Friday, September 7, 2012

రామాయణం - కిష్కింధా కాండ 1

వసంతకాలం. పంపాసరస్సులోని జలం నిర్మలంగా ఉన్నది. అందులో కమలాలూ, నల్ల కలువలూ పూస్తున్నాయి. సరస్సు చుట్టూ ఉండే అరణ్యం అత్యంత మనోహరంగా ఉన్నది. గండుకోయిలలు కూస్తున్నాయి. నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఈ వసంత శోభను గమనించి రాముడు ఒక వంక ఆనందమూ, మరొక వంక సీతకై వేదనా పొంది తన స్థితికి ఎంతగానో విలపించాడు.
 
ఎటు చూసినా, దేన్ని చూసినా అతనికి సీతే జ్ఞాపకం వచ్చింది. అతను లక్ష్మణుడితో నిరాశాపూరితంగా మాట్లాడాడు. ‘‘లక్ష్మణా, ఈ మనోహరమైన ప్రాంతంలో నా వెంట సీతే ఉంటే జీవితంలో ఇంకేమీ కోరను. కానీ, సీత లేకుండా జీవించటం అసంభవంగా ఉన్నది. నేను ప్రాణాలు వదిలేస్తాను, నువ్వు భరతుడి వద్దకు వెళ్ళి పో,'' అని పెద్ద పెట్టున ఏడవసాగాడు. లక్ష్మణుడు రాముడికి హితం చెప్పాడు.
 
సీతపై గల అమితమైన ప్రేమచేతనే దుఃఖం కలుగుతున్నదనీ; ఆ ప్రేమనూ, వేదననూ దూరంగా ఉంచమనీ, రావణుడి జాడ తెలుసుకుని సీతను తెచ్చుకోవలసి ఉన్నదనీ, రావణుడు మంచిగా సీత నివ్వకపోతే అతణ్ణి వధించవలసి ఉంటుందనీ, ఇందుకు ధైర్యం అవసరమనీ, దుఃఖం కార్యనాశకమనీ లక్ష్మణుడు రాముడికి చెప్పి ధైర్యం కలిగించాడు. రామలక్ష్మణులు పంపాసరస్సు వద్దకు వచ్చిన క్షణం నుంచీ, ఋశ్యమూక పర్వతం మీద ఉంటున్న సుగ్రీవుడనే వానరరాజు వారిని చూస్తూనే ఉన్నాడు.

ఏనుగు గున్నల్లా గున్న ఆ ఇద్దరూ ఆ ప్రాంతానే తచ్చాడుతూ ఉండటం చూసి సుగ్రీవుడికి దడ పుట్టుకొచ్చింది. తనకు కీడు చేసే ఉద్దేశంతో తన అన్న అయిన వాలి వారిని పంపి ఉంటాడనుకుని సుగ్రీవుడు తన మంత్రులైన వానరులతో సహా మతంగాశ్రమంలోకి వెళ్ళి కూచున్నాడు. ఎందుకంటే అక్కడ వారికి వాలి భయం లేదు. వాలి తాలూకు మనుషులు కూడా అక్కడికి రాలేరు.
 
సుగ్రీవుడు తన మంత్రులతో, ‘‘వీరెవరో నారబట్టలు కట్టి, మారు వేషాలు వేసుకుని, పని బెట్టుకుని ఈ అరణ్యంలోకి వచ్చారు. ఎందుకో తెలుసా? వాలే వీరిని పంపి ఉంటాడు,'' అన్నాడు. ఆ మాటలు విని అందరూ భయపడ్డారు. అప్పుడు, సుగ్రీవుడు మంత్రులలో ఒకడైన హనుమంతుడు, ‘‘మీరంతా ఎందుకిలా భయపడుతున్నారో తెలియకుండా ఉంది. ఈ ఋశ్యమూకం మీదికి వాలి రాడు.
 
రాజైన వాడికి ఇలాటి చపలచిత్తం కూడదు,'' అని చెప్పాడు. ఆ మాట విని సుగ్రీవుడు, ‘‘వాలి ఇక్కడికి వచ్చాడని నేననలేదు. ఆ మనుషులను చూడు; పొడుగైన వాళ్ళ చేతులు చూడు, ఆ చేతుల్లో ఉండే కత్తులూ, వారి విల్లంబులూ చూడు! వారిని చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. వాలే వారిని తప్పక పంపి ఉంటాడని నా అనుమానం. వాలి రాజు గనక అతనికి ఎందరో సహాయకులుంటారు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
 
లేకపోతే మనని శత్రువులు మోసగించి నాశనం చేసేస్తారు. వాలి మహాదక్షుడు. అందుచేత నువ్వు మారు వేషంతో వెంటనే వారి వద్దకు వెళ్ళి, వారితో మాట్లాడి వారి రహస్యం ఏమిటో తెలుసుకురావాలి,'' అన్నాడు. తమ రాజైన సుగ్రీవుడి అభిప్రాయం తెలుసుకుని హనుమంతుడు వానర రూపం వదిలి బ్రహ్మచారి రూపం ధరించి రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి, వినయంతో వారికి నమస్కారం చేసి, ‘‘అయ్యలారా, మీరు వ్రతదీక్ష బూని తపస్సు చేసుకునే రాజర్షుల్లాగా కనిపిస్తున్నారు; ఎక్కడో రాజ్యాలేల వలసిన మీరు ఈ పంపా సరోవర ప్రాంతాన, నారబట్టలు కట్టి ఎందుకు తిరుగుతున్నారు? మీరెవరు? మా రాజైన సుగ్రీవుడనే వానరుడు అన్న చేత వెళ్ళగొట్టబడి, దీనుడై తిరుగుతున్నాడు.


నే నాయన మంత్రిని. నా పేరు హనుమంతుడు. నా తండ్రి వాయుదేవుడు. సుగ్రీవుడి కోరికపై నేను ఈ బ్రహ్మచారి రూపు ధరించి ఋశ్యమూక పర్వతం నుంచి వచ్చాను. నాకు కామరూప, కామగమన శక్తులు న్నాయి,'' అని చెప్పాడు. హనుమంతుడి మాటలు వింటూంటే రాముడి ముఖాన ఆనంద రేఖలు గోచరించాయి. అతను లక్ష్మణుడితో, ‘‘ఇతనికి నువ్వే సమాధానం చెప్పు.
 
ఇతని మాటల తీరు చూడగా మంచి భాషా జ్ఞానమూ, పాండిత్యమూ కలవాడుగా కనిపిస్తున్నాడు. ఇలాటి దూతలు గల రాజేరాజు,'' అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడి కేసి తిరిగి, ‘‘హనుమంతుడా, వానర రాజైన సుగ్రీవుణ్ణి గురించి మాకు బాగా తెలుసు. మేమా యనకోసమే వెతుకుతూ వస్తున్నాము. ఈయన మా అన్న రాముడు. ఇతనికి మీ సుగ్రీవుడి సహాయం కావలసి ఉన్నది.
 
సుగ్రీవుడికి ఈయన తిరిగి రాజ్యం ఇప్పించ గలడు,'' అంటూ తమ కథ యూవత్తూ హనుమంతుడికి సవిస్తరంగా చెప్పేశాడు. చిట్టచివరకు, ‘‘రాముడి భార్యను తీసుకు పోయిన రాక్షసుడి జాడ సుగ్రీవుడు చెప్పగలడని కబంధుడి ద్వారా మాకు తెలిసింది. సీతను వెదకటానికి సుగ్రీవుడు మాకు సహాయపడాలి. అడిగిన వారికి అంతులేని దానాలు చేసిన ఈ రాముడు ఈ సహాయం కోసం సుగ్రీవుణ్ణి అర్థిస్తున్నాడు,'' అని లక్ష్మణుడు హనుమంతుడితో అన్నాడు.
 
ఈ మాటలు నోటి వెంట అనటానికి లక్ష్మణుడికి ఎంతో దుఃఖం కలిగింది. హనుమంతుడు లౌక్యంగా, ‘‘మీరు మహానుభావులు. మిమ్మల్నే సుగ్రీవుడు వెతుక్కుంటూ రావలిసింది. ఆయన పుణ్య వశాన మీరే ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. సీతాదేవిని వెతకటానికి సుగ్రీవుడు పూర్తిగా మీకు సహకరిస్తాడు.
 
ఇంక మనం సుగ్రీవుడి వద్దకు పోదామా?'' అన్నాడు. హనుమంతుడు నమ్మదగిన వాడేననీ, అతను నిజమే చెబుతున్నాడనీ తృప్తి కలిగి రామలక్ష్మణులు అతని వెంట వెళ్ళటానికి సిద్ధపడ్డారు. హనుమంతుడు బ్రహ్మచారి రూపు వదిలిపెట్టి వానర రూపం ధరించి, రామలక్ష్మణులను తన వీపు మీద ఎక్కించు కుని ఋశ్యమూక పర్వతానికి వెళ్ళాడు.

సుగ్రీవుడు ఋశ్యమూకం మీద లేడు, మలయపర్వతం మీద ఉన్నాడు; హనుమంతుడు అక్కడికి వెళ్ళి రామలక్ష్మణులు వచ్చి ఉన్నారనీ, సుగ్రీవుడు వచ్చి వారితో స్నేహం చేసుకోవటం లాభకరమనీ చెప్పాడు. రామలక్ష్మణులకు సుగ్రీవుడి వల్ల కావలిసిన సహాయం కూడా వివరించాడు. హనుమంతుడి మాటలు విన్నాక సుగ్రీవుడి భయం తీరిపోయింది, అతను సంతోషించి, తన వానరరూపు విడిచి అందమైన మానవరూపు ధరించి రామలక్ష్మణులను చూడవచ్చాడు.
 
ఆయన రాముడితో, ‘‘మిమ్మల్ని గురించి హనుమంతుడు అంతా చెప్పాడు. మహారాజువైన నువ్వు నా స్నేహం కోరి రావటం వానరుణ్ణయిన నాకు ఎంతో గౌరవం, ఎంతో లాభకరం,'' అంటూ స్నేహ చిహ్నంగా చెయ్యి చాచాడు. రాముడు సుగ్రీవుడి, చేతిని పట్టుకుని తన స్నేహ భావాన్ని అతడికి స్పష్టం చేశాడు. తరవాత రాముడు సుగ్రీవుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు.
 
హనుమంతుడు అరణులు మధించి అగ్ని చేసి, ముందుగా తానా అగ్నిని పూజించి తెచ్చి రామ సుగ్రీవుల మధ్య ఉంచాడు. వారిద్దరూ ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అగ్ని సాక్షిగా మైత్రి చేసుకున్నారు. ఇకనుంచీ ఒకరి సుఖదుఃఖాలు మరొకరివని ప్రమాణం చేసుకున్నారు. సుగ్రీవుడొక మద్దికొమ్మ విరిచి తెచ్చాడు. రాముడూ అతనూ ఆ కొమ్మమీద కూచున్నారు. అలాగే హనుమంతుడొక చందనపు చెట్టుకొమ్మ విరిచి తెచ్చి లక్ష్మణుణ్ణి దానిపై కూచోబెట్టాడు.
 
అప్పుడు సుగ్రీవుడు రాముడితో, ‘‘రామా, నా అన్న అయిన వాలి నాకు అన్యాయం చేశాడు, నా భార్యను అపహరించాడు. వాలి భయంతో ఇలా అడవులు పట్టి తిరుగుతున్న నాకు అభయం ఇవ్వాలి,'' అన్నాడు. ‘‘సుగ్రీవా, నీ స్నేహానికి ప్రత్యుపకారంగా నేను నీ అన్న అయిన వాలిని చంపేస్తాను. అతని చావు నా బాణాలలోనే ఉన్నది,'' అని రాముడన్నాడు.
 
‘‘నీ అనుగ్రహంతోనే నేను రాజ్యాన్నీ, నా భార్యనూ తిరిగి పొందవలసి ఉన్నది. మీరు ఏ పని మీద ఈ నిర్జన వనాల్లో తిరుగుతున్నారో అదంతా హనుమంతుడు చెప్పాడు. నువ్వూ, నీ తమ్ముడూ లేని సమయం చూసి ఒంటిగా ఉన్న సీతాదేవిని బలాత్కారంగా రావణుడు ఎత్తుకుపోయూడు.

తనకు అడ్డు తగిలిన జటాయువును కూడా అతను చంపేశాడు. నీకు త్వరలోనే భార్యావియోగం పోతుంది. సీతాదేవి మూడు లోకాలలో ఎక్కడ ఉన్నప్పటికీ ఆమెను తెచ్చి నీకు అప్పగిస్తాను. ఇప్పుడు నాకు అర్థమయింది, నేనా నాడు చూసినది సీతాదేవినే, సందేహం లేదు. ఏడుస్తూ ఆకాశ మార్గాన పోతున్న సీతను నేను చూశాను. ఆవిడ కూడా నన్నూ, నా వెంట ఉన్న నలుగురు వానర వీరులనూ చూసింది; చూసి, తన ఆభరణాలను పైబట్టలో మూట గట్టి మా కేసి విసిరింది.
 
ఆ ఆభరణాలను ఇంత కాలంగా భద్రంగా ఉంచాము. వాటిని చూసి నువ్వు గుర్తు పట్టవచ్చు,'' అన్నాడు. రాముడీ మాట విని ఆ ఆభరణాలు చూడటానికి తహతహ లాడాడు. సుగ్రీవుడు లేచి ఒక గుహలోకి వెళ్ళి, సీత ఆభరణాల మూటతో తిరిగి వచ్చాడు. మూటను చూస్తూనే రాముడు సీత ధరించిన పైబట్టను గుర్తించి శోకావేశంతో కూలిపోయూడు.
 
అతను కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూ, ‘‘లక్ష్మణా, రావణుడు ఎత్తుకుపోయేటప్పుడు సీత ఆకాశం నుంచి పడవేసిన ఈ పై బట్టా, నగలూ చూడు,'' అన్నాడు. లక్ష్మణుడు సీత ఆభరణాలు చూసి, ‘‘ఈ కేయూరాలూ, కుండలాలూ, హారాలూ నేను గుర్తించలేదు గాని, సీత కాళ్ళకు నమస్కరించేటప్పుడు కనిపించిన అందెలు మాత్రం ఇవే,'' అన్నాడు.

రాముడు సుగ్రీవుడి కేసి తిరిగి, ‘‘నువ్వు చూస్తూండగానే గదా ఆ రాక్షసుడు ప్రాణసమానురాలయిన నా భార్యను ఎత్తుకు పోయూడు! వాడెక్కడికి వెళ్ళాడు? దయచేసి చెప్పు, వాడి ప్రాణాలు తీస్తాను,'' అన్నాడు. రావణుణ్ణి గురించి తనకు ఏమీ తెలియదన్నాడు సుగ్రీవుడు; అయితే సీత దొరక గలందులకు తగిన ప్రయత్నాలన్నీ తాను చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.
 
తరవాత అతను రాముడికి ధైర్యం చెబుతూ, ‘‘వానర మాత్రుణ్ణి అయి ఉండి కూడా నేను భార్య కోసం ఇలా దుఃఖంతో కుంగిపోలేదు. దుఃఖంవల్ల ప్రయోజనం లేదు, పౌరుషం అవలంబించాలి, ధైర్యంగా ఉండాలి,'' అని హితవు చెప్పాడు. ఈ మాటలు విని రాముడు ధైర్యం తెచ్చుకుని, సుగ్రీవుడితో, ‘‘నువ్వు నిజమైన మిత్రుడనదగిన మాట అన్నావు. కష్ట సమయంలో నీలాటి ఆప్తుడు దొరకటం కష్టం.
 
నువ్వు మాత్రం సీతను వెతికే ప్రయత్నం తప్పక చేయూలి. ఇప్పుడు నేను నీకు చెయ్యవలసిన సహాయం గురించి చెప్పు. ఆ సహాయం నా వల్ల అవుతుందో కాదోనన్న సందేహమేమీ పెట్టుకోకు. వాలిని చంపుతానని మాట ఇచ్చానే. అందులో అబద్ధమేమీ లేదు. నేనెన్నడూ అబద్ధమాడినవాణ్ణి కాను,'' అన్నాడు. రాముడి మాటలకు వానరులు పరమానందం చెందారు. తరువాత రామ సుగ్రీవులు ఏకాంతంగా సంభాషించుకుని తమతమ కష్టాలు ఒకరికొకరు చెప్పుకున్నారు.
 
సుగ్రీవుడు రాముడితో, ‘‘నా అన్న వాలి బలశాలి. యువరాజుగా ఉన్న నన్ను తిట్టి, రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. ప్రాణాలకన్న ఎక్కువైన నా భార్యను హరించాడు. నా స్నేహితులను కారాగృహంలో పెట్టాడు. నన్ను చంపే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను పంపిన వానరులను ఎంతమందినో నేను చంపాను.
 
మా అన్న భయంతోనే నేను మిమ్మల్ని చూడగానే మీ ఎదటికి రాలేదు. నాకిప్పుడున్నదల్లా ఈ హనుమంతుడు మొదలైనవారే. వారి చలవవల్లనే నేనింకా బతికి ఉన్నాను. నాకు పరమ విరోధి అయిన ఆ వాలి చస్తే తప్ప నాకు జీవితం లేదు, సుఖం లేదు. ఇది నా విషాదగాథ. కష్టాలు మిత్రులకే చెప్పుకోవాలిగద,'' అన్నాడు.

No comments:

Post a Comment