రాముడు శంబూకుణ్ణి చంపి, అయోధ్యకు తిరిగి వస్తూనే, ద్వారపాలకుడితో భరత లక్ష్మణులను తన వద్దకు పంపమని చెప్పాడు. తన వద్దకు వచ్చిన వారితో రాముడు, ‘‘తమ్ములూ, అన్ని పాపాలనూ పోగొట్టే రాజసూయం చేద్దామనుకుంటున్నాను. పూర్వం మిత్రుడూ, చంద్రుడూ రాజసూయం చేసే శాశ్వతమైన కీర్తి గడించారు. అందుకు మీ సలహా ఏమిటి?’’ అని అడిగాడు. దానికి భరతుడు, ‘‘అన్నా, నీ ధర్మానికీ, కీర్తికీ లోటేమున్నది? రాజసూయం చేశావంటే అనేక రాజవంశాలు నాశనమవుతాయి. పౌరుషం కొద్దీ అనేకమంది రాజులు నశిస్తారు. అందుచేత రాజసూయం చేసి భూమికి లేనిపోని సంక్షోభం కలిగించవద్దు,’’ అన్నాడు. భరతుడన్న మాట రాముడికి నచ్చింది. మంచి సలహా ఇచ్చి నందుకు అతడు భరతుణ్ణి మెచ్చుకున్నాడు.
అప్పుడు లక్ష్మణుడిలా అన్నాడు. ‘‘అన్నా, సమస్త పాపాలనూ పోగొట్టే మహాయజ్ఞం అశ్వమేధం, వెనక ఇంద్రుడు తనకు మహా పాతకం చుట్టుకోగా, అశ్వమేథ యాగం ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకున్నాడు.’’
లక్ష్మణుడా వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు: పూర్వం వృత్రుడనే గొప్ప రాక్షసుడు ఉండేవాడు. అతను మహాధర్మపరుడు, గొప్ప జ్ఞాని, మూడులోకాలనూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ, ధర్మం తప్పకుండా పాలించాడు. అతని పాలనలో భూమి అన్ని కోరికలనూ తీర్చేది. దున్నకుండానే పండేది, పూలూ పళ్లూ, కాయలూ రసవంతంగా ఉండేవి.
ఈలోగా తపస్సు చేయూలని సంకల్పం కలిగిన వృత్రుడు తన పెద్దకొడుక్కు రాజ్యం అప్పగించి ఉగ్రతపస్సు ప్రారంభించాడు. అది చూసి దేవేంద్రుడు బెదిరిపోయి, విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ‘‘వృత్రుడు అదివరకే మూడు లోకాలనూ జయించాడు. ఇప్పుడు తపస్సు కూడా ప్రారంభించాడు. అది పూర్తి అయిందంటే లోకాలుండేటంత కాలమూ అతన్ని నేను జయించలేను. అందుచేత నువు ఆ వృత్రుణ్ణి కడతేర్చితే గాని నాకు, దేవతలకూ దిక్కులేదు,’’ అన్నాడు.
దేవతల పక్షాన ఇంద్రుడిలా మొరపెట్టుకోగా, విష్ణుమూర్తి, ‘‘మహాత్ముడైన వృత్రుడు నాకు స్నేహితుడు అందుచేత నేను అతణ్ణి చంపను. అయితే నీ కోరిక కూడా తీసివెయ్యడానికి లేదు. అందుకని వృత్రుడు చచ్చే ఉపాయం ఒకటి చేస్తాను. నా శక్తిని మూడు భాగాలు చేసి, ఒక భాగం నీలోనూ, ఒకటి వజ్రాయుధంలోనూ, మూడవదాన్ని భూమిలోనూ ప్రవేశపెడతాను. అప్పుడు నువు వృత్రుణ్ణి చంపగలుగుతావు,’’ అన్నాడు.
ఈ మాటలు విని ఇంద్రుడూ, దేవతలూ సంతోషించి, వృత్రుడు తపస్సు చేసుకునే వనానికి వెళ్లారు. తపశ్శక్తి చేత మూడు లోకాలనూ దహించేటట్టుగా వెలిగిపోతూ వృత్రుడు వారికి కనిపించాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని రెండు చేతులా పట్టి వృత్రుడి తలను తెగవేశాడు. ఆ వెంటనే బ్రహ్మహత్య ఇంద్రుడి శరీరాన్ని చుట్టుకున్నది. అతనికి తీరని దుఃఖం పుట్టుకొచ్చింది. అప్పుడు దేవ తలు విష్ణువుతో, ‘‘దేవా, నువ్వేమో వృత్రుణ్ణి చంపావు. బ్రహ్మహత్య ఇంద్రుణ్ణి చుట్టుకున్నది. అది వదిలే ఉపాయం చెప్పు,’’ అని మొరపెట్టుకున్నారు.
‘‘ఇంద్రుడు అశ్వమేధం చేసినట్టయితే బ్రహ్మహత్య తొలగిపోయి అతడు ఎప్పటి దేవేంద్రుడవుతాడు,’’ అని విష్ణుమూర్తి దేవత లకు చెప్పాడు. ఈ సలహా విని దేవతలు బృహస్పతి మొదలైన మునులను వెంటబెట్టుకుని ఇంద్రుడున్న చోటికి వెళ్లారు. ఇంద్రుడు తెలివి పూర్తిగా పోయి, భయభ్రాంతుడై ఒక చోట పడి ఉన్నాడు. ఆ ఇంద్రుణ్ణి వెంట ఉంచుకుని దేవతలు అశ్వమేధయూగం చేసిన మీదట, అతణ్ణి బ్రహ్మహత్య వదలిపోయింది. లక్ష్మణుడీ కథ చెప్పిన మీదట రాముడు అశ్వమేధం యొక్క మహిమను తెలిపే మరొక కథ చెప్పాడు.
పూర్వం కర్దమప్రజాపతి కొడుకు ఇలుడు బాహ్లిక దేశాన్ని పరిపాలించేవాడు. అతనంటే దేవతలకూ, రాక్షసులకూ, నాగులకూ, యక్షులకూ, గంధర్వులకూ, ఎంతో గౌరవం ఉండేది. ఒక చైత్రమాసంలో ఇలమహారాజు తన పరివారాన్ని వెంటబెట్టుకుని అడవికి వేటకు వెళ్లాడు. ఎన్ని వేల మృగాలను చంపినా అత నికి వేటతమకం తీరలేదు. అందుచేత అతడు వేటాడుతూ పోయిపోయి, కుమార స్వామి పుట్టిన చోటికి వెళ్లాడు. అక్కడ పార్వతి పరమేశ్వరులూ, వాళ్ల అనుచరులూ ఉన్నారు.
ఆ పర్వత ప్రదేశంలో గల విశేషమేమిటంటే, అక్కడ చెట్లూ, పక్షులూ, జంతువులూ కూడా అడవే.అక్కడికి చేరుతూనే, ఇలుడూ, అతని భృత్యులూ కూడా స్త్రీలుగా మారిపోయారు. తనలో కలిగిన మార్పు చూసి ఇలుడికి బాధా, భయమూ పుట్టాయి. అతను శివుడి దగ్గిరకు వెళ్లి, స్తోత్రం చేసి, కాళ్లపైన పడి రక్షించమన్నాడు. ‘‘నీ ఆడతనం పోగొట్టడం తప్ప ఇంకేమైనా కోరుకో,’’ అన్నాడు శివుడు. ఇలుడు శివుణ్ణి మరొక వరమేదీ కోరక, పార్వతిని ప్రార్థించాడు. పార్వతి అతనిపై జాలిపడి, అతను ఒక నెల స్త్రీ గానూ, మరొక నెల పురుషుడుగానూ ఉండేటట్టూ, స్ర్తీగా ఉండేటప్పుడు జరిగేది పురుషుడిగా ఉండేటప్పుడు జ్ఞాపకం లేకుండానూ వరమిచ్చింది.
ఇలుడు కాస్తా ఇలగా మారింది. అతని సైనికులందరూ స్త్రీలే అయ్యారు. వారందరూ యధేచ్ఛగా ఆ అడవిలో తిరగసాగారు. వాళ్లు స్త్రీలుగా మారిన కొండకు సమీపంలోనే ఒక సరస్సున్నది. అక్కడనే చంద్రుడి కొడుకైన బుధుడు ఆశ్రమం ఏర్పర్చుకుని, తపస్సు చేసుకుంటున్నాడు. అతను మంచి యౌవనంలో ఉండి, ఆకర్షణీయంగా ఉన్నాడు. ఇలా, ఆమె వెంట ఉన్న స్త్రీలూ సరస్సులో దిగి, దాన్ని కల్లోలం చెయ్యసాగారు. బుధుడు వారిని చూసి, ఇల సౌందర్యం చేత సమ్మో హితుడయాడు. అంత అందమైన స్త్రీ మూడులోకాలలోనూ మరొకతె ఉండదని అతనికి తోచింది. ఇల వెంట ఉన్న స్త్రీలను కొందరిని అతను ఆశ్రమంలోకి పిలిచి, ‘‘ఆమె ఎవరు? ఈ ప్రాంతానికి ఏం పనిమీద వచ్చింది? నిజం చెప్పండి.’’ అన్నాడు.
‘‘అయ్యా, ఆమె మాకు నాయకురాలు. ఆమెకు భర్త లేడు. మమ్మల్ని వెంటబెట్టుకుని ఇలా అరణ్యమంతా తిరుగుతున్నది.’’ అన్నారా స్త్రీలు. ‘‘మీరంతా ఈ ఆశ్రమంలోనే కందమూలాలు తింటూ ఉండిపోండి. ఇక్కడ ఉండే కింపురుషులు మీకు భర్తలౌతారు.’’
అని బుధుడు వారితో అన్నాడు. వాళ్లందరూ వెళ్లిపోయారు. తరవాత బుధుడు ‘‘నేను చంద్రుడి కొడుకును. నా పేరు బుధుడు. నన్ను భక్తి స్నేహాలతో చూసుకుంటూ ఇక్కడే ఉండిపో,’’ అన్నాడు. ‘‘నీ ఇష్టం,’’ అన్నది ఇల. ఇద్దరూ మహా సంతోషంగా ఆ నెల గడిపారు. ఒకనాడు ఉదయం ఇల కాస్తా, ఇల మహారాజులా మారాడు. జరిగిన దేదీ జ్ఞాపకం లేదు. సరస్సులో బుధుడు చేతులు పైకెత్తి తపస్సు చేసుకుంటున్నాడు. ఇలుడతన్ని చూసి, ‘‘అయ్యా, నా సైనికులతో ఈ పర్వత ప్రాంతానికి వేటకై వచ్చాను. వారంతా ఎటు పోయూరో తెలియకుండా ఉన్నది,’’ అన్నాడు.
‘‘రాజా, రాళ్లవాన కురిసి, నీ పరివారమంతా నశించింది. నువు మాత్రం ఈ ఆశ్రమంలో తలదాచుకున్నావు. విచారించకు. ఇక్కడ నువు సుఖంగా ఉండవచ్చు,’’ అన్నాడు బుధుడు. ఇలుడు తన అనుచరులు పోయినందుకు దిగులుపడుతూ, ‘‘నాకింక రాజ్యం ఏలాలని లే దు. మీరనుమతిస్తే నా పెద్ద కొడుకు శశిబిందుడికి పట్టం గట్టి, వెంటనే తిరిగి వస్తాను,’’ అన్నాడు. ‘‘ఇలమహారాజా, ఒక్క సంవత్సరం ఇక్కడ ఉండు. నీకు మేలు కలిగేటట్టు చేస్తాను,’’ అన్నాడు బుధుడు. ఇలుడు సరేనన్నాడు. ఒక నెలపాటు స్ర్తీగా ఉండి మరొక నెలపాటు పురుషుడుగా ఉంటూ ఇలుడు తాను స్ర్తీగా ఉన్న సమయంలో బుధుడికి ఒక కొడుకును కన్నాడు.
అటు తరవాత బుధుడు సంవర్తుణ్ణీ, చ్యవనుణ్ణీ, ప్రమోచనుణ్ణీ, దుర్వాసుడు మొదలుగా గల ఇతర రుషులునూ పిలిపించి, వారికి ఇలుణ్ణి పరిచయం చేసి, అతని పరిస్థితి యధాప్రకారం అయేటందుకు ఏమైనా దారి చెప్పమన్నాడు. ఈ సమయంలోనే ఇలుడి తండ్రి అయిన కర్దముడూ, మరి కొందరు రుషులూ కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఇలుడికి తలా ఒక సలహా ఇచ్చారు. కాని కర్దముడు, తన కొడుక్కు మేలు కలగాలంటే, అశ్వమేథయూగం చెయ్యటమే మార్గమన్నాడు. ఆయన సలహా ప్రకారం అందరూ చేరి అశ్వ మేథయాగం చేసి, ఇలమహారాజుకు స్త్రీత్వం లేకుండా చేశారు. యజ్ఞం పూర్తి అయే సమయానికి శివుడే ప్రత్యక్షమై ఇల మహారాజును అనుగ్రహించాడు. తరవాత ఇలుడు బాహ్లిక దేశానికి తిరిగి వెళ్లక, మధ్యదేశంలోని ప్రతిష్టానపురాన్ని ఏలుతూ, అక్కడే ఉండిపోయాడు. అతని కొడుకు శశిబిందుడు బాహ్లిక దేశాన్ని పాలించాడు. ఇలకూ బుధుడికీ పుట్టిన పురూరవుడు ఇలమహారాజు అనంతరం ప్రతిష్ఠానపురానికి రాజయ్యాడు.
రాముడీ కథ తన తమ్ములకు చెప్పి, లక్ష్మణుణ్ణి పంపి, తన పురోహితులైన వశిష్ట, వామదేవ, జాబాలి మొదలైన వారిని రప్పించి, తాను అశ్వమేధం తలపెట్టిన సంగతి వారికి తెలియజేశాడు. వారు చాలా సంతోషించారు.
అశ్వమేధానికి ప్రయత్నాలు వెంటనే ప్రారంభమై చాలా చురుకుగా సాగాయి. సపరివారంగా బయలుదేరి రావలసిందనీ, యజ్ఞోత్సవంలో పాల్గొన వలసిందనీ, లక్ష్మణుడు కిష్కింధలో సుగ్రీవుడికి, లంకలో విభీషణుడికి ఆహ్వానాలు పంపాడు. రాముడి మంచి కోరే రాజులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. నానా దేశాల బ్రాహ్మణులూ, రుషులూ, సకుటుంబంగా గృహస్తులూ, గాయకులూ, నటులూ, నర్తకులూ ఆహ్వానించబడ్డారు.
నైమిశవనంలో గోమతీ నదీతీరాన యజ్ఞశాల నిర్మించబడింది. వేలకొద్దీ బళ్లతో ధాన్యం, అపరధాన్యాలూ, ఉప్పూ, గంధమూ చేరాయి. కోట్లకొద్దీ బంగారం వచ్చింది. వంటవాళ్లూ, శిల్పులూ వచ్చారు. రాముడి అంతఃపురం నుంచి అతని తల్లులూ, బంగారు సీతా భరతుడి వెంట వచ్చి యజ్ఞం జరిగే చోటికి చేరారు. ఆహ్వానితులకు విడుదులు వేరువేరుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ లోపలే రాముడు ఒక నల్లని గుర్రాన్ని విడిచి, దాని వెంట రుత్విజులనూ, లక్ష్మణుణ్ణీ పంపాడు.
యజ్ఞం చూడవచ్చిన రాజులు రాముడికి కానుకలు తెచ్చారు. వారి సౌకర్యాలను భరతశత్రుఘ్నులు చూశారు. బ్రాహ్మణుల సౌకర్యాలను సుగ్రీవుడి వానరులూ, రుషుల సౌకర్యాలను విభీషణుడి రాక్షసులూ చూశారు. యజ్ఞం జయప్రదంగా జరిగింది. ఎవరికీ, ఏ లోటూ కలగలేదు. అందరికీ కావలసిన పదార్థాలు వడ్డన అయాయి. బంగారం, ధనం, రత్నాలు, బట్టలు, ఎవరేమికోరినా ఇచ్చారు. వీటిని పెద్దపెద్ద కుప్పలు పోసి రాత్రీ పగలూ అడిగినవారికి ఇస్తూనే వచ్చారు. అలాటి యజ్ఞాన్ని ఇంద్ర, కుబేర, యమాదులు కూడా చేసి ఉండరని చెప్పుకున్నారు.
వానరులకూ, రాక్షసులకూ చేతినిండా పని పడింది. యాచకులు కోరినదల్లా వారే ఇస్తూ వచ్చారు. ఇలా ఏడాది గడిచి యజ్ఞం పూర్తి అయింది.
No comments:
Post a Comment