Monday, August 27, 2012

రామాయణం - యుద్ధకాండ

హనుమ చెప్పిన మాటలని విన్న రాముడు ఎంతగానో సంతోషించి " హనుమ! నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్ళడం అనేది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత, రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణంలో ప్రవేశించి, సీత దర్శనం చేసి, ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యము నిర్వహించి, ఎటువంటి అవమానము పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పనికాదు.

సేవకులు మూడు రకాలుగా ఉంటారు, ప్రభువు చెప్పిన పనికన్నా తనలో ఉన్న సమర్ధత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగిన సమర్ధత కలిగినవాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి, అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్ధ్యం ఉన్నప్పటికీ, ప్రభువు చెప్పలేదు కనుక మనకెందుకులే అనుకునేవాళ్లు మధ్యములు. తనకి చెయ్యగలిగే సమర్ధత ఉన్నా, నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్యనివాడు ఎవడు ఉంటాడో వాడు అధముడు. ఇవ్వాళ నిన్ను నీవు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు. నా క్షేమ వార్త సీతకి చెప్పి, ఆమె మనసులో ఉన్న దైన్యాన్ని, బాధని తొలగించి సుఖాన్ని పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించావు. సీత జాడ తెలియక బాధపడుతున్న నాకు సీత జాడ చెప్పి సంతోషపెట్టావు. నీకు నేను ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను. ఇవ్వాళ నీకు ఇవ్వటానికి నా దెగ్గర ఎటువంటి వస్తువు లేదు. నా దెగ్గర ఉన్నది ఈ దేహమే, అందుకని నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను " అని, హనుమని దెగ్గరికి తీసుకుని గట్టిగ కౌగలించుకున్నాడు.

తవువాత రాముడన్నాడు " అంతా బాగానే ఉంది కాని, ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు వెళతారు. మనకున్న ఈ వానర సముహంతో ఆ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలుగుతాము. అందులో క్రూరమైన రాక్షసులు, తిమింగలాలు, మొసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా......." అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ఒక మాట అంటాడు, " రామ! నువ్వు శోకాన్ని పొందకు. నీకున్న ఉత్సాహమును, పౌరుష పరాక్రమములను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు కోదండం పట్టుకొని నిలబడిననాడు నీముందు నిలబడగలిగిన మొనగాడు ఎవడు. నువ్వు సమస్త బ్రహ్మండములను శాసించగలిగిన వాడివి. నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వెంట రావడానికి సమస్త వానర సైన్యము సిద్ధంగా ఉంది. ఒకసారి వానర సైన్యము లంకా పట్టణంలో అడుగుపెట్టిందంటే, రావణుడు నిహతుడయ్యిపోయినట్టే. అందుకని సముద్రాన్ని దాటడం ఎలాగన్న విషయం మీద నీ దృష్టి కోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి " అన్నాడు.

సుగ్రీవుడి మాటలకి ఉత్సాహం పొందిన రాముడు " నిజమే, నేను తలుచుకుంటె నా తపఃశక్తి చేత ఈ వానరములను సముద్రాన్ని దాటించగలను. నేను తలుచుకుంటె నా అస్త్ర ప్రయోగం చేత సముద్రాన్ని ఇంకింప చేస్తాను " అని చెప్పి, హనుమ వంక తిరిగి " హనుమా! ఆ లంకా పట్టణం యొక్క బలం ఏమిటో నాకు చెప్పు. అక్కడ సైన్యం ఎంత ఉంటుంది. ద్వారములు, దుర్గములు ఎలా ఉంటాయి " అని అడిగాడు.

అప్పుడు హనుమంతుడు " ఆ లంకా పట్టణం 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళితే త్రికూటా పర్వత శిఖరాల మధ్యన ఉంటుంది. అది శత్రు దుర్భేధ్యమైనది, దేవదానవులు కూడా దానిని ఆక్రమించలేరు. ఆ లంకా పట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, అందులో ఒక విశాలమైన అగడ్త నిర్మించారు. దానిమీద నాలుగు వైపులా నాలుగు వంతెనలు ఉంటాయి. ఈ వంతెనల మీద సర్వకాలములయందు కొన్ని వందల శతఘ్నులు సిద్ధం చెయ్యబడి ఉంటాయి. దానితో పాటు ఆ లంకకి నాలుగు దుర్గాలున్నాయి, అరణ్యంలో ఉన్న దుర్గానికి అరణ్య దుర్గము అని పేరు. నది చేత రక్షింపబడుతున్న దుర్గానికి నదీ దుర్గము అని పేరు. పర్వతము చేత రక్షింపబడుతున్న దుర్గానికి పర్వత దుర్గము అని పేరు. కృత్రిమంగా నిర్మించిన దుర్గానికి కృత్రిమ దుర్గము అని పేరు. ఆ లంకా పట్టణము ఈ నాలుగు దుర్గములతోటి శోభిల్లుతోంది. లంకకి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం దెగ్గర 10,000 మంది రాక్షసులు ఆయుధములు పట్టుకొని గుర్రాల మీద, ఏనుగుల మీద తిరుగుతూ కాపు కాస్తుంటారు. దక్షిణ ద్వారాన్ని లక్ష మంది సైనికులు కాపు కాస్తుంటారు. పది లక్షల మంది పశ్చిమ ద్వారాన్ని కాపు కాస్తుంటారు. కోటి మంది సైనికులు ఉత్తర ద్వారాన్ని కాపు కాస్తుంటారు. ఆ రాక్షసులకి యుద్ధం చెయ్యడమంటే మహా ప్రీతికరమైన విషయం. రాజద్వారమునకు భయంకరమైన ఇనుప గడియలు, పరిఘలు బిగించి ఉంటాయి. ఆ లంకని చేరుకొని యుద్ధం చెయ్యడం అంత సామాన్యమైన విషయం కాదు.

మీరు కాని ఆజ్ఞాపిస్తే ఒక సుషేణుడు, గంధమాదనుడు, నీలుడు, నలుడు, ద్వివిదుడు, మైందుడు, సుగ్రీవుడు, అంగదుడు లంకని సర్వనాశనం చేసేస్తారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడున్న మొత్తం రాక్షస సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనం చేశాను. అక్కడున్న అనేక వంతెనలలో ఒక వంతెనని పూర్తిగా విరిచేశాను. అనేక ప్రాసాదాలని విరగొట్టాను. ప్రస్తుతం లంక చెదిరిపోయిన శోభతో ఉంది, రాక్షసులు ఉద్విగ్నులై ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చెయ్యడానికి ఇది చాలా అనువైన సమయం అని నేను అనుకుంటున్నాను " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు " నాకన్నీ శుభనిమిత్తములు కనపడుతున్నాయి. నా మనస్సులో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతోంది. మనం ఆ సముద్రాన్ని సేతువు కట్టి దాటితే రావణుడు నిహతుడు అయిపోయినట్టే. మంచి ముహూర్త నిర్ణయం చెయ్యండి, మనం బయలుదేరదాము " అన్నాడు.

అప్పుడు రాముడు " మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశంలో మధ్యన ఉన్నాడు. ఈ రోజున ఉన్న విశాఖ నక్షత్రం మా ఇక్ష్వాకు వంశీయులది, ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని విజయము అని పిలుస్తారు. ఈ ముహూర్తం చాలా బాగుంది కనుక మన వెంటనే సైన్యాన్ని తీసుకొని బయలుదేరదాము " అన్నాడు.

రాముడు ఈ మాట అనగానే అక్కడున్న వానరములన్నీ సంతోషాన్ని పొంది " జై శ్రీరాం, జై జై రామ, బయలుదేరదాము, లంక చేరిపోదాము, రావణుడిని సంహరిద్దాము " అన్నాయి.

తరువాత రాముడు సుగ్రీవుడితో " వృద్ధులైన వారు, శరీరంలో శక్తిలేనివారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు, ఇటువంటి వానరములని తీసుకొని రావద్దు. మొదట నీలుడు వెళ్ళాలి, ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన లక్ష వానరములు వెళ్ళాలి. మిగతా వానరాలన్నీ రావడానికి కావలసిన త్రోవని వారు నిర్ణయించాలి. అందరూ వెళ్ళడానికి అనువైనరీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి. కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు, అప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి చక్కని వృక్ష సముదాయం ఉండాలి, తాగడానికి మంచి నీరు దొరకాలి, పళ్ళు, తేనె దొరకాలి, అటువంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి. ఈ సైన్యం అంతా వెళుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గవయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. ఈ సైన్యాన్ని కుడి పక్కన ఋషభుడు చూస్తూ వాళ్ళని రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానరములతో ఆ సైన్యాన్ని రక్షించాలి. అలాగే వెనుక కూడా కొన్ని లక్షల వానరములు రక్షిస్తూ రావాలి.

వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. అటువంటి సరోవరాలలొ శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు. ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరు కూడా శరీరాలని విడిచిపెట్టే ఉపద్రవం ఏర్పడవచ్చు. అందుకని చాలా ముందుగా వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకి, సరస్సులకి ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి. నేను సైన్య మధ్య భాగంలో హనుమ భుజాల మీద కూర్చుని వస్తాను. అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరతాడు. జాంబవంతుడు మొదలైనవారు ఈ వానర సైన్యాన్ని అన్నివైపులా రక్షిస్తూ ఉండాలి " అని చెప్పాడు.

అప్పుడా వానర సైన్యం అంతా బయలుదేరింది. అప్పుడా సైన్యంలో కొంతమంది వెనుక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు. రాముడికి పక్కన నడుస్తున్నవారు అంటున్నారు " ఒరేయ్! చూడరా లంకకి వెళ్ళగానే రావణుడిని ఏమి చేస్తానో " అని ఒకడు, " నేను ఒక్క గుద్దు గుద్దానంటే వాడి తలకాయలు పగిలిపోతాయి. చూడరా నా కండ " అని రాముడికి వినపడేటట్టుగా తమ ప్రతాపాలు చెప్పుకుంటున్నారు. ఆ సైన్యంలో బలంగా ఉన్నవాళ్ళు మెల్లగా నడుస్తున్నవారిని ఎత్తి పక్కకు పారేసి ముందుకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తొందరగా వెళ్ళాలని పర్వతాల మీద ఎక్కి వెళుతున్నారు. కొంతమంది చెట్లని పీకేసి వాటిని గోడుగులుగా పట్టుకొని వెళుతున్నారు. వాళ్ళందరూ అలా వెళుతుంటే అరణ్యం అరణ్యమే వెళ్ళిపోతుందా అన్నట్టుగా ఉంది. అలా వాళ్ళందరూ బయలుదేరి దక్షిణ దిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరముల మీదకి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అక్కడున్న రకరకాల పళ్ళని తిని కాలం గడిపారు. తరువాత అక్కడినుంచి బయలుదేరి కొంచెం ముందుకి వెళ్ళగా వాళ్ళకి సముద్రం కనపడింది. వాళ్ళు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది.

అప్పుడు రాముడు " మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి, రాక్షసుల బారిన పడకుండా ఈ వానరములను 3 భాగములు చెయ్యండి " అన్నాడు. అప్పుడు కొన్ని కోట్ల వానరములని ఒక వైపు నిలబెట్టారు, కొండముచ్చులని ఒక వైపు నిలబెట్టారు, భల్లూకాలని ఒక వైపు నిలబెట్టారు.

చంద్రుని కాంతి కెరటాలు మీద, కదులుతున్న నీటిమీద పడి మెరుస్తుంది. చంద్రుడిని చూసి పొంగుతున్న సముద్రాన్ని, పైనున్న చంద్రుడిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. గాలి చేత తోయబడుతున్న నీరు చంద్రుని కాంతికి మెరుస్తూ వెండి పళ్ళెంలా ఉంది. పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సముద్రం మీద ప్రతిఫలిస్తూ, అగ్నిచూర్ణం తీసుకొచ్చి సముద్రం మీద ఎవరో చల్లేసినట్టు ఉన్నాయి. ఆకాశం సముద్రంలా, సముద్రం ఆకాశంలా ఉన్నాయి, రెండిటికి తేడా తెలియడం లేదు. ఆకాశము, సముద్రము రెండూ కలిసిపోయినట్టు ఉన్నాయి, ఆకాశంలో తారలు ఉన్నాయి, సముద్రంలో రత్నాలు ఉన్నాయి. కదులుతున్న మేఘాలతో ఆకాశం ఉంది, కదులుతున్న తరంగాలతో సముద్రం ఉంది, అని ఆ సముద్రం గురించి వాల్మీకి మహర్షి తనదైన శైలిలో వర్ణించారు.

ఆ సమయంలో రాముడు సముద్రం వంక చూస్తూ " సీత లంకలో ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. చంద్రుడా! సీత నిన్ను చూసుంటుంది, అలా చూడబడిన నువ్వు నా వంక చూస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది. అటువైపు నుంచి వస్తున్న గాలి సీతకి తగిలి వస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది " అన్నాడు.

అటుపక్క లంకలో మంత్రులతో కూర్చుని దీనంగా తల దించుకుని రావణుడు ఉన్నాడు. అప్పుడాయన వాళ్ళతో " జెరగకూడని పని జెరిగిపోయింది. నేను సీతని అపహరించిన విషయం మీ అందరికి తెలుసు కదా. రాముడు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంకా పట్టణాన్ని ఎంత పీడించాడొ మీరు చూశారు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రాముడు సముద్ర తీరానికి వచ్చేశాడు, ఎలాగోలా సముద్రాన్ని దాటుతాడు (తన గూఢచారుల వల్ల రాముడు సముద్ర తీరానికి వచ్చాడని రావణుడు తెలుసుకున్నాడు). అప్పుడు మనం రామలక్ష్మణులతో, వానరములతో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి. మంత్రులందరూ ఎకాభిప్రాయంగా చెప్పిన మాట, ఉత్తమమైన మాట. మంత్రులు తమలో తాము విభేదించుకుని, తమ విభేదాలు పక్కకి పెట్టి కలిసి ఒక్కటిగా చెప్పిన మాట, మధ్యమమైన మాట. మంత్రులు విడిపోయి, ఎవరిమానన వాళ్ళు తలోమాట చెబితే, అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి " అన్నాడు.

అప్పుడా మంత్రులన్నారు " ప్రభు! మీరు దేనికింత బెంగ పెట్టుకుంటున్నారు. మీరు ఒకనాడు హిమాలయాలలో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి, ఆయనని ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చారు. ఆయన ఉన్న ఇంట్లోనుంచి ఆయనని తరిమేసి ఈ లంకా పట్టణాన్ని మీదిగా స్వాధీనం చేసుకున్నారు. నీ చెల్లెలైన కుంభీనస యొక్క భర్త అయిన మధువుని ఓడించి అక్కడినుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు. పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడున్న నాగులని, తక్షకి, జటి మొదలైన వాళ్ళని ఓడించి అపారమైన కీర్తి గడించారు. అక్కడినుంచి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఓడించారు. తరువాత యమలోకానికి వెళ్ళి యముడిని ఓడించారు, యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంతమందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు. మీ దెగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు, ఇంద్రజిత్ ముందు ఆ రాజకుమారులు ఎంత " అన్నారు.

ఇంతలో మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు లేచి " రావణ! నువ్వు భయపడవద్దు, నేను ఒక్కడిని యుద్ధానికి వెళితే చాలు. ఆ రామలక్ష్మణులిద్దరిని సంహరించి వస్తాను. నిన్నటి రోజున ప్రమత్తంగా ఉండడం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము " అన్నాడు.

అప్పుడు దుర్ముఖుడు అనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిఘని పట్టుకొచ్చి " నేను ఒక్కడినే వెళ్ళి ఈ పరిఘతో వాళ్ళని కొట్టి వచ్చేస్తాను " అన్నాడు.

అప్పుడు వజ్రదంష్ట్రుడు " రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాలిక నీకు చెబుతాను. మన దెగ్గర కామరూపులైన రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ భరతుడి సైన్యంలా రూపం మార్చమని చెప్పి రాముడి దెగ్గరికి పంపి ' అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు, అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు ' అని రాముడితో చెబుతారు. భరతుడి మీద ఉన్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మన సైన్యం సముద్రాన్ని దాటి రాముడిని కొట్టేస్తుంది, అప్పుడు వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు. మీరు అనుజ్ఞ ఇవ్వండి, ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాము " అన్నాడు.

అప్పుడు నికుంభుడు(కుంభకర్ణుడి కుమారుడు) అన్నాడు " దీనికింత మోసం ఎందుకు, నేను వెళ్ళి వాళ్ళని చంపేసి, రామలక్ష్మణులని తినేసి వస్తాను " అన్నాడు.

అప్పుడు విభీషణుడు " 3 విషయాలున్న శత్రువు విషయంలోనే యుద్ధానికి సిద్ధపడాలి. ఆ రాజు ఏమరపాటుతో ఉంటె యుద్ధానికి వెళ్ళడం తేలిక, మరొక శత్రువుతో పీడింపబడుతున్న రాజు మీదకి వెళ్ళడం తేలిక, దైవము ప్రతికూలంగా ఉన్న రాజుమీదకి వెళ్ళడం తేలిక. ఈ మూడు లోపాలు ఉన్న రాజు మీదకి దండయాత్ర చెయ్యడం తేలిక. కాని, మీరందరూ రాముడిని చంపేస్తాము, కొట్టేస్తాము అని ఎగురుతున్నారే, రాముడంటె అంత చేతకానివాడిలా కనపడుతున్నాడ. రాముడు ఇవ్వాళ యుద్ధానికి వచ్చాడు, అప్రమత్తుడై ఉన్నాడు, దైవము ఆయన పట్ల అనుకూలించి ఉంది. మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకొని వెళితే తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదు. నదులకు(తూర్పు దిక్కుకి ప్రవహించేవాటిని నదులు అంటారు), నదములకు(పశ్చిమ దిక్కుకి ప్రవహించేవాటిని నదములు అంటారు) భర్త అయిన సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి నిన్న హనుమ వచ్చి లంకా పట్టణం అంతటినీ కాల్చేశారు. మరి నిన్న మీరు హనుమని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇన్ని కోట్లమంది ఇక్కడికి వచ్చినవాడిని పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవ్వాళ ప్రభువు దెగ్గర నిలబడి నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను, నేను తినేస్తాను అంటున్నారు. ఇవి మంత్రులు చెప్పవలసిన మాటలేనా? మీ మాటలకి ఆలోచన కాని, విచక్షణ కాని ఉందా. యుద్ధానికి వెళ్ళేముందు శత్రుసైన్యం యొక్క బలం ఎంత ఉంది అని జాగ్రత్తగ అంచనా వెయ్యాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి మనకన్నా ఎక్కువ బలం ఉంటె వేరొక మార్గాన్ని ఆలోచించాలి, శత్రువు కన్నా మనకే ఎక్కువ బలం ఉంటె, ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రువు బలం ఏమిటో, ఎంతమంది వస్తున్నారో, ఎవరు ఎటువంటివారో మీరు అంచనా వేశార?

మీరు ఒక్కసారి ఆలోచించండి, రాముడు యుద్ధానికి రావలసిన అవసరం ఏమిటి? రాముడి భార్య అయిన సీతమ్మని మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోక వనంలో పెట్టాడు. అందుకని రాముడు తన భార్యని విడిపించుకోవడానికని యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉంది, ధర్మం ఎక్కడుంటె దేవతలు అక్కడ ఉంటారు, కావున దేవతల అనుగ్రహం రాముడికి ఉంటుంది. మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళదామని ఎలా అనుకుంటున్నారు. ఏ రకంగా చూసినా రాముడిదే పైచేయి. లంకకి, రాక్షసులకి, రావణుడికి ఉపద్రవం రాకూడదు అనుకుంటె, ఏ సీతమ్మ కారణంగా ఇటువంటి కలహం వస్తోందో, ఆ సీతమ్మని రాముడికి అప్పగిస్తే రాముడు యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనం, ఆ తప్పుని సమర్ధించుకోడానికి ఇన్ని కోట్ల మందిని ఫణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట విని సీతమ్మని ఇచ్చెయ్యండి " అన్నాడు.

విభీషణుడు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కని రావణుడు తన మంత్రులని ఆ సభ నుండి వెళ్ళమని చెప్పి, తాను కూడా వెళ్ళిపోయాడు.

విభీషణుడు మరునాడు ఉదయం రావణుడు ఉన్న గృహానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు, బ్రాహ్మణులు స్వస్తి వాచకాలు చెబుతున్నారు, పూజలు, అగ్నికార్యాలు జెరుగుతున్నాయి. రావణుడు ఒక మంచి తల్పం మీద కూర్చుని ఉండగా విభీషణుడు అక్కడికి తల వంచి నమస్కరిస్తూ వెళ్ళి " అన్నయ్య! నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెబుతుంటే వెళ్ళిపోయావు కదా. నీకు కొన్ని విషయాలు ఆంతరముగా చెబుదాము అనుకున్నాను. ఎందుకంటే, ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు. నీ మంత్రులకి కూడా తెలుసు. కాని నీకు భయపడి ఎవరూ నీతో చెప్పడం లేదు. నేను కూడా చెప్పకపోతె నా అన్నని రక్షించుకోనివాడిని అవుతానని, నీ మీద ప్రేమ చేత చెప్పడానికి వచ్చాను.

నువ్వు ఏనాడైతే సీతమ్మని అపహరించి లంకకి తీసుకోచ్చావో, ఆనాటినుంచి నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఎప్పుడైనా హోమం చేద్దామని నాలుగు పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే, ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్దగా పైకి రావడం లేదు, పొగ చుట్టుముట్టి ఉంటోంది. అన్ని హోమగుండాలలోని అగ్ని కూడా పొగతోనే ఉంటుంది, నిప్పురవ్వలు బయటకి కనపడుతున్నాయి. అగ్నిశాలలోకి, వేదశాలలోకి, పూజా గృహంలోకి విశేషంగా పాములు వస్తున్నాయి. అన్నిటినీమించి తెల్లవారుజామున హోమం చేద్దామని పాయసం కాని, తేనె కాని పెట్టుకుంటె, వాటినిండా చీమలు పట్టి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైన శకునములు.

ఆవు పాలు తీసుకొచ్చి పెట్టగానే అవి విరిగిపోతున్నాయి. ఏనుగులకు మదజలాలు కారకుండా అలా నిలబడి ఉంటున్నాయి. గుర్రాలు ఉత్సాహంగా సకిలించడం లేదు, దీనంగా సకిలిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తున్నాయి. గాడిదలు, కంచర గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువుల మీద ఉన్న వెంట్రుకలు తమంతట తాముగా ఊడి పడిపోతున్నాయి. పశు వైద్యులని తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించినా, ఈ జాతి మృగాల మీద వెంట్రుకలు నిలబడడం లేదు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్ళ మీద కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి. ప్రతిరోజు గ్రద్దలు ఇళ్ళ మీద కూర్చుంటున్నాయి. అరణ్యంలో ఉండే నక్కలు పగటివేళ, రాత్రివేళ ఊరి పోలిమేరలకొచ్చి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. క్రూరమైన మృగాలు భయంకరమైన ధ్వనులు చేస్తున్నాయి. అందుకని సీతమ్మని తీసుకెళ్ళి మనం రాముడికి అప్పచెప్పేద్దాము " అన్నాడు.

అప్పుడు రావణుడు విభీషణుడి వంక కోపంగా చూసి " ఇవన్నీ నీకు ఎక్కడ కనపడుతున్నాయి రా. నాకు ఎక్కడా కనపడడం లేదు. రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే, సీతని ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు " అన్నాడు. విభీషణుడు తల వంచుకొని వెళ్ళిపోయాడు.

తన మనస్సు నిరంతరము పరకాంత యందు ఉండుట చేత, సోదరుడు చెప్పిన మంచి మాట వినకపోవడము చేత రావణాసురుడు రోజురోజుకి కృశించిపోవుచున్నాడు.

తరువాత రావణుడు ఒక గొప్ప రథం ఎక్కి అందరినీ సభా మండపానికి రమ్మన్నాడు. అందరూ సభలొ కూర్చున్నాక ఆయనంటాడు " నేను సీతని అపహరించి తీసుకొచ్చిన మాట పరమ వాస్తవం. ఆ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కనుక నేను వాడికి చెప్పలేదు. ప్రహస్త! వెళ్ళి కుంభకర్ణుడిని తీసుకురా " అన్నాడు.

తరువాత ఆ సభని ఉద్దేశించి రావణుడు అన్నాడు " మూడు లోకాలలో సీతకన్నా అందగత్తె లేదు, కనుక నేను ఆమెని అపహరించి తీసుకొచ్చాను. ప్రతిరోజు సన్నటి నడుము కలిగిన సీతని చూస్తుంటే నాలొ కామ ప్రచోదనం పెరిగిపోయి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ కామం ఎక్కువ అవ్వడం వల్ల నేను నీరసించిపోతున్నాను ( ఆ రావణుడు సీతమ్మ గురించి ఇంకా నీచంగా వర్ణిస్తాడు, అది ఇక్కడ రాయడం బాగోదని రాయడం లేదు). నేను సీతని అపహరించి తీసుకొచ్చాక ' రాముడు ఒకవేళ తిరిగి వస్తాడేమో, ఒక సంవత్సర కాలం చూద్దాము ' అని సీత నన్ను అడిగింది. ఒక సంవత్సరం వరకూ నా మంచం ఎక్కను అనింది, పోనిలె ఒక సంవత్సరమే కదా అని సంవత్సరం గడువు ఇచ్చాను " అన్నాడు.

అప్పుడు అక్కడికి వచ్చిన కుంభకర్ణుడు " నువ్వు చేసిన పని పరమ తప్పు. ఇప్పుడు మా అందరినీ పిలిచి, ఏమి చెయ్యను అని అంటావేంటి. ఈ మాట నువ్వు మమ్మల్ని అపహరించే ముందు అడగాలి. రాజు ఒక నిర్ణయం చేసేముందు న్యాయాన్యాయములను బాగా ఆలోచించాలి. యుక్తాయుక్త విచక్షణ లేకుండా చపలచిత్తంతో రాజు కాని నిర్ణయం చేస్తే, ఆ నిర్ణయం నుంచి బయట ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. నువ్వు తొందరపడి సీతని తీసుకొచ్చావు, నీ అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా రాముడి చేతిలో చచ్చిపోకుండా బతికి ఉన్నావు. ఏదో తప్పు చేశావు సరె, ఇంక బెంగపెట్టుకోమాకు. హాయిగా లోపలికి వెళ్ళి మధ్యం తాగి, నీ కాంతలతో సుఖంగా విహరించు. నేను ఉన్నాను కదా, నేను వెళ్ళి ఆ రామలక్ష్మణులని సంహరించి, ఆ వానరులందరినీ తినేసి వస్తాను " అన్నాడు.

అప్పుడు మహాపార్షుడు అనే మంత్రి అన్నాడు " ఒక కోడిపుంజుకి కోరిక కలిగితే కోడిపెట్టని తరిమి, బలాత్కారంగా దానిని అనుభవిస్తుంది. అలా నువ్వు కూడా సీతని అనుభవించు " అన్నాడు.

రావణుడు ఆ మహాపార్షుడిని దెగ్గరికి పిలిచి " ఎంత గొప్ప ఆలోచన చెప్పావు. కాని నాకు ఒక శాపం ఉండిపోయింది. ఒకనాడు నేను బ్రహ్మ సభకి వెళుతున్నప్పుడు పుంజకస్థల అనే అప్సరస నన్ను చూసి దాక్కుంది. అప్పుడు నేను ఆమెని వెంట తరిమి, వివస్త్రని చేసి అనుభవించాను. బహుశా ఆవిడ బ్రహ్మగారికి చెప్పుంటుంది, అందుకని బ్రహ్మగారు నన్ను పిలిచి ' ఇకముందు నీయందు మనస్సులేని స్త్రీని నువ్వు బలాత్కారంగా అనుభవిస్తే, ఉత్తర క్షణం నీ శిరస్సు నూరు ముక్కలవుతుందని ' బ్రహ్మగారు శపించారు. అందుకని నేను సీత జోలికి వెళ్ళలేదు " అన్నాడు.

అప్పుడు విభీషణుడు పైకి లేచి అన్నాడు " మీ అందరికీ రాముడంటే చాలా తేలికగా ఉంది. సీతమ్మ అంటె మీకు చాలా చులకనగా ఉంది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, కుంభకర్ణుడు కాని, ఇంద్రజిత్ కాని, రావణాసురుడు కాని, మహాపార్షుడు కాని, మహొదరుడు కాని, నికుంభుడు కాని, వీరేవ్వరు కూడా రాముడి జోలికి వెళ్ళలేరు " అన్నాడు.

అప్పుడు ప్రహస్తుడు " ఏమిటయ్యా విభీషణ అలా మాట్లాడుతున్నావు, మన ప్రభువు దేవదానవులని ఓడించాడు. అసలు మనకి భయమన్న మాట ఇప్పటివరకూ తెలీదు. అటువంటిది నువ్వు ఎందుకు రాముడిని చూసి భయపడుతున్నావు " అన్నాడు.

విభీషణుడు " ఇక్ష్వాకు వంశస్తుడైన ఆ రాముడు పరమ ధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకి ఉన్నది ధర్మం ఒక్కటే. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ప్రహస్త! నీకేమి తెలుసని మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా గ్రద్ద రెక్కలు కట్టబడిన రామ బాణములు నీ వక్షస్థలంలో నాటుకుని నీ గుండెలు చీరేసి ఉంటె నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కాదు. నీకు రామ బాణం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు. మీరందరూ బతకాలనుకుంటె, అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం చెయ్యండి, రావణుడి మీద తిరగబడండి, ఆయనకి బుద్ధి చెప్పండి, సీతమ్మని ఇచ్చెయ్యండి, అలా చేస్తే మీరు బతికుంటారు లేకపోతె నశించిపోతారు " అన్నాడు.

ఆ సభలోనే ఉన్న ఇంద్రజిత్ పైకి లేచి " వీర్యంలొ కాని, పరాక్రమంలో కాని, బలంలో కాని, తేజస్సులో కాని మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటిలేనివారు. నువ్వు ఇంత పౌరుషహీనుడిగా ఎలా పుట్టావు పినతండ్రి!. పద్దాక ' రాముడు వచ్చేస్తాడు ' అని మాట్లాడుతున్నావు, ఎందుకంత భయం నీకు, ఏంచేస్తాడు రాముడు వస్తే " అన్నాడు.

అప్పుడు విభీషణుడు " నువ్వు బాలుడివి, నీకేమి తెలియదు. నిన్ను ఈ సభలోకి తీసుకోచ్చినవాడిని, నిన్ను చంపాలి. నీకేమి తెలుసని ఇక్కడికి వచ్చావు. ఈ సభలో మీ నాన్న పరస్త్రీయందు తనకున్న కామం గురించి మాట్లాడుతుంటే వినడానికి నీకు సిగ్గుగా లేదా. నీ పౌరుషం, నీ పరాక్రమం రాముడి ముందు నిలబడలేదు. లేనిపోని వ్యగ్రత తెచ్చుకొని విర్రవీగకురా ఇంద్రజిత్, కుర్చో " అన్నాడు.

అప్పుడు రావణుడు అన్నాడు " ఇంట్లో పగబట్టిన పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండచ్చు. శత్రువు అని తెలిసి, ఆ శత్రువు ఉన్న చోట ఉండచ్చు. కాని మిత్ర రూపంలో ఉండి శత్రువుగా ప్రవర్తిస్తున్నవాడితో కలిసి ఉండకూడదు. పూర్వం కొన్ని ఏనుగులు సరోవరంలో ఉండేవి, ఆ ఏనుగులు చెప్పిన మాటలని నీకు చెబుతాను జాగ్రత్తగా విను విభీషణ. ఆ ఏనుగులు అన్నాయి ' మనకి అగ్నివల్ల భయం లేదు, పాశాల వల్ల భయం లేదు, నీటి వల్ల భయం లేదు, మనకి మన జాతి వల్లే భయం ' అన్నాయి. నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజం అనిపిస్తోంది. ఆవులే ఐశ్వర్యము, బ్రాహ్మణులే తపస్సు, స్త్రీలదే చాపల్య బుద్ధి, బంధువుల వల్ల భయము కలుగుతాయి. నాకు నీవల్లే భయమొస్తోంది. ఇవ్వాళ నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు నాకు తమ్ముడివి కాదు, నువ్వు నా శత్రువువి " అన్నాడు.

అప్పుడు విభీషణుడు " నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి, తండ్రి తరువాత పెద్దన్నగారు తండ్రిలాంటి వారు. నువ్వు నాకు తండ్రిలాంటి వాడివి కనుక, నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితొ నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నం చేశాను. నాకన్నా పెద్దవాడిని అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ నేను ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటె నన్ను క్షమించు. నిన్ను పొగుడుతూ గోతుల్లోకి దింపేవాళ్ళు, తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. యదార్ధమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. అలా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు భయం ఏర్పడుతోందని అన్నావు కాబట్టి, నేను నీకు ప్రమాదకరంగా ఉన్నానన్నావు కాబట్టి, నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నాను అన్నావు కాబట్టి, నేను నీకు ఎప్పటికైనా కంటకుడిని అవుతానని అన్నావు కాబట్టి నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతాను. ఇప్పటికీ నా కోరిక ఒకటే, నువ్వు, నీ పరిజనం, ఈ లంక, రాక్షసులు, నీ బంధువులు, అందరూ సుఖంగా ఉండండి " అని చెప్పి, రావణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆయనతోపాటు మరో నలుగురు రాక్షసులు కూడా ఆయనతో వెళ్ళిపోయారు. ఆ అయిదుగురు ఒకేసారి ఆకాశమండలంలోకి ఎగిరిపోయారు.

విభీషణుడు, మిగతా నలుగురు రాక్షసులు ఉత్తర దిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశంలో నిలబడ్డారు. ఆకాశంలో ఉన్న విభీషణుడిని చూడగానే అక్కడున్న వానరాలు " రాక్షసుడు వచ్చాడు, కొట్టెయ్యండి " అని అక్కడున్న చెట్లని, పర్వతాలని పెకలించేశారు.

ఆ సమయంలో విభీషణుడు బెదరకుండా " నేను లంకని పాలించే రావణాసురుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అని పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మని అపహరించి లంకలో పెట్టాడు. సీతమ్మని అపహరించేటప్పుడు ఆమెని రక్షించాలని ప్రయత్నించిన జటాయువుని నిగ్రహించి చంపాడు. దురాత్ముడైన రావణుడిని నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను. కాని ఆయన నా మాటలు వినలేదు. ఆయనయందు అధర్మము ఉంది కనుక నేను ఆయనని విడిచిపెట్టి రాముడిని శరణు వేడడానికి వచ్చాను. రాముడు నాకే కాదు ఈ లోకములన్నిటికి శరణు ఇవ్వగలిగినవాడు. నేను మీకు శత్రువుని కాదు " అన్నాడు.

వెంటనే సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దెగ్గరికి వెళ్ళి " వచ్చినవాడు మనకి పరమ శత్రువైన రావణుడి తమ్ముడు. ఆయన ఒక రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం యుద్ధాన్ని ప్రారంభించేముందు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. ఈయనకి అభయమిచ్చి కిందకి దింపావంటె మన సైన్యంలో ఎటువంటి లోపాలున్నాయో కనిపెడతాడు. ఈయన రావణుడి గూఢచారి. ఇక్కడి రహస్యాలన్నీ కనిపెట్టి మనలో మనకి బేధాలు కలపిస్తాడు. అందుకని రామ, నువ్వు ఆయనకి శరణాగతి ఇవ్వకు. మాకు అనుమతి ఇవ్వు, వాళ్ళని సంహరిస్తాము. ఒక్కసారి గుడ్లగూబని కాని కాకులు తమ గూటిలోకి రానిస్తే, కాకి పిల్లలని ఆ గుడ్లగూబ తినేస్తుంది. ఈ విభీషణుడు కూడా అదే పని చేస్తాడు. " అన్నాడు.

అప్పుడు రాముడన్నాడు " నాయందు నీకున్న ప్రీతి ఎటువంటిదో నాకు తెలుసు సుగ్రీవ. నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఆదుర్తాని కూడా నేను కనిపెట్టగలను. నీకున్న అనుభవం చేత చక్కని ఉదాహరణలను చెప్పి బాగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా " అని అడిగాడు.

అంగదుడు లేచి అన్నాడు " మనం విభీషణుడిని పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనపడితే స్వీకరిద్దాము. ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా కనపడితే ఆయనని విడిచిపెట్టేద్దాము " అన్నాడు.

తరువాత శరభుడు అన్నాడు " మనం కొంతమంది గూఢచారులని పంపిద్దాము. గూఢచారులు ఆయనని పరిశీలించి ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వవచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు. గూఢచారులు చెప్పిన మాటలని బట్టి మనం నిర్ణయించుకుందాము " అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు అన్నాడు " ఇది వేళ కాని వేళ. ఇటువంటి సమయంలో రావణుడిని విడిచిపెట్టి మన వైపుకి వచ్చాడు. ఇప్పుడు మనం ఉన్నది పరుల ప్రదేశంలో. దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణాగతి చేస్తున్నాడు. అందుకని ఈయనని తీసుకోకపోవడమే మంచిది " అన్నాడు.

మైందుడు అన్నాడు " మనం ఎవరన్నా పెద్దవాళ్ళని ఆ విభీషణుడి దెగ్గరికి పంపిద్దాము. అప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నలకి విభీషణుడు ఏ సమాధానాలు చెబుతాడో గమనిద్దాము, విభీషణుడు చెప్పిన సమాధానాలు మనకి అనుకూలంగా ఉంటె ఆయనని స్వీకరిద్దాము, లేకపోతె ఆయనని స్వీకరించద్దు " అన్నాడు.

రాముడు హనుమ వంక ' నువ్వేమి చెప్పవా, హనుమ! ' అన్నట్టు చూశాడు. అప్పుడు హనుమంతుడు లేచి అన్నాడు " మహానుభావ! మూడు లోకములలో జెరిగే సమస్త విషయాలని తెలుసుకోగలిగే ప్రాజ్ఞుడవి నువ్వు, నీకు వేరొకరు చెప్పవలసిన అవసరం లేదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించడానికి చెబుతున్నాననో, తర్కం చెయ్యడానికి చెబుతున్నాననో, వేరొకరు చెప్పిన అభిప్రాయాలని ఖండించి సంఘర్షణ పడాలనుకొని చెబుతున్నాననో మీరు మాత్రం భావించకూడదు. మీరు నాయందు గౌరవముంచి అడిగారు, నేను మీయందు గౌరవముంచి నాకు యుక్తము అనిపించిన మాటలు చెబుతాను. మీరు ఆలోచన చేసి నిర్ణయించుకోండి.

ఇందులో కొంతమంది విభీషణుడిని నమ్మకూడదు అన్నారు, విభీషణుడు కామరూపాన్ని పొందగలిగినవాడైతే, మన సైన్యంలోకి వచ్చి గూఢచర్యం చెయ్యవలసినవాడైతే, తన స్వరూపంతో వచ్చి ఆకాశంలో నిలబడి ' నేను రాముడిని శరణు వేడుకుంటున్నాను ' అని అతను చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది గూఢచారులని పంపమన్నారు, మనకి తెలీకుండా మనకి అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఉన్నవాడి మీదకి గూఢచారులని పంపి నిర్ణయించుకోవచ్చు. కాని ఎదురుగా నిలబడి ఉన్నవాడి మీదకి గూఢచారిని ఎలా పంపిస్తారు. కొంతమంది మంచి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల వల్ల సమాధానాలు రాబట్టమన్నారు, మనం అతనిని ఏమని ప్రశ్నిస్తాము? జవాబు చెప్పేవాడికన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వెయ్యవచ్చు. ఆ తెలివి తక్కువ ప్రశ్న వల్ల మిత్రుడిగా ఉండవలసినవాడు అమిత్రత్వంతో అక్కడినుంచి వెళ్ళిపోవచ్చు, దానివల్ల మనం నష్టపోతాము. అందుకని అన్నివేళలా ప్రశ్నలు వేసి నిర్ణయించడం సాధ్యం కాదు. కొంతమంది గుణములు ఉంటె స్వీకరిద్దాము అన్నారు, వేరొకరియందు ఉండకూడని గుణము అని చెప్పబడినది మనయందు గుణము అవ్వచ్చు. కొంతమంది దేశము, కాలము యందు దోషముందని చెప్పారు, దేశము చేత, కాలము చేత ఇప్పుడే యదార్ధమైన స్థితి ఉంది.

ఇవతలవారికి అపకారము చేద్దామనే బుద్ధితో వచ్చి ఆకాశంలో నిలబడినవాడైతే ఆయన ముఖం అంత తేజోవంతంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండదు, అంత ధైర్యంగా నిలబడలేడు. ఆయన ముఖంలో ఏ విధమైన దోషం కాని, శఠుడికి ఉండే బుద్ధికాని నాకు కనపడడంలేదు. ఆయన మాట్లాడిన మాటలలో దోషం పట్టుకోడానికి నాకు ఏమి కనపడలేదు. ఇటువంటప్పుడు మనం ఆయన యందు వేరొక భావనని ఆపాదించి శరణు ఇవ్వకుండా ఉండవలసిన అగత్యం ఉన్నది అని నేను అనుకోవడం లేదు. నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను. విభీషణుడికి మీ పౌరుష పరాక్రమాల గురించి, మీ ధర్మము గురించి తెలుసు, ఆయనకి రావణుడు పౌరుషము తెలుసు, మీ పౌరుషం ముందు రావణుడి పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. అలాగే, మీరు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన విషయాన్ని విభీషణుడు విన్నాడు, అధర్మాత్ముడిని సంహరించి ధర్మాత్ముడికి పట్టాభిషేకం చేస్తారు అని నమ్మి ఇక్కడికి వచ్చాడు. మీరు ఆయనకి శరణు ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను " అన్నాడు.

అప్పుడు రాముడు " ఇప్పటిదాకా మీరందరూ, దోషములు ఉన్నాయా, దోషములు లేవ, తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని పలు మాటలు చెప్పారు, నేను ఒక మాట చెబుతున్నాను వినండి. నా దెగ్గరికి వచ్చి భూమి మీద పడి ' రామ! నేను నీవాడనయ్యా, నువ్వు నన్ను రక్షించు ' అనినవాడియందు నేను గుణదోష విచారణ చెయ్యను.

    సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
    అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ

వచ్చినవాడు విభీషణుడే కాని, రావణుడే కాని, నన్ను శరణు కోరినవాడు ఎవడైనా సరె రక్షిస్తాను. యదార్ధమునకు ఇటువంటి యుద్ధం జెరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికి ఆశ ఉంటుంది. అదే కులంలో జన్మించినవాడు ఎవడు ఉంటాడొ వాడికి రాజ్యాధికారం మీద ఆశ ఉంటుంది, అలాగే పక్కనున్న రాజుకి ఆశ ఉంటుంది. అందుకని ఈ రెండిటి విషయంలో మనం తటస్థులము, కాని ఈ రెండు కారణములు తన వైపు ఉన్నాయి కాబట్టి విభీషణుడు వచ్చి శరణాగతి అడిగాడు.

సుగ్రీవ! ప్రపంచంలో భరతుడులాంటి సోదరుడు ఉండడు(కోరి వచ్చిన రాజ్యాన్ని వదిలాడు కనుక), నాలాంటి కొడుకు ఉండడు(తండ్రి ప్రేమని అంతలా పొందాడు కనుక) , నీలాంటి మిత్రుడు ఉండడు. అందుకని అన్నీ ఆ కోణంలొ పోల్చి చూడకు. వాడు దుష్టుడు కాని, మంచివాడు కాని, నా దెగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణు ఇచ్చేస్తాను. ఈ బ్రహ్మాండములో ఉన్న పిశాచములు, దానవులు, యక్షులు, ఈ సమస్త పృధ్విలో ఉన్న భూతములు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే, నేను నా చిటికిన వేలి గోటితో చంపేస్తాను.

పూర్వకాలంలో ఒక చెట్టు మీద రెండు పావురాలు ఉండేవి. అవి ఒక ఆడ పావురము, ఒక మగ పావురము. ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ ఆనందంతో రమిస్తున్న రెండు పావురములను చూశాడు. అప్పుడాయన బాణం పెట్టి ఆడ పావురాన్ని కొట్టాడు. బాణం దెబ్బకి కిందపడిన ఆడ పావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు. ఆడ పావురం చనిపోయిందని ఆ మగ పావురం చాలా బాధ పడింది. కొంతకాలానికి ఆ బోయవాడు విశేషమైన వర్షం పడుతుండగా వేటకని వచ్చి, ఏమి కనపడకపోయేసరికి ఒక చెట్టుకింద ఉండిపోయాడు. తరువాత ఆ అరణ్యంలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి, పూర్వం తాను ఏ ఆడ పావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు. అప్పుడా మగ పావురం ఆ బోయవాడిని చూసి గబగబా వెళ్ళి నాలుగు ఎండు పుల్లలని తీసుకొచ్చి, ఎక్కడినుంచో అగ్నిని తీసుకువచ్చి నిప్పు పెట్టింది. అప్పుడా వేడికి ఈ బోయవాడు పైకి లేచి స్వస్తతని పొందాడు. ఆకలితో ఉన్న ఆ బోయవాడి ఆకలి తీర్చడం కోసం ఆ మగ పావురం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తన భార్యని చంపిన బోయవాడు తన చెట్టు దెగ్గరికి వచ్చి పడిపోతె, ఒక మగ పావురం ఆతిధ్యం ఇచ్చి, తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని భావించి తన ప్రాణములు ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది. నేను మనుష్యుడిలా పుట్టి, క్షత్రియ వంశ సంజాతుడనై, దశరథుడి కొడుకునై, నన్ను శరణాగతి చేసినవాడి గుణదోషములను ఎంచి, నీకు శరణాగతి ఇవ్వను అంటె నేను రాజుని అవుతాన? క్షత్రియుడని అవుతాన? ఈ భూలోకంలొ ఉన్న సమస్త భూతములలో ఏదన్నా సరె నన్ను శరణాగతి చేస్తే, వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. శరణాగతి చేసినవాడు బలహీనుడై, శరణు ఇవ్వవలసినవాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతె, వాడు చూస్తుండగా శరణాగతి చేసినవాడు మరణిస్తే, మరణించినవాడు రక్షించనివాడి యొక్క పుణ్యాన్ని అంతా తీసుకొని ఊర్ధలోకాలకి వెళ్ళిపోతాడు. రక్షించనివాడి కీర్తి ప్రతిష్టతలు నశించిపోతాయి. అందుచేత నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను, ఆయనని తీసుకురండి " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు అన్నాడు " రామ! నీకు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది. నీ ప్రాజ్ఞతకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను " అన్నాడు.

రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దెగ్గరికి వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగుతూనే ' ఇది రాముడు నిలబడిన భూమి ' అని, ఆ భూమికి నమస్కరించి అన్నాడు " రామచంద్ర! నేను రావణుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అంటారు. నేను లంకా పట్టణాన్ని విడిచిపెట్టి నీ దెగ్గరికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యని, బిడ్డలని వదిలేసి నువ్వే నా సర్వస్వం అని నమ్మి వచ్చేశాను. నా శిరస్సుని నీ పాదాలకి తగల్చి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమములను నువ్వే వహించాలి " అన్నాడు.

రాముడు విభీషణుడిని తన పక్కన కూర్చోపెట్టుకొని లంకలో ఉన్న రాక్షసుల బలాబలాల గురించి అడిగాడు. అప్పుడు విభీషణుడు రావణుడి గురించి, కుంభకర్ణుడి గురించి, ఇంద్రజిత్ గురించి మరియు ఆ లంక ఎంత శత్రు దుర్భేద్యమో కూడా చెప్పాడు. అప్పుడు రాముడన్నాడు " విభీషణ బెంగపెట్టుకోకు, రావణుడిని బంధువులతో, సైన్యంతో సహా సంహరిస్తాను. నీకు లంకని దానం చేస్తాను. నిన్ను లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రావణుడు హతమయ్యేవరకు నువ్వు ఆగక్కరలేదు, ఇప్పుడే నిన్ను లంకకి రాజుగా చేసేస్తాను " అన్నాడు.

అప్పుడు విభీషణుడు " మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏమాట చెబితే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చెయ్యమంటె యుద్ధం చేస్తాను. మీకు ఎప్పుడన్నా సలహా కావలసి వచ్చి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెబుతాను " అన్నాడు.

మళ్ళి రాముడు అన్నాడు " లక్ష్మణా! వెంటనే వెళ్ళి సముద్ర జలాలని తీసుకురా. ఈయనకి అభిషేకం చేసి లంకా రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను " అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు.

ఆ తరువాత రావణుడు శార్దూలుడనే గూఢచారిని రాముడి దెగ్గరికి పంపించాడు. ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలాన్ని అంతటినీ చూసి రావణుడి దెగ్గరికి వెళ్ళి " అది వానర సైన్యమా? సముద్రం పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉందయ్యా. నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు, అక్కడున్న వీరులు సామాన్యులు కారు, నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు " అన్నాడు.

" నేను మాత్రం సీతని ఇవ్వను " అని, సుకుడు అనేవాడిని పిలిచి " నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు. ' నువ్వు వానరుడివి, నేను రాక్షసుడిని. నేను అపహరించింది నరకాంతని, మధ్యలో నీకు నాకు కలహం ఎందుకు? మీరు ఈ సముద్రాన్ని దాటి రాలేరు. ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించడం? నా మాట విని మీరు వెళ్ళిపొండి ' అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి, నేను ఆయన కుశలమడిగానని చెప్పు " అని సుకుడిని పంపించాడు.

ఆ సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు అన్నాడు " దుర్మార్గుడు, దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే, రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అపహరించాడు. రాముడి కోదండ విద్యా పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు " అన్నాడు.

ఈలోగా అక్కడున్న వానరాలు గూఢచారిని విడిచిపెట్టకూడదని చెప్పి, అందరూ పైకి ఎగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. అప్పుడా సుకుడు ' రామ రామ ' అని ఏడిస్తే, రాముడు వెంటనే ఆ వానరాలని శాంతింప చేసి సుకుడుని విడిపించాడు. కాని వానరములు సుకుడిని బందీగా పట్టుకుని ఉంచాయి.

ఏమిచేస్తే ఈ సముద్రం మనకి దారి ఇస్తుంది అని విభీషణుడిని అడుగగా, ఆయన అన్నాడు " రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారి ఇస్తుంది " అన్నాడు.

చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, కోట్ల గోవులని దానము చేసిన బాహువు, మణులతో కూడిన కేయూరములు మొదలైనవాటితో  అలంకరింపబడ్డ బాహువు, అనేకమంది స్త్రీలచేత స్ప్రుసింపబడ్డ బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువుని ఈనాడు తనకి తలగడగా చేసుకొని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. మూడు రాత్రులు గడిచిపోయినప్పటికి సముద్రుడు రాకపోవడం వల్ల రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు " పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకానివాడిగా చూస్తుంది ఈ ప్రపంచం. ఈ సాగరం దారి ఇవ్వకపోతె నేను వెళ్ళలేను అనుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను. ఇందులో ఉన్న తిమింగలాలని, మొసళ్ళని, పాములని, రాక్షసులని నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తర క్షణం ఆవిరయిపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు " అని చెప్పి, కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు.

అలా చేసేటప్పటికి పర్వతాలన్ని కదిలిపోయాయి, వ్యాకులంగా గాలి వీచింది, అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కిందపడ్డాయి, ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి, 2 యోజనముల దూరం సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపలినుంచి బయటకి వచ్చాడు.

ఆ సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారములు, రత్నములతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకొని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుభానికి తోడపుట్టిన ఒక మణిని మెడలో వేసుకొని ఉన్నాడు. పైకి కిందకి వెళుతున్న తరంగ సద్రుస్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గంగ, సిందు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి. అలా పైకిలేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి " భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశములు అనే పంచ భూతములు ఉన్నాయి. వీటన్నిటికి ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావాన్ని ఈ పంచ భూతములు అతిక్రమించలేవు. సముద్రం అంటె అగాధంగా ఉండాలి, లోతుగా ఉండాలి, అందులోకి దిగినవాడికి ఆధారం చిక్కకూడదు, సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి, వ్యాకులితమైన తరంగాలతో ఒడ్డుని కొడుతూ ఉండాలి. ఇలా ఉండకపోతే దానిని సముద్రము అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపచెయ్యడం, సముద్రంలో నుంచి దారి ఇవ్వడం నాకు వీలుపడే విషయం కాదు. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకి వెయ్యకు. నీ దెగ్గర ఉన్న వానరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములను నిర్మిస్తూ ఉంటాడు, అటువంటివాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను. నాలొ ఉన్న ఏ క్రూర మృగము వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి. ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉంది. అక్కడుండే జలాలని ఆభీరులు, దాస్యులు అనే వారు తాగేస్తుంటారు. సముద్రాన్ని క్షోభింప చేస్తుంటారు. అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడి నుంచి అక్కడికి ప్రయోగించు " అన్నాడు.

అపడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా అది ఉత్తర దిక్కుకి వెళ్ళి ఆభీరులు, దాస్యులు మీద పడింది. ఆ దెబ్బకి అక్కడున్నవారందరూ మరణించారు. ఈ బాణం భూమిలోకి   వెళ్ళి భూమిని పెకలించగా అందులో నుంచి గంగ పుట్టింది. " అక్కడ మందాకినీ జలాలలాంటి తియ్యటి జలాలు ప్రవహిస్తాయి, అక్కడ గో సంపద పెరుగుతుంది, రోగాలు ఉండవు, మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు, అక్కడ విశేషంగా తేనె, చెట్లు, పళ్ళు, పెరుగు, నెయ్యి మొదలైనవి లభిస్తాయి. ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది " అని రాముడు బ్రహ్మాస్త్రం గుచ్చుకున్న ప్రాంతానికి వరం ఇచ్చాడు.

వెంటనే నలుడు పరిగెత్తుకొచ్చి సేతు నిర్మాణం ప్రరంభిస్తానన్నాడు. అప్పుడు అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు, కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. ఆ సమయంలో ఎవరినోట విన్నా ' సీతారామ ప్రభువుకి జై ' అంటూ, ఉత్సాహంగా రకరకాల చెట్లని తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. మొదటి రోజున 14 యోజనముల సేతువుని నిర్మించారు, రెండు మూడు నాలుగు అయిదు రోజులలో 20, 21, 22, 23 యోజనాల సేతువుని నిర్మించేసారు. మొత్తం అయిదు రోజులలో 100 యోజనముల సేతువు నిర్మాణం అయిపోయింది.

" మీరందరూ ఈ సేతువు మీద ప్రయాణం చేసి ఆవలికి చెరుకోండి " అని రాముడు అన్నాడు.

అప్పుడా వానరములలో కొంతమంది సేతువు మీద నడవకుండా సేతువు యొక్క అంచుల మీద నడిచేవారు. కొంతమంది సముద్రంలోకి దూకి మళ్ళి సేతువు ఎక్కి వెళ్ళేవారు. ఇంకొంతమంది సముద్రంలో ఈదుకుంటూ వచ్చారు. కొంతమంది ఒక పెద్ద చెట్టుని పెకలించి సముద్రంలో పడేసి, దాని మీద కూర్చుని తోసుకుంటూ వచ్చేవారు. ఆ రోజున సముద్ర ఘోష గొప్పదా వానర ఘోష గొప్పదా అంటె, ఎవరూ చెప్పలేకపోయారు, అంతగా అల్లరి చేసుకుంటూ వెళ్ళారు. ఎన్నిరోజులైనా ఆ సైన్యం లంకా పట్టణానికి వస్తూనే ఉంది. చివరికి అన్ని కోట్ల వానర సైన్యం లంకని చేరుకుంది.

అప్పుడు రాముడు సుగ్రీవుడిని, విభీషణుడిని పిలిచి " మనం అవతల ఒడ్డున ఉండగా సుకుడన్నవాడు రాయబారం చెయ్యడానికి వచ్చాడు కదా, వాడు ఎక్కడున్నాడు " అని అడిగాడు.

అప్పుడు ఆ సుకుడిని తీసుకొచ్చి రాముడి ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు రాముడు " నువ్వు ఎందుకొచ్చావు" అని అడిగాడు.

సుకుడన్నాడు " బుద్ధిహీనుడైన రావణుడు మీ బలాన్ని చూసి రాయబారం చెప్పమన్నాడు, ఇందులో నా తప్పు లేదు. నీ వంటి ప్రాజ్ఞుడు రాయబారిని చంపడు " అన్నాడు.

అప్పుడు రాముడు ఒక చిరునవ్వు నవ్వి " నువ్వు అన్నీ చూశావ? " అని అడిగాడు. అప్పుడా సుకుడు " ఇంకా చూడలేదు " అన్నాడు.

" విభీషణ! వీడిని తీసుకెళ్ళి దెగ్గరుండి మన సైన్యం అంతా ఒకసారి చూపించు. చూపించాక వీడిని వదిలెయ్యండి, వెళ్ళిపోతాడు " అన్నాడు.

ఆ సుకుడు వానర సైన్యం అంతా చూశాక రావణుడి దెగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు " రెక్కలు విరిగిపోయాయే " అని సుకుడిని చూసి ఎకిలించాడు.

సుకుడన్నాడు " నీలాంటి దుర్మార్గుడు కాదు రాముడు. ఆయన నన్ను ప్రాణాలతో విడిచిపెడితే వాళ్ళ సైన్యాన్ని చూసి వచ్చాను. ఆ సైన్యం సామాన్యమైన సైన్యం కాదు, అందులో అరవీర భయంకరులైన వానరులు ఉన్నారు. వాళ్ళు సముద్రాన్ని దాటి వచ్చేశారు. వాళ్ళందరూ నిన్ను మట్టుపెట్టకముందే నా మాట విని సీతమ్మని విడిచిపెట్టవయ్యా. వానరులందరినీ గరుడ వ్యూహంగా నిలుచోబెట్టారు. శిరస్థానం దెగ్గర రాముడు, లక్ష్మణుడు నిలబడ్డారు. హృదయ స్థానమునందు అంగదుడు నిలబడ్డాడు. కుడి వైపున ఋషభుడు, ఎడమ వైపున గంధమాదనుడు, వెనుక భాగమునందు సుగ్రీవుడు నిలబడ్డారు. అలా కొన్ని కోట్ల కోట్ల వానరాలని నిలబెట్టారు " అన్నాడు.

తరువాత రావణుడు సుక, సారణులు అనే మరో ఇద్దరు గూఢచారులని పిలిచి వానర సైన్యాన్ని చూసి, ఎంత సైన్యం ఉందో లెక్కపెట్టి రమ్మన్నాడు. ఆ ఇద్దరు గూఢచారులు ప్రచ్ఛన్న రూపాలలో ఆకాశంలో ఉండి వానర సైన్యం ఎంత ఉందో అని చూస్తుండగా విభీషణుడు వాళ్ళని పసిగట్టి రాముడి దెగ్గరికి తీసుకెళ్ళి " వీళ్ళు దుర్మార్గులు, అందుకని వీళ్ళని బంధించి తీసుకొచ్చాను " అన్నాడు. ఇంతకముందు సుకుడితో ఎలా మాట్లాడాడో అలానే ఈ ఇద్దరు గూఢచారులతో రాముడు మాట్లాడి, విభీషణుడితో వాళ్ళని పంపించి సైన్యాన్ని చూడమన్నాడు.

ఆ సుక సారణులు వానర సైన్యాన్ని చూసి, రావణుడికి ఆ సైన్యం గురించి వివరించారు. అప్పుడు రావణుడు " వాళ్ళందరూ 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చేశారు అంటున్నారు కదా, వాళ్ళని ఒకసారి నాకు చూపించండి " అన్నాడు.

అప్పుడు రావణుడు సుక సారణులతో కలిసి ఒక ప్రాసాదం ఎక్కి " వాళ్ళలో ఎవరు ఎవరో నాకు చెప్పు " అన్నాడు.

అప్పుడు సారణుడు అన్నాడు " రావణ! అక్కడ చూడు, అక్కడున్నాడే ఆయన ధూమ్రుడు. ఆ ధూమ్రుడి తమ్ముడే జాంబవంతుడు. ఆయన అపారమైన పరాక్రమము ఉన్నవాడు, కొన్ని కోట్ల వానరములతో యుద్ధానికి వచ్చాడు. వాడు గట్టిగా పెద్ద పెద్ద కేకలు వేస్తే వాడి నోట్లోనుంచి వచ్చే నాదానికి శత్రువుల గుండెలు బద్దలయిపోతాయి. వాళ్ళకి వేరె ఆయుధములు అక్కరలేదు, వాళ్ళకి గోళ్ళు, కోరలు ఆయుధములు. పళ్ళతో కొరుకుతారు, మోచేతులతో పొడుస్తారు, చెట్లు పెకలిస్తారు, పర్వత శిఖరాలని ఊపుతారు, పెద్ద పెద్ద శిలలని విసురుతారు. ఒక్కొక్కడిది 10 ఏనుగుల బలం, కొంతమందిది 100 ఏనుగుల బలం, 1000 ఏనుగుల బలం, లక్ష ఏనుగుల బలం, కొంతమందిది ఎంత బలమో చెప్పడం కుదరదు. ఇందులో ఇంకా ఆశ్చర్యమైనవాడు ఇంకోడు ఉన్నాడు, ఆయన అడుగు తీసి అడుగు వేస్తే యోజనం దూరం పడుతుంది అడుగు. ఆయనంత విశాలమైన శరీరం ఉన్నవాడు ఈ భూమిలో లేడు. అదిగో ఎదురుగా కనపడుతున్నది ఆయనే. ఆయన పేరు పనసుడు, 4 యోజనముల విశాలమైన శరీరాన్ని పొంది ఉంటాడు. అదిగో ఆయన పక్కన కనపడుతున్నవాడు సుగ్రీవుడు. 36 కోట్ల వానరములు సర్వకాలములయందు ఆయన చుట్టూ ఉంటాయి. గద ఎత్తి ' రారా రావణ ' అని ఆయన అక్కడ అరుస్తుంటే ఇక్కడ లంకలో ప్రాసాదములు కదులుతున్నాయి. ఇన్ని కోట్ల వానరాలకు ఆయన అధినాదుడు, ఆయన ఆజ్ఞకి తిరుగులేదు. ఆయన కిష్కిందని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. ఈయన కన్నా బలవంతుడైన ఈయన అన్న వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టి చంపేశాడు. వాలి మెడలో ఉండే మహేంద్ర మాల ఇప్పుడు సుగ్రీవుడి మెడలో ఉంది.

అదిగో అటు చూడు, ఆయన కేసరి, హనుమ యొక్క తండ్రి. ఆయన మేరు పర్వత శిఖరాల మీద తిరుగుతుంటాడు, కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. ఆయనది సామాన్యమైన శక్తి కాదు. ఆ పక్కన ఉన్న గంధమాధనుడి శక్తి అంత ఇంత అని చెప్పడానికి కుదరదు. అక్కడున్న వానరములలో కొంతమంది బంగారు రంగులో మెరుస్తూ ఉంటారు, కొంతమంది కాటుక కొండల్లా ఉంటారు, కొంతమంది భయంకరమైన దంతాలతో ఉంటారు, కొంతమంది తోకలు పొడుగ్గా ఉంటాయి, కొంతమంది ఎర్రగా, కొంతమంది పచ్చగా ఉంటారు. అక్కడున్న గుహల నిండా, పర్వతాల నిండా వాళ్ళే, సముద్రం మీద వాళ్ళే, ఆ వారధి మీద వాళ్ళే, లంకా పట్టణం చుట్టూ వానరాలే. ఈ వానరాలే కాకుండా ఇంకా వానరాలు వస్తూనే ఉన్నాయి వారధి దాటుతూ. లంకా పట్టణం చుట్టూ ఉన్న వనాలలొ ఉన్న ప్రతి చెట్టు మీద భల్లూకాలు ఉన్నాయి, ఈ భల్లూకాలన్నిటికి జాంబవంతుడు నాయకుడు. ఇంకా గవయుడు, గయుడు, గవాక్షుడు కోటి ఏనుగుల బలం ఉన్నవారు. నీ మీదకి ఇవ్వాళ ఎంత సైన్యం యుద్ధానికి వచ్చిందో చెబుతాను విను, పది పదివేలయితే ఒక లక్ష, పది లక్షలయితే పదిలక్షలు, పది పదిలక్షలు అయితే ఒక కోటి, లక్ష కోట్లయితే ఒక సంకువు, వెయ్యి సంకువులు ఒక మహా సంకువు, వెయ్యి మహా సంకువులు ఒక వృందము, వెయ్యి వృందములు ఒక మహా వృందము, వెయ్యి మహా వృందములు ఒక పద్మము, వెయ్యి పద్మములు ఒక మహా పద్మము, వెయ్యి మహా పద్మములు ఒక ఖర్వము, వెయ్యి ఖర్వములు ఒక మహా ఖర్వము, వెయ్యి మహా ఖర్వములు ఒక సముద్రము, వెయ్యి సముద్రములు ఒక ఓధము, వెయ్యి ఓధములు ఒక మహా ఓధము. ఇటువంటి మహా ఓధములు ఎన్నున్నాయో చెప్పడం కుదరదు.

అదుగో అక్కడ మధ్యలో నిలబడినవాడు హనుమ, ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకి బ్రహ్మగారి వరం ఉంది, ఏ అస్త్ర-శస్త్రములకి ఆయన కట్టుబడదు. ఆయన పక్కన నీలమైన శరీరంతో, పద్మాలవంటి కన్నులతో, ఎడమ చేతితో కోదండం పట్టుకుని, సాముద్రిక శాస్త్రంలో ఎలా ఉండాలని చెప్పబడిందో అలా పోతపోసిన సౌందర్యంతో ఉన్నాడే, ఆయనే రాముడు. ఆయన పరమ ధర్మాత్ముడు, పితృవాక్య పరిపాలకుడు. ఆ రాముడి బహి ప్రాణం లక్ష్మణుడు, కంటిని కనురెప్ప కాపాడినట్టు ఆయన నిరంతరం అన్నని కాపాడుతూ ఉంటాడు. రామతుల్యమైన పరాక్రమము ఉన్నవాడు. రాముడికి ఎన్ని అస్త్ర-శస్త్రములు తెలుసో లక్ష్మణుడికి కూడా అన్ని అస్త్ర-శస్త్రములు తెలుసు " అని పొంగిపోతూ ఆ రామ సైన్యం గురించి రావణుడికి చెబుతున్నాడు.

అప్పుడు రావణుడు ఆ సారణుడిని ఆపి " నీకు ఎంత సంతోషంగా ఉందిరా వాళ్ళ గురించి చెప్పడం అంటె. నా అన్నం తిని వాళ్ళని పొగుడుతావ. ఇంకొకళ్ళు అయితే ఇప్పుడే పీకలు తీయించేవాడిని, కాని మీరు నాకు గతంలో చాలా ఉపకారాలు చేశారు కనుక వదిలేస్తున్నాను. ఇంకెప్పుడన్నా మీ ముఖాలు నాకు కనపడితే మీ పీకలు ఎగిరిపోతాయి, పోండి ఇక్కడినుంచి " అని, మళ్ళి శార్దూలుడిని పిలిచి " ఈ సారి నువ్వు వెళ్ళి గూఢచర్యం చేసి, ఎవడు ఏ వంశానికి చెందినవాడు, ఎవడు ఎవడి పుత్రుడు, రాముడు ఆహారం ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, పక్కన ఎవరుంటారు, ఎవరు రక్షిస్తూ ఉంటారు మొదలైన ఈ విషయాలని కనిపెట్టి రా " అన్నాడు.

తరువాత రావణుడు విద్యుజిహ్వుడిని పిలిచి " నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. నువ్వు గొప్ప మాయాజాలం ఉన్నవాడివి. రాముడి శరీరం నుండి శిరస్సు విడిపోతే ఆ శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అటువంటి శిరస్సు తయారుచెయ్యాలి. రాముడి చేతిలో ఎటువంటి కోదండం ఉంటుందో అటువంటి కోదండాన్ని సృష్టించాలి. అలాగే రాముడి బాణాలు, అక్షయతుణీరాలు ఎలా ఉంటాయో అటువంటివి సృష్టించాలి " అన్నాడు.

కొంతసేపటికి ఆయన అశోక వనానికి వెళ్ళి " సీత! నా భర్త అంత గొప్పవాడు అని గొప్పగా చెప్పావు కదా, ఆ రాముడు వానరములతో కలిసి సముద్రానికి సేతువు కట్టి దాటాడు. రాముడు దక్షిణ తీరంలో లంకకి సమీపంగా పడుకొని ఉండగా, ప్రహస్తుడి నాయకత్వంలో సైన్యం వెళ్ళి ఆదమరచి నిద్రిస్తున్న రాముడి శిరస్సుని శరీరం నుండి వేరు చేశారు. నిద్రపోతున్న వానరముల మీద మా సైన్యం దాడి చేసి అందరినీ సంహరించారు. హనుమంతుడు దవడల నుండి రక్తం కక్కుతూ చనిపోయాడు. రాముడి శిరస్సు వేరవడం చూసి లక్ష్మణుడు దిక్కులుపట్టి పారిపోయాడు. జాంబవంతుడు, సుషేణుడు, గంధమాదనుడు, శతబలి, అంగదుడు మొదలైన వీరులందరూ మరణించారు. మిగిలిన వానరాలని సముద్రంలోకి తోసేసారు. లక్ష్మణుడు మాత్రం కొంతమంది వానరములతో కలిసి పారిపోయాడు. ఇదుగో నీ భర్త శిరస్సు చూసుకుని సంతోషించు " అని చెప్పాక, అక్కడున్న ఒక రాక్షస స్త్రీని పిలిచి " రాత్రి ప్రహస్తుడు రాముడి శిరస్సుని వేరు చేసి తీసుకొచ్చాడు. విద్యుజిహ్వుడిని ఆ శిరస్సు తీసుకురమ్మన్నానని చెప్పండి " అన్నాడు.

అప్పుడు విద్యుజిహ్వుడు తీసుకొచ్చిన రామ శిరస్సుని, బాణాలని, కోదండాన్ని అక్కడ పెట్టారు. వాటిని చూడగానే సీతమ్మ నేల మీద పది మూర్చపోయింది. అప్పుడు రావణుడు ఆ కోదండాన్ని, బాణాలని సీతమ్మ దెగ్గరికి విసిరేసి " సీత! ఇప్పటికైనా నువ్వు నా పాన్పు చేరుతావ " అన్నాడు.

అప్పుడు సీతమ్మ ఆ శిరస్సుని పట్టుకొని రాముడిదో కాదో అని అవలోకనం చేసి చూసింది. అది యధాతధంగా రాముడి శిరస్సులా ఉంది. అప్పుడు సీతమ్మ అనింది " రామ! నాకు చాలా సౌభాగ్యము ఉందని, నువ్వు దీర్ఘాయిష్మంతుడవని పెద్దలు, జ్యోతిష్కులు చెప్పారు. ఇవ్వాళ ఆ జ్యోతిష్కులు చెప్పిన మాట అబద్ధమయ్యింది. నువ్వు గొప్ప యజ్ఞాగ్నితొ అంతిమ సంస్కారం జెరుపుకోవలసినవాడివి, కాని ఇవ్వాళ దిక్కులేకుండా యుద్ధ భూమిలో పడిపోయి ఉంటె క్రూరమృగాలు నీ శరీరాన్ని తినేస్తు ఉంటుంటాయి. భార్యయందు దోషం ఉంటె, భార్య ప్రవర్తనయందు విశేషమైన వైక్లవ్యం ఉంటె భర్త వెళ్ళిపోతాడని శాస్త్రం చెబుతుంది. నాయందు ఏ దోషముందని నాకన్నా ముందు వెళ్ళిపోయావు రామ " అని సీతమ్మ ఏడ్చింది.

సీతమ్మ అలా ఏడుస్తుంటే చిరునవ్వులు చిందిస్తున్న రావణుడిని చూసి ఆమె అనింది " ఇప్పటికైనా నా శిరస్సుని రాముడి శిరస్సుతోటి, నా కాయాన్ని రాముడి కాయంతోటి కలిపి అంచేస్టి సంస్కారం పూర్తిచెయ్యి. ఈ ఒక్క కోరిక తీర్చు " అని సీతమ్మ అనింది.

అదృష్టవశాత్తు అదే సమయంలో అక్కడికి ఒక భటుడు వచ్చి " మహారాజ! మీకోసం ప్రహస్తుడు ఎంతో ఆదుర్తాతో ఎదురుచూస్తున్నాడు. మీరు వెంటనే సభకి రావలసింది " అన్నాడు.

వెంటనే రావణుడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళగానే ఆ శిరస్సు, ధనుర్-బాణములు అదృశ్యమయ్యాయి. ఏడుస్తున్న సీతమ్మ దెగ్గరికి విభీషణుడి భార్య అయిన సరమ వచ్చి " నువ్వు శోకించకమ్మా, నాకు అపారమైన శక్తి ఉంది. నేను ఆకాశంలో నిలబడినప్పుడు ఎవ్వరికీ కనపడను. నేను రాముడిని చూశాను, ఆయన గుండ్రమైన బాహువులతో ఆ వానర సైన్యాన్ని కాపాడుతూ ఆవలి ఒడ్డున ఉన్నాడు. అంత అప్రమత్తంగా రాముడు నిద్రపోతాడ?, రాక్షసులు రాముడిని సంహరించగలరా? ఇంద్రుడు దేవతలని రక్షిస్తున్నట్టు, రాముడు వానరములని రక్షిస్తుంటాడు. నేను ఇప్పుడే చూసి వచ్చాను ఇది విద్యుజిహ్వుడి మాయ. అందుకనే రావణుడు వెళ్ళగానే ఇక్కడున్న శిరస్సు అంతర్దానమయ్యిపోయింది. రావణుడి మాయలు నమ్మకు, ఉపశాంతిని పొందు " అనింది.

" నువ్వు చెప్పినది నిజమైతే రావణుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో చూసి, నాకు చెప్పు " అని సీతమ్మ సరమతో అనింది.

అప్పుడు సరమ రావణుడి అంతఃపురానికి వెళ్ళి, కొంతసేపటికి తిరిగొచ్చి " ఇప్పుడే నేను విని వచ్చాను, రావణుడి తల్లి కైకసి, ఒక వృద్ధుడైన మంత్రి రావణుడికి నచ్చచెప్పారు. ' ఏది ఏమైనా సీతని విడిచిపెట్టడం జెరగదు ' అని రావణుడు అన్నాడు. రాముడితో యుద్ధం చెయ్యడానికి కారణం చెప్పకుండా సైన్యాన్ని పిలవమన్నాడు. రాక్షసుల కోలాహలం గట్టిగా వినపడుతోంది. మేరు పర్వత శిఖరాల చుట్టూ తన గుర్రముల మీద ఎక్కి తిరిగే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి, నీకు సమస్త శుభములు కలుగుతాయి " అని చెప్పింది.

సరమ మాటలకి సీతమ్మ ఉపశాంతిని పొందింది.

ఈలోగా మాల్యవంతుడు(తాత వరస) రావణుడి దెగ్గరికి వచ్చి " సృష్టిలో ధర్మం ఎప్పుడూ కూడా దేవతల వైపు ఉంటుంది, అధర్మం అసురుల వైపు ఉంటుంది. అధర్మపక్షం ధర్మపక్షం చేత ఓడింపబడుతుంది. నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చినప్పటినుంచి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, అందుకని మనం ఓడిపోక తప్పదు. నువ్వు సీతమ్మని తెచ్చినప్పటినుంచి, తెల్లటి రెక్కలు ఉండి ఎర్రటి పాదాలతో ఉండే పావురాలు అరుస్తూ గోల చేస్తున్నాయి, ఇంట్లో పెంచుకునే చిలకలు, గోరింకలు మంచి మాటలు చెప్పడం మానేసి వీచి-కూచి మాటలు చెబుతున్నాయి, ఎక్కడినుంచో క్రూరమైన పక్షులు వచ్చి వీటితో యుద్ధం చేస్తున్నాయి, ఏ ఇంటిముందు చూసినా నల్లనివాడు, బోడిగుండువాడు, ఎర్రటి వస్త్రములు కట్టుకున్నవాడు ఉదయము సాయంకాలము ఇళ్ళల్లోకి తొంగిచూస్తున్నట్టు కనపడుతోంది. వచ్చినవాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు వచ్చాడు, సీతమ్మని రాముడికి అప్పగించి సంధి చేసుకుని బతికిపో, నా మాట విని యుద్ధం చెయ్యకు " అన్నాడు.

అప్పుడు రావణుడు " చేతిలో పద్మములేని లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న సీతని నేను వదులుతాన, రాముడు గొప్పవాడే కావచ్చు కాని నేను కూడా సురాసురులని ఓడించాను. అందరూ నాకు నీతులు చెబుతున్నారు కాని నన్ను ప్రోత్సహించే వాడు కనపడడం లేదు. మీరందరూ బుద్ధిహీనులు. తాత! నువ్వే కాదు, ఒకవేళ బాణం పెట్టి నా శరీరాన్ని రెండుగా చీల్చినా, కత్తి పెట్టి నా శరీరాన్ని రెండుగా నరికేసినా ఆ రెండు ముక్కలు మాత్రం ముందుకి వంగవు, వెనక్కే పడిపోతాయి. ఒకరిమాట వినడం నాకు చేతకాదు, ఇది నా స్వభావం " అని చెప్పాడు.

అటుపక్క రాముడు లంకా పట్టణాన్ని చూద్దామని సువేల పర్వత ఎక్కాడు. అప్పుడే ఎదురుగా ఉన్న అంతఃపురంలోకి రావణుడు విశేషమైన మాలలు, వస్త్రాలు వేసుకుని బయటకి వచ్చాడు. అలా వస్తున్న రావణుడిని చూసిన సుగ్రీవుడు ఆగ్రహించి ఒక్క దూకు దూకి రావణుడి మీద పడ్డాడు. ఇద్దరూ పోడుచుకున్నారు, కొట్టుకున్నారు, రక్తాలు కారేటట్టు గుద్దుకున్నారు. ఇంతలో రావణుడు మాయలు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వీడు మాయా యుద్ధం చేస్తున్నాడని సుగ్రీవుడు ఎగిరి మళ్ళి రాముడి పక్కకి వచ్చేశాడు. అప్పుడు రాముడన్నాడు " సుగ్రీవ! ఇలా నువ్వు వెళ్ళిపోయావె, నీకు ఏదన్నా అయితే నాకు సీత ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు, భరతుడు ఎందుకు, శత్రుఘ్నుడు ఎందుకు. నేను మనస్సులో ఎమనుకున్నానో తెలుసా, ఒకవేళ రావణుడి చేతిలో నీకు జెరగరానిది జెరిగితే, ఈ రావణుడిని ఇక్కడే చంపేసి, విభీషణుడికి పట్టాభిషేకం చేసేసి, లక్ష్మణుడిని వెనక్కి పంపి భరతుడిని రాజ్యం ఏలుకోమని చెప్పి, నేను కూడా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకున్నాను. నువ్వు లేకుండా నేను ఒక్కడినీ మాత్రం వెనెక్కి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చెయ్యకు " అన్నాడు.

తరువాత అంగదుడిని పిలిచి రావణుడి దెగ్గరికి రాయబారానికి పంపారు. రాముడు అంగదుడితో  " నువ్వు ఎందరో మహర్షులని బాధలు పెట్టావు, ఎందరో స్త్రీలని అపహరించావు. నువ్వు చేసిన పాపాలకి దండన విధించడానికి, నా భార్యని కూడా అపహరించావు కనుక నీయందు దోషమున్నది కనుక, నిన్ను నేను సంహరించవచ్చు కనుక, ఇవ్వాళ లంకా పట్టణానికి వచ్చాను. ఏ దేవర్షులని, రాజులని నిష్కారణంగా వధించి పంపించావో ఆ మార్గంలోనే నిన్ను పంపిస్తాను. అంతఃపురం విడిచి బయటకి రా " అని రాముడు అంగదుడితొ చెప్పాడు.

అంగదుడు వెంటనే వెళ్ళి రావణుడితొ ఈ మాటలు చెప్పాడు. ఆ మాటలు విన్న రావణుడు ఆగ్రహించి తన సైనికులతో అంగదుడిని పట్టుకోమని చెప్పాడు. ఆ సైనికులు అంగదుడిని పట్టుకోగా, అంగదుడు ఆ సైనికులతో సహా పైకి ఎగిరి ఒళ్ళు దులుపుకున్నాడు, అప్పుడా సైనికులందరూ కింద పడిపోయారు. అంగదుడు వెళ్ళిపోతూ రావణుడి అంతఃపుర ప్రాసాదాన్ని ఒక్క తన్ను తన్నాడు, ఆ దెబ్బకి ఆ ప్రాసాదం ఊడి కదిలిపోయింది.

రావణుడు వెంటనే ద్వారాలన్నీ మూయించేసాడు. యుద్ధం ప్రారంభం అవుతుంది అందరూ సిద్ధంకండి అన్నాడు. తూర్పు దిక్కుకి సర్వసైన్యదికారి అయిన ప్రహస్తుడిని మోహరించాడు, దక్షిణ దిక్కుకి మహోదర, మహోపార్షులని నియమించాడు, పశ్చిన దిక్కుకి ఇంద్రజిత్ ని పెట్టాడు, ఉత్తర దిక్కుకి సుక సారణులని పెట్టి, నేను మీతో యుద్ధానికి వస్తాను అన్నాడు. ఇదంతా చూసిన విభీషణుడి గూఢచారులు విషయాన్ని వెనక్కి వెళ్ళి చెప్పారు.

అప్పుడు రాముడు " తూర్పు దిక్కున ఉన్న ప్రహస్తుడిని మన సర్వసైన్యాధికారి అయిన నీలుడు ఎదుర్కొంటాడు. దక్షిణ దిక్కున ఉన్న మహోదర, మహోపార్షులని యువరాజైన అంగదుడు ఎదుర్కొంటాడు. పశ్చిమ దిక్కున ఉన్న ఇంద్రజిత్ ని హనుమంతుడు ఎదుర్కొంటాడు. ఉత్తర దిక్కున ఉన్న సుక సారణులకి నాయకత్వం వహించి రావణుడు ఉన్నాడు కనుక లక్ష్మణుడితో కలిసి నేనే వెళ్ళి ఎదుర్కొంటాను. నాలుగు దిక్కులా యుద్ధం ప్రారంభం అవుతోంది, బయలుదేరండి " అన్నాడు.

                యుద్ధం ప్రారంభమయ్యింది

వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలని తిరగ తోసేసారు, పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు, చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. నాలుగు ద్వారాలనీ మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్లు బయట ఉన్నవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు.

అలా ఆ వానరములకు రాక్షసులకు యుద్ధం జెరగబోయేముందు రాముడు అన్నాడు " యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరుపాన్ని పొందగలరు, అలాగే వానరములలో కూడా కొంతమంది కామరుపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితులలోను మీరు మాత్రం కామ రూపాన్ని తీసుకోకండి. ఏడుగురము మాత్రమే నర రూపంలో ఉండి యుద్ధం చేస్తాము. విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు నర రూపంలో ఉంటారు, నేను, లక్ష్మణుడు ఉంటాము. మిగిలినవారందరూ వానర రూపంలోనే ఉండండి " అని చెప్పాడు.

ఆరోజున జెరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బలాధిక్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో రాక్షసులు ముసలాలు, ముద్గరాలు, శూలాలు, త్రిశూలాలు, కత్తులు, బరిసెలు వంటి ఆయుధములను పట్టుకొచ్చి కనపడ్డ వానరాన్ని కొట్టి చంపి తినేస్తున్నారు. ఆ వానరములలో ఉన్న భల్లూకములు కనపడ్డ రాక్షసుడిని గట్టిగా కౌగలించుకుని మరీ తింటున్నాయి. ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు, నరుకు అనే కేకలే వినపడుతున్నాయి. ఆ రాత్రంతా మహా భయంకరమైన యుద్ధం జెరిగింది. శిరస్సులు బంతులు ఎగిరినట్టు ఆకాశంలోకి ఎగిరాయి. ఎక్కడ చూసినా చీలిపోయిన వక్షస్థలాలు, తెగిపోయిన కాళ్ళు, చేతులు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా నెత్తుటితొ బురదయ్యి యుద్ధం చేస్తుంటే కాళ్ళు జారిపోతున్నాయి. ఏనుగుల తొండాలు, కాళ్ళు, గుర్రాల కాళ్ళు మొదలైన శరీర భాగాలు ఆ యుద్ధ భూమిలో పడి ఉన్నాయి.

అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్ ని చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది. అప్పుడాయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పారేశాడు. ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం మడిసిపోయింది. ఎప్పుడైతే ఎవ్వరూ ఊహించని విధంగా అంగదుడు ఆ ఇంద్రజిత్ యొక్క రథాన్ని, గుర్రాలని, ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడో, ఆ సంఘటనని చూసి దేవతలు, రామ లక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ జీవితంలో ఇప్పటిదాకా ఆయన రథాన్ని కొట్టినవాడు లేడు.

తన రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్ కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడాయన మాయ చేత మంత్రములను అభిమంత్రించగానే చీకటి అలుముకుంది. తరువాత మాయ చేత సృష్టింపబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి, ఆకాశంలో ఎవరికీ కనపడకుండా ఉండి, రామలక్ష్మణుల మీద బాణ పరంపర కురిపించాడు. కద్రువ యొక్క కుమారులైన సర్పాలని ఇంద్రజిత్ బాణములుగా వేశాడు. అవి బాణములుగా వచ్చి కొడతాయి, సర్పాలుగా చుట్టుకుని మర్మ స్థానములయందు కరుస్తుంటాయి. ఇంద్రజిత్ విడిచిపెట్టిన ఆ బాణములు రామలక్ష్మణులని నాగాస్త్ర బంధనంగా చుట్టేసింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్ ని ఏమి చెయ్యలేము. ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా మనం కూడా ఈ బాణాలని వహించడమే కొంతసేపు " అన్నాడు. తరువాత రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు. ఓర్చుకుని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి ఏడుస్తూ ' ఏ మహానుభావుడిని ఎవ్వరూ యుద్ధ భూమిలో నిగ్రహించలేరో, ఎవరు విశ్వామిత్రుడి దెగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశం పొందాడో, ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోడానికి ఈ లంకా పట్టణానికి వచ్చాడో అటువంటి రాముడు ఇవ్వాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి, ఉత్సాహము ఉపసమించి, భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు ' అని అనుకున్నాడు. తరువాత లక్ష్మణుడు కూడా కిందపడిపోయాడు. రాముడు పట్టుకున్న కోదండం చేతిలోనుంచి వదులయిపోయి దూరంగా పడిపోయింది. రామలక్ష్మణుల వేళ్ళ యొక్క చివరి భాగాల నుండి శరీరం అంతా అంగుళం చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి " మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటూ దొర్లాడు. ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకా పట్టణం పీడింపబడిందో, ఏ రామలక్ష్మణుల వల్ల మా తండ్రి నిద్రపోలేదో, అటువంటి తండ్రి ఋణం తీర్చుకోడానికి ఈ రామలక్ష్మణుల ప్రాణములు పోయే వరకూ కొడతాను " అని, వారి యొక్క మర్మస్థానములలో గురి చూసి వజ్రములవంటి బాణములతో కొట్టాడు.

అప్పుడు రాముడు మెల్లగా బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు, లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు. అలా రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు. అప్పుడు ఇంద్రజిత్ హనుమని, ఋషభుడిని, వేగదర్సిని, విభీషణుడిని, సుషేనుడిని, గంధమాధనుడిని బాణాలతో కొట్టి, వానర సైన్యం అంతటినీ కలచి వేశాడు. ఆ సమయంలో వానరాలు ఎటు వెళుతున్నారో, ఎవరి మీద నుంచి దాటుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు.

రామలక్ష్మణులు ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి " నాయనా సుగ్రీవ! అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుతుందని అనుకోడానికి వీలులేదు, ఎంతటివారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితులలో మొహాన్ని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చెయ్యవలసిన పని స్ఫురణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కాని తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే, వాళ్ళిద్దరికీ కాని తెలివి రాకపోతే మనిద్దరమూ నాశనం అయినట్టే. రామలక్ష్మణుల శరీరాలలో కాంతి తగ్గలేదు, అంగుళం మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసినా తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి " అని చెప్పి, పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు.

కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. అప్పటికీ రామలక్ష్మణులు కిందపడిపోయే ఉన్నారు. పర్వతాల నుంచి సెలయేళ్ళు ప్రవహించినట్టు ఇంద్రజిత్ యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. అలా రక్తం వెళ్ళిపోతుండడం వలన వాళ్ళ శరీరాలు నీరసపడిపోతున్నాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి " నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణులని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను. కాని ఈ రామలక్ష్మణులే యుద్ధంలో నిహతులయిపోయారు. ఇంక నాకు ఎవరు దిక్కు. మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు, నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడిని " అని బాధపడ్డాడు.

విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటివరకూ అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి " ఇంత అసహ్యంగా, ఇంత సిగ్గులేకుండ వానర సైన్యం ఎందుకు పారిపోతుంది " అని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు " మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము " అన్నారు. ఇలా పారిపోవడమనేది చాలా భయంకరమైన విషయం, దయచేసి మీరందరూ వెనక్కి రండని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు.

ఆ సమయంలోనే ఇంద్రజిత్ లంకా నగరానికి చేరుకొని రావణుడితో " తండ్రి గారు మీరింక బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణులని నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరూ యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో నుంచి నెత్తురు ఏరులై పారుతోంది. వాళ్ళిద్దరూ మరణించారు, ఇక మీరు ప్రశాంతంగా ఉండండి " అన్నాడు.

ఈ మాట వినగానే రావణుడు అపారమైన సంతోషాన్ని పొంది అక్కడున్న భటులని పిలిచి " యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణులు ఇద్దరూ నా కుమారుడైన ఇంద్రజిత్ చేత సంహరింపబడ్డారు, అని లంకలో చాటింపు వేయించండి. లంకంతా తోరణాలు కట్టండి, భేరీలు మ్రోగించండి. అందరూ సంతోషించేటట్టుగా పెద్ద ఉత్సవం చెయ్యండి  " అని ఆజ్ఞాపించాడు.

తరువాత అక్కడ ఉన్న రాక్షస స్త్రీలని పిలిచి " మీరు ఒకసారి అశోకవనంలో ఉన్న సీత దెగ్గరికి వెళ్ళండి. సీతని పుష్పక విమానం ఎక్కించి యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి. ఆ యుద్ధ భూమిలో మరణించిన రామలక్ష్మణులని సీత చూస్తుంది. ' ఇంక ఎలాగూ నా భర్త మరణించాడు కదా, ఇంక రాముడి మీద ఎందుకు ఆశ ' అని లంకకి వచ్చి అలంకారం చేసుకుంటుంది, మంచి చీర కట్టుకుని సర్వాలంకారభూషితై నా పాన్పు చేరుతుంది. తొందరగా వెళ్ళి చూపించండి " అన్నాడు.

యుద్ధ భూమిలో రాక్షసులు ఉత్సాహంతో గెంతులు వేస్తూ, కేకలు వేస్తూ ఆనందంగా ఉన్నారు. వానరులందరూ చాలా నిరుత్సాహంతో, దీనంగా నిలుచుని ఉన్నారు. అప్పుడు ఆ రాక్షసులు సీతమ్మని పుష్పక విమానంలో తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పడిపోయున్న రామలక్ష్మణులని చూపించారు. సీతమ్మ కిందకి చూడగా, ముళ్ళు విప్పిన ముళ్ళ పంది ఎలా ఉంటుందో, అలా బాణములు చేత కొట్టబడిన రామలక్ష్మణులు ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ మరణించారు అనుకొని గుండెలు బాదుకొని ఏడ్చింది. అప్పుడు సీతమ్మ " నేను పుట్టింట్లో ఉన్నప్పుడు మహా జ్ఞానులైన జోతిష్యులు నా పాదాలు చూసి ' అమ్మ! నీ పాదాలలో పద్మాలు ఉన్నాయి. ఏ స్త్రీ అరికాళ్ళలో పద్మాలు ఉంటాయో, ఆ పద్మములు కలిగిన స్త్రీ తన భర్తతో పాటు సింహాసనం మీద కూర్చుని మహారాణిగా పట్టాభిషేకం చేసుకుంటుంది ' అన్నారు. కాని వారు చెప్పిన మాటలన్నీ అసత్యాలు అయ్యాయి. చిన్నతనంలో మా తండ్రిగారి పక్కన నేను కూర్చుని ఉంటె దైవజ్ఞులైన వారు మా ఇంటికి ఎక్కువగా వస్తుండేవారు, అప్పుడు వాళ్ళు నా సాముద్రిక లక్షణాలు చూసి ' తల మీద వెంట్రుకలు చాలా మెత్తగా, ఒత్తుగా, నల్లగా ఉన్నటువంటి స్త్రీ ఈమె, కనుబొమ్మలు కలవని స్త్రీ ఈమె, పిక్కలు గుండ్రంగా ఉండి వాటి మీద వెంట్రుకలు లేని స్త్రీ ఈమె, దంతముల మధ్యలో ఖాళీలు లేని స్త్రీ ఈమె కనుక ఈమె అయిదోతనాన్ని పూర్ణంగా పొందుతుంది, మహానుభావుడైన వాడిని భర్తగా పొందుతుంది ' అని చెప్పారు. కాని అవన్నీ అబద్ధాలు అయిపోయాయి. నా వేళ్ళ మీద ఉండే గుర్తులు, నేత్రములు, చేతులు, పాదములు, తొడలు గుండ్రంగా, సమంగా ఉండేవి, నా గోళ్ళు ఎర్రటి కాంతితో ఉండేవి, అలా ఉండడం వలన నేను పూర్ణమైన అయిదోతనాన్ని పొందుతానని మా ఇంటికొచ్చిన జ్యోతిష్యులు చెప్పేవారు.

రామ! రావణుడు నన్ను అపహరించాక దండకారణ్యం అంతా వెతికావు, హనుమని పంపించావు, నాకోసం సముద్రానికి సేతువుని కట్టి, దాటి వచ్చావు, చివరికి యుద్ధంలో ఇంద్రజిత్ మాయ వల్ల మరణించావు, ఎంత ఆశ్చర్యం రామ, నీకు బ్రహ్మాస్త్రం తెలుసు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసు, వారుణాస్త్రం తెలుసు, ఆగ్నేయాస్త్రం తెలుసు, ఇన్ని అస్త్రములు తెలిసిన నిన్ను ఒకడు కేవలం మాయతో కనపడకుండా కొట్టిన బాణములకు శరీరం వదిలేశావు. నువ్వు మరణించావన్న వార్త విని కౌసల్యాదులు బతుకుతార, అయోధ్య అయోధ్యలా ఉంటుందా. నువ్వు ఇన్ని కష్టాలు పడడానికి, అర్ధాంతరంగా శరీరం విడిచెయ్యడానికి నన్ను పెళ్ళి చేసుకున్నావ. నువ్వు నన్ను చేసుకోకపోతేనె బాగుండేదేమో " అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పకంలో ఉన్న త్రిజట చూడలేకపోయింది. అప్పుడు త్రిజట " ఏడవకు సీతమ్మ. రామలక్ష్మణులు మరణించలేదు, వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నారు. నేను నిన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెబుతున్నానని అనుకుంటున్నావ, కాని నేను నీకు రామలక్ష్మణులు బతికున్నారని చెప్పడానికి ఒక బలవత్తరమైన కారణాన్ని చెబుతాను. భర్త మరణించిన స్త్రీ కాని ఈ పుష్పక విమానం ఎక్కితే ఇది పైకి ఎగరదు, నువ్వు పుష్పకంలోకి ఎక్కగా ఇది ఆకాశంలో నిలబడిందంటే, నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావు అని అర్ధం. యోధుడైనవాడు నిజంగా శరీరాన్ని విడిచిపెడితే సైన్యాలు ఇలా నిలబడవు, ఎవరి మానాన వాళ్ళు పారిపోతుంటారు. రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏ మాత్రం తగ్గలేదు. కొద్దిసేపు మూర్చపోయారు అంతే. కొద్దికాలంలో రావణుడి పది తలలు పడిపోయి ఇదే పుష్పకంలో రాముడితో కలిసి నువ్వు అయోధ్యకి వెళ్ళిపోతావు. ఏ రాక్షస స్త్రీకి నామీద లేని ప్రేమ నీ ఒక్కదానికే నా మీద ఎందుకు అంటావేమో, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటినుంచి నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీకు భర్త అంటె ఉన్న ప్రేమ చేత, నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అందుకని నీకెప్పుడూ మంచి చెయ్యాలనే చూస్తుంటాను. అమ్మ! ఇంతకముందెన్నడూ నేను అబద్ధాలు చెప్పలేదు, ఇక ముందు కూడా ఎన్నడూ అబద్ధాలు చెప్పను. రామలక్ష్మణులు జీవించి ఉన్నారని నేను చెప్పినది పరమ సత్యం, నువ్వు బెంగ పెట్టుకోకు తల్లీ " అని చెప్పింది.

తరువాత ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళి దింపేశారు.

ఇంతలో రాముడు మెల్లగా తేరుకుని ఎదురుగా మూర్చపోయి పడిఉన్న లక్ష్మణుడిని చూసి " ఒకవేళ లక్ష్మణుడి ప్రాణములు దక్కకపోతే, నేనొక్కడినే బతికితే, సీత నాకు దక్కినా ఆ బ్రతుకు నాకెందుకు. ఎలోకంలోనైనా వెతికితే సీతలాంటి భార్య దొరకచ్చు, కాని లక్ష్మణుడిలాంటి తమ్ముడు దొరకడు. కార్తవీర్యార్జునుడు( ఈయన ఒకసారి రావణుడిని ఓడించి చెరసాలలో బంధించాడు. ఈయనకి 1000 చేతులు ఉండేవి) ఒకేసారి 500 బాణములను ప్రయోగం చేసేవాడు, అంతకన్నా ఎక్కువ బాణములను ప్రయోగం చెయ్యగలిగే శక్తి లక్ష్మణుడికి ఉంది. నాకోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకు ఇంక సీత ఎందుకు. నాకు ఈ జీవితం అక్కరలేదు " అని రాముడు బాధపడ్డాడు.

అప్పుడాయన సుగ్రీవుడిని పిలిచి " సుగ్రీవ! ఇప్పటివరకూ నువ్వు నాకు చేసిన ఉపకారం చాలు, లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను. నేను శరీరాన్ని వదిలేస్తాను. ఇది తెలిశాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు, అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకొని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. జాంబవంత, హనుమ, అంగద, మీరందరూ నాకు మహోపకారం చేశారు, మీరందరూ వెళ్ళిపొండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను, విభీషణుడికి లంకా రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను, ఇప్పుడది అసత్య వాక్కు అయ్యింది. అసత్య వాక్యం నా నోటి నుండి దొర్లిందని నేను బాధపడుతున్నాను " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు " విభీషణ! నువ్వు వానరాలని తీసుకొని కిష్కిందకి వెళ్ళు, నేను రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకొస్తాను. సుషేణ! వీళ్ళు మూర్చపోయి ఉన్నారు, ఇంకా వీళ్ళ ప్రాణములు పోలేదు, తొందరగా వీళ్ళని కిష్కిందకి తీసుకుపో " అన్నాడు.

అప్పుడు సుషేణుడు " పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జెరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలని విశేషమైన అస్త్రాలతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలు విడిచిపెడుతుంటే, శరీరాలు దెబ్బతింటుంటే దేవగురువైన బృహస్పతి విశల్యకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఓషధులు కలిగిన మొక్కలని రసం పిండి వాసన చూపిస్తే ఆ దేవతలందరూ మళ్ళి జీవించారు. ప్రస్తుతం అవి పాల సముద్రంలో ఉండే రెండు పర్వత శిఖరాల మీద ఉన్నాయి. మనదెగ్గర ఉన్న వానర సైన్యంలో హనుమ, సంపాతి, ఋషభుడు, నీలుడు మొదలగు వారు మాత్రమే వెళ్ళి ఆ ఓషధులని గుర్తుపట్టగలరు. వాటిని తీసుకొచ్చి రాముడికి, లక్ష్మణుడికి వాసన చూపిస్తే వారు జీవించే అవకాం ఉంటుంది " అన్నాడు.

సుషేణుడు చెప్పిన ప్రకారం వెళదామని వారు అనుకుంటుండగా అక్కడ ఒక గొప్ప నాదం వినపడింది. ఎక్కడిదీ ఈ ధ్వని అని అందరూ ఆ సముద్రం వైపున చూడగా, బ్రహ్మాండమైన కాంతితో, రెక్కలు అల్లారుస్తూ ఒక మహా స్వరూపం వస్తుంది. అది వస్తున్నప్పుడు దాని కాంతి చేత, వేగం చేత సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని వేల వృక్షములు నేలన పడిపోయాయి. కాంతివంతమైన స్వరూపంతో గరుగ్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయనని చూడగానే అందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. అప్పటివరకూ రామలక్ష్మణులని గట్టిగా పట్టుకుని ఉన్న నాగములు గరుగ్మంతుడు వచ్చి అక్కడ వాలగానే వాళ్ళని విడిచిపెట్టేసి పారిపోయాయి. నాగములు విడిచిపెట్టగానే రామలక్ష్మణులు స్వస్థత పొంది పైకి లేచారు. అప్పుడు గరుగ్మంతుడు వాళ్ళిద్దరిని దెగ్గరికి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకొని వాళ్ళిద్దరి ముఖాలని తన చేతులతో తడిమాడు. గరుగ్మంతుడు అలా కౌగాలించుకోగానే, ఇంతకముందు రాముడికి ఎంత బలం ఉండేదో, ఎటువంటి పరాక్రమము ఉండేదో, ఎటువంటి బుద్ధి ఉండేదో, ఎటువంటి తేజస్సు ఉండేదో వాటికి రెండింతలు పొందాడు. వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయములన్నీ మానిపోయాయి.

అప్పుడు గరుగ్మంతుడు " నాయనా రామ! ఇకమీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కోరలున్న పాములని తన మాయ చేత ఇంద్రజిత్ బాణములుగా మార్చుకున్నాడు. ఈ నాగపాశం నుండి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు. యక్ష, గంధర్వ, కిన్నెరులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చినా ఈ నాగపాశములను విడదీయలేరు. ఇది కేవలం నన్ను చూసి మాత్రమే విడివడుతుంది " అన్నాడు.

అప్పుడు రాముడు " మీరు ఎవరు? " అని అడిగాడు.

గరుగ్మంతుడు అన్నాడు " నేను గరుగ్మంతుడిని, నేను ఎందుకు వచ్చాను అని ఇప్పుడు అడక్కు. నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది. నీకు నాకు ఉన్న అనుబంధమేమిటో యుద్ధం అయ్యాక చెబుతాను. ఇప్పుడు చెప్పడం కుదరదు, నువ్వు నన్ను అడగనూ కూడదు. కొద్దికాలంలోనే ఈ లంకలో వృద్ధులు, బాలురు తప్ప ఓపికున్న రాక్షసుడు ఎవ్వడూ ఉండకుండా నువ్వు కొట్టేసి సీతమ్మని పొందుతావు. మరి నేను బయలుదేరడానికి నాకు అనుమతిని కటాక్షించు రామ " అన్నాడు.

రాముడు " చాలా సంతోషం, మీరు వెళ్ళండి " అన్నాడు.

గరుగ్మంతుడు ఎలా వచ్చాడో అలా తన బంగారు రెక్కలను ఊపుకుంటూ సముద్రం మీద నుంచి వెళ్ళిపోయాడు.

రెట్టింపు ఉత్స్సహంతో, బలంతో ఉన్న రామలక్ష్మణులని చూడగానే అక్కడున్న వానరులందరూ ఆనందంతో భేరీలు మ్రోగించారు, కుప్పిగంతులు వేశారు, పాటలు పాడారు, పెద్ద పెద్ద కేకలు వేశారు. లోపల సంతోషంగా కూర్చుని ఉన్న రావణుడికి ఈ కేకలు వినపడి " ఏమి జెరిగిందో చూడండి " అన్నాడు. అప్పుడు అక్కడున్న రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కి చూసేసరికి, రెండు ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా రామ లక్ష్మణులిద్దరు నిలబడి ఉన్నారు. వాళ్ళు వెంటనే చూసిన విషయాన్ని రావణుడికి చెప్పారు. ఆ మాటలు విన్న రావణుడు మొదట ఆశ్చర్యాన్ని పొంది తరువాత ఆగ్రహంతో ఊగిపోయాడు.

అప్పుడు రావణుడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి " నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని సంహరించి తిరిగిరా, నీకన్నా బంధువు నాకు లేడు. నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి, నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళు " అన్నాడు.'

అప్పుడా ధూమ్రాక్షుడు పశ్చిమ ద్వారంగుండా బయటకి వెళ్ళాడు. ఆయన అలా బయటకి వెళ్ళగానే ఆకాశం నుండి ఒక మేఘం వచ్చి రక్తాన్ని వర్షించింది. ఆకాశంలో తిరుగుతున్న ఒక గ్రద్ద వాడి రథం మీద వాలింది. రక్తంతో తడిసిపోయిన ఒక తెల్లటి మొండెం సూర్యమండలంలో నుంచి వాడి రథం ముందు పడింది. ఇన్ని అపశకునములు కనపడినా ఆ ధూమ్రాక్షుడు యుద్ధానికి వెళ్ళాడు.

ఆ ధూమ్రాక్షుడు తన యొక్క బాణములతో వానరులని కొట్టి వాళ్ళ శరీరాలని చీల్చేస్తున్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిలని పెకలించి పరుగు పరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదకి విసిరాడు. హనుమ వేసిన శిలని గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుంచి బయటకి దూకేశాడు. ఆ రథం తుత్తునియలు అయిపోయింది. తరువాత ఆ ధూమ్రాక్షుడు కొన్ని బాణములతో హనుమంతుడిని కొట్టాడు. వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేశాడు. నజ్జునజ్జయిపోయి ఆ ధూమ్రాక్షుడు మరణించాడు.

తరువాత రావణుడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు. అప్పుడాయన సైన్యంతో కలిసి దక్షిణ ద్వారంగుండా బయటకి వచ్చాడు. ఆ వజ్రదంష్ట్రుడు బయటకి రాగానే అరణ్యంలో ఉన్న నక్కలు అరిచాయి, అన్ని మృగాలు ఏడిచాయి. ఆ వజ్రదంష్ట్రుడు ఒకేసారి 7-8 బాణములని ప్రయోగించేవాడు. అన్ని వైపులకి బాణములని ప్రయోగం చేసి వానరములని కొట్టాడు. ఇక వీడిని ఉపేక్షించకూడదని అంగదుడు భావించి, ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొచ్చి వజ్రదంష్ట్రుడిని కొట్టబోయాడు. కాని ఆ వృక్షాన్ని తన బాణముల చేత వజ్రదంష్ట్రుడు నరికేశాడు. తరువాత అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొచ్చి దానిని విసిరేశాడు. ఆ దెబ్బకి వజ్రదంష్ట్రుడి రథం ముక్కలయిపోయింది. మళ్ళి అంగదుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కిందపడి వజ్రదంష్ట్రుడు మరణించాడు.

ఈసారి రావణుడు అకంపనుడు అనే రాక్షసుడిని పంపాడు. ఆ అకంపనుడు యుద్ధానికి వస్తుండగా ఆయన ఎడమ కన్ను అదిరింది, అకారణంగా వాడి కంఠం బొంగురుపోయింది, పక్షులు, మృగాలు ఆయన చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తున్నాయి, ఎత్తుపల్లాలు లేని మార్గంలో వెళుతున్న గుర్రాలు తొట్రుపడి మోకాళ్ళ మీద కిందపడి పైకి లేచాయి. ఈ అకంపనుడు కూడా పశ్చిమ ద్వారంగుండానే బయటకి వెళ్ళాడు. ఆయన కొంతసేపు భయంకరమైన యుద్ధం చేసి వానరాలని కొట్టాడు. తరువాత హనుమంతుడు ఆయన మీదకి ఒక పర్వతాన్ని విసరగా దానిని ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు వేసిన ఒక పెద్ద చెట్టుని 14 బాణములతో కొట్టి బద్దలుచేశాడు. ఆ తరువాత హనుమంతుడు ఇంకొక పెద్ద చెట్టుని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తూ దారిలో ఉన్న రాక్షసులని కొట్టుకుంటూ, ఏనుగుల్ని ఎడమ చేతితో విసిరేస్తూ మహా రౌద్రరూపంతో ఆ చెట్టును పట్టుకెళ్ళి అకంపనుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు పచ్చడై చనిపోయాడు.

అప్పుడు రావణుడు తన సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడిని పిలిచి " ప్రహస్త! యుద్ధం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళాలి, కుంభకర్ణుడు వెళ్ళాలి, నికుంబుడు వెళ్ళాలి లేకపోతె తత్తుల్యమైన పరాక్రమము ఉన్న నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన వాడు తిరిగి రావడం లేదు, ఇప్పుడు కాని నువ్వు వెళితే యుద్ధం చేద్దాము. మనం యుద్ధం చెయ్యలేము అని నువ్వు అంటె యుద్ధం ఆపేద్దాము " అన్నడు.

అప్పుడు ప్రహస్తుడు " మీరు ఈ మాట ఇంతకముందు ఒకసారి సభలో అడిగారు. అప్పుడు కొంతమంది ' సీతమ్మని ఇచ్చెయ్యండి ' అన్నారు. మీరు అప్పుడే ఇవ్వలేదు, ఇప్పుడు యుద్ధం ఆపడమేమిటండి. యజ్ఞంలో వేసిన దర్భలా వెళ్ళి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళమనా మీ ఉద్దేశం " అన్నాడు.

అప్పుడు రావణుడు " ప్రహస్త! నీ కంఠం గట్టిది, నువ్వు యుద్ధానికి వెళ్ళి గట్టిగా అరువు. వానరులకి యుద్ధం చెయ్యడం రాదు, వాళ్ళు చపలబుద్ధులు. నువ్వు గట్టిగా అరిస్తే అన్ని వానరాలు పారిపోతాయి. అప్పుడు యుద్ధ భూమిలో ఒక్క రామలక్ష్మణులు తప్ప ఎవరూ ఉండరు, అప్పుడు నువ్వు వాళ్ళని సునాయాసంగా కొట్టేయ్యచ్చు " అన్నాడు.

అప్పుడా ప్రహస్తుడు రావణుడికి ప్రదక్షిణ చేసి, రథానికి ప్రదక్షిణ చేసి కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. ఈయనకి కూడా అనేకమైన అపశకునాలు కనపడ్డాయి. ఈయన కూడా మిగతా వాళ్ళలాగానే వాటిని లెక్కచెయ్యకుండా తూర్పు ద్వారంగుండా ముందుకెళ్ళాడు.

అప్పుడు ప్రహస్తుడికి నీలుడికి యుద్ధం జెరిగింది. ప్రహస్తుడు చాలా గొప్ప యుద్ధం చేసి ఎందరో వానరాలని చంపాడు. ప్రహస్తుడు నీలుడి మీద బాణాలని ప్రయోగిస్తే, ఆబోతు మీద వర్షం పడితే అది ఎంత సంతోషంగా ఉంటుందో, నీలుడు కూడా ఆ బాణాలు పడుతుంటే అంత సంతోషంగా ఉన్నాడు. నీలుడు ఒక చెట్టుని పెకలించి ప్రహస్తుడి రథాన్ని కొట్టాడు, అప్పుడా రథం పడిపోయింది. తరువాత ఆయన ఒక పెద్ద సాల వృక్షంతొ ప్రహస్తుడి గుర్రాలని కొట్టాడు. ఆ తరువాత ఒక శిలని తీసుకొచ్చి ప్రహస్తుడి మీద పడేశాడు. దాంతో ఆ ప్రహస్తుడు కూడా మరణించాడు.

ప్రహస్తుడు మరణించాడన్న వార్త విన్న రావణుడు ఉద్విగ్నతని పొంది, తన సైన్యం అంతటినీ పిలిచి " ఇప్పుడు నేనే యుద్ధానికి వెళుతున్నాను. నేను బయటకి వెళ్ళాక వానరాలు లోపలికి రావచ్చు, అందుకని మీరందరూ జాగ్రత్త వహించి కోట శిఖరముల మీద నిలబడండి " అని చెప్పి రథం ఎక్కి, సైన్యాన్ని తీసుకొని యుద్దానికి వెళ్ళాడు.

రాముడంతటివాడు కూడా యుద్ధ భూమిలోకి వస్తున్న రావణుడిని చూసి ' మిట్ట మధ్యానం వేళ సూర్యుడిని చూస్తే స్పష్టంగా కనపడకుండా ఆయన తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు, ఈయనని చూస్తే కూడా కళ్ళు అదురుతున్నాయి. ఎవరీ వస్తున్నవాడు ' అని ఆశ్చర్యపోయి, వస్తున్నవాడు ఎవరని విభీషణుడిని అడిగాడు.

విభీషణుడు అన్నాడు " రామ! ఆ ఏనుగు మీద వస్తున్నవాడు అకంపనుడు( ఇందాక చనిపోయినవాడు కూడా అకంపనుడే, కాని వీడు ఇంకొక అకంపనుడు), వాడిది సామాన్యమైన యుద్ధం కాదు, వాడిని కనీసం పర్వత శిఖరాలతో కొట్టాలి, లేకపోతె వాడికి ఇష్టం ఉండదు. ఆయన పక్కన రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్. వాడి రథం యజ్ఞాగ్నిలో నుంచి బయటకి వస్తుంది, సింహములు పూన్చిన రథం మీద వస్తాడు. ఈ పక్కన, మహేంద్ర పర్వతం, వింధ్య పర్వతం ఎంత శరీరాలతో ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో, అంతటి ధైర్యము, శరీరము ఉన్న అతికాయుడు వస్తున్నాడు. పర్వత శిఖరం కదిలొస్తోందా అన్నట్టుగా ఉన్న ఆ ఏనుగు మీద వస్తున్నవాడు మహోదరుడు. అక్కడ ఒక గుర్రము ఎక్కి పాశము పట్టుకొని వస్తున్నవాడు పిశాచుడు, వాడు అరవీరభయంకరుడు. అటుపక్క వృషభం ఎక్కి చేతిలో శూలం పట్టుకొని వస్తున్నవాడు త్రిశిరస్కుడు, వాడు మహా ఘోరమైన యుద్ధం చేస్తాడు. అటుపక్క తన ధ్వజానికి సర్పాన్ని గుర్తుగా పెట్టుకొని, ధనుస్సు పట్టుకొని వస్తున్నవాడు కుంభుడు. అలాగే పర్వతాలని గులకరాళ్ళగా విసరగల బాహుపరాక్రమము కలిగినవాడు ఆ పక్కన వస్తున్నాడు, వాడి పేరు నరాంతకుడు. భోజనం చెయ్యడం అందరికీ ఎంత సంతోషమో, యుద్ధం చెయ్యడం అంత సంతోషంగా ఉండేవాడు నికుంభుడు.

అదుగో అక్కడ పది తలకాయలతో, ఇరవై చేతులతో, కిరీటాలు వేసుకొని, కుండలాలు తొడుక్కొని, బ్రహ్మాండమైన పర్వతంవంటి భీమకాయం కలిగినవాడు, మహేంద్రుడు, యముడు, దేవతలు మొదలైనవారిని యుద్ధరంగంలో పరుగులు తీయించినవాడు, అందరినీ శాసించగలిగినవాడు, ఎవడి పేరు చెబితే లోకాలు ఏడుస్తాయో అటువంటి రావణుడు ఆ ఏనుగు మీద వస్తున్నాడు.

అప్పుడు రాముడు రావణుడిని చూసి " ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి స్వరూపం, ఏమి పరాక్రమం, మిట్ట మధ్యానం సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఇప్పటివరకూ నేను దేవతలలో కాని, యక్షులలో కాని, గంధర్వులలో కాని ఇంత తేజస్సు కలిగినవాడిని చూడలేదు. కాని ఇన్నాళ్ళకి రావణుడిని చూసే అదృష్టం కలిగింది, ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడు. ఎవరితో యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అటువంటివాడు ఇవ్వాళ యుద్ధ భూమిలోకి వచ్చాడు " అని సంతోషంగా ధనుస్సుని చేతితో పట్టుకొని టంకారం చేశాడు.

రావణుడిని చూడగానే సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పెకలించి గబగబా వెళ్ళి రావణుడి మీద పడేశాడు. తన మీదకి వస్తున్న ఆ పర్వత శిఖరాన్ని రావణుడు అర్థచంద్రాకార బాణాలతో తుత్తునియలు చేసి, బంగారు కొనలు కలిగిన బాణాలతో సుగ్రీవుడి గుండెల్లో కొట్టాడు. ఆ దెబ్బకి భూమిలో నుంచి జలం పైకొచ్చినట్టు సుగ్రీవుడి గుండెల్లోనుంచి రక్తం పైకి వచ్చింది. అంతటి సుగ్రీవుడు కూడా గట్టిగా అరుస్తూ కిందపడి మూర్చపోయాడు. తదనంతరం గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఋషభుడు, నలుడు మొదలైన వానర వీరులందరి మీద 4, 6, 8, 12 బాణములను ఏకాకాలమునందు విడిచిపెట్టి వాళ్ళ మర్మస్థానముల మీద కొట్టాడు. వాళ్ళందరూ కింద పడిపోయారు.

వానర వీరులందరినీ రావణుడు కొట్టేస్తున్నాడని హనుమంతుడు గబగబా వచ్చి రావణుడి రథం ముందు నిలబడి కుడి చెయ్యి బిగించి " రావణా! నీకు బ్రహ్మగారి వరాలు ఉన్నాయని మిడిసిపడ్డావు, సీతమ్మని అపహరించావు, నా పిడికిలి గుద్దు చేత నీలోని జీవాత్మని పైకి పంపించేస్తాను రా " అన్నాడు.

అప్పుడు రావణుడు " నువ్వంత మొనగాడివైతే అది చాలా గొప్ప విషయమే, నన్ను గుద్దు చూస్తాను " అన్నాడు.

హనుమంతుడు తన పిడికిలిని బిగించి రావణుడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి రావణుడు స్పృహ తప్పినట్టయ్యి అటు ఇటూ తూలి " ఆహా! ఏమి గుద్దు గుద్దావురా, చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి " అన్నాడు.

అప్పుడు హనుమంతుడు " ఛి దురాత్ముడా, ఇన్నాళ్ళకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యం వేసింది. దీనితో గుద్దాక నువ్వు బతికి ఉన్నావు, ఎంత ఆశ్చర్యం. నేను ఇంక నిన్ను కొట్టను, నువ్వు నా వక్షస్థలం మీద గుద్దు, నా శక్తి ఏమిటో నువ్వు చూద్దువు కాని. అప్పుడు నేను నిన్ను మళ్ళి తిరిగి గుద్దుతాను " అన్నాడు.

అప్పుడు రావణుడు తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి హనుమంతుడు గిరగిరా తిరిగి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.

అప్పుడు సర్వసైన్యాధికారి అయిన నీలుడు చీమ అంత రూపాన్ని పొంది రావణుడిని బాగా విసిగించాడు. రావణుడి బాణాల మధ్య నుండి తప్పించుకుంటూ వెళ్ళి ఆయన కిరీటం మీదకి దూకి, అక్కడినుంచి కిందకి దూకి ఆయన చెవులు కొరికాడు, తరువాత ఆయన బుగ్గలు కొరికాడు, తరువాత ఆయన లాల్చిలో దూరాడు. అటు ఇటూ పాకుతూ నానా అల్లరి పెట్టాడు. అప్పుడు రావణుడు అగ్నేయాస్త్రాన్ని నీలుడి మీదకి అభిమంత్రించి వదిలాడు, అప్పుడా అస్త్రం మంటలు కక్కుతూ నీలుడి మీద పడిపోయింది. అదృష్టవశాత్తు నీలుడు అగ్ని యొక్క అంశకి జన్మించినవాడు కనుక ఆ మంటలని తట్టుకోగలిగాడు, కాని స్పృహ కోల్పోయి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.  

ఇక రావణుడిని ఉపేక్షించకూడదని అనుకొని రాముడు ముందుకి వెళుతుండగా, లక్ష్మణుడు రాముడి పాదాలు పట్టుకొని " అన్నయ్య! నువ్వు వెళ్ళకూడదు. ఇటువంటి వాడితో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళితే మేమంతా ఎందుకు. నేను వెళతాను, నన్ను ఆశీర్వదించు " అన్నాడు.

అప్పుడు రాముడు " నాయనా! వచ్చినవాడు సామాన్యుడు కాదు. వాడు వేసిన బాణాలని నిగ్రహిస్తూ, నీ బాణములతో వాడి మర్మస్థానములయందు గురి చూసి కొడుతూ రావణుడిని నొప్పించు. లోపల మంత్రాలని మననం చేసుకుంటూ వెళ్ళు " అని చెప్పాడు.

" దుష్టాత్ముడవై మా వదినని అపహరించావు, ఇప్పుడు యుద్ధ భూమిలో కనపడ్డావు కనుక నువ్వు ఇక ఇంటికి వెళ్ళే సమస్య లేదు " అని చెప్పి లక్ష్మణుడు రావణుడి మీద బాణములను ప్రయోగించాడు. లక్ష్మణుడు వేసిన బాణములను రావణుడు దారిలోనే సంహారం చేసి తాను కొన్ని బాణములను ప్రయోగించాడు. రావణుడు వేసిన బాణములను లక్ష్మణుడు నిగ్రహించాడు. ఇక లక్ష్మణుడిని ఉపేక్షించకూడదని రావణుడు భావించి బ్రహ్మగారు ఇచ్చిన శక్తి(ఈ అస్తం ఎవరిమీదన్నా ప్రయోగిస్తే ఇంక వాళ్ళు మరణించవలసిందే) అనే భయంకరమైన ఆయుధాన్ని అభిమంత్రించి ఆయన మీద వేశాడు. లక్ష్మణుడు దాని మీదకి వేసిన అనేకమైన బాణములను కూడా అది నిగ్రహించుకుంటూ వచ్చి ఆయన వక్షస్థలం మీద పడింది. అప్పుడు లక్ష్మణుడు ' నేను విష్ణు అంశ ' అని స్మరించాడు. అయినా ఆ బాణము యొక్క దెబ్బకి లక్ష్మణుడు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు.

వెంటనే రావణుడు లక్ష్మణుడిని తన రథంలో లంకకి తీసుకు వెళదామని అనుకొని పరుగు పరుగున వచ్చి తన 20 చేతులతో లక్ష్మణుడిని ఎత్తబోయాడు. ఆ చేతులతో మేరు పర్వతాన్ని, మందర పర్వతాన్ని ఎత్తిన రావణుడు, ఆ చేతులతో హిమవత్ పర్వతాన్ని కదిపిన రావణుడు ఇవ్వాళ ఆ చేతులతో లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు( లక్ష్మణుడు పడిపోయేముందు ' నేను విష్ణు అంశని ' అని పడిపోయాడు కనుక రావణుడు ఎత్తలేకపోయాడు). ఇంతలో హనుమంతుడు మూర్చనుండి తేరుకుని చూసేసరికి, రావణుడు రథం దిగి లక్ష్మణుడిని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు. అప్పుడు హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చి ' నీ దిక్కుమాలిన చేతులతో లక్ష్మణుడిని ముట్టుకుని, ఎత్తి తీసుకు పోదామనుకుంటున్నావా ' అనుకొని, పరుగు పరుగున వచ్చి తన కుడి చేతితో రావణుడి వక్షస్థలంలో ఒక పోటు పొడిచాడు. ఆ దెబ్బకి రావణుడి చెవుల నుండి, ముక్కు నుండి, కనుగుడ్ల పక్కనుండి కూడా రక్తం కారి, మోకాళ్ళ మీద కిందకి పడిపోయి, మళ్ళి స్పృహలోకి వచ్చి గబగబా తన రథంలోకి వెళ్ళి కూర్చుండిపోయాడు.

అప్పుడు లక్ష్మణుడిని హనుమంతుడు పరమభక్తితో, రక్షించుకోవాలనే భావనతో ముట్టుకునేసరికి ఆయన దూదిపింజలా పైకి లెగిసిపోయాడు. లక్ష్మణుడిని తీసుకెళ్ళి రాముడికి అప్పగించారు. వెంటనే లక్ష్మణుడు స్పృహని పొంది " బ్రహ్మగారి శక్తిని నా మీదకి ప్రయోగించాడు అన్నయ్యా, అప్పుడు నేను విష్ణు అంశని స్మరించాను. నాకు ఏ ఉపద్రవం లేదు " అన్నాడు.

లక్ష్మణుడి మాటలు విన్న రాముడు క్రోధపర్వసుడై గబగబా అడుగులు వేసుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు. వెంటనే హనుమంతుడు వచ్చి " స్వామీ! ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుగ్మంతుడి మీద కూర్చొని యుద్ధం చేస్తాడో, అలా మీరు నా వీపు మీద కూర్చొని యుద్ధం చెయ్యండి. ఆ రావణుడు రథంలో కూర్చుంటే మీరు నేల మీద నిలబడి యుద్ధం చెయ్యడమేమిటి స్వామీ, నా మీద కూర్చొని యుద్ధం చెయ్యండి " అన్నాడు.

అప్పుడు రాముడు హనుమ మీద కూర్చొని యుద్ధానికి వెళ్ళి " దురాత్ముడా, ఆచారభ్రష్టుడా, పర స్త్రీని అపహరించినవాడ! ఈ రోజు నువ్వు అంతఃపురంలోకి వెళ్ళవు. ఇవ్వాళ నీ పదితలకాయలు కొట్టేస్తాను............" అని రాముడు చెబుతుండగా, రావణుడు విశేషమైన బాణ పరంపరని హనుమంతుడి మీద కురిపించాడు. ఆ బాణపు దెబ్బలకి హనుమంతుడి శరీరం అంతా నెత్తురు వరదలై కారిపోతుంది. అలా ఉన్న హనుమని చూసిన రాముడికి పట్టరాని కోపం వచ్చి, అర్థచంద్రాకార బాణములు, నారాచ బాణములు, వంకరలు లేని బాణములు రావణుడి మీద ప్రయోగించాడు.

అవి బాణాల, మెరుపులా? అని రావణుడు ఆశ్చర్యంగా చూస్తుండగా, ఆ బాణ పరంపరకి రావణుడి గుర్రాలు పడిపోయాయి, సారధి చనిపోయాడు, ధ్వజం పడిపోయింది, చక్రాలు ఊడిపోయాయి, రావణుడు తూలి భూమి మీద నిలబడ్డాడు. ఆ రావణుడి చేతిలో కోదండము, ఖడ్గము ఉన్నాయి. అప్పుడు రాముడు రావణుడి భుజంలోకి బాణాలు కొట్టాడు, కోదండాన్ని బాణాలతో కొట్టి విరిచేశాడు, ఆ ఖడ్గాన్ని విరిచేశాడు. ఆ రావణుడి అన్ని మర్మస్థానాలని బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకి నెత్తురు వరదలై కారిపోయింది. తరువాత రాముడు బాణములతో రావణుడి కిరీటాన్ని కొడితే అది దొర్లి కింద పడిపోయింది.
(ఈ సర్గని మకుట భంగ సర్గ అంటారు)

అప్పుడు రాముడు " భయంకరమైన యుద్ధం చేశావు రావణా. నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చనిపోయాయి, నీ సారధి మరణించాడు, నీ ధ్వజం కిందపడిపోయింది, నీ రథం ముక్కలయ్యింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. ఇప్పటివరకూ నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపొయావు, నీ కళ్ళల్లో భయం కనపడుతుంది, నీ ఒంటికి చెమట పట్టింది, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. పోయి ఇవ్వాళ రాత్రి పడుకో, విశ్రాంతి తీసుకో, మళ్ళి రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కు, చేతిలో ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి రా, నా పరాక్రమము ఏమిటో చూద్దువు కాని, ఇవ్వాల్టికి పొ " అన్నాడు.

రావణుడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అప్పుడాయన మంత్రులందరినీ, సైన్యాన్ని పిలిచి, సిగ్గుతో తల వంచుకొని " గరుగ్మంతుడు పాములని తినేసినట్టు, ఏనుగులు సింహము చేత ఓడింపబడినట్టు, ఇవ్వాళ నేను రాముడి బాణముల చేత ఓడింపబడ్డాను. ఇవ్వాళ ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి, నన్ను కొట్టి, చంపకుండా వదిలేసి, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు మళ్ళి స్వస్తతని పొంది, ఆయుధాన్ని పట్టుకొని, రథం ఎక్కి రా, చూపిస్తాను నా పరాక్రమము అన్నాడు.

ఒకనాడు బ్రహ్మగారు నాతో ' నువ్వు మనుష్యుల చేతిలో నశించిపోతావు ' అన్నారు. ఆయన మాట యదార్ధమవుతోంది. ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేతుల్లో మరణించకూడదని కోరుకున్నాను, కాని మనుష్యుల చేతిలో, వానరుల చేతిలో మరణించకూడదన్న వరాన్ని నేను అడగలేదు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది, ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు( రావణుడు అనరణ్యుడిని యుద్ధంలో సంహరించాడు) అని ఒక రాజు ఉండేవాడు. ఆయన నన్ను ఒకనాడు ' ఒరేయ్ రాక్షసుడా, మా ఇక్ష్వాకు వంశంలో ఒకనాడు రాముడన్నవాడు జన్మిస్తాడు, ఆయన నిన్ను సంహరిస్తాడు ' అని శపించాడు. బహుశా ఆయనే ఇవ్వాళ ఇక్ష్వాకు వంశంలో రాముడిగా వచ్చి ఉంటాడు. ఒకనాడు పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలని ప్రయత్నించాను. ఆ వేదవతి ' స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావు ' అని శపించింది. బహుశా ఆ వేదవాతే జనక మహారాజుకి కూతురిగా సీతగా పుట్టిందిరా, నేను సీతని నా మృత్యువు కోసమే తెచ్చిపెట్టుకున్నాను. ఒకనాడు కైలాశ పర్వతం మీద పార్వతీదేవి నన్ను శపించింది, నందీశ్వరుడు శపించాడు( నందీశ్వరుడిని చూసి రావణుడు ' కోతి ముఖంవాడ ' అని హేళన చేశాడు. ' ఆ వానరాలే నీ కొంప ముంచుతాయిరా ' అని నంది అన్నాడు). నలకూభరుడి భార్య  అయిన రంభ శాపం ఫలిస్తోంది, వరుణుడి కుమార్తె అయిన పుంజకస్థల శాపం ఫలిస్తోంది. ఇవ్వన్నీ నిజం చెయ్యడం కోసమని రాముడొచ్చాడని నేను అనుకుంటున్నాను.

అయినా నేను దేవ దానవులని ఓడించినవాడిని, నేను ఎవరికీ భయపడను, సీతని ఇవ్వను. మీరందరూ జాగ్రత్తగ కోట బురుజులు ఎక్కండి, ప్రాసాదాలు ఎక్కండి. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి, యుద్ధానికి వెళ్ళాలి. ఇంక మామూలు వాళ్ళు యుద్ధానికి పనికిరారు. నా తమ్ముడైన కుంభకర్ణుడు ఉన్నాడు, వాడి యుద్ధానికి ఇంద్రుడు మొదలైన వాళ్ళే హడలిపోయారు. వాడు మొన్ననే సభకి వచ్చాడు, ఇప్పుడు నిద్రపోతున్నాడు. వాడిని లేపడమే కష్టం, వాడు లెగిస్తే రాముడు ఎంత. వెంటనే వెళ్ళి కుంభకర్ణుడిని లేపి తీసుకురండి " అన్నాడు.

రావణుడి ఆజ్ఞ మేరకు నిద్రపోతున్న కుంభకర్ణుడిని నిద్రలేపడానికి ఎందరో సైనికులు ఆయన యొక్క శయనాగారంలోకి ప్రవేశించారు. లోపల కుంభకర్ణుడు వింధ్య పర్వతం, మేరు పర్వతం పడుకున్నట్టు పడుకున్నాడు. ఆయన ముక్కు యొక్క రంధ్రములు పెద్ద పర్వత గుహలలా ఉన్నాయి, ఆయన ఊరిపి తీసేసరికి తలుపులు తీసిన వాళ్ళందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు. మళ్ళి ఆయన ఊపిరి విడిచేసరికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న గోడలకి, తలుపులకి కొట్టుకొని కిందపడిపోయారు. ఆయనని ఎలా నిద్రలేపాలి అని వాళ్ళు బాగా ఆలోచించి " ఈయనకి తినడం అంటె బాగా ఇష్టం. అందుకని ఈయనకి ఇష్టమైన పదార్ధాలని తీసుకొచ్చి పెడదాము. ఎంత నిద్రపోతున్నవాడైనా వాసన పీల్చడం అనేది తప్పదు కదా, మనం పెట్టిన పదార్ధాల వాసనకి నిద్ర లేస్తాడు " అని అనుకొని ఆయనకి ఇష్టమైన దున్నపోతులని, జింకలని మొదలైన అనేక మృగాలని చంపి, వాటితో మంచి వాసనలు వచ్చే కూరలు వండారు. వండినవాటిని పెద్ద పెద్ద పాత్రలలోకి సర్దారు. తరువాత ఆ పాత్రలని తీసుకొచ్చి ఆయన పడుకున్న శయనాగారంలో సర్దారు. కొన్ని వేల కుంభములతొ మద్యాన్ని తీసుకొచ్చి పెట్టారు. అన్ని ఆహార పదార్ధాలు తీసుకొచ్చి పెట్టినా కుంభకర్ణుడికి తెలివి రాలేదు.

అప్పుడు వాళ్ళు తెల్లటి శంఖాలను పట్టుకొచ్చి మోగించారు, భేరీలు, మృదంగాలు మోగించారు. పెద్ద పెద్ద శూలాలు, పరిఘలు, తోమరాలు పట్టుకొచ్చి ఆయనని పొడిచారు. ఆ కుంభకర్ణుడి చేతులని కొన్ని వందల మంది రాక్షసులు ఎత్తి కిందపడేశారు. తరువాత వాళ్ళు ఏనుగుల్ని, కంచర గాడిదలని, ఎద్దులని, ఒంటెలని తెచ్చి ఆయన శరీరం మీదకి తోలారు. అవి ఆయన శరీరం మీదకి ఒక వైపు నుండి ఎక్కి మళ్ళి ఇంకొక వైపు నుండి దిగుతున్నాయి. వాళ్ళు అన్ని చేసినా కుంభకర్ణుడు మాత్రం చెలించకుండా అలానే నిద్రపోతున్నాడు.  

తరువాత వాళ్ళు బాగా చల్లగా ఉన్న నీటి కడవలని తీసుకొచ్చి, ఆ నీటిని ఆయన చెవులలో పోసేశారు. ఇంక లాభం లేదనుకొని ఆ రాక్షసులు ఆయన చెవులని కొరికెయ్యడం మొదలుపెట్టారు. తరువాత పర్వతాలంత ఎత్తు, బరువు ఉన్న 1000 ఏనుగుల్ని తీసుకొచ్చి ఆయన శరీరం మీదకి ఎక్కించారు. అ ఏనుగులు తన శరీరం మీద తిరుగుతుంటే కుంభకర్ణుడికి కొంచెం తెలివొచ్చినట్టనిపించింది. ఈయన మళ్ళి కునుకులోకి వెళ్ళిపోతాడేమో అని అక్కడున్న రాక్షసులు వెంటనే భేరీలు, మృదంగాలు, శంఖాలు మ్రోగించారు. కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, కొంతమంది పెద్ద పెద్ద కర్రలతో, శూలాలతొ ఆయనని పొడుస్తున్నారు. అక్కడున్న రాక్షసులందరూ కలిసి ఒకేసారి గట్టిగా అరిచారు. అప్పుడా కుంభకర్ణుడు మెల్లగా కన్నులు తెరిచి, రెండు చేతులని కలిపి ఒళ్ళు విరుచుకొని, పెద్దగా ఆవలించాడు. ఆయన నిద్రలేస్తూనే అక్కడున్న పాత్రలలో ఉన్న మాంసాహారాన్ని అంతా తినేశాడు. ఆ పక్కన ఉన్న కల్లుని కూడా తాగేసాడు.

అప్పుడా రాక్షసులు " కుంభకర్ణా! ఎన్నడూ లేని ప్రమాదం ఇవ్వాళ లంకకి ఏర్పడింది. మీ అన్నగారు సీతని అపహరించి తీసుకొచ్చారు. కేవలం నరుడైన రాముడు వానరములని తన సైన్యంగా మలుచుకొని 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి, ఆ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి యుద్ధోన్ముఖుడై తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. మన వైపు ఉన్న రాక్షస బలంలో అతిరథులు, మహారథులైన ఎందరో యోధులు మరణించారు. ఇంక దిక్కులేని పరిస్థితులలో మీ అన్నగారు నిన్ను నిద్రలేపమని మమ్మల్ని నియమించాడు. అందుకని మేము మిమ్మల్ని నిద్రలేపాము " అన్నారు.

అప్పుడు కుంభకర్ణుడు " ఈ మాత్రం దానికి నేను అన్నయ్య దెగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఇలానే యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతాను. నేను యుద్ధానికి వెళితే యముడు తన సైన్యంతో పారిపోయాడు, ఇంద్రుడు పారిపోయాడు. నరులైన రామలక్ష్మణులని సంహరించడం నాకు ఒక లెక్కా. నాకు చాలా ఆకలిగా ఉంది, అందరూ యుద్ధ భూమిలోకి యుద్ధం చెయ్యడానికి వెళితే నేను తినడానికి వెళతాను. అక్కడున్న వానరాలని, భల్లూకాలని తింటాను " అన్నాడు.

అప్పుడు ఆ రాక్షసులు " అలా వెళ్ళిపోకయ్యా. మీ అన్నగారు నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనతో మాట్లాడి, ఆయన ఎలా నిర్దేసిస్తే అలా వెళ్ళు " అన్నారు.

" ఇవన్నీ తిన్నాక, స్నానం చేసి వస్తాను " అని కుంభకర్ణుడు అన్నాడు.

స్నానం చేసి బయటకి వచ్చిన కుంభకర్ణుడికి దాహం వేసి అక్కడ 1000 కడవలలో ఉన్న కల్లుని తాగి రావణుడి అంతఃపురానికి బయలుదేరాడు. రావణుడి అంతఃపురానికి వెళుతున్న కుంభకర్ణుడిని చూసిన వానరాలు భయంతో పారిపోయాయి,( కుంభకర్ణుడిది అంత పెద్ద శరీరం, లంకా పట్టణానికి దూరంగా యుద్ధ భూమిలో ఉన్న వానరాలికి కూడా వాడు కనిపించాడు) కొంతమంది చెట్లు ఎక్కేసారు, కొంతమంది పర్వత గుహలలోకి దూరిపోయారు, కొంతమంది సేతువెక్కి పారిపోయారు.

ఈ గందరగోళాన్ని చూసి సుగ్రీవుడు, అంగదుడు ' ఏంటి విషయము ' అని అడుగగా, విభీషణుడు అన్నాడు " మా అన్నయ్య నడిచి అంతఃపురంలోకి వెళుతున్నాడు. ఇంక కొంచెంసేపటిలో వాడు యుద్ధానికి రాబోతున్నాడు. ఇతను రావణుడి తమ్ముడు, ఇతను కూడా ఒక రాక్షసుడే అని వానరాలకి చెప్పకండి, అలా చెబితే వాళ్ళు భయపడతారు, అది కేవలం ఒక యంత్రం అని చెప్పండి " అన్నాడు.

అప్పుడు కుంభకర్ణుడిని యంత్రము అని ప్రకటించారు. అలా ప్రకటించగానే పారిపోయిన వానరాలన్నీ మళ్ళి తిరిగి వచ్చాయి.

అప్పుడు రాముడు " విభీషణ! నీ అన్నయ్య ఇలా ఉన్నాడేంటి. వీడు ఇంతేనా లేక పుట్టాక ఇలా పెరిగాడ " అని అడిగాడు.

విభీషణుడు అన్నాడు " కొంతమంది రాక్షసులు జన్మించిన తరువాత తపస్సు చేసి బలాన్ని సంపాదిస్తారు. మా అన్నయ్య గొప్పతనం ఏమిటంటె, ఆయన పుట్టడమే ఇలా పుట్టాడు. వీడు పుట్టినప్పటి నుంచి ' ఆకలీ ' అని దేశం మీద పడి మనుష్యులని, రాక్షసులని, జంతువులని తినేవాడు. అలా గంటకి కొన్ని లక్షల మందిని తినేవాడు. వీడిని చూసి లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్ధించారు. అప్పుడాయన కుంభకర్ణుడు ఆహారం తింటున్న ప్రాంతానికి ఆకాశంలో ఐరావతం మీద వెళ్ళి ' ఏరా నీకు బుద్ధి ఉందా లేదా, ఏమిట్రా ఆ తినెయ్యడం. కొన్ని గంటల్లో ఈ ప్రపంచంలోని ప్రాణి కోటిని బతకనివ్వవా ' అని అరిచాడు. అప్పుడు కుంభకర్ణుడు ఆగ్రహంతో పైకి ఎరిగి ' నేను తింటుంటే నువ్వు ఎవడివిరా చెప్పడానికి ' అని, ఆ ఐరావతాన్ని ఒక్క తోపు తోసాడు. అప్పుడా ఐరావతం కింద పడిపోయింది. అప్పుడాయన ఆ ఐరావతానికి ఉన్న దంతాన్ని పీకి దానితో ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ దెగ్గరికి వెళ్ళి జెరిగినది చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు ' సృష్టిలో ఇలాంటివాడు ఒకడు వచ్చాడ! అలా తినెయ్యడమేమిటి, వాడిని ఒకసారి ఇక్కడికి తీసుకురండి ' అన్నారు.

తరువాత వాళ్ళు కుంభకర్ణుడిని బ్రహ్మగారి దెగ్గరికి తీసుకొచ్చారు. కుంభకర్ణుడిని చూడగానే బ్రహ్మగారు ఉలిక్కిపడి ' నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో ' అన్నారు.

కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషించి, కాని రావణుడికి బాధ కలిగింది. అప్పుడాయన బ్రహ్మగారితో ' అదేమిటి తాత అలా శపించావు, వాడు నీకు మునిమనవడు. అలా నిద్రపోమంటే ఎలా, కొన్నాళ్ళు లేచేటట్టు ఏర్పాటు చెయ్యి ' అన్నాడు.

అప్పుడు బ్రహ్మగారు ' వీడు 6 నెలలు నిద్రపోతాడు, ఒక్క రోజే నిద్రలేస్తాడు. ఆ ఒక్క రోజులోనే 6 నెలల తిండి తినేస్తాడు. తినంగానే మళ్ళి నిద్రపోతాడు ' అన్నారు.

అందుకని వాడు అలా నిద్రపోతుంటాడు రామ. ఇవ్వాళ మా అన్నయ్య వాడిని యుద్ధం కోసం నిద్రలేపాడు. వాడితొ యుద్ధం అంటె సామాన్య మైన విషయం కాదు రామ " అన్నాడు.

ఇంతలో కుంభకర్ణుడు రావణుడి అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు తన బాధ అంతా చెప్పుకుని కుంభకర్ణుడిని యుద్ధానికి వెళ్ళమన్నాడు.

అప్పుడు కుంభకర్ణుడు " అన్నయ్య! మనం ఏదన్నా ఒక పని చేసేముందు ఆలోచించి చెయ్యాలి. సీతని అపహరించే ముందు ఎవరితో అన్న ఆలోచన చేశావ. ఒక్కడివే ఎవరితో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చావు, ఇప్పుడది ఉపద్రవం అయ్యి కూర్చుంది. నీకు చెప్పగలిగేంత వాడిని కాదు కాని, నీకన్నా అవతలివాడి పౌరుష పరాక్రమాలు ఎక్కువ అనుకున్నప్పుడు సంధి చేసుకోవాలి, సమానుడు అనుకుంటేనే యుద్ధం చెయ్యాలి, లేదా నీకంటే తక్కువ శక్తి కలిగిన వాడైతేనే యుద్ధం చెయ్యాలి అని విభీషణుడు చెబితే, ఆయనని రాజ్యం నుండి బయటకి పంపించేశావు. ఇప్పుడు అందరూ మరణించిన తరువాత నన్ను నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటున్నావు. నీ మంత్రులైనా నీకు మంచి చెప్పరా?, నీ ముఖ ప్రీతి కోసం మాట్లాడుతూ ఉంటారా?. వచ్చే ఉపద్రవాన్ని కనిపెట్టి నీకు సలహా ఇవ్వగలిగిన మంత్రులు నీకు లేరా?. ఏమి రాజ్య పాలన చేస్తున్నావన్నయ్యా నువ్వు " అని అడిగాడు.

ఈ మాటలకి రావణుడికి కోపం వచ్చి " నేను తప్పే చేశాను అనుకో, దానిని దిద్దుబాటు చెయ్యమని నిన్ను నిద్రలేపాను తప్ప, నా తప్పుని పది మార్లు ఎత్తి చూపమని నిన్ను నిద్రలేపలేదు. నువ్వు ఉపకారం చెయ్యగలిగితే రామలక్ష్మణులని సంహరించు, లేకపోతె వెళ్ళి పడుకో, కాని ఇవ్వాల్టితో నీకు నాకు ఉన్న అనుబంధం తెగిపోతుంది " అన్నాడు.

అప్పుడు కుంభకర్ణుడు " ఎందుకన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు. నేను ఉండి కూడా నీకు ఉపకారం చెయ్యకపోతే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి. యుద్ధరంగానికి వెళ్ళి ఆ రాముడిని తప్పకుండా సంహరిస్తాను " అని బయలుదేరుతున్నాడు.

ఆ సమయంలోనే మహోదరుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి " కుంభకర్ణా! రాముడు అంత బలవంతుడు అంటూనే యుద్ధానికి వెళతానంటావేంటి. ఇలాంటప్పుడు యుద్ధం చెయ్యకూడదు, మోసాన్ని ప్రయోగం చెయ్యాలి. మనం ఒక అయిదుగురము బయలుదేరి రాముడి మీదకి యుద్ధానికి వెళదాము. అయిదుగురము రాముడి చుట్టూ చేరి ఆయనని నిగ్రహించగలిగితే అదృష్టవంతులం, ఒకవేళ రాముడిని నిగ్రహించలేకపోతె రామనామాంకితమైన బాణములు మన శరీరంలో గుచ్చుకుని ఉంటాయి.అప్పుడు మనం యుద్ధ భూమిలో ఉండకుండా వెనక్కి తిరిగొచ్చి రావణుడి కాళ్ళ మీద పడదాము. అప్పుడాయన ఫలాన అయిదుగురు వెళ్ళి రాముడిని సంహరించారు అని అందరికీ చెబుతాడు. అప్పుడు రావణుడు సీత కూర్చున్న చోట ఒక సభ నిర్వహించి మనన్ని కోరికలు కోరమంటాడు. అప్పుడు మనము డబ్బు, బంగారము, వాహనాలు అడుగుదాము. అవన్నీ రావణుడు సభలో మనకి ఇస్తాడు. అప్పుడు సీత అనుకుంటుంది ' ఇంత సభ జెరుగుతుంది, బయట భేరీలు మ్రోగుతున్నాయంటే రాముడు మరణించి ఉంటాడు. ఇంక రాముడు ఎలాగూ లేడు కదా....  ' అని చాలా కాలం సుఖాలకు దూరమైన స్త్రీ కనుక రావణుడి పాన్పు ఎక్కుతుంది. అప్పుడు రావణుడి కోరిక తీరుతుంది " అన్నాడు.

అప్పుడు రావణుడు " ఈ మహోదరుడికి రాముడితో యుద్ధం అంటె భయంరా, అందుకని ఇలాంటి నాటకాలన్నీ చెబుతున్నాడు " అని అన్నాడు.

అప్పుడు కుంభకర్ణుడు " మీరెవరు రావక్కరలేదు, నేనొక్కడినే వెళతాను " అన్నాడు.

అప్పుడు రావణుడు " నువ్వు ఒక్కడివే వెళ్ళద్దు, రాక్షస సైన్యాన్ని తీసుకొని వెళ్ళు " అని చెప్పి, కుంభకర్ణుడి మెడలో ఒక మాల వేశాడు.

అప్పుడా కుంభకర్ణుడు మంచి ఉత్తరీయము వేసుకొని, ఒక మంచి పంచె కట్టుకొని, శూలాన్ని పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెనకాల కొన్ని లక్షల సైన్యం అనుగమించి బయలుదేరింది.

యుద్ధ భూమిలోకి వచ్చిన కుంభకర్ణుడిని ఆ వానరాలు యంత్రము అనుకొని చూస్తున్నారు. హనుమకి, సుగ్రీవుడికి, సుషేనుడికి, గంధమాదనుడికి, నీలుడికి, మైందుడికి మొదలైన నాయకులకి వస్తున్నది యంత్రము కాదు కుంభకర్ణుడు అని తెలుసు. అందుకని వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు, శిలలు, చెట్లు పట్టుకెళ్ళి కుంభకర్ణుడిని కొడుతున్నారు. వాళ్ళు అలా కొడుతుంటే కుంభకర్ణుడు తన శూలాన్ని ఆడిస్తూ ఆ పర్వతాలని, చెట్లని కొట్టాడు, అప్పుడవి చూర్ణమయ్యి కిందపడ్డాయి. ఆయన తన అరి చేతులతో కొడుతుంటే వేలకు వేల వానరములు మరణిస్తున్నాయి. అలా మరణించిన వానరాలని నోట్లో వేసుకుని నములుతున్నాడు. ఆయన అలా నడుస్తూ వెళుతూ ఒక చేతితో 200 మంది వానరాలని పట్టుకొని నోట్లో వేసుకునేవాడు. ఆయన నోట్లోకి వెళ్ళిన వానరాలలో కొంతమంది ఆయన చెవుల నుండి బయటకి దుకేస్తున్నారు, కొంతమంది ఆయన ముక్కులో నుండి బయటకి దుకేస్తున్నారు. అలా బయటకి వస్తున్న వాళ్ళని కుంభకర్ణుడు మళ్ళి ఏరుకొని తినేస్తున్నాడు. పెద్ద పెద్ద భల్లూకాలని పట్టుకొని కొరుక్కుని తింటున్నాడు. ఆయన శూలం పెట్టి కొడుతుంటే కొన్ని వేల వానరాలు చనిపోయాయి.

అక్కడున్న వానరాలకి వచ్చింది యంత్రము కాదు రాక్షసుడే అని తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద నుంచి, పడిపోయిన వాళ్ళ మీద నుంచి దూకుకుంటూ పారిపోయారు. కొంతమంది చెట్లు ఎక్కేశారు, కొంతమంది పర్వత గుహలలో దాక్కున్నారు, కొంతమంది సముద్రంలో దూకేశారు, కొంతమంది సేతువు ఎక్కి పారిపోయారు.

అప్పుడు అంగదుడు వాళ్ళందరి దెగ్గరికి వెళ్ళి అన్నాడు " ఏరా మీరందరూ ఇలా పారిపోతున్నారు కదా, రేపు ఇంటికి వెళ్ళాక మీ భార్యలు మిమ్మల్ని అడిగితే ఏమి చెబుతారు. యుద్ధ భూమిలో కుంభకర్ణుడిని చూసి పారిపోయి వచ్చామని చెబుతార. మీ పౌరుషం ఏమయ్యింది " అని అందరినీ వెనక్కి తీసుకువస్తున్నాడు.

ఇంతలో నీలుడు, ఋషభుడు, గంధమాధనుడు, సుగ్రీవుడు మొదలైనవారు కుంభకర్ణుడి దెగ్గరికి వెళ్ళారు. అప్పుడా కుంభకర్ణుడు ఓ ఇద్దరిని చేతితో పట్టుకుని నలిపాడు. అప్పుడు వాళ్ళ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, కళ్ళల్లో నుంచి, చెవులలో నుంచి నెత్తురు వరదలై పారింది. తరువాత వాళ్ళని అవతలికి విసిరేశాడు. కాని వాళ్ళు చాలా దేహ ధారుడ్యం, బలము ఉన్నవాళ్లు కనుక కిందపడి మూర్చపోయారు. తరువాత ఆ కుంభకర్ణుడు కొంతమందిని పాదాలతో తన్నాడు, కొంతమందిని మోకాళ్ళతో పొడిచాడు. ఈలోగా సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి ఆయన మీద పడేశాడు. అది ఆ కుంభకర్ణుడి శరీరానికి తగిలి చూర్ణమయ్యి కిందపడిపోయింది. అప్పుడాయన తన శూలంతొ సుగ్రీవుడిని కొట్టాడు, ఆ దెబ్బకి సుగ్రీవుడు మూర్చపోయి కిందపడిపోయాడు, కాని మళ్ళి స్పృహ వచ్చి పైకి లెగబోతుంటే కుంభకర్ణుడు అన్నాడు " సుగ్రీవ! నీ జన్మ ఎటువంటిదో నీకు జ్ఞాపకం ఉందా, నువ్వు ఋక్షరజస్సు కొడుకువి(బ్రహ్మగారి కొడుకైన ఋక్షరజస్సు ఒకనాడు తెలియక శాపం ఉన్న ఒక సరస్సులొ స్నానం చేశాడు. అలా స్నానం చేసేసరికి ఆయన ఒక అప్సరస అయ్యాడు. అప్పుడు సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరస యుక్క తలోచెయ్యి పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరి వీర్యము స్కలనమయ్యింది. ఇంద్రుడు తన వీర్యాన్ని ఆ అప్సరస యొక్క వాల భాగమునందు విడిచిపెట్టాడు. సూర్యుడు తన వీర్యాన్ని ఆమె కంఠ భాగమునందు విడిచిపెట్టాడు. ఆ కంఠ భాగమునుండి సుగ్రీవుడు, వాల భాగమునుండి వాలి పుట్టారు. ఆ తరువాత బ్రహ్మగారు ఆ అప్సరసని తీసుకెళ్ళి ఇంకొక తటాకంలో స్నానం చేయించాడు, అప్పుడాయన మళ్ళి తన వానర రూపాన్ని పొందాడు). నేను నిన్ను విడిచిపెడతాన...." అని శూలం పట్టుకొని సుగ్రీవుడిని గట్టిగా కొట్టాడు. ఆ సుగ్రీవుడు నెత్తురు కక్కుతూ కిందపడిపోయాడు.

అప్పుడు హనుమంతుడు ఆ కుంభకర్ణుడి చేతిలో ఉన్న శూలాన్ని లాక్కుని తన తొడకేసి కొట్టి వంచేశాడు. అప్పుడా కుంభకర్ణుడు హనుమంతుడిని ఒక దెబ్బ కొట్టాడు, ఆ దెబ్బకి హనుమంతుడు నోటి వెంట రక్తం కక్కుతూ విచలితుడై పడిపోయాడు. తరువాత ఆ కుంభకర్ణుడు కిందపడిపోయి ఉన్న సుగ్రీవుడిని తన సంకలో పెట్టుకొని తిరిగి లంకలోకి వెళ్ళిపోదామని బయలుదేరాడు. ఆ సమయంలో హనుమంతుడు చూసి అనుకున్నాడు ' నాకు ప్రభువు అయినవాడిని శత్రువు అపహరిస్తుండగా సేవకుడనైన నేను వెళ్ళి ఆయనని రక్షిస్తే, అది ప్రభువుకి అమర్యాద. సుగ్రీవుడికే తెలివొస్తుంది, వేచి చూద్దాము " అని హనుమంతుడు అనుకున్నాడు.

ఈలోగా ఆ లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి సుగ్రీవుడిని తీసుకువస్తున్న కుంభకర్ణుడిని చూసి చాలా సంతోషం కలిగింది. వాళ్ళు అంతఃపుర గోపురముల మీదనుంచి, మేడల మీదనుంచి చందన ద్రవాలని కుంభకర్ణుడి మీద పోశారు. సువాసనతో కూడిన గంధపు నీళ్ళు మీద పడేసరికి సుగ్రీవుడికి తెలివొచ్చి వెంటనే కుంభకర్ణుడి చెవులు, ముక్కు కొరికేశాడు. తరువాత ఆయన డొక్కల్ని తన గోళ్ళతో చీల్చేశాడు. అలా చీల్చేసేసరికి బాధతో కుంభకర్ణుడు సుగ్రీవుడిని వదిలేశాడు. సుగ్రీవుడు వెంటనే ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు.

ఇంక ఆ కుంభకర్ణుడు కోపంతో మళ్ళి యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయనకి కోపం ఎక్కువ అవ్వడంతో వానరులతో, భల్లూకాలతో కలిపి రాక్షసులని కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇంక ఆ సమయంలో లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణ ప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కిందపడిపోతున్నాయి. అప్పుడాయన లక్ష్మణుడితో " ఏమో అనుకున్నాను కాని నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు. కాని పిల్లాడివి నీతో నాకు యుద్ధం ఏమిటి, నిన్ను చంపితే లాభం ఏమిటి. నేను రాముడిని చంపి వెళ్ళిపోతాను. నన్ను విడిచిపెట్టు, నేను రాముడి దెగ్గరి వెళతాను " అన్నాడు.

లక్ష్మణుడు కొట్టిన బాణాలకి, సుగ్రీవుడు కొరికిన దానికి ఆ కుంభకర్ణుడి శరీరం నుండి నెత్తురు కారుతోంది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు " వీడు ఇలా నిలబడి నడిచినంతసేపు అందరినీ చంపేస్తాడు. వీడు కిందపడిపోతే గొడవ వదిలిపోతుంది. అందుకని మొత్తం వానర సైన్యం అంతా ఎగిరి వెళ్ళి వాడి మీద కూర్చోండి. అప్పుడా బరువుకి వాడు కిందపడిపోతాడు " అన్నాడు.

అప్పుడు కొన్ని కోట్ల వానరాలు ఎగిరి వాడిమీదకి దూకారు. ఇంతమంది మీద పడేసరికి ఆ కుంభకర్ణుడు ఒకసారి తన శరీరాన్ని దులుపుకున్నాడు, అంతే, అన్ని వానరాలు కిందపడిపోయాయి. అప్పుడు అందరూ రాముడి దెగ్గరికి వెళ్ళారు. " రామ! ఈ కుంభకర్ణుడిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ నిగ్రహించలేరు. మీరొచ్చి ఈ కుంభకర్ణుడిని సంహరించండి " అన్నారు.

రాముడిని చూసిన కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని పరుగు పరుగున ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి వక్షస్థలంలోకి బాణములతో కొట్టాడు. ఆ బాణములు తగిలి రక్తం బాగా కారింది, కాని ఆ కుంభకర్ణుడు ఇంకా వ్యగ్రతని పొంది రాముడి మీదకి వస్తున్నాడు. ఇంక వీడిని నిగ్రహించకపోతే కష్టమని రాముడు భావించి, తీవ్రమైన ములుకులు కలిగిన బాణములని ప్రయోగించాడు. ఆ బాణములు ఆ కుంభకర్ణుడి వక్షస్థలంలో తగిలి వాడి చేతిలో ఉన్న ఆయుధములు జారిపోయి, కళ్ళు తిరిగినంత పనయ్యింది. తరువాత రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుడి కుడి చెయ్యి నరికేశాడు. ఆ చెయ్యి కిందపడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరాలు పడి చనిపోయాయి. అప్పుడా కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టుని పట్టుకుని రాముడి మీదకి వచ్చాడు, అప్పుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడి ఎడమ చేతిని భుజం వరకూ నరికేశాడు.

రెండు చేతులు పోయినా ఆ కుంభకర్ణుడు తన పాదాలతో వానరాలని తొక్కడం ప్రారంభించాడు. అప్పుడు రాముడు రెండు అర్ధచంద్రాకార బాణములతో వాడి రెండు తొడలని నరికేశాడు. తరువాత వాడి శిరస్సుని ఖండించారు. అప్పుడు వాడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోయింది, మిగిలిన సగభాగం లంకా ద్వారం వరకూ పడిపోయింది.

కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ " అయ్యయ్యో, నిద్రపోతున్నవాడిని లేపి నిష్కారణంగా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని, ఇంద్రుడిని ఓడించాడో అటువంటి నా తమ్ముడు ఇవ్వాళ రాముడి చేతిలో నిహతుడయిపోయాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడి ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర, మహాపార్ష, ప్రహస్తులు ఎవ్వరూ నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుడిని అవమానించి వెళ్ళగొట్టాను. ఇప్పుడు కుంభకర్ణుడు మరణించాడు, నా కుడి భుజం ఇవ్వాళ విరిగిపోయింది " అని కిందపడి ఏడుస్తుంటే, రావణుడి యొక్క కుమారులు, కుంభకర్ణుడి యొక్క కుమారులు అక్కడికి వచ్చారు.

వాళ్ళన్నారు " నాన్నగారు! మీరు అంత బాధ పడకండి. మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్టుగా రామలక్ష్మణులని నిగ్రహించి వస్తాము " అన్నారు.

అప్పుడు రావణుడు " ఇప్పటికయినా నా కోరిక తీర్చండి " అన్నాడు.

అప్పుడు యుద్ధరంగంలోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిలిని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి, వాడు తల పగిలి చనిపోయాడు. తదనంతరం మహోదరుడిని నీలుడు సంహరించాడు. దేవాంతకుడిని, త్రిశిరుడిని (మూడు తలకాయలతో ఉంటాడు) హనుమంతుడు సంహరించాడు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు.

ఆ తరువాత అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు " విభీషణ! అంత పెద్ద శరీరంతో ఉన్నాడు, అసలు వాడెవడు " అని అడిగాడు.

అప్పుడు విభీషణుడు " ఆయన సామాన్యుడు కాదు. ఆయన వేదం చదువుకున్నాడు, బ్రహ్మగారి దెగ్గర వరాలు పొందాడు. ఆయన కవచాన్ని ఎటువంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు. అందుచేత అతనిని నిహతుడిని చెయ్యడం చాలా కష్టం " అన్నాడు.

ఆ అతికాయుడు యుద్ధంలో చాలా మందిని నెత్తురు కారేటట్టు కొట్టాడు, ఎందరినో నిగ్రహించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అతికాయుడితో యుద్ధం చెయ్యబోతుంటే వాడన్నాడు " లక్ష్మణా! నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి. నేను అతికాయుడిని, చిన్న చిన్న వాళ్ళతో నేను యుద్ధం చెయ్యను, అలా చెయ్యడం నాకు అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయివాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో " అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు " ఈ డాబులెందుకురా, నాతో యుద్ధం చెయ్యి " అన్నాడు.

అతికాయుడన్నాడు " పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతావు, నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు. ఆ తరువాత నీ శరీరం పడిపోయాక బాధ పడతావు. వెళ్ళి రాముడిని పిలువు " అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు " నీ బతుక్కి రాముడు కావాలేంటి, నీకు నేను సమాధానం చెబుతాను " అని అర్ధచంద్రాకార బాణాలని అతికాయుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలాక వాడన్నాడు " అబ్బో నీతో యుద్ధం చెయ్యవలసిందే " అని ఐంద్రాస్త్రం, వాయువ్యాస్త్రం మొదలైన ఎన్నో అస్త్రాలని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రములన్నిటికి లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములను ప్రయోగించినా, ఎన్ని అస్త్రములను ప్రయోగించినా, అన్నీ వాడి యొక్క కవచానికి తగిలి పడిపోతున్నాయి.

ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో " వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఆ కవచం. వాడు ఆ కవచం పెట్టుకుని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా ఆ కవచం పగలదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది " అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అతికాయుడిని సంహరించాడు.

అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు క్రుద్ధుడై, సామాన్యమైన వారిని పంపిస్తే వీలులేదని మళ్ళి ఇంద్రజిత్ ని పిలిచి " నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమయ్యింది " అన్నాడు.

అప్పుడా ఇంద్రజిత్ 4 గుర్రములు పూన్చిన రథం ఎక్కి అనేకమంది సైన్యంతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మొహరించి ఉంది, కాని ఇంద్రజిత్ మాత్రం కొంతసేపు ఎవరికీ కనపడలేదు.(ఆ సమయంలో చుట్టూ మోహరించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్ సమిధలు, పుష్ప మాలికలు, ఎర్రటి వస్త్రాలతో అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక ఆ హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకిలేస్తుంది, అప్పుడు ఒక నల్ల మేకని పట్టుకొచ్చి తన పళ్ళతో దాని కంఠాన్ని కొరికి, మెడ చీల్చి, ఆ మేక మాంసాన్ని ఆ హోమాగ్నిలో వేస్తాడు {వీటిని ఆభిచారిక హోమాలు అంటారు, ఇవి చాలా ప్రమాదకరమైనవి}. అప్పుడా పుష్పాలని, అక్షతలని తన ఆయుధముల మీద వేసి, ఎర్రటి వస్త్రాలు కట్టుకొని, రథం ఎక్కి మాయమయిపోతాడు, ఇంక ఎవరికీ కనపడడు. ఆ ఇంద్రజిత్ గుర్రాల చప్పుడు కాని, వాడి ధనుస్సు యొక్క శబ్దము కాని, వాడి బాణ ప్రయోగం కాని ఎవరికీ వినపడదు, అర్ధం కాదు. ఆయనకి అందరూ కనపడతారు, కాని ఆయన ఎవరికీ కనపడడు. ఒక్క విభీషణుడు మాత్రమే ఆయనని మాయా బలంతో చూడగలడు)

హోమాన్ని పూర్తి చేసిన ఇంద్రజిత్ రథం ఎక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేసి, బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆవాహన చేసుకున్నాడు. ఆయన రథం ఎక్కగానే ఆ రథం ఎవ్వరికీ కనపడలేదు, అప్పుడాయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మేఘాల మధ్యకి వెళ్ళిన ఇంద్రజిత్ దిక్కులని, విదిక్కులని మంచుతొ కప్పేసి, ధనుష్టంకారం కూడా వినపడకుండా కొన్ని వేల బాణాలను ప్రయోగం చేసి హనుమంతుడిని, సుగ్రీవుడిని, ద్వివిదుడిని, మైందుడిని, అంగదుడిని, గంధమాదనుడిని, జాంబవంతుడిని, సుషేణుడిని, వేగదర్సిని, నీలుడిని, గావాక్షుడిని, కేసరిని మొదలైన అనేకమంది వానర వీరులని తన బాణములతో కొట్టి భూమి మీద పడేశాడు. అన్ని కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్రం చేత కట్టి పడేశాడు.

అప్పుడు వాడు పైనుంచి ఒక పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులతో అన్నాడు " ఒకసారి నాగ పాశాలతో మిమ్మల్ని కట్టాను, కాని మీరు విడిపించుకున్నారు. ఇవ్వాళ బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని కట్టేస్తాను, ఇవ్వాల్టితో యుద్ధం అయిపోతుంది " అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! ఇవ్వాళ మనకి వేరొక దారిలేదు. వాడు బ్రహ్మగారికి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు, ఆ బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టచ్చు, కాని వాడు మాయా యుద్ధం చేస్తున్నాడు, కనుక మనం వాడిని కొట్టలేము. అందుచేత వాడు కొడుతున్న బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో, తరువాత స్పృహతప్పినవాడు పడిపోయినట్టు రణభూమిలో పడిపో. అప్పుడు వాడు ఎన్ని బాణములు కొట్టాలో అన్ని బాణములతో మన శరీరాలని కొడతాడు. అలా కొట్టేశాక శత్రువు మరణించాడనుకొని, జయలక్ష్మిని పొందాననుకొని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బతికుంటే చూద్దాము. ముందు వాడిని కొట్టెయ్యని " అన్నాడు.

అప్పుడు ఇంద్రజిత్ రామలక్ష్మణులిద్దరినీ బాణాలతో కొట్టేశాడు. ఇద్దరి శరీరాల నిండా బాణాలతొ కొట్టాడు, నెత్తురు వరదలై కారిపోయింది. వాడి బాణ పరంపరని తట్టుకోలేక రామలక్ష్మణులిద్దరూ భూమి మీద పడిపోయారు. అప్పుడు వాడు వికటాట్టహాసం చేసి చూసేసరికి ఆ యుద్ధ భూమిలో నిలబడి ఉన్నవాడు ఎవడూ లేడు, అందరినీ ఒక్కడే కొట్టేశాడు, మొత్తం 67 కోట్ల వానర సైన్యాన్ని ఇంద్రజిత్ ఒక్కడే కొట్టాడు. తరువాత వాడు అంతఃపురానికి వెళ్ళి రావణుడితో " రామలక్ష్మణులిద్దరినీ బ్రహ్మాస్త్ర బంధనం చేశాను, వాళ్ళు పడిపోయి ఉన్నారు " అని చెప్పాడు.

ఇంద్రజిత్ బాణములు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధ భూమినుంచి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనని ఏ అస్త్రము బంధించలేదు. ఆ విభీషణుడు హనుమంతుడు కలుసుకొని " అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు విదిచిపెట్టేశార? " అని ఒక కాగడా పట్టుకొని ఆ యుద్ధ భూమిలో వెతికారు.( ఇంద్రజిత్ అందరినీ కనురెప్పలు కూడా తెరవడానికి వీలులేకుండా బాణాలతో కొట్టాడు)

అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు, అప్పుడు విభీషణుడు " జాంబవంత! నీకు స్పృహ ఉందా, మేము మాట్లాడుతుంది నీకు అర్ధం అవుతుందా " అని అడిగాడు.

అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తి అన్నాడు " నాయనా, నీ కంఠం చేత గుర్తుపట్టానయ్య, నువ్వు విభీషణుడివి కదా. హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా? " అని అడిగాడు.

విభీషణుడు అన్నాడు " నువ్వు పెద్దవాడివి, వానర యోధులకందరికి కూడా నువ్వు తాతవంటి వాడివి. అటువంటి నువ్వు  రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగారు " అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు అన్నాడు " మొత్తం వానర సైన్యం అంతా మరణించని, హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళి వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి ఉండని, హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు, హనుమ ఉన్నాడా? " అని అడిగాడు.

వెంటనే హనుమంతుడు జాంబవంతుడి పాదాలు పట్టుకొని " తాత! హనుమ నీకు నమస్కరించుచున్నాడు " అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు " అందరినీ రక్షించగలిగినవాడివి నువ్వే. ఆలస్యం చెయ్యకుండా ఉత్తర క్షణం బయలుదేరి హిమాలయ పర్వతాలకి వెళ్ళు. అక్కడ కైలాశ పర్వతం పక్కన ఓషది పర్వతం ఒకటి ఉంది. దానిమీద ఉండే మృతసంజీవని (దీని వాసన చూస్తే చనిపోయిన వాళ్ళు బతుకుతారు) , విశల్యకరణి (దీని వాసన చూస్తే, శరీరంలో బాణపు ములుకులు గుచ్చుకుని ఉంటె అవి కింద పడిపోతాయి), సంధానకరణి (దీని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి), సౌవర్ణకరణి (దీని వాసన చూస్తే, ముర్చపోయిన వాళ్ళకి తెలివి వస్తుంది) అనే నాలుగు ఓషదులని తీసుకురా " అన్నాడు.

జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి, మెరుపు వెళ్లినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. హనుమంతుడు తీవ్రమైన వేగంతో హిమాలయ పర్వతాలని చేరుకొని, ఓషది పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయాల మీద ఆయనకి బ్రహ్మగారి ఇల్లు కనపడింది, అక్కడే పరమ శివుడు తన ధనుస్సుని పెట్టే ఒక పెద్ద అరుగు కనపడింది. అక్కడే హయగ్రీవుడిని ఆరాధన చేసే ప్రదేశం కనపడింది, సూర్య భగవానుడి కింకరులు ఉండే ప్రదేశం కనపడింది, అక్కడే ఇంద్రుడు ఉండే గృహం, కుబేరుడు ఉండే గృహం కనపడింది, అక్కడే సూర్య భగవానుడిని విశ్వకర్మ చెక్కిన వేదిక కనపడింది.

తరువాత ఆయన ఆ ఓషది పర్వతం కోసం వెతికాడు.

ఆ ఓషది పర్వతంలోని ఓషదులు తమని ఎవరో తీసుకుపోడానికి వస్తున్నారని, అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోయాయి.

ఆ ఓషదులను చూసిన హనుమంతుడు " ఆ ఓషదులని నాకు కనపడకుండా దాస్తార, రామ కార్యానికి సాయం చెయ్యరా " అని ఆ పర్వత శిఖరాన్ని పీకి, చేతితో పట్టుకొని వాయు వేగంతో ఆ శిఖరాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టాడు.

అలా పెట్టేసరికి వాటి వాసనలు పీల్చిన ఇన్ని కోట్ల వానరాలు పైకి లేచిపోయాయి, రామలక్ష్మణులు పైకి లేచారు.

అప్పుడు హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి ఆ హిమాలయ పర్వతాల దెగ్గర పెట్టి వచ్చేశాడు.

అప్పుడు సుగ్రీవుడు అన్నాడు " మనన్ని బ్రహ్మాస్త్ర బంధనం చేసి వెళ్ళిన ఇంద్రజిత్ కి బుద్ధి రావాలి. అందుకని మీరందరూ ఒకసారి ఎగిరి లంకలోకి దూరిపోండి, కాగడాలు పట్టుకొని లంకనంతా కాల్చెయ్యండి " అన్నాడు.

సుగ్రీవుడు అలా అనంగానే ఇన్ని కోట్ల వానరాలు లంక యొక్క అంతఃపురాల మీద పడిపోయి రావణ అంతఃపురంతో సహా అన్ని ఇళ్ళని అగ్నికి ఆహుతి చేశారు. ఆ ఇళ్ళల్లో ఉన్న రకరకాల వస్త్రాలు, బంగారు పాత్రలు, ముత్యాలు, రత్నాలు మొదలైనవన్నీ కాలిపోయాయి. బాలురు, వృద్ధులు మినహాయించి లంకలో ఉన్న మిగిలిన మూలబలంలోని రాక్షసులు చాలామంది కాలిపోయారు. ఇదేసమయంలో రామచంద్రమూర్తి క్రుద్ధుడై ధనుష్టంకారం చేశాడు. ఒకపక్క ధనుష్టంకారం, ఒకపక్క వానర ఘోష, ఒకపక్క రాక్షసుల అరుపులు, ఒకపక్క రామ బాణ పరంపర వచ్చి లంకా పట్టణ ప్రాసాదముల మీద పడిపోతుంది. ఎక్కడా చూసినా అరుపులతో పరిస్థితి ఘోరంగా ఉంది.

అప్పుడు రావణుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభుడు, నికుంభుడిని యుద్ధానికి పంపాడు. వాళ్ళతో పాటు ప్రజంఘుడు, మకరాక్షుడు అనే తన కుమారుడిని యుద్ధానికి పంపాడు.

అప్పుడు సుగ్రీవుడు కుంభుడిని, హనుమంతుడు నికుంభుడిని, అంగదుడు ప్రజంఘుడిని, రాముడు మకరాక్షుడిని సంహరించారు.

ఈ వార్త విన్న రావణుడు విశేషమైన శోకాన్ని పొంది, మళ్ళి ఇంద్రజిత్ ని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు.

ఆ ఇంద్రజిత్ మళ్ళి అదృశ్యమయిపోయి బాణ పరంపరతో వానరాలని కొట్టడం మొదలుపెట్టాడు.

అప్పుడు లక్ష్మణుడు రాముడితో " అన్నయ్య! వీడు ఎన్నోసార్లు యుద్ధానికి వస్తున్నాడు. నువ్వు నాకు అనుమతిని ఇవ్వు, సమస్త రాక్షసజాతి నశించిపోవాలని సంకల్పించి, అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాను " అన్నాడు.

రాముడన్నాడు " పారిపోతున్నవాడిని, ప్రమత్తుడై ఉన్నవాడిని, కనపడకుండా మాయా యుద్ధం చేస్తున్నవాడిని, వెన్ను చూపి పారిపోతున్నవాడిని, శరణాగతి చేసినవాడిని కొట్టకూడదు. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం క్షోభిస్తుంది. అందుకని ఒక్కడిని సంహరించడం కోసం అలాంటి అస్త్ర ప్రయోగం చెయ్యకూడదు. మనం అదును చూసి, వాడు ఎటువైపు తిరుగుతున్నాడో, బాణాలు ఎటువైపు నుండి వస్తున్నాయో చాలా నిశితంగా పరిశీలించు. ఇవ్వాళ వాడు ఎక్కడో అక్కడ దొరకకపోడు, అప్పుడు తీవ్రమైన వేగం కలిగిన బాణములతో ఇంద్రజిత్ ని కొట్టి భూమి మీద పడేస్తాను. లక్ష్మణా! ఇది నా ప్రతిజ్ఞ " అన్నాడు.

రాముడి మాటలను విన్న ఇంద్రజిత్ అనుకున్నాడు ' ఈ రామలక్ష్మణులు నన్ను కనిపెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి నేను ఏదో ఒక మోసం చేసి, రామలక్ష్మణుల దృష్టిని నా నుంచి మరల్చాలి ' అనుకుని ఆలోచించాడు. అప్పుడాయన వెంటనే సీతమ్మని మాయ చేత సృష్టించి తన రథంలొ కుర్చోపెట్టాడు.

ఆయనకి ఎదురుగా హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకొని వస్తున్నాడు. అప్పుడా ఇంద్రజిత్ తన రథంలో ఉన్న మాయా సీత చెంపల మీద ఎడాపెడా కొట్టాడు. వాడు అలా కొడుతుంటే ఆవిడ ' హా రామ, హా రామ ' అని ఏడుస్తోంది. అలా ఏడుస్తున్న సీతమ్మని చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కిందపడేసి, ఏడుస్తూ " దుర్మార్గుడా, ఆమె మహా పతివ్రత, రామ కాంత. సీతమ్మని అలా కొడతావ, నాశనమయిపోతావురా నువ్వు, నేను, సుగ్రీవుడు నిన్ను విడిచిపెట్టము, నీ శిరస్సు గిల్లేస్తాను. సీతమ్మని వదులు " అని హనుమంతుడు బాధతో ఏడుస్తూ అరిచాడు.

అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు " ఆమె స్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కాని మాకు దుఃఖాన్ని కల్పించింది కాబట్టి ఈమెని మాత్రం నేను విడిచిపెట్టను " అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆమె శరీరాన్ని చీరేశాడు. అప్పుడా మాయా సీత మరణించి ఆ రథంలో పడిపోయింది. తరువాత ఇంద్రజిత్ ఆ రథంతో వెళ్ళిపోయాడు.

ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధం మానేసి, ఏడుస్తూ, పెద్ద పెద్ద కేకలు వేస్తూ " ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తారురా. ఏ తల్లిని రక్షించడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు. ఇంక నేను యుద్ధం చెయ్యను " అని ఏడుస్తూ రాముడి దెగ్గరికి వెళ్ళి " రామ! దుర్మార్గుడైన ఇంద్రజిత్ వానరులందరూ చూస్తుండగా సీతమ్మని తీసుకొచ్చి, సంహరించి తీసుకెళ్ళిపోయాడు. ఇంక సీతమ్మ లేదు " అని చెప్పాడు.

ఈ మాటలు విన్న రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు.

తరువాత వాళ్ళు రాముడి ముఖం మీద కొన్ని నీళ్ళు పోసి ఆయనని లేపారు.

అప్పుడు లక్ష్మణుడు అన్నాడు " అన్నయ్యా! నువ్వు ధర్మము ధర్మము ధర్మము అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు. ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్య భ్రష్ట్రుడివి అయ్యావు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల తండ్రిగారు మరణించారు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సీతమ్మ అపహరింపబడింది, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల జటాయువు మరణించాడు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల 14 సంవత్సరాలుగా అరణ్యాలలో తిరుగుతున్నావు. ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కులుకుతున్నాడు, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు, ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు. ఇంకా ధర్మము ధర్మము అని ఎందుకంటావు అన్నయ్యా, ఆ ధర్మాన్ని విడిచిపెట్టు. మనం కూడా అధర్మాన్నే స్వీకరిద్దాము " అన్నాడు.

వెంటనే విభీషణుడు పరుగు పరుగున వచ్చి " ఎంతమాటన్నావు లక్ష్మణా, సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడనుకున్నావ? ఎంతోమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టనివాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకుంటాడ. ఆ ఇంద్రజిత్ మహా మాయావి, మీరు అంతలోనే వాడి మాయ మరిచిపోయారు. వాడు మాయా సీతని సంహరించి తీసుకుపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా. పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది, దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి నికుంభిలా హోమం చేస్తాడు. అక్కడ వాడు నికుంభిలా దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి, వాడి గుర్రాల మీద, ఆయుధముల మీద ఆ అక్షతలని చల్లుకొని యుద్ధ రంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చెయ్యలేడు. సీతమ్మ చనిపోయింది అనుకుని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, కాని వాడు అక్కడ హోమం చేస్తుంటాడు. రామ! నన్ను అనుగ్రహించు, నాతో లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవకుండానే వాడిని సంహరిస్తాను " అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి, హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు.

విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటుకి తీసుకెళ్ళాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చెయ్యడం కోసం సిధ్దపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడుచెయ్యకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు.

అప్పుడు విభీషణుడు " లక్ష్మణా! నువ్వు ఒకపక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కొట్టి కాకావికలం చెయ్యి, అప్పుడు ఇంద్రజిత్ కనపడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముట్టించెయ్యాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చుని హోమం చెయ్యలేడు. కాబట్టి రథం ఎక్కి వస్తాడు, అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి " అన్నాడు.

వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడా సైన్యం పక్కకి తప్పుకుంది, వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఆ మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరవీరభయంకరుడై ఆ రాక్షసులని మర్దించేశాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షస సైన్యం నిలబడలేక పెద్ద హాహాకారాలు చేశారు. ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్ హోమాన్ని ఆపి ' ముందు హనుమంతుడిని సంహరించి, అప్పుడు హోమం చేస్తాను ' అని అనుకొని రథం ఎక్కాడు. అప్పుడాయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. ఆ టంకారానికి ఇంద్రజిత్ లక్ష్మణుడి వైపు చూశాడు.

అప్పుడు లక్ష్మణుడు " దుర్మార్గుడా, హనుమతో యుద్ధం ఎందుకు, నీతో యుద్ధం చెయ్యడానికి నేను వచ్చాను. పౌరుషం ఉంటె నాతో యుద్ధం చెయ్యి " అన్నాడు.

అప్పుడు ఇంద్రజిత్ " ఇంతకముందు నిన్ను రెండు మూడుసార్లు కొట్టాను, అయినా బుద్ధి లేకుండా మళ్ళి వచ్చావు. చూడు నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవ్వాళ " అని ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు.

లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని ఇంద్రజిత్ చూసి అన్నాడు " నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు, నువ్వు స్వయానా నా తండ్రికి తమ్ముడివి, నాకు పినతండ్రివి. నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి ఇవ్వాళ శత్రువులతో చేతులు కలిపావే నీకు ఇలా చెయ్యడానికి సిగ్గుగా లేదా. శత్రువులతో చేతులు కలిపి తనవారిని చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతులలోనే చనిపోతాడు " అన్నాడు.

విభీషణుడు అన్నాడు " నీ తండ్రియందు, నీయందు పాపం ఉంది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకి వచ్చాను " అన్నాడు.

అప్పుడు ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి ఘోరమైన యుధం జెరిగింది. ఇద్దరూ ఒకరిని ఒకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకి ఇంద్రజిత్ యొక్క ధనుస్సు ముక్కలయిపోయింది. తరువాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరూ సింహాలలా యుద్ధం చేశారు. విభీషణుడు ఆ రాక్షసుల మీద బాణాలని వేసి వాళ్ళని సంహరించాడు.

ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జెరిగింది. ఆఖరికి ఇంద్రజిత్ యొక్క సారధిని లక్ష్మణుడు కొట్టాడు. అప్పుడా ఇంద్రజిత్ ఒక చేతితో సారధ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. అప్పుడు నలుగురు వానర వీరులు ఆ రథం యొక్క గుర్రాలని కిందకి లాగేసి ఆ రథాన్ని నాశనం చేశారు.

లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలని వేసినా ఇంద్రజిత్ సంహరింపబడకపోయేసరికి విభీషణుడు అన్నాడు " ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్ ని సంహరించు " అన్నాడు.


    ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది
    పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్

అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి, వింటినారికి తొడిగి " మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, దశరథుడి కొడుకే అయితే, పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది అయిన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక " అని బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది. ఇంద్రజిత్ మరణించాడు.

ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీదనుండి కిందపడి దీర్ఘమూర్చని పొందాడు. తరువాత ఆయన అన్నాడు " నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడనివాడు, ఇవ్వాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంక నాకీ జీవితం ఎందుకు. అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరించేస్తాను " అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ ఒణికిపోయింది. రావణుడు సీతమ్మని చంపుదామనుకునేసరికి మహాపార్షుడు అక్కడికి వచ్చి అన్నాడు " ఇంత బతుకు బతికి, ఇంత చదువు చదివి, ఇంతమందిని ఓడించి, ఇంతమందీ చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూటకట్టుకుంటావ రావణా. నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు, అంతేకాని ఆడదానిమీద ఎందుకు నీ ప్రతాపం " అన్నాడు.

అప్పుడు రావణుడు " రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తాను " అని అంతఃపురానికి వచ్చేశాడు.

మరునాడు రావణుడు విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్షుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు.

ఆ యుద్ధంలో విరూపాక్షుడిని, మహోదరుడిని సుగ్రీవుడు చంపాడు, మహాపార్షుడిని అంగదుడు చంపాడు.

అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనుస్సుని పట్టుకొని బాణాలు వేస్తుంటే, లోపలినుంచి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడదో, అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి, ఏనుగుల తొండాలు తెగిపోతున్నాయి, గుర్రాలు కాళ్ళు తెగి పడిపోతున్నాయి, లక్షల రాక్షస సైన్యం పడిపోతుంది కాని రాముడు మాత్రం కనపడడం లేదు. ఆ సమయంలో రాముడు అగ్ని చక్రం తిరిగినట్టు తిరుగుతూ, మండలాకారంగా(వృత్తాకారంలో) ధనుస్సుని పట్టుకుని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసులని కొట్టాడు.

' తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైనవాడు ఆ విభీషణుడు ' అనుకొని, రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా, లక్ష్మణుడు బాణములతో ఆయన చేతిని కొట్టాడు. ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు, అప్పుడా శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుండి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్చపోయి కిందపడిపోయాడు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్ళి రాముడి దెగ్గర పెట్టాడు.

అప్పుడు రాముడన్నాడు " నా చేతిలోనుంచి ధనుస్సు జారిపోతోంది, మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కాని తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు " అని బాధపడ్డాడు.

అప్పుడు హనుమంతుడు " రామ! నువ్వు బెంగపెట్టుకోకు, లక్ష్మణుడిని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు " అని మళ్ళి ఆకాశంలోకి ఎగిరి, హిమాలయ పర్వతాలని చేరుకొని అక్కడున్న ఓషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు సుషేణుడు ఆ ఓషదులని లక్ష్మణుడి ముక్కులో పిండాడు, ఆ ఓషదుల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్ళి పైకి లేచాడు.

" ఇంక నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో " అని రాముడు ముందుకి బయలుదేరాడు. ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు ' దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు ' అని అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన సారధి అయిన మాతలిని రాముడికి సహాయం చెయ్యమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు.

అప్పుడా మాతలి రాముడితో అన్నాడు " రామ! ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు. దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి. పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మింపబడినది. ఇందులో అక్షయబాణ తూణీరాలు, ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనుస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారధ్యం చేస్తాను. శ్రీ మహావిష్ణువుని గరుడుడు వహించినట్టు నేను మీకు సారధ్యం చేస్తాను. మీకు ఇవ్వమని చెప్పి ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని స్వీకరించండి " అన్నాడు.

రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు. అప్పుడు రాముడికి రావణుడికి చండప్రచండమైన యుద్ధం జెరిగింది. రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు వెనక్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జెరుగుతుండగా ఆకాశం అంతా చీకటిగా అయిపోయింది. పగటి వేళలో వాళ్ళిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది. అప్పుడు రాముడన్నాడు " ఇంక మీరెవ్వరు యుద్ధం చెయ్యకండి, అలా నిలబడి చూడండి. రావణుడో రాముడో తేలిపోవాలి " అన్నాడు.

అటుపక్క రాక్షసులు, ఇటుపక్క వానరాలు నిలబడిపోయి రామ-రావణ యుద్ధాన్ని చూస్తున్నాయి. రావణుడు 20 చేతులతో ఆయుధాలని రాముడి మీదకి ప్రయోగిస్తున్నాడు. ఆ సమయంలో రావణుడు శక్తి అనే అస్తాన్ని రాముడి మీదకి విడిచిపెట్టాడు. అప్పుడు రాముడనుకున్నాడు ' ఈ రథం ఎక్కాక, లక్ష్మణుడు బతికాక, నాకు విపరీతమైన ఆనందం కలుగుతోంది. అన్ని అస్త్ర-సస్త్రాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఉత్సాహం పొటమరిస్తోంది ' అనుకొని, ఇంద్రుడు ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు. ఇద్దరి యొక్క శక్తులు ఆకాశంలో కొట్టుకొని నిర్వీర్యం అయ్యి కిందపడిపోయాయి. ఆ తరువాత రాముడు వేసిన బాణాలని రావణుడు తట్టుకోలేకపోయాడు, ఆయన చేతిలోని ధనుస్సు విరిగిపోయింది. అటువంటి సమయంలో రావణుడి సారధి ఆయన రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు.

అప్పుడు రావణుడు ఆ సారధితో " ఛి నీచుడ! నా జీవితంలో లేదు ఇటువంటి అప్రతిష్ట. యుద్ధభూమిలో ఉండగా నా తలలు తెగిపోయినా పరవాలేదు, కాని నువ్వు రథాన్ని చాటుకి తీసుకొచ్చి దాచావు. నువ్వు శత్రువుల దెగ్గర లంచం తీసుకున్నావు కనుకనే ఇలాంటి పని చేశావు, నిజం చెప్పు? " అన్నాడు.

అప్పుడా సారధి " మీ దెగ్గర ఇంత కాలం పని చేశాను. ఇప్పుడు ఒకరి దెగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని అవమానించవలసిన అగత్యం నాకు లేదు. నేను శాస్త్రం తెలియనివాడిని కాదు, మర్యాద తెలియనివాడిని కాదు, రధికుడు రథంలో ఉండగా ఎలా నడపాలో తెలియని భ్రష్టుడిని కాదు. నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తిన్నాను, మీయందు కృతజ్ఞుడనై ఉన్నాను. ద్వంద యుద్ధం జెరుగుతున్నప్పుడు సమయోచితంగా అవసరాన్ని బట్టి రథాన్ని దెగ్గరికి తీసుకెళ్ళాలి, దూరంగా కూడా తీసుకెళ్ళాలి, గుర్రాలు అలసిపోతున్నాయేమో చూసుకోవాలి, వెనుకన ఉన్న రథియొక్క పరిస్థితిని గమనించుకోవాలి. రాముడి బాణపు వేడి చేత గుర్రాలు శోషించిపోయాయి, తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేని నీరస స్థితిని మీరు పొందుతున్నారు. అప్పుడు రథికుడిని రక్షించుకోవలసిన బాధ్యత సారధికి ఉంది, అందుకని నేను రథాన్ని వెనక్కి తెచ్చాను. అంతేకాని ఒకరి దెగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని తేవలసిన అవసరం నాకు లేదు, మీ సేవలో ధన్యుడను అవ్వడానికి నీతికి కట్టబడిన సారధిని నేను " అన్నాడు.

అప్పుడు రావణుడు " నేను నిన్ను ఎన్ని మాటలు అన్ననురా సారధి. నువ్వు ఉత్తమ సేవకుడివి " అని చెప్పి, తన చేతికున్న స్వర్ణ కంకణాన్ని తీసి సారధికి ఇచ్చాడు.

ఈ సమయంలోనే లంకా పట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు " ఆ శూర్పణఖ జుట్టు తెల్లబడిపోయి వృద్ధురాలు అయిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైన, వికృతమైన స్వరూపంతో ఉంటుంది, జారిపోయిన కడుపు ఉన్నది, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణఖ మన్మదుడితో సమానమైన ఆకృతి కలిగినవాడిని, అంత మధురముగా మాట్లాడగలిగినవాడిని, అటువంటి సౌందర్య రాశిని, చక్కటి నడువడి కలిగినవాడిని, సర్వకాలములయందు ధర్మమును అనుష్టించేవాడు అయిన రాముడిని ఏ ముఖం పెట్టుకొని కామించింది? రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే, కడుపులో కక్ష పెంచుకుని సీతాపహరణానికి దారితీసేటట్టుగా రావణుడి మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా ఎలా మాట్లడగలిగింది?  రావణుడు ఎంత మూర్ఖుడు, రాముడు అరణ్యంలో 14,000 మంది రాక్షసులని, ఖర-దూషణులని సంహరించాడు. అలాంటివాడితో సంధి చేసుకుందాము అన్న ఆలోచన లేకుండా శూర్పణఖ మాటలు విని సీతని అపహరించడానికి వెళ్ళాడు.

పోని అప్పటికి రాముడు అంత పరాక్రమము ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి, ఋష్యమూక పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకొని, వాలిని ఒక్క బాణంతో సంహరించి, చేసుకున్న స్నేహానికి, ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్టించినప్పుడైనా రావణుడి కళ్ళుతెరుచుకోలేదా.  

పోని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు ' అన్నయ్యా, నువ్వు రాముడిని నిగ్రహించలేవు, లంక అంతా నాశనమయిపోతుంది. నువ్వు చేసినది పాపపు నడువడితో కూడిన పని. నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి ఇచెయ్యి ' అని చెప్పాడు. విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటె ఇవ్వాళ లంకా పట్టణానికి ఇంతటి చేటుకాలం దాపురించేది కాదు. తోడపుట్టినవాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు, తన కుమారులైన నరాంతకుడు, అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు, మహోదర, మహాపార్షులు మొదలైనవారు మరణించారు, ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావట్లేదే?

ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడములను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దెగ్గరికి వెళ్ళి ' అయ్యా! రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేకపోతున్నాము, నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు. ఇవ్వాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడడానికి భయపడుతుంది, సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు, అలా దిక్పాలకులని కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు. వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి, మేము ఎలా జీవించాలి ' అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు ' నేను ఇవ్వాల్టి నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు, దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది ' అని అన్నారు.

దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు. త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసినవాడైన పరమశివుడు ఆ దేవతలయందు ప్రీతి చెంది, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి ' ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా, సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది ' అని ఆరోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు. అందుచేత రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోడానికి, ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చెయ్యడానికి, రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళ రాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు " అని ఆ లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు.

ఇటుపక్కన రాముడు అలసిపోయినవాడై ' ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడం ' అని ఆలోచిస్తుండగా, ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైనవారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితోపాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి " రామ! రామ! ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను, దీనిని నువ్వు స్వీకరించు. ఇది కాని నువ్వు పొందావ, ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ పరమమంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కాని, అరణ్యంలో ఉన్నప్పుడు కాని చదువుకో, నీకు రక్ష చేస్తుంది " అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు......

    తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
    రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం

    దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
    ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః

అగస్త్య ఉవాచ:

    రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
    యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి

    ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
    జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం

    సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
    చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం

    రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
    పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం

    సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
    ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

    ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
    మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః

    పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
    వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః

    ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
    సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః

    హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
    తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్

    హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః
    అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్

    వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః
    ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః

    ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
    కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః

    నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
    తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే

    నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః
    జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః

    జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
    నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః

    నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
    నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః

    బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
    భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః

    తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె
    కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

    తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే
    నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే

    నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
    పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

    ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
    ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం

    వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
    యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమ ప్రభుః

    ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ
    కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః

    పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
    ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

    అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
    ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం

    ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా
    ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్

    ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
    త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

    రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
    సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్

    అథ రవి రవదన్నిరీక్ష్య రామం
    ముదితమనాః పరమం ప్రహృష్యమానః
    నిశిచరపతి సంక్షయం విదిత్వా
    సురగణమధ్యగతో వచస్త్వరేతి

    1 నుండి 2 శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముడికి వద్ద కు వచ్చుట
    3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.
    6 నుండి 15 శ్లోకాలు  : సూర్యుడంటే బయటకు వ్యక్త మవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే.
    16 నుండి 20 శ్లోకాలు  : మంత్ర జపం
    21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు
    25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవనుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం

అగస్త్యుడు అన్నాడు " ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, నువ్వు నీ సర్వ శత్రువులని జయిస్తావు, నీ శత్రువులని దునుమాడేస్తావు, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. రావణుడు నీ చేతిలో నిహతుడు అవుతాడు " అన్నాడు.

రాముడు ఆ ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు.

ఆ తరువాత రావణుడు నల్లటి గుర్రాలు కట్టి ఉన్న తన రథం మీద యుద్ద భూమికి తీవ్రమైన వేగంతో వచ్చాడు.

అప్పుడు రాముడు " మాతలి! ప్రతిద్వంది వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండు, ఎంత మాత్రం పొరబడకు. రథాన్ని కుడి చేతి వైపుకి తీసుకువెళ్ళు. నేను నీకు చెప్పాను అని మరోలా అనుకోకు, నువ్వు ఇంద్రుడికి సారధ్యం చేస్తున్నవాడివి, నీకు అన్నీ తెలుసు. కాని నీ మనస్సునందు ధైర్యం ఉండడం కోసమని ఈ మాట చెప్పాను. వేరొకలా భావించకు " అన్నాడు.

ఆ యుద్ధ భూమిలో ఒకరికి ఎదురుగా ఒకరి రథాలని నిలబెట్టారు. ఆకాశంలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు అందరూ నిలబడి " రాముడు ఈ యుద్ధంలో గెలవాలి, రావణ సంహారం చెయ్యాలి " అని స్వస్తి వాచకం చేస్తున్నారు.

రావణుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడుతున్న సమయంలో ఆకాశం నుండి రక్త వర్షం కురిసింది, అదే సమయంలో మండలాకారంలో గాలులు తిరిగాయి, ఆకాశంలో గ్రద్దలు తిరుగుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలాయి, నిష్కారణంగా అక్కడున్న భూమి కదిలింది, ఆకాశంలో మేఘాలు లేకుండానే రాక్షస సైన్యం వైపు పిడుగులు పడ్డాయి, ఆకాశం నుండి ఒక తోకచుక్క రావణుడి రథం మీద పడింది, రాక్షసులు తమ ఆయుధములను ప్రయోగిద్దామని చేతులు పైకి ఎత్తుతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నట్టు చేతులు ఆగిపోయాయి, లంకా పట్టణం అంతా కాలిపోతున్నట్టు ఎర్రటి కాంతిని పొందింది, ఇళ్ళల్లో ఉన్న గోరువంకల మీద రాబందులు వచ్చి దాడి చేశాయి, సూర్యమండలం నుంచి ఎర్రటి, తెల్లటి, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన కిరణాలు రావణుడి మీద పడ్డాయి, నిష్కారణంగా గుర్రాలు ఏడిచాయి, నక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి, క్రూరమైన మృగాలు రావణుడి ముఖాన్ని చూస్తూ పెద్దగా అరిచాయి.

రామ-రావణ యుద్ధం ప్రారంభం అవ్వగానే అప్పటిదాకా కొట్టుకున్న వానరులు, రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండిపోయారు. రాముడు, రావణుడు ప్రయోగించిన బాణాలకి ఆకాశం అంతా చీకటి అయిపోయి, ఆకాశంలో గుద్దుకుంటున్న బాణముల మెరుపులే కనపడుతున్నాయి. అప్పుడు రావణుడు కొన్ని బాణములని రాముడి రథం యొక్క ధ్వజం మీదకి ప్రయోగించాడు. ఆ రథం యొక్క శక్తి చేత రావణుడు వేసిన బాణములు నిర్వీర్యం అయిపోయాయి. తరువాత రాముడు వేసిన బాణములకి రావణుడి ధ్వజం విరిగిపోయి నేలమీద పడిపోయింది. ఆ తరువాత రావణుడు బాణములతో రాముడి రథాన్ని లాగుతున్న గుర్రాలని కొట్టాడు. కాని ఆ గుర్రాలు రావణుడి బాణాలు తగిలినా కనీసం కదలను కూడా కదలలేదు. రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణముల నుంచి కొన్ని వేల రోకళ్ళు, పర్వతములు, వృక్షాలు, రోళ్ళు, చిత్ర విచిత్రమైనవన్నీ పుట్టి రాముడి రథం మీద పడిపోతున్నాయి. రావణుడి అన్ని బాణములకు సమాధానంగా రాముడు బాణ ప్రయోగం చేసి రావణుడి సారధిని, గుర్రాలని, ధ్వజాన్ని కొట్టాడు.

వాళ్ళిద్దరూ చేస్తున్న యుద్ధానికి సముద్రాలన్నీ క్షోభించాయి, నదులు గట్లు దాటి ప్రవహించాయి, భూమి అంతా కదిలిపోయింది, సూర్యమండలం అంతా ధూమముతో ఆవహించబడి ఉంది, బ్రహ్మాండములో ఉన్న సర్వ భూతములు కలత చెందాయి.

    గగనం గగనాకారం సాగరం సాగరోపమం
    రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ

ఆ భయంకరమైన యుద్ధాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి " ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, రామ-రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక " అన్నారు.

అప్పుడు రాముడు విషంతో కూడిన సర్పం వంటి బాణమును తీసి, వింటినారికి సధించి, రావణుడి కంఠానికి గురిచూసి విడిచిపెట్టాడు. ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది. ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళి ఒక కొత్త శిరస్సు మొలకెత్తింది. మళ్ళి బాణం పెట్టి ఇంకొక శిరస్సుని రాముడు కొట్టాడు, అది కూడా మొదటిదానిలాగానే కిందపడిపోయింది, కాని మళ్ళి కొత్త శిరస్సు పుట్టింది. అలా రాముడు మొత్తం 100 సార్లు రావణుడి సిరస్సులని కొట్టాడు.

అప్పుడు రాముడు అనుకున్నాడు ' ఈ బాణంతో మారీచుడిని, ఖరుడిని, దూషణుడిని, వాలిని సంహరించాను. ఈ బాణానికి ఎదురులేదు, ఈ బాణంతో ఇప్పటికి నూరు తలకాయలు భూమి మీద పడేశాను. కాని ఈ బాణం రావణుడి చంపలేకపోతుంది ' అని అనుకున్నాడు.

వాళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధం 7 రాత్రులు, 7 పగళ్ళు, ఒక్క క్షణం కూడా విరామం లేకుండా జెరిగింది. ఆకాశం అంతా దేవతలు, ఋషులు మొదలైన వాళ్ళతో నిండిపోయింది.

అప్పుడు మాతలి " రామ! 7 రాత్రులు 7 పగళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నావు. దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమయిపోయింది. అగస్త్యడు ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీయొక్క బాణతుణీరంలో ఉంది, దానిని బయటకి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు " అన్నాడు.

అప్పుడు రాముడు ఆ అస్త్రాన్ని బయటకి తీస్తుంటే, అది పుట్టలోనుంచి బయటకి వస్తున్న బ్రహ్మాండమైన సర్పంలా ఉంది. లోకాలని రక్షించమని ఆ అస్త్రాన్ని బ్రహ్మగారు దేవేంద్రుడికి ఇచ్చారు. ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వాయు వేగంతో వెళ్ళిపోతుంది, దానికున్న బంగారు ములుకులో అగ్ని, సూర్యుడు ఉంటారు, దాని శరీరం బ్రహ్మమయం అయ్యి ఉంటుంది, సుర్యుడివంటి తేజస్సుతో ఉంటుంది, ధూమంతో నిండిపోయిన కాలాగ్నిలా ఉంటుంది. ఆ బాణం ఇంతకముందు ఎన్నో పర్వతాలని చీల్చుకుంటూ, ద్వారాలని బద్దలుకొడుతూ, పరిఘలని విరుచుకుంటూ, ఎందరో రాక్షసుల గుండెల్ని బేధించుకుంటూ వెళ్ళింది. దాని ఒంటి మీద కొంచెం రక్తం, కొవ్వు ఉంటాయి. ఆ బాణం ఇంతకముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడ వెంటనే డేగలు, గ్రద్దలు, రాబందులు, నక్కలు, క్రూరమృగాల గుంపులుగా వచ్చి చనిపోయిన శత్రువుల మాంసాన్ని తినేవి.

రాముడు ఆ బాణాన్ని చేతితో పట్టుకుని దానిమీద వేదప్రోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఆయనలా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసరికి భూమి అంతా కంపించింది. అప్పుడాయన ఆ బాణాన్ని వింటినారికి తగిలించి, చెవి వరకూ లాగి, పరమాత్మని స్తోత్రం చేస్తూ, శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ, లోకాలన్నిటినీ క్షోభింప చేస్తూ, ఇంతకాలం ఏ రావణుడు లోకములన్నిటినీ పీడించాడొ, ఆ రావణుడి గుండెల్ని బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుండి దూసుకు వెళ్ళింది.

రావణుడి చేతిలో ఉన్న ధనుస్సు, ఆయుధములు కింద పడిపోయాయి, ప్రాణాలు విడిచిపెట్టేసి ఆ శరీరంతో కింద పడిపోయాడు.

రావణాసురుడు మరణించాడు.

రావణుడు మరణించగానే ఆకాశంలో దేవదుందుభిలు మ్రోగాయి. వెంటనే సుగ్రీవుడు, లక్ష్మణుడు, అంగదుడు, ఋషభుడు, వేగదర్శి, నీలుడు, సుషేణుడు, గందమాధనుడు, మైందుడు, జాంబవంతుడు, కొన్ని కోట్ల వానరములు అందరూ పరమానందంతో రాముడి దెగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ రాముడి పాదాల మీద పడిపోయి, ఆనందంతో పూజలు చేసి, " రామ రామ " అంటూ ఆయన ఒళ్ళు ముట్టుకుని పరవశించిపోయారు. హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు.

రావణుడు రథం మీద నుంచి కింద పడిపోయేసరికి అక్కడున్న రాక్షసులు పరుగులు తీశారు. వానరాలన్నీ కనపడ్డ రాక్షసుడిని వెంట తరిమి సంహరించారు.

ఆకాశంలో దేవతలందరూ పొంగిపోయి రాముడిని పొగిడారు .

రావణుడు ఆ రణభూమిలో నిహతుడై పడిపోగానే విభీషణుడు ఏడుస్తూ ఆయన దెగ్గరికి పరిగెత్తాడు. అప్పుడాయన అన్నాడు " అన్నయ్యా! ఆనాడే నేను నీకు చెప్పాను ' యుద్ధానికి వెళ్ళవద్దు, తప్పు చేసింది నువ్వు, నీ తప్పు నువ్వు దిద్దుకో ' అన్నాను. కాని నువ్వు నా మాట వినలేదు. ఆ వినకపోవడం వల్ల ఈనాడు ఎలా పడిపోయి ఉన్నావో చూశావ. ఆ రోజున దర్పంతో ప్రహస్తుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు, అతిరధుడు, అతికాయుడు, నరాంతకుడు నా మాట వినలేదు. మా అన్నయ్య జీవించి ఉన్నంతకాలం ఎందరికో దానాలు చేశాడు, గొప్ప అగ్నిహోత్రాలు నిర్వహించాడు, మిత్రధర్మాన్ని నెరపి స్నేహితులకి కానుకలు ఇచ్చాడు, భూరి దానాలు చేశాడు, శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. ఇన్ని చేసినవాడు ఇవ్వాళ కేవలం కిందపడిపోయి, ఎందుకూ పనికిరానివాడిగా చేతులు భూమికి ఆన్చి, నోరు తెరిచి ఉండిపోయాడు. శాంతి పొందిన అగ్నిహోత్రంలా ఉన్నావాన్నయ్య " అని ఏడిచాడు.

అప్పుడు రాముడు " విభీషణ! నీకొక మాట చెబుతాను. నీ అన్నయ్య యుద్ధం చెయ్యడానికి బెంగపెట్టుకోలేదు, భయపడలేదు, ఉత్సాహంతో యుద్ధం చేసి పడిపోయాడు. ఒక వీరుడు ఎలా పడిపోవాలని కోరుకుంటాడో మీ అన్నయ్య కూడా అలానే పడిపోయాడు " అన్నాడు.

అప్పడు అంతఃపురం నుండి కొన్ని వేల అంతఃపుర కాంతలు పరిగెత్తుకుంటూ వచ్చి " రావణ! నువ్వు వెళ్ళిపోయావు, నీతో పాటు మా అయిదోతనము వెళ్ళిపోయింది, భోగము వెళ్ళిపోయింది. ఇంత గొప్పవాడివి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు " అన్నారు.

ఆ సమయంలోనే అక్కడికి మేలి ముసుగు తీసేసి పరిగెత్తుకుంటూ రావణుడి పట్టమహిషి అయిన మండోదరి వచ్చి, రావణుడిని కౌగలించుకొని " ఇవ్వాళ నేను మేలి ముసుగు లేకుండా పరిగెత్తుకొచ్చానని కోపం తెచ్చుకోకు. నువ్వు దేవతలందరినీ ఓడించావు, ఎందరినో తరిమికొట్టావు, దుర్భేద్యమైన కాంచన లంకని నిర్మించవు, 10 తలలతో 20 చేతులతో ప్రకాశించావు, గొప్ప తపస్సు చేసి చివరికి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు. ఆ రోజు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి ' నీ పది తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను, కాని రాముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కనుక వదిలేస్తున్నాను ' అని, లంకని కాల్చి వెళ్ళిపోయాడు. ఒక్కడే అలా వచ్చి లంకని నాశనం చేసి వెళ్ళిపోతే నీ మనస్సులో శంక కలగలేదు. నీ జీవితానికి ప్రమాదం వస్తుందని నువ్వు ఆలోచించలేదు. కోతులంటే చపల బుద్ధికి పెట్టింది పేరు, అలాంటి కొన్ని కోట్ల కోతుల్ని రాముడు వెంట పెట్టుకుని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు, నీకు అప్పుడైనా అనుమానం రాలేదా. ఒక మనుష్యుడైన రాముడి చేతిలో చనిపోయావ " అని పక్కకి తిరిగి రాముడిని చూసింది.

రాముడిని చూడగానే మండోదరి అనింది " ఈయన మనుష్యుడు కాదు, సనాతనమైన పరమాత్మ. నిన్ను నిగ్రహించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు. దేవతలందరినీ వానర రూపాలు ధరింప చేసి, వాళ్ళని వెంట బెట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాముడిని ఇన్ని సార్లు చూసినా నీకు వచ్చింది విష్ణువు అని ఎందుకు అర్ధం కాలేదు రావణా!. నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకం అనుకుంటుంది, నువ్వు ఎందువల్ల చనిపోయావో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు తపస్సు చెయ్యాలనుకొని నీ ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెట్టావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. అందుకని నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి.

ఒక్కసారి కామం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదు. మహా సౌందర్యరాసులైన భార్యలు నీకు కొన్ని వేల మంది ఉన్నారు, వారితో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కామము అదుపులో ఉంటుంది. ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మయందు కామం పుట్టి ఆవిడని నువ్వు అనుభవించడం కాదు, నువ్వు, నీ రాజ్యము, నీ వారు భ్రష్టమవ్వడం కోసం నీకు ఆ కోరిక పుట్టింది. దుర్మతి! నీకు సీతమ్మ ఎవరో అర్ధం కాలేదు, ఆవిడ రోహిణి కన్నా, అరుంధతి కన్నా గొప్పది. తన భర్తని అనుగమించి వచ్చిన ఇల్లాలిని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు, ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ తల్లిని తేవడం వల్ల నువ్వు పొందే సుఖం ఏమి లేదు, నాశనం అయిపోతావని చెప్పాను. నువ్వు చేసుకున్న పూర్వ పుణ్యముల వల్ల కాంచన లంకని అనుభవించావు, ఎన్నో సుఖాలు పొందావు, కాని సీతమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల ఆ పాపాన్ని అనుభవించాల్సి వచ్చి ఈనాడు పడిపోయావు. విభీషణుడు పుణ్యాలు చేశాడు, సీతమ్మ ఎవరో తెలుసుకున్నాడు, ఆ పుణ్య ఫలం ఇవ్వాళ విభీషణుడికి అనుభవంలోకి వచ్చింది, బతికిపోయాడు.

రావణా! సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా, నాకన్నా గొప్ప రూపవతా,  నాకన్నా గొప్ప దాక్షిణ్యం ఉన్నదా, సీత నాకన్నా ఎందులో గొప్పది? కాని నీ దురదృష్టం, నాకన్నా సీత నీకు గొప్పదిలా కనపడింది. నా తండ్రి దానవ రాజైన మయుడు, నా భర్త లోకములను గెలిచిన రావణుడు, నా కుమారుడు ఇంద్రుడిని జయించిన మేఘనాధుడు, నేనున్నది కాంచన లంకలో అని అహంకరించాను, కాని ఇది నిలబడలేదు, అబద్ధమయిపోయింది. ఇవ్వాళ నాకు కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు, నీకు తలకొరివి పెట్టడానికి ఒక్క కొడుకూ లేడు. నువ్వు మహాపాతకం చెయ్యడం వల్ల 10 రోజులలో నా పరిస్తితి ఇలా అయిపోయింది. మహా పతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికన్నా వచ్చి కన్నీరు పెడితే, ఆ కన్నీరు కిందపడితే, ఆ ఇల్లు నాశనమయిపోతుంది " అని బాధపడింది. ( ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పతివ్రత అయిన వేరొకడి భార్య నేను చేసిన పని వల్ల ఏడవడం కాదు, నా భార్య నేను చేసిన పని వల్ల ఏడిచినా, ఆ పాపం వల్ల నేను నశించిపోతాను)

అప్పుడు రాముడు " ఆవిడ చాలా శోకించింది, ఆవిడని లోపలికి తీసుకువెళ్ళండి. రావణుడి కొడుకులందరూ చనిపోయారు కనుక, ఈ శరీరానికి చెయ్యవలసిన కార్యాన్ని విభీషణ నువ్వు చెయ్యి " అన్నాడు.

అప్పుడు విభీషణుడు " రామ! మీరు ఏమైనా చెప్పండి, వీడు బతికున్నంత కాలం వీడి జీవితంలో ధర్మం అన్న మాటే లేదు, బతికున్నంత కాలం పర స్త్రీల వెంట తిరిగాడు, ఇటువంటి వాడికి అంచేష్టి సంస్కారం ఏమిటి? ఆ శరీరాన్ని అలా వదిలేద్దాము " అన్నాడు.

అప్పుడు రాముడు " విభీషణ! అవతలివాడు ఏ శరీరంతో ఇన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరంతోనె వెళ్ళిపోయాయి. అందుకని ఇంక వైరం పెట్టుకోకూడదు. ఆ శరీరానికి సంస్కారం చెయ్యకపోతే వాడు ఉత్తమ గతులకి వెళ్ళడు. ఒకవేళ నువ్వు ' చెయ్యను ' అంటె, నువ్వు నాకు స్నేహితుడివి కదా, స్నేహితుడి అన్నయ్య నాకూ అన్నయ్యే కదా, నువ్వు చెయ్యకపోతే ఆయనని అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తాను " అన్నాడు.

అప్పుడు విభీషణుడు రావణుడికి అంచేష్టి సంస్కారం చేశాడు. ఆ తరువాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోయారు.

అప్పుడు రాముడు " విభీషణుడికి సింహాసనం మీద అభిషేకం జెరిగితే చూడాలని ఉంది లక్ష్మణా. సముద్రానికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చెయ్యండి " అన్నాడు.

విభీషణుడికి అభిషేకం చేశాక రాముడు హనుమంతుడిని పిలిచి " ఇవ్వాళ విభీషణుడు అభిషేకం జెరిగి లంకకి రాజయ్యాడు కనుక ఆయన అనుమతి తీసుకొని లంకలోకి వెళ్ళి సీత దర్శనం చెయ్యి. నేను సుగ్రీవుడి సాయంతో, విభీషణుడి సాయంతో రావణుడిని సంహరించి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకొని క్షేమంగా ఉన్నానని చెప్పు. విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయిందని చెప్పు. అందుకని ఇవ్వాళ సీత నా మిత్రుడైన విభీషణుడి ఇంట్లో ఉంది కనుక బెంగపడవలసిన అవసరం లేదని చెప్పు " అన్నాడు.

హనుమంతుడు సీతమ్మ దెగ్గరికి వెళ్ళగా, సీతమ్మ హనుమంతుడిని చూసి తల తిప్పుకొని ఏదో ధ్యానం చేసుకుంటుంది. మళ్ళి ఓ సారి హనుమంతుడి వంక చూసి " హనుమ! నువ్వు కదా " అనింది.

అప్పుడు హనుమంతుడు " సీతమ్మ! రాముడు సుగ్రీవుడిని, విభీషణుడిని తన పక్కన పెట్టుకుని, వాళ్ళ యొక్క సహాయంతో రావణుడిని సంహరించి లంకని తనదిగా చేసుకున్నాడు. ఇవ్వాళ విభీషణుడిని లంకా రాజ్యానికి రాజుగా చేశారు. ఇప్పుడు నువ్వు రాముడి మిత్రుడైన విభీషణుడి ప్రమదావనంలో ఉన్నావు, అందుచేత నువ్వు బెంగపడవలసిన పరిస్థితి లేదు. నీ శోకాన్ని విడిచిపెట్టు " అన్నాడు.

అప్పుడు సీతమ్మ " ఎంత మంచిమాట చెప్పావయ్య హనుమ " అని చెప్పి ఒక్క నిమిషం అలా ఉండిపోయింది.

అప్పుడు హనుమంతుడు " అదేమిటమ్మ ఏమి మాట్లాడావు " అన్నాడు.

సీతమ్మ " 10 నెలల నుంచి ఈ మాట ఎప్పుడు వింటాన అని తపస్సు చేశాను కదా హనుమ. నువ్వు నిజంగా వచ్చి ఈ మాట చెప్పేటప్పటికి నా నోటి వెంట మాటరాలేదు. నువ్వు చెప్పిన మాటకి నేను చాలా ఆనందాన్ని పొందాను. కాబట్టి నేను నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి, కాని నేను ఆలోచన చేస్తే, నేను నీకు ఏమి ఇవ్వగలను. ఎంత బంగారం ఇచ్చినా, రత్నాలు ఇచ్చినా, మూడు లోకములని ఇచ్చినా సరిపోదు. ఇవ్వాళ నీకు ఇవ్వడానికి నా దెగ్గర ఏమిలేదు హనుమ. నువ్వు మధురాతి మధురంగా మాట్లాడతావు, నీకు అష్టాంగ యోగంతొ కూడిన బుద్ధి ఉంది, వీర్యము, పరాక్రమము, తేజస్సు ఉంది. నిన్ను చూసి పొంగిపోతున్నానయ్య " అనింది.

అప్పుడు హనుమంతుడు " అమ్మ! నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పి, నాకు ఇవ్వడానికి నీ దెగ్గర గొప్ప వస్తువు లేదన్నావు కదా. నేనొక వరం అడుగుతాను ఇస్తావ తల్లి " అని, " ఇంతకముందు వచ్చినప్పుడు శింశుపా వృక్షం మీద కూర్చుని చూశానమ్మా, ఈ రాక్షస స్త్రీలందరూ నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు. నువ్వు బ్రతికుండగా నిన్ను వాటాలు వేసుకున్నారు. ' నిన్ను అనుమతించాను హనుమ ' అని ఒక్కమాట అను, నేను వాళ్ళని గోళ్ళతో గిల్లేస్తాను, మోకాళ్ళతో గుద్దేస్తాను, కొంతమందికి పళ్ళు పీకేస్తాను, కొంతమంది జుట్టు పీకేస్తాను, కొంతమందిని గుద్దేస్తాను " అన్నాడు.

అప్పుడు సీతమ్మ " హనుమ! వాళ్ళు దాసీజనం, ప్రభువు ఎలా చెయ్యమంటే వాళ్ళు అలా చేస్తారు. దోషం వాళ్ళది కాదు, దోషం ప్రభువుది. ఏ దోషం వాళ్ళయందు ఉందని వాళ్ళని చంపేస్తావు. నీ ప్రభువు చెబితే నువ్వు చేసినట్టు, వాళ్ళ ప్రభువు చెప్పినట్టు వాళ్ళు చేశారు. ప్రభుభక్తి విషయంలో నువ్వు ఎటువంటివాడివో వాళ్ళు కూడా అటువంటివాళ్ళే. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపానికి ఫలితంగా ఇన్ని కష్టాలు పడ్డాను.

పూర్వకాలంలో ఒక వేటగాడు అడవిలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి అతనిని తరుముకొచ్చింది. అప్పుడా వేటగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టు మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక భల్లూకం పడుకొని ఉంది. ఆ వేటగాడు పైకి వెళితే భల్లూకం తినేస్తుంది, కిందకి వెళితే పులి తినేస్తుంది.

ఈ స్థితిలో పులి భల్లూకంతో ' వాడు నరుడు, మనిద్దరమూ క్రూర జంతువులము, మనిద్దరిది ఒక జాతి, వాడిది ఒక జాతి, కనుక వాడిని కిందకి తోసేయ్యి ' అనింది.

అప్పుడా భల్లూకం ' వాడు తెలిసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున నేనున్న చెట్టు ఎక్కాడు, అందుకని వాడు నన్ను శరణాగతి చేసినట్టు. వాడు నాకు అతిథి. కనుక నేను వాడిని తొయ్యను, నేను వాడికి ఆతిధ్యం ఇస్తున్నాను ' అనింది.

ఆ పెద్ద పులి అలా చెట్టు కిందనే ఉంది. కొంతసేపయ్యాక భల్లూకం వేటగాడితో ' నాకూ పెద్ద పులి చేత ప్రమాదమే. నాకు నిద్రొస్తోంది, నిద్రొస్తే జారి కిందపడిపోతాను. అందుకని నేను నీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాను, కొంచెం పడిపోకుండా చూడు ' అనింది. అప్పుడా వేటగాడు ' తప్పకుండా పడుకో ' అన్నాడు.

ఆ భల్లూకం పడుకున్నాక పెద్ద పులి అనింది ' దానికి నిద్రలేచాక ఆకలి వేస్తుంది. అది సహజంగా క్రూర జంతువు కనుక నిన్ను చంపేసి తింటుంది. అందుకని ఇదే అదును, నువ్వు ఆ భల్లూకాన్ని కిందకి తోసేయ్యి. అప్పుడు నేను ఆ భల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను, తరువాత నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు ' అనింది.

ఈ మాట వినగానే ఆ వేటగాడు నిద్రపోతున్న భల్లూకాన్ని కిందకి తోసేశాడు. ఆ భల్లూకం కిందకి పడిపోతూ పడిపోతూ ఒక చెట్టుకొమ్మని పట్టుకొని పైకి ఎక్కింది. అప్పుడా పులి ' చూశావ, నిద్రపోతున్న నిన్ను వాడు కిందకి తోసేశాడు, ఎప్పటికైనా మనిషి మనిషే మనం మనమే. అందుకని వాడిని కిందకి తోసేయ్యి ' అనింది.

అప్పుడా భల్లూకం ' అపకారం చేసినవాడే అయినా, వాడు నా ఇంటికి వచ్చాడు కాబట్టి, అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా అపకారము చెయ్యకూడదు కాబట్టి నేను ఆ వేటగాడిని తొయ్యను ' అని ఒక భల్లూకం చెప్పింది. నేను మనుష్య స్త్రీగా పుట్టి, క్షత్రియ కాంతనై, రాముడికి ఇల్లాలినై ఆ రాక్షస స్త్రీలని చంపిస్తే నేను ఉత్తమ కులాంగనను అవుతాన. చెడ్డగా ఎవడున్నాడో, ఎవడు పాడయిపోయాడో వాడి మీద దయ ఉండాలి. ఈ రాక్షస స్త్రీలు చెయ్యకూడని పనులు చేశారు, వీళ్ళ మీద కదా నేను దయతో ఉండాలి. వీళ్ళందరికి నా రక్ష " అనింది.

" అమ్మ! ఈ మాట చెప్పడం నీకే చెల్లింది తల్లి " అని సీతమ్మతో అని, అక్కడినుంచి బయలుదేరి రాముడి దెగ్గరికి వెళ్ళి " రామ! సీతమ్మ నీ దర్శనం చెయ్యాలని అనుకుంటోంది " అని రాముడితో చెప్పాడు.

హనుమంతుడు చెప్పిన మాట విన్న రాముడు కొంచెంసేపు ఆలోచించాడు, ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్ళు నిండాయి. చాలా శోకం పొందినవాడిలా అయ్యి, ఒకసారి భుమివంక చూసి, తన పక్కన ఉన్న విభీషణుడిని పిలిచి " విభీషణ! నువ్వు లోపలికి వెళ్ళి, సీతకి నేను చెప్పానని చెప్పి తలస్నానం చేయించి, పట్టు వస్త్రం కట్టించి, అన్ని అలంకారములు చేసి నా దెగ్గరికి ప్రవేశపెట్టు " అన్నాడు.

రాముడి మాటలు విన్న విభీషణుడు ఆశ్చయపోయి సీతమ్మ దెగ్గరికి వెళ్ళి " సీతమ్మ! నువ్వు తల స్నానం చేసి, పట్టుబట్ట కట్టుకొని, ఒంటినిండా అలంకారాలు చేసుకుని వస్తే రాముడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు " అన్నాడు.

సీతమ్మ అనింది " నేను ఎలా ఉన్నానో అలానే వచ్చి రామదర్శనం చేసుకోవాలని నా మనస్సు కోరుకుంటోంది " అనింది.

విభీషణుడు అన్నాడు " అమ్మా! అది రామ ఆజ్ఞ. ప్రభువు ఎలా చెప్పాడో అలా చెయ్యడం మంచిది. అంతఃపుర కాంతలు నీకు తలస్నానం చేయిస్తారు, నువ్వు దివ్యాంగరాదములను అలదుకొని, మంచి భూషణములను వేసుకొని, రాముడికి దర్శనం ఇవ్వమ్మా " అన్నాడు.

సీతమ్మ స్నానం చేసి అలంకరించుకున్నాక పరదాలు కట్టిన ఒక పల్లకి ఎక్కించి రాముడి దెగ్గరికి తీసుకు వెళ్ళారు. అప్పుడు రాముడి ముఖంలో సంతోషం, దైన్యం, కోపం కనపడ్డాయి.

అప్పుడు రాముడు " మీరు ఆవిడని పల్లకిలో ఎందుకు తీసుకొస్తున్నారు. దిగి నడిచి రమ్మనండి " అన్నాడు.

అలా నడిచి వస్తున్న సీతమ్మని చూడడం కోసమని అక్కడున్న వానరాలు ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు (ఆ వానరాలు అప్పటిదాకా సీతమ్మని చూడలేదు). అప్పుడు సుగ్రీవుడు కొంతమందిని ఆజ్ఞాపించి ఆ వానరాలని వెనక్కి తొయ్యమన్నాడు.

రాముడన్నాడు " ఈ సీత కోసం వాళ్ళు తమ ప్రాణాలని ఫణంగా పెట్టి యుద్ధం చేశారు. ఇప్పుడావిడ నడిచొస్తుంటే వాళ్ళని కొట్టి దూరంగా తోసేస్తార. వాళ్ళందరూ సీతని చూడవలసిందే. ఎవరైనా ప్రియ బంధువులు వియోగం పొందినప్పుడు, రాజ్యంలో క్షోభం ఏర్పడినప్పుడు, యజ్ఞం జెరుగుతున్నప్పుడు, యుద్ధం జెరుగుతున్నప్పుడు అంతఃపుర కాంతలు బయటకి రావచ్చు. ఇవ్వాళ నేను యుద్ధభూమిలో ఉన్నాను, కనుక భర్త దర్శనానికి సీత అలా రావచ్చు. నా పక్కన ఉండగా సీతని చూడడంలో దోషంలేదు " అన్నాడు.

అప్పుడు హనుమంతుడు " రామ! ఎవరి కోసం మనం ఇంత కష్టపడి యుద్ధం చేశామో, ఆ సీతమ్మ మీ దెగ్గరికి వచ్చింది " అన్నాడు.

అప్పుడు సీతమ్మ రాముడి దెగ్గరికి వచ్చి, తన భర్త తన పట్ల ఆనందంగా లేకపోవడం వల్ల ఏడుస్తూ, ఆ ముసుగులో నుంచి " ఆర్యపుత్రా " అని, అలా నిలబడిపోయింది.

అప్పుడు రాముడు " శత్రువుని జయించాను, నిన్ను పొందాను. ఏ దైవము యొక్క అనుగ్రహము లేకపోవడము చేత, ఏ దైవము యొక్క శాసనము చేత నువ్వు అపహరింపబడ్డావో దానిని పురుష ప్రయత్నం చేత దిద్దాను. రావణుడిని సంహరించి నిన్ను తెచ్చుకున్నాను. అపారమైన పౌరుషము, పరాక్రమము ఉన్నవాడికి ఏదన్నా అపవాదు వస్తే, వాడు తన ప్రయత్నంతో ఆ అపవాదుని తుడిచిపెట్టుకోకపోతే, వాడు చేతకానివాడు అని ప్రపంచం అంటుంది. అందుకని నా ప్రయత్నంతో వచ్చిన అపవాదుని తుడిచిపెట్టడానికి, రాముడి భార్యని రావణుడు అపహరిస్తే, రావణుడిని రాముడు ఏమి చెయ్యలేదు అని అనకుండా ఉండడం కోసం రావణుడిని సంహరించాను. 100 యోజనముల సముద్రాన్ని గడిచి లంకా పట్టణాన్ని చేరి, హనుమ చేసిన ఈ లంకా భీభత్సం అంతా నేటితో సార్ధక్యాన్ని పొందింది. నేను ఇదంతా కష్టపడి చేసింది నా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోడానికి. ఇక్ష్వాకు వంశంలో జన్మించాను కాబట్టి, రాముడు చేతకానివాడు అన్న అపవాదు నా మీద పడకూడదు కాబట్టి ఇదంతా చేశాను. రాముడు సీతని తిరిగి తెచ్చుకోలేకపోయాడు అన్న కళంకం మా వంశంలో ఉండిపోకూడదు, అందుకని నిన్ను గెలిచి తెచ్చుకున్నాను.

సీత! ఇవ్వాళ నీ చారిత్రము శంకింపబడింది. నువ్వు చాలాకాలం రాక్షసుని గృహంలో ఉన్నావు. నువ్వు అలా ఉన్న కారణం చేత నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా, కంటియందు జబ్బు ఉన్నవాడు దీపాన్ని ఎలా చూడలేడో, అలా నేను నీ వంక చూడలేకపోతున్నాను. నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు అపార సౌందర్యరాశివి, నిన్ను చూసినవాడు చపలచిత్తుడైతే వెంటనే నీ యందు మనస్సు పెట్టుకుంటాడు. పరమ చపలచిత్తుడైన రావణుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు, బలవంతంగా నీ జుట్టు పట్టి ఈడ్చాడు, తన తొడ మీద కుర్చోపెట్టుకున్నాడు, గుండెల మీద వేసుకున్నాడు, అశోకవనంలో పెట్టాడు, 10 నెలలు నిన్ను చూశాడు. నువ్వూ మహా అందగత్తెవి, వయస్సులో ఉన్నదానివి. అటువంటి నువ్వు ఖచ్చితమైన నడువడితో ఉన్నావని నేను ఎలా నమ్మను. అందుకని ఇప్పుడు నీ ఇష్టం, నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపో. లక్ష్మణుడితో కాని, భరతుడితో కాని, విభీషణుడితో కాని, సుగ్రీవుడితో కాని నువ్వు వెళ్ళిపోవచ్చు, వీళ్ళు కాదు ఈ పది దిక్కులలో నీకు ఎవరు నచ్చినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. నేను నీకు అనుమతి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు. నీతో నాకు మాత్రం ఏవిధమైన అవసరం లేదు " అన్నాడు.

అప్పుడు సీతమ్మ " రామ! నన్ను చిన్నతనంలో పాణిగ్రహణం చేశావే, నా చెయ్యి పట్టుకున్నావే, చాలా కాలం కలిసి దాంపత్య జీవనం చేశామే, నేను ఎటువంటిదాననో నీకు తెలియదా, నేనంత చేతకాని స్త్రీలా నీకు కనపడుతున్నాన. నేను నిజంగా అటువంటి చారిత్రము ఉన్నదానిని అని నువ్వు అనుమానించినవాడివైతే ఆనాడు హనుమని నాకోసం ఎందుకు పంపించావు. నేను రాక్షసుల మధ్యలో ఉన్నాను అని హనుమ నీకు చెబితే, మళ్ళి హనుమతోనే నేను నీ చారిత్రమును శంకిస్తున్నాను అని కబురు చేస్తే నేను ప్రాణాలు విడిచిపెట్టేదాన్ని. అలా చెయ్యకుండా నాకోసం ఎందుకు ప్రాణ సంకటాన్ని పొందావు, ఎందుకు సముద్రానికి సేతువు కట్టి, లంకకి వచ్చి, అంత యుద్ధం చేశావు. యుద్ధంలో జయాపజయములు విధి నిర్ణీతములు, నువ్వు గెలవచ్చు రావణుడు గెలవచ్చు. నాయందు నీకు ప్రేమ ఉంది కాబట్టి అంత ప్రాణ సంకటం తెచ్చుకున్నావు. కాని ఇవ్వాళ ఎందుకింత బేలగా మాట్లాడుతున్నావు. నేను స్త్రీని కాబట్టి ఎలా అయినా మాట్లాడచ్చు అనుకుంటున్నావా. నా భక్తి, నా సౌశీల్యం, నా నడువడి అన్నిటినీ వెనక్కి తోసేశావు. నేను బతికుంటే రాముడికి ఇల్లాలిగా బతుకుతాను, చచ్చిపోయినా రాముడికి ఇల్లాలిగానే చచ్చిపోతాను. ఒకసారి అపనింద పడ్డాక నాకీ జీవితంతో సంబంధం లేదు. లక్ష్మణా! చితి పేర్చు " అనింది.

అప్పుడు లక్ష్మణుడు రాముడివంక కనుగుడ్లు మిటకరిస్తూ కోపంగా చూశాడు. రాముడు అంతకన్నా కోపంగా, ఎర్రటి కళ్ళతో లక్ష్మణుడివంక చూసేసరికి లక్ష్మణుడు గబగబా వెళ్ళి చితిని పేర్చాడు.

అప్పుడు సీతమ్మ " నా మనస్సు రాముడియందే ఉన్నదైతే, సర్వకాలములయందు రాముడిని ధ్యానము చేసిన దాననైతే, పృధ్వీ, ఆకాశము, అష్ట దిక్పాలకులు, అంతరాత్మ, అగ్ని సాక్షిగా ఉండి, ఒక్క క్షణం కూడా నా మనస్సు రాముడిని విడిచిపెట్టనిది నిజమే అయితే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక " అని చెప్పి అగ్నిలో దూకింది.

అలా సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దేవతలు మొదలైనవారందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి నమస్కారం చేస్తున్న రాముడిని చూసి వాళ్ళు అన్నారు " అదేమిటయ్యా రామ అంత పని చేశావు. నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహా విష్ణువువి. నువ్వు లోకములను సృష్టించగలిగినవాడివి, లయం చెయ్యగలిగినవాడివి, పరబ్రహ్మానివి. సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పగలిగావయ్య " అన్నారు.

అప్పుడు రాముడు " మీరందరూ నేను చాలా గొప్పవాడిని అని అంటున్నారు, నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు, కాని నేను అలా అనుకోవడం లేదు. నేను దశరథ మహారాజు యొక్క కుమారుడిని, రాముడిని, నరుడిని అని అనుకుంటున్నాను. నేను యదార్ధముగా ఎవరినో మీరు చెప్పండి " అన్నాడు.

అప్పుడు బ్రహ్మ " సృష్టికి ముందు ఉన్నవాడివి నువ్వు, స్థితికారుడివి నువ్వు, లయకారుడివి నువ్వు, వరాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించినవాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, కోపం నువ్వు, రాత్రి నువ్వు, నీ రోమకూపాల్లో దేవతలు ఉంటారు, సమస్తము నీయందే ఉంది, అంత్యమునందు ఉండిపోయేవాడివి నువ్వు, నువ్వు కన్ను ముస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు " అని రాముడిని స్తోత్రం చేశారు.

తరువాత అగ్నిహోత్రంలో నుంచి అగ్నిదేవుడు తన తొడ మీద సీతమ్మని కూర్చోపెట్టుకుని బంగారు సింహాసనం మీద పైకి వచ్చాడు. అప్పుడాయన " రామ! ఈవిడ మహాపునీత. గొప్ప పుణ్యచారిత్రము ఉన్నది, ఈ తల్లి కంటితో కూడా దోషం చెయ్యలేదు. ఈవిడ పాతివ్రత్యం వల్లే రాక్షస సంహారం జెరిగింది. ఈ తల్లి మనస్సుతో కాని, వాక్కుతో కాని పాపం చెయ్యలేదు. నేను సమస్త జీవుల యొక్క కర్మలని చూస్తుంటాను, ఈ తల్లియందు కించిత్ దోషం లేదు. రామ! సర్వకాల సర్వావస్తలయందు నీ నామం చెప్పుకుని, నీ పాదములయందు మనస్సు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ. నువ్వు ఇంకొక మాట చెబితే నేను అంగీకరించను. ఈమెని నువ్వు స్వీకరించు " అన్నాడు.

అప్పుడు రాముడు " మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు, సర్వకాలములయందు ఈమె మనస్సు నా దెగ్గెర ఉందని నాకు తెలుసు. సముద్రం చెలియలి కట్టని దాటనట్టు, అగ్నిని చేత పట్టలేనట్టు, సీతని రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు. కాని ఈ విషయం రేపు లోకమంతటికి తెలియాలి. చేతకానివాడు రాముడని లోకం అనకూడదు. సీత చారిత్రము ఏమిటో లోకానికి చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను " అన్నాడు.

అప్పుడు రాముడు సీతమ్మ భుజం మీద చెయ్యివేసి ఆమెని దెగ్గరికి తీసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన వానరులందరూ ఆనందంతో పొంగిపోయారు.

దేవతలందరితో పాటుగా అక్కడికి వచ్చిన శివుడు అన్నాడు " నాయన రామ! నీ తమ్ముడైన భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు, ఆయనని ఓదార్చు. నీ తల్లి అయిన కౌసల్యని ఊరడించు. కైకేయి, సుమిత్రలకి నమస్కరించు. లక్ష్మణుడిని ఊరడించు. ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుంచి పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి, నీవారిని సంతోషపెట్టు. ఏ వంశంలో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. యాగాలు చెయ్యి, బ్రాహ్మణులకు భూరి దానాలు చేసి పరమ సంతృప్తిని పొందు. తదనంతరం స్వర్గానికి చేరుకుందువుగాని. అదిగో, ఆ విమానంలో మీ తండ్రిగారైన దశరథ మహారాజు ఉన్నారు, వెళ్ళి చూడు " అన్నాడు.

తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు. అప్పుడు దశరథుడు రాముడిని ఒకసారి ఆనందంతో గట్టిగా కౌగలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకుని " రామ! నేను స్వర్గలోకంలో విహరించానురా, ఇంద్రలోకంలో తిరిగానురా, కాని నువ్వు లేకపోతె అది కూడా నాకు పెద్ద సుఖంగా అనిపించలేదురా. ఆనాడు నీకు పట్టాభిషేకాన్ని చేద్దాము అనుకోవడం, నేను ఎంతో ఆనందాన్ని పొందడం, రాత్రి కైక దెగ్గరికి వెళ్ళడం, కైక వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నం అవ్వడం, ఆనాడు నేను ఏడ్చి ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నేను ఇప్పుడు తెలుసుకున్నదేంటంటే, ఆ పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కారణం దేవతలు. రావణ సంహారం జెరగాలి కనుక దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు " అన్నాడు.

అప్పుడు రాముడు " ఆనాడు మీరు భావనా వ్యగ్రతని పొంది, నా పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కైకమ్మ కారణం అనుకొని ' ఇప్పుడే నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నువ్వు నా భార్యవి కావు, నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాదు ' అన్నారు. ఆ మాటని మీరు ఉపసంహారం చెయ్యండి, నేను సంతోషిస్తాను " అన్నాడు.

అప్పుడు దశరథుడు " నువ్వు కోరుకున్నటు తప్పకుండా జెరుగుతుంది " అన్నాడు. తరువాత ఆయన లక్ష్మణుడితో " నాయన లక్ష్మణా! నువ్వురా ప్రాజ్ఞుడవి అంటె. చక్కగా అన్నయ్య సేవ చేశావు, ఇలాగె సర్వకాలములయందు అన్నయ్యని, వదినని సేవిస్తూ నీ జన్మ చరితార్ధం చేసుకో " అన్నాడు.

అప్పుడు దశరథుడు రామలక్ష్మణుల వెనకాల తనకి నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతమ్మని దెగ్గరికి పిలిచి " అమ్మా సీతమ్మ! నీ మనస్సుకి కష్టం కలిగిందా. ' సీత! నీతో నాకు ప్రయోజనం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు ' అని మావాడు అన్నాడు కదా, అలా అన్నాడని నువ్వు బాధపడ్డావ. ఇవ్వాళ నేను ఊర్ధలోకవాసినమ్మా, తప్పు మాట చెబితే కిందకి పడిపోతాను, నీకొక నిజం చెప్పనా, రాముడికి నీమీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా, నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని మావాడి తాపత్రయం.

కూతురా! నువ్వు ఇవ్వాళ చేసిన పతి సేవ వల్ల జెరిగిన గొప్పతనం ఏమిటో తెలుసా, ఇతఃపూర్వం పతివ్రతలై భర్తని సేవించిన వాళ్ళందరి చరిత్రలను పక్కన పెట్టి, పతివ్రత అంటె సీతమ్మ అని నిన్ను చూపిస్తున్నారు. నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టం. నీకు నేను ఇంక చెప్పడానికి ఏమిలేదమ్మ, నీకు అన్నీ తెలుసు, కాని మామగారిగా ఒక్క మాట చెబుతాను. అమ్మా! భర్త మాత్రమే దైవము అని తెలుసుకో " అన్నాడు.

తరువాత దశరథుడు విమానంలో ఊర్ధలోకాలకి వెళ్ళిపోయాడు.

అప్పుడు దేవేంద్రుడు " రామ! ఒకసారి మేము వచ్చి దర్శనం ఇస్తే, ఆ దర్శనం వృధా కాకూడదు. అందుకని ఏదన్నా ఒక వరం కోరుకో " అన్నాడు.

రాముడన్నాడు " నాకోసమని తమ యొక్క కొడుకులని, భార్యలని విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని మిగిలాయి, మిగిలిన వాటిలో కొన్నిటికి చేతులు తెగిపోయాయి, కొన్నిటికి కాళ్ళు తెగిపోయాయి, కొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి, కొన్ని యమ సదనమునకు వెళ్ళిపోయాయి. మీరు నిజంగా నాయందు ప్రీతి చెందినవారైతే, యమ సదనమునకు వెళ్ళిన వానరములన్నీ బతకాలి, యుద్ధభూమిలో కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్ళి జవసత్వములతో పైకి లేవాలి. అవన్నీ యుద్ధానికి వచ్చేటప్పుడు ఎంత బలంతో ఉన్నాయో ఇప్పుడు మళ్ళి అంతే బలంతో ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు ఫలించాలి, పువ్వులు పుయ్యాలి, అక్కడ సమృద్ధిగా తేనె ఉండాలి, వాళ్ళు తాగడానికి ఎప్పుడూ మంచి నీరు ప్రవహిస్తూ ఉండాలి " అన్నాడు.

ఇంద్రుడు " తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నాను " అన్నాడు.

వెంటనే యుద్ధ భూమిలో పడి ఉన్నవారు లేచి వచ్చారు, యమ సదనానికి వెళ్ళినవారు తిరిగి వచ్చేశారు. వానరులందరూ పరమ సంతోషాన్ని పొందారు.

ఆరోజు రాత్రి అక్కడ విశ్రమించారు, మరునాడు ఉదయం రాముడు విభీషణుడిని పిలిచి " నేను తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడినుంచి కాలి నడకన వెళితే చాలా సమయం పడుతుంది కనుక తొందరగా వెళ్ళడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటు అవుతుందా " అన్నాడు.

విభీషణుడు " మన దెగ్గర పుష్పక విమానం ఉంది, ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరిపోతారు. ఇన్ని కష్టాలు పడ్డారు కదా, సీతమ్మ లభించింది కదా, సీతమ్మ అభ్యంగన స్నానం ఆచరించి, పట్టు పుట్టం కట్టుకుని, నగలు అలంకరించుకుంది కదా, మీరు కూడా తలస్నానం చేసి, పట్టు పుట్టాలు కట్టుకుని, ఆభరణములను దాల్చి, నా దెగ్గర బహుమతులు అందుకొని మీరు బయలుదేరితే నేను ప్రీతి పొందుతాను " అన్నాడు.

అప్పుడు రాముడు " నా తమ్ముడైన భరతుడు అక్కడ జటలు పెంచుకొని, మట్టి పట్టిన వస్త్రం కట్టుకొని, నా పాదుకలని సింహాసనం మీద పెట్టి, నన్ను చూడాలని శోకిస్తు రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు స్నానం చెయ్యకముందు నేను స్నానం చెయ్యనా. భరతుడు పట్టుపుట్టం కట్టుకోకముందు నేను కట్టుకోన. భరతుడు ఆభరణాలు పెట్టుకోకముందు నేను పెట్టుకోన. నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉంది " అన్నాడు.

విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు, రాముడు ఆ విమానాన్ని అధిరోహించాక " మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను......." అని చెబుతుండగా, అక్కడున్న వాళ్ళందరూ అన్నారు " మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, మేము మీతో అయోధ్యకి వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మిమ్మల్ని కన్న కౌసల్యని ఒకసారి చూడాలని ఉంది, మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటె చూడాలని ఉంది రామ " అన్నారు.

విశాల హృదయుడైన రాముడు సరె అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడు రాముడు సీతమ్మకి ఆ పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ " సీత చూశావ, ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం, అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం, ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువుని మేము వానరములతో కలిసి నిర్మించాము. ఇక్కడే మేమందరమూ కూర్చుని ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని అనుకున్నాము. ఇదే కిష్కింద, ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకి నీ జాడ కనిపెట్టడానికి బయలుదేరారు " అని చెప్తుంటే సుగ్రీవుడు గబగబా వచ్చి " రామ! మనం కిష్కింద మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తార, రుమ చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాము " అన్నాడు.

అప్పుడా పుష్పకాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి తార, రుమలకి విషయాన్ని చెప్పి రమ్మన్నాడు. అప్పుడు తార మిగిలిన ఆడవారి దెగ్గరికి వెళ్ళి " రండి, రండి, సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి " అనింది. అప్పుడు వాళ్ళు మానవ కాంతలగా కామరూపాలని పొంది, పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసేసి, లోపలికి ఎక్కి " సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ? " అని అడిగారు.

" ఆవిడే సీతమ్మ " అని చూపిస్తే అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకొని, పలకరించింది.

మళ్ళి రాముడన్నాడు " సీత! అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూశావ సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు " అని రాముడు చెబుతుంటే సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది.

కొంతముందుకి వెళ్ళాక " అదే అగస్త్య మహర్షి ఆశ్రమం, ఇక్కడే అగస్త్యడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనపడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం. అక్కడ కనపడుతున్నది చిత్రకూట పర్వతం, ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము " అన్నాడు.

అలా ఆ పుష్పకం కొంత ముందుకి వెళ్ళాక వాళ్ళకి భారద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పకాన్ని అక్కడ దింపి, భారద్వాజుడికి నమస్కరించారు. అప్పుడు భారద్వాజుడు " రామ! నేను నా తపఃశక్తితో అన్ని కాలములయందు నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం కూడా నాకు తెలుసు. ఇవ్వాళ ఒక్క రాత్రి నా దెగ్గర ఉండి, విశ్రాంతి తీసుకొని, నా ఆతిధ్యం తీసుకొని బయలుదేరు " అన్నాడు.

అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి " హనుమ! నువ్వు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు, అతను నాకు మిక్కిలి స్నేహితుడు. ఆ గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. తరువాత అక్కడినుంచి బయలుదేరి అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా అని కనుక్కొని నందిగ్రామానికి వెళ్ళి, నేను తిరిగొస్తున్నాను అని భరతుడికి చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను, భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగ కనిపెట్టి తిరిగిరా " అన్నాడు.

వెంటనే హనుమంతుడు అక్కడినుంచి బయలుదేరి గుహుడిని కలుసుకొని, ఆయనని పలకరించి, రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుంచి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకొని, రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలని వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు.

మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయేముందు భారద్వాజుడు అన్నాడు " నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది రామ. నీకొక వరం ఇస్తాను, ఏదన్నా కోరుకో " అన్నాడు.

అప్పుడు రాముడు " వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫలసంవృద్ధి ఉండాలని నేను కోరాను. ఇప్పుడు ఇక్కడినుంచి 3 యోజనముల దూరం వరకూ అయోధ్యకి ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి " అని అడిగాడు.

తరువాత భారద్వాజుడి దెగ్గర సెలవు తీసుకొని పెద్ద కోలాహలంతో నందిగ్రామానికి రాముడు చేరుకున్నాడు.

అప్పుడు భరతుడు తన సైనికులతో " రాముడు వచ్చేస్తున్నాడు, అయోధ్యలో ఉన్న తల్లులని తీసుకురండి, రథాలని తీసుకురండి, పెద్దవాళ్ళని తీసుకురండి, అందరినీ అయోధ్యకి రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి. దివ్యమైన ధూపములు వెయ్యండి. అందరమూ కలిసి రాముడిని నందిగ్రామం నుంచి అయోధ్యకి పట్టాభిషేకానికి తీసుకువెళదాము " అని భరతుడు ఆజ్ఞాపించాడు.

రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు.

రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణులు కన్నుల నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని " ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుంచి మనం అయిదుగురము అన్నదమ్ములము సుగ్రీవ " అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదుడిని, మైందుడిని మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలని ' మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు, మీరు ఎంత మంచివారు ' అని అందరినీ కౌగలించుకున్నాడు.

పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ళ ప్రేమలని, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు అన్నారు " ఈ వానర కాంతలందరికి మేమే తలస్నానాలు చేయిస్తాము " అని, వాళ్ళందరికీ తలస్నానం చేయించారు.

తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని " కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపో " అని ఆజ్ఞాపించాడు. అప్పుడా ఆ పుష్పకం కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపోయింది.

అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో " మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ పాదుకలని న్యాసంగా ఇచ్చి నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దెగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు, అందుకని ఇవ్వాళ నేను దానిని నీకు ఇచ్చేస్తున్నాను " అన్నాడు.

భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు.

శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి " అన్నయ్య! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను, నీ జుట్టు జటలు పట్టేసింది కదా అందుకని క్షుర కర్మ చేయించుకో " అన్నాడు.

అప్పుడు రాముడు " నేను తండ్రిమాట నిలబెట్టడం కోసమని నా అంత నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కాని, తండ్రి ఆజ్ఞాపించకపోయినా, నాయందున్న ప్రేమ చేత స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలని తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి, 14 సంవత్సరములు రాజ్యమునందు మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్షని విరమించను " అన్నాడు.

భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకొని, దివ్యాభరణములను ధరించి బయటకి వచ్చాడు.

తన కొడుకు ఇన్నాళ్ళకి తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు 9000 ఏనుగుల్ని ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగుని తీసుకొచ్చి దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు, ఆ రథం యొక్క పగ్గములను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు మరొకపక్క విభీషణుడు వింద్యామర వేస్తున్నారు. అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు.

ప్రతి ఇంటిమీద పతాకాలు ఎగురవేశారు, అన్ని ఇళ్ళముందు రంగవల్లులు వేశారు, సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ అందరూ వెళుతున్నారు. ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి, ఆ వెనకాల వేద పండితులు నడిచారు, తరువాత పెద్దలు, వాళ్ళ వెనకాల కన్నె పిల్లలు, కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులు అయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక మరునాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదుల జలాలని వానరాలు తీసుకొచ్చాయి. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు.

వానరాలు తీసుకోచ్చిన ఆ జాలలని రాముడి మీద పోసి ఆయనకి పట్టాభిషేకం చేశారు. కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకారం చేశారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, లక్షల ఆవులు, వేల ఎద్దులు దానం చేశాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! యువరాజ పట్టాభిషేకం చేసుకో " అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు " అన్నయ్య! నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు. నాకు రాజ్యం వద్దు, భరతుడికి ఇవ్వు " అన్నాడు.

తరువాత యువరాజ పట్టాభిషేకం భరతుడికి జెరిగింది.

సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు మొదలైన వానర వీరులందరికీ బహుమతులు ఇచ్చారు. హనుమంతుడికి తెల్లటి వస్త్రముల ద్వయం, హారాలు ఇచ్చారు.

ఆ సమయంలో, సీతమ్మ తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. అప్పుడు రాముడు సీత వంక చూసి " ఈ హారాన్ని ఎవరికి ఇస్తావో తెలుసా. పౌరుషము, బుద్ధి, విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, పాండిత్యము ఎవడిలో ఉన్నాయో, అటువంటివాడికి ఈ హారాన్ని కానుకగా ఇవ్వు, అన్నిటినీమించి వాడు నీ అయిదోతనానికి కారణం అయ్యి ఉండాలి " అన్నాడు.

అప్పుడు సీతమ్మ ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. అప్పుడాయన ఆ హారాన్ని కన్నులకు అద్దుకొని మెడలో వేసుకున్నాడు.

ఎప్పుడైతే ధర్మాత్ముడైన రాముడు సింహాసనం మీద కూర్చున్నాడో, అప్పుడు ఎవరినోట విన్నా' రాముడు, రాముడు ' తప్ప, వేరొక మాట వినపడలేదు. రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు, శత్రువుల భయం లేదు, నెలకి మూడు వానలు పడుతుండేవి, భూమి సస్యశ్యామలంగా పంటలని ఇచ్చింది, చెట్లన్నీ ఫలపుష్పములతో నిండిపోయి ఉండేవి, చాతుర్వర్ణ ప్రజలు తమ తమ ధర్మములయందు అనురక్తులై ఉన్నారు, చిన్నవాళ్ళు మరణిస్తే పెద్దవాళ్ళు ప్రేతకార్యం చెయ్యడం రామ రాజ్యంలో లేదు. ఆ రాముడి పరిపాలనలో అందరూ సంతోషంగా ఉండేవారు.


రామాయణం యొక్క ఫలశ్రుతి -

ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్దిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటివారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు. సంతానం లేని రజస్వలలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటె, వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు, తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. వివాహము కానివారికి వివాహము జెరుగుతుంది, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము నిలబడుతుంది, మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది, దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు, ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, ఎన్నాళ్ళనుంచో జెరగని శుభకార్యాలు జెరుగుతాయి, పితృదేవతలు సంతోషిస్తారు.