Sunday, April 19, 2015

తిరుమల కొండలలోని పరమార్థం ఏంటో తెలుసా?

శ్రీ వెంకటేశ్వరుని స్వామి ఆలయం వున్న తిరుమల ఏడుకొండలకు ఆధ్యాత్మికమైన పూర్వచరిత్రలు చాలా వున్నాయి. బ్రహ్మస్థానమైన తిరుమల ఏడుకొండలలో ఒక్కొక్క కొండను ఎక్కడంలో ఒక్కొక్క రహస్యం దాగి వుంది. ఆ ఏడుకొండలను మహర్షులతో పోలుస్తారు. ఆ కొండలలో వున్న చెట్లు, పుట్టలు, పక్షులన్నింటిని మహర్షుల అంశాలుగా విశ్వసిస్తారు ప్రతిఒక్కరు. అటువంటి కొండలలో వున్న పరమార్థం ఏంటో ఒకసారి తెలుసుకుందాం....

1. వృషభాద్రి... అంటే ఒక ఎద్దు. పరాశ్రమశాలియైన పరమశివుడు ఎద్దు పైనే కూర్చుంటాడు. ఆ ఎద్దుకు నాలుగు కొమ్ములు, 3 పాదాలు వుంటాయి. ఆ మూడు పాదాలు భూత, భవిష్యత, వర్తమాన కాలాలను సూచిస్తాయి. తిరుమల కొండలలోని ఈ మొదటి కొండను ఎక్కేవాడు వేద ప్రమాణాన్ని అంగీకరించినవాడుగా తెలుపబడతాడు.

2. వృషాద్రి... అంటే ధర్మం. ధర్మం అంటే.. వేదాలను అనుసరించి మంచిగా వినడం, మంచిగా మాట్లాడటం, మంచిగా అన్ని పనులను నిర్వహించడం. దానివల్ల మానవులు విశ్వంలోనూ, పరలోకంలోనూ పరమ సుఖాలను పొందుతాడు. అంటే తిరుమల కొండలలోని రెండవ కొండను ఎక్కిన వాడు ధర్మాలతో కూడిన పనులను నిర్వర్తించినట్లుగా పరిగణించబడతాడు.

3. గరుడాద్రి... అంటే పక్షి. ఉపనిషత్తుల జ్ఞానాన్ని సొంతం చేసుకోవడం. మానవునిలో వుండే పరమాత్మం ఎప్పటికీ జీర్ణం కానిది, నశించనిది, తరగనిది. శరీరంలో వున్న మిగతా వాటన్నిటికి 6 వికారాలు వుంటాయి. అవి పుట్టింది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందేది, తరిగేది, నశించేది.. ఇవన్నీ పుట్టిన ప్రతి మానవునికి జరుగుతూనే వుంటాయి. కానీ ఈ ఆరు వికారాలు లేనివాడే భగవానుడు. అంటే తిరుమలలో వుండే మూడవ కొండ అయిన గరుడాద్రి ఎక్కితే.. భగవానుడిని జ్ఞానం చేత తెలుసుకోవడం అన్నమాట!

4. అంజనాద్రి... అంజన అంటే కంటికి కాటుక వంటిది. కళ్లతో చూసిన ప్రదేశాల్లో, అంతటా బ్రహ్మయే వున్నాడని తెలుసుకోవడమే కంటికి కాటుక. అంటే తిరుమల కొండలలో నాలుగవ కొండయిన అంజనాద్రిని ఎక్కితే.. బ్రహ్మను గ్రహించినట్లుగా పరగణించబడుతుంది.

5. శేషాద్రి... ఈ యావత్ లోకంలో తనతోపాటు ఇంకొకటి వుందని గ్రహించేవాడికి నిత్యం భయం వెంటాడుతూనే వుంది. అలా కాకుండా ప్రపంచంలో కేవలం బ్రహ్మయే తప్ప మిగతావేమీ లేవు అని అనుకున్నవాడికి ఎటువంటి రాగద్వేషాలు, క్రోధం, కామం, శత్రుత్వం, భయం వుండదు. ఎప్పుడూ ఒకేలా వుండటమే బ్రహ్మం. శేషాద్రి కొండను ఎక్కితే.. అటువంటి స్థితిని గ్రహించినట్లే అవుతుంది.

6. వెంకటాద్రి... ఇందులో వెం అంటే పాపాలు, కట అంటే తీసివేయడం... అంటే పాపాలను తీసివేయడం. లోకంలో జరుగుతున్న వాటన్నింటికీ కారణం కేవలం బ్రహ్మే. అటువంటి బ్రహ్మ గురించి తెలిసినవాళ్లు పిచ్చివాళ్లులాగా ప్రవర్తిస్తారు. రామకృష్ణ పరమహంస కూడా ఇటువంటి పిచ్చి పరిస్థితి ఎప్పుడు వస్తుందోనని నిత్యం తలుచుకునేవాడు. అంటే ఇక్కడ జ్ఞాని, పిచ్చివాడి స్వభావం, అర్థం ఒకేలా వుంటుంది. ఇద్దరూ పరబ్రహ్మను గ్రహించగలరు. వెంకటాద్రి కొండను ఎక్కితే.. ఇటువంటి పరిస్థితిని పొందినట్లుగా అర్థం.

7. నారాయణాద్రి... అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మంగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడమే ఈ నారాయణాద్రి.

No comments:

Post a Comment