Sunday, April 19, 2015

శ్రీశైలం మల్లన్న ఆలయ విశేషాలు

భక్తుల కోర్కెలను తీర్చుతూ వారిపాలిట కొంగు బంగారమై వున్న మల్లికార్జునస్వామి.. భ్రమరాంబా సమేతుడై శ్రీశైలముపై కొలువైవున్నాడు. భారతదేశంలోని ద్వాదశజ్యోతిర్లింగాలలో పవిత్రమైన క్షేత్రాలలో ఇదొకటి. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో భ్రమరాంబికా అమ్మవారిపీఠం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఈ క్షేత్రాన్ని దక్షిణకాశీ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా ముక్తి కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో వుంది. అలాగే శ్రీశైలం శిఖరం సముద్రమట్టానికి 2300 అడుగుల ఎత్తులో వుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ నివసిస్తున్న కొండజాతివారు మల్లన్నను తమ అల్లుడిగాను, భ్రమరాంబికా అమ్మవారిని తమ కూతురిగాను భావిస్తారు. ఇక్కడ జరిగే పూజలలో కూడా వీలు పాలుపంచుకుంటారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించే రధోత్సవంలో వీరే రథాన్ని లాగుతారు. ఈ స్వామివారి ఆలయాన్ని తరాతరాలనుంచి శాతవాహనములు, పల్లవులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, విజయనగరాధీశులు ఇలా ఎంతోమంది అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈ ఆలయం గురించి అనేక పురాణాల్లో, పుస్తకాల్లో ప్రస్తావన వుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన వనవాస సమయంలో సీతా సమేతుడై స్వామివారిని దర్శించుకున్నాడట. అలాగే ద్వాపరయుగంలో పాండవులు కూడా స్వామివారిని దర్శించుకునేవారట.

స్థలపురాణం -

ఈ ప్రాంతంలో పూర్వం శిలాదుడనే మహర్షి ‘వరం’ కోరుకోవడం కోసం పరమశివుని గురించి ఘోరతపస్సు చేయగా... శివుడు మహర్షి తపస్సునకు మెచ్చి, ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. దీంతో శిలాదుడు ‘నీ అంశతో నాకు పుత్రులను ప్రసాదించు’ అని వరం కోరుకున్నాడు. శివుడు తనకు వరం ప్రసాదించి అక్కడినుంచి అంతర్దానమయ్యాడు. స్వామివారి వరప్రసాదంగా శిలాదునికి నందీశ్వరుడు, పర్వతుడనే ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిద్దరిలో పర్వతుడు మళ్లీ శివునిపై తపస్సు చేయగా.. స్వామి ప్రత్యక్షమై ఏమి కావాలో అడగగా.. పర్వతుడు స్వామికి దైవంగా నమస్కరించి ‘నువ్వు నన్ను పర్వతంగా మార్చి నాపై కొలువుండే వరం ప్రసాదించు’ అని వరం కోరాడు. అడిగిందే తడువుగా వరాలిచ్చే బోళాశంకరుడు ‘సరే’ అని అక్కడే వుండిపోయాడు. దాంతో కైలాసంలో వున్న పార్వతీదేవి, ప్రమదగాణాలు కూడా స్వామివారి బాటనే పట్టి ఇక్కడే కొలువైవున్నారు.

ఇక్కడ పరమశివుడు మల్లికార్జునిగా, పార్వతీదేవి భ్రమరాంబికా దేవిగా స్వయంభువులుగా వెలిశారు.  స్వామివారైన మల్లికార్జునని పిలవడానికి ఇంకో కథ కూడా ప్రచారంలో వుంది. పూర్వం చంద్రవంశరాజైన చంద్రగుప్తిని కుమార్తె చంద్రవతి శివుని పరమభక్తురాలు. ఆమె ఎప్పుడూ పరమశివుని ద్యానంలోనే ఎక్కువ కాలం గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీసమేతుడై, సాక్షాత్కరించి వరం కోరుకొమ్మని అడిగాడు. అప్పుడు చంద్రవతి ‘స్వామి నేను మీ శిరముపై వుంచిన మల్లెపూలదండ ఎన్నటికీ వాడిపోకుండా వరం ప్రసాదించు’ అని అడిగింది. ఆ సమయంలో శివుడు ఆ మల్లెపూదండను శిరముపై ‘గంగా, చంద్రవంక’ల మధ్య ధరిస్తాడు. ఇలా తలపై మల్లెపూదండ ధరించాడు కావున స్వామిని మల్లికార్జునుడయ్యాడని ప్రతీది.  అదేవిధంగా పార్వతీదేవిని అరుణాశురుడనే రాక్షసుడు.. సాధుజనులను బాధలు పెడుతుంటే అది చూసి సహించలేని అమ్మవారు కోపోద్రిక్తురాలై, భ్రమరూపిణి రూపం దాల్చి నాదంచేస్తూ ఆ రాక్షసుడ్ని సంహరించింది. అమ్మవారు భ్రమరూపం దాల్చి దుష్టసంహారం చేశారు కనుక భక్తులు ఆమెను భ్రమరాంబికాదేవిగా కొలుస్తారు.

శ్రీశైల క్షేత్రంలో చూడదగిన ప్రదేశాలు

శ్రీశైల శిఖరం, ఇష్టకామేశ్వరీ ఆలయం, హాజకేశ్వరం, అక్కమహాదేవి గుహలు, సాక్షిగణపతి ఆలయం, కడలీవనం, పంచమటాలు, నాగలూటి, పాలదార, భ్రమరాంబా చెరువు, పంచదార, సర్వేశ్వరం, కైలాసద్వారం, గుప్త మల్లికార్జునం, భీమును కొలను... ఇవేకాకుండా శ్రీశైలక్షేత్రం చుట్టూ విస్తరించి వున్న దట్టమైన నల్లమల అభయారణ్యం విస్తరించి వుంది. చుట్టూ పక్షుల కిలకిలరావాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. అంతేకాకుండా దగ్గరలో వున్న శ్రీశైలం డేమ్ చూడడానికి రెండు కళ్లూ చాలవు.

No comments:

Post a Comment