అదేమిటి? భూలోకమంతా అదివరకే జయించాను. అక్కడ నా శాసనానికి ఎదురులేదు.’’ అన్నాడు మాంధాత. ‘‘మధువనంలో లవణాసురుడనేవాడున్నాడు. వాడు నీకు లోబడి నడుచుకుంటున్నాడా?’’ అని ఇంద్రుడు మాంధాతనడిగాడు.

మాంధాత సిగ్గుపడి  తల వంచుకుని భూమికి తిరిగి వచ్చి, లవణుడిని జయించడానికి సేనా సమేతుడై బయలుదేరి వెళ్లి, తనకు లొంగిపొమ్మని లవణుడికి కబురు చేశాడు. లవణుడా దూతను పట్టుకుని తినేశాడు.

ఎంత కాలానికీ దూత తిరిగి రాకపోగా, మాంధాత లవణుడి పైన యుద్ధం ప్రారంభించాడు. లవణుడు నవ్వి, తన శూలాన్ని ప్రయోగించే సరికి, అది మాంధాతని, అతని సైన్యమంతటినీ భస్మం చేసేసింది. చ్యవనుడీ సంగతి చెప్పి, ‘‘వాడి చేతిలో ఆ త్రిశూలం లేని సమయంలోనే నువు వాడిని చంపాలి. రేపే ఆ పని చెయ్యగలుగుతావు,’’ అన్నాడు. ఆ రాత్రి కబుర్లతో సులువుగా గడిచిపోయింది.




No comments:

Post a Comment