Sunday, April 19, 2015

భద్రాచలం ఆలయ విశేషాలు...

పవిత్రమైన గౌతమీనదీ తీరాన శ్రీరామచంద్రుడు-సీతా-లక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతమే భద్రాద్రి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా.. చేసిన తమ పాపాలన్నీ తుడిచిపోవడమే గాక స్వామివారి కృపకు పాత్రులవుతారు. కేవలం రామనామం జపించిన ముక్తిమార్గం కలుగుతుందని నమ్ముతారు. అంతటి పవిత్రమైన క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం....

ఇక్కడ శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్బుజుడుగా వెలిశారు. ఈ క్షేత్రంలో ఇంకో ప్రత్యేకతేమిటంటే.. శ్రీరాముడు పశ్చిమానానికి అభిముఖంగా వుంటూ, దక్షిణాన ప్రవహిస్తున్న గోదావరి నదిని వీక్షిస్తుంటాడు. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. దీని గురంచి బ్రహ్మాండపురాణంలో, గౌతమీ మహత్యంలో ప్రస్తావన వుంది.

స్థలపురాణం -

శ్రీరాముడు వనవాస సమయంలో కాసేపు సేద తీర్చుకోవడానికి ఈ ప్రాంతంలో వుండే ఒక బండరాయిమీద కూర్చున్నాడట. సేద తీరిన తర్వాత ఆ బండరాయిని అనుగ్రహించి.. ‘మరో జన్మలో నువ్వు మేరుపర్వత పుత్రుడు బద్రుడుగా జన్మిస్తావు. అప్పుడు నీ కొండపూనే నేను శాశ్వతనివాసం వుంటాను’ అని వరమిచ్చాడట. దీంతో ఆ రాయి భద్రునిగా జన్మించి శ్రీరాముడి కోసం తపస్సు చేయసాగాడు. దీంతో శ్రీరాముడు భద్రున్ని అనుగ్రహించి భద్రగిరిపై వెలిసి ఒక పుట్టలో వున్నాడట. కాలక్రమంలో శబరి శ్రీరాముడు అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో పరమ రామభక్తురాలుగా వుంటూ ఎప్పుడూ రామనామస్మరణం చేస్తుండేది. ఒకరోజు కలలో.. ‘నేను భద్రగిరిపై ఎండకు ఎండి, వానకు తడిసి వుంటున్నాను. నాకు ఏదైనా నీడ నిర్మించు’ అని ఆదేశించాడట. దమ్మక్క ఆ ఉదయమే స్వామి చెప్పిన ప్రాంతానికెళ్లి చూస్తే.. పుట్టలో వేంచేని వున్నాడట. పుట్టను శుభ్రంచేసి తాటాకులతో తనకు చేతనయినట్టు ఒక పందిరి వేసి, అందులోనే విగ్రహాలను వుంచి పూజలు నిర్వహించేదట.

భద్రారెడ్డి పాలెంకు కూతవేటు దూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న. చిన్నతనం నుండి ఇతను శ్రీరామభక్తుడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బంధువైన అక్కన్న తానిషా ప్రభువు దగ్గర మంత్రిగా వుండటంతో గోపన్నను పాల్వంచప్రాంతానికి తహశీలుదారుగా నియమించాడు. ఆ పరగణాలోనే వున్న భద్రగిరి ప్రాంతంను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి.. పన్నులుగా వసూలయిన ధనంతో రామాలయంను నిర్మించాడట. దీంతో తానిషా కోపోద్రిక్తుడై గోపన్నను చరసాలలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తాడు. తరువాతి రోజుల్లో తానిషాకు రామచంద్రుడు అనుగ్రహించి లక్ష్మసమేతుడై కలలో కనిపించి తన కాలంనాటి రామమాడలను చెల్లించాడట. తానిసా ఒక్కసారిగా మేలుకుని చూడగా.. ఆలయానికి గోపన్న ఎంత డబ్బయితే వాడాడో అంతసొమ్ము రాశిగా వేసి వుందట. దీంతో తన తప్పును తెలుసుకున్న తానిషా గోపన్నను ఖైదునుండి విడుదల చేసాడట. గోపన్న ఎప్పుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్దికెక్కాడు. ఆ సమయంలో గోపన్న నిర్మించిన ఆలయమే ప్రస్తుతం భద్రాచలంలో వున్న ఆలయం. ఇదీ ఆ ఆలయానికి వున్న చరిత్ర.. తానిషా ప్రభువు శ్రీరాముని యొక్క లీలలు చూసినప్పటినుండి ప్రతీయేటా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి వచ్చి, ముత్యాల తలంబ్రాలు సమర్పించేవాడట. ఈ ఆనవాయితీ ఇప్పటికూడా జరుగుతుంది. రాష్ట్రప్రభుత్వం నుండి స్వామివారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి అందజేస్తారు.

భద్రాచలంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలు - పండుగలు

శ్రీరామనవమి - స్వామివారి ఆలయంలో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం. చైత్రశుద్ధ నవమినాడు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబొట్టును రామదాసు చేయించాడు. ఇప్పిటికీ ఆ మంగళసూత్రాన్నే వినియోగిస్తున్నారు. కళ్యాణ సమయంలో అప్పటి తానిషా ప్రభుత్వ సంప్రదాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందజేస్తుంది. ఈ కళ్యాణానికి తరించడానికి రాష్ట్ర నలమూలల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.

వైకుంఠ ఏకాదశి - వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైంది. ఈ వేడుకను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. ఏకాదశికి గోదావరిలో నిర్వహించే తప్పోత్సవం, ఉదయం 5 గంటలకు జరిగే వైకుంఠ ద్వార దర్శనం చూసేవారికి ఎంతో నయనానందకరంగా వుంటాయి.

వాగ్యేయకార మహోత్సవం - భక్తరామదాసు పేరు మీద 1972 నుండి వాగ్యేయకార మహోత్సవాలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి.


భద్రాచలంలో చూడవలసిన ఇతర ఆలయాలు -

1. గోవిందరాజులస్వామి ఆలయం

2. నరసింహస్వామి ఆలయం

3. యోగానంద నరసింహస్వామి ఆలయం

4. శ్రీరామదాసు ద్యానమందిరం

5. రంగనాయక స్వామి ఆలయం

6. వేణుగోపాలస్వామి ఆలయం

7. హరనాద ఆలయం

ఇంకా భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో వర్ణశాల వుంది. రాముడు వనవాస సమయంలో ఇక్కడే వున్నాడట. ఈ ప్రాంతో ఎంతో ప్రకృతి రమణీయంగా వుంటుందని భక్తులు ఆహ్లాదంగా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ పర్ణశాలలో వనవాస సమయంలో జరిగిన సన్నివేశాలు శిలాల రూపంలో మనకు కనిపిస్తాయి. దీనికి పక్కనే వేణుగోపాలస్వామి ఆలయం కూడా వుంది. ఇక్కడే ఒక వాగు గోదావరి నదిలో ఐక్యమవుతుంది. ఈ వాగు గట్టు మీదే సీతమ్మవారు స్నానంచేసి తన నార చీరలను ఆరేసుకునేందట. అందుకే ఈ వాగును సీతమ్మవాగు అంటారు. విశేషమేమిటంటే ఇప్పటికీ ఆవిడ ఆరేసిన ప్రాంతంలో చీర గుర్తులు 20 అడుగుల మేర కనిపిస్తాయి. ఇంకా అమ్మవారు కుంకుమకు ఉపయోగించుకున్న రాళ్లను కూడా అక్కడ చూడొచ్చు.

No comments:

Post a Comment