జాంబవంతుడు ప్రేరేపించగా హనుమంతుడు వాయువేగంతో ఆకాశ మార్గాన హిమాలయ పర్వతాలకు పోయి, అక్కడ ఉన్న మంచు శిఖరాలూ, గుహలూ, గొప్ప క్షేత్రాలైన బ్రహ్మకోశమూ, కైలాసమూ, హయగ్రీవమూ, బ్రహ్మకపాలమూ, కుబేరస్థానమూ, పాతాళరంధ్రమూ, కాంచన శృంగమూ చూస్తూ సర్వౌషధి పర్వతం పైన దిగి, ఓషధుల కోసం వెదక సాగాడు. ఆ సంగతి తెలిసి దివ్యౌషధులు అంతర్థానమయ్యూయి.
హనుమంతుడికి పట్టరాని కోపం వచ్చింది. అతను పెద్దపెట్టున అరిచి పర్వతంతో, ‘‘రాముడి పైన జాలి తలపరాదని నిశ్చయించుకున్నావా ఏమిటి? నిన్ను నా చేతులతో పెరికి, పిండి చేసేస్తాను,’’ అన్నాడు. అంటూనే హనుమంతుడు ఆ పర్వత శిఖరాన్ని పెకలించి తిరిగి ఆకాశ మార్గం పట్టాడు. పర్వత శిఖరంతో సహా తిరిగి వస్తున్న హనుమంతుణ్ణి చూసి వానరులు గట్టిగా అరిచారు. హనుమంతుడు ఓషధి పర్వతంతో సహా త్రికూట పర్వతం మీద వానర సేన మధ్య వాలి, ప్రముఖ వానరులకు నమస్కారాలు చేసి, విభీషణుణ్ణి కౌగిలించుకున్నాడు. రామలక్ష్మణులూ, ఇతర వానర వీరులూ దివ్యౌషధుల వాసనకు బాణాల బాధ పోగొట్టుకున్నారు. యుద్ధంలో చచ్చిపోయిన వానరులు సైతం దివ్యౌషధుల గాలి సోకగానే నిద్ర లేచినట్టు లేచి కూర్చున్నారు. హనుమంతుడు ఓషధి పర్వత శిఖరాన్ని తీసుకుపోయి యథాస్థానంలో ఉంచి తిరిగి వచ్చాడు.
అప్పుడు సుగ్రీవుడు హనుమంతుడితో, ‘‘తమ్ముడైన కుంభకర్ణుడూ, కొడుకులూ చచ్చారు గనుక ఇప్పుడు రావణుడు యుద్ధానికి రాడు. మనలో బల వేగాలు గల వానరులు ఈ రాత్రి దివిటీలు తీసుకుని వెళ్ళి లంకపై పడాలి,’’ అన్నాడు. సూర్యాస్తమయమై భయంకరమైన రాత్రి రాగానే వానర వీరులు దివిటీలు పట్టుకుని లంకకేసి వెళ్ళారు. వారి ధాటికి బెదిరి నగర ద్వార రక్షకులైన రాక్షసులు పారిపోయూరు. తమను అడ్డే వారెవరూ లేక, వానరులు నగరం ప్రవేశించి, ద్వారాలలోనూ, బురుజులలోనూ, రాజ వీధులలోనూ, ఇతర వీధులన్నిటా నిప్పు పెట్టారు. లంక అంతా అంటుకుని తగలబడసాగింది. ఆకాశమంత ఎత్తున్న మేడలు కాలి, కూలిపోయూయి. ఇళ్ళతో బాటు విలువగల వస్తువులూ, వస్త్రాలూ, శాలువలూ, రత్నకంబళాలూ, నగలూ, ఆయుధాలూ, కవచాలూ, సమస్తమూ తగలబడిపోయూయి. అనేక మంది రాక్షసులు కాలిపోయూరు. రాక్షస స్ర్తీలు హాహాకారాలు చేశారు. గుర్రాలూ, ఏనుగులూ కట్లు తెంచుకుని బీభత్సంగా పరిగెత్తాయి.
తగలబడిపోతున్న లంకానగరం సముద్రంలో ప్రతిబింబించి సముద్రం కూడా ఎరగ్రా కనబడింది. ఒక వంక వానరులు సంతోషంతోనూ, రాక్షసులు దుఃఖంతోనూ కేకలు పెడుతూంటే, రెండు ధ్వనులనూ మించి రాముడి బాణం చేసే ధ్వని వినపడింది. అది విని రాక్షసులు యుద్ధానికి సిద్ధపడ్డారు. రావణుడి అంతఃపుర ద్వారం వద్దకు వెళ్ళి యుద్ధం చేయవలసిందిగా సుగ్రీవుడు వానరోత్తముల నాజ్ఞాపించాడు.
వానరులు దివిటీలతో సహా ద్వారంలో నిలబడటం రావణుడు చూసి మండిపడి, ఆ వానరులను చంపిరమ్మని నికుంభుడూ, కుంభుడూ అనే వాళ్ళను, కుంభకర్ణుడి కొడుకులను పంపాడు. వాళ్ళు అనేక మంది రాక్షస వీరులను వెంటబెట్టుకుని బయలుదేరి వచ్చారు. వానరులకూ రాక్షసులకూ తీవ్రమైన యుద్ధం జరిగింది. అనేక మంది రాక్షస వీరులు చచ్చారు. అంగదుడు మూర్ఛపోయూడు. చివరకు కుంభుడు సుగ్రీవుడి చేతిలో చచ్చాడు. అతని తమ్ముడైన నికుంభుణ్ణి హనుమంతుడు దారుణంగా చంపేశాడు. కుంభ నికుంభులు చావగానే వానరులు సింహనాదాలు చేశారు. రాక్షసులు భయపడ్డారు.
తరవాత రావణుడు వానరులతో యుద్ధం చెయ్యటానికి ఖరుడి కొడుకైన మకరాక్షుణ్ణి వెళ్ళమన్నాడు. మకరాక్షుడు రాక్షస సేనతో సహా రామ లక్ష్మణులతో యుద్ధం చెయ్యటానికి బయలుదేరి వెళ్ళాడు. రాక్షసుల బాణ వర్షం ముందు తాళలేక వానరులు పారిపోయి వస్తుంటే వెంట తరుముకుంటూ వచ్చే రాక్షసులను రాముడు తన బాణాలతో నిలవేశాడు. తన తండ్రి అయిన ఖరుణ్ణి చంపినందుకు రాముణ్ణి చంపి పగ తీర్చుకుంటానని మకరాక్షుడు ప్రగల్భాలాడాడు.
‘‘మాటలతో విజయం కలగదు! యుద్ధం చెయ్యి,’’ అన్నాడు రాముడు. ఇద్దరూ తలపడి భయంకరమైన యుద్ధం చేశారు. మకరాక్షుడు తన సారథినీ, గుర్రాలనూ, రథాన్నీ పోగొట్టుకుని చివరకు రాముడు ప్రయోగించిన ఆగ్నేయూస్త్రంతో చచ్చి పడిపోయూడు. అతని వెంట ఉన్న రాక్షసులందరూ నగరంలోకి పారిపోయూరు. మకరాక్షుడి మరణ వార్త విని రావణుడు కోపోద్రేకంతో పళ్ళు పటపట కొరికి, తన కొడుకైన ఇంద్రజిత్తును పిలిచి, ‘‘నాయనా దృశ్యంగానో, అదృశ్యంగానో రామలక్ష్మణులతో యుద్ధం చేసి, వాళ్ళను చంపిరా! ఇంద్రుణ్ణి గెలిచిన నీకీ మానవమాత్రులొక లెక్కా?’’ అన్నాడు.
ఇంద్రజిత్తు తండ్రి ఆజ్ఞ పొంది యజ్ఞశాలకు వెళ్ళి, హోమం చేసి, ఒక నల్ల మేకను బలి ఇచ్చాడు. అగ్నిహోత్రం చక్కగా ప్రజ్వలించి విజయం సూచించింది. ఇంద్రజిత్తు అదృశ్యశక్తి గల తన రథమెక్కి, యుద్ధరంగానికి వెళ్ళి, వానర సేనలో ఉన్న రామలక్ష్మణులను గుర్తించి, వారిపై బాణాలు వర్షం లాగా కురిపించసాగాడు. ఇంద్రజిత్తు ఆకాశంలో ఎటుగా ఉన్నదీ కానరాక, రామలక్ష్మణులు ఆకాశ మంతా బాణాలతోనూ, దివ్యాస్త్రాలతోనూ నింపేశారు. ఇంద్రజిత్తు వేసే బాణాలు ఎటునుంచి వస్తున్నదీ కనిపెట్టి, రామలక్ష్మణులు అటుగా తమ బాణాలను ప్రయోగించారు. అయితే ఇంద్రజిత్తు ఆకాశమంతటా సంచరిస్తూండటం చేత వారి బాణాలతనికి తగల లేదు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణాలతో రామలక్ష్మణుల శరీరాల రక్తప్రవాహాలు కారాయి.
వానరులు గుంపులు గుంపులుగా చచ్చారు. లక్ష్మణుడికి కోపం వచ్చి, ‘‘బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాక్షసులనందరినీ చంపేస్తాను,’’ అన్నాడు. ‘‘ఒక్కడి కోసం, మనతో యుద్ధం చెయ్యని వారందరినీ చంపటం ఉచితం కాదు. ఇంద్రజిత్తు నొక్కణ్ణే చంపుదాం,’’ అన్నాడు రాముడు. అంతలో ఇంద్రజిత్తు ఒక మాయ ఆలోచించాడు. అతనొక మాయూసీతను చేసి, ఆమెను రథం మీద పెట్టుకుని, వానరులు చూస్తుండగా ఆమెను చంపి, రామలక్ష్మణులకు మనస్తాపం కలిగించే ఉద్దేశంతో వానరసేన కెదురుగా వచ్చాడు. ఇంద్రజిత్తు కళ్ళకు కనపడగానే వానరులు యుద్ధోత్సాహం చెందారు. హనుమంతుడు ఒక పెద్ద పర్వత శిఖరం పట్టుకుని వానరులకు ముందు నిలబడ్డాడు.
అంతలో హనుమంతుడికి ఇంద్రజిత్తు రథంలో సీత కనిపించింది. ఆమె మాసిన బట్ట కట్టుకుని, దుమ్ము కొట్టుకుని, దీన వదనంతో, తాను కొద్ది కాలం క్రితం చూసినట్టుగానే ఉన్నది. సీత ఇంద్రజిత్తు రథంలో ఉండటం చూసి హనుమంతుడు చాలా బాధపడి, ఏ ఉద్దేశంతో ఇంద్రజిత్తు ఆమెను తెస్తూ ఉండి ఉంటాడా అని ఆలోచించి, పక్క వారిని అడుగుతుండగా ఇంద్రజిత్తు మాయూ సీతను జుట్టు పట్టుకుని, కత్తితో కొట్టాడు. ఆమె ‘‘రామా! రామా!’’ అంటూ ఏడ్చింది.
హనుమంతుడు ఇంద్రజిత్తు ముందుకు వెళ్ళి, అతన్ని నానా తిట్లూ తిట్టి, ‘‘ఈ సీత నీకే విధమైన అపకారం చేసింది? ఆమెనెందుకు చంప జూస్తున్నావు?’’ అని అడిగాడు.
‘‘ఈ సీత మూలానే గదా సుగ్రీవుడూ, రాముడూ ఈ లంకకు వచ్చారు? ఈమెను ఇప్పుడు నీ ఎదుటే చంపి, ఆ తరవాత రాముణ్ణీ, లక్ష్మణుణ్ణీ, నిన్నూ, సుగ్రీవుణ్ణీ, ఆచారం పోగొట్టుకున్న ఆ విభీషణుణ్ణీ చంపేస్తాను,’’ అన్నాడు ఇంద్రజిత్తు. వెంటనే అతను తన చేతి కత్తితో మాయూసీతను నరికేశాడు. ‘‘నీ కళ్ళ ఎదుటనే సీతను చంపేశాను. ఇక మీ ప్రయత్నమంతా వృథా!’’ అంటూ ఇంద్రజిత్తు పెద్ద పెట్టున సింహనాదం చేశాడు. వానరులు భయపడి పారిపోసాగారు. అప్పుడు హనుమంతుడు వారితో, ‘‘ఎక్కడికి పారిపోతారు? మీ పరాక్రమమంతా ఏమయింది? నేను ముందు నడుస్తాను, నా వెంట రండి,’’ అని అందరినీ యుద్ధోన్ముఖులను చేశాడు. అందరూ కలిసి రాక్షస సేనపై పడి చంప నారంభించారు.
హనుమంతుడు ఒక వైపు దుఃఖంతోనూ, మరొక వైపు కోపంతోనూ తపించిపోతూ ఇంద్రజిత్తు పైన ఒక పెద్ద శిల విసిరాడు. కాని అది అతనికి తగలలేదు. అయినా వానరులు హనుమంతుడి చర్యతో ఉత్సాహం వచ్చి రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టసాగారు. హనుమంతు డప్పుడు తోటి వానరులతో, ‘‘మనం ఏ సీత కోసం వచ్చామో, ఎవరి కోసం ప్రాణాలొడ్డి యుద్ధం చేస్తున్నామో, ఆ సీత కాస్తా చంపబడింది. ఇంద్రజిత్తు సీతను చంపాడన్న వార్త రాముడికీ, సుగ్రీవుడికీ చెప్పి, వారేం చెయ్యమంటే అది చేద్దాం,’’ అన్నాడు. వానరులు వెనక్కు తిరిగి వెళ్ళిపోయూరు. వారలా వెళ్ళిపోవటం చూసి ఇంద్రజిత్తు హోమం చెయ్యటం కోసం నికుంభిళ చైత్యానికి వెళ్ళాడు.
ఈ లోపల రాముడికి పశ్చిమ ద్వారం వైపు నుంచి యుద్ధ కోలాహలం వినిపించింది. అతను జాంబవంతుడితో, ‘‘మన హనుమంతుడు రాక్షసులతో పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నట్టున్నది. అతనికి సహాయం వెళ్ళు,’’ అన్నాడు. జాంబవంతుడు పశ్చిమ ద్వారం దిక్కుగా వెళుతూంటే దారిలో హనుమంతుడూ, ఇతర వానర వీరులూ ఎదురుగా రావటం చూశాడు. హనుమంతుడు యుద్ధ రంగానికి బయలుదేరిన భల్లూక సేనను వెనక్కు మళ్ళమని చెప్పి, త్వరగా రాముడున్న చోటికి వెళ్ళి, తన ఎదుటనే ఇంద్రజిత్తు సీతను చంపేసినట్టు చెప్పాడు. ఈ మాట వింటూనే రాముడు మొదలు నరికిన చెట్టు లాగా పడిపోయూడు. దూర దూరంగా ఉన్న వానరులందరూ పరిగెత్తుకొచ్చారు. రాముడి ముఖాన నీరు చల్లారు. లక్ష్మణుడు రాముణ్ణి ఓదార్చాడు. రాముడు లక్ష్మణుడి తొడపై తల పెట్టుకుని ఎంతో దుఃఖించాడు.
అంతలో అక్కడికి విభీషణుడు తన నలుగురు మంత్రులతోనూ వచ్చి, ‘‘అందరూ విచారంగా ఉన్నట్టున్నారే? ఏమిటి కారణం?’’ అని అడిగాడు. ‘‘ఇంద్రజిత్తు సీతను చంపేసినట్టు హనుమంతుడు వచ్చి చెప్పేసరికి రాముడు దుఃఖపడుతున్నాడు,’’ అని లక్ష్మణుడు విభీషణుడితో అన్నాడు.
‘‘అదంతా వట్టిమాట, రావణుడు సీతకు అంత కీడు ఎన్నటికీ జరగనివ్వడు. సీతను రాముడి కిచ్చెయ్యమని నే నెంత చెప్పినా సీతను విడిచి ఉండటానికి అంగీకరించనివాడు సీతను చంపనిస్తాడా? ఇంద్రజిత్తు సీతను చూడనైనా లేడు, వాడామెను తెచ్చి చంపగలడా? ఇప్పుడు రావణుడికి ఆ ఇంద్రజిత్తు తప్ప మరెవడూ లేడు. ఇంద్రజిత్తు విజయం కోసం హోమం చెయ్యటానికి నికుంభిళానికి వెళతాడు.
ఈ లోపల వానరులు వచ్చి తనకు యజ్ఞ భంగం కలగ చెయ్యకుండా చెయ్యటాని కేదో మాయ పన్నాడు. ఆ మాయ పారింది. మీరంతా పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. అక్కడ వాడు నిర్విఘ్నంగా హోమం పూర్తి చేస్తాడు. ఆ తరవాత దేవతలూ, దానవులూ ఏకమై ఎత్తి వచ్చినా వాడి ముందు నిలవలేరు. కనక నేను చెప్పే దేమంటే, వాడా హోమం పూర్తి చేసేలోగా మనం నికుంభిళానికి పోదాం. రామా! నిర్విచారంగా నీ విక్కడే ఉండి, మా వెంట లక్ష్మణుణ్ణి పంపించు. అతను ఇంద్రజిత్తును చంపగలుగుతాడు. ఏమాత్రమూ ఆలస్యం లేకుండా బయలుదేరాలి,’’ అన్నాడు విభీషణుడు.
No comments:
Post a Comment