Friday, September 7, 2012

రామాయణం - యుద్దకాండ 7


అకంపనుడు చచ్చిన వార్త విని రావణుడికి కోపం వచ్చింది. అతను సభ నుంచి బయలుదేరి, తన వ్యూహాలను చూసుకుంటూ ఒకసారి లంక అంతా తిరిగి వచ్చాడు. అతను లంక చుట్టూ ఉన్న వానరుల ముట్టడి కూడా చూశాడు; సభకు తిరిగి వచ్చి, ప్రహస్తుణ్ణి చూసి, ‘‘వానరుల ముట్టడిని విచ్ఛిన్నం చెయ్యటం ఇతరుల వల్లకాదు; దానికి నేనూ, నువ్వూ, కుంభకర్ణుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ మాత్రమే సమర్థులం. నువ్వు సేనతో వెళ్ళి, వానరులను జయించిరా,’’ అన్నాడు.

సీతను రాముడికిచ్చేసి సంధి చేసుకోవటమే మంచిదనుకున్న వారిలో ప్రహస్తుడు కూడా ఉన్నాడు. సంధి జరగలేదు. అందుచేత తప్పనిసరిగా యుద్ధం సంప్రాప్తమయింది. యుద్ధం వస్తే రావణుడి కోసం ప్రాణాలు విడవటానికైనా ప్రహస్తుడు సిద్ధమే. అతను రథమెక్కి, యుద్ధానికి బయలుదేరాడు.

ఆర్భాటంగా వస్తున్న ప్రహస్తుణ్ణి చూసి,  ‘‘అతను ప్రహస్తుడు. అస్త్రాలెరిగిన శూరుడు. రావణుడి సేనలో మూడోవంతు అతని ఆధీనంలో ఉంటుంది,’’ అని విభీషణుడు చెప్పాడు.
యుద్ధంలో ఉభయపక్షాలా ప్రాణ నష్టం జరిగింది. నరాంతకుడూ, కుంభహనుడూ, మహానాదుడూ, సమున్నతుడూ అనే రాక్షస యోధులు అంతులేని వానరులను చంపి, ద్వివిదుడూ, దుర్ముఖుడూ, జాంబవంతుడూ, తారుడూ అనే వానరవీరుల చేతుల్లో చచ్చారు. నీలుడు ప్రహస్తుణ్ణి ఎదుర్కొని, భయంకరంగా పోరాడి, తల చితకగొట్టి చంపేశాడు.


ప్రహస్తుడి మరణవార్త విని రావణుడికి కసీ, దుఃఖమూ కూడా కలిగాయి. అతను రాక్షసవీరులతో, ‘‘దేవతలను జయించగల ప్రహస్తుణ్ణే చంపారంటే వానరులు సామాన్యులుకారు. ఇంక నేను ఉపేక్షించటానికి లేదు. నేనే స్వయంగా యుద్ధానికి పోతాను;  నా బాణాలతో ఆ రామలక్ష్మణులనూ, వానరసేననూ దగ్ధం చేస్తాను,’’ అన్నాడు.

రావణుడు తన రథమెక్కి, సేనను వెంటబెట్టుకుని వానరులపై యుద్ధం చెయ్యటానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ సేనలో రావణుడి కొడుకులైన అకంపనుడనే వాడూ, ఇంద్రజిత్తూ ఉన్నారు. విభీషణుడు రాముడికి వారందరి గురించి వేరువేరుగా చెప్పాడు. రాముడు రావణుడి తేజస్సునూ, అతని యోధులు పట్టిన ఆయుధాలనూ చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. రావణుడు యుద్ధానికి వస్తుండగానే సుగ్రీవుడతన్ని ప్రతిఘటించాడు. రావణుడు వేసిన బాణాలకు సుగ్రీవుడు త్వరలోనే తెలివి తప్పి పడిపోయాడు.

వానరసేనను కాపాడే భారం రాముడిపైన పడింది. అతను విల్లుపట్టి రావణుడితో తలపడటానికి ఉద్యుక్తుడౌతుండగా, లక్ష్మణుడు రాముడితో, ‘‘వీణ్ణి చంపటానికి నువ్వు కావాలా? నన్ను పోనీ!’’ అన్నాడు. ‘‘వెళ్ళు. యుద్ధం జాగ్రత్తగా చెయ్యి,’’ అన్నాడు రాముడు. లక్ష్మణుడు రావణుడిపైకి వచ్చేలోపల హనుమంతుడు రావణుడి రథం పక్కన చేరి, కుడి చెయ్యి ఎత్తి, ‘‘నిన్నిప్పుడొక్క గుద్దుతో చంపబోతున్నాను,’’ అన్నాడు. ‘‘నన్ను తప్పకుండా కొట్టు. ఒక కోతి రావణుణ్ణి కొట్టింది అన్న ఖ్యాతి కలకాలం ఉండిపోతుంది. నువ్వు నన్ను కొట్టిన మరుక్షణం నీ ప్రాణాలు తీస్తాను,’’ అన్నాడు రావణుడు.


 ‘‘నా చేతి దెబ్బకు నీ కొడుకు అక్షుడు చచ్చిన సంగతి మరిచిపోకు,’’ అన్నాడు హనుమంతుడు. ఈ మాట విని రావణుడు హనుమంతుడి రొమ్ముమీద అరచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు హనుమంతుడు క్షణం పాటు దిమ్మరపోయి, రావణుడి రొమ్ము మీద తన అరచేత్తో ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బకు రావణుడదిరిపోయాడు. రావణుడు కాస్త పుంజుకుని, ‘‘భేష్! పగవాడివైతేనేం? నీ బలం చాలా గొప్పది!’’ అన్నాడు.

‘‘నా బలం తగలబెట్టనా? నా చేత దెబ్బతిని కూడా నీవింకా బతికే ఉంటివి! మళ్ళీ ఒకసారి దెబ్బ కొట్టు, ఆ తరవాత నా పిడికిలి పోటుతో నిన్ను యముడి దగ్గిరికి పంపేస్తాను,’’ అన్నాడు హనుమంతుడు. రావణుడు మండిపడి, తన పిడికిలితో హనుమంతుడి రొమ్ములో భయంకరంగా పొడిచి, హనుమంతుడు తెప్పిరిల్లే లోపుగా నీలుడితో యుద్ధానికి వెళ్ళాడు.
నీలుడు రావణుడితో అతి విచిత్రమైన యుద్ధం చేశాడు. అతను అతి చిన్న దేహం ధరించి రావణుడి టెక్కెం పైన వాలాడు. అతనికి బాణం గురిచేసి కొట్టటం రావణుడికి అసాధ్యమయింది. నీలుణ్ణి చూసి రామలక్ష్మణ హనుమంతు లాశ్చర్యపడ్డారు. చివరకు రావణుడు నీలుణ్ణి ఆగ్నేయాస్త్రంతో పడగొట్టాడు. అయితే, అగ్నిదేవుడు నీలుడికి తండ్రే గనక ఆగ్నేయాస్త్రం అతన్ని నేలపై పడగొట్టిందే గాని, అతని ప్రాణాలు తియ్యలేదు.

అప్పుడు లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించాడు. ఇద్దరికీ జరిగిన యుద్ధంలో ఒకరినొకరు మూర్ఛపోగొట్టుకున్నారు. చివరకు రావణుడు లక్ష్మణుడిపైన ఒక శక్తిని ప్రయోగించాడు; అది అతనికి బ్రహ్మ ఇచ్చినది. అది రొమ్ములో తగిలే సరికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అప్పుడు రావణుడు లక్ష్మణుడి వద్దకు వచ్చి, అతన్ని తన చేతులలో ఎత్తటానికి ప్రయత్నించాడు, కాని సాధ్యం కాలేదు.

ఇంతలో హనుమంతుడు వచ్చి రావణుణ్ణి తన పిడికిలితో రొమ్ములో పొడిచాడు. ఆ దెబ్బకు రావణుడు మోకాళ్ళ పైన ముందుకు పడిపోయి, రక్తం కక్కుకుని, తన రథం మీద స్పృహ తప్పి పడిపోయాడు. హనుమంతుడు లక్ష్మణుణ్ణి తన చేతులలో ఎత్తుకుని రాముడి వద్దకు తెచ్చాడు. కొద్ది సేపటిలో లక్ష్మణుడికి మూర్ఛ తెలిసింది. రావణుడికి కూడా స్పృహ వచ్చింది. హనుమంతుడు రాముడితో, ‘‘నా వీపు మీద ఎక్కి రావణుడితో యుద్ధం చెయ్యి,’’ అన్నాడు. రాముడా ప్రకారమే హనుమంతుడి భుజాలపైన ఎక్కి కూర్చున్నాడు. హనుమంతుడు రాముణ్ణి క్షణాలలో రావణుడి ఎదటికి తీసుకుపోయాడు.


రావణుడు హనుమంతుణ్ణి తీవ్రమైన బాణాలు వేసి కొట్టాడు. అది చూసి రాముడు క్రోధంతో రావణుడి రథ చక్రాలనూ, గుర్రాలనూ, ధ్వజాన్నీ, సారథినీ నాశనం చేసి, రావణుడి రొమ్ములో పిడుగులాటి బాణాన్ని నాటాడు. ఆ దెబ్బకు రావణుడు పడిపోగా మరొక బాణంతో అతని కిరీటాన్ని భగ్నం చేసేసి, ‘‘రాక్షసరాజా, చాలా గొప్ప యుద్ధం చేసి అలిసిపోయి ఉన్నావు. అందుచేత నిన్నిప్పుడే యమపురికి పంపను. లంకకు తిరిగి వెళ్ళటానికి అనుమతిస్తున్నాను. వెళ్ళి, విశ్రాంతి తీసుకుని, రథమెక్కి, బాణం పట్టుకుని మళ్ళీరా. అప్పుడు నా శక్తి చూపుతాను,’’ అన్నాడు.

రావణుడు గర్వభంగం పొంది, సిగ్గుపడుతూ లంకకు తిరిగి వెళ్ళాడు. అతనికిప్పుడు రాముడంటే భయం పట్టుకున్నది. అతను రాక్షసులను సమావేశపరిచి ఇలా అన్నాడు:
‘‘ఇంద్రుడికి తీసిపోని నేను ఒక మనుష్య మాత్రుడికి ఓడిపోయాను! నా తపస్సంతా ఏమయిందో తెలియటం లేదు. నాకు మనుష్యుల వల్ల ప్రమాదం ఉంటుందని ఒకప్పుడు బ్రహ్మ చెప్పాడు. వెనక నేను అనరణ్యుడనే ఇక్ష్వాకు రాజును చంపేటప్పుడు, నన్ను సర్వనాశనం చేయగలవాడు తన కులంలోనే జన్మిస్తాడని ఆయన అన్నాడు.

వెనక వేదవతిని బలాత్కరించి ఆవిడ చేత శాపం పొందాను. ఆ వేదవతే ఈ సీత. పార్వతీ, నందీశ్వరుడూ, రంభా, పుంజికస్థలా ఏమేమి అన్నారో, అదంతా ఈనాడు నిజం అవుతున్నది. ప్రమాదం మనసులో ఉంచుకుని శత్రుసంహారం విషయంలో మీరు మరింత శ్రద్ధ వహించండి. ద్వారాలనూ, గోపురాలనూ శ్రద్ధగా కాపలా కాయండి.  కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు. అతన్ని లేపండి. యుద్ధాలోచన చేసేటప్పుడు కూడా మేలుకునే ఉన్నాడు.

అటువంటి వాడు, తొమ్మిది రోజులకు యుద్ధం ఆరంభమవుతుందనగా నిద్రపోయాడు. అతన్ని లేపండి. నాలాగా అతను శాపాలకు గురి అయినవాడు కాడు. అవలీలగా వానరసేననూ, రామ లక్ష్మణులనూ నిర్మూలించగలవాడు. రాముడి చేత దెబ్బ తిన్న నాకు కుంభకర్ణుడు లేస్తే ధైర్యంగా ఉంటుంది. కుంభకర్ణుడు ఇటువంటి తరుణంలో పక్కన లేకపోతే అతను ఉండి ప్రయోజనమేమిటి?’’


రావణుడీమాట అనగానే రాక్షసులు కుంభకర్ణుడి ఇంటికి బయలుదేరారు. వాళ్ళు తమ వెంట గంధమూ, పూలమాలలూ, ఆహారమూ పట్టుకుపోయారు. ఒక బ్రహ్మాండమైన గుహలాంటి ఇంట కుంభకర్ణుడు పడుకుని నిద్రపోతున్నాడు. అతను విడిచే ఊపిరి, రాక్షసులు లోపలికి ప్రవేశించటానికి యత్నిస్తే, బయటికి తోసేసింది. అతి కష్టం మీద వాళ్ళు చివరికి గుహ లోపలికి వెళ్ళారు.

కుంభకర్ణుడు భయంకరమైన ఆకారంతో పడుకుని గాఢ నిద్రలో ఉన్నాడు. అతడి ముందు రకరకాల మాంసాలు పెట్టి ఉన్నాయి. అన్నం రాసులుగా పోసి ఉన్నది. మద్యమూ, నెత్తురూ కడవలలో ఉన్నాయి. అతన్ని లేపటానికి రాక్షసులు విశ్వప్రయత్నాలు చేశారు-అందరూ కలిసి గట్టిగా అరిచారు, భయంకరమైన ధ్వనులు చేశారు. గదలతోనూ, రోకళ్ళతోనూ అతని శరీరమంతా బాదారు. కుంభకర్ణుడు కదలనైనా లేదు.

రాక్షసులకు మండిపోయింది. వాళ్ళు ఏనుగుల చేత కుంభకర్ణుణ్ణి తొక్కించారు. ఏవో పురుగులు పాకుతున్నట్టనిపించి కుంభకర్ణుడు మేలుకున్నాడు. అతను లేచి కూర్చుని పెద్ద పెట్టున ఆవలించాడు. కుంభకర్ణుడు నిద్రలేస్తూనే మాంసంతిని, మద్యం తాగి చుట్టూ కలయజూసి, రాక్షసులతో, ‘‘మీరంతా వచ్చి నన్నెందుకు నిద్ర లేపారు? రావణుడికి క్షేమమేగదా?’’ అన్నాడు. కుంభకర్ణుడు పడుకుంటే మూడునెలలూ, ఆరు నెలలూ, తొమ్మిది నెలలూ నిద్ర పోయేవాడు.

రావణుడు మంత్రి యూపాక్షుడనేవాడు కుంభకర్ణుడితో, ‘‘కుంభకర్ణా! పూర్వం దేవతల వల్ల కూడా కలిగి ఉండనంతటి భయం ఇప్పుడు మానవుల వల్ల కలిగింది. కొండలంతేసి వానరులు లంకను ముట్టడించి ఉన్నారు. సీతను ఎత్తుకు వచ్చినందుకాగ్రహించి రాముడీపని చేశాడు. కొంత కాలం క్రితం ఒక వానరుడు వచ్చి లంకను తగలబెట్టి, అక్షకుమారుణ్ణి చంపేశాడు. దేవతలనందరినీ జయించిన రావణుణ్ణి రాముడు కొస ప్రాణంతో విడిచిపెట్టాడు. ఏ దేవతలూ చెయ్యలేని పని ఇప్పుడా రాముడు చేశాడు,’’ అన్నాడు.


తన అన్న అపజయ వార్త విని కుంభకర్ణుడు కోపోద్రేకంతో గుడ్లు తిప్పుతూ, ‘‘నేనా వానరసేననూ, రామలక్ష్మణులనూ చంపేసి తరవాత రావణుణ్ణి చూస్తాను,’’ అన్నాడు.
మహోదరుడనే రాక్షసుడు కుంభకర్ణుడికి చేతులు జోడించి, ‘‘కుంభకర్ణా, నువ్వు రావణుడి వద్దకు వచ్చి, ఆయన చెప్పేది విని, మంచి చెడ్డలు సరిగా ఆలోచించుకుని, ఆపైన శత్రువుల పైకి యుద్ధానికి పోతే విజయం పొందటానికి వీలుగా ఉంటుంది,’’ అన్నాడు.

కుంభకర్ణుడందుకు సమ్మతించి రాక్షసులనందరినీ వెంటబెట్టుకుని రావణుడి ఇంటికి బయలుదేరాడు. అతను అంగవేస్తుంటే భూమి దద్దరిల్లింది. దారి పొడుగునా ఎదురైన రాక్షసులతనికి నమస్కారాలు చేశారు. లంక బయటి నుంచి అతన్ని చూసి వానరులు దడుచుకున్నారు. కొందరు వానరులు పారిపోసాగారు. రాముడు కుంభకర్ణుణ్ణి చూసి విభీషణుడితో, ‘‘లంకలో పర్వతాకారుడైన వీరుడొకడు కిరీటం ధరించి కనబడుతున్నాడే ఎవరతను? అతన్ని చూసి మన వానరులు పారిపోతున్నారు!’’ అన్నాడు.

‘‘అతను కుంభకర్ణుడు. యుద్ధంలో ఇంద్రుణ్ణీ, యముణ్ణీ గెలిచినవాడు. రాక్షసులలో అంత పెద్ద శరీరం కలవాడు లేడు. అతని బలం సహజమైనది, వరాల వల్ల వచ్చినది కాదు,’’ అన్నాడు విభీషణుడు.






No comments:

Post a Comment