Friday, September 7, 2012

రామాయణం - బాలకాండ 5


విశ్వామిత్రుడు పుష్కరంలో చేసిన తపస్సుకు మెచ్చి ఒకనాడు బ్రహ్మప్ర త్యక్షమై ఆయనకు ఋషి అనే బిరుదు ఇచ్చాడు. దానికి కూడా తృప్తిపడక విశ్వామిత్రుడు మరింత దీక్షగా తపస్సు సాగించాడు. ఈ సమయంలో ఆయనకు ఒకనాడు ఒక తీర్థంలో స్నానం చేస్తున్న మేనక అనే అప్సరస కనిపించి మనస్సు చలించింది. ఆయన తన తపస్సు విడిచిపుచ్చి మేనకను తన ఆశ్రమానికి పిలుచుకుపోయి, ఆమెతో పదేళ్ళు సుఖంగా గడిపాడు.

ఆ తరవాత ఆయనకు తన పొరపాటు తెలిసివచ్చింది. తన తపస్సు భంగం చెయ్యటానికి దేవతలు మేనకకు పంపారేమోననుకున్నాడు. ఆయనలో మార్పు గమనించి, తను శపిస్తాడేమోనని మేనక భయపడింది. కాని విశ్వామిత్రుడామెను ఏమీ అనక, "ఇందులో నీ తప్పేమీ లేదు, తప్పంతా నాదే. ఇక నీవు వెల్లిపో!" అన్నాడు.
ఆ తరవాత ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరి హిమాలయాలలో కౌశికీ నదీ తీరాన నివసిస్తూ, మహాదారుణమైన తపస్సు చేశాడు. చివరకు బ్రహ్మతో సహా పలువురు దేవతలు వచ్చి ఆయనకు మహార్షి అనే భిరుదు నిచ్చారు.

విశ్వామిత్రుడు బ్రహ్మను, "ఇప్పుడు నేను ఇంద్రియాలను జయించిన వాణ్ణేనా?" అని అడిగాడు. "ఇంకా నీవు జితేంద్రియుడవు కావు," అన్నాడు బ్రహ్మ. జితేంద్రి యుడు కావాలనే ఆశతో విశ్వామిత్రుడు వాయుభక్షణ చేస్తూ మహాఘోరమైన తపస్సు చేశాడు. ఈ తపస్సు చూసి చాలా దేవతలకూ, ఇంద్రుడికీ భయం పుట్టింది.


ఇంద్రుడు రంభను పిలిచి, "నీవు వెళ్ళి విశ్వామి త్రుడి తపస్సు భంగం చెయ్యాలి. మన్మథుణ్ణీ వెంటబెట్టుకుని నేను కూడా నీకు తోడు వచ్చి, కోయిల రూపం ధరించి కూస్తాను," అన్నాడు. రంభ భయపడుతూనే అందుకు ఒప్పుకున్నది. విశ్వామిత్రుడు తపస్సులో ఉండగా కోయిలకూత వినిపించింది. కళ్ళు తెరిచే సరికి ఎదురుగా రంభ కనిపించింది. ఇదంతా దేవతల పన్నాగమని తెలుసుకుని ఆయన రంభను రాయికమ్మని శపించాడు. ఇంద్రుడూ మన్మథుడూ పారిపోయారు..

మరుక్షణమే ఆయన, "ఆయ్యో, ఎందుకు శపించాను? కోపాన్ని ఎందుకు నిగ్రహించుకోలేక పోయాను?" అని పశ్చాత్తాప పడ్డాడు. ఎవరేమిచేసినా కోపపడరాదని ఆయన తీర్మానించుకున్నాడు. తపశ్శక్తిచేత బ్రాహ్మాణత్వం సాధించితీరాలని నిశ్చయించుకున్నాడు. ఈ ఉద్దేశంతో ఆయన ఉత్తరాన్ని విడిచి తూర్పు దిక్కుకుపోయి, మౌనవ్రతం అవలంబించి, తపస్సు సాగించాడు. ఆ తపస్సు యొక్క వేడికి మూడు లోకాలూ దగ్థమయ్యేటట్టు కనిపించింది. ఆ స్థితిలో ఎంతగానో భయపడి పోయిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా , ఆయన వచ్చి విశ్వామిత్రుణ్ణి, "బ్రహ్మర్షీ, నీకు బ్రాహ్మాణత్వం వచ్చింది," అన్నాడు.

విశ్వామిత్రుడు చాలా సంతోషించి, "నేను బ్రహ్మర్షినని వసిష్టుడు ఒప్పుకుంటేనే తృప్తి పడతాను," అన్నాడు. దేవతలు వసిష్ఠుణ్ణి ప్రార్థించి ఆయన చేత విశ్వా మిత్రుడు బ్రహ్మర్షి అని ఒప్పించారు. వసిష్ట విశ్వామిత్రులకు కలహంపోయి స్నేహం ఏర్పడింది. ఈ విధంగా శతానందుడు విశ్వామిత్రుడి కథ పూర్తి చేసేసరికి అస్తమయ మయింది. జనక మహారాజు విశ్వామిత్రుడి రాకకు తన సంతోషం తెలుపుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు తెలుపుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవార గానే ఆయన విశ్వామిత్రుణ్ణీ, రామలక్ష్మణులనూ యజ్ఞశాలకు పిలిపించాడు.

జనకుడు తన వద్ద ఉండే ధనువును గురించి విశ్వామిత్రుడికి చెప్పాడు. దక్షయజ్ఞం నాడు పరమశివుడు ఆ ధనువును ఎత్తి దేవతలను చంపబో యాడు. చివరకు వారి మొర ఆలకించి, ఆ ప్రయత్నం మాని, ఆ ధనువును దేవతలకే ఇచ్చేశాడు. దేవరాతుడనే వాడి కాలం నుంచీ ఆ ధనువు జనక మహారాజు వంశంలోనే ఉంటున్నది. దాన్ని ఎవరూ ఎక్కుపెట్టలేరు; కదిలిం చను కూడా లేరు.


 ఒకప్పుడు జనకడు యజ్ఞం కోసం భూమి దున్నుతూ ఉండగా చాలులో నుంచి ఒక ఆడశిశువు పైకి వచ్చింది. ఆమెకు సీత అని పేరు పెట్టుకుని, జనకుడు తన కుమార్తెలాగే పెంచుతూ వస్తున్నాడు. శివధనువును ఎక్కు పెట్టినవారికి సీత నిచ్చి పెళ్ళీ చెయ్యటానికి ఆయన నిశ్చయించాడు. ఆ సంగతి తెలిసి ఎందరో రాజకుమారులు వచ్చి, ఆ ధనువును ఎక్కుపెట్టలేక పోయారు.

చివరకు ఈ ఓడిపోయిన రాజులు ఏకమైదండెత్తి వచ్చి ఒక ఏడాదిపాటు మిథిలకు ముట్టడివేశారు. జనకుడు ఏమి చెయ్యటానికీ శక్తిలేక దేవతలను ప్రార్థించగా వారు సేనలను పంపి, నగరాన్ని ముట్టడించిన రాజకుమారులను పారదోలారు. ఈ వృత్తాంతం విన్న మీదట విశ్వామిత్రుడు జనకుడితో, ఆ ధనువును రాముడికి చూపమన్నాడు. దాన్ని తీసుకురావటానికి జనకుడు మనుషులను నగరంలోకి పంపాడు. ఎనిమిది చక్రాలు గల ఇనప పెట్టెలో ఉండే ఆ శివధనువును నగరం నుంచి యజ్ఞశాల వద్దకు తెచ్చారు.

"దీన్ని ఎత్తటానికీ, ఎక్కు పెట్టటానికీ నాకు శక్తి ఉందేమో చూస్తాను," అంటూ రాముడు పెట్టె తెరిచి, ధనువును మధ్య భాగం పట్టి పైకెత్తి, అవలీలగా తాడు తగిలించాడు. దానికి అతను బాణం పెట్టటానికి ప్రాయత్నించగా అది ఉరుములాంటి పెళపెళారావంతో నడిమికి విరిగి పోయింది. అందరూ నిర్ఘాంతపోయారు. జనకుడు పరమానందం చెంది, "సీతను శౌర్య వంతుడికే ఇవ్వాలనుకున్నాను. ఇప్పటికి నా ఆశయం ఈడేరనున్నది. ఈ కుర్రవాడు సీతకు అర్హుడు. వీరద్దరి వివాహం విషయం ఇప్పుడే అయోధ్యకు కబురు చేస్తాను," అన్నాడు.

జనకుడి దూతలు మూడు రోజులు ప్రయాణం చేసి, నాలుగోరోజు ఉదయానికి అయోధ్య చెరి, దశరధుడితో శివధనుర్భంగ వృత్తాంతం చెప్పి, సీతారాముల వివాహానికి తరలిరమ్మని కోరారు. దశరథుకు ఆవార్తవిని ఎంతగానో సంతోషించి తన మంత్రులతో సంప్రతించి, జనక మహారాజుతో సంబంధం ఉచితమని తెలుసుకున్నాడు. వసిష్ఠ, వామదేవ, జాబాలి, కాశ్యప, మార్కండేయాదులను ముందుగా ప్రాయాణం చేసి, తాను తన బలగంతో వెనకగా ప్రాయాణమై, నలుగోరోజుకు దశరథుడు జనకుడి యజ్ఞశాల చేరాడు.


అప్పటికి యజ్ఞం పరిసమాప్తి అయింది సీతను పెళ్ళికూతుర్ని చేశారుకూడా. జనకుడూ, దసరథుడూ ఒకచోట చేరారు. జనకుడివెంట ఆయన తమ్ముడు కుశధ్వజుడు కూడా ఉన్నాడు. దశరథుడి తరపున వసిష్ఠుడు జనకుడితో దశరథుడి వంశావళి అంతా సమగ్రంగా చెప్పాడు. తరవాత జనకుడు తనవం శావళిని తానే దశరథుడికి తెలుపుకున్నాడు రెండూ గొప్పవంశాలు. వియ్యం పొందదగినవి.

జనకమహారాజుకు సీత గాక ఊర్మిళ అనే కుమార్తె ఉన్నది. ఆయన తమ్ముడు కుశధ్వజుడికి మాండవి,శ్రుతకీర్తి అని ఇద్దరు కూతుళ్ళున్నారు. సీతా రాముల వివాహముహూర్తానికే లక్ష్మణుడికి ఊర్మిళనూ, భరతుడికి మాండవినీ, శత్రుఘ్నుడికి శ్రుతకీర్తినీ ఇచ్చి చేస్తే బాగుంటుందని జనకుడు సూచించాడు. ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో ముహూర్తం నిశ్చయమయించి. పెళ్ళికి ముందే దశరథుడు నాలుగు లక్షల గోవులను దానం చేశాడు. ఆ రోజునే భరతుడి మేనమాన అయిన యుధాజిత్తుకూడా మిథిలకు వచ్చాడు. అగ్నిసాక్షిగా నలుగురి వివాహాలూ జరిగిపోయాయి. దశరథుడి కొడుకులు నలుగురూ తమ భార్యలను వెంటబెట్టుకుని తమ విడిదికి వచ్చేశారు.


పెళ్ళీ కాగానే విశ్వామిత్రుడు తన దారిన తాను హిమాలయానికి వెళ్ళిపో యాడు. దశరథుడుకూడా తన బలగంతో అయోధ్యకు బయలుదేరాడు. అలా వారంతా ప్రయాణం చేస్తూండగా దారిలో అకస్మాత్తుగా చీకటికమ్మింది. ధూలి లేచింది. పెనుగాలి వీచింది. అదే సమయంలో ప్రళయకాల రుద్రుడి లాగా పరశురాముడు వారికి ఎదురు వచ్చాడు. ఆయన భుజాన గండ్రగొడ్డలీ, చేతిలో కాంతి వంతమైన ధనుర్బాణాలూ ఉన్నాయి. ఆయన రాముడితో, "ఓరామా, నీవు శివుడి విల్లువిరిచావట, విన్నాను.

చాలా ప్రజ్ఞగలవాడవు. దానికన్న శక్తివంతమైన ఈ విష్ణుధనువు ఎక్కుపెట్టగలవేమో చూడు. అంతశక్తి నీకున్న ట్టయితే నాతో ద్వంద్వయుద్దం చేతువు గాని!" అన్నాడు. పరుశురాముడు రాముడితో విష్ణుధనువు గురించి ఇలా చెప్పాడు: దీనినికూడా విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు. శివుని విల్లులాగే ఇదీ ధనుస్సులలో శ్రేష్ఠమైనది. దీనిని దేవతలు విష్ణువుకు ఇచ్చారు. శివవిష్ణువుల బలాబలాలు తెలుసుకు నేటందుకు వారు బ్రహ్మద్వారా ఇద్దరికీ కలహం పెట్టించారు. ఇద్దరికీ చెరొక గొప్ప విల్లూ ఉన్నది. వారు మహా భయంకరమైన యుద్ధం చేశారు.

ఆ యుద్ధంలో విష్ణువుదే పైచెయ్యి అయింది. శివకేశవులలో కేశవుడే ఎక్కువ ని దేవతలు గ్రహించి, యుద్దం మానవలసిందిగా ఇద్దరు దేవుళ్ళనూ ప్రార్థించారు. తనకన్న విష్ణువు ఎక్కువగా నిర్ణయం జరిగినందుకు శివుడు ఆగ్రహించి, తన ధనువునూ, బాణాలనూ విదేహదేశపు రాజైన దేవరాతుడి కిచ్చేశాడు. విష్ణువు తన ధనుస్సును భృగువంశంవాడైన ఋచీకుడి వద్ద దాచి పెట్టాడు. అది ఋచీకుడి కొడుకైన జమదగ్నికీ, ఆయన కొడుకైన పరశురా ముడికీ సంక్రమించింది. దశరథుడు భయంతో వణికిపోతూ, పరశురాముడి కాళ్ళపైపడి, "స్వామీ, ఇరవై ఒక్కసారి క్షత్రియులను నాశనంచేసి, అస్త్రం పట్టనని ఇంద్రుడి వద్ద ప్రతిజ్ఞచేశావు. ఈనా కొడుకును కాపాడు. లేకపోతే మేమంతా నాశనమైపోతాం," అన్నాడు.


పరశురాముడు ఆయన మాటలు పెడచెవి పెట్టాడు. రాముడికి మండిపో యింది. అతను పరశురాముడి నుంచి విష్ణుధనువు తీసుకుని, అవలీలగా వంచి ఎక్కుపెట్టి, బాణం సంధించి, "ఓ బ్రాహ్మాడా, ఈ బాణంతో నీ ప్ర్రాణం తీయగలను. కాని బ్రాహ్మణ హత్య నా కిష్టంలేదు. అందుచేత దీనితో నీ కాళ్ళు విరగగొట్టమన్నావా? నీవు తపస్సు చేసిన ఉత్తమలోకాలు ధ్వంసం చెయ్య మన్నావా?" అని అడిగాడు.

పరశురాముడు నిర్వీర్యుడైపోయి తన ఉత్తమలోకాలను పోగొట్టుకోవటానికి సిద్దపడ్డాడు. రాముడు బాణం వదిలాడు. తరవాత పరశురాముడు మహేం ద్రగిరికి వెళ్ళి పోయాడు. రాముడు మూర్ఛపోయిన తన తండ్రిని లేపిన అనంతరం అయోధ్యకు వచ్చేశారు. కొద్దిరోజులు గడిచాయి. యుధాజిత్తు తన మేనల్లుడైన భరతుణ్ణి తన ఇంటికి తీసుకుపోతానన్నాడు. ఇందుకు దశర థుడు సమ్మతించాడు. భరతుడు శత్రుఘ్నుణ్ణి వెంటబెట్టుకుని తన మేనమామ వెంట వెళ్ళిపోయాడు.

సీతారాములు అన్యోన్య ప్రేమతో దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారు తమ ప్రేమను పైకి చూపకపోయినా ఒకరి మనసు నొకరు బాగా అర్థం చేసు కుంటున్నారు. రాముడు రాచకార్యాలలో తండ్రికి సహాయపడుతున్నాడు. రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి.             

                                         (బాలకాండ సమాప్తం)






No comments:

Post a Comment