రాముడు సీతా లక్ష్మణులతో సహా మహా భయంకరమైన దండకారణ్యం ప్రవేశించాడు.
అరణ్యం అంచునే ఋష్యాశ్రమాలున్నాయి. ఆశ్రమాలుండే ప్రాంతం అందంగా, ప్రశాంతంగా
కనిపించింది. అక్కడి ఋషులు సీతారామలక్ష్మణులకు చక్కని ఆతిథ్యమిచ్చి,
‘‘రామా, రాజు దుష్ట శిక్షణ చేస్తాడు గనక, ప్రజలకు తండ్రి వంటి వాడు. మేము
నీ రాజ్యంలో ఉన్నాం.
నువ్వు పట్టణంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా మాకు రాజువే. అందుచేత నువ్వే
మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండాలి,'' అన్నారు. రాముడు ఆ ఆశ్రమాలలో
రాత్రి గడిపి ఉదయం కాగానే సీతా లక్ష్మణులతో సహా నిర్జనమైన భీకరారణ్యం
ప్రవేశించాడు. ఇక్కడ అందమన్నది లేదు. ఎటు చూసినా భయంకరమైన దృశ్యాలే. చెట్లు
చీకాకుగా ఉన్నాయి.
నీటి మడుగులు అసహ్యం పుట్టిస్తున్నాయి. సమస్త భీకర జంతువులూ ఆ
అరణ్యంలో తిరుగాడుతున్నాయి. దారిలేని ఆ అరణ్యంలో పడి వారు పోతూండగా వారికొక
రాక్షసుడు ఎదురయ్యూడు. వాడు చాలా ఎత్తుగా ఉన్నాడు. పెద్ద నోరు; పెద్ద
పొట్ట; చూస్తేనే రోత పుట్టే ఆకారం! వాడి చేతిలో ఒక పెద్ద శూలం ఉన్నది.
దానికి సింహాలూ, పులులూ, తోడేళ్ళూ, జింకలూ, ఒక ఏనుగు తలా గుచ్చి
ఉన్నాయి. ఆ రాక్షసుడు సీతారామలక్ష్మణులను చూస్తూనే యముడిలాగా మీదికి వచ్చి,
సీతను అవలీలగా ఎత్తి చంకన పెట్టుకుని, ‘‘మీరు ఆయువు తీరి ఈ అరణ్యంలోకి
వచ్చినట్టున్నారు.
మీరు చూస్తే ఋషి, వేషాలు ధరించారు, మరి మీ వెంట ఈ ఆడది ఎందుకున్నది? నేను
దీన్ని పెళ్ళాడేస్తాను. ఋషులను తినటం నాకు అలవాటే, అందుచేత మిమ్మల్ని చంపి
మీ రక్తం తాగేస్తాను,'' అన్నాడు. రాక్షసుడి చంకలో చిక్కి గిలగిలా
కొట్టుకుంటున్న సీతను చూడగానే రాముడికి దుఃఖంతో నోరార్చుకు పోయింది. అతను
లక్ష్మణుడితో, ‘‘ఏ ఉద్దేశంతో కైకేయి నన్ను అడవికి పంపిందో ఆ ఉద్దేశం కొంచెం
కొంచెమే నేరవేరుతున్నది.
లక్ష్మణా, తండ్రి చనిపోయినా, రాజ్యం పోయినా కలగని బాధ వీడు సీతను
తాకటం చేత కలుగుతున్నది!'' అన్నాడు కన్నీరు కార్చుతూ. రాముడి దుఃఖం చూసి
లక్ష్మణుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ‘‘నేను పక్కన ఉండగానే అలా
విచారిస్తావేమిటి? ఒక్క బాణంతో నేను వీడి ప్రాణాలు తీస్తాను,'' అని అతను
రాముడితో అని రాక్షసుడితో వెటకారంగా, ‘‘నాయనా, ఈ అరణ్యంలో సుఖంగా తిరిగే
నువ్వెవడవు?'' అన్నాడు. ‘‘అడిగేవాణ్ణి నేను, చెప్పేది మీరు! ఎక్కడికి
పోతున్నారు? ముందు నువ్వు అది చెప్పు,'' అన్నాడు రాక్షసుడు. ‘‘మేము
క్షత్రియులం.
సదాచారం గల వాళ్ళం. అరణ్యవాసం చేస్తున్నాం. నీ సంగతి చెప్పు,''
అన్నాడు రాముడు. ‘‘నా సంగతిచెబుతా విను. నా తండ్రి జయుడు, తల్లి శతహ్రద. నా
పేరు విరాధుడు. బ్రహ్మను గురించి పెద్ద తపస్సు చేసి నేను ఏ ఆయుధంతో కూడా
చావకుండా వరం పొందాను. నన్నెవరూ ఏమీ చేయలేరు. అందుచేత మీరు ఆడదాని మీద ఆశ
వదులుకుని, పారిపోయి ప్రాణాలు రక్షించుకోండి. మీ ప్రాణాలు తీస్తే నాకేం
లాభం?'' అన్నాడు రాక్షసుడు.
రాముడి కళ్ళు కోపంతో ఎరబ్రడ్డాయి. ‘‘నీచుడా, పరస్ర్తీ హరణం చేస్తావా?
నీకు కాలం మూడింది,'' అంటూ అతను విల్లు ఎక్కుపెట్టి ఏడు కరుకైన బాణాలు
రాక్షసుడి శరీరంలో దిగిపోయేటట్టు కొట్టాడు. విరాధుడు ఎగతాళిగా నవ్వుతూ
సీతను కింద దించి, ఒక్కసారి ఒళ్ళు విరుచుకునే సరికి ఏడు బాణాలూ వాడి శరీరం
నుంచి బయటికి వచ్చి, కింద పడిపోయూయి. వాడు కోపంతో శూలం ఎత్తి రామలక్ష్మణుల
పైకి వచ్చాడు.
రాముడు రెండు బాణాలతో వాడి శూలాన్ని ముక్కలు చేశాడు. కాని విరాధుడు లక్ష్య
పెట్టక వారిని పట్టుకోవటానికి యత్నించాడు. రామ లక్ష్మణులు కత్తులు దూసి
వాణ్ణి ఎన్నో పోట్లు పొడిచారు. ఆ పోట్లనుకూడా లక్ష్యపెట్టక వాడు ఆ ఇద్దరినీ
అవలీలగా చెరొక భుజం మీదికి ఎత్తుకుని అరణ్యానికి అడ్డం పడి నడవసాగాడు.
‘‘వీడిలా మనని ఎక్కడికి తీసుకుపోతాడో చూద్దాం,'' అని రాముడు లక్ష్మణుడితో
అన్నాడు.
కాని సీత మాత్రం గట్టిగా ఏడుస్తూ, ‘‘అయ్యో, ఈ రాక్షసుడు రామ
లక్ష్మణులను ఎత్తుకు పోతున్నాడు. నన్ను తోడేళ్ళో, పెద్దపులులో మింగేస్తాయి!
... ఓ రాక్షసుడా, నీకు దణ్ణం పెడతాను. దయతలచి వారిని వదిలేసి నన్ను
తీసుకుపో!'' అన్నది. సీత చేసిన ఆర్తనాదం వినగానే రామలక్ష్మణులు
కూడబలుక్కుని, తమ చేతులలో ఉన్న కత్తులతో విరాధుడి భుజాలు రెండూ నరికేశారు.
వాడు కాస్తా పర్వతం కూలినట్టు కూలాడు. అలా కింద పడిన ఆ రాక్షసుణ్ణి
రామ లక్ష్మణులు పిడికిళ్ళతోనూ, మోకాళ్ళతోనూ కుమ్మి చితక బొడిచారు. అప్పటికీ
వాడి ప్రాణం పోలేదు. విరాధుడు కదలకుండా వాడి కంఠంపైన కాలువేసి బలంగా
తొక్కి పట్టి, రాముడు, ‘‘లక్ష్మణా, వీణ్ణి ఇలాగే పూడ్చేద్దాం. ఒక పెద్ద
గొయ్యి తవ్వు,'' అన్నాడు. లక్ష్మణుడు వాడి పక్కనే గొయ్యి తవ్వాడు.
రామలక్ష్మణులు వాణ్ణి ఆ గోతిలోకి బలాత్కారంగా తోసేశారు. గోతిలో పడిపోతూ
వాడు పెట్టిన పెడబొబ్బకు అరణ్యమంతా దద్దరిల్లింది.
తరవాత రామ లక్ష్మణులు గుంటను రాళ్ళతో పూడ్చేశారు. రాముడు సీతను
కౌగలించుకుని, ధైర్యం చెప్పి, లక్ష్మణుడితో, ‘‘మనం ఇలాటి అరణ్యానికి
అలవాటుపడిన వాళ్ళం కాదు. అందుచేత ఇక్కడ ఉండటం మంచిది కాదు. త్వరగా శరభంగ
మహాముని ఆశ్రమానికి పోదాం,'' అన్నాడు. వారు శరభంగ మహాముని ఆశ్రమాన్ని
చేరవస్తూ ఉండగా రాముడి కొక వింత దృశ్యం కనిపించింది. భూమికి ఎత్తుగా ఒక
కాంతివంతమైన రథం కనిపించింది. దానికి ఆకు పచ్చని గుర్రాలు కట్టి ఉన్నాయి.
సూర్యుడులాగా వెలిగి పోతున్న ఒక మహాపురు షుడు, కాంతివంతమైన ఆభరణాలూ,
స్వచ్ఛమైన బట్టలూ ధరించి, నేలను అంటకుండా ఆశ్రమం కేసి పోవటం కనిపించింది.
ఆయన వెంట ఆయనలాటి వాళ్ళే అనేక మంది పరివారంగా ఉన్నారు. అందరూ పాతికేళ్ళ
వయస్సుగలవాళ్ళే. రాముడు లక్ష్మణుడికి ఈ దృశ్యం చూపించి, ‘‘లక్ష్మణా, అది
దేవేంద్రుడు లాగుంది. నేను వెళ్ళి తెలుసుకువస్తాను.
నువ్వూ, సీతా ఇక్కడే ఉండండి,'' అంటూ బయలుదేరాడు. ఆ వచ్చినది నిజంగా
దేవేంద్రుడే. శరభంగ మహామునిని బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళటానికి స్వయంగా తన
రథంలో వచ్చాడు. రాముడు తన కోసం వస్తున్నాడని గ్రహించి ఇంద్రుడు
శరభంగుడితో, ‘‘రాముడు నన్ను కలుసుకోవటానికి వస్తున్నాడు. అతనివల్ల ఒక
మహాకార్యం జరగాలి. అది ముగిసినదాకా అతనికి కనపడటం నా కిష్టం లేదు,'' అని
చెప్పి తన రథమెక్కి తిరిగి వెళ్ళిపోయూడు.
తన ప్రయత్నం విఫలంకాగా రాముడు సీతా లక్ష్మణులను కలుపుకుని శరభంగుడి
వద్దకు వచ్చి నమస్కరించాడు. అప్పటికే శరభంగుడు అగ్నిప్రవేశం చెయ్యటానికి
ఏర్పాట్లన్నీ చేసుకుని ఉన్నాడు. రాముడు దేవేంద్రుణ్ణి గురించి అడగగా ఆయన,
‘‘అవును, నేను తపశ్శక్తి చేత బ్రహ్మలోకం సాధించుకున్నాను. నన్ను తీసుకు
పోవాలని ఇంద్రుడు వచ్చాడు. నీవు నా కోసం వస్తున్నావని తెలిసి, నిన్ను చూసి
మరీ పోదామనుకున్నాను. నేను సాధించిన బ్రహ్మలోక, స్వర్గలోకాలను నీకు దానం
చేస్తాను, పుచ్చుకో,'' అన్నాడు.
‘‘స్వామీ, నాకు కావలిసిన లోకాలను నేనే సంపాదించుకుంటాను. ప్రస్తుతం ఈ
అరణ్యంలో నాకు వాసయోగ్యమైన చోటేదో చెప్పండి,'' అన్నాడు రాముడు. ‘‘ఈ యేటి
వెంబడే పోతే సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం వస్తుంది. ఆయన నీకు తగిన చోటు
చూపించగలుగుతాడు. పాము కుబుసాన్ని విడిచినట్టు నేనీ దేహాన్ని విడవటం చూసి
మరీ వెళ్ళండి,'' అంటూ శరభంగ మహాముని అగ్నిలో ఆజ్యం పోసి అందులో
ప్రవేశించాడు.
ఆయన శరీరం అస్థికలతో సహా దగ్ధమయ్యూక, ఆయన ఇరవై అయిదేళ్ళ ప్రాయంగల
దివ్యశరీరంతో అగ్ని నుంచి వెలువడటం చూసి సీతా రామలక్ష్మణులు నివ్వెరపోయూరు.
శరభంగుడు దేహం చాలించగానే ఆశ్రమంలోని మునులందరూ రాముడి వద్దకు వచ్చి,
‘‘రామా, పంపాతీరంలోనూ, చిత్రకూటంలోనూ, మందాకినీ తీరంలోనూ ఉండే ఋషులను
రాక్షసులు చెప్పరాని హింసలు పెడుతున్నారు.
క్రూరులైన ఈ రాక్షసుల బారినుంచి ఋషులను నువ్వే కాపాడాలి,'' అన్నారు.
‘‘నేను అరణ్యవాసం రావటంలో తండ్రి ఆజ్ఞను పాలించే మేలు ఒకటేననుకున్నాను.
ఇప్పుడు నాకు మీ మూలంగా మరొక మేలు కూడా చేకూరుతుందన్న మాట. నేను తప్పక
రాక్షసుల బారి నుంచి మునులను కాపాడతాను,'' అని రాముడన్నాడు. రాముడు
సుతీక్ష్ణుడి ఆశ్రమానికి బయలు దేరుతుంటే వైఖానసుడు మొదలైనవారు అతని వెంట
కదిలారు.
వారందరూ కొన్ని నదులను దాటి, ఒక పర్వతం పక్కగానున్న అరణ్యం
ప్రవేశించారు. ఆ అరణ్యంలోనే తపో సంపన్నుడైన సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం
ఉన్నది. రాముడు తన పేరు చెప్పుకుని నమస్కారం చెయ్యగానే సుతీక్ష్ణుడతన్ని
కౌగలించుకుని, ‘‘రామా, నువ్వు చిత్రకూటం చేరినప్పటి నుంచీ నీ వార్తలు
వింటూనే ఉన్నాను. నేను చాలా తపస్సు చేశాను. అదంతా నీ కిస్తాను, సీతా
లక్ష్మణులతో అన్ని లోకాలూ అనుభవించు,'' అన్నాడు. ‘‘స్వామీ, లోకాలన్నీ నేనే
సంపాదించుకుంటాను. నాకీ అరణ్యంలో నివాసయోగ్యమైన స్థానం ఉంటే చెప్పండి
చాలు,'' అన్నాడు రాముడు.
‘‘కావాలంటే ఈ ఆశ్రమంలోనే ఉండవచ్చు. ఇక్కడ మృగబాధ తప్ప మరే బాధా
లేదు,'' అని సుతీక్ష్ణుడు చెప్పాడు. ‘‘నేను పొరపాటున ఆశ్రమ మృగాలను
చంపినట్టయితే మీకు కోపం రావచ్చు. అందుచేత ఈ ఆశ్రమం నాకు వద్దు,'' అన్నాడు
రాముడు. సీతారామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడే సుఖంగా గడిపారు. మర్నాడు ఉదయం
కాల కృత్యాలు ముగించి రాముడు సుతీక్ష్ణుడితో, ‘‘స్వామీ, నా వెంట వచ్చిన
మునులు తొందర చేస్తున్నారు. మాకు సెలవిప్పించండి,'' అన్నాడు.
సీత, రామలక్ష్మణుల ఆయుధాలు తెచ్చి ఇచ్చింది. దారిలో సీత రాముడితో,
‘‘ప్రపంచంలో మూడు మహా పాపాలు: అబద్ధం చెప్పటమూ, పర స్ర్తీని కోరటమూ, అకారణ
వైరమూనూ. అన్నిటిలోకీ అకారణ వైరం చాలా చెడ్డది. మొదటి రెండు పాపాలూ
నిన్నంటలేవు, నాకు తెలుసు. కాని మనకు ఏ కీడూ చేయని రాక్షసులను నీ వెందుకు
చంపాలి? వారిని చంపుతానని ఈ ఋషుల కెందుకు మాట ఇవ్వాలి? అసలు ఆయుధాలు వెంట
ఉండటమే ఒక కీడు.
పూర్వం ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటే తపోభంగం కలిగించటానికి ఇంద్రుడు
ఒక భటుడి రూపంలో వచ్చి తన కత్తిని భద్రంగా దాచి ఉంచమనీ, మళ్ళీ వచ్చి
తీసుకుంటాననీ చెప్పాడట. ఆ ముని ఆ కత్తిని కాపాడటానికి వెంట ఉంచుకుని
తిరుగుతూ, మొదట్లో పళ్ళూ ఫలాలూ కోశాడట. కాని రానురాను అతడి బుద్ధి హింసవైపు
మళ్ళి, చివరకు చచ్చి నరకానికి వెళ్ళాడట. అందుచేత మనం కనీసం ఈ అరణ్యవాస
కాలంలో నైనా ఆయుధాలు విసర్జించి తపస్సు చేసుకుందాం.
తిరిగి అయోధ్యకు వెళ్ళాక క్షత్రియధర్మం పాటించవచ్చు. ఇది ఆదేశం కాదు,
సూచన మాత్రమే,'' అన్నది. రాముడు సీతతో, ‘‘ఆ మునులందరూ ప్రాధేయ పడితే వారి
కోరికపై, రాక్షసులను చంపి వారి తపస్సు నిర్విఘ్నంగా కొనసాగేలా చూస్తానని
మాట ఇచ్చాను. నిన్నూ, లక్ష్మణుణ్ణీ, నా ప్రాణాలనూ వదులుతాను గాని చేసిన
ప్రతిజ్ఞ విడవను,'' అన్నాడు.
No comments:
Post a Comment