గుహుడు భరతుడికి సహాయం చేస్తానన్నాడేగాని, లోలోపల అతన్ని సందేహం ఇంకా
బాధిస్తూనే ఉన్నది. అతడు భరతుడితో, ``అయ్యా, నీ సేనా, అట్టహాసమూ చూస్తే
నాకేదో అనుమానంగా ఉన్నది. నీవు వెళ్ళేది రాముడికి ద్రోహం తలపెట్టి కాదు
గద?'' అని అడిగాడు. ఈ మాటకు భరతుడు బాధపడి, ``నీకీ అనుమానం కలగటం కన్న
పెద్ద కష్టం నా కేమి ఉంటుంది? పెద్ద అన్న అయిన రాముడు నాకు తండ్రితో సమానం
కాదా? రాముణ్ణి తీసుకురావటానికే నేను పోతున్నాను.
నా మాట నము్మ,'' అన్నాడు. ``మంచిమాట అన్నావు, బాబూ. నీలాగా చేతికందిన
రాజ్యాన్ని విడిచిపుచ్చే వాళు్ళ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నీ కీర్తి
శాశ్వతం,'' అన్నాడు గుహుడు. అస్తమయమై చీకటి పడింది. ఆ రాత్రి
భరతశత్రుఘు్నలు పడుకుని నిద్రపట్టక చాలా సేపు రాముణ్ణి గురించి చాలా
దుఃఖించారు. వారి వెంట ఉన్న గుహుడు వారిని ఓదార్చాడు. అతడు లక్ష్మణుణ్ణి
గురించి గొప్పగా చెప్పాడు: ``రాముడు నిద్రపోతున్నప్పుడు తాను మేలుకునే ఉండి
రాముడికి ఏ భయమూ లేకుండా కాపాడతాను, నిద్రపొమ్మని చెప్పాను.
కాని విన్నాడుకాడు. రాముడూ, సీతా కటిక నేలపై పడుకున్నందుకే తన
ప్రాణాలు కొట్టుకుపోతూ ఉంటే ఇక నిద్ర ఎలా పడుతుందని అడిగాడు. రాముణ్ణి
వదిలి దశరథుడు ఒక్క రోజు బతుకుతాడా అన్నాడు. పధ్నాలుగేళు్ళ వనవాసం చేసి
మేము మళ్ళీ అయోధ్యకు తిరిగిపోతామా అని చింతించాడు. అదుగో, ఆ మర్రిచెట్టు
కిందనే రామలక్ష్మణులు జడలు ధరించారు.
తెల్లవారినాక నేను వారి చేత గంగ దాటించాను.'' గుహుడు ఈ విధంగా చెప్పుకుపోతూ
ఉంటే భరతుడికి దుఃఖం హెచ్చిపోయింది. కన్నీటి ధారలను ఆపుకోలేక పోయాడు.
కౌసల్యా, సుమిత్రా, కైకా కూడా అతనున్న చోటికి వచ్చారు. వారి ఆసక్తి చూసి
గుహుడు వారితో రాముణ్ణి గురించి ప్రతి వివరమూ చెప్పాడు. సీతారాములు
గారచెట్టు కింద పడుకున్న చోటుకూడా చూపాడు.
దశరథ మహారాజు పెద్దకొడుకు ఆ చెట్టు కింద దర్భలు పరుచుకుని పడుకోవటం
భరతుడు ఊహించనైనా లేకపోయాడు. ఆ రాత్రి గడిచినాక గుహుడు సూర్యోదయమవుతూండగా
వచ్చి భరతుడికి నమస్కారంచేసి, ``రాత్రి సుఖంగా గడిచిందా? హాయిగా
నిద్రపోయారా?'' అని అడిగాడు. ``మాకు ఏలోటూ జరగలేదు. మేము త్వరగా మా అన్న
రాముణ్ణి చూడాలి.
మమ్మల్ని త్వరగా నది దాటించే ఏర్పాట్లు చేయించు,'' అన్నాడు భరతుడు.
గుహుడు అయిదువందల పడవలూ, స్వస్తికాలనే పేరు గల మేలుజాతి ఓడలూ సిద్ధం
చేయించాడు. తెల్ల కంబళి పరిచిన ఒక స్వస్తికంలో భరతశత్రుఘు్నలూ, వసిష్ఠుడూ,
రాజభార్యలూ ఎక్కారు. భరతుడి సేనా, రథాలూ, బళూ్ళ, వాటినిలాగే జంతువులూ,
సంబారాలూ, సమస్తమూ పడవలలోకి ఎక్కించారు. పడవలు నది దాటాయి. ఏనుగులు నదికి
అడ్డంగా ఈదాయి. అలాగే కొందరు మనుషులుకూడా ఈదారు. మరి కొందరు తెప్పలమీదా,
కుండల సహాయం తోనూ నది దాటారు.
తరవాత భరతుడు ప్రయాగవనానికి సపరివారంగా చేరుకుని, వసిష్ఠాదుల సల హాతో
భరద్వాజ మహర్షిని చూడ బయలుదేరాడు. భరద్వాజాశ్రమం కోసు దూరంలో ఉందనగానే
సైన్యమంతా ఆగి పోయింది. భరతుడు తన ఆయుధాలూ, ఆభరణాలూ తీసివేసి, పట్టుబట్టలు
కట్టుకుని, వసిష్ఠుణ్ణీ, మంత్రులనూ వెంటబెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళాడు.
మంత్రులు ఆశ్రమంలో నిలిచిపోయారు. వసిష్ఠ భరతులు భరద్వాజుడి కుటీరానికి
వెళ్ళారు. వారిని చూస్తూనే భరద్వాజుడు, ``అర్ఘ్యం తీసుకు రండి,'' అని కేక
పెట్టి లేచి నిలబడ్డాడు.
భరతుణ్ణి వసిష్ఠుడు పరిచయం చేసినాక భరద్వాజుడు క్షేమసమాచారాలడిగి,
``నాయనా, నీవు హాయిగా రాజ్యపాలన చేసుకోక ఇలా ఎందుకు వచ్చావు?'' అన్నాడు.
భరతుడు రామలక్ష్మణులకు ద్రోహం తలపెట్టి వచ్చాడన్న అనుమానం ఆయనకుకూడా
కలిగింది. భరతుడిందుకు మనసులో ఎంతో నొచ్చుకుని, గుహుడికి చెప్పినట్టే
భరద్వాజుడితో కూడా తన ఉద్దేశం చెప్పాడు. అంతా విని భరద్వాజుడు సంతోషించి,
``సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో ఉంటున్నారు.
ఇవాళ ఇక్కడ ఉండి, రేపు పోదువుగాని,'' అన్నాడు. ఇందుకు భరతుడు
సమ్మతించాడు. ``నీ సేనలకన్నిటికీ నేను విందు చేయాలనుకుంటున్నాను. వారి
నందరినీ దూరాన ఎందుకు ఉంచి వచ్చావు? ఇక్కడికి వారిని కూడా నీ వెంట
తేవలిసింది,'' అన్నాడు భరద్వాజుడు. ``మహాత్మా, ముని ఆశ్రమాలకు సేనలు దూరంగా
తొలగివెళ్ళాలన్న నియమాన్ని బట్టి సేనను దూరంగా ఉంచాను,'' అని భరతుడు
సవినయంగా చెప్పాడు. ``ఫరవాలేదు, నీ సేనను పిలిపించు,'' అని భరతుడితో చెప్పి
భరద్వాజుడు తన అతిథులకు అపూర్వమైన ఆతిథ్యం ఏర్పాటుచేశాడు.
విశ్వకర్మ వచ్చి క్షణంలో అద్భుతమైన ఇళు్ళ ఏర్పాటుచేశాడు. నదులన్నీ
వచ్చి నీరూ, మైరేయం అనే సుమధర పానీయం సిద్ధం చేశాయి. దిక్పాలకులు
పిలిపించబడ్డారు. పాటలు పాడటానికి విశ్వావసువూ, హాహా, హూహూ, అనే గంధర్వులూ,
అనేకమంది అప్సరసలూ పిలిపించబడ్డారు. చంద్రుడు వచ్చి చతుర్విధాన్నాలూ
పుష్పమాలలూ, పానీయాలూ, సుమధుర ఫలాలూ సిద్ధంచేశాడు. మయుడు నిర్మించిన
అద్భుతమైన భవనాలలో ఒక రాజగృహంలాటిది భరతుడికి ప్రత్యేకించబడింది. అందులో
సింహాసనంతో కూడిన విశాలమైన రాజసభ ఉన్నది.
భరతుడు అక్కడి అందమైన సింహాసనం మీద కూచోక మంత్రుల ఆసనం పైన కూచుని, తన
పరివారాన్నీ, గుహుణ్ణీ యథోచితస్థానాలలో కూచోబెట్టాడు. బ్రహ్మదేవుడూ,
కుబేరుడూ, దేవేంద్రుడూ తలా ఒక ఇరవైవేల మంది అప్సరసలను పంపారు. భరతుడు
కొలువుతీరి ఉండగా నారద తుంబుర గోపులనే గంధర్వ రాజులు గానం చేశారు. అలంబుస,
మిశ్రకేశి, పుండరీక, వామన అనే అప్సరసలు భరతుడి ముందు నృత్యం చేశారు.
భరధ్వాజాశ్రమంలో గల చెట్లూ, పొదలూ, లతలూ స్త్రీ రూపాలు ధరించి భరతుడి
సైనికులకు భక్తి శ్రద్ధలతో చక్కటి అతిథి మర్యాదలు చేశాయి. సైనికులు
రుచికరమైన భోజనాలు చేసి ఆనందించారు. వారిచ్చిన అతిథిసత్కారాలతో మైమరిచి,
``మేము అయోధ్యకూ పోము, దండకారణ్యానికి పోము, ఇక్కడే ఉంటాము. రాముడూ, భరతుడూ
క్షేమంగా ఉంటారుగాక!'' అన్నారు. కొందరు పూల మాలలు ధరించి అటూ ఇటూ
పరిగెత్తారు, పాటలు పాడారు, నృత్యాలుకూడా చేశారు.
రకరకాల
వంటకాలతో, పాయసంతో, మజ్జిగ పెరుగులతో దివ్యంగా తయారు చేసిన ఆహారాన్ని
ఎంతతిన్నా వారికి తనివి తీరలేదు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మర్నాడు
భరతుడు భరద్వాజుడి దర్శనం చేసుకుని, తమకు జరిగిన ఆతిథ్యానికి కృతజ్ఞత
చెప్పుకుని, రాముణ్ణి చేరటానికి మార్గం అడిగాడు. చిత్రకూటానికి వెళ్ళటానికి
దక్షిణంగా ఒక మార్గమూ, నైరృతీ దిశగా ఒక మార్గమూ ఉన్నాయనీ, సేనలు నడవటానికి
ఏది యోగ్యమో చూసుకుని వెళ్ళమనీ భరద్వాజుడు సలహా ఇచ్చాడు.
దశరథుడి భార్యలు ముగ్గురూ మునికి మొక్కారు. భరతుడు తగిన రీతిగా వారిని
మునికి పరిచయం చేశాడు. తన తల్లిని పరిచయం చేసేటప్పుడు అతను పరుషంగా
మాట్లాడుతూ, కోపంతో దహించుకు పోయాడు. అనుకోకు. అందువల్ల ముందు ముందు చాలా
లాభం కలుగుతుంది,'' అన్నాడు. తరవాత భరతుడు భరద్వాజముని వద్ద యథోచితంగా
సెలవు తీసుకుని తన బలగంతో చిత్రకూటానికి బయలుదేరాడు.
వారు చివరకు మందాకినీ నదినీ, దానికి దక్షిణంగా ఉన్న చిత్రకూట
పర్వతాన్నీ చేరవచ్చారు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నదీ జాడ తెలుసుకు రమ్మని
భరతుడు సైనికులను పంపాడు. కొందరు సైనికులు అడవి ప్రవేశించి ఒక చోట పొగ
వస్తూండటం గమనించి ఆ సంగతి భరతుడితో చెప్పారు. ఆ పొగ వచ్చేచోట ఎవరో
ఉన్నారు. అయితే వారు రామలక్ష్మణులు కావాలి. లేదా రామలక్ష్మణుల జాడ ఎరిగిన
మునులైనా కావాలి.
భరతుడు సేనను నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించి, సుమంత్రుణ్ణీ,
వసిష్ఠుణ్ణీ మాత్రమే వెంట తీసుకుని సైనికులు చెప్పిన దిక్కుగా బయలుదేరాడు.
రాముడు చిత్రకూటానికి వచ్చి అప్పటికి నెల అయింది. ఈ రోజే అతను తన పర్ణశాల
విడిచి సీతతో సహా కొండ మీద విహరించటానికి బయలుదేరాడు. చిత్రకూటపర్వతం చాలా
అందమైనది. అక్కడి చెట్లూ, పక్షులూ, మృగాలూ, చిత్రవిచిత్రమైన ధాతువులూ,
పక్కనే గలగలా ప్రవహించే మందాకినీ నదీ, మనోహరమైన దృశ్యాలూ చూస్తూ వారిద్దరూ
చాలాసేపు విహరించారు. రాముడు సీతతో, ``నీవూ, లక్ష్మణుడూ నా వెంట ఉంటే ఈ
దృశ్యాలు చూసి ఆనందిస్తూ ఎన్ని ఏళ్ళయినా ఇక్కడే ఉండి పోగలను,'' అన్నాడు.
ఇలా చాలాసేపు విహరించిన పిమ్మట సీతారామలక్ష్మణులు ఒక చోట కూచున్నారు.
రాముడు కులాసాగా కబుర్లు చెబుతూ సీత చేత సుమధుర ఫలాలు తినిపించాడు. అదే
సమయంలో రాముడికి పరిగెత్తిపోతున్న అడవి ఏనుగులు కనిపించాయి. అవి చేసే
అరుపులు వింటే భయపడి పరిగెత్తుతున్నట్టు కనబడ్డాయి. నిజానికవి భరతుడి వెంట
ఉండే సేనను చూసి బెదిరినవే. అప్పటికి రాముడు లక్ష్మణుడితో, ``చూడు,
లక్ష్మణా! ఏనుగులూ, ఎనుబోతులూ, సింహాలూ కూడా బెదిరి పారిపోతున్నాయి.
అటువైపు ఎవరైనా రాజు వేటాడుతున్నాడా? లేక ఈ అడవి మృగాలను మించిన క్రూర మృగ
మేదైనా వచ్చిందా? కారణ మేమిటో చూడు!'' అన్నాడు.
లక్ష్మణుడు ఎత్తయిన చెట్టెక్కి అన్ని దిక్కులా ఒకసారి కలయజూసే సరికి
ఉత్తర దిక్కుగా పెద్ద సేన కనబడింది. అతను రాముడితో, ``ఏదో పెద్ద సేన మనకేసి
వస్తున్నది వెంటనే అగ్ని చల్లార్చి, సీతను గుహలో భద్రంగా దాచి, కవచం
తొడిగి, ధనుర్బాణాలు తీసుకో,'' అన్నాడు. ``సరిగా పరిశీలించి చూడు,
లక్ష్మణా! అలా వస్తున్నది ఎవరి సేనలాగుంది?'' అన్నాడు రాముడు.
లక్ష్మణుడు సేన మధ్య కనిపించే రథాలకు కట్టిన ధ్వజాలను గుర్తించి,
``భరతుడు తల్లి ధర్మమా అంటూ రాజ్యాభిషేకం చేసుకుని, అంతటితో తృప్తిచెందక తన
రాజ్యం నిష్కంటకం చేసుకోవటానికై మనని చంపటానికి సేనలతో వస్తున్నాడు-మనం
పర్వతం మీద దాక్కుందామా? లేక యుద్ధ సన్నద్ధులమై ఇక్కడే ఉందామా?'' అని
రాముణ్ణి అడిగాడు కోపంగా. అతను అంతటితో ఆగక, ``ఇప్పుడు భరతుడు మనకు
చిక్కబోతున్నాడు. మనకీ కష్టాలన్నీ తెచ్చి పెట్టిన ఈ భరతుణ్ణి తప్పక
చంపేస్తాను.
అందులో తప్పేమీ లేదు. పైగా భరతుడు చస్తే నీవు హాయిగా రాజువు కావచ్చు.
కైకేయినీ, ఆ మంథరనూ, వాళ్ళవాళ్ళ నందరినీ కూడా చంపేస్తాను. అటువంటి పాపులు
బతికి ఉండరాదు,'' అన్నాడు. ఈ మాటలు విని రాముడు తన తము్మణ్ణి మెత్తగా
చివాట్లు పెట్టాడు: ``తనకుతానై భరతుడు మనను చూడవస్తూంటే యుద్ధం
చేస్తానంటావేమిటి? తండ్రి మాట నిలబెట్టటానికి ఇక్కడికి వచ్చినవాణ్ణి,
భరతుణ్ణి చంపేసి లోకనిందకు పాలుకమ్మంటావా? కొంచెం నష్టం కలగగానే తండ్రినీ,
తము్మలనూ చంపుకుంటారా? భరతుణ్ణి ఎందుకు శంకిస్తున్నావు? అతను ఎన్నడైనా
అనుమానించదగిన మాటలైనా నీతో అన్నాడా? అతను మామగారి ఇంటి నుంచి అయోధ్యకు
వచ్చి, మన సంగతి విని మనని తిరిగి తీసుకుపోయే ఉద్దేశంతో వస్తూ ఉంటాడని నా
నమ్మకం. నీకు నిజంగా రాజ్యకాంక్ష
ఉంటే చెప్పు, భరతుడు రాగానే రాజ్యం నీకిమ్మంటాను. అతను నా మాట
కాదనడు.'' ఈ మాటలకు లక్ష్మణుడు సిగ్గుపడితల వంచుకుని, ``మన తండ్రే మనని
చూడటానికి వస్తూ ఉండవచ్చు,'' అని మాట మార్చాడు. రాముడు లక్ష్మణుణ్ణి చెట్టు
దిగి రమ్మన్నాడు. లక్ష్మణుడు దిగి వచ్చాడు.
No comments:
Post a Comment