Friday, September 7, 2012

రామాయణం - సుందరకాండ 3


శింశుపా వృక్షం ఎక్కిన హనుమంతుడు అక్కడి నుంచి చుట్టుపక్కలన్నీ కలయ జూశాడు. అశోకవనం దేవేంద్రుడి నందన వనం లాగుంది. దాని నిండా పూల చెట్లూ, పళ్ళ చెట్లూ ఉన్నాయి. పక్షులూ, మృగాలూ ఉన్నాయి. అక్కడక్కడా దివ్యమైన భవనాలూ, అరుగులూ; తామర పూలూ, కలువపూలూ గల మడుగులున్నాయి. అన్నిటికన్న అశోక వృక్షాలు జాస్తిగా ఉన్నాయి.

కొద్ది దూరంలో ఒక ఎత్తయిన తెల్లని మండపం ప్రకాశిస్తున్నది. అందులో వెయ్యి స్తంభాలున్నాయి. దానిలో పగడాలతో తయూరు చేసిన మెట్లూ, బంగారు అరుగులూ ఉన్నాయి. అది ఒక చైత్యం ఆకారంలో ఉన్నది. తరవాత హనుమంతుడికి సీత కనిపించింది. ఆమె ధరించిన చీర మట్టి కొట్టుకుని ఉన్నది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలున్నారు. ఆమె బాగా కృశించి, నిట్టూర్పులు విడుస్తూ, దైన్యంతో కూడుకుని ఉన్నది. దేహ సంస్కారం లేక ఆమె శరీరం కూడా మట్టి కొట్టుకుని ఉన్నది. నగలు చాలా కొద్దిగా ఉన్నాయి. ఆమె జుట్టు ఒకే జడలాగా అట్టకట్టుకుపోయి తుంటి దాకా వేళ్ళాడుతున్నది.

ఈమె సీత అయి ఉండాలని హనుమంతుడు ఈ విధంగా వితర్కించుకున్నాడు: రావణాసురుడు ఎత్తుకు పోయేటప్పుడు ఆ స్త్రీలో తనకూ, సుగ్రీవాదులకూ కనిపించిన పోలికలు ఈమెలో కొన్ని ఉన్నాయి. నిండు చంద్రుడి వంటి ముఖం. తీర్చినట్టుండే కనుబొమలు,  నల్లని వెంట్రుకలు, అందమైన నడుము-సీత ఎంత కృశించి, శోక సముద్రంలో మునిగి ఉన్నా ఈ లక్షణాలు దాగటం లేదు. ఇవి గాక రాముడు సీత గుర్తులు కొన్ని చెప్పాడు. అందుచేత హనుమంతుడు ఆమె సీతేనని నిర్ణయించుకోవటానికి చాలా శ్రద్ధగా చూశాడు.


రాముడు చెప్పిన ఆభరణాలలో కొన్నిటిని ధరించటం ఇష్టంలేక ఆమె చెట్టు కొమ్మలకు తగిలించింది. వాటిలో చెవులకు పెట్టుకునేవీ, చేతులకు పెట్టుకునేవీ ఉన్నాయి. అవి తీసి వేసినట్టుగా సీత చెవులకూ, చేతులకూ గుర్తులు కానవస్తున్నాయి. అదీ గాక సీత ఋశ్యమూక పర్వతం పైన మూట గట్టి పడవేసిన ఆభరణాలలో ఇవి లేవు. అదీ గాక సీత నగలను మూట గట్టిన పచ్చ పట్టు వస్తమ్రూ, ఆమె ఇప్పుడు కట్టుకొన్న చీరా ఒకటి గానే ఉన్నాయి-కాకపోతే చీర చాలా మాసి ఉన్నది. ఇవన్నీ ఆలోచించి హనుమంతుడు ఆమె సీతేనని నిశ్చయించుకుని పరమానందం చెందాడు.

మరుక్షణమే సీత స్థితి తలుచుకుని హనుమంతుడి గుండె నీరైపోయింది. జనకుడి కుమార్తె, దశరథుడి పెద్ద కోడలు, ఎన్నో సుఖాలు అనుభవించవలసిన ఈ సీత కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూ, శుష్కించి, ఈ భయంకర రాక్షస స్త్రీల మధ్య ఇలా కుమిలిపోవట మేమిటి? ఈ సీత కోసం రాముడు ఎందరు రాక్షసులను చంపాడు!

ఈమె కోసమే గదా అతను వాలిని చంపి సుగ్రీవుడికి పట్టం గట్టాడు! ఈమెకోసమే గదా తాను సముద్రాన్ని లంఘించి లంకకు వచ్చాడు! ఈమె కోసం రాముడు మూడు లోకాలూ తల్లకిందులు చెయ్యమన్నా చేస్తాడు. ‘‘పరాయి వాణ్ణయిన నాకే ఈ సీతను చూసి ఇంత బాధ కలుగుతూంటే రాముడి కింకా ఎంత దుఃఖం కలుగుతూండవచ్చు?’’ అనుకున్నాడు హనుమంతుడు.

రాత్రి చాలా భాగం గడిచింది. రాక్షస బ్రాహ్మణులు వేదాధ్యయనం ప్రారంభించారు. మంగళ వాద్యాలు మోగాయి. రావణుడు వాటి ధ్వనికి మేలుకొని, సీతను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. వెంటనే అతను సమస్తాభరణాలూ ధరించి, వెలిగి పోతూ అశోక వనానికి బయలుదేరాడు. అతని వెంట నూరు మంది స్త్రీలు వచ్చారు. వారిలో కొందరు బంగారు దీపస్తంభాలూ, కొందరు చామరాలూ, మరి కొందరు విసన కరల్రూ పట్టుకున్నారు. ఒకతె తన కుడిచేతిలో మణి మయమైన మద్యభాండం తీసుకున్నది, మరొకతె రావణుడి వెనుక నుంచి బంగారు కర్ర గల తెల్లగొడుగు పట్టింది.


వారందరూ అశోకవన ద్వారం దగ్గిరికి వచ్చే సరికి, చెట్టు మీద ఆకుల చాటున ఉన్న హనుమంతుడు వారిని చూశాడు. రావణుడు ఇంకా అంత దూరంలో ఉండగానే సీత భయంతో కంపించిపోయింది. ఆమె ముడుచుకుని కూర్చుని ఏడవసాగింది. కటిక నేల మీద కూర్చుని, భయపడిఏడుస్తూ, దుమ్ము కొట్టుకుని ఉన్న సీతతో రావణుడిలా అన్నాడు:
‘‘నన్ను చూసి ఎందుకు భయపడతావు, సీతా? ఇక్కడ నీకు హాని చేసే వారెవరూ లేరు.

నేనా నీ మీది మోహంతో తపించి పోతున్నాను. కాని నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఎందుకిలా శోకిస్తావు? నన్ను నమ్ము, స్నేహ బుద్ధితో చూడు. తల దువ్వుకోక, మురికి బట్ట కట్టుకుని, అర్థం లేని ఉపవాసాలు చెయ్యటం నీ కెంత మాత్రమూ తగదు. కారిపోయిన నీటి లాగా పోయిన యౌవనం తిరిగి రాదు. భోగాలు అనుభవించు. నీ వంటి అందగత్తె సృష్టిలో లేదు. నన్ను చేపట్టితే నిన్ను అగ్రభార్యను చేస్తాను. ప్రపంచమంతా జయించి నీ తండ్రి జనకుడికి కానుకగా ఇస్తాను. అదృష్టహీనుడై, రాజ్యం పోగొట్టుకుని, అడవులలో అలమటించే ఆ రాముడింకా బతికి ఉంటాడా అని నా సందేహం.

ఒక వేళ బతికి ఉన్నా అతడు నిన్ను చూడను కూడా లేడు. పూర్వం తన భార్యను ఇంద్రుడెత్తుకు పోతే హిరణ్యకశిపుడు నారదుడి చేత అడిగించి తెచ్చుకున్నాడు. రాముడి గతీ అంతే. అయితే అతను ఎంత వినయంగా అడిగినా నేను నిన్నివ్వను. కృశించి, మట్టి కొట్టుకుని ఉంటేనే నీ అందం నా మనస్సు హరించేస్తున్నదే, చక్కగా అలంకరించుకుని, మంచి బట్టలు కట్టుకుని, సంతోషంగా ఉంటే ఎలా ఉంటావో! హాయిగా తిను, తాగు, సుఖించు. నీ కేమిటి లోపం?’’.


ఈ మాటలు విని సీత ఒక గడ్డి పోచను తనకూ రావణుడికీ మధ్యగా పట్టుకుని, దీనస్వరంతో ఇలా చెప్పింది:‘‘నా మీది ఆశ వదులుకో. పాపిష్ఠి వాడికి మోక్షం ఎంత దుర్లభమో, నీకు నేనూ అంతే. నేనింకొకడి భార్యను, పతివ్రతను. నీ భార్యలను ఇతరులు కోరితే నీకెలా ఉంటుందో ఆలోచించుకో. నీకు బుద్ధి చెప్పే వారెవరూ లేరో, లేక చెప్పినా నువ్వు వినవో! కాని నువ్వు చేసిన పని నీకూ, నీ రాజ్యానికీ, రాక్షస కులానికీ చేటు కలిగించేది.

నాకు కావలసింది నీ అంతఃపుర స్త్రీలపై పెత్తనమూ కాదు, ధనమూ కాదు, ఇంకేదీ కాదు-నా భర్త వెంట ఉండటం. నాలుగు కాలాలపాటు సుఖంగా ఉండాలంటే నన్ను రాముడి దగ్గిర చేర్చు. రాముడితో స్నేహం చేసుకో. శరణన్న వారిని రాముడు క్షమించగలడు. లేదా, రామలక్ష్మణుల మూలంగా నీకు సర్వ నాశనం తప్పదు. నువ్వు పిరికిపందవు. రాముడు జనస్థానంలో ఉన్న రాక్షసుల నందరినీ చంపెయ్యటం చూసి భయపడి, రామలక్ష్మణులిద్దరూ బయటికి వెళ్ళి ఉండగా నన్ను దొంగిలించి తెచ్చావు. వారి గాలి ఏమాత్రం సోకినా, పులుల వాసన తగిలిన కుక్కలాగా నువ్వు పారిపోయి ఉందువు. అటువంటి రామలక్ష్మణులతో యుద్ధం పెట్టుకోకు.’’

సీత ఆడిన ఈ పరుష వచనాలకు రావణుడు మండిపడి, ‘‘నీవన్న ఈ మాటలలో ప్రతి ఒక్క మాటకూ నిన్ను చంపవచ్చును. కాని నీ మీది మోహం చేత నేనాపని చెయ్య లేకుండా ఉన్నాను. నేను చెప్పిన గడువింకా రెండు మాసాలున్నది. ఈ లోపల నా భార్యవు కావటానికి సమ్మతించక పోయావో, నిన్ను ఉదయపు ఫలహారం కింద వండించుకు తింటాను,’’ అన్నాడు. అతను సీత వెంట ఉన్న రాక్షస స్త్రీలతో, ‘‘మీరు నయానో, భయానో ఈ సీత మనస్సు నా మీదికి మళ్ళేటట్టు చేయండి. ఆమె కిష్టం లేని పనులు చేయటానికి కూడా ఇప్పుడనుజ్ఞ ఇస్తున్నాను,’’ అన్నాడు.


రావణుడి వెంట ఉన్న భార్యలలో దేవగంధర్వ స్త్రీలు సీతను చూసి జాలిపడి, తమ సానుభూతిని ఆమెకు సంజ్ఞల ద్వారా తెలియ జేశారు. రావణుడి కడగొట్టు భార్య అయిన ధాన్యమాలిని రావణుణ్ణి కౌగలించుకుని, ‘‘ఈమెకు నీపై ఇష్టం లేదు. ఆమె పైన ఎందుకు లేని పోని ఆశ పెట్టుకుంటావు? ఆమెకు సుఖపడే గీత లేదు. అందుకే నిన్ను వరించటం లేదు,’’ అన్నది.

రావణుడీ మాట విని చిరునవ్వు నవ్వి స్త్రీలతో సహా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతను వెళ్ళిపోగానే రాక్షస స్త్రీలు సీతను మాటలతో హింసించారు, ఆయుధాలతో బెదిరించారు. కొందరు రావణుణ్ణి పొగిడారు. కొందరు రాముణ్ణి తిట్టారు. ‘‘మేము చెప్పినట్టు చెయ్యకపోతే నిన్నిప్పుడే తినేసి, సీత చచ్చిపోయిందని రావణుడికి చెబుతాం,’’ అన్నారు. ‘‘మళ్ళీ పోట్లాడుకోకుండా దీన్ని ముందుగానే ముక్కలు ముక్కలుగా కోసి సమంగా పంచండి,’’ అన్నది ఒకతె.

సీతకు ఒక వంక భయమూ, మరొక వంక అసహ్యమూ కలిగాయి. ఆమె తాను కూర్చున్న చోటి నుంచి లేచి శింశుపావృక్షం కేసి నడిచి ఒక అశోక వృక్షం కింద దాని కొమ్మ పట్టుకుని నిలబడి, తన దుస్థితిని గురించి తలుచుకుని బాధ పడింది. రామలక్ష్మణులు మరణించి ఉంటారా, రావణుడు వారిని ఈపాటికి చంపించి ఉంటాడా అని ఆమెకు కొంచెం సేపు అనుమానం కలిగింది. వాళ్ళు సన్యసించారేమోనని మరొకసారి సందేహించింది. రాక్షస స్ర్తీలు ఆమెను చుట్టు ముట్టి ఇంకా భయపెడుతూనే ఉన్నారు.

ఇంతలో త్రిజట అనే ముసలి రాక్షసి అప్పుడే నిద్ర లేచి, పెద్దగా మూలుగుతూ, ‘‘సీతను తినెయ్యకండర్రా, కావలిస్తే నన్ను తినండి. నాకొక భయంకరమైన కల వచ్చింది,’’ అన్నది. రాక్షస స్త్రీలు ఈ మాటకు భయపడి, దాని చుట్టూ మూగి ఏం కల వచ్చిందని త్రిజట నడిగారు. త్రిజట ఇలా చెప్పింది: ‘‘రాముడు తెల్లటి పూల మాలలు వేసుకుని, తెల్ల బట్టలు కట్టుకుని, దంతంతో చేసిన పల్లకీలో ఎక్కి, లక్ష్మణుడితో సహా, వెయ్యి హంసలు మోస్తుండగా ఆకాశ మార్గాన లంకకు వచ్చాడట.


ఈ సీత తెల్లని చీర కట్టుకుని, సముద్రం మధ్య ఉండే శ్వేతపర్వతం మీద ఉన్నట్టు నాకు కలలో కనిపించింది. రామలక్ష్మణులు నాలుగు దంతాలు గల పెద్ద ఏనుగు నెక్కి లంకలో సంచరించటం కనిపించింది. ఆ రామ లక్ష్మణులు సీతను సమీపించారు. రాముడెక్కిన ఏనుగు శ్వేతపర్వత శిఖరం పైగా ఉంటే సీత దాని పైకి ఎక్కింది. తరవాత, రాముడి తొడ పైన కూర్చున్న సీత లేచి, చేతులతో సూర్య చంద్రులను పట్టుకుంటున్నట్టు కనిపించింది.

ఆ తరవాత రాముడు ఎనిమిది తెల్ల ఎద్దులు లాగే రథం మీద సీతతో ఇక్కడికి రావటం చూశాను. సీతా రామ లక్ష్మణులు పుష్పక విమాన మెక్కి ఉత్తరంగా వెళ్ళటం నాకు కనిపించింది. ఇక రావణుడు గన్నేరు పూల మాలలు ధరించి, ఒళ్ళంతా నూనె పూసుకుని, ఎరబ్రట్ట కట్టుకుని, తాగిన మత్తులో నేల పైన పడి ఉండటం కనిపించింది. ఇంకోసారి రావణుడు పుష్పక విమానం నుంచి కింద పడి, నున్నని, జుట్టు లేని తలతో, నల్లని బట్టలు కట్టుకున్న ఆడది ఈడుస్తున్నట్టు కనిపించాడు. మరొకసారి రావణుడు ఎర్ర పూల మాలలూ, రక్త చందనమూ ధరించి, నూనె తాగుతూ, నవ్వుతూ, నాట్యం చేస్తూ, మతిపోయి గాడిదలు పూన్చిన రథం పైన పోతూ కనిపించాడు.

ఒకసారి రావణుడు గాడిద నెక్కి దక్షిణంగా పోతూ, దాని మీద నుంచి తల్ల కిందులుగా నేల మీద పడటం చూశాను. అక్కడి నుంచి లేచి అతను నోటికి వచ్చినట్టు దుర్భాషలాడుతూ ఒక బురద గుంటలో పడి మునిగి పోయూడు. కుంభకర్ణుడు కూడా ఇలాటి స్థితిలోనే కనిపించాడు. రావణుడి కొడుకులు శరీరంపై నూనె పోసుకోవటం కనిపించింది. లంకానగరంలోని సుందర భవనాలు జలప్రళయంలో మునిగిపోతూ కనిపించాయి. రాముడి దూత అయిన ఒక కోతి లంకను తగలబెట్టాడట. అందుచేత మీ అఘాయిత్యం చాలించి సీతతో మంచిగా ఉండండి, లంకకు చేటు రానున్నది.’’






No comments:

Post a Comment