Friday, September 7, 2012

రామాయణం - యుద్దకాండ 3


విభీషణుడు రాజ్యకాంక్షతో వచ్చాడని హనుమంతుడన్న మీదట రాముడు తన అభిప్రాయాన్ని కూడా బయటపెడుతూ, ‘‘ఈ విభీషణుడెంత దుర్మార్గుడు కానీయండి, శరణని వచ్చిన తరవాత నేను అతణ్ణి విడవలేను. అది సజ్జనుల పద్ధతి కాదు,’’ అన్నాడు.

దానికి సుగ్రీవుడు ఒప్పుకోక, ‘‘ఇతను మంచి వాడే అయితే మాత్రం ఇతని వల్ల మనకేమిటి లాభం? ఇతణ్ణి చేరనివ్వగూడదు. అన్నను వదిలి వచ్చిన కృతఘ్నుడు మనను నమ్ముకుని ఉంటాడని ఏమిటి?’’ అన్నాడు.

‘‘రాజులలో ఒక ధర్మం ఉన్నది. జ్ఞాతులు కూడా ఇరుగుపొరుగు రాజుల వంటి వారే; కష్టకాలంలో దెబ్బ తీస్తారు. అందుచేత యోగ్యులైన రాజులు కూడా బలవంతులైన జ్ఞాతులను నమ్మరు. ఇతణ్ణి రావణుడు నమ్మలేక పోయాడు. అందుచేత విభీషణుడు మన వద్దకు వచ్చాడు. మనం రాక్షసులం కాము; మనకు రాక్షస రాజ్యం పైన కాంక్ష లేదు. అందుచేత మన ద్వారా ఇతను రాజ్యం పొంద గోరుతున్నాడు. ఇతను మనని విడవడు,’’ అన్నాడు రాముడు.

అయినా సుగ్రీవుడు ఊరుకోక, ‘‘రావణుడే ఇతణ్ణి ఇక్కడికి రహస్యంగా పంపాడు, సందేహం లేదు. నిన్నో, నన్నో, లక్ష్మణుణ్ణో కడ తేర్చటానికే ఇతను వచ్చాడు. అందరమూ కూడా చావవచ్చు. దుర్మార్గుడైన రావణుడి తమ్ముణ్ణి ఎలా నమ్మటం?’’ అన్నాడు. ‘‘ఇతను దుర్మార్గుడైతే మాత్రం నన్నేం చేయగలడు. ఇతను మారు వేషంలో వచ్చిన రావణుడే అయినా శరణన్న తరవాత విడిచి పుచ్చను. శరణార్థిని రక్షించటానికి ప్రాణాలైనా ఇవ్వాలి. నువ్వు వెంటనే అతణ్ణి తీసుకురా!’’ అని రాముడు సుగ్రీవుడితో అన్నాడు.


ఈ మాటలతో సుగ్రీవుడి మనసు మారింది. అతను వెళ్ళి విభీషణుణ్ణి రాముడి వద్దకు తీసుకు వచ్చాడు. విభీషణుడు తన నలుగురు అనుచరులతో బాటు రాముడి కాళ్ళపై పడి, ‘‘నేను రావణుడి తమ్ముణ్ణి. అతడి వల్ల అవమానం పొంది నిన్ను శరణు జొచ్చాను. నా సర్వస్వాన్నీ లంకలో వదిలి ఇక్కడికి వచ్చాను. ఇక నా జీవితమూ, నా సౌఖ్యమూ, నా రాజ్యమూ నీ చేతిలో ఉన్నాయి,’’ అన్నాడు.

రాముడు విభీషణుణ్ణి ఆశ్వాసించి, ‘‘రాక్షసుల బలాబలాలను యథార్థంగా వివరించి చెప్పు,’’ అన్నాడు. దానికి విభీషణుడిలా చెప్పాడు: ‘‘గంధర్వ ఉరగ రాక్షసుల చేతనూ, ఏ భూతం చేతనూ చావు లేకుండా రావణుడు బ్రహ్మ నుంచి వరం పొందాడు. రావణుడికి తమ్ముడూ, నాకు అన్నా అయిన కుంభకర్ణుడు మహా బలశాలి, యుద్ధంలో ఇంద్రుడికి సమానుడు. రావణుడి సేనాపతి అయిన ప్రహస్తుడు కుబేర సేనాపతి అయిన మణిభద్రుణ్ణి జయించిన వాడు. హనుమంతుడతణ్ణి గురించి చెప్పే ఉంటాడు. రావణుడి కొడుకు ఇంద్రజిత్తు వర ప్రసాదుడు; యుద్ధం చేస్తూనే అదృశ్యుడైపోయి శత్రువులను చంపగలవాడు. మహోదరుడూ, మహాపార్శ్వుడూ, అకంపనుడూ అనే రావణ సేనాపతులు దిక్పాలకులతో సమంగా యుద్ధం చెయ్యగలవారు. రక్తమాంసాహారులూ, కామరూపులూ అయిన రాక్షసులు లంకలో పదివేల కోట్ల మంది ఉన్నారు. వారి సహాయుంతోనే రావణుడు దిక్పాలకులను జయించాడు.’’

విభీషణుడు చెప్పిన ఈ మాటలు విని రాముడు, ‘‘విభీషణా, ఈ పనులన్నీ చేసిన రావణుణ్ణీ, ప్రహస్తుణ్ణీ, రావణుడి బలగాన్నీ చంపి, లంకారాజ్యం నీకు చేకూర్చుతాను, నా మాట నమ్ము. అతను రసాతలానికి పోనీ, పాతాళానికి పోనీ, బ్రహ్మ లోకానికే పోనీ, నేను ప్రాణాలతో వదలను. అతణ్ణి సపరివారంగా వధించకుండా అయోధ్యకు తిరిగిపోను, నా ముగ్గురు తమ్ముల మీద ఒట్టు!’’ అన్నాడు. ‘‘ఆ యుద్ధంలో నేను కూడా పాల్గొని శక్తికొద్దీ రాక్షసులను చంపుతాను, మీకు నా చేతనైన సహాయం చేస్తాను,’’ అన్నాడు విభీషణుడు.


 రాముడు సంతృప్తుడై లక్ష్మణుడితో సముద్రజలం తెచ్చి, విభీషణుణ్ణి లంకకు రాజుగా అభిషేకించమన్నాడు. లక్ష్మణుడు వానరుల మధ్య విభీషణుణ్ణి లంకా రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. వానరులు సింహనాదాలు చేసి రాముడికి జయధ్వానాలు పలికారు.

తరువాత సుగ్రీవ హనుమంతులు విభీషణుడితో, ‘‘ఇంత మందిమీ ఈ మహాసముద్రాన్ని దాటి లంక చేరట మెలాగో మాకు తెలియడంలేదు. ఆ ఉపాయం నువ్వే చెప్పాలి,’’ అన్నారు.

‘‘రాముడు సముద్రుడి శరణు పొందాలి. సముద్రుడు రాముడి పూర్వీకుడైన సగరుడికి ఎంతగానో ఋణపడి ఉన్నాడు; అందుచేత రామకార్యం తప్పక తీరుస్తాడు,’’ అన్నాడు విభీషణుడు.

సుగ్రీవుడు రామలక్ష్మణులున్న చోటికి వెళ్ళి, విభీషణుడన్న మాట చెప్పి, సముద్రుణ్ణి ఆరాధించాలని రాముడితో అన్నాడు. రాముడందుకు ఒప్పుకుని, సముద్రతీరాన దర్భలు పరిచి, వాటిపైన పడుకున్నాడు.

ఈలోపుగా శార్దూలుడనే రాక్షసుడు, రావణుడి వేగులవాడు, వానరసేన ఉన్న చోటికి వచ్చి, అక్కడి పరిస్థితులన్నీ చూసి, రావణుడి వద్దకు తిరిగివెళ్ళి, ‘‘వానర భల్లూకసేన అపరసముద్రంలాగా లంక పైకి వస్తున్నది. ఉత్తమాయుధాలు ధరించి సీత కోసం వస్తున్న రామలక్ష్మణులు సేనతో సహా సముద్రతీరాన విడిసి ఉన్నారు. నేనీ విషయాలు స్థూలంగా చూసి వచ్చాను. వివరంగా చూసి రావటానికి మరెవరినైనా పంపటం మంచిది,’’ అన్నాడు.

అప్పుడు రావణుడు శుకుడనే రాక్షసుడితో, ‘‘నువ్వు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి, మంచిగా ఈ మాటలు చెప్పు,’’ అని, ఏమి చెప్పాలో చెప్పి పంపాడు.

శుకుడు పక్షి రూపం ధరించి సముద్రం దాటి, వానర సేన దగ్గిరకు ఎగురుతూ వెళ్ళి, సుగ్రీవుడు మొదలైన వారి మీదుగా గాలిలోనే ఉండి ఇలా చెప్పాడు:

‘‘వానర రాజైన సుగ్రీవుడా! రావణుడిలా అన్నాడు: ఉన్నత వంశంలో పుట్టిన వాడవు. మహాబలుడవు. జన్మతః నాకు బంధువులాటి వాడివి. అకారణంగా నాతో విరోధ మెందుకు? ఇందువల్ల నీకు ఒరిగేదీ, తరిగేదీ లేదు. వాలి నా స్నేహితుడు. నువ్వు నా తమ్ముడిలాటి వాడివి.


 నేను రాముడి భార్యను తెస్తే నీ కేమిటి? బుద్ధిమంతుడవు, బాగా ఆలోచించుకుని కిష్కింధకు తిరిగి వెళ్ళు. లంకను దేవతలే ప్రవేశించలేరు గదా, నరుల మాటా, వానరుల మాటా చెప్పేదేమిటి?’’

ఈ మాటలు వింటూనే వానరులు ఆకాశాని కెగిరి శుకుణ్ణి పట్టుకుని నేల మీదికి పడదోశారు. శుకుడు ఎలుగెత్తి, ‘‘ఓ రామా, నన్నీ వానరులు చంపేస్తున్నారు. దూతను చంపరాదు. నా ప్రభువు అనమన్న మాటలే అన్నాను గాని, నేను సొంతాన ఏమీ అనలేదు,’’ అని అరిచాడు. రాముడు జాలిపడి, ‘‘వాణ్ణి చంపకండి,’’ అన్నాడు వానరులతో.
శుకుడు దెబ్బతిన్న రెక్కలతో ఆకాశం లోకి లేచి, ‘‘సుగ్రీవుడా, రావణుడితో ఏం చెప్పమంటావు?’’ అని అడిగాడు.

‘‘రావణుడితో ఇలా అన్నానని చెప్పు: రాక్షసరాజా, నువ్వు నాకు స్నేహితుడవు కావు, మేలుచేసిన వాడవు కావు, నా మిత్రుడైన రాముడికి శత్రువువు, నా శత్రువైన వాలికి మిత్రుడవు. అందుచేత తప్పక చంపదగిన వాడవు. నేను నిన్ను సకుటుంబంగా చంపి లంకను భస్మీపటలం చేస్తాను. నిన్ను రాముడి బారి నుంచి దేవతలు కూడా రక్షించలేరు. ముసలి జటాయువును చంపినట్టు కాదు; రామలక్ష్మణులు లేనప్పుడు దొంగతనంగా సీతను ఎత్తుకు వచ్చినట్టూ కాదు; రాముడి ప్రతాపం నీకు తెలియుదు,’’ అని సుగ్రీవుడు శుకుడితో అన్నాడు.

అంతలో అంగదుడు సుగ్రీవుడితో, ‘‘వీడు దూతలాగా లేడు, వేగుల వాడని తోస్తున్నది. మనతో మాట్లాడుతూనే శిబిరమంతా చూశాడు, వీణ్ణిపట్టుకోండి. పోనివ్వకండి,’’ అన్నాడు.

సుగ్రీవుడి ఆజ్ఞానుసారం వానరులు శుకుణ్ణి మళ్ళీ పట్టుకున్నారు. శుకుడు ఆక్రోశిస్తూ, ‘‘ఓ రామా, దూతనైన నన్ను ఈ వానరులు రెక్కలు విరుస్తున్నారు, కళ్ళు పీకేస్తున్నారు,’’ అని పెద్దగా మొరపెట్టుకున్నాడు.

రాముడు కోతులతో చెప్పి శుకుణ్ణి కాపాడాడు. తరవాత అతను సముద్రుడికి నమస్కరించి చెయ్యి తల కింద పెట్టుకుని, సముద్రుడికి ఎదురుగా పడుకున్నాడు.

రాముడలా మూడు రాత్రులు గడిపాడు. అంతకాలమూ సముద్రుణ్ణి ధ్యానించాడు. కాని సముద్రుడు సాక్షాత్కరించ లేదు. అతనికి కోపం వచ్చింది. లోకంలో మంచి వాళ్ళు అసమర్థులుగా గణించబడతారు.


సముద్రుడు తనను అలాగే భావించి ఉంటాడు. అందుచేత రాముడు సముద్రుడికి తన ప్రతాపం చూప నిశ్చయించి లక్ష్మణుడితో, ‘‘లక్ష్మణా, నా ధనుర్బాణాలిలా ఇయ్యి. సముద్రాన్ని ఎండించి, వానరులు కాలి నడకన లంకకు చేరేలాగు చేస్తాను. సముద్రంలోని జలమంతా భూమి పైకి పారేటట్టు చేస్తాను,’’ అన్నాడు.

అతను బాణాలు ఎక్కుపెట్టి వదిలాడు. అవి ధగధగా వెలిగిపోతూ వెళ్ళి సముద్రం ప్రవేశించి, సముద్రాన్ని అల్లకల్లోలం చేశాయి. సముద్రంలో బ్రహ్మాండమైన తరంగాలు పుట్టాయి. నీటి అడుగున ఉండే శంఖాలూ, ముత్యపు చిప్పలూ, భయంకరమైన సముద్ర ప్రాణులూ పైకి తేలాయి. లక్ష్మణుడు రాముడి చెయ్యి పట్టుకుని, ‘‘ఇంక చాలు! ఊరుకో!’’ అన్నాడు. రాముడు వినిపించుకోలేదు.

‘‘సముద్రుడా! నిన్ను పాతాళం దాకా ఇగిర్చేస్తాను! నీలో ఉన్న ప్రాణులన్నిటినీ దహించేసి, నిన్ను ఇసుకపరగ్రా చేసి వదిలేస్తాను! నా బలపరాక్రమాలు నీకు తెలియవు! నేను నిన్నేం చెయ్యగలనో తెలుసుకో లేకుండా ఉన్నావు!’’ అన్నాడు రాముడు, తనకు ప్రత్యక్షం కాని సముద్రుడితో.

అతనొక భయంకరమైన బాణాన్ని తీసి బ్రహ్మాస్ర్తం పఠించి, చెవి దాకా లాగాడు. అతను దాన్ని వదిలిపెట్టక మునుపే భూమ్యాకాశాలు బద్దలయినంత పని అయింది; కొండలు అదిరాయి; లోకాలన్నిటినీ చీకటి ఆవరించింది; నదులూ, సరస్సులూ కలకపారాయి. సూర్యచంద్రుల, నక్షత్రాల గతులు తప్పాయి. చీకటి కమ్మింది. పిడుగులు పడ్డాయి. ఆకాశాన ప్రచండమారుతాలు వీచాయి. వాటి వేగానికి మహావృక్షాలు విరుచుకు పడిపోయాయి. ఈ ఉత్పాతాల మధ్య సముద్రపు నీరు ఒక ఆమడ వెనక్కు పోయింది. సముద్రుడు వెనక్కు తగ్గటం చూసి రాముడు బాణం వదలలేదు.

అంతలోనే సముద్ర మధ్యంలోని బ్రహ్మాండమైన అలల మధ్య నుంచి సముద్రుడు, సమస్త నదులు వెంట రాగా, వెలువడి వచ్చాడు. ఆయన దేహం వైడూర్య వర్ణంగా ఉన్నది; ఎరన్రి మాలలూ, బట్టలూ ధరించాడు, రంగురంగుల పుష్పమాలికలు తలలో ధరించాడు; అనేకమైన బంగారు నగలు ధరించాడు; అతని మెడలోని ముత్యాల హారాల మధ్య కౌస్తుభమణి యొక్క తోబుట్టువు ప్రకాశిస్తున్నది.


సముద్రుడు రాముణ్ణి సమీపించి, ముందుగా తానే రాముడి పేరు చెప్పి నమస్కరించి, ‘‘రామా, లోతు అన్నది నాకు స్వభావసిద్ధమైనది. ఆ గుణాన్ని నేను విసర్జించలేను. కాకపోతే, వానరులు వారధి కట్టేటప్పుడు వారికి సముద్ర ప్రాణుల భయుం లేకుండా చెయ్యగలను, వారికి సహాయుపడగలను,’’ అన్నాడు.

‘‘అలా అయితే, ఎక్కు పెట్టిన ఈ అమోఘాస్త్రాన్ని ఏమి చెయ్యను?’’ అని రాముడు అగాడు. ‘‘ఇలా ఉత్తరంగా ద్రుమకుల్యమనే చోట భయంకరులైన దొంగలు కొందరుండి, నా జలాన్ని తాగి, సమస్త పాపకార్యాలూ చేస్తున్నారు. ఎంతో కాలంగా వారి స్పర్శ సహించ లేకుండా ఉన్నాను. నీ బాణాన్ని వారిపై ప్రయోగించు,’’ అని సముద్రుడు, రాముణ్ణి కోరాడు.

ఆ ప్రకారమే రాముడు తన బాణాన్ని ద్రుమకుల్యం పైన ప్రయోగించాడు. అది పిడుగులాగా వెలుగుతూ వెళ్ళి పడినచోటుకు మరుకాంతార మని పేరు వచ్చింది. బాణం పెద్ద మోతతో భూమిని చీల్చుకుని వెళ్ళిన చోట పాతాళం నుంచి జల పుట్టుకొచ్చింది. వ్రణకూపమని పేరు పొందిన ఆ జల ఎన్నడూ ఆగక ప్రవహిస్తూనే ఉంటుంది.
ద్రుమకుల్యంలోని దొంగలందరూ నశించారు.

అప్పుడు సముద్రుడు రాముడితో, ‘‘నీ సేనలో గల నళుడనే వానరోత్తముడు విశ్వకర్మ కొడుకు. శిల్ప విద్యలలో తండ్రికి తీసిపోడు. ఇతని చేత సేతువు నిర్మింపజెయ్యి. అది మునగకుండా నేను చూస్తాను,’’ అన్నాడు.

ఈ మాట చెప్పి సముద్రుడు అంతర్థానం కాగానే నళుడు, ‘‘సముద్రుడన్న మాట నిజమే. నేను సేతువు నిర్మించగలను. నా శక్తి మరొకరు చెబితే బాగుంటుందని నాకై నేనే చెప్పదలచలేదు. కావలిస్తే వానరులందరూ కలిసి ఇప్పుడే సేతు నిర్మాణం ప్రారంభించవచ్చు,’’ అన్నాడు రాముడితో.






No comments:

Post a Comment