నూరామడల దూరం దూకినా కూడా హనుమంతుడికి ఆయూసం కలగలేదు. ఆఖరుకు ఊపిరి
కూడా వేగంగా పీల్చలేదు. అందుచేత అతను, ‘‘నేను ఎన్ని నూరామడలైనా దూక గలను. ఈ
సముద్రం దాటటం ఏపాటి?'' అనుకున్నాడు. అతను పచ్చిక భూముల మీదుగా, చిన్న
పెద్ద కొండలు గల అరణ్యాలమధ్యగా లంకానగరం కేసి నడవసాగాడు. లంకాపట్టణం చుట్టూ
సరళ చెట్లూ, కొండగోగులూ, ఖర్జూరాలూ, జంబీరాలూ, కొండ మల్లెలూ, మొగలి పొదలూ,
అరటులూ మొదలైన ఎన్నో రకాల చెట్లున్నాయి.
అందమైన ఉద్యానాలున్నాయి. నగరం చుట్టూ బంగారు ప్రాకారాలున్నాయి,
అగడ్తలున్నాయి. ఎవరూ లోపల ప్రవేశించకుండా భయంకరులైన రాక్షసులు ఆయుధాలతో
కాపలా కాస్తున్నారు. లెక్కలేని కోట బురుజులతోనూ, ధ్వజస్తంభాలతోనూ,
ప్రకాశిస్తున్న ఇళ్ళతోనూ అతి మనోహరంగా ఉన్న లంకానగరం ఎత్తున ఉండటం చేత
నిజంగానే దేవలోకానికి సంబంధించినట్టుగా ఉన్నది.
లంకానగరమూ, దానికి గల రక్షణలూ, రాక్షసుల కాపలా చూస్తూ ఉంటే
హనుమంతుడికొక ఆలోచన కలిగింది: వానరులు సముద్రం దాటి ఈ లంకకు ఎలా వస్తారు?
నూరు యోజనాల సముద్రాన్ని లంఘించగల వానర వీరులలో హనుమంతుడు గాక, అంగదుడూ,
నీలుడూ, సుగ్రీవుడూ మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళ మాటేమిటి? మహా
వీరుడైనప్పటికీ రాముడిక్కడికి వచ్చి ఈ లంకను జయించగలడా అని హనుమంతుడికి
అనుమానం కలిగింది.
సీతను చూసిన తరవాత ఈ శంకలను గురించి ఆలోచించవచ్చుననుకుని హనుమంతుడు
లంకలో ప్రవేశించటానికి చిన్న రూపం ధరించాడు. మరీ చిన్న శరీరమైతే త్వరగా
కదలలేడు, మరీ పెద్ద శరీరం అందరినీ ఆకర్షిస్తుంది; అందుచేత అన్నివిధాలా
అనుకూలించే ప్రమాణంలో శరీరాన్ని ఉంచుకుని అతను ముందుకు సాగాడు. లంకలో
జొరబడి సీతను వెదకటానికి రాత్రివేళే మేలని అతనికి తోచింది.
అందుచేత అతను సూర్యాస్తమయమయ్యూక పిల్లి ప్రమాణం గల దేహంతో, నాలుగు
కాళ్ళమీదా ఒకేసారి గెంతుతూ కోతిలాగే లంక ప్రవేశించాడు. లంకానగరం
హనుమంతుడికి అద్భుతంగా కనబడింది. ఏడేసి, ఎనిమిదేసి అంతస్థుల మేడలు, వాటికి
వెండి బంగారాల స్తంభాలు, స్ఫటికమణుల అలంకారాలు! ఎక్కడ చూసినా మణులతోనూ,
ముత్యాలతోనూ తీర్చిన అలంకరణలు! ‘‘హా, ఈ నగరాన్ని వానరులు ఎలా జయిస్తారు!''
అనుకున్నాడు హనుమంతుడు.
అకస్మాత్తుగా హనుమంతుడి ముందు ఒక భయంకర వికృతాకారం సాక్షాత్కరించి,
పెద్ద గొంతుతో అరుస్తూ, ‘‘ఎవరు నువ్వు? ఇక్కడి కెందుకు వచ్చావు? నిజం
చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తాను!'' అన్నది. ‘‘నా సంగతి చెబుతాను గాని
నువ్వెవతెవు? ఈ నగర ద్వారం దగ్గిర ఏం చేస్తున్నావు?'' అని హనుమంతుడా
ఆకారాన్ని అడిగాడు. ‘‘నేను ఈ లంకానగరాన్ని. రావణుడి కింకరిని. ఈ నగరాన్ని
నేను రక్షిస్తున్నాను. నన్ను గెలిచి నువ్వు నగరంలోకి అడుగు పెట్టలేవు.
తప్పక నా చేతిలో చస్తావు,'' అన్నది లంక.
‘‘మరేమీ లేదు. ఈ బురుజులూ, ప్రాకారాలూ గల అందమైన లంకానగరాన్ని చూడ
బుద్ధి పుట్టి వచ్చాను. నగరమంతా చూసి ఎలా వచ్చానో, అలాగే పోతాను. ఇంకేమీ
చేయను,'' అన్నాడు హనుమంతుడు. ఆ మాట విని లంక హనుమంతుణ్ణి అరచేత్తో గట్టిగా
చరిచింది. హనుమంతుడొక్క కేక పెట్టి, తన ఎడమ పిడికిలి బిగించి లంకను
ఒక్కపోటు పొడిచాడు. దాన్ని చంపాలనే ఉద్దేశం లేకపోవటంచేత అతను ఆటే బలంగా
కూడా పొడవలేదు. కాని ఆ దెబ్బకే లంక కాళ్ళూ, చేతులూ కొట్టుకుంటూ నేల
కూలింది.
లంక హనుమంతుడికి ఒక్క నమస్కారం పెట్టి, ‘‘కోతిరాజా, నువ్వు మహా
బలుడవు. నా మీద నీ శక్తి చూపక, నన్ను కాపాడు. నేను ఓడిపోయూను. నన్ను ఎవరో
వానరుడు వచ్చి జయిస్తాడనీ, అంతటితో రాక్షసులకు చేటు మూడుతుందనీ ఒకప్పుడు
బ్రహ్మ చెప్పాడు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఇక రాక్షసులకు కీడు తప్పదు.
సీతను ఎత్తుకు వచ్చి రావణుడు రాక్షసులందరికీ నాశనం తెచ్చాడు.
నువ్వు నగరం ప్రవేశించి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. సీతను కూడా
చూడు,'' అన్నది. ఈ విధంగా లంకను జయించిన హనుమంతుడు ప్రాకారం ఎక్కి లంకానగరం
లోకి దిగి, ఎడమకాలు ముందు పెట్టి నగరం ప్రవేశించాడు. అతను రాజ మార్గం వెంట
పోతుంటే వాద్య ధ్వనులూ, నవ్వులూ వినిపించాయి. ఇళ్ళన్నీ ఎంతో అందంగా రంగు
రంగుల పుష్ప మాలలతోనూ, చిత్ర విచిత్రమైన రంగులతోనూ అలంకరించి ఉన్నాయి.
మద్యం తాగిన స్ర్తీలు త్రిస్థాయిలలో పాడుతూ గంధర్వ స్ర్తీలను జ్ఞాపకం
చేస్తున్నారు. రాక్షసుల ఇళ్ళలో స్ర్తీలు అటూ ఇటూ తిరిగేటప్పుడూ, మేడల
మెట్లెక్కేటప్పుడూ చేసే అందెలు మొదలయిన వాటి ధ్వనులు హనుమంతుడు విన్నాడు.
కొన్ని ఇళ్ళలో మంత్రాలు చదువుతున్నారు. ఒక చోట రాక్షససేన విడిసి ఉండటం
కనిపించింది. హనుమంతుడు రావణుడు మొదలైన రాక్షస ప్రముఖులుండే కోటను
చేరేసరికి పొద్దు పోయింది. దానిలోపల బంగారపుటిళ్ళూ, బంగారు పూత పూసి,
ముత్యాలతో అలంకరించిన ప్రాకారాలూ ఉన్నాయి.
దానికి భయంకరులైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. ఎవరికీ తెలియకుండా
హనుమంతుడు ఆ అంతర్నగరం ప్రవేశించాడు. ప్రతి ఒక్క ఇంటా రథాలూ, ఏనుగులూ,
గుర్రాలూ, సింహాసనాలూ ఉన్నాయి. ఎక్కడ చూసినా బాగా తిని, తాగి ఒళ్ళు తెలియని
స్థితిలో ఉన్న రాక్షస స్ర్తీ పురుషులు అతనికి కనిపించారు.
అతను ధైర్యంగా ప్రతి ఇల్లూ, ఇంటి తోటా పరిశీలిస్తూ-ప్రహస్తుడు,
మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, మహోదారుడు, విరూపాక్షుడు,
విద్యున్మాలి, వజ్రదంష్ర్టుడు, శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి,
రశ్మికేతువు, వజ్రకా యుడు, ధూమ్రాక్షుడు, విద్యుద్రూపుడు, విఘనుడు,
శుకానాసుడు, యుద్ధోన్మత్తుడు, ధ్వజగ్రీవుడు, బ్రహ్మకర్ణుడు, ఇంద్రజిహ్వుడు,
కరాళుడు మొదలైన రాక్షస ప్రముఖుల ఇళ్ళన్నీ గాలించి రావణుడి ఇంట జొరబడ్డాడు.
ఆ ఇంటి ఆవరణలో రంగు రంగుల గుర్రాలూ, ఐరావతాలలాటి ఏనుగులూ, శ్రేష్ఠమైన
బంగారు ఆభరణాలు ధరించిన కావలి వాళ్ళూ కనిపించారు. ఆ ఇంట లతా గృహాలూ,
చిత్రశాలలూ, క్రీడా గృహాలూ మొదలైనవి వేరువేరుగా ఉన్నాయి. అంతటా మణులు
ప్రకాశిస్తున్నాయి. ఆ ఇంట మంచాలూ, పీటలూ, పాత్రలూ, సమస్తమూ బంగారంతో
చేసినవే. ఎక్కడ చూసినా పుష్పమాలలూ, సుగంధ ధూపాలూ, దీపాలూ, కనిపించాయి.
విశ్వకర్మ నిర్మించిన ఆ గృహం కన్న అందమైనది ప్రపంచంలో ఎక్కడా లేదు.
అక్కడే పుష్పక విమానం కూడా హనుమంతుడికి కనిపించింది. అత్యద్భుతమైన పుష్పక
విమానాన్ని వివరంగా చూసి హనుమంతుడు రావణుడి శయ్యూగారానికి వెళ్ళాడు.
అర్ధరాత్రి దాటింది. అందరూ నిద్రపోతున్నారు. అక్కడ హనుమంతుడికి వెయ్యి మంది
స్ర్తీలు కనిపించారు. వారిలో చాలామంది అడ్డదిడ్డంగా పడుకుని ఉన్నారు.
కొందరి చేతుల్లో ఇంకా వాద్యాలు మొదలైనవి ఉన్నాయి.
వారిలో చాలామంది సౌందర్యవతులున్నారు. వారందరూ రావణుడి భార్యలు. వారిలో
ఋషుల స్ర్తీలూ, దేవగంధర్వ స్ర్తీలూ, రాక్షస స్ర్తీలూ ఉన్నారు. కాని ఒక్కతె
కూడా బలాత్కారంగా తెచ్చినదికాదు. అందరికీ అతడిపై ప్రేమ ఉన్నది. రావణుడు ఒక
పక్కగా శయ్యపై నిద్రపోతున్నాడు. అతను తన నల్లని శరీరానికి ఎరన్రి చందనం
పూసుకుని, బంగారు అలంకారాలు గల బట్టలు ధరించి మందర పర్వతంలాగా ఉన్నాడు.
రావణుడికి సమీపంగా వెళ్ళిన హనుమంతుడు భయపడ్డ వాడిలాగా వెనక్కు వెళ్ళి,
పక్కనే ఉన్న మెట్ల మీది కెక్కి, అక్కడి నుంచి రావణుణ్ణి పరీక్షించాడు.
నిద్రపోతున్న స్ర్తీలలో సీత ఉన్నదేమోనని అతను చూడటంతో, అతని కళ్ళు రావణుడి
పక్కనే పడుకుని ఉన్న మందోదరిపై పడ్డాయి. ఆమెను చూసి సీతే అనుకుని హనుమంతుడు
ఒక్క క్షణంపాటు సంతోషించి, మరుక్షణం అనుమానంలో పడ్డాడు.
ాముణ్ణి ఎడబాసిన సీతకు నిద్రాహారాలూ, అలంకరణలూ, ప్రశాంతతా ఉంటాయూ?
అందుచేత ఆమె సీత అయి ఉండదని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. అతనికి అనేక
రకాల స్ర్తీలు కనిపించారు గాని సీత కనిపించలేదు. సీత ప్రాణాలతో ఉంటే ఇందరు
స్ర్తీల మధ్యగాక ఇంకెక్కడో ఉంటుందా? సీత ఆత్మహత్య చేసుకున్నదేమోనని
హనుమంతుడికి అనుమానం కలిగింది.
ఇంత యత్నమూ చేసి చివరకు సీతను చూడకుండానే తిరిగి పోవలసివస్తుందా అని
అతను భయపడ్డాడు. హనుమంతుడు మిగిలిన లంకయూవత్తూ వెతకటానికి
నిశ్చయించుకున్నాడు. పెడగా అనేక ఇళ్ళున్నాయి. కొన్ని మేడలు, కొన్ని ఇళ్ళలో
నేలమాళిగలున్నాయి. హనుమంతుడు అన్ని ఇళ్ళలోకీ జొరబడి అంతటా సీత కోసం
వెతికాడు. ఆఖరుకు వీధులూ, మంటపాలూ, తిన్నెలూ, బావులూ కూడా వెతికాడు.
సీత
అసలు లంకదాక రానే లేదేమో, రావణుడు తెచ్చేటప్పుడు మార్గ మధ్యానో,
సముద్రంలోనో పడిపోయిందేమోనని కూడా అతనికి తోచింది. తాను సీతను చూడక
తిరిగిపోతే రాముడు చస్తాడు, రాముడి తమ్ములు చస్తారు. సుగ్రీవుడూ, అంగదుడూ
చస్తారు. అందుచేత సీత కనబడిన దాకా తాను లంకను విడవరాదు. ఇక్కడే ఏ వనంలోనో
పళ్ళూ ఫలాలూ తింటూ ఉండి, సీతను చూడలేకపోయిన పక్షంలో ప్రాయోపవేశం చెయ్యటం
మంచిదని హనుమంతుడు తీర్మానించుకున్నాడు.
రాత్రి అయిపో వచ్చింది. హనుమంతుడు ప్రాకారంమీదుగా దూకి చుట్టూ
చూసేసరికి అతనికి అశోకవనం కనిపించింది. అక్కడ కూడా సీత కోసం వెతకవచ్చునని
అతనికి తోచింది. ప్రాకారం మీది నుంచి చూస్తే అశోక వనంలో అశోక వృక్షాలతో
బాటు మామిడి చెట్లూ, సంపెంగ చెట్లూ, ఇతర వృక్షాలూ, దట్టంగా అల్లుకుని ఉన్న
లతలూ, నానా రకాల పక్షులూ ఉన్నట్టు తెలిసింది. హనుమంతుడు విడిచిన బాణం లాగా ఆ
చెట్ల మీదుగా పరిగెత్తసాగాడు.
అతని వేగానికి చెట్లు పూలను రాల్చాయి, పక్షులు గోల చేస్తూ ఎగిరాయి.
హనుమంతుడు ఆ చెట్ల మీదుగా పోతూ ఆకులూ, పళ్ళూ రాల్చి చెట్లను మోడు చేశాడు,
లతలను చిందరవందర చేశాడు. అశోకవనంలో అనేక రకాల అందమైన కట్టడాలున్నాయి.
కృత్రిమ వృక్షాలూ, దిగుడు బావులూ ఉన్నాయి. ఒక చోట ఒక క్రీడా పర్వతం ఉన్నది.
దాని చుట్టూ చెట్లున్నాయి. దానిమీద రాతి ఇళ్ళున్నాయి. దానిపై నుంచి ఒక నది
కిందికి ప్రవహిస్తున్నది. ఆ నదికి దూరంగా తామర తంపర కనిపించింది.
అక్కడ చల్లని నీరు గల కృత్రిమమైన తటాకం ఒకటి ఉన్నది. దానికి రత్నాల
మెట్లున్నాయి. ముత్యాలు ఇసుకలాగా పోసి ఉన్నాయి. దాని చుట్టూ అందమైన చెట్లూ,
మేడలూ ఉన్నాయి. హనుమంతుడికి దట్టమైన ఆకులూ, బంగారు అరుగులూ గల శింశుపా
వృక్షం ఒకటి కనిపించింది. అతను కొన్ని బంగారు వృక్షాలనూ, వాటి మధ్య గల ఒక
అశోక వృక్షాన్నీ చూసి ఆశ్చర్యపడ్డాడు.
ఆ అశోక చెట్టు గాలికి కదిలినప్పుడల్లా గజ్జెలమోత వినిపించింది. అతను
శింశుపా వృక్షం ఎక్కి, ‘‘ఈ అశోకవనం ఇంత అందంగా ఉన్నదే, సీత రోజూ ఇక్కడికి
రాక మానదు. ఆమెకు వనవిహారం ఇష్టం. ఆమె విహరించటానికి ఈ వనం తగి ఉన్నది,
స్నానమాడటానికి ఈ జలాశయం కూడా తగి ఉన్నది. రాముణ్ణి తలుచుకుని
దుఃఖించటానికైనా ఇది ఎంతో అనువైన చోటు. సీతకు ఈ వనమూ, ఈ వనానికి సీతా తగి
ఉంటారు. ఆమె జీవించే ఉండాలి గాని, ఇక్కడికి రాకుండా ఉండదు; నేనామెను తప్పక
చూస్తాను కూడా!'' అనుకున్నాడు.
No comments:
Post a Comment