Friday, September 7, 2012

రామాయణం - కిష్కింధా కాండ 6


వానరులు తిరిగి తిరిగి అలిసిపోయి, ఆకలి దప్పులతో అలమటిస్తూ, మయుడు నిర్మించిన ఋక్షబిలం వద్దకు చేరుకున్నారు. అందులోనుంచి పక్షులు ఎగిరి వస్తున్నాయి, సువాసనలు వెలువడుతున్నాయి. కాని బిలానికి అడ్డంగా లతల పొదలు ఉండటం చేత లోపలికి వెళ్ళటం కష్టంగా ఉన్నది.
 
‘‘ఈ బిలం లోపలినుంచి పక్షులు రావటం చూస్తూంటే, బయట ఉన్న పొదలు నవనవలాడుతూ ఉండటం చూస్తూంటే దీని లోపలబావో, చెరువో ఉంటుందని తోస్తున్నది,'' అన్నాడు హనుమంతుడు. వెంటనే వానరులు ఆ బిలం లోపలికి ప్రవేశించారు. లోపల గాఢాంధకారం. ఆ కటిక చీకటిలో వారు ఒకరి చేతులొకరు పట్టుకుని ముందుకు పోగా పోగా ఒక అద్భుతమైన ప్రదేశం వచ్చింది.
 
ఆ ప్రదేశం కాంతివంతంగా ఉన్నది. పెద్ద పెద్ద చెట్లున్నాయి. వెండి బంగారాలతో చేసి రత్నాలతో అలంకరించిన ఇళ్ళున్నాయి. బంగారు, వెండి, కంచు పాత్రలు రాసులుగా పోసి ఉన్నాయి. అలాగే అగరు చందనాలూ, ఫలాలూ, పానీయూలూ, బట్టలూ, రత్న కంబళ్ళూ, తోళ్ళూ, బంగారమూ పెద్ద పెద్ద రాసులలో కనిపించాయి.
 
దగ్గిరలోనే ఒక స్ర్తీ కృష్ణాజినమూ, నారబట్టలూ ధరించి, కాంతితో వెలిగిపోతూ తపస్సు చేసుకుంటున్నది. హనుమంతుడామెను సమీపించి నమస్కరించి, ‘‘నువ్వెవరు? ఇదేమి బిలం? మేము చాలా దూరం ప్రయూణించి, ఆకలి దప్పులతో అలమటిస్తూ నీరు దొరకుతుందనే ఆశతో తొందరపడి ఈ బిలం ప్రవేశించాం.

ఇక్కడి వింతలన్నీ చూస్తే ఇదంతా రాక్షసమాయేమో ననిపిస్తున్నది. ఈ ఇళ్ళూ, ఈ పళ్ళూ ఎవరివి? ఇక్కడి స్వచ్ఛమయిన కొలను నీళ్ళలో బంగారు కమలాలూ, బంగారు చేపలూ, బంగారు తాబేళ్ళూ ఎవరి మహిమ చేత కలిగాయి?'' అని అడిగాడు. దానికి ఆ తపస్విని ఈ విధంగా సమాధానం చెప్పింది: ‘‘దానవుల విశ్వకర్మ అయిన మయుడు ఇక్కడ నివసించేవాడు.
 
ఆయన దీర్ఘ తపస్సు చేసి బ్రహ్మ నుంచి గొప్ప వరాలు పొందాడు. ఆయనే తన శక్తిచేత ఈ ప్రదేశం సృష్టించి, హేమ అనే అప్సరతో ఇక్కడ సుఖంగా జీవిస్తూ వచ్చాడు. అది చూసి సహించలేక దేవేంద్రుడు మయుడిపై వజ్రాయుధం ప్రయోగించాడు. తరవాత బ్రహ్మ ఈ ప్రదేశం హేమ కిచ్చేశాడు. హేమ నా ఇష్ట సఖి. నేను మేరుసావర్ణి కుమార్తెను. నా పేరు స్వయంప్రభ. ఈ ప్రదేశాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉన్నాను.
 
మీ రిక్కడికి ఏ పని మీద వచ్చారు? ఇక్కడి ఫలాలూ నీళ్ళూ పుచ్చుకుని మీ ఆకలి దప్పులు తీర్చుకుని మీ వృత్తాంతం చెప్పండి.'' వానరులందరూ పళ్ళు తిని, నీరు తాగి సంతృప్తులయినాక హనుమంతుడు స్వయం ప్రభకు తమ పూర్వోత్తరాలు క్లుప్తంగా ఇలా చెప్పాడు: ‘‘దశరథ మహారాజు కొడుకు రాముడు త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడితో సమానుడు.
 
అతను తన తమ్ముడైన లక్ష్మణుడితోనూ, భార్య అయిన సీతతోనూ దండకారణ్యానికి వచ్చాడు. వారు జనస్థానంలో ఉండగా సీతాదేవిని రావణుడు బలాత్కారంగా తీసుకుపోయూడు. రాముడి మిత్రుడైన సుగ్రీవుడు సమస్త వానరులకు రాజు. ఆయన సీతాదేవిని వెతికే నిమిత్తమై మమ్మల్ని దక్షిణ దిశకు పంపాడు. మేము దక్షిణ దిశ అంతా కలయ వెతికి, ఆకలి చెంది, అలసిపోయి ఒక చెట్టు కింద కూచుని ఉండగా లతలు కప్పి ఉన్న గొప్ప అంధకార బిలం కనిపించింది.
 
తడి విదిలించుకుంటూ ఈ బిలం నుంచి పక్షులు బయటికి రావటం చూసి నేనే ఈ వానరులందరినీ ప్రోత్సహింప జేసి బిలంలో ప్రవేశించమన్నాను. మేము ఇలా వచ్చి ఇక్కడ చేరుకున్నాం. అదృష్టవశాన నువ్వు మాకు తటస్థపడి మా ఆకలి తీర్చి, మేలు చేశావు.

హనుమంతుడు స్వయంప్రభకు ఈ విధంగా తమ వృత్తాంతమంతా చెప్పి, ‘‘నువ్వు మాకు ప్రాణదానం చేశావు. దీనికి ఏ ప్రత్యుపకారం కోరినా చేస్తాము. మేము ఈ బిలంలో ప్రవేశించామేగాని ఇందులో నుంచి ఎలా బయట పడాలో తెలియటం లేదు,'' అన్నాడు. స్వయంప్రభ తన కేమీ ప్రత్యుపకారం అవసరం లేదనీ, వానరులంతా కళ్ళు మూసుకుంటే వారిని తన తపశ్శక్తితో బిలం వెలుపల చేర్చుతాననీ అన్నది. వానరులందరూ కళ్ళు మూసి తెరిచేసరికి బిలం వెలుపల ఉన్నారు.
 
స్వయంప్రభ వారున్న చోటికి కొండ గుర్తులు చెప్పి బిలంలోకి వెళ్ళిపోయింది. వింధ్య పర్వతపు పడమటి పార్శ్వపుటంచున కూచుని, పశ్చిమ సముద్రాన్ని చూస్తూ తమ గడువు ముగిసిందనీ, శిశిరం వెళ్ళి వసంతం కూడా రాబోతోందనీ గుణించుకుని వానరులందరూ చింతలో మునిగిపోయూరు. అప్పుడు అంగదుడు మిగిలిన వానరులతో, ‘‘మనమంతా సుగ్రీవుడి ఆజ్ఞకు లోబడి వచ్చాం.
 
ఆయన చెప్పిన గడువు లోపల సీత జాడ తెలుసుకోలేక పోయూం. ఇప్పటికే ఆయన ఆజ్ఞ మీరిన వాళ్ళమయ్యూం. సుగ్రీవుడు చాలా క్రూరుడు, మీదుమిక్కిలి రాజు. మనని క్షమించడు. ఆయన వద్దకు తిరిగి పోవడం కన్న అన్న పానాలు మాని ప్రాయోపవేశం చేసి చావటం మేలు. కావటానికి నేను యువరాజునే కాని నన్ను యువరాజు చేసినది సుగ్రీవుడు కాదు, రాముడు.

సుగ్రీవుడికి నా మీద చాలా పగ ఉన్నది. నేను ఇప్పుడు అతడికి దొరికితే నన్ను ప్రాణాలతో వదలడు,'' అన్నాడు. మిగిలిన వానరులు కూడా ఇలాగే భావించారు. కనీసం సీత వార్త అయినా తెలిస్తే రాముడు సంతోషించి, గడువు దాటినందుకు శిక్ష పడకుండా చూస్తాడేమో! కాని సీత జాడ తెలియక, గడువు దాటి కిష్కింధకు వెళ్ళటం కన్న ఇక్కడే ఉండిపోవటం మేలని వారు భావించారు.
 
ముఖ్యంగా తారుడు వారితో, ‘‘ఇంత ఆలోచన దేనికి? మీ కిష్టమైతే ఈ బిలంలోనే ఉండి పోదాం,'' అన్నాడు. అంగదుడి మాటకారితనమూ, ధోరణీ గమనిస్తున్న హనుమంతుడు తనలో, ‘‘అబ్బో, వీడు సుగ్రీవుడి, రాజ్యం కాజేసేలాగే ఉన్నాడే!'' అనుకుని వానరులకూ అంగదుడికీ మధ్య భేదం కలిగించటానికి గాను, ‘‘అంగదుడా, వానరులకు ఈ క్షణం ఉన్న ఆలోచన మరుక్షణం ఉండదు.
 
వీరందరూ భార్యలనూ, బిడ్డలనూ వదిలేసి నీ ఆజ్ఞలు పాటిస్తూ నిజంగానే ఇక్కడ ఉండి పోతారని నమ్ముతున్నావా? ఉన్న మాట చెబుతాను విను. నేనుగాని, ఈ జాంబవంతుడుగాని, నీలుడుగాని, సుహోత్రుడుగాని సుగ్రీవుణ్ణి విడిచి నిన్ను అనుసరించటం కల్ల. అదీగాక బలవంతుడితో వైరం కూడదు. ఈ బిలం నిన్ను లక్ష్మణ బాణాల నుంచి కూడా రక్షించ లేదు. తెగ బడి యుద్ధమే చెయ్యటానికైనా నువ్వు వాలి కన్న బలశాలివి కావుగదా!
 
ఈ వానరులందరూ నీ మాట అనుసరిస్తారని భ్రమపడితే త్వరలోనే ఒంటరిగాడివై లేని పోని చిక్కులపాలై పోతావు. సుగ్రీవుడికి నీ పైన పగ అన్నది నిజం కాదు,'' అన్నాడు. ఈ మాట లేవీ అంగదుడి చెవికెక్కలేదు. అతను కోపావేశంతో, ‘‘సుగ్రీవుడికి స్థిరబుద్ధీ, ఆత్మశుద్ధీ, చిత్తశుద్ధీ, దయూ, పరాక్రమమూ, గాంభీర్యమూ ఏ కోశానా లేవు.
 
రాక్షసుడితో పోరటానికి బిలంలోకి దూరిన తన అన్న బయటికి రాకుండా బిలానికి కొండ రాయి అడ్డం పెట్టిన ద్రోహి. తనకు రాజ్య దానం చేసిన రాముణ్ణే మరిచిన కృతఘు్నడు. లక్ష్మణుడి భయం కొద్దీ సీతాన్వేషణకు గాను మనని పంపాడేగాని అతనికి అధర్మభయం ఎక్కడిది? అటువంటివాడు, తన కొడుక్కు రాజ్యమిస్తాడుగాని నా కిస్తాడా? తన ఆజ్ఞ మీరిన వంక పెట్టి నన్ను తప్పక ఉరి తీయిస్తాడు.

నేను తిరిగి రాను; ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను. నన్ను వదిలి మీరంతా వెళ్ళండి. రామ లక్ష్మణులకూ, మా పినతండ్రికీ, పినతల్లి రుమకూ నా నమస్కారాలు చెప్పండి. నేనంటే ప్రాణంకన్న ఎక్కువగా చూసే నా తల్లిని ఊరడించండి. ఆమె ఎలాగూ నాకోసం ప్రాణాలు విడుస్తుంది,'' అని మిగిలిన వానరులకు నమస్కారాలు చేసి, భూమి మీద దర్భలు పరుచుకుని వాటిపై ఏడుస్తూ పడుకున్నాడు.
 
అంగదుణ్ణి చూసి వానరులందరికీ ఆగకుండా దుఃఖం వచ్చింది. వాళ్ళు వాలిని మెచ్చుకుని సుగ్రీవుణ్ణి తిట్టుతూ, తాము కూడా ప్రాయోపవేశం చేయ నిశ్చయించారు. సముద్రంలో స్నానం చేసి తీరాన దర్భలు పరిచి వారంతా తూర్పు ముఖంగా పడుకున్నారు. అలా పడుకుని వారు రాముడు అరణ్యవాసానికి బయలుదేరినది మొదలు జరిగిన సంఘటనలన్నీ చెప్పుకుంటూ ఉండగా ఒక భయంకరమైన ఆకారం గల గద్ద వారికి కనిపించింది.
 
దానిని చూస్తూనే భయంతో వారు పెట్టిన కేకలకు గుహలన్నీ మారుమోగాయి. ఆ వచ్చినది జటాయువు అన్న అయిన సంపాతి. అతను వింధ్య పర్వతం మీది ఒక గుహలో ఉంటున్నాడు. అతను గుహలో నుంచి వెలికి వచ్చి, ‘‘దేవుడి దయ వల్ల ఇవాళ నాకు కావలిసినంత ఆహారం! ఈ వానరులందర్నీ వరసగా చంపి కడుపు నింపుకుంటాను,'' అన్నాడు. ఆ మాటలు విని అంగదుడు హనుమం తుడితో, ‘‘మన కెలాటి గతి పట్టింది?

యముడు ఈ గద్ద రూపంలో మనని కడతేర్చ వచ్చాడు. మనమా రాముడి పని తీర్చినవాళ్ళమూ కాలేదు, సుగ్రీవాజ్ఞ నిర్వర్తించిన వాళ్ళమూ కాలేదు. మన కన్న ఆ జటాయువు మేలు; అతను రాముడి కోసం ప్రాణాలు వదిలాడు. మనం రామకార్యం మీద బయలుదేరామన్న మాటేగాని అది చెయ్యకుండానే ఈ గద్ద నోట పడబోతున్నాం. మన చావుకు ఎన్ని కలిసి వచ్చాయో!
 
జటాయువు ప్రాణాలు వదలక పోతే మనకు సీతను వెతక వలిసిన పనే ఉండేది కాదు; రావణుడి సంగతి అతనే చెప్పేవాడు. రావణుడు సీత నెత్తుకు పోక పోతే ఆమె కోసం వెతికే పనే ఉండేది కాదు. దశరథుడు చావకపోతే ఏనాడో రాముణ్ణి పిలిపించుకుని ఉండేవాడు. అసలు దశరథుడా కైకేయికి వరాలే ఇవ్వకపోతే ఏ బెడదా ఉండకనేపోను. ఇవన్నీ మన వానరులందరి ప్రాణం తియ్యటానికే జరిగాయి,'' అన్నాడు.
 
సంపాతి గట్టిగా, ‘‘ఎవడది? నా తమ్ముడు చచ్చిపోయినట్టు మాట్లాడుతున్నాడు! ఇంత కాలానికి నా తమ్ముడి పేరు విన్నాను గదా అని సంతోషించాను. అంతలోనే ఎంతటి దుర్వార్త! నాయనలారా, నా రెక్కలు సూర్య కిరణాలకు కాలిపోయూయి. నేను మీ దగ్గిరికి రాలేను. దయచేసి నన్ను మీరున్న చోటికి దించండి,'' అని అరిచాడు. వానరులు ఇదంతా దొంగ ఎత్తనుకున్నారు.
 
అయినా తాము చావటానికి సిద్ధమయ్యే ఉన్నారు గనక, ఆ చావు ఈ విధంగా త్వరగా రావటం కూడా మేలేనేమోనని వారికి తోచింది. అంగదుడు మాత్రం లేచి వెళ్ళి సంపాతిని కొండ మీది నుంచి దించి కిందికి తెచ్చాడు. అతను సంపాతితో రాముడు అరణ్యవాసం రావటమూ, జనస్థానంలో ఉన్న సీతను రావణుడు అపహరించటమూ, అది చూసి జటాయువు రావణుడితో ఘోర యుద్ధం చేసి చనిపోవటమూ, రామలక్ష్మణులు సీతను వెతుక్కుంటూ ఋశ్యమూకానికి వచ్చి, సుగ్రీవుడి స్నేహం చేసి, వాలిని చంపి, వానర రాజ్యాన్ని సుగ్రీవుడి కివ్వటమూ, సుగ్రీవుడు సీతాన్వేషణకై తమను పంపటమూ, తాము విఫలులై, తిరిగి వెళ్ళలేక ప్రాయోపవేశం చెయ్యటమూ వివరించి చెప్పాడు.

No comments:

Post a Comment