Friday, September 7, 2012

రామాయణం - సుందరకాండ 4


త్రిజట తన కల గురించి రాక్షసస్ర్తీలకు చెబుతూండగా మరోవైపు సీత దుఃఖ వివశురాలై బెంబేలు పడిపోయింది. ఎటు చూసినా ఆమెకు ఆశ అన్నది లేదు. రావణుడో, రాక్షస స్త్రీలో తనను తప్పక చంపుతారనీ, తాను రాముడి కొరకు ఇంత కాలమూ ఎదురు చూడటం నిష్ర్పయోజన మయిందనీ ఆమె అనుకున్నది. నోరెండిపోతూ ఆమె శింశుపా వృక్షం కిందికి పోయి, ఆత్మహత్య చేసుకునే ఆలోచన చేస్తూ తన జడను మెడకు చుట్టుకున్నది. అంతలోనే ఆమెకు శుభ శకునాలు కలిగాయి. ఆమె ఎడమ కన్ను గట్టిగా అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది. ఈ శుభ శకునాలు చూసి ఆమెకు కొత్త ప్రాణం వచ్చినట్టయింది.

ఇంతసేపూ శింశుపా వృక్షంలో కూర్చుని ఉన్న హనుమంతుడు అంతా చూశాడు. అన్నీ విన్నాడు. కాని అతనికి ఏం చెయ్యటానికీ ఒకంతట పాలుపోలేదు. తాను రాముడి వార్త సీతకు చెప్పి, ఆమె సందేశం రాముడికి అందించాలి. సీతతో మాట్లాడకుండానే తిరిగిపోతే సీతకు రాముడి విషయం తెలియదు; ఆమె ఇక్కడి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవచ్చు. అదీ గాక, ‘‘సీత ఏమన్నది?’’ అని రాముడు తప్పక అడుగుతాడు. ‘‘నేనామెతో మాట్లాడలేదు,’’ అంటే రాముడు తన చూపులతోనే నన్ను దగ్ధం చేస్తాడు.
 
పోనీ సీతతో మాట్లాడతామంటే రాక్షస స్త్రీలంతా ఉన్నారు. పైగా, సీత తనను చూసి రావణుడే మాయా రూపంలో వచ్చాడనుకుంటుందేమో! అప్పుడామె భయపడి కెవ్వున అరవగానే రాక్షస స్ర్తీలు తన పైకి ఆయుధాలతో వస్తారు. తన చేత దెబ్బలుతిని వాళ్ళు రాక్షస యోధులను పిలుచుకు వస్తారు. వాళ్ళతో యుద్ధం చేసి అలసిపోతే తాను మళ్ళీ నూరు యోజనాల సముద్రం లంఘించలేక పోవచ్చు. ఒక వేళ తాను రాక్షసుల చేతిలో చావటమే జరిగితే సీత వార్త చెప్పేవాడుండడు.

 ‘‘నేను చెప్పే మాటలు సీత ఆలకించాలి, కాని ఆమె నన్ను చూసి భయపడగూడదు. అలా మాట్లాడే మార్గమేది?’’ అని హనుమంతుడు దీర్ఘంగా ఆలోచించి అందుకొక మంచి మార్గం కనిపెట్టాడు. అతను చెట్టు కొమ్మల మాటున సీతకు కనిపించకుండా కూర్చుని, ఆమెను చూస్తూ ఆమెకు వినిపించేలా ఇలా ప్రారంభించాడు: ‘‘దశరథుడనే ఒక గొప్ప రాజు. ఆయన జ్యేష్ఠపుత్రుడు రాముడు మిక్కిలి అందమైనవాడు, గొప్ప విలుకాడు. తండ్రి ఆజ్ఞచేత ఆ రాముడు భార్యనూ, తమ్ముణ్ణీ వెంట బెట్టుకుని అరణ్యాలకు వెళ్ళాడు.

అక్కడ అతను ఖరుడు మొదలైన అనేక రాక్షసులను చంపాడు. ఈ సంగతి తెలిసి రావణుడు మాయలేడి సహాయంతో రాముణ్ణి మోసపుచ్చి, అతడి భార్య అయిన సీతను అపహరించాడు. రాముడు సీతను వెతుకుతూ వచ్చి, సుగ్రీవుడనే అతనితో స్నేహం చేసి, వాలి అనే వానర రాజును చంపి, ఆ రాజ్యాన్ని సుగ్రీవుడికిచ్చాడు. ఆ సుగ్రీవుడు సీతాదేవిని వెతకటానికి అన్ని దిక్కులకూ వేలకువేల వానరులను పంపాడు. ఆ ప్రయత్నంలో నేను నూరు యోజనాల సముద్రాన్ని లంఘించి ఈ లంకకు వచ్చి, రాముడు వర్ణించిన సీతను చూడగలిగాను.’’

హనుమంతుడీ మాటలని మౌనం వహించగానే సీత ఆశ్చర్యంతోనూ, సహజమైన భయంతోనూ తల ఎత్తి శింశుపా వృక్షం కేసి చూసింది. ఆమెకు హనుమంతుడు కనిపించాడు. సీత తన కళ్ళనూ, చెవులనూ, తానే నమ్మలేక, తాను కలగంటున్నాననీ, కలలో కోతి కనిపించటం చాలా చెడ్డదనీ భయపడింది. తరవాత ఆమె తాను కలకనటం లేదని రూఢిచేసుకుని, భ్రమపడుతున్నాననుకున్నది.


 ఈలోపల హనుమంతుడు చెట్టుదిగి వచ్చి, కొంతదూరంలో నిలబడి నమస్కారం చేసి, ‘‘అమ్మా, జీర్ణించిన పట్టుచీరె కట్టుకుని,  చెట్టుకొమ్మ పట్టుకుని నిలబడి ఉన్నావు, నువ్వెవరవు? ఏ జాతికి, ఏ గణానికి చెందిన దానివి? నిన్ను చూస్తే దేవతవనిపిస్తున్నది. నీ తండ్రి ఎవరు? భర్త ఎవరు? పెద్ద దుఃఖంలో ఉన్నావు, నీ బంధువు ఎవరైనా పోయారా? జనస్థానం నుంచి రావణుడు అపహరించి తెచ్చిన సీతవే అయితే ఆ మాట వెంటనే చెప్పు,’’ అన్నాడు.

సీత హనుమంతుణ్ణి చూసి, ‘‘నేను దశరథుడి కోడలిని, జనకుడి కూతురిని, రాముడి భార్యను. నా పేరు సీత అంటారు. నేను కాపరానికి వచ్చిన పదమూడో ఏట నా భర్తకు రాజ్యాషేభికం జరగనుండగా, దశరథుడి భార్య అయిన కైకేయి అనే ఆమె రామ పట్టాభిషేకం చేస్తే తాను ప్రాణత్యాగం చేస్తాననీ, రాముణ్ణి వనవాసం పంపెయ్యమనీ కోరింది. తండ్రి యాచించిన మీదట రాముడు తాను పుచ్చుకోనున్న రాజ్యాన్ని తిరిగి తండ్రికి ఇచ్చివేశాడు. అతను నారబట్టలు కట్టుకుని వనవాసం పోతూ నన్ను తన తల్లి అయిన కౌసల్య వద్ద ఉండమన్నాడు. నేను రాముణ్ణి విడిచి ఉండలేక వెంట బయలుదేరాను. నా కన్న ముందే నారబట్టలు కట్టి బయలుదేరాడు లక్ష్మణుడు. మేము దండకారణ్యంలో ఉండగా దుర్మార్గుడైన రావణుడు నన్ను ఇక్కడికి తెచ్చాడు. ఆ రావణుడు నన్నింకా రెండు నెలలు బతకనిస్తాడు, ఆ తరవాత నాప్రాణాలు తీస్తాడు,’’ అన్నది.

సీత దుఃఖం చూసి హనుమంతుడికికూడా దుఃఖం వచ్చింది. అతను ఆమెకు దుఃఖోపశమనం కలిగేటట్టుగా, ‘‘సీతాదేవీ, రాముడి దూతగా నేను నీ వద్దకు వచ్చాను. రాముడు తన క్షేమం నీకు చెప్పి, నీ క్షేమం తెలుసుకు రమ్మన్నాడు. లక్ష్మణుడు నీకు సాష్టాంగ నమస్కారం చేశాడు,’’ అని చెప్పాడు. ఈ మాటలు వినగానే సీతకు శరీరమంతా పులకరించింది. ‘‘మనిషి బ్రతికి ఉండాలే గాని నూరేళ్ళకైనా ఆనందం కలగకపోదంటారు. అది నా విషయంలో నిజమయింది,’’ అన్నదామె.


సీతకు తనపై నమ్మకం కుదిరిందనుకుని హనుమంతుడు ఆమెను సమీపించాడు. ఇది చూసి సీత, రావణుడే వానర రూపంలో వచ్చాడని అనుమానించి, అతనితో ఆత్మీయంగా మాట్లాడినందుకు భయపడుతూ, అశోకవృక్షం కొమ్మ విడిచి నేలపై చతికిల బడింది. తనకు నమస్కారం చేస్తున్న హనుమంతుడి ముఖం చూడటానికి కూడా ఆమెకు ధైర్యం చాలలేదు. ఆమె హనుమంతుడితో, ‘‘నువ్వు నిజంగా రావణుడివే. ఇప్పుడీ కోతి రూపంలో వచ్చావు. ఆ నాడు సన్యాసి రూపంలో వచ్చావు. నేనసలే దుఃఖంతోనూ, ఉపవాసాలతోనూ కృశించి ఉన్నాను. నన్నిలా మరింత బాధపెడుతున్నావెందుకు? ఇది నీకు మంచిదికాదు. ఒక వేళ నువ్వు నిజంగా రామదూతవే అయితే రాముడి గుణగణాలు వర్ణించు. అతడి గుర్తులు చెప్పు. రాముడితో నీకెప్పుడు సంబంధం కలిసింది? నువ్వు రామలక్ష్మణుల నెలా ఎరుగుదువు? నర వానరులకు పొత్తు ఎలా కుదిరింది?’’ అని అడిగింది.

హనుమంతుడు రాముడి గుణగణాలు వివరించాడు. రాముణ్ణి ఆపాదమస్తకమూ వర్ణించాడు. సీతాపహరణానంతరం రామలక్ష్మణులు ఋశ్యమూక పర్వత ప్రాంతానికి వచ్చినది మొదలు తాను లంకకు వచ్చిన దాకా జరిగినదంతా పూసగుచ్చినట్టు సీతకు చెప్పాడు. తాను హనుమంతుణ్ణనీ, సుగ్రీవుడి మంత్రిననీ తెలిపి రాముడిచ్చిన ముద్రికను సీత చేతిలో పెట్టాడు.

సీతకు హనుమంతుడియందు నమ్మకం కుదిరింది. ఆమె ముఖం విప్పారింది. ఆమె ఆంజనేయుణ్ణి పొగడుతూ, అతడు మామూలు కోతి కాడనీ, ఎంతో శక్తిసామర్థ్యాలుండబట్టే సముద్రం దాటి రాగలిగాడనీ, రావణుడు కూడా అతణ్ణి ఏమీ చేయలేడనీ అన్నది. అప్పటికప్పుడే ఆమె రాముడు వచ్చి తనను రక్షిస్తాడనీ, అయోధ్య నుంచి భరతుడు కూడా వానరసేనకు తోడుగా ఒక అక్షౌహిణి సేనను పంపుతాడనీ, రామలక్ష్మణులు సపరివారంగా రావణుణ్ణి యుద్ధంలో హతమార్చుతారనీ కలలు కన్నది. మరి కొంత సేపటికి రాముడు తనను తీసుకుపోతాడో పోడో అన్న అనుమానం కూడా ఆమెకు కలిగింది; తీసుకుపోకపోతే ఇక్కడే ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకున్నది.


రాముడు ఆస్తమానమూ సీతనే స్మరిస్తూంటాడనీ, ఆమె వెళ్ళిపోయిన తరవాత అతను సరిగ్గా ఆహార పానీయాలు తీసుకోవడం కూడా మానేశాడనీ, సీత ఇక్కడ ఉన్నదని తెలియగానే వచ్చి వాలుతాడనీ హనుమంతుడు చెప్పాడు. తనకు రావణుడిచ్చిన ఏడాది గడువులో పది నెలలు నిండవచ్చాయనీ, మిగిలిన రెండు మాసాలలోగా రాముణ్ణి రమ్మని చెప్పమనీ సీత హనుమంతుడితో అన్నది. ఆమె హనుమంతుడితో ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పింది: లంకలో సీత పక్షం వహించిన వారున్నారు; వారిలో విభీషణుడూ, అతని భార్యా, అతని పెద్ద కూతురు నలా, అవింధ్యుడనే ఒక రాక్షసుడూ ఉన్నారు.

హనుమంతుడు సీతతో, ‘‘అమ్మా, నువ్విక ఒక్క క్షణంకూడా దుఃఖించనవసరంలేదు. నా వీపు పైన ఎక్కు, ఒక్క క్షణంలో సముద్రాన్ని దాటేస్తాను,’’ అన్నాడు. హనుమంతుడు చిన్న ప్రమాణంలో ఉండటం చూసి సీత అతని మాటలు నమ్మలేక, ‘‘నువ్వేమిటి? నన్ను వీపున ఎక్కించుకుని సముద్రం దాటటమేమిటి? మొత్తానికి కోతి వనిపించావు,’’ అన్నది.

ఈ మాట హనుమంతుడికి అవమాన మయింది. అతను సీతకు కొంచెం ఎడంగా వెళ్ళి తన శరీరాన్ని భయంకరంగా పెంచాడు. అతని శరీరం మండుతున్నట్టు కాంతి వంతంగా కనబడింది. ‘‘సీతాదేవీ, నిన్నే కాదు; ఈ లంకనంతా పాదుతో సహా పెరికి తీసుకుపోగలను. అందుచేత భయపడక నా వెంబడి వచ్చెయ్యి,’’ అన్నాడతను.


కాని సీత అభ్యంతరాలు చెప్పింది. తనను వీపున ఎక్కించుకుని సముద్రం మీదుగా బయలుదేరగానే సాయుధులైన రాక్షసులు చుట్టు ముట్టుతారనీ, తాను భయపడి సముద్రంలో పడిపోవచ్చుననీ, అందువల్ల తనకూ, హనుమంతుడికీ కూడా అపాయం కలగవచ్చుననీ, ఒక వేళ హనుమంతుడే రాక్షసుల నందరినీ చంపినా అందువల్ల రాముడికి అపకీర్తి వస్తుందనీ, అందుచేత హనుమంతుడు వెంటనే తిరిగి వెళ్ళి రాముణ్ణి తీసుకురావటమే మేలనీ అన్నది. హనుమంతుడు పరపురుషుడు గనక అతడి శరీరాన్ని తాకటానికి తన కభ్యంతరం వున్నట్టు సీత సూచన ప్రాయంగా పరోక్షంగా తెలియజేసింది.

హనుమంతుడీ అభిప్రాయాన్ని గ్రహించి, ‘‘పరపురుషుడినైన నా వీపుపై ఎక్కటానికి నీ కభ్యంతరం ఉండటం భావ్యమే. నిన్ను నేను చూసినట్టు గుర్తుగా రాముడికి ఏమైనా ఇయ్యి,’’ అన్నాడు. రాముడికి గుర్తుగా ఉండగలందులకు సీత హనుమంతుడితో ఒక పాత సంఘటన చెప్పింది. ఈ సంఘటన చిత్రకూట పర్వతం వద్ద గంగాతీరాన ఒక ఋష్యాశ్రమంలో సీతా రాములుండగా జరిగింది. ఒకనాడు సీత అక్కడి పుష్పవనంలో విహరించి అలసిపోయి రాముడి తొడపై కూర్చున్నది. అప్పుడొక కాకి వచ్చి సీత రొమ్ముమధ్య పొడిచింది. సీతకు కోపం వచ్చి, మంటిబెడ్డతో దాన్ని తరిమింది. కాని ఆ కాకి వెళ్ళిపోక మాటిమాటికీ సీత మీదికి రాసాగింది. కాకి చేత అవస్థపడుతూండే సీతను చూసి రాముడు హేళన చేసి, కోపం తెప్పించి తరవాత ఆమెను ఓదార్చాడు. తరవాత సీత రాముడి తొడపై తల పెట్టుకుని చాలా సేపు నిద్రపోయింది. ఆమె నిద్రలేవగానే రాముడు ఆమె తొడపై తల పెట్టుకుని తాను కూడా నిద్రపోయాడు. ఆ కాకి తిరిగి వచ్చి సీతను మళ్ళీ రొమ్ములో గీరి వేధించ  సాగింది. ఆమెకు పెద్ద గాయమై రక్తం కారి రాముడు కూడా తడిశాడు.

ఆఖరికి కాకి బాధ భరించలేక సీత రాముణ్ణి నిద్ర లేపింది. రాముడు నిద్ర లేచి, సీత రొమ్మున గాయం చూసి మండిపడుతూ, ‘‘ఇంతగా నిన్ను గాయపరిచిన దుర్మార్గుడెవరు?’’ అని అడిగాడు. అతను అటూ ఇటూ చూసే సరికి గోళ్ళనిండా నెత్తురుతో కాకి కనిపించింది. రాముడు దర్భాసనం నుంచి ఒక దర్భను లాగి బ్రహ్మాస్త్రం పఠించాడు. ఆ దర్భ ప్రళయూగ్ని లాగా ప్రజ్వరిల్లుతూ కాకి పైకి వెళ్ళింది.




No comments:

Post a Comment