ఈలోపుగా భరతుడు రామాశ్రమాన్ని అంతదూరంలో చూసి, తన తల్లులను తీసుకు
రమ్మని వసిష్ఠుడికి చెప్పి, సుమంత్రుణ్ణీ, శత్రుఘు్నణ్ణీ వెంటబెట్టుకుని
ముందుకు వచ్చాడు. పర్ణశాల పరిసరాలలో మార్గం తెలిపే గుర్తులూ, ఎత్తుగా
పేర్చిన కట్టెలూ, పిడకల పోగులూ, చెట్లకు గుర్తుగా కట్టిన పేలికలూ ఉన్నాయి.
త్వరలోనే భరతుడు పర్ణశాలను సమీపించి, దానికి ఈశాన్యాన అగ్ని వేదికను
చూశాడు. తరవాత పర్ణశాలలో తాపసి వేషంలో ఉన్న రాముణ్ణి చూశాడు. పక్కనే సీతా
లక్ష్మణులున్నారు.
రాముణ్ణి చూడగానే భరతుడికి పుట్టెడు దుఃఖం వచ్చింది. అతను రాముడి
దగ్గిరికి పరిగెత్తుకుపోయి, కన్నీరు కారుస్తూ, రాముడి పాదాలు కనబడక నేలపై
బోర్లాపడ్డాడు. అతని నోట మాట రాలేదు. శత్రుఘు్నడు కూడా ఏడుస్తూ రాముడి
కాళ్ళకు వందనం చేశాడు. రాముడు భరతశత్రుఘు్నల నిద్దరినీ కౌగలించుకుని
కన్నీరు కార్చాడు. అతను భరతుడిపై ప్రశ్నల వర్షం కురిపించాడు: ``నాయనా, చాలా
కాలానికి నిన్ను చూశాను. మారిపోయావు. గుర్తించ లేక పోయాను.
చాలా సంతోషం. ఇప్పుడెందు కిలా ఈ అరణ్యానికి వచ్చావు? నాయనగారు విచారం
లేకుండా ఉన్నారా? తల్లులందరూ క్షేమమా? నీవు రాజధర్మాలు చక్కగా పాటిస్తూ
పరిపాలన చేస్తున్నావా? నీ రాజ్యం ఎవరూ అపహరించలేదు గద? మంత్రులు అన్ని
వేళలా తగిన సలహాలు ఇస్తూ నీకు సహాయంగా ఉంటున్నారా?''
భరతుడు రాజ్యాభిషేకం చేసుకున్నాడనుకుని రాముడు వేసిన ప్రశ్నలన్నిటికీ
సమాధానంగా, ``అన్నా, మన వంశంలో పెద్ద కొడుకుండగా చిన్నవాడు అభిషేకించుకునే
ఆచారం ఎన్నడన్నా ఉన్నదా? పెద్దవాడివైన నువు్వండగా చిన్నవాడినైన నేనెలా
రాజ్యాభిషేకం చేసుకోగలను? నా వెంట అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకుని,
మన వంశాన్ని తరింపజెయ్యి. ఇప్పుడు మన తండ్రి కూడా లేడు.
నే నింకా కేకయరాజు నగరంలో ఉండగానే ఆయన పోయాడు. నీవూ, సీతా, లక్ష్మణుడూ
వెళ్ళిపోయిన దుఃఖం ఆయనను తన పొట్టన పెట్టుకున్నది. ముందు తండ్రిగారికి జల
తర్పణాలు చెయ్యి. నిన్నే తలచుకుంటూ పోయిన ఆత్మకు నీ జలతర్పణాలే ఫల
ప్రదమవుతాయి,'' అన్నాడు. తండ్రి మరణవార్త విని రాముడు మూర్ఛపోయాడు.
సీతా భరత లక్ష్మణ శత్రుఘు్నలు చన్నీరు చల్లి రాముడికి మూర్ఛ
తెలిసేటట్టు చేశారు. రాముడి విచారానికి అంతులేదు. తన కోసం దుఃఖించి తండ్రి
చనిపోయినందుకూ, ఆయనకు తాను ఉత్తరక్రియలు చెయ్యనందుకూ తనను తాను
తిట్టుకున్నాడు. తరవాత అతను తండ్రికి ఉదకదానం చెయ్యటానికి
బయలుదేరుతూ,స్త్రీలూ పిల్లలూ ముందు నడవాలి గనక, సీతనూ లక్ష్మణుణ్ణీ తనకు
ముందుగా నదికి బయలుదేరమన్నాడు.
సీతారామలక్ష్మణులు మందాకినీ నది రేవులో స్నానాలుచేసి దశరథుడికి నీళు్ళ
వదిలారు. తరవాత రాముడు తండ్రికి సపిండీకరణం చేశాడు. గార గానుగుపిండిని
రేగుపళ్ళతో కలిపి ముద్దలుచేసి దర్భలపై ఉంచాడు. తరవాత వారు ముగ్గురూ
పర్ణశాలకు తిరిగివెళ్ళారు. అంతవరకూ దూరాన ఉండిపోయిన జనం పర్ణశాల నుంచి రోదన
ధ్వనులు వినగానే అటుకేసి పరిగెత్తుకుంటూ వచ్చి మునివేషంలో ఉన్న రాముణ్ణీ,
అతని తము్మలనూ, సీతనూ ఒక్క చోట చూశారు.
రాముడికి కొందరు నమస్కారాలు చేశారు. కొందరిని రాముడాలింగనం
చేసుకున్నాడు. ఈ లోపల దశరథుడి భార్యలు వసిష్ఠుడి వెంట మెల్లగా నడుచుకుంటూ
మందాకిని ఒడ్డు మీదుగా పర్ణశాల కేసి వచ్చారు. వారికి స్నానాలరేవూ, దానికి
ఎడంగా రాముడు తండ్రి నిమిత్తం పెట్టిన పిండాలూ కనిపించాయి. కౌసల్య
సుమిత్రతో, ``మన వాళు్ళ ఇక్కడే స్నానం చేస్తారు కాబోలు.
నీ కొడుకు రాముడి కోసం ఇక్కడినుంచే నీళు్ళ తీసుకుపోతాడు కాబోలు. ఇక
లక్ష్మణుడి కష్టాలు తీరాయిలే. భరతుడు రాముణ్ణి తీసుకువచ్చి రాజ్యాభిషేకం
చేయిస్తున్నాడుగా! ఈ గార గానుగుపిండి ముద్దలు చూశావా? భూమండలమంతా ఏలిన దశరథ
మహారాజుకు ఈ ముద్ద లేమిటి, ప్రారబ్ధంగాకపోతే? పాపం, రాముడిదే తింటున్నాడు
కాబోలు.
తలుచుకుంటే నా గుండె పగి లిపోతున్నది!'' అన్నది వచ్చే దుఃఖాన్ని
బలవంతంగా ఆపుకుంటూ. వారు పర్ణశాల చేరగానే రాముడు లేచి ముగ్గురు తల్లులకూ
సాష్టాంగ నమస్కారం చేశాడు. సీత కూడా వారికి నమస్కరించి ఎదురుగా నిలబడింది.
వనవాసంతో చిక్కి పోయి ఉన్న సీతను కౌసల్య కౌగలించుకుని, ``జనకమహారాజు
కూతురూ, దశరథ మహారాజు కోడలూ అయి ఉండి నీకీ వనవాసం గతి పట్టిందా, తల్లీ?''
అని ఎంతగానో వాపోయింది. రాముడూ, వసిష్ఠుడూ దగ్గిరగా కూచున్నారు.
రాముడికి మరొక పక్కగా భరతుడూ, మంత్రులూ, పురప్రముఖులూ మౌనంగా
కూచున్నారు. భరతుడు తాను వచ్చినపని బయట పెట్టే సమయం వచ్చింది. అతడు ఎలా
మొదలు పెడతాడా అని అందరూ ఆత్రంగా వింటున్నారు. రాముడే విషయం కదిపాడు.
``భరతా, నీవు జడలూ, నారబట్టలూ, కృష్ణాజినమూ ధరించి మునికుమారుడిలా ఈ
అరణ్యానికి రావటానికి కారణ మేమిటి? వినాలని ఉన్నది,'' అన్నాడతను. భరతుడిలా
చెప్పాడు: ``మన తండ్రి నిన్ను అడవికి పంపి నీ వియోగం భరించ లేక కాలధర్మం
చెందాడు.
ఆయన ఈ పాపపు పని చేయటానికి ప్రేరణ ఇచ్చినది నా తల్లి కైకేయి. అందుకామె
ఘోరనరకం ఎలాగూ అనుభవిస్తుంది. ఆమె కొడుకునైన నన్ను నీవు అనుగ్రహించాలి.
వచ్చి రాజ్యాభిషేకం చేసుకో. ఇందుకే మన తల్లులూ, ఈ ప్రజలూ కూడా నిన్ను
వెతుక్కుంటూ నావెంట వచ్చారు. వారి కోరిక తీర్చు. ఇంతమంది కోరికను
తోసిపుచ్చకు.'' ఈ మాటలు చెప్పి భరతుడు తన తల రాముడి పాదాలకు తగిలేలాగా
సాష్టాంగ పడ్డాడు. రాముడు భరతుణ్ణి కౌగలించుకుని నిట్టూర్చుతూ, ``నాయనా,
నీవు చిన్నతనం చేత నీ తల్లిని నిందించావు.
పెద్దవారికి చిన్నవారిని ఎలా శాసించటానికైనా అధికారం ఉన్నది.
దశరథుడికి నన్ను అడవికి పంపే అధికారం ఉన్నది. తండ్రి మీద లాగే తల్లి మీదా
గౌరవం ఉంచాలి. పెద్దలు నన్ను అడవికి పొమ్మంటే నేను రాజ్యం ఎలా చేస్తాను?
నీవు అయోధ్యకు వెళ్ళి రాజ్యం చెయ్యాలి, నేను నారబట్టలు కట్టి వనవాసం
చెయ్యాలి. ఇది మన తండ్రి ప్రజల సమక్షంలో ఏర్పరచిన నియమం. పధ్నాలుగేళూ్ళ
వనవాసం ముగించినాక తిరిగివచ్చి తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజ్యం చేస్తాను.
తండ్రి ఆనతి నెరవేర్చటంకంటె నాకు రాజ్యం ఏలటం ఎక్కువైనది కాదు,''
అన్నాడు. భరతుడి నోట మాటలు రాక అలాగే ఉండిపోయాడు. ఆ రాత్రి అలాగే
గడిచిపోయింది. మర్నాడు అందరూ స్నానాలూ, జపహోమాలూ పూర్తిచేసి మళ్ళీ రాముడి
చుట్టూ చేరారు. ఎవరూ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం మధ్య భరతుడు రాముడితో, ``నా
తల్లిని గౌరవించి, నాకు రాజ్యం ఇచ్చావు. దాన్ని నీకిస్తున్నాను, తీసుకుని
సుఖంగా ఏలుకో.
ఈ రాజ్యభారం మొయ్యటానికి నీవే సమర్థుడవు. గుర్రంలాగా గాడిద నడవలేదు
గదా! మన తండ్రి నీకు చిన్నతనం నుంచీ ఎంతో శ్రమపడి రాజుకు అవసరమైన శిక్షణ
ఇచ్చాడు. నీవు రాజువు కాకుండాపోతే, ఆయన పడిన శ్రమ అంతా వృథా అవుతుంది,''
అన్నాడు. భరతుడు చెప్పిన ఈ మాటలకు చుట్టూ చేరినవారంతా ఎంతో సంతోషం
వెలిబుచ్చి, ప్రశంసించారు.
అప్పుడు రాముడు భరతుడికి కొంత తత్వబోధ చేశాడు: ప్రాణులకు మరణం నిత్యం.
మనిషి ఏ పని చేస్తున్నా ఒక్కొక్క క్షణమే మృత్యువు దగ్గిరపడుతూ ఉంటుంది.
ముసలివాడై అసమర్థుడైనవాడు చేయగలది లేదు; యౌవనం ఉండగానే ఆత్మవిచారం
చెయ్యాలి. గడచిన క్షణం మరి రాదు. చనిపోయినవారి కోసం ఎంత చింతించీ లాభంలేదు.
ఏ ప్రాణి కూడా తన ఇష్టంవచ్చినట్టు నడుచుకోలేదు. దశరథుడు ఎన్నో
పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళ్ళాడు. అందుచేత భరతుడు మనోవైకల్యం మాని
తండ్రి ఆజ్ఞను శిరసావహించి, తండ్రి జాడలలోనే నడుచుకుంటూ రాజ్యం చెయ్యటం
ధర్మం. అలాగే రాముడు తండ్రి ఆజ్ఞ మీరక వనవాసం జరపటం ధర్మం. అంతా విని
భరతుడు, ``నేను ధర్మానికి వెరిచే నా తల్లిని శిక్షించలేదు. తండ్రిని
బహిరంగంగా దూషించలేదు.
కాని ఆయన తన భార్యకు దాసుడై, ఆమె విషం తాగుతానంటే బెదిరి, రాజ్యం
చేయవలసినవాణ్ణి అరణ్యానికి పంపటం అధర్మం కాదా? తండ్రి చేసిన అన్యాయాన్ని
సరిచేసి తండ్రికి నరకప్రాప్తి కలగకుండా కొడుకు చూడవద్దా? వచ్చి రాజ్యంచేసి,
తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచెయ్యి,'' అన్నాడు. రాముడు ఇందుకెంత మాత్రమూ
ఒప్పుకో లేదు. కైకేయిని పెళ్ళాడేటప్పుడు దశరథుడు తన మామగారితో ఆమెకు పుట్టే
కొడుకుకే పట్టం కడతానని మాట ఇచ్చిన సంగతి చెప్పాడు.
అప్పుడు అక్కడ ఉన్నవారిలో జాబాలి అనే బ్రాహ్మణుడు రాముడితో,
``వెర్రివాడా? ఎవరు తండ్రి? ఎవరు కొడుకు? చచ్చిపోయిన వారి తృప్తి కోసం
తద్దినాలు పెట్టేవాళూ్ళ, ఈ లోకంలో కష్టాలుపడేవాళూ్ళ మూఢులు. పరలోకం
ఎక్కడున్నది? నీవు వెళ్ళి హాయిగా రాజ్యంచేసి సుఖపడు. ప్రతి ప్రాణీ ఒంటరిగా
పుట్టుతుంది, ఒంటరిగా చస్తుంది.
బతికున్నంత కాలమూ ఈ ప్రపంచం ఒక మజిలీ. ఇదే నిజం, మిగిలినదంతా భ్రమ,''
అన్నాడు. ``ఇవి నాస్తికులనవలిసిన మాటలు. నీవు నాస్తికుడవని తెలియక మా
తండ్రి నిన్ను చేరదీశాడు,'' అని రాముడు జాబాలిని నిందించాడు. వసిష్ఠుడు
అడ్డువచ్చి, ``నాయనా, జాబాలి నాస్తికుడు కాడు. నీచేత రాజ్యాభిషేకానికి
ఒప్పించటానికే అతను అలా చెప్పాడు,'' అన్నాడు. వసిష్ఠుడు కూడా పట్టం
కట్టుకోమని రాముడికి ఎంతగానో చెప్పాడు.
కాని రాముడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. అప్పుడు భరతుడు
సుమంత్రుడితో, ``వెంటనే వెళ్ళి దర్భలు తెచ్చి ఈ పర్ణశాల వాకిలికి అడ్డంగా
పరు. రాముడు నా కోరిక తీర్చేదాకా నేను వాటిపై పడుకుని లేవను,'' అన్నాడు.
సుమంత్రుడు, ``ఏం చెయ్యమంటావు?'' అన్నట్టు రాముడి కేసి చూశాడు. అది గమనించి
భరతుడు తానే స్వయంగా వెళ్ళి దర్భలు తెచ్చి, వాటిని పర్ణశాల వాకి లికి
అడ్డంగా పక్కవేసుకుని అలాగే పడుకున్నాడు. అది చూసి రాముడు భరతుడితో,
``నాయనా, ఈ పనిచేసేవారు అప్పులు వసూలు చేసుకోలేకపోయిన బ్రాహ్మణులు.
ఇది క్షత్రియులు చేసేపని కాదు. అదీగాక నేను నీకేమి ద్రోహం చేశానని
వాకిలికి అడ్డం పడుకుంటావు? లే, నా మాట విని అయోధ్యకు తిరిగి వెళ్ళిపో,''
అన్నాడు. భరతుడు దర్భల మీది నుంచి లేవకుండానే చుట్టూ మూగిన జనాన్ని చూసి,
``మీరందరూ ఊరుకుంటారేం? రాముడికి చెప్పరేం?'' అని అడిగాడు. ``రాముడు తండ్రి
ఆజ్ఞ పాలించి తీరాలని పట్టుపడుతున్నప్పుడు చేసేదేముందీ?'' అన్నారు
వారందరూ.
No comments:
Post a Comment