చెట్లూ, పొదలూ నరికి కీకారణ్యం మధ్యగా దారి చేసుకుంటూ రామలక్ష్మణులు
జన స్థానం దాటి మూడు కోసుల దూరం వెళ్ళి క్రౌంచారణ్యం ప్రవేశించారు. వారు
దారిలో మధ్యమధ్య విశ్రాంతి తీసుకుంటూ, దారి పొడుగునా సీతను వెతుకుతూ
క్రౌంచారణ్యం దాటి మతంగాశ్రమ ప్రాంతం చేరి అక్కడ ఒక పెద్దగుహను చూశారు.
అది చీకటి గుహ. రామలక్ష్మణులు ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి అందులో
వారికి ఒక వికారమైన పెద్దరాక్షసి కనిపించింది. దాన్ని చూస్తేనే మామూలు
మనుషులు దడుచుకుంటారు, అసహ్యపడతారు. పెద్ద నోరూ, పెద్ద కళ్ళూ, పెద్ద
పొట్టా, కోరలూ, గరుకైన చర్మమూ గల ఆ రాక్షసి సింహాలనూ, పులులనూ పీక్కుతింటూ
రామలక్ష్మణులను చూసింది.
వెంటనే అది, పరిగెత్తుకుని, ముందు నడిచే లక్ష్మణుడి వద్దకు వచ్చి,
అతన్ని పట్టుకున్నది. అది లక్ష్మణుడితో, ‘‘నా పేరు అయోముఖి. ఇంతకాలానికి
నాకు నచ్చినవాడవు దొరికావు. మనిద్దరమూ పెళ్ళాడి అరణ్యమంతా విహరించుదాం,
నాతో రా!'' అన్నది. లక్ష్మణుడికి ఆగ్రహం వచ్చి కత్తి దూసి దాని ముక్కూ,
చెవులూ నరికేశాడు.
అసలే వికారంగా ఉన్న ఆ రాక్షసి మరింత భయంకరంగా అయి, పెడబొబ్బలు పెడుతూ
అరణ్యంలోకి పారిపోయింది. తరవాత వారిద్దరూ సీత కోసం ఆ వనమంతా వెదక
నారంభించారు. ఇంతలో ఉన్నట్టుండి ఒక భయంకరమైన ధ్వని పుట్టి ఆకాశానా,
దిక్కులా మారుమోగింది.
రామ లక్ష్మణులా ధ్వని వచ్చిన దిక్కుగా వెళ్ళి గుబురుగావున్న ఒక పొదలో
ఒక వింత ఆకారాన్ని చూశారు. ఆ ఆకారం చిన్నకొండ ప్రమాణంలో ఉన్నది. నల్లగా
ఉన్నది. దానికి తలా, మెడా, కాళ్ళూ లేవు. పక్షస్థలంలో ఒక పెద్ద కన్ను
కాంతివంతంగా ప్రకాశిస్తున్నది. దాని కొక పెద్దరెప్ప కూడా ఉన్నది. దానికి
కిందుగా పొట్టలో పెద్ద నోరున్నది. మొండెం లాగున్న ఈ ఆకారానికి అతి దీర్ఘమైన
చేతులు మాత్రం ఉన్నాయి.
ఈ వింత అవతారం కబంధుడనే రాక్షసుడు. అలా ఒకే చోట కదలకుండా ఉండి, అతి
దీర్ఘమైన చేతులు చాచి, ఎంతో దూరాన ఉన్న జంతువులనూ, మనుషులనూ కూడా పట్టి
భక్షిస్తూ ఉంటాడు. రామలక్ష్మణులు తన ఎదుటికి రాగానే కబంధుడు ఇద్దరినీ చెరొక
చేత్తోనూ బలంగా పట్టేసి, వేగంగా తన కేసి లాక్కోసాగాడు. ఎంతో బలమూ, ఆయుధాలూ
ఉండి కూడా ఆ అన్నదమ్ములు ఎంత ప్రయత్నించినా వాడి చేతిపట్టు వదిలించుకోలేక
పోయూరు.
లక్ష్మణుడు భయపడి పోయి, ‘‘అన్నా, నన్ను వీడికి బలి ఇచ్చి నీ ప్రాణాలు
కాపాడుకుని, వెళ్ళి సీతను వెతుకు!'' అన్నాడు. రాముడు లక్ష్మణుడికి
భయపడవద్దని ధైర్యం చెప్పాడు. ఇంతలో కబంధుడు భయంకరమైన గొంతుతో, ‘‘ఇద్దరూ
బలిసిన ఆబోతుల్లా గున్నారు. మిమ్మల్ని విడవను. నా నోటికి చిక్కారు,''
అన్నాడు.
ఆ మాటలు వినగానే రాముడికి భయంతో నోరెండుకు పోయింది. క్షణం క్రితం
లక్ష్మణుడికి ధైర్యం చెప్పినవాడు కాస్తా నీరు కారి పోయి, ‘‘మన రోజులు
బాగాలేవు. అన్నీ కష్టాలే. మన కిలాంటి ఘోర మరణం రాసిపెట్టి ఉన్నదికాబోలు.
కాలం తీరితే ఎంతెంత మహావీరులు కూడా యుద్ధంలో చావటం లేదు?'' అన్నాడు. అంతలో
లక్ష్మణుడికి పరాక్రమం వచ్చేసింది.
అతను రాముడితో, ‘‘వీడు మనని తినటానికి సిద్ధంగా ఉన్నాడు. వీడి బలమంతా
చేతుల్లోనే ఉంది. వీడి చేతులు రెండూ నరికేద్దాం!'' అన్నాడు. కబంధుడీ మాటలు
విని మండిపడి నోరు తెరిచి ఇద్దరినీ మింగబోయూడు. సరిగ్గా ఆ క్షణంలోనే రాముడు
వాడి కుడిచేతినీ, లక్ష్మణుడు వాడి ఎడమచేతినీ నరికేశారు. ఆ దెబ్బతో కబంధుడు
పెడబొబ్బలు పెడుతూ పడిపోయూడు.
వాడు
రామలక్ష్మణులను, ‘‘మీరెవరు?'' అని అడిగాడు. లక్ష్మణుడు వాడికి తమ సంగతి
చెప్పి, ‘‘ఈ వింత ఆకారం గలనువ్వెవడవు? ఈవనంలో ఎందుకున్నావు?'' అని అడిగాడు.
‘‘మీరిద్దరూ రామలక్ష్మణులా? మీరు ఈ అరణ్యానికి రావటం నాకు చాలా
మంచిదయింది. నా కథ చెబుతాను వినండి,'' అంటూ కబంధుడు తన వృత్తాంతం వారికి
ఇలా చెప్పాడు: ఒకప్పుడు ఈ కబంధుడు ఇంద్రుడికి తీసిపోని దేవరూపం గలవాడు.
అయితే అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మునులను భయపెట్టుతూ
వచ్చాడు.
ఇలా చేస్తూండగా ఒకసారి స్థూలశిరుడనే మహాముని తటస్థపడి, ‘‘నీకీ రూపమే
శాశ్వతంగా ఉండిపోవు గాక!'' అని శపించాడు. అప్పుడీ కబంధుడు మునికి క్షమాపణ
చెప్పుకుని శాప విముక్తి ఎలాగని అడిగాడు. ‘‘ఎప్పుడు రాముడు అడవికి వచ్చి,
నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం
వస్తుంది,'' అని ముని చెప్పి వెళ్ళిపోయూడు. స్థూలశిరుడిచ్చిన ఈ శాపం అతి
విచిత్రంగా ఫలించింది.
శాపం తగలక మునుపే కబంధుడు బ్రహ్మను గురించి అతి దారుణమైన తపస్సు
చేశాడు. బ్రహ్మ అతడి తపస్సు మెచ్చుకుని అతనికి దీర్ఘాయువు వరంగా ఇచ్చాడు.
‘‘బ్రహ్మదేవుడు నాకు దీర్ఘాయువిచ్చాడు గనక నన్నిక దేవేంద్రుడు కూడా ఏమీ
చేయలేడు,'' అని గర్వించి, అతను ఇంద్రుణ్ణి యుద్ధానికి పిలిచాడు. ఇంద్రుడు
వజ్రాయుధంతో అతని తలనూ, కాళ్ళనూ శరీరంలోకి తోసేసి మొండెంలాగా తయూరుచేశాడు.
ఆ రూపంతో ఎలా బతకటం? అందుచేత అతను ఇంద్రుణ్ణి ఎంతగానో వేడుకుని తన
ప్రాణాలు తీసెయ్యమన్నాడు. ‘‘బ్రహ్మదేవుడు నీకు దీర్ఘాయువిచ్చి ఉండగా నేను
నీ ప్రాణాలెలా తియ్యను? నేనాపని చెయ్యను,'' అన్నాడు ఇంద్రుడు. ‘‘తిండి
తినటానికి నోరుకూడా లేకుండా నేను దీర్ఘకాలం ఎలా జీవిస్తాను?'' అని కబంధుడు
అడిగాడు. అప్పుడింద్రుడు అతనికి అతి దీర్ఘమైన చేతులూ, కడుపులో పదునైన కోరలు
గల నోరూ ఏర్పాటు చేశాడు.
అతడికి కబంధరూపం ఏర్పడింది. ముని శాపం ఫలించింది. ఆ తరవాత కబంధుడు
అక్కడే ఉండిపోయి అందిన ప్రతి ప్రాణినీ తింటూ వచ్చాడు. కబంధుడీ కథంతా
చెప్పినాక రాముడు, ‘‘నా భార్య అయిన సీతను రావణుడనేవాడు ఎత్తుకుపోయూడు. అతని
పేరు తెలుసే తప్ప, ఎక్కడ ఉంటాడో, ఎవడో, అతని శక్తి ఎటువంటిదో మాకు
తెలియదు.
అష్ట కష్టాలూ పడి సీతను వెతుకుతున్న మాకు నీబోటివాడు సహాయం చెయ్యటం
భావ్యం,'' అన్నాడు. దానికి కబంధుడు, ‘‘నాకిప్పుడు దివ్యజ్ఞానం ఏమీలేదు.
నన్ను మీరు దహించినట్టయితే నిజరూపం పొంది మీకు చేతనైన సహాయం చేస్తాను, సలహా
ఇవ్వగలుగుతాను,'' అన్నాడు.
రామలక్ష్మణులు ఒక పల్లపు ప్రదేశంలో చితి పేర్చి దానిపైన కబంధుణ్ణి
పెట్టి దహనం చేశారు. కొద్దిసేపట్లో ఆ చితిని తోసుకుని ఒక దివ్యపురుషుడు
స్వచ్ఛమైన బట్టలు కట్టుకుని, అనేక దివ్యాభరణాలతో పైకి వచ్చాడు. అతను హంసలతో
అలంకరించబడిన విమానంలో కూచుని ఆకాశంలోకి లేచి రాముడితో ఇలా అన్నాడు:
‘‘రామా, సీతను తిరిగి సంపాదించుకోవటానికిగాను నీకు ఒక వ్యక్తి సహాయం
చెయ్యగలడు.
అతడు కూడా నీలాగే రాజ్యాన్నీ, భార్యనూ పోగొట్టుకుని, అన్నభయం చేత
పంపాసరోవర సమీపాన ఋశ్యమూకపర్వతం మీద నలుగురు అనుచరులతో ఉంటున్నాడు. అతను
సుగ్రీవుడనే పేరు గల వానరరాజు, వాలి అనేవాడి తమ్ముడు, సత్యసంధుడు,
సమర్థుడు, అద్భుత పరాక్రమశాలి. సీతను వెదకటానికి అతను నీకు సహాయ పడగలడు.
నువ్వు ముందుగా అతని వద్దకు వెళ్ళి అగ్నిసాక్షిగా అతనితో స్నేహం
చేసుకో. అతను కోరిన సహాయం చెయ్యి, అతని నుంచి సహాయం పొందు, అతని భటులైన
వానరులు సీత ఎక్కడ వున్నదీ తప్పక తెలుసుకోగలరు.'' కబంధుడీ మాటలు చెప్పి,
ఋశ్యమూకానికి వెళ్ళే మార్గం వివరించి తన దారిన తాను వెళ్ళిపోయూడు.
సుగ్రీవుణ్ణి కలుసుకోవటం లక్ష్యంగా పెట్టుకుని రామలక్ష్మణులు పంపాసరోవరం
కేసి బయలుదేరారు. వారు మర్నాటికి పంపా సరస్సు యొక్క పడమటి గట్టు చేరుకుని,
అక్కడ చెట్ల మధ్య అందమైన శబరి ఆశ్రమం చూశారు.
ఈ ఆశ్రమంలో మతంగమహాముని ఉండేవాడు. ఆయన వద్ద తపశ్శక్తిసంపన్నలైన
శిష్యులుండేవారు. శబరి అనే సన్యాసిని శిష్యులకు సేవచేస్తూ తాను కూడా తపస్సు
చేసింది. రాముడు చిత్రకూటానికి వచ్చిన సమయంలో ఆ మతంగ శిష్యులు ఐహికజీవితం
చాలించి స్వర్గానికిపోతూ శబరితో, ‘‘రాముడు నీ ఆశ్రమానికి రాగలడు. అతనికి
చక్కగా అతిథి సత్కారాలు చేసి పుణ్యలోకాలు పొందు,'' అని చెప్పారు.
వారు వెళ్ళినాక వృద్ధురాలైన శబరి రాముడి రాకకు ఎదురుచూస్తూ,
వన్యాహారాలూ, ఫలాలూ అతని కోసం దాచి ఉంచింది. శబరి రామలక్ష్మణులకు వందనం
చేసి ఈ సంగతి తెలిపింది. రాముడి కోరికపై ఆమె రాముడికి తపోవనమంతా చూపింది.
అక్కడ మునులు తమ తపశ్శక్తి చేత సప్త సముద్రాలూ సృష్టించుకున్నారు. వారి
యూగవేదిక చెక్కుచెదరకుండా ఉన్నది.
ఏనాడో ఆ మునులు కట్టిన పుష్పమాలలు వాడకుండా పరిమళాలు వెదజల్లుతూ
నిలిచి ఉండటం రాముడు చూశాడు. ఇలా అక్కడి వింతలన్నీ చూపించి శబరి రాముడితో,
‘‘ఇక నేను దేహం చాలించి నా యజమానులైన మహామునులను చేరుకుంటాను,'' అన్నది.
తరవాత ఆమె అగ్నిప్రవేశం చేసి ఊర్థ్వలోకాలకు వెళ్ళిపోయింది.
రాముడు ఆ వనం చూసి, అక్కడి సప్తసముద్రాలలో స్నానం చేసి, తర్పణాలు
విడిచిన మీదట అతనికి మనశ్శాంతి కలిగింది, భవిష్యత్తు గురించి ఆశ
పుట్టుకొచ్చింది. అతను లక్ష్మణుడితో సహా ఆ ఆశ్రమం దాటి పంపాసరస్సుకు
వెళ్ళాడు.
దానికి సమీపంలోనే మతంగసరస్సున్నది. రాముడు అందులో స్నానం చేసి
లక్ష్మణుడితో, ‘‘లక్ష్మణా, ఈ సమీపంలోనే ఋశ్యమూకపర్వతం పైన సుగ్రీవుడుంటాడు.
నువ్వు బయలుదేరి అతని వద్దకు వెళ్ళు,'' అన్నాడు.
[అరణ్యకాండ సమాప్తం]
No comments:
Post a Comment