Saturday, December 14, 2013

నారాయణుని ఉపదేశం -శ్రీ దేవీ భాగవతం

శచికి బృహస్పతి హితవు

పాలకుడు పాతకుడైతే, పాలితులు తమకు ఎక్కడ హితవు లభిస్తుందో అది వెతుక్కుంటూ వెళ్లిపోవడం సహజంగా జరిగేదే! మన్మధావేశితుడై మూర్ఖుడైపోయిన నహుషునికి ఎంత చెప్పినా ఏమీ ప్రయోజనం లేదని అర్థమైపోయింది వారందరికీ. అంగీరసుడు తప్పక ఈ దుర్మార్గాన్ని అంతమొందించే మార్గం చెప్పగలడని అందరూ కలిసి ఆయనను సంప్రదించారు.

దేవతలకు ఆచార్యుడు బుద్ధికి బృహస్పతి అయిన ఆ సురగురువు చాలా సేపు యోచించి, “నహుషుడి ఆతృతకు ప్రస్తుతానికి అడ్డుకట్ట వేయగల మార్గం అయితే చెప్పగలను. కాని అది వాయిదా వేయడానికీ తాత్కాలికంగా అతడ్ని నిలువరించడానికీ సాధ్య పడుతుంది తప్ప, అతని పీడ శచీదేవికి పరిపూర్ణంగా తప్పిస్తుందని చెప్పజాలను” అన్నాడు. ఏదోలా ముందీ గండం గడచి గట్టెక్కితే, నిదానించి ఇంకొక మంచి ఆలోచనతో నహుషుడి నాశనం గురించి యోచించవచ్చు! ఇక అట్టే కాలం ఇతడ్ని పదవిలో కొనసాగనివ్వడం శిష్టులకు క్షేమం కాదు” అని బృహస్పతి చెప్పిన చొప్పున చేయడానికి అందరూ సమాయత్తమయ్యారు.

బృహస్పతితో కూడి దేవతలూ – మునులూ తన వద్దకు రావడం వారితో శచీదేవి కూడా ఉండడం నహుషుడికి మహదానంద సంధాయకంగా తోచింది. ఇంద్రాణి మీదికి వలపు చూపుల తూపులు రువ్వుతూ “రా! శచీ! రా! ఇప్పుడు కదా నేను పరిపూర్ణ ఇంద్రుడినైనాను. ఇక నా హృదయ రాజ్యానికీ మన్మధసామ్రాజ్యానికీ దేవేరివి నీవే” అంటూ నవ్వులొలకబోశాడు.

లోలోపల చీదరించుకుంటూ, సిగ్గుతో చితికిపోతూ “అది అలా ఉంచు నరపతీ! నువ్వు ఒక విషయం విస్మరిస్తున్నావు. నా భర్త కనిపించకుండా పోయాడే తప్ప, కాలగతి చెందలేదు. ఏ స్త్రీ అయినా పతి బ్రతికి ఉండగా పరపురుషుని కన్నెత్తి అయినా చూడజాలదు. అది జారిణో స్వైరిణో అయితే తప్ప, అట్టి స్థితి నాకు కల్పించకు! అది నీకే అప్రతిష్ట. ముందీ శచీపతి గురించి పూర్తి సమాచారం సేకరించు! అతడికి కనపడే అవకాశం లేదని నిర్ధారించుకో! అది నీకూ నాకూ ఇద్దరికీ క్షేమదాయకం. ఎందుకంటే, కాలం కర్మం కూడివచ్చి భవిష్యత్తులో నా భర్త తిరిగి వచ్చాడనుకో, వచ్చేవాడెంత శక్తియుతుడై తిరిగి వస్తాడో! ఏ తపోదీక్ష బూని ఏ వరాలను గొనివస్తాడో ఎవరికి ఎరుక? అట్టి దేవేంద్రుడు బలోపేతుడై తిరిగొచ్చాడనుకుందాం! నీతో కులుకుతున్నానని శాపాలు నాకూ – తన భార్యని లోబర్చుకున్నందుకు ప్రతాపాలు నీకూ రుచి చూపిస్తే ఇద్దరికీ ఇక్కట్లే! నేను చెప్పినది కాదని ఎవరైనా ఖండిస్తారేమో ….ఇందరిలో ఒక్కర్ని చూపించు!” అని ప్రశ్నార్థకంగా చూసింది శచీదేవి.

నహుష చక్రవర్తి వికటంగా నవ్వేసి “అమరాధిపుడైన నాకు ఇంక ఎదురేమున్నదీ? నీ భర్త ఇంకా వుండడం కల్ల. అది నీవు నీ పతిపట్ల గల అనురాగం చేత గ్రహించలేకపోతూన్నావు. అతడిక బ్రతికిలేడు గాక లేడు! లేడు గనుకనే దేవతలు నాకు పట్టం గట్టారు. నీవింకా ఆ సంగతి జీర్ణించుకోలేక ఎదురు తెన్నులు చూస్తున్నావల్లే వుంది.

అయినప్పటికీ నేను నిన్ను సంతోషపరిచే ప్రయత్నం తప్పకచేస్తాను . దేవేంద్రుని గురించి నేడే దశ దిశలకూ గూఢచారులను పంపుతాను. వారు ఏడేడు పధ్నాలుగు లోకాలూ గాలించి, అణువణువూ శోధించి అతడి అవశేషాలేం మిగిలి వున్నా నాకు నివేదిస్తారు. అది నువ్వు చూశాకనే నిన్ను చేపడతాను” అని కొంతకాలం ఆగడానికి ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడే భూలోకాన్నుంచి తనకు నమ్మకస్తులైన గూఢచారుల్ని పిలిపించి ఇంద్రుడినైనా – అతడి అవశేషాలనైనా జాడ కనుక్కోమని ఆజ్ఞ జారీచేశాడు. శచీదేవిని ఆమె మందిరానికి క్షేమంగా చేర్చమని అక్కడున్న ఋషుల్ని ఆదేశించాడు. అంతేకాదు – ఆమె సంక్షేమం చూసుకోవడమే వారికి వృత్తిగా చేసి, జపతపాలు కొన్నాళ్ళు కట్టి పెట్టవలసిందని కూడా ఆదేశించాడు. ‘ఔరా! అల్పుడా! ఆమె సదా కుశలమే! నీ కన్నుపడ్డాకనే, ఆమె కుశలానికి దూరమైంది. మేము ఎటూ ఆమె సంక్షేమం చూస్తూనే ఉన్నాం! నువ్వు ఏదో ఇప్పుడు కొత్తగా మాకేం ఆజ్ఞ లివ్వనక్కర్లేదు. అల్పునికి అధికారం అప్పగించాం చూడు! మేం చేసిన అపరాధం అదీ! దుర్మర్గుడా! దేవేంద్రుని జాడ కనుగొనడం ఇన్నాళ్ళుగా మా వశం కాలేదు. నీ మానవానుచరుల వల్ల అయ్యేదేనా? ఏదైతే అది అయిందిలే! నీకు రోజులు దగ్గర కొచ్చాయి. మా ప్రయత్నాలు మేమూ చేస్తున్నాం! అవి ఫలించి మేమే దేవేంద్రుని కనుక్కోగలిగితే, నీ పని హుళక్కే” అనుకుంటూ ఇంటిదారి పట్టారు అందరూ.

నారాయణుని ఉపదేశం

నహుష చక్రవర్తి సదనం నుంచి అలా బయటపడిన దేవతలంతా వైకుంఠానికి పోయి శ్రీమన్నారాయణుని సందర్శించి, విష్ణువును పలువిధాల స్తుతించారు. బ్రహ్మ హత్యాపాతకానికి వెరచి అతడెటకో కానరాని చోటకు నిష్క్రమించాడని వివరించారు. అసలానాడు ఇంద్రుడు నువ్విచ్చిన సలహా ప్రకారమే చేశాడు గాని, స్వతంత్రించి చేశాడా? ధర్మ సూక్ష్మాలు మాకు అర్థంకానివైపోయాయి. ఏది ఏమైనా మాకందరికీ దిక్కు నీవే వాసుదేవా! అంటూ మొరపెట్టుకున్నారు. చిద్విలాసంగా దేవతలందర్నీ చూశాడు శ్రీహరి.

“నిజమే! సూక్ష్మాతి సూక్ష్మ ధర్మ రహస్యాలు అందరికీ అర్థంకావు. అవి అలా ఉంచండి! ఏదోలా దేవేంద్రుని జాడ నేను కనుక్కుంటాను. మీరా పాకశాసనునిచేత అశ్వమేధ యాగం చేయించండి. ఆ హయమేధం వల్ల జగదాంబ ప్రీతిపాత్రురాలు కాగలదు” అని ఊరడించి, దేవేంద్రునికి బ్రహ్మహత్యాదోషం తొలగిపోగల మార్గం ఉపదేశించాడు.


దేవతలకు దేవేంద్రుడు కనిపించే మార్గం సుగమం చేశాడు. అవిశ్రాంతంగా వెతుకుతూన్న దేవతలకు, ఎట్టకేలకు దేవేంద్రుడొక తామరతూడులో దాగుకొని కనిపించాడు. అటుపైన క్షణమైనా ఆలసించక విష్ణుదేవుని పలుకులను అతనికి వినిపించి హయమేధం సాంగోపాంగంగా నిర్వహింపజేశారు. దీనితో అతడు తిరిగి పవిత్రుడైనాడు. ఎప్పటిలాగానే తన తేజస్సుతో ఉజ్వలంగా ప్రకాశించసాగాడు. కాని స్వర్గంలో నహుషుడో ఇంద్రుడిలా వెలిగిపోతూండడంతో – ‘ఒక వొరలో రెండు కత్తులు ఇమడవన్న’ సామెత ప్రకారం స్వర్గానికి వెళ్ళలేక ఆ తామర తూడునే నివాసంగా మల్చుకొని అక్కడే ఉండసాగాడు. తాము నిర్వర్తించాల్సినట్టి కార్యం నెరవేరినందున దేవతలు ఆనందంతో, అమరపురిని చేరారు.

జరాదుఃఖము-పరమార్థ కథలు

(జరా అనగా ముసలితనమందు మనుజుడు ఎదుర్కొను దుఃఖములు కొన్ని ఈ కథయందు తెలుపబడినవి).
పూర్వమొకానొక పట్టణమందు ఒక ధనికుడు కలడు. అతడు కష్టపడి చెమటకార్చి వ్యాపారమందు లక్షలు గడించెను. అచిరకాలములోనే కోటికి పడగెత్తెను. తన నివాసమునకై మహోన్నతమైన గగనచుంబిత భవనము నొకదానిని నిర్మించుకుని హాయిగా నివసించుచుండెను. పరిచారకులు, సేవకులు లెక్కకు మించినవారు ఆతని గృహమున సేవచేయుటకై నియోగించబడిరి. గొప్ప అట్టహాసముగ జీవితము గడుచుచుండెను.

కాని పరిస్థితులు ఎల్లకాలమందూ ఒకేతీరున ఎవరికీ ఉండవు. అవి అపుడపుడు తారుమారగుచుండును. ధనికులకు క్రమముగ వార్దక్యము దాపురించెను. శరీరసౌష్ఠవము తగ్గిపోవదొడగెను. దేహదార్ద్యము సన్నగిలజొచ్చెను. ఎటువంటి భీమబలునకైనను వృద్ధాప్యమందు దేహము శుష్కించక తప్పదుగదా! ఇంద్రియములు అత్తరి పట్టు తప్పిపోవును. శరీరము పలువిధ రుగ్మతలకు అలవాలము కాగా జీవితమే భార భూతముగ పరిణమించును. ఇది యట్లుండ మరియొక పెద్ద ప్రతిబంధకము వార్దక్యమున జనులకు దాపురించుచుండును. ఇంటిలో పుత్రులుగాని బంధువర్గముగాని, పరివారముగాని వృద్ధుడు చెప్పినమాటను సరిగా ఆలకించరు. నిర్లక్ష్యముగ తృనీకారబుద్ధితో, తిరస్కారభావముతో ఉందురు. ఆతనిని పూర్తిగా ఉపేక్ష చేయుదురు. పైగా ఎగతాళి చేయుటకున్ను పూనుకుందురు. ఇంద్రియ పటుత్వము తప్పి శక్తిహీనుడగుట జేసి వయస్సు చెల్లిన ఆవ్యక్తి పుత్రాదుల కేమియు జవాబు చెప్పలేక, దుఃఖమును, ఆక్రోశమును దిగమ్రింగుకొనుచు, గొప్ప మాఅనసిక క్షేశమును అనుభవించుచు, జీవితరథమును బహు భారముతో ఈడ్చుకొని పోవుచుండెను.

కథలోని ధనికుని పరిస్థితియు అట్లే ఏర్పడెను. కుమారునకు యుక్తవయస్సు రాగా తండ్రి అతనికి సంపన్నకుటుంబములోని ఒక కన్యక నిచ్చి వివాహము చేసెను. కొంతకాలము కుటుంబములో ఏ కలతలు, పొరపొచ్చములు లేక సవ్యముగా సాగిపోయెను. కాని తండ్రి వృద్ధుడగుచుండిన కొలది, కుమారునకు ధనమదము పెరిగి పెరిగి కన్ను మిన్నుగానక ప్రవర్తించుచుండెను. తండ్రిని లెక్క చేయకుండెను. ఒకే కుమారుడగుటబట్టి కుమారుడు తనకు పెట్టుబాధలకు తండ్రి ఎవరికి చెప్పుకొనలేక ఓర్పుకొనుచు లోలోన పరమసంతాపము నొందుచుండెను. కష్టపడి చెమటకార్చి, రాత్రింబగళ్లు శ్రమ చేసి దేశదేశములు తిరిగి సంపాదించిన ద్రవ్యమునంతను కుమారుడు నానావిధ దుర్వ్వసనములకు ధారబోయుచుండెను. భోగవిలాసములలో చిక్కుకుని, దుస్సాంగత్యమునకు లోనై అశ్లీలకార్యములో మునిగితేలుచు కుమారుడు తండ్రి సేకరించిన ధనమునంతను వర్ధ్యము చేయదొడగెను. దుర్బలుడగు తండ్రి ఏమియు చేయలేక మిన్నకుండెను.
కుమారుడు తండ్రికి చేయుచుండిన అపచారములు పోనుపోను శ్రుతిమించి రాగాన పడుచుండెను. ఒకనాడు కుమారుడు తల్లితండ్రులను పిలిచి, నాన్నగారూ; అమ్మగారూ, ఇకమీదట మీరిరువురు ఇంటి లోపల భోజనము చేయంటకు వీలుపడదు. బయట వరండాలో కూర్చొని భోజనము చేయువలసినదే!” అని ఆజ్ఞాపించెను. పాపము, వృద్ధదంపతు లేమి చేయగలరు? సుతుని ఆజ్ఙను జవదాటలేక అంజలిబద్ధులై అట్లే ఆచరింపదొగగిరి. మరి కొంతకాలమునకు గోరుచుట్టుపై రోకలిపోటు అన్నట్లు తనయుడు తల్లిదండ్రులను పిలిచి మరొయొక తీక్షణమైన శాసనమును ఈప్రకారముగ జారీచేసెను – “తల్లిదండ్రులారా! ఇకమీదట మీరిరువురూ రెండు వేర్వేరు కంచములలో భోజనము చేయరాదు. ఒకే కంచములో ఇద్దరూ తినవల్సినదే!” అని యతడు ఆదేశించెను. కఠోరములగు ఆ వాక్యములను వినుటతోడనే మాతాపితరులు హతాశులై గత్యంతరము లేక సుతుని ఆజ్ఞను శిరసావహించి పాలింపదొడగిరి.

ఇట్లుండ, ధనికుని మనుమడు, పదునారేండ్ల ప్రాయము గలవాడు తన తాతకు, అవ్వకు తనతండ్రి, పెట్టుచుండీ రాక్షస బాధలను చూచి సహించలేక, ఆ కిరాతక చర్యలను చూడలేక తండ్రికి గుణపాఠము బోధించుటకై అదనుకొరకు వేచియుండెను. ఒకనాడతడు తన తండ్రి ముదుసలివారైన తాత అవ్వలకు పెట్టుచుండిన ఒకే ఒక కంచమును ఎవరికిని తెలియకుండా దాచిపెట్టెను. మధ్యాహ్నమగుసరికి అతనితండ్రి వృద్ధులైన మాతాపితరులకు అన్నము పెట్టుటకై కంచముకొరకు వెతుకగ ఆది ఎక్కడను కనిపించలేదు. ఇల్లంతయు గాలించినను దాని జాడతెలియలేదు. అపుడు తండ్రి కుమారునితో ‘ఏమిరా మీ తాతగారికి, అవ్వగారికి పెట్టే కంచం నీవేమైన దాచినావా?” అని ప్రశ్నింప కుమారుడు ‘అవును’ అని జవాబిచ్చెను. ఎందులకు దాచితివని ప్రశ్నింప అతడిట్లు తడుముకొనకుండ ప్రత్యుత్తరమిచ్చెను. నాన్నా! నీవు ముసలివాడవైన తరువాత, నీకు అమ్మకు అదే కంచము పెట్టాలని నేను దాచిపెట్టినాను. కుమారుని ఆ వాక్యములను వినగానే తండ్రికి కనువిప్పు కలిగెను. క్షణములో జ్ఞానోదయమయ్యెను. తాను తన తల్లిదండ్రులకు పెట్టు హింసకు పదిరెట్లు హింస తనకు వృద్ధావస్థలో తన కుమారుడు పెట్టనున్నాడని గ్రహించెను. తోడనే యతడు తన వృద్ధజననీజనకులను సగౌరవముగ ఇంటిలోనికి బిలిపించి, వారిని యథోచితముగ ఆదరించి శ్రద్ధాపూర్వకముగ సపర్యలను చేయదొడగెను.

కావున జనులు మహాకష్టతరమైన వార్దక్యావస్థలో తమకు సంభవింపనున్న శారీరక, మానసిక వ్యథలను ముందుగానే ఊహించుకొని, అట్టి భీషణ వార్ధక్యదశ రాకపూర్వమే తాను చేయవలసిన పరమార్థ కార్యములను,ఆధ్యాత్మిక సాధనలను త్వరలో పూర్తిచేసి జీవితమును కృతార్థ మొనర్చుకొనవలయును.

నీతి: ముసలితనమున జీవుడు నానాభాధల ననుభవించును. కావున వార్ధక్యము రాకమునుపే పరమార్థ సాధనలను పూర్తిచేసి ధన్యుడు కావలయును.

సుబ్రహ్మణ్య ప్రధాన గాధ

సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి ‘స్కందా’ అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి

షణ్ముఖుడు – ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు – పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు – కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు – శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు – శరములో అవతరించినవాడు
గాంగేయుడు – గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి – దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు – శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు – బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
మురుగన్ -


దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు

సుబ్రహ్మణ్య ప్రధాన గాధ సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి ‘స్కందా’ అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి షణ్ముఖుడు – ఆరు ముఖాలు గలవాడు స్కందుడు – పార్వతి పిలచిన పదాన్ని బట్టి కార్తికేయుడు – కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు వేలాయుధుడు – శూలము ఆయుధంగా గలవాడు శరవణభవుడు – శరములో అవతరించినవాడు గాంగేయుడు – గంగలోనుండి వచ్చినవాడు సేనాపతి – దేవతల సేనానాయకుడు స్వామినాధుడు – శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు సుబ్రహ్మణ్యుడు – బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు మురుగన్ – దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు

Friday, December 13, 2013

సంధ్యావందనం

గాయత్రి వేదమంత్రములన్నిటికీ తల్లి. ఈ మంత్రంఎనిమిదేసి అక్షరాలతో కూడిన మూడు పాదములు అంటే మొత్తం ఇరవై నాల్గు అక్షరములతో కూడినది. అందుకే దీనిని ‘‘త్రిపదగాయత్రీ’’ అంటారు. ఒక్కొక్కపాదం ఒక్కొక్క వేదంయొక్క సారం. అధర్వణ వేదమునకు వేరే గాయత్రి ఉన్నది. ఆ గాయత్రిని పొందడానికి ప్రత్యేకంగా వేరే ఉపనయనము చేసుకోవలసి ఉన్నది. ఈ త్రిపదా గాయత్రి ఋగ్యజస్సామ వేదముల సారము.

గాయత్రిని మూడు తరాలబాటు జపించడం మానివేసిన బ్రాహ్మణ కుటుంబం కులాన్ని కోల్పోతుంది. అట్టి కుటుంబం నివసించే ప్రదేశాన్ని అగ్రహారమని పిలవరాదు. గాయత్రిని వదిలి మూడు తరాలయినట్లు లేదు. ఇంకా అందరూ బ్రాహ్మణులుగా పిలవబడుతున్నారు. మూడు తరములు యజ్ఞం చేయకపోతే దౌర్బాహ్మణ్యం వస్తుందని శాస్త్రం. పతితుడైనా బ్రాహ్మణుడన్న పేరు పోలేదు. మళ్ళీ ప్రాయశ్చిత్తాదులు చేసుకొని, యజ్ఞాలు చేసి సద్బ్రాహ్మణుడవచ్చు.

గాయత్రి విషయమలా కాదు. మూడు తరములు గాయత్రిని జపించనివారికి తిరిగి బ్రాహ్మణులయ్యే అవకాశమే లేదు. వారు బ్రహ్మ బంధువులు మాత్రమే. ఇదే నియమం క్షత్రియ వైశ్యులకు కూడా వర్తిస్తుంది. ఎంత అనాచారమొచ్చిపడినా ఇంకా గాయత్రి అనే అగ్నికణం నివురుగప్పి మిణుకుమంటూనే ఉన్నది. ఆ నిప్పురవ్వను అలానే వదిలేస్తే ప్రయోజనము ఉండదు. దానిని పరిరక్షించి వృద్ధిచేస్తే, మహాగ్నిజ్వాలగా పరిణతి చెంది మనలను సంరక్షించుతుంది. అట్టి శక్తి దానికున్నది. ఆ పెన్నిధిని కాపాడుకొనే బాధ్యత మనకున్నది. ఆదివారాలైనా యజ్ఞోపవీతధారులందరూ సహస్ర గాయత్రీ జపం చేయాలి. ఆ గాయత్రీ జ్వాల ప్రకాశవంతంగా ఉండటానికి శౌచనియమాలను పాటించాలి. అశౌచమైన జనం అశౌచమైన ప్రదేశాలకు పోవడం వంటివి పరిహరించాలి. కర్మలోప ప్రాయశ్చిత్తం చేసుకొని కర్మిష్ఠులమయి కర్మశుద్ధంగా ఉండేట్లు జాగ్రత్తపడాలి. శరీరాన్ని మనస్సును పరిశుద్ధంగా ఉంచుకొన్నప్పుడే మంత్రశక్తి పెంపొందడానికి అనువుగా వుంటుంది. ఎంతటి కష్టకాలంలోనైనా సరే గాయత్రిని కనీసం పదిసార్లైనా జపించాలి.

 మూడు సంధ్యాకాలాల్లోనూ సంధ్యావందనం చేయవలసి ఉన్నది. ఉదయ సంధ్యలో జీవులన్నీ నిద్రలేస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రతకు అనువుగా ఉంటుంది. సాయంకాలం జీవులు అంతా పడిన శ్రమ తరువాత ఇల్లు చేరి ప్రశాంతతను పొందుతాయి. సూర్యుడు నడినెత్తిన చేరిన సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ సమయాలలో శాంతంగా వరుసగా గాయత్రి, సావిత్రి, సరస్వతీ దేవతలను ధ్యానించాలి.

ఉదయం విష్ణుప్రధానమైనది. మధ్యాహ్నం బ్రహ్మస్వరూపిణిగానూ, సాయంత్రం శివస్వరూపిణిగాను గాయత్రిని ధ్యానించాలి. ఈ మూడు కలిసి సమష్టి గాయత్రి. గాయత్రి అన్ని వైదిక మంత్రముల శక్తులను కలిగి ఉన్నది. ఇది మిగతా మంత్రములకు శక్తినిస్తుంది. గాయత్రీ అనుష్ఠానం చేయకుండా మరి ఏ ఇతర మంత్రముల జపం చేసినా అవి పూర్ణ్ఫలితాన్నీయజాలవు. సంధ్యావందనములో గాయత్రీ జపము, అర్ఘప్రదానము ముఖ్యమైనవి. మిగతావన్నీ అంగాలు. లేవలేని స్థితిలో కూడా కనీసం అర్ఘ్యత్రయ ప్రదానం, గాయత్రీ జపం (కనీసం పదిసార్లయినా) వదలకూడదు. ఈ రెండే ముఖ్యమైనవి కాబట్టి, మిగతావి వదిలేస్తే కాలక్రమంలో ఈ రెండూ కూడా వదిలేస్తాము. ప్రముఖ విద్వాంసులొకరు.

 సంధ్యావందనం విధివత్తుగా సకాలంలో చేయాలి. మహాభారత యుద్ధంలో సంధ్యాకాలంలో యుద్ధంలో ఉండవలసి వచ్చిన వీరులు, సకాలంలో మన్నుతో అర్ఘ్యమిచ్చారని చెప్పబడి ఉంది. ఒకరికి విపరీతమైన జ్వరం కాస్తే, అతనికి పరిచర్య చేసేవారు అతని తరపున సంధ్యావందనం చేసి ఆ జలం అతనికి తీర్థంగా ఈయాలి. రోగి తాను సంధ్యవార్చలేని సందర్భంలో ఎవరికైనా తన తరఫున సంధ్యావందనం చేసి తీర్థమివ్వమని అర్థించాలి. ఆఫీసులకు వెళ్ళేవారికి కూడా ప్రాతః సాయంకాలములు సంధ్యావందనము చేయడం ఇబ్బంది కాదు. మధ్యాహ్నిక సంధ్యావందనం ఆఫీసులో ఉండటంవలన ముఖ్యకాలంలో చేయలేకపోతే సూర్యోదయమునకు 2 గం 24 నిల తరువాత చేయవచ్చు. దానిని సంగమ కాలమంటారు.

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే,అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే
సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు “జంబుద్వీపే భరతవర్షే భరతఖండే” అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?
జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష 2) హరి వర్ష 3) ఇలవ్రిత వర్ష 4) కురు వర్ష 5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష 7) కింపురుష వర్ష 8 ) భద్రస్వ వర్ష

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.
మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.
దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది

విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు. నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము. మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలము లో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు.

ఈ భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో.

బ్రాహ్మణ, క్షత్రీయులు “మానస్తోకే మంత్రము ” తో, వైశ్యులు ” త్ర్యయంబక ” మంత్రము తో , ఇతరులు శివపంచాక్షరి తో భస్మ ధారణ చెయాలి.  ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది.
మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని “శాంతికము ” అని అంటారు.
షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని “పౌష్ఠికం” అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని “కామదం” అని అంటారు..


భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.

యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి.  అనంతరం శుబ్ర్హమైన పాత్రలో విభుతిని నింపాలి.

హర హర మహా దేవ శంభో శంకర _/\_

రాక్షసవధతో ముక్కంటిగా మారిన హనుమాన్

హనుమాన్ ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు గుర్తుకు వస్తాడు. అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని ఎప్పుడైనా చూశారా? అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన పిమ్మట నారదుడు ఆయనను కలుసుకున్నాడు.
“స్వామి లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాల”ని వేడుకున్నాడు. అప్పుడు రాముడు “నారదమహర్షి రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమ”ని అన్నాడు. కాగా, రాక్షస వధకు హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు.


యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు. కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.

శ్రీరాముని తరువాత అయోధ్యను ఎవరు పాలించారు?

ఈ ప్రశ్నకు సమాధానం కాళిదాసు రఘువంశంలోనే దొరుకుతుంది. శ్రీ రాముడు తన అవతార సమాప్తికి ముందే తన కుమారులైన కుశ లవులకు, తమ్ములకుమారులకు చిన్న చిన్న రాజ్యాలు ఇచ్చాడని చూచాము. వారంతా రాముడు జీవించియుండగానే ఆ యా రాజ్యాల పాలనను స్వీకరిస్తారు. అందులో కుశునికి కుశావతి అనే నగరం కేంద్రముగా చిన్న రాజ్యం లభిస్తుంది. ముందు లక్ష్మణుడు తరువాత శ్రీరాముడు తమ మానవదేహాలను త్యజించి వైకుంఠవాసులౌతారు. అయోధ్యానగర పౌరులు అనేకులు కూడా శ్రీరామునితోబాటుగా సరయూనదిలో జలప్రవేశం చేస్తారు. అయోధ్య కళావిహీనమౌతుంది. కొంతకాలానికి కుశావతిలో రాజభవనంలో నిద్రిస్తున్న కుశునికి ఒక రాత్రి ఒక కల వస్తుంది. అయోధ్యానగర అధిదేవత దర్శనము ఇచ్చినది. అయోధ్యకు తిరిగివచ్చి పాలనను చేపట్టమని, పూర్వవైభవం చేకూర్చమని ఆదేశిస్తుంది.


ఆమెకోరికను శిరసావహించి కుశుడు అయోధ్యకు తిరిగి వస్తాడు. సింహాసనం అధిష్ఠిస్తాడు. కొన్ని రోజులలోనే అయోధ్య తిరిగి కళకళలాడుతుంది. ప్రజలు ఆనందంగాఉంటారు. ఒక దినం కుశుడు సరయూనదిలో జలక్రీడలు సలుపుతుండగా అతడి కేయూరమనే ఆభరణం నదిలో పడిపోతుంది. వెదకినా దొరకదు. ఆనదిలో నివాసం ఏర్పరచుకున్న నాగవంశీయుడు కుముదుడు ఆ ఆభరణాన్ని తీసి ఉంటాడని అనుమానించి కుశుడు అస్త్రప్రయోగం చేయబోతాడు. కుముదుడు ఆభరణంతో నది వెలుపలికి వాచ్చి తాను కేవలం కుతూహలంతో దానిని తీసినట్లు చెబుతాడు. తరువాత తన సోదరి కుముద్వతిని వివాహంచేసుకొమ్మని అడుగుతాడు. కుశుడు అంగీకరించి ఆమెను తన రాణిగా చేసుకుంటాడు. వారికి అతిథి అనే కుమారుడు కలుగుతాడు. కుశుని తరువాత అతడు అయోధ్యను పాలిస్తాడు.. గొప్ప రాజనీతికోవిదుడు. కాని దుర్జయుడనే అసురునిచేతిలో మరణిస్తాడు.


తరువాత 21 రాజుల పేర్లు రఘువంశం చెబుతుంది. 21వ తరము రాజు సుదర్శనుడు. అతడికుమారుడు అగ్నివర్ణుడు. స్త్రీలోలుడు. క్షయ వ్యాధితో మరణిస్తాడు. తరువాత ఆవంశంలో గుర్తుంచుకోవలసిన వారులేరు. మహాభారత కాలంలో వారి వంశీయుడు కౌరవులతరఫున యుద్దంచేసి మరణిస్తాడు. అయోధ్య సప్త పుణ్యనగరాలలో ఒకటిగా కీర్తి పొందింది. బాబరు అయోధ్యపై దాడిచేసిన ఆధునిక అసురుడు.

పంచభూతలింగాల గురించి తెలుసా?

అయితే ఈ కథనం చదవండి. పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.


1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.


5. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

కుబేరుడిని అనుగ్రహించిన మహాశివుడు

తనపైకి రావణుడు దండెత్తిరావడంతో వైశ్రవణుడు నిర్ఘాంతపోయాడు. వైశ్రవణుడు శివభక్తుడు. అయితేనేం యుద్ధానికి తలపడింది మహా బలవంతుడు. అందుకే ధైర్యం సన్నగిల్లి వైశ్రవణుడు గంగాతీరాన ఉన్న కాశీ నగరానికి పారిపోయాడు. తన ఆపదను తల్చుకుని దుఃఖిస్తూ దృఢ సంకల్పంతో తపస్సు చేశాడు. వైశ్రవణుడి తపో దీక్షకు మహాశివుడు సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు.వైశ్రవణుడు చెప్పింది విని, “లంకా పట్టణం చేజారిపోయిందని నువ్వేం దిగులుపడకు.. నీ తపస్సుకు మెచ్చాను. నీకు లంకా పట్టణాన్ని మించిన అందమైన, అద్భుతమైన, అపూర్వమైన నగరాన్ని ప్రాప్తింప చేస్తాను. నవ నిధులకూ నువ్వు నాయకుడివి అయ్యేలా వరం ఇస్తున్నాను. ఇకపై నీ పేరు వైశ్రవణుడు కాదు, కుబేరుడు. నీకు అనంతమైన సంపదలు ఇస్తున్నాను. నువ్వు అందరికంటే సంపన్నుడివి అవుతావు. నువ్వు నివసించే నగరం సుబిక్షంగా, సుసంపన్నంగా వర్ధిల్లుతుంది. రావణాసురుని మించిన ధనవంతుడివి కాబోతున్నావు. రాబోయే కాలంలో ధనవంతుల ప్రసక్తి వస్తే అందరూ నీ గురించే చెప్పుకుంటారు..” అంటూ వరం ఇచ్చాడు. ఇప్పటికీ చాలా డబ్బు ఉంది అనే చెప్పదలచుకుంటే కుబేరుడినే తలచుకుంటాం

సాయినాథుని దినచర్య

ప్రత్యక్షదైవంగా హిందువుల పూజలందుకుంటున్న షిర్డీ సాయిబాబా జీవనశైలి యోగులందరికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే…
బాబా ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచేవారు. బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ, మరొకరోజు చావడిలోనూ నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని భక్తులు మేల్కొలిపి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు. ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చుని ధునివైపు చూస్తూ గడిపేవారు. అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు. అప్పటికే గంగాళం నిండా భక్తులు నీళ్ళు సిద్ధం చేసేవారు. ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు. అందువల్ల ఆయన వద్దకు వెళ్ళేందుకు భక్తులు సాహసించేవారు కాదు.

ముఖం కడుక్కున్న తర్వాత కుడిచేతి మణికట్టుకు రోజూ నేతిలో ముంచిన గుడ్డతో కట్టు కట్టుకునేవారు. భక్తులే ఈ కట్టు కట్టేవారు. కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు. చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టుకట్టించుకునే వారు. ఇలా ఎందుకు చేసేవారో తెలియదు.

ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా బిక్షకు వెళ్లేవారు. కేవలం ఐదు ఇళ్లలో మాత్రమే బిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని ధునిలో వేసి, కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి, మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి, మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా. ఆ తర్వాత లెండీకి బయలుదేరేవారు.

సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు. లెండీకి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు. లెండీకి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు. బాబా లోనికి వెళ్ళి ఒకటి రెండు గంటలు లెండీలో యోగ సాధన చేస్తూ గడిపేవారు. తిరిగి 11గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు.

ద్వారకమయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల గానం మొదలయ్యేది. ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు. ఆ నైవేద్యాలను భక్తులకే పంచిపెట్టేవారు బాబా. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి జరిగేది. హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు. అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు.

హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు. సమాధి మందిరంలో ఈనాటికీ హారతి ముగియగానే బాబాను దర్శించుకుని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఈ ప్రసాదం ఉదయం నుండీ బాబాకు భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి.

సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద రెండు స్టీలు డ్రమ్ములు ఉంటాయి. బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ములలోనే బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు, పాలకోవాలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు. వాటినే భక్తులకు తిరిగి పంచిపెడతారు.


సాయినాథుని హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి లెండీ వద్ద కొంతసేపు గడిపి, తిరిగి చావడిలోనో, ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే..

ఈశ్వరుడు అంటాడుట “నేను చెప్పినట్టు మీరు నడుచుకోవడమే మీరు నాకు ఇచ్చే పెద్ద దక్షిణ. భగవంతుడు బంగారానికి,వజ్రాలకి పొంగిపోయే ఆయన కాదని చెబుతూ గురువు గారు ఈ కధ చెప్పారు.

ఇది వరకు తిరుమలలో “తొండమాన్ చక్రవర్తి” అనే ఆయన స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట – స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడుట. స్వామి వారికి చిరాకు వేసి వీడికి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గర లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే,తొండమాన్ చక్రవర్తి ని లేవదీసి తన ఇంటికి తీసుకువెల్లాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం.

భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి
- కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.
- కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.
- అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు
- వాటి వల్ల నా సంసారం సాగుతోంది.
- నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా “గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి అనేవాడుట?
అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,

images

వీడేమో – అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,
నేనేమో – నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.
ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.

భీముడు అన్నం తినే ముందు మట్టి తో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తి కి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానం లోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారు.
అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్నిభీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికి స్వామి వారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.

సారాంశం:
ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి.
ఎక్కడ గర్వం/అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు.

సమస్త అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడాయన. ఈశ్వరా ఇదంతా
నీ సృష్టే తండ్రి, నేను నీకు ఏమైనా ఇవ్వగాలనా అని అనుకోవాలుట.

జాంబవంతుడు

జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శ్యమంతకమణిని, జాంబవతిని ఇచ్చాడు.

సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనపుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వ సమర్ధుడని తెలియజెప్పాడు.

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల రామ లక్ష్మణులు, వానర సేన మూర్ఛిల్లినపుడు – మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని “అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?” అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు.

“హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది” అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.

జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కొన్నింటిని (బహుశా నాలుగు కూర్మ, వామన, రామ, కృష్ణావతారాలు) చూసిన పరమ భక్తుడు. సమస్త భూమండలాన్ని ఎన్నో సార్లు ప్రదక్షిణ చేశాడు. క్షీరసాగర మథనం జరుగుతున్నపుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఔషధులన్నింటినీ అందులో పోశాడు. బలి చక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు మహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినపుడు, సురగంగతో బ్రహ్మపాదాలు కడిగే సమయాన జాంబవంతుడు త్రివిక్రముడుకి అనేక ప్రదక్షిణలు చేశాడు.

రామావతారంలో హనుమంత, అంగదాది వానర వీరులతో సీతాన్వేషణకై వెళ్ళాడు. శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానరవీరులంతా ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు జాంబవంతుడు హనుమంతుని సమీపించి అతని జన్మ వృత్తాంతం, శాపాల్లాంటి వరాల గూర్చి చెప్పి హనుమంతుడికి ప్రేరణనిచ్చాడు. ఆ తర్వాత యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వేళ, సర్వ వానరసేన మూర్చిల్లుతారు. అస్త్ర ప్రభావం సోకని విభీషణుడు వానర యోధులను సమీపించి వారి చెవులలో ధైర్య వచనాలు పలుకుతుంటే, ఆంజనేయుడు కూడా లేచి తనవారికి ఉత్సాహం కల్పించే ప్రయత్నం చేస్తాడు.

ఈ సమయంలో విభీషణుడు జాంబవంతుడి దగ్గరకు వెళ్ళి ”తాతా!” అంటే ”బ్రహ్మాస్త్రం ధాటికి కన్నులు కనపడకున్నవి. కంఠస్వరాన్ని బట్టి నిన్ను గుర్తిస్తున్నాను. ఇంతకూ మన వాయునందనుడు క్షేమమేనా?” అని ప్రశ్నిస్తాడు.

ఆశ్చర్యచకితుడైన విభీషణుడు ”తాతా! రామలక్ష్మణులు, అంగద సుగ్రీవుల గురించి అడగకుండా, కేవలం హనుమంతుని గురించి మాత్రమే ఎందుకడుగుతున్నావు?” అని ప్రశ్నిస్తాడు.


అప్పుడు జాంబవంతుడు ”ఒక్క హనుమంతుడు ఉంటే చాలు. సర్వం శుభప్రథమే అంటాడు. ” హనుమంతునిపై ఆయనకున్న విశ్వాసం అటువంటిది. అప్పుడు మారుతి జాంబవంతుని చెంతకు చేరి సంతోషంతో ఆలింగనం చేసుకుని, బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల మూర్ఛితులైన వారిని కాపడటం కోసం హిమగిరుల్లోని ఔషధులు తెమ్మని చెబుతాడు. ఇంకా జాంబవంతుడి ప్రస్థావన క్రిష్ణావతారంలోనూ కనిపిస్తుంది. స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేయడమే కాకుండా, ఆయనకు కన్యాదానమే చేశాడు

కృష్ణసంతానం

శ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ తదితర అష్ఠ మహిషులు, పదహారు వేల వంద మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడికి ఆ భార్యల వల్ల కలిగిన సంతానం ఎంత? భార్యలందరితోనూ ఆయనకు ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.

రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు.

కృష్ణుడికి సత్యభామ వల్ల భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.

జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.

నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.


కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.

లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.

మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టా.

కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు

శ్రీ కృష్ణ నిర్యాణం

కురుక్షేత్ర సంగ్రామం అనంతరం, ఒకనాడు కణ్వ, విశ్వామిత్ర , నారద మహర్షులు శ్రీ కృష్ణుని సందర్శనార్దం ద్వారకకు విచ్చేశారు. వీరు పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారక యువకులకు చిలిపి ఊహ తట్టింది. ఆ యువకులు ఒకడికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడ బిడ్డ పుడతాడో , మగ బిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్యదృష్టి తో మొత్తం కనుక్కుని ఆగ్రహం తో, ఆడబిడ్డా కాదు మగబిడ్డా కాదు ఒక ముసలం(రోకలి) పుడుతుంది, అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విషయం శ్రీ కృష్ణునికి తెలిసింది. విధి రాత ను ఎవరూ తప్పించలేరు, యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు.

మహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది. ఆ యువకులు దానిని శ్రీ కృష్ణుని వద్దకు తీసుకుపోయారు. శ్రీ కృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధం లా కనిపించింది. దానిని పిండి చేసి సముద్రం లో కలపమని ఆ యువకులకు చెప్పాడు. వారు దానిని పిండి చేసి సముద్రం లో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రం లోనికి విసిరివేశారు. పిండి చేసిన ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుంది లెమ్మని సంతోషం గా ఇళ్ళకు పోయారు. కానీ మునుల వాక్కు వృధా పోదు కదా. మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకు వచ్చి ఒకానొక చోట ఇసుకలో దిగబడింది. సముద్రంలో కలిసిన రోకలి పిండి బడబాగ్ని వలె కాచుకుని ఉంది. శ్రీ కృష్ణునికి ఇవన్నీ తెలిసినా విధి రాతను తప్పించే శక్తి లేక మిన్నకుండి పోయాడు.

అది మొదలు ద్వారక నగరం లో అనేక ఉత్పాతాలు సంభవించాయి. ఎపుడూ లేని విధంగా యాదవులు సజ్జనలును బాధించడం మొదలుపెట్టారు. స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. యాదవవంశ నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణునికి అర్ధం అయ్యింది. తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు యాదవులు అందరినీ కొలువుపర్చాడు. సముద్రానికి జాతర చెయ్యాలని అందరినీ బయలుదేరమని చెప్పాడు. అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు. బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు. శ్రీ కృష్ణుడు ఒక్కడే యాదవుల తో పాటు వెళ్ళాడు. వెళ్ళే ముందు తండ్రియైన వసుదేవునితో ఇలా అన్నాడు. “తండ్రీ! కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తనున్నది. అర్జునుడు వస్తాడు మిమ్ములను అందరినీ ఉద్ధరిస్తాడు. అతను వేరు నేను వేరు కాదు. అందరూ అతని ఆజ్ఞను పాటించండి.”

సముద్ర తీరానికి వెళ్ళిన యాదవులు సుష్ఠుగా భోజనం చేసి, కృష్ణుని ఎదుటే మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు. అన్నీ తెలిసినా కృష్ణుడు ఏమీ చెయ్యలేని వాడయ్యాడు. అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోది చంపేశాడు. అది మొదలు అందరూ ఒకరిని ఒకరు చంపుకున్నారు.

మిగిలిన దారుకుడిని, భబ్రుడిని తీసుకుని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీ కృష్ణుడు. అక్కడ బలరాముడు అరణ్యం లో ధ్యానం లో ఉన్నాడు. అపుడు శ్రీ కృష్ణుడు అర్జునుడి ని ద్వారకకు తీసుకురమ్మని దారుకుడిని పంపాడు. భబ్రుడి ని ద్వారకలోని స్త్రీలను, మిగిలిన వాళ్ళని ప్రయాణమునకు సిద్దం చెయ్యమని పంపాడు. కానీ మార్గమధ్యం లో ఒక ఆటవికుడు అతనిని అదే రోకలి తుంగ తో సంహరించాడు.

దారుకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఆ పరిస్థితి లో చూసి పాండవులు చలించిపోయారు. అపుడు దారుకుడు జరిగిన విషయం చెప్పి బలరామకృష్ణులు అరణ్యం లో ఉన్నారని, అర్జునుడుని ద్వారకకు తీసుకువెల్లమన్నారని చెప్పాడు. అది విని పాండవులు ఆశ్చర్యపోయారు. శ్రీ కృష్ణ భగవానుడు అచట ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా భాధపడ్డారు. అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు.

అచట అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన మహా సర్ప రూపం ధరించి సముద్రం లో కలిసిపోయాడు. తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలచి, తను చెయ్యవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని దుర్వాస మహాముని శాపం ఇవ్వడం గుర్తుకువచ్చింది. అపుడు శ్రీ కృష్ణుడు ఒక మహా వృక్షం నీడన మేను వాల్చి, అక్కడకు వస్తున్న ఒక బోయవానికి, తన పాదం లేడి పిల్ల లాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి కృష్ణుని పాదానికి బాణం వదిలాడు. తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునికా నేను బాణం వేసింది అని రోదించడం మొదలు పెట్టాడు. శ్రీ కృష్ణుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు.

 “త్రేతాయుగాన వాలి వైన నిన్ను చెట్టు చాటునుండి చంపిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నాను. కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే. నీవు నిమిత్తమాత్రుడవు.”

అని శ్రీ కృష్ణుడు తన శరీరమును త్యజించాడు.
ద్వారకకు చేరుకున్న అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకను చూసి ఖిన్నుడయ్యాడు. శ్రీ కృష్ణుడి ప్రియ సఖుడైన ఆర్జునుడిని చూడగానే శ్రీ కృష్ణుని భార్యలు పలు విధాల రోదించారు.

  వసుదేవుడు శ్రీ కృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిస్ఠ తో శరీరం వదిలాడు.


వసుదేవుని మరణవార్త శ్రీ కృష్ణునికి చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యం లో శ్రీ కృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీళ్ళ పర్వంతం అయ్యాడు. మృతదేహానికి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి తను ద్వారకకు పయనమయ్యాడు. సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణం అప్పటివరకు కాచుకుని ఉన్న సముద్రం ద్వారకను ముంచెత్తింది.

ఇపుడు సముద్రం లో బయటపడిన ద్వారక అదేనని అధికుల విశ్వాసం.

దీపకుని గురుసేవ

పూర్వం దీపకుడనే నైష్ఠిక బ్రహ్మచారి ఉండేవాడు. అతడొకనాడు శాస్త్రాలలో చెప్పబడిన ఈ సుక్తిని చదివినాడు “పతివ్రతకు భర్త పుత్రునికి తల్లిదండ్రులు శిష్యునకు గురువు దైవసమానులు. వీరిని మించిన దైవము లేదు. వీరి సేవను మించిన తీర్థాలు వ్రతాలు ఉపవాసాలు లేవు. తరించుటకు ఇదియే అతిసులభ మార్గము” అని చదివినాడు. వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు. పవిత్ర గోదావరీనదీ తీరమున వేదధర్య మహర్షి ఆశ్రమము ఉన్నదని ఆయన సకల వేదవేదాంగాలు తెలిసినవాడని ఉత్తమ గురువు అని ఎందఱో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారము చేసినాడు. వినయవంతుడైన దీపకుని శిష్యునిగా స్వీకరించినాడు వేదధర్యుడు. గురుసేవ ప్రభావం వలన తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వలన అచిరకాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నేర్చాడు. అనన్య గురుసేవా నిరతుడై ప్రకాశించాడు.

శిష్యుని విద్యాతేజస్సు చూసి వేదధర్యుడు ఒకనాడు “కుమారా! నేను పూర్వజన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకున్నాను. కానీ రెండు భయంకరమైన పాపాల ఫలము ఇంకా అనుభవించాలి. చేసిన కర్మ చెడని పదార్థముకదా. నేను అతిపురాతనము సనాతనము పవిత్రము సాక్షాత్ విశ్వనాథుని ధామమైన కాశీ క్షేత్రములో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము చేయదలచినాను. పుణ్యక్షేత్రములో ఏ కార్యానికైనా ఫలితము రెండింతలు కదా!

నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తార్థము ఆవాహన చేయగానే భయంకరమైన కుష్ఠురోగం వస్తుంది. శరీరమంతా చీము నెత్తురు కారుతుంటుంది. వికారరూపము అంధత్వము వస్తాయి. నాలో సహనం సాధుత్వం ఆది సద్గుణాలు నశిస్తాయి. కఠినాత్ముడనై ఇతరుల సేవలకై దీనముగా ఎదురు చూస్తుంటాను. అట్టి దుస్థితిలో నీవు నాకు సేవ చేయగలవా”? అని అడిగినాడు వేదధర్యుడు.

గురుసేవయే పరమభాగ్యమని త్రికరణశుద్ధిగా నమ్మిన దీపకుడు “గురూత్తమా! నేను మీ పాపాలను ఆవహింప చేసుకొని పాపఫలితాన్ని అనుభవిస్తాను. నాకా అవకాశాన్ని ప్రసాదించండి” అని అన్నాడు. “దీపకా! నీ వంశాన్నంతా దీపింపచేయగల వాడవు అలా అనక ఏమంటావు? కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు కదా! పుణ్యమైనా పాపమైనా ఫలితమును అనుభవించక తప్పదు కదా! నా పాపాలను కడుక్కుంటే గాని ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందలేను” అని వేదధర్యుడు చెప్పినాడు. గురు ఆజ్ఞప్రకారమే చేశాడు దీపకుడు. ఇద్దరు మణికర్ణికా ఘాట్ కు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు. కశీ విశ్వనాథునికి అన్నపూర్ణాభవానీకి పూజలుచేసి పాపాల ఆవాహన చేశాడు వేదధర్యుడు. గురువుగారు చెప్పినట్టే జరిగింది.

గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడ్డాడు దీపకుడు. చీము నెత్తురు తుడిచి కట్టు కట్టి మలమూత్రాదులను కడిగి అతని శుభ్రపఱచే వాడు దీపకుడు! ప్రతిపూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి “ఇంత కొంచెం తెచ్చావెందుకు” అని నిష్ఠూరాలాడేవాడు వేదధర్యుడు. అతడెంత కోపించినా గద్దించినా ధర్మనిష్ఠతో నిరంతర గురుసేవ చేసినాడు ఆనందపరశుడై దీపకుడు.

అంబికానాథుడు దీపకుని అసమాన గురుభక్తి మెచ్చి “వత్సా! నీ అనన్య గురుసేవా దీక్షను మెచ్చినాను. ఏమి వరము కావాలో కోరుకో” అని అన్నాడు. గుణనిధి అయిన దీపకుడు “స్వామి! నాకు ఈ లోకములో గురుసేవ తప్ప ఏదీ తెలియదు. వారి అభీష్టమేమో కనుక్కొని చెప్తాను” అని అన్నాడు దీపకుడు. గురువుగారికీ విషయం చెప్పి “గురుదేవా! మీకు స్వస్థత కోరుతాను” అని అన్నాడు. వేదధర్యుడు “నాయనా! ఎవరు చేసిన పాపాలకు ఫలితం వారు అనుభవిస్తేనే పోతాయి” అని చెప్పాడు.


మరునాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఏ వరమూ కోరలేదు దీపకుడు. భగవంతుడు ఆ దీపకుని చూసి మురిసిపోయి జగజ్జనని అయిన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు. తరువాత నిర్వాణ మండపములో ఉన్న శ్రీమన్నారాయణునికి సమస్త దేవతలకు దీపకుని సంగతి చెప్పి పొగిడినాడు. మహావిష్ణువు “పరమశివుని మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యము. నీ మనోభీష్టమును కోరుకో” అని అన్నాడు. అందఱికీ సాష్టాంగవందనము చేసి ఆనందాశ్రువులతో “స్వామీ! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు” అని అడిగినాడు. “తథాస్తు” అని దీవించి దీపకుని కృతార్థుని చేసినాడు మహావిష్ణువు.

రుక్మిణీ కల్యాణం – శ్రీ విష్ణు పురాణము

కుండినపురం రాజధానిగా విదర్భనేలే భీష్మకునికి రుక్మిణి కూతురు. ఆమె అన్న రుక్మి. ఇతడికి కృష్ణుడంటే ఉన్న ద్వేషం చేత – తన సోదరి కృష్ణునే భర్తగా వరించెనని తెలిసికూడా వారి కల్యాణం జరిపించడాయెను. శిసుపాలునికి ఇద్దామని అతడి ఆలోచన.

వివాహం రేపు జరగనున్నదనగా, కృష్ణుడామెను రథంపై ఎక్కించుకుని తీసుకువెళ్లి రాక్షసవివాహరీతిని ఆమెను పెండ్లాడాడు. ఆమెకు ప్రధ్యుమ్నుడు జన్మించాడు.

శంబరాసుర వథ:

ప్రద్యుమ్నుడు పుట్టిన అరవనాడు, అతడు తనకు ప్రాణాంతకుడని ఎరిగిన శంబరాసురుడు, ఆ శిశువును అపహరించి సముద్రంలో పారవేశాడు. జాలరులచేత రక్షించబడిన ఆ శిశువే పెరిగి పెద్దవాడై శంబరాసురుని ‘నామమాత్రపు భార్య’ అభోగ్య అయిన మయావతిచే పోషింపబడి, శంబరుని హతమార్చి, ఆమెతోకూడ నిజపురానికి చేరుకుని నారదమహర్షి వల్ల అతడు కృష్ణుని పుత్రుడని ధృవీకరింపబడి, తిరిగి అంతకాలానికి తల్ల్లితండ్రులను కలుసుకోగలిగాడు ఆ ప్రద్యుమ్నుడు.

రుక్మిణీకృష్ణులు, ద్వారక వాసులు చిరకాలమునకు ప్రద్యుమ్నుని చూసినందుకు ఆశ్చర్యానందాలు పొందారు. ఆ మాయవతి రతీదేవి అవతారం. ప్రద్యుమ్నుని భార్య అయింది.

రుక్మివథ:

రుక్మిణీదేవి కన్న సంతానం చారుదేష్ణుడు, చారుదేహుడు, సుదేష్ణుడు, సుషేణుడు, చారుగుప్తుడు, చారువిందుడు, చారువు, భద్రబాహువు అనే పుత్రులతో పాటు చారుమతి అనేపుత్రిక. రుక్మిణిగాక కృష్ణునికి ఇంకా ఏడుగురు పత్నులు. వారు సత్య, కాశింది, మిత్రవింద, రోహిణి, నాగ్నజితి, జాంబవతి, సుశీల, వీరుగాక 16000 మంది భామలు. ప్రద్యుమ్నుడు రుక్మికూతురు ఒకర్నొకరు పరస్పరం వరించారు. వీరికి జన్మించినవాడే అనిరుద్ధుడు. పెళ్లికి తరలివచ్చిన బంధుజనుల్లో కొందరు బలరాముడికి పాచికలాట తెలీదు, జూదంలో అతడ్ని మనం తేలిగ్గా గెల్వవచ్చునన్నారు.

బలమదం కొద్దీ రుక్మి సరేనన్నాడు. బలరామునితో ద్యూతక్రిడ మొదలెట్టారు. అప్పుడు బలరాముడు వెయ్యినిష్కాలు ఓడిపోయాడు. రెండో పందెంలో కూడ అంతే మొత్తం కోల్పోయాడు. మూడోపందెంలో పదివేలు ఓడిపోయాడు. ఈసారి కోటి నిష్కాల పందెం. బలరాముడు మౌనం వహించాడు. అందులో రుక్మి ఓడిపోయి కూడా, నేనే గెల్చానంటూ అబద్ధమాడగా, ‘మౌనం అంగీకారసూచకం!’ అని ఆకాశవాణి కూడ పలికి, బలరాముడే విజేత అని చెప్పింది. రుక్మిని పాచికలతో కొట్టాడు బలరాముడు. అటుపై అదంతా చూస్తూ అక్కడే ఉన్న కళింగరాజు పరిహాసం చేసినందుగ్గాను అతడి దవడ పళ్లూడగొట్టాడు.

ఈ సందడిట్లా నడుస్తూన్నంతలో పెండ్లికొడుకును తీసుకుని నెమ్మదిగా అక్కడ్నుంచి వచ్చాడు శ్రీకృష్ణుడు. రుక్మి హతుడయ్యాడు గనుక ఇక కలహాలుండవని ఆయనకు తెలుసు!

నరకాసుర వథ:

తరువాత కొంతకాలానికి ఇంద్రుడు, ద్వారకకు రాగా శ్రీకృష్ణుడు అతనికి అతిథి సత్కారాలు చేసి విషయమేమిటని అడిగాడు. దేవేంద్రుడు సందర్భవశంగా ఇలా అన్నాడు.

“శ్రీకృష్ణా! ఏం చెప్పమంటావు. భూమిపుత్రుడైన నరకాసురుడు నీకు తెలుసుకదా! వాడి దుశ్చర్యలు మితిమీరిపోతున్నాయి. అ విషయం నీకు విన్న వించడానికే నేను ఇక్కడకొచ్చాను. ప్రాగ్జ్యోతిషపురాథిపతి పెడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. దేవతలు, సిద్ధులు, మునులు….ఒక్కరేమిటీ – వాడి బారిన పడనివారు లేరనుకో! ఎందరు ధరణి పతుల కన్యలనో వాడు తన ఇంట బంధించాడు. వరుణుని చత్రం ఊడలాక్కున్నాడు. మందరర పర్వతశృంగం మీద మణులన్నీ కాజేశాడు. ఇవి వాడి దుశ్చర్యల్లో అత్యల్పభాగం మాతమే! కనుక తక్షణమే నువ్వేదైనా ప్రతిక్రియ ఆలోచించాలి” అని నివేదించాడు.

“అలాగే! సరే! నువ్వు ధైర్యంగా ఉండు! వాడి గర్వం అణచవలసిందే!’ అని శ్రీకృష్ణుడు ఇంద్రునికి అభయమిచ్చి పంపేశాడు.

అనంతరం హృదయంలో గరుడుని తల్చుకుని, అతడు రాగా ఆ పక్షిరాజు మూపునధిరోహించి సత్యభామా సమేతుడై ప్రాగ్జ్యోతిష్యపురానికి వెళ్లాడు శ్రీకృష్ణుడు. నరకునిసేనలతో శ్రీకృష్ణునికి మొదట పెనుయుద్ధమయింది. అహర్నిశలు సాగిన ఆ యుద్ధంలో, సత్యాపతి ఇంచుక అలసి విశ్రమించగా, సత్యభామ ఆ దానవ వీరులతో పోరాడింది. వారిపైకి అస్త్రశస్త్రాలు వర్షంలా కురిపించింది. శ్రీకృష్ణుడు కొంతసేపు సేదతీరి, సత్యభామను ప్రశంసించి, తిరిగి తన కర్తవ్యాన్ని తానే నెరవేర్చాడు.

(శస్త్రాస్త్రవర్షం ముం చం తం తం భౌమం నరకం బలీ|
క్షి ప్త్యా చక్రం ద్విధా చక్రే చక్రీ దై తేయ చక్రహా||)

తన చక్రాయుధంతో నరకాసురుని రెండుగా ఖండించాడు. మురాసురుని, హయగ్రీవుని, పంచజనుడను వానిని కూల్చాడు. మురాసురుని 7వేల మంది పుత్రుల్ని సంహరించాడు. ఎవరెవరిదగ్గర నుంచి నరకుడు ఏమేమి అపహరించాడో, అవన్నీ వారికి అందేలా చేశాడు.

పృథివీ కృతకృష్ణస్తుతి:

“నాథా! వరాహమూర్తివై నీవు ఒకప్పుడు నన్నుద్ధరించగా, పుట్టినవాడు ఈ నరకుడు. ఈ పుత్రుని ఇచ్చినదీ నీవే! తిరిగి సంహరించినదీ నీవే! వీడు అపహరించిన (అథితి యొక్క) కర్ణకుండలాలు ఇవిగో! వీడి సంతతిని ఇంకా ముక్కపచ్చలారని వారిని కాపాడు!

జగత్కర్తవు, సంహార కారణుడవు నీవే! నా బరువును దింపటానికే అంశావతారం ఎత్తావు. నిన్నేమని స్తుతించను? వ్యాపించువాడవు వ్యాపించబడు విశ్వమూ నీవే! సర్వ భూతాంతరాత్మవగు నిన్నేమని స్తుతించను? వాక్కులకు అందనివాడివి. సర్వభూతాత్మా! దయచూడు! ధర్మసంస్థాపన కొరకు నీ కొడుకుని నువ్వే సంహరించావు గనుక, వీని తప్పిదాలను మన్నించు!” అని స్తుతించింది భూదేవి.

ఇతి శ్రీవిష్ణుమహాపురాణే పంచమాంశే ఏకోనత్రింశో ధ్యాయః

భూత భావనుడైన భగవానుడు పృధ్వీ స్తోత్రానికి ప్రసన్నుడై ఆమెకు అభయప్రదానం చేసి, నరకుని అంతఃపురంలో ఉన్న 16000 మంది (పైన 100 కూడా…శ్లోకప్రకారం ‘శతాధికాని దృశే సహస్రాణి’ కనుక) సౌందర్యవతులైన కన్యలను, విలువైన రత్నాలను, 16000 ఉత్తమమైన నాలుగు దంతాలుగల ఏనుగులను, 21 లక్షల ఉత్తమైన కాంభోజదేశపు గుర్రాలను నరకుని భటులచేతనే అప్పటికప్పుడు ద్వారకాపురికి రవాణా చేయించాడు.
వరుణుని గొడుగును, మణి పర్వతం యొక్క మణులను, ఇంద్రుని తల్లి అదితి యొక్క మణిమయ కుండలాలను (నరకుడు అపహరించిన ఈ దేవతల సొత్తును) స్వయంగా తానే అప్పగించదలచి సత్యభామతో సహా అదే గరుడునిపై అధిరోహించి స్వర్గానికి వెళ్లాడు.


శ్రీకృష్ణుడు విజయుడై తిరిగొచ్చాడన్న వార్త ఇంద్రునికి అందింది. స్వర్గానికి వచ్చాడనీ తెలిసి, ఎదురేగి స్వాగతం పలికి ఆదరించాడు. శ్రీకృష్ణుడు దేవమాత అదితిని దర్శించి ఆమె కుండలాలు అప్పగించాడు. ఆమె ఆనందంతో అ జగన్నాధుని సోత్రం చేసింది.

Wednesday, December 11, 2013

కనకదుర్గ గాథలు….

ఓంకార పంజర శికీ ముననిష దుద్యాన కేళికల కంఠీమ్ !
ఆగమ విపిన మయూరీ మర్యామంతర్విభావ యే గౌరమ్ !!
భక్త్యాస్నాత్యాత్ర మల్లీశం దుర్గం దుర్గారి నాశినీం 
దృష్ట్యా పాపాత్ ప్రముచ్యేత్ దేవలోకే వసేత్సాదా!!

కృష్ణానదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి వున్న కనక దుర్గామాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం వుంది. ఈ చక్రానికి అగస్త్యల వారు తమ తపః ఫలాన్ని ధారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్రరూపంలో వుండేదని, ఆదిశంకరులు విచ్చేసి శ్రీ చక్రంలోని రౌద్రబీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి ఆయి తనను దర్శించే భక్తులు కోరికలు నేరవేరుస్తునదని చెబుతారు. కనకదుర్గా క్షేత్రమహత్యాన్ని తెలిపే పురాణ గాథలు పరిశీలిద్దాం.

ఇంద్రకీలాద్రి కథ :- 
ఈ కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిరనివాసం ఏర్పరచుకొని భక్తులను ఈడేరుస్తోంది. కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలసి వుండడానికి ఒక కథ వుంది. దుర్గామాత ఆలయం వున్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు.
అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ వుండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీపరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగాఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గ ఎనిమిది బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలుగి, సింహాన్ని అధిష్టించి మహిషాసురోత్తమాంగాని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది.

ఆరి, శంఖ, కేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లోను ధరించే ఎనిమిది ఆయుధాలు, ఈ దేవీమూర్తికి ఎడమభాగంలో శ్రీ చక్రం స్థాపించబడి వుంది. ఆ శ్రీ చక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి వుంది, ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీ చక్రానికి జరుగుతాయి. ఆ దేవీమూర్తికి గల మకరతోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి వున్నాయి. శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, మష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు.

మహిషాసుర సంహారం :-
పూర్వకాలంలో దనువు పుత్రులైన రంభకరంభులనే వారు సంతానంకోసం ఈశ్వరుని గూర్చి ఘోరతపస్సు చేశారు. కరంభుడు నీటిలోను, రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంభుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ‘పుత్రసంతతిలేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి. ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదవేదాంగవిధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావలి’ అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు. ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు.

రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశంతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. చూలు నిండాక మహిషాకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్మి గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షిశిష్యుని బాధిస్తూ వుండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్దిస్తుందని శపించాడు. అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీ సాధుపుంగవులని, దేవతలనీ, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ‘ఉగ్రచండి’ అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది.

మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుడి పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలనీ పీడిస్తూవుంటే, ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి ‘భద్రకాళి’ రోపంలో అవతరించి మహిషుని ముట్టుపెట్టింది.మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోరతపస్సు చేసి బ్రహ్మ వసువరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు. ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కలవచ్చింది. అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోరతపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని, నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞభాగార్హత కలగజేయవలసిందని మహిషుడు కోరాడు.

‘మహిషా! నువ్వు రుద్రాంశసంభవు. నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నువ్వు నా వాహనంగా వుండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచివుంటాను’ అని దేవి పలికింది.ఆ తర్వాతా మహిషుడికి మళ్ళి జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసుర చేష్టలకు పూనుకొని దేవతలని, మునులని పీడిస్తూ వుండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గామాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుని సంహరించింది.

శంభు నిశంభుల కథ :-
మహిషాసురుని వలె అతి క్రౌర్యంగా వ్యవహరించిన శంభు నిశంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడి వుంది. పూర్వం శంభునిశంభులనే రాక్షసులు ఇంద్రాది దేవతల్ని పదవీభ్రష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాల్ని బాధించసాగారు. అప్పుడు దేవతలంతా దేవిని ప్రార్థించారు. వారి మొర ఆలకించిన దేవి శరీరం నుంచి దివ్యతేజోరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది. శంభునిశంభుల సేవకులైన ఛండాముండలు ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు. తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు. శంభునిశంభులు. తనతో యుద్ధంచేసి తనను జయించిన వానినిగాని, తనతో సమాన బలపరాక్రమశాలిని గాని తాను పెళ్ళి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పింది.

ఆ మాటలు విన్న శంభునిశంభులు కోపోద్రిక్తులై ఆ కన్యను పట్టిదెమ్మని తమ సేనాధిపతి ధూమ్రలోచనుడిని పంపారు. తనపై దండెత్తిన ధూమ్రలోచనుడిని, అతని సైన్యాన్ని దేవి సంహరించింది. ఆ రుధిరమంతా దేవి వాహనమైన సింహం త్రాగింది. ఈ వార్తవిన్న శంభునిశంభులు చతురంగ బలాలని సమకూర్చుకొని దేవిపై యుద్ధం ప్రారంభించారు. వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భ్రూమధ్య నుంచి ఖడ్గం, పాశం మొదలయిన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షస గణాన్ని శంభునిశంభులని నిమేషకాలంలో హతమార్చింది.

దుర్గాసుర సంహారం :-
ఇలాగే దుర్గాసురుణ్ణి దేవి సంహరించిన కథ కూడా పురాణాల్లో పేర్కొనబడివుంది. పూర్వం దుర్గాసురడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. ఆ వర గర్వతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించసాగాడు. ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది. ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్తుతించారు.


దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం, వరుణినిచేత శంఖం, అగ్నిచేత బల్లెం, వాయువుచేత బాణాలు అంబులపొది, ఇంద్రునిచేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షమాల, సూర్యునిచేత కిరణాలు, శివుని చేత సింహ వాహనం పొందింది. స్కందపురాణం సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడి వున్నాయి. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపురసుందరి, లలితాత్రిపురసుందరి, రాజరాజేశ్వరి, చిచ్ఛక్తి రూపమైన కుండలినీ మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి.

శ్రీహరి సుదర్శన చక్రం పొందుట, ఉపమన్యుచరితం

శ్రీహరి సుదర్శన చక్రం పొందట "శివలీలలో అతి ముఖ్యమైనది - విష్ణువు సుదర్శన చక్రం పొందడానికి శివారాధనే కారణమంటారు! ఆ లీల వినిపింపుడు" అని శౌనకాది ఋషులంతా అడగ్గా సూతుడు ఇలా చెప్తున్నాడు. "ఒకానొక సమయంలో దానవమూకలు మహా బలవంతులైరి. త్రిలోకాల్లో వున్న సౌమ్యులందర్నీ ముని - దేవ - మానవులన్న విచక్షణ లేకండా హింసిస్తూ ఉండిరి. దేవతలంతా విష్ణువు చెంత చేరి దానవులను అణచి వేయవలసిందిగా ప్రార్థించారు. "ఇదంతా కాల వైపరీత్యం! ఇందుకు పరమ శివారాధనమే శరణ్యం" అని వారిని ఊరడించి పంపి అఖండ శివదీక్షలో మునిగిపోయాడు. ఒక గొప్ప అలోచన స్ఫురించి వెయ్యికమలాలతో శివ సహస్ర నామాలను అర్చించాలని నిర్ణయించుకున్నాడు. వెయ్యి పువ్వులూ కోసి తెచ్చి పెట్టుకున్నాడు. నామానికొక పుష్పం అర్పిస్తున్నాడు. పరిక్షార్ధం శివుడు ఓ పుష్ఫాన్ని కాజేశాడు, మాయమైన పుష్పం సంగతి తొమ్మిది వందల తొంబై తొమ్మిది సంఖ్యకు చేరుకున్నాక గాని (శివునికి ఓ పుష్పం లోటు ఏర్పడిందని) శ్రీహరికి తెలియలేదు. వెంటనే - లోకులంతా కమలాక్షుడని తనను పిలవడం సంగతి గుర్తొచ్చి, ఆ వెయ్యోనామం అర్చించడానికి తన నేత్రాన్ని పెకలించాలని ఉధ్యుక్తుడవుతూండగా పరమశివుడు వారిస్తూ ప్రత్యక్షమయ్యాడు. వాస్తవంగా విష్ణువు అర్పించిన వెయ్యి పువ్వులూ అందాయి అని చెప్పి కరుణించాడు. దేవతల సంరక్షణార్ధం ఇంత దుస్సాహసానికి వొడిగట్టిన శ్రీహరిని మనస్ఫూర్తిగా దీవించి తనచే నిర్మితమైన సుదర్శనం అనే చక్రాన్ని ప్రసాదించి, 'దీనికి ఎదురులేదు! ఎంత మందిని నిర్జించినా - తిరిగి నీవద్దకు చేరుకుంటుంది' అని అనుగ్రహించాడు. అందువల్లనే ఆయనకు చక్రి అనీ - చక్రధరుడని - చక్రపాణి అనీ పేర్లు వచ్చాయి" అని వివరించాడు సూత పౌరాణికుడు. 

ఉపమన్యుచరితం వ్యాఘ్రపాదుడనే ముని సత్తముని కొడుకే ఉపమన్యుడు. పసితనంలోనే తండ్రికి దూరమైన ఈ బాలుడు తల్లి - మేనమామల అండతో పెరిగాడు. బాల్యంలో అందరూ గోక్షీరం గ్రోలుతూంటే , కనీసం తల్లిపాలకైనా నోచుకోని ఉపమన్యుడు బాల్యచాపల్యం కొద్దీ పాలకోసం తల్లిని వేధించసాగాడు. ఆమెకు మార్గాంతరంతోచక, ఉన్న ఒకే్ ఒక్క అన్నగారి అండనీ (తనయుని కోరికలు చెప్పి విసిగించి) పోగొట్టుకోలేక, ఒక ఉపాయం ఆలోచించింది. పేలపిండిని చిక్కగా నీళ్లలో పిసికి, అవే పాలు అని చెప్పి మరపింపచూసింది...బాలుడు ఆమోఘ మేధా సంపన్నుడు కావడంతో అది ఇట్టే పసిగట్టేశాడు. ఆ తల్లి, తన అవస్థను చెప్పుకుంది కొడుకుతోనే! శివధ్యానం చేసి ఏకంగా పాలసముద్రాన్నే పొందుతానన్నాడు ఉపమన్యుడు. అతడికి అంత పట్టుదల కూడా ఉన్నదని ఆ తల్లికి తెలుసు! ఓంకార పరబ్రహ్మమైన శివముర్తిని ప్రసన్నం చేసుకోడానికి 'నమః శివాయ' అనే పంచాక్షరినే తోడుగా చేసుకొని తపోనిష్ఠకు బయల్దేరాడు ఉపమన్యుడు. క్రమంగా ఉపమన్యుడి తపో తీవ్రత పెరిగి, లోకాలను హడలెత్తించ సాగింది. ఉపమన్యుడి దీక్షను పరీక్షించబోయాడు శివుడు. ఇంద్రుడి వేషములో వెళ్లి భోగభాగ్యాదులు ఇస్తానని ఆశ చూపించాడు. బూడిద తప్ప ఏమి ఇవ్వలేని శివుడినేం అడుగుతావు? ఆయన ఏమిస్తాడు? అని ఎద్దేవ చేశాడు. శివనింద భరించజాలక చెవులు మూసుకుని తక్షణం అక్కడి నుంచి ఆ ఇంద్ర వేషధారిని కదలమని హెచ్చరించాడు ఉపమన్యుడు. ఇంకా తాత్సారం చేస్తున్న అతడ్ని వెళ్లగొట్టాలని తల్లి తనకు రక్షగా ఇచ్చిన భస్మం పిడికిట్లో పట్టుకుని అఘోరాస్త్రం మది తలచి ప్రయోగించబోగా అప్పుడు ప్రత్యక్షమయ్యాడు శూలి - పార్వతీ సహితుడై. "ఇదంతా నీ లీలేనా శూలీ?" అని పరిపరి విధాల ప్రార్థించి, శివుని కరుణకు పాత్రుడయ్యాడు. ఇష్ట కామ్యసిద్ధి పొందాడు. 

స్వామి శరణమయ్యప్పా

హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.

అయ్య (=విష్ణువు),
అప్ప (= శివుడు)

అని పేర్ల సంగమం తో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే “కుళతుపుళ”లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. “అచ్చన్ కోవిల్”లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.

అయ్యప్పను గురించిన ప్రధాన గాధలు
మహిషి కధనం

మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. ‘తధాస్తు’ అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.

అయ్యప్ప జననం
ఛైత్రమాసము , ఉత్తరా నక్షత్రం ,చతుర్ధశి – సోమవారము నాడు జన్మించినారు . జ్యోతి రూపం గా అంర్ధానమయిన రోజు — మకర సంక్రాంతి . క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో

శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త.
అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు ‘అయ్యా అని మరికొందరు ‘అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి ‘అయ్యప్ప’ అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.

మహిషి వధ
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.

శబరిమలైలో నివాసం

రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.

శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ

నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః |
చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ||

రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దెగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది, ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జెరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించె మార్గం చెప్పవలసింది” అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు ” నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు” అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు.

ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలొ తనంతట తానుగా వచ్చారు….

ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః |
శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః ||

ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందొ, అందమైన రూపంతొ, మెడలొ వైజయంతి మాలతొ, శంఖ చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు……

హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం |
దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ ||
వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం |
ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్ ||

మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అక్రుత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు.

తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం |
పితరం రోచయామాస తదా దశరథం నృపం ||

నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు.
అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలొ వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమిచెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు ” నాయనా దశరథా! నన్నుప్రాజాపత్ర్య పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు, ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతొ ఉంటారు” అని చెప్పి వెళ్ళిపోయాడు.
వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలొ సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు.

యాగం పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. రుష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా రుష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరిని తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు.
కొంత కాలానికి దశరథ మహారజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు.

తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |
నక్క్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు ||
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ |
ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ||

జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కారింపబడే వాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి, చైత్ర మాసంలొ, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలొ, కర్కాటక లగ్నంలొ రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలొ కైకేయకి పుష్యమి నక్షత్రంలొ, మీన లగ్నంలొ భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.


తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు.

కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది?

ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తి క నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది.

కృత్తికా నక్షత్రం
ఈ కృత్తికానక్షత్రం నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమార స్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.

కార్తీక సోమవారాలు
ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగినది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఏ మనుష్యూడైనను తులారాశియందు సూర్యుడుండగా కార్తీకమాసమందు సూర్యోదయ కాలమునకు లేచి కాలకృత్యంబులు నిర్వర్తించి, నదీస్నాన మొనరించి, జపము, దేవపూజ, తీర్థవిధి మొదలగు కార్యములను జేసినచో గొప్ప ఫలంబు సంప్రాప్తించునని యుందురు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమగు శుద్ధపాడ్యమి మొదలుకొనిగాని వ్రతారంభమును చేయవలయును.అట్లు ప్రారంభించు సమయ మున ఓ కార్తీక దామోదార! నీకు వందనములు. నాచే నారంభింపబడు కార్తీక వ్రతంబును విఘ్నము లేకుండ జరు గునట్లు చేయుము అని పిమ్మట స్నానము చేయవలెను.

కార్తీకమాసం……….ఆకాశ దీపం………..
శివ కేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీకమాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వెళ్లాడ దీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం వుంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు … ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. ‘దీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

కార్తీక సోమవారం రోజున ఈ క్షేత్రాన్ని దర్శించినవారిని యమధర్మరాజు సైతం ఏమీ చేయలేడు…..
సదాశివుడు తన భక్తులను సదా కాపాడుతూ ఉంటాడు. నిస్వార్ధంతో నిరంతరం తన నామస్మరణ చేసే భక్తులను మృత్యువు బారిన పడకుండా రక్షిస్తుంటాడు. ఈ విషయంలో యమధర్మరాజును సైతం అయన ఎదిరించిన ఘట్టం మార్కండేయుడి జీవిత చరిత్రలో స్పష్టమవుతుంది. మార్కండేయుడు పరమ శివభక్తుడు. తన ఆయువుతీరనున్న సమయంలో ఆ బాలుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ పిల్లవాడిపైకి యమధర్మరాజు విసిరిన పాశం … శివలింగానికి కూడా చుట్టుకుంటుంది. అది గమనించని యముడు అలాగే పాశాన్ని లాగాడు. ఆగ్రహావేశాలకు లోనైన శివుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై యమధర్మరాజుని సంహరించాడు. ఆ తరువాత సమస్త దేవతల ప్రార్ధనమేరకు ఆయన్ని బతికించాడు. తన భక్తుల విషయంలో ఆచి తూచి వ్యవహరించమని సున్నితంగా మందలించాడు. పురాణంలో అత్యద్భుతమైన ఘట్టంగా కనిపించే ఈ సంఘటన తమిళనాడులోని ‘తిరుకడవూరు’లో జరిగిందని చెబుతుంటారు. ఈ కారణంగానే ఇక్కడి శివుడిని ‘కాలసంహార మూర్తి’ పేరుతో పూజిస్తూ వుంటారు. ఇక్కడ శివుడి కాళ్ల క్రింద నలుగుతున్నట్టుగా యమధర్మరాజు … ఆ పక్కనే శివుడికి వినయంగా నమస్కరిస్తూ మార్కండేయుడు దర్శనమిస్తూ ఉంటారు. ప్రాచీనకాలానికి చెందిన ఈ క్షేత్రానికి ‘కార్తీక సోమవారం’ రోజున వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ రోజున ఇక్కడ ఒకవెయ్యి ఎనిమిది శంఖాలతో స్వామివారికి జరిగే అభిషేకం చూసితీరవలసిందే. ఇక అమ్మవారు ‘అభిరామి’ పేరుతో విశేష పూజలు అందుకుంటూ వుంటుంది. కార్తీక సోమవారం రోజున ఈ క్షేత్రాన్ని దర్శించినవారిని యమధర్మరాజు సైతం ఏమీ చేయలేడనీ, విధివశాత్తు ఆపదలు ఎదురైనా మృత్యుంజయులుగా బయటపడతారని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. అందువలన ఈ రోజున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు … స్వామి అనుగ్రహాన్ని పొందుతూ వుంటారు.

శివాభిషేక ఫలములు

  • 1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
  • 2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
  • 3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
  • 4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
  • 5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
  • 6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
  • 7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
  • 8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
  • 9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
  • 10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
  • 11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
  • 12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
  • 13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
  • 14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
  • 15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
  • 16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
  • 17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
  • 18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
  • 19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
  • 20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
  • 21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
  • 22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
  • 23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
  • 24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.

దత్తప్రభువుల జన్మవృత్తాంతం

ఆధిభౌతికం,ఆధిదైవికం,ఆధ్యా త్మికం అనే తాపాలను తొలగించుకున్న అత్రి మహర్షుల వారికి,కామక్రోధాది దుర్గుణాలన్నింటికీ మూలమైన అసూయను జయించిన అనసూయ మాతకు, కృతయుగంలో ఇప్పుటి నేపాల్‌ ప్రాంతంలోని చిత్రకూట పర్వతం వద్దనున్న అనసూయా పహాడ్ అనేచోట ఒకానొక వైశాఖ బహుళ దశమీ గురువారంనాడు రేవతీ నక్షత్రయుక్త మీన లగ్నంలో మీనాంశయందు ‘బ్రహ్మ అంశమున చంద్రుడు,విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసులుగా’ దత్తాత్రేయులవారు జన్మించారు. తర్వాత చంద్రుడు,దుర్వాసుడు తమ తమ అంశములను దత్తునిలో నిక్షిప్తం చేసి తపస్సు చేయడానికి వెళ్లిపోయారు.

(బ్రహ్మ నా తండ్రి, మాయ(ప్రకృతి) నా తల్లి వారి ఐక్యం వల్లనే నాకీ దేహం వచ్చింది. నేనే దైవం,శిరిడీలోనూ సర్వత్రా నేనే వున్నాను, సర్వ జగత్తూ నాలోనే వుంది.నీవు చూస్తున్నదంతా కలిపి నేను..నేను శిరిడీలో మాత్రమే ఉన్నాననుకొనేవాడు నన్నసలు చూడనట్లే – అన్న సాయి వాక్కుని సదా స్మరించినట్లయితే ఆయనెవరో క్రమంగా అర్ధం అవుతుంది.)

బాల్య లీలలు :
————–
ఈ బాలుడు సామాన్యుడు కాదని అఙ్ఞానులను ఙ్ఞానమార్గాన నడిపి కైవల్యము చేర్చే మార్గదర్శకుడని ఙ్ఞానులు ఆయన్ను ప్రసంశించేవారు. దత్తులవారు మాత్రం గురుశుశ్రూష చేయక బాలునిగా, ఉన్మత్తునిగా, పిశాచపీడితునిలా విహరిస్తుండేవారు, అది చూచి సంశయించేవారు ఆయన కృపకి దూరమయ్యేవారు. ఒకసారి ఆశ్రమవాసులు, వయోవృద్ధులు దత్తస్వామిని చేరి గురువై తమను అనుగ్రహించవలసిందని ఆయన్ను కోరారు. దత్తులవారు వారితో ఏమీ మాట్లాడకుండా ఏకాంత నిష్టలో ఉండటానికి బయలుదేరారు, ఆశ్రమవాసులు ఆయన్ను వెంబడించారు. అది గమనించిన దత్తప్రభువు దగ్గరలో వున్న సరోవరంలో దిగి అదృశ్యులయ్యారు.

ఆయన్ను వెంబడిస్తూ వచ్చినవారు ఆయన దర్శనంకోసం అక్కడే వేచివున్నారు. ఇలా 100 సంవత్సరాలు గడిచేవరకు వారి సహనాన్ని, వారి దృఢ సంకల్పాన్ని పరిక్షించిన పిదప దత్తస్వామి వారి నమ్మకాన్ని పరిక్షించదలచి, ఒక స్త్రీని ఎడమతొడపై కూర్చోబెట్టుకుని సరోవరంలోంచి బయటకు వచ్చారు. దత్తులవారు ఈ విధంగా దర్శనమిచ్చినప్పటికీ ఆశ్రమవాసులు దృఢచిత్తులై అక్కడనుండి కదలలేదు. అప్పుడు దత్తులవారు మద్యాన్ని సేవిస్తూ. వెంటతెచ్చిన స్త్రీతో సరసాలాడటం మొదలుపెట్టారు. ఈ ఘటన కొందరిలో చిత్తచాంచల్యాన్ని కలిగించింది, ఇలా చిత్తం చెదిరినవారు – ఇటువంటి దురాచారుడు, స్త్రీలోలుడు ఆశ్రితులనెలా ఉద్ధరిస్తాడు? అంటూ ఆయన్ని విడిచివెళ్లారు(ఇటువంటివారినే శ్రీసాయి బాబా రాలిపోయే పూతతో పోల్చారు). అక్కడే మిగిలిన అతి కొద్దిమంది మాత్రం అక్కడ జరుగుతున్న చర్యల్ని పట్టించుకోకుండా చిత్తాన్ని కేవలం దత్తప్రభువుపైనే నిలిపివుంచి ఆయన్ని ఇలా స్తుతించారు – ఓ మహానుభావా నీవు యోగీశ్వరుడివి, పూర్ణ పరబ్రహ్మ స్వరూపూడివి, నిర్గుణుడవైనప్పటికీ భక్తులనుద్ధరించడానికి ఇలా సగుణరూపంలో సంచరిస్తున్నావు. ఇకనైనా ఈ దీనులని పరిక్షించటంమాని, నీ ఆశ్రయం కోరివచ్చిన మమ్ము ఉద్ధరించు ప్రభూ అంటూ స్తుతించగా, వారి ప్రార్ధనను మన్నించిన దత్తప్రభువు ఆ మునులకు తన నిజరూపాన్ని చూపి అనుగ్రహించారు.

ఈ విధంగా ఆశ్రమవాసుల్ని అనుగ్రహించిన తర్వాత దత్తప్రభువు తన తల్లిదండ్రుల చెంతకు వచ్చి, భక్తులను అనుగ్రహించడానికి, ప్రజలను సన్మార్గవర్తనులను చేయడానికి నేను సహ్యాద్రికి వెళ్లాలి నన్ను ఆశీర్వదించమనగా, సర్వఙ్ఞురాలైన ఆ మాత కూడా పుత్రవ్యామోహముతో అంగీకరించక – నా వద్దనే ఉండు,నన్ను విడిచి వెళ్లకని బ్రతిమాలింది. దత్తుల వారు పట్టు విడవకపోవడంతో – నా వల్ల కలిగిన దేహాన్ని నాకు ఇచ్చి నీ ఇచ్ఛ ప్రకారం నడుచుకోమని నిష్టూరమాడింది. దత్తాత్రేయుల వారు నవ్వుతూ తన చర్మాన్ని గోళ్లతో చీల్చి తన దేహాన్ని తల్లికి ప్రసాదించారు. ఆ దృశ్యాన్ని చూచిన అనసూయమాతకు దేహం నాశనమయినప్పటికీ, ఆత్మ శాశ్వతమనే సత్యం స్ఫురించినదై – కుమారా తల్లికి సహజమైన మాతృవ్యామోహంతో నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను, అఙ్ఞానంతో అలమటించే మానవాళికి ఙ్ఞానాన్ని ప్రసాదించే మోక్షమార్గాన్ని అనుగ్రహించు అన్నది.
**వ్యామోహం సత్యాన్ని మరుగుపరుస్తుందనే విషయం తెలియజేయడానికే ఈ లీల జరిగిందని మనం గ్రహించాలి.

దత్తప్రభువు దినచర్య :
———————
దిగంబరుడూ,శరీమంతా భస్మం పులుముకొన్నవాడు,ఆత్మ ఙ్ఞానం కలిగించ గలవాడు, సర్వమతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారంలోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడూ, సదా బ్రహ్మనిష్టకలవాడూ,ప్రసన్నుడు,నిర్మానసుడు ఐన దత్త ప్రభువుల వారు -
ప్రతిరోజూ కాశీలో గంగాస్నానము, మాహురపురములో ధ్యానము, కొల్హాపురిలో (కరవీరపురం) భిక్ష, నిర్మలమైన,స్వచ్ఛమైన తుంగభద్రా నీటితో దాహం తీర్చుకుని, సహ్యాద్రి పర్వతములో నిద్ర చేస్తారు. సహ్యాద్రి కల్పవృక్షము కింద మణిపీఠం ఉంది, దానిపై దత్త ప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారం, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి మధుమతీదేవి, వెనుక కామధేనువు, నలుదిక్కులా నాల్గువేదాలూ నాలుగు కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా – ఆయన ముందు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులూ, నవనాధుల ఆదిగాగల మహ్మాతులు ఆయన్ను స్తుతిస్తూ వుంటారు.కేవలం భిక్షాన్నం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు,నవనిధులు దాస్యం చేస్తూ ఉంటాయి. ఎడమ చేతిలో త్రిశూలం, శంఖం, కమండలం ధరించి కుడి చేతిలో ఢమరుకం, చక్రం, జపమాల ధరించి ఉండగా గంధర్వుల గానం చేస్తూంటే. అప్సరసలు నృత్యం చేస్తూండగా దత్తప్రభువులు ప్రతిదినమూ దర్బార్ నిర్వహిస్తూవుంటారు. అట్టి ప్రభువు తనను దర్శించి, స్మరించినంత మాత్రానే ఇహ, పర సౌఖ్యాలు కలుగజేస్తుంటాడు.
**శ్రీ దత్తుల వారికి అవధూత అనే బిరుదువున్నది – అవదూతోపనిషత్తు ప్రకారం ఆ పదానికి అర్ధం.

శ్లో II అక్షరద్వాద్వరేణ్యత్వాద్ధూత సంసార బంధనాత్
తత్వమస్యాది లక్ష్యత్వదవదూత ఇతీర్యతే II
తా II నాశరాహిత్యమూ,శ్రేష్టత్వమూ. విదిలించి వేయబడిన సంసారబంధము తత్త్వమసి అనే మహావాక్యానికి లక్షమవ్వడం వలన,అట్టి వారిని అవధూత అని చెబుతారు.

కార్త వీరార్జుని వృత్తాంతం :
————————-
త్రేతాయుగంలో ’హైహయ’ వంశానికి చెందిన కృతవీరుడనే చక్రవర్తి ’మహిష్మతి’ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవాడు. అతని భార్య శీలధారా దేవి. వీరికి ఎంతో మంది సంతానం కలిగినప్పటికీ, చ్యవన మహర్షి శాపం వల్ల ఒక్కరూ బ్రతకడంలేదు. సంతానం నిలబడటానికి ఎన్నో యాగాలు, పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో శీలధారా దేవి ఎంతో మనో వేదనకు గురైంది. ఒకరోజు వారికి యఙ్ఞవల్క్య మహర్షుల వారిని దర్శించే భాగ్యం కలిగింది.

మహర్షుల వారి సతీమణి మైత్రేయి మాత వారి వ్యధ విని వారికి అనంత వ్రతం చేయమని చెప్పి, వ్రత విధానం తెలియజేసింది. ఆ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నప్పుడు, దేవగురువు బృహస్పతి వారి ఇంటికి విచ్చేసి వారిని సూర్యభగవానుణ్ని కూడా ఆరాధించమని చెప్పి ఆలా చేస్తే పాపాలు నశించి పుత్ర సంతానం కలుగుతుందని తెలియజేస్తాడు. వారు చెప్పినట్లే ఆచరించిన కొన్ని రోజుల తర్వాత శీలధారా దేవి గర్భం ధరించి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఐతే ఆ బాలుడు చూడ ముచ్చటగా వున్నప్పటికీ, అతని చేతులు వంకర తిరిగి సన్నగా బలహీనంగా వుండి వేలాడుతున్నాయి. అంగ వైకల్యం గల పిల్లవాడు పుట్టేసరికి వారు ఎంతో దుఃఖించారు. అయినప్పటికీ ఆ బాలుణ్ని వారు ఎంతో ముద్దుగా పెంచసాగారు. ఆ బాలుడికి అర్జునడనే పేరు పెట్టారు. కృతవీర్యుని కొడుకు కావడం వల్ల కార్తవీరార్జునుడయ్యాడు. కొంతకాలానికి కృతవీర్యుడు మరణించాడు. రాజ్యభారం వహించడానికి కార్తవీరునికి అంగవైకల్యం దృష్ట్యా అర్హత లేకపోవడం వల్ల మంత్రులకు రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సు ద్వారా శక్తులను పొంది రాజ్యానికి తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. గర్గ మహాముని కార్తవీరునికి శ్రీ దత్తాత్రేయుల వారే ఈ వైకల్యాన్ని నివారించగలరని చెప్పి వారిని దర్శించుకోడానికి సహ్యాద్రికి వెళ్లమని రాజుకి చెప్తాడు. దత్తాత్రేయుల వారిని దర్శించినప్పుడు వారు తమ భక్తుల భక్తి శ్రద్ధలను కఠినంగా పరిక్షించి, ఆ తర్వాతే అనుగ్రహిస్తారని చెప్పి దేవేంద్రుడు దత్తుల వారి అనుగ్రహం వల్ల జంభాసురుని ఏ విధంగా వధించాడో తెలియజేస్తారు.

జంభాసురుడు దేవతలని జయించినప్పుడు ఇంద్రుడు దేవ గురువు బృహస్పతిని మార్గం తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు బృహస్పతి సహ్యాద్రి పై కొలువై ఉన్న దత్త ప్రభువులే ఈ సమస్యని పరిష్కరించగలరని చెప్పి, ఆయన అనుగ్రహం పొందడంలో ఎదురయ్యే ఆటంకాలు జయించిన వారికే ఆయన తన నిజరూప దర్శనమిస్తాడని, దానికి ఎంతో భక్తి, శ్రద్ధలు అవసరమని చెప్తాడు. ఇంద్రుడు సహ్యాద్రికి చేరుకుని దత్తుల వారి దర్శనం కోసం వెళ్లినప్పుడు ఆయన మగువతో కలిసి మద్యాన్ని పానం చేస్తూ కనిపించారు. ఇలా ఎన్ని పరీక్షలు ఎదురయినా దేవేంద్రుడు ఆయన్ని విడువక సేవిస్తూనే వున్నాడు. కొన్ని రోజులకి ఇంద్రుని భక్తికి ప్రసన్నుడైన దత్త ప్రభువు తన నిజ రూపంలో దర్శనమిచ్చి జంభాసురుని సహ్యాద్రికి వచ్చేలా చెయ్యమని చెప్తాడు. ఇంద్రుడు జంభాసురుని కవ్వించి అతన్ని సహ్యాద్రికి వచ్చేలా చేస్తాడు. జంభాసురుడు తన సైన్యంతో సహా సహ్యాద్రికి రాగానే వాళ్లకి మహాసౌందర్యవతియైన అనఘా దేవి కనిపిస్తుంది. ఆమె సౌందర్యానికి మోహితులై యుద్ధాన్ని చేయడం మాని ఆమెను పల్లకీలో కూర్చోబెట్టారు. ఆమెను ముందుగా ఎవరు పొందాలని వారిలో వారు కలహించుకుంటున్నప్పుడు దత్తప్రభువు ఇంద్రున్ని పిలిచి రాక్షసులను ఓడించడానికి ఇదే సరైన సమయం అని తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వారిని సునాయాసంగా ఓడిస్తాడు. అలా ఇంద్రుడు దత్త ప్రభువుల కృపకు పాత్రుడై తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అని పై వృత్తాంతాన్ని గర్గముని, కార్తవీరునికి తెలియజేస్తారు.

కార్తవీరార్జునుడు సహ్యాద్రి చేరి దత్తప్రభువుని దర్శించి, భక్తి శ్రద్ధలతో వారిని సేవించిన తర్వాత కొంతకాలానికి ఆయన ప్రసన్నులై అతని వైకల్యాన్ని నివారించారు. అంతేగాక అతనికి వేయి బాహువులను, ఇతరుల మనసులను గ్రహించే శక్తిని అనుగ్రహించి, తనంత వాడి చేతిలో మరణం పొందే వరాన్ని ఇచ్చారు. దత్త ప్రభువు అనుగ్రహ బలం చేత కార్తవీరార్జునుడు రావణాసురుడ్ని యుద్ధంలో ఓడించాడు. అలా చాలా కాలం రాజ్య పాలన చేసిన తర్వాత రాజ్యభోగాల పట్ల విసుగు చెంది సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక తీవ్రంగా కలిగి దత్త ప్రభువుని ఆశ్రయించాడు. లౌకిక శాస్త్రాలు విషయాల పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి, తత్త్వ శాస్త్రానికి పండితులు తెలియజేసే అర్ధాలు పరస్పర విరుద్ధంగా వుండి సాధకులను గందరగోళానికి గురిచేస్తున్నాయి అని దత్త ప్రభువుతో చెప్పగా. దత్త ప్రభువు “కార్త వీర్యా ! కొన్ని అర్ధాల్లో బాహ్యంగా బేధాలు కనిపించినా, అవి ఒకే తత్త్వాన్ని భిన్నమైన కోణాల్లోంచి ప్రతిపాదించిన సూత్ర పరిశీలనలు మాత్రమే. ఉత్తమమైనది తత్త్వ శాస్త్రమే. అలా అని ఇతర శాస్త్రాలు లౌకికములు అని వాటిని నిరసించరాదు. శాస్త్రాలన్నీ మంచి మార్గానికి దారి చూపేవే. వాటి ద్వారా కూడా ముక్తి సాధించవచ్చు.” అని చెప్పారు. ఆ తర్వాత అతనికి నిర్వికల్ప సమాధి స్థితి కలుగజేసి, ఆత్మ తత్త్వం విచారణ చేసే పద్ధతులను తెలియజేసి అతన్ని ఆశీర్వదించారు. చివరికి కార్త వీరార్జునుడు తాను పొందిన వరం వల్ల పరశురామ అవతారంగా వచ్చిన భగవంతుని చేతిలో మరణాన్ని పొందాడు.

ఙ్ఞానబోధ :
———-
**దత్తాత్రేయుల వారు అలర్కునికి, ప్రహ్లాదునికి, పరశురామునికి ఙ్ఞానబోధ చేసారు.

షోడశ అవతారాలు :
——————-
1.యోగిరాజు 2.అత్రివరదుడు 3.శ్రీ దత్తాత్రేయుడు 4.కాలాగ్ని శమనుడు 5.యోగిజన వల్లభుడు 6.శ్రీ లీలా విశ్వంభరుడు 7.సిద్ధరాజు 8.ఙ్ఞాన సాగరుడు 9.విశ్వంభరావధూత 10.శ్రీ అవధూత 11.మాయాముక్తావధూత 12.ఆది గురువు 13.శివరూపుడు 14.శ్రీ దేవదేవ 15.దిగంబరుడు 16.శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు.
**శ్రీ దత్తాత్రేయ సంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి పదహారు అవతారాలని చెప్పబడింది.ఆయన పరతత్త్వంతో నిత్యం భూలోక నివాసం చేస్తాడు గనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన అవతారాలని కీర్తించారని మనం గమనించాలి.

ఈ దత్తప్రభువు మానవజాతి నిలిచివున్నంతవరకూ గురురూపంలో మానవాళిని ఉద్ధరించడమే తన కార్యంగా చేసుకుని, వివిధ గురుసంప్రదాయాల ద్వారా అన్నిమతాల్లో, ప్రతియుగంలో 1,25,000 మంది అవధూతలు, మహాత్ముల రూపంలో ఈ భూమిపై తన కార్యం నిర్వహిస్తూవుంటారు. అట్టి గురుపరంపరలో భాగంగా, కలియుగంలో ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి దగ్గరగా ఉన్న శ్రీ పీఠికాపురం (పిఠాపురం) అనే గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభులుగా దత్తప్రభువు తన ప్రపధమ అవతారాన్ని ప్రకటించారు.

కృతే జనార్ధనో దేవః
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే రామకృష్ణాచ
కలౌ శ్రీపాద వల్లభః


తా II కృత యుగములో జనార్ధనుడు,త్రేతా యుగములో రాముడు,ద్వాపర యుగములోకృష్ణుడు,కలి యుగములో శ్రీపాద శ్రీవల్లభుడు అవతార పురుషులని ఆది గురువు వేదవ్యాస మహర్షి తమ భవిష్యపురాణంలో తెలియజేసారు

హనుమంతునిపై శనీశ్వర ప్రభావం

శ్రీరామాయణంలోని ఓ చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు…………

దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి. శనీశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు, హనుమంతునిపై పడలేదని పురాణాలు పేర్కొంటున్నాయి.
రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు.

ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూత నిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ హనుమంతుడుని పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శనిభగవానుడు తెలిపాడు. చెప్పినట్లు హనుమాన్ తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు.

కానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు, శనీశ్వరుడిని తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు.

అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు. దీంతో పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి, తప్పించుకునే మార్గం లేక తపించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు అంటున్నారు.

అందుచేత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.


ఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే.. వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

నవరాత్రి ఉత్సవాలు ఎందుకు జరపాలి!?

దసరా అంటే దన్+హరా అని; అంటే సీతాపహరణ గావించిన రావణాసురుని శ్రీరాముడు పదితలలను నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు సంహరించినాడు. అందువల్ల దీనిని “దసరా వైభవం” గా దశమినాడు జరుపుతూ ఉంటారు.

ఇక దేవినవరాత్రి పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. “అశ్వనీ” నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే “ఆశ్వీయుజమాసం” అవుతుంది. ఈ మాసమందు ‘దేవీనవరాత్రుల’ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.

ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ 
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ 
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా.

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ “దసరావైభవం” ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ “శరన్నవరాత్రులు” గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త ‘దశమి’ తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు “దశహరా” అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు దైవజ్ఞలు.


ఈ దేవి నవరాత్ర్యుత్సవాలు జరపడంల్లోకూడా మంచి అంతరార్థం ఉన్నదట! శరదృతువుకు ముందు వర్షరుతువు ఉంటుంది. బహుళంగా కురిసిన వానలవల్ల, చీమలు, దోమలు, కీటకాలు పెరుగుతాయి. ఈ ఋతువులో ప్రజలు రోగబాధలతో మరింతగా బాధపడుతూ ఉంటారు. వీటికి “యమదంష్ట్రము”లని పేరు. దేవి మహిషాదిజంతువులను జయించడంల్లో అంతరార్థమిదే అని దేవీభాగవతం చెప్తోంది. కావున ఆరోగ్య ప్రాప్తికి ఈ రెండు రుతువులలోను నవరాత్ర్యుత్సవం జరుపవలెనని పేర్కొంది.

ఏడు కొండలు వివరాలు

శేషాద్రి
సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి.విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని  దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారిమధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన  ఎటూ  తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి  వారిద్దరిలో ఎవరు బలవంతులో  తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని  వాయుదేవుడు కదిలించగలగాలి.

పోటీప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని  కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏంచేస్తున్నాడో   చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి  చూశాడు. ఇంకేం! పట్టుసడలింది. క్షణమాత్రకాలంలో వాయువు ఆనందశిఖరాన్ని  కదిలించి స్వర్ణముఖీ నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.

నీలాద్రి
స్వామివారికి తొలిసారిగా తన  తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదనే స్వామి తన
ఏడుకొండలలో ఒకదానికి ‘నీలాద్రి’గా నామకరణం చేశారు. తలనీలాలు అనే మాట కూడా ఆమెపేరు మీద రూపొందిందే. తలనీలాల  సమర్పణ అనేది భక్తుల అహంకార  విసర్జనకు గుర్తు.

గరుడాద్రి
దాయాదులైన కద్రువ పుత్రుల  (నాగులు)ను సంహరించిన గరుత్మంతుడు  పాపపరిహారార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే  తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి… తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ని కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.

అంజనాద్రి
వానరప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న  అంజనాదేవికి  చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద  ఏళ్లతరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని  ప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడనీ అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా  ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందనీ అంటారు.

వృషభాద్రి
కృతయుగంలో… తిరుమలలోని తుంబురుతీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజూ తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలాకాలంపాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తిలభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి  తన పేరు పెట్టాలని కోరుకున్నాడనీ అదే వృషభాద్రి అనీ పురాణగాథ.

నారాయణాద్రి
విష్ణుదర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణమహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు.

వేంకటాద్రి
కలియుగదైవం వెలసిన తిరుమల గిరి…  అలవైకుంఠం నుంచి గరుడుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. ‘వేం’ అంటే పాపాలు అని, ‘కట’ అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే ఆ  పవిత్రగిరిని ‘వేంకటాద్రి’ అంటారని ప్రతీతి.దీనికి సంబంధించి జనబాహుళ్యంలో ఓ కథ విస్తృత ప్రచారంలో ఉంది. శ్రీకాళహస్తిలో నివసించే పురందర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఓ కొడుకు పుడతాడు. అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారా దంపతులు.

మాధవుడు మాత్రం చెడుసావాసాలు పట్టి అన్నీ పాపాలే చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితోపాటు స్వామిదర్శనానికి వెళతాడు. దర్శనం కోసం స్వామి ఎదుట నుంచున్న మాధవుడికి ఒళ్లంతా మంటలు పుట్టడం మొదలవుతుంది. ఉపశమనం కోసం కేకలు పెడతాడు. క్రమంగా మంటలు తగ్గుతాయి. ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలూ నశించాయట. ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు. అతడే మరుజన్మలో తొండమాన్చక్రవర్తిగా పుట్టాడని, స్వామికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకం.