Saturday, April 18, 2015

శ్రీపద్మ పురాణము

ఒకప్పుడు శౌనకాది మహా మునులున్న నైమిశారణ్యమును సకల పురాణవేత్తయైన సూతుడు వచ్చెను. అతడు, పృథుచక్రవర్తి చేసిన యాగములో హవిస్తులు తారుమారగుట చేత అగ్నికుండము నుండి పుట్టి, వ్యాసుని శిష్యుడై సర్వపురాణములను రహస్యార్థములతో నేర్చుకొని ఆందరకును జెప్పుచు, పులకరింప జేసెడివాడు. అందుచే రోమహర్షణుడని పేరొందెను.

అతనిని మహర్షులు ఆదరించి, ‘‘విష్ణువు నాభినుండి పుట్టిన పద్మము విషయమును, విష్ణువు మహత్త్వమును దెలిపెడి పురాణము నొకదానిని మాకు జెప్పు’’ మని యడిగిరి. సూతు డిట్లు చెప్ప నారంభించెను. ‘‘మునులారా! పద్మపురాణమని ఒక మహాపురాణము గలదు. కల్పాంతరమునందు జగము లన్నియు మహావర్ణమై, తిరిగి కల్పము మొదలైనప్పుడు మత్స్యరూపుడైనమాధవుని చేత వేదములతోపాటు ఈ పురాణము గూడ ఉద్ధరింపబడినది.

శ్రీహరి నాభినుండి మొలచిన పద్మము యొక్క విశేషములను జెప్పుచుండుట చేతను, పద్మకల్పమున జరిగిన విశేషములను వర్ణించుట చేతను పద్మపురాణమని ప్రసిద్ధినొందెను. దీనిని విన్న వారికి జన్మ జన్మాంతర పాపములు నశించి మోక్షము గలుగును’’.

త్రిపుర సంహారము -

పూర్వము బాణాసురుడను రాక్షసుడు శివునారాధించి, ‘‘త్రిభువనేశ్వర’’మను లింగమును సంపాదించి పూజించెడివాడు. అతనికి ప్రథానపురములు మూడుండెడివి.

అవి ఆకాశములో విమానముల వలె తిరిగెడివి. అతడు వానిపై దిరుగుచు మునుల యజ్ఞములను, తపములను చెడగొట్టుచుండెను. దేవతలు భయభ్రాంతులై శివునితో చెప్పుకొనిరి. శివుడు నారదుని బిలిచి ‘‘బాణునకీ శక్తి, వాని భార్యల పాతివ్రత్యము వలన గలిగినది. వారెప్పుడును భర్తనుగూర్చియే ధ్యానము చేయుచుందురు. నీవు వారి దృష్టిని వ్రతదానముల మీదకు మరలించితివేని బాణుని మనము సాధింపగలము’’ అనగా విని నారదుడు, రాణుల య:తపురము జేరి వారిచేత పూజలొంది, వ్రతముల మహత్త్వమును, దానముల వలన పుణ్యములను వర్ణించెను.

పట్టపురాణి అనౌపమ్య ‘‘మునీంద్రా! వ్రతములలోను, దానములలోను ఉత్తమమైనవానిని చెప్పు’’మని యడిగెను. మిగిలిన రాణులును ఆసక్తి చూపిరి. నారదుడు తన పథకము పారినందుకు సంతోషించును. ‘‘వేదవేత్తయైన భూసురునకు తిలధేను దానము (చిమ్మిలితో చేసిన ధేనువు కావచ్చును లేదా తిలలతో సహా గోదానము కావచ్చును) చేసినతో అక్షయమైన స్వర్గభోగములు గలుగును. ఉపవాసవ్రతము చేసి యీ దానమిచ్చినచో స్వర్గము నీ చేతిలో నున్నట్లే’’ అని చెప్పి బయలుదేరుచుండగా ఆమె ‘‘మహాత్మా! నీవే ఆ దానము పుచ్చుకొని మమ్ము తరింప జేయరాదా?’’ అని యడిగిరి.

‘‘అమ్మా, నేను బ్రహ్మచారిని, తపస్విని, ఇవన్నియు నాకెల? ఒక కుటుంబికుని చూచి యిచ్చి మంచిది’’ అని వెళ్లిపోయెను. రాణుల మనస్సులు భర్తృచింతన మాని వ్రతదానములపై బడెను. దానితో త్రిపురములందును ఎన్నో విపరీతములు పుట్టెను. (‘‘తిలా:పునంతుమే పాపం’’ అని శ్రుతి. తిలలు సర్వపాపములను బోగొట్టును. అందుకే పీడ తొలగుటకు తిలదానము చేయుదురు.) శివుడు, మేరువును, ధనస్సునుగాను, విష్ణువును బాణమునుగాను, బ్రహ్మనుసారథిగాను జేసి కొని భూమి రథముకాగా, విల్లెక్కుపెట్టి, త్రిపురములును ఒక వరుసలోనికి ఎప్పుడు వచ్చునా యని యెదురు చూచుచు, అట్లు రాగానే బాణమును ప్రయోగించెను.

వరుసగా రెండు పురములు అగ్నిదగ్ధము లయ్యెను. వెంటనే బాణాసురుడు వచ్చి ‘‘దేవా! నీ వరప్రాసాదము వలన లభించిన పురముల నేల భస్మము చేయుచున్నావు? నన్ను చంపదలచినచో చంపుము. కాని నా త్రిభువన లింగమును కాపాడుము’’ అనగా శివుడు, ‘‘నీ పురములందు సాధుపీడ జరుగుచున్నందున ఇట్లు చేయవలసి వచ్చినది. అది మానినచో నిన్నొక్క పురముతో బ్రతుకనిచ్చెదను’’ అనగా శివుని యాజ్ఞపై బాణుడు దుర్మార్గ కృత్యములు మానెను.

వానిని శివుడు దయతో ‘‘ఒక్క పురముతో బ్రతుకు’’మని పంపివేసి, కాలిన రెండు పురములలోనొకదానికి అమరకంటకమున (అమరావతిలో) పడునట్లును, రెండవదానిని శ్రీశైలములో బడునట్లును చేసెను. బాణాసురుడు శివ భక్తుడై సజ్జనులను పీడించుటమానెను. (స్థూల, సూక్ష్మ కారణ దేహములను నశింపజేసి, తన భక్తులకు భగవానుడు మోక్షము ననుగ్రహించునని అంతరార్థము).

ధర్మదేవుడు శాపము నొందుట-

ఒకప్పుడు ఆత్రిపుత్రుడైన దూర్వాసుడు ధర్మస్వరూపమును దర్శింపగోరి ధర్మదేవతను గూర్చి తపముచేసెను. పదివేల యేండ్లు గడిచినవి. ధర్మదేవత (యముడు కాడు) ప్రత్యక్షము కాలేదు. దూర్వాసునికి కోపమువచ్చి ధర్మదేవుని శపించుటకు సిద్ధపడెను. అప్పుడాయన ప్రత్యక్షమై ‘‘నీవంటి కోపిష్ఠి వానికి తపస్సు ఫలించునా?’’ అనగా దూర్వాసుడు ‘‘నీవెవ్వడ’’వని యడిగెను.

ధర్ముడు ‘‘నేను ధర్మమూర్తి’’ననెను. దూర్వాసుడు మహాక్రోధముతో ‘‘నా కోపమును నీ వార్పగలవా? పదివేలేండ్లు గడిచిన తర్వాత ఇప్పుడు మేము కనబడితిమా? ఇన్నాళ్లు మాకు ప్రత్యక్షము కాకుండా ఏమి చేయుచున్నావు? ఇప్పుడైనను నా కోపమునకు జడిసి ప్రత్యక్షమైట్లు కనబడుచున్నది. నీవు ఇంత దుర్మదాంధుడ వైబ్రాహ్మణాపచారము ఒక రాజువై, ఒక చండాలుడవైపుట్టుము’’ అని శపించి లేచిపోయెను. ఆ శాపము వలన విదురుడుగాను, పాండు కుమారులలో జ్యేష్ఠుడైన ధర్మరాజుగాను, కాటికాపరితనము చేసిన హరిశ్చంద్రుడుగా ధర్మమూర్తి జన్మించెను.

సీతాదేవికి చిలుక శాపం :

అదిమిథిలానగరంలోని అంత:పురం స్త్రీల ఉద్యానవనం. సీతాదేవి చెలికెత్తెలతో విహారానికి వచ్చింది. ఒక చెట్టుమీద చిలుకలు ముచ్చటలాడుకొంటున్నాయి. అవి వాల్మీకి ఆశ్రమం నుంచి వచ్చినవి. మగచిలుక ‘‘ఈ దేశపు రాజుగారికే సీత నాగటిచాలలో దొరికిందట. ఆమెను శ్రీరాముడు శివధనుర్భంగం చేసి పెళ్లాడాడు’’ అని భార్యకు చెబుతున్నాడు. అది విన్న సీత, ఆ రెండు చిలుకలను పట్టి ఇలా అడుగుతుంది.

‘‘మీరు ఎవరిగురించి మాట్లాడుకుంటున్నారు? సీతను నేనే. నా గురించేనా? ఆ రాముడెవడో చెప్పు. ఈ విషయాలు మీకెలా తెలుసు?’’ అని అడగగా.. ‘‘మేము వాల్మీకి ఆశ్రమంలో వుండేవాళ్లం. విహారం చేయడానికి ఇక్కడికి వచచాం. వాల్మీకి రామాయణం అనే ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు. అందులోని కథనే చెబుతున్నాను. రాముడు అయోధ్యకు యువరాజు’’ అని చెప్పి, ‘‘మమ్మల్ని వదిలేయ్’’ అని ప్రార్థించాయి. ‘‘ఆ శుభకార్యం జరిగిన తరువాతే మిమ్మల్ని విడిచిపెడతాను’’ అని సీత అంటుంది.

అప్పుడు ఆ చిలుకలు ‘‘మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్లం. పంజరంలో వుండలేము. అంతేగాక నా భార్య చూలాలు. శ్రమకు ఓర్వలేదు. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు’’ అని కోరుతుంది.

సీత.. ‘‘అయితే ప్రసవం అయ్యేంతవరకు ఆడచిలుక నా దగ్గరే వుంటుంది. నువ్వు వెళ్లు’’ అని మగచిలుకను అంటుంది. అప్పుడది.. ‘‘తల్లీ! దీనిని విడిచిపెట్టి నేను బ్రతకలేను. కరుణించి మమ్మల్ని విడిచిపెట్టు’’ అని దీనంగా ప్రార్థించింది. కానీ సీత వినలేదు.

ఆడచిలుక సీతతో... ‘‘నా భర్త నన్ను విడిచి బ్రతకలేనంటున్నాడు. నేను అతనిని విడిచి వుండలేను. కాబట్టి మమ్మల్ని దయతో వదిలేయ్’’ అని అడుగుతుంది. అప్పటికీ సీత వారి మాటలను పట్టించుకోదు.

ఆ సమయంలో మగచిలుక ఆవేదనతో ఏడుస్తూ వుంటుంది. తన ఆవేదనను చూసి ఆడచిలుక గుండె పగిలి, సీతను చూసి ‘‘నువ్వెంత కఠినురాలివి. గర్భవతినైన నన్ను, నా భర్తనుండి విడదీశావు. కాబట్టి నువ్వు కూడా గర్భవతివైనప్పుడు నీ భర్తను ఎడబాసి దు:ఖపడతావు’’ అని శపించి.. తన ప్రాణాలను విడిచిపెడుతుంది.

మగచిలుక.. ‘‘నా భార్యను అన్యాయంగా చంపావు. కాబట్టి నిన్ను నీ భర్త విడిచిపెట్టడానికి మూలకారకుడైన చాకలివాడగా జన్మించి.. పగ తీర్చుకుంటాను’’ అని వెళ్లి, గంగానదిలో పడి మరణిస్తుంది. ఇలా ఇవి శపించడం వల్లే శ్రీరాముడు సీతను అడవిలో విడిచివెళ్లడానికి కారణం.

పూర్వకల్పంలో రామాయణం :

ఈ రామాయణం పద్మకల్పానికి పూర్వమయిన వైరాజకల్పంలోని కథ. అప్పుడు రాముడికి జాంబవంతుడు ఆ కథను వినిపించాడు.

దశరథుడు అనే రాజుకు కౌసల్య, సుమిత్ర, సురూప, సువేష అని నలుగురు భార్యలు వుండేవారు. ఆ రాజుకు ఒకే కొడుకు. అతడు కూడా వేటకు వెళ్లి, అక్కడ ఓ భల్లూకం దెబ్బకు మరణిస్తాడు. ఇక ఆ రాజుకు ఏ సంతానం వుండదు. తరువాత దశరథుడు సాధ్యరాజుపై దండెత్తి, అతనిని ఓడించి బంధిస్తాడు. అతని కొడుకయిన భూషణుడు ఆ రాజును ఎదిరించగా.. అతనిని కూడా బంధిస్తాడు. ఆ భూషణుడ్ని చూసి దశరథుడికి చనిపోయిన తన కొడుకు గుర్తుకు వస్తుంటాడు.

అప్పుడు దశరథుడు.. ‘‘ఏ వ్రతం చేసి ఇటువంటి కొడుకును గన్నావు’’ అని సాధ్యరాజును అడుగుతాడు. ‘‘ఏడాదిపాటు ఏకాదశీవ్రతం చేసి విష్ణువు దయవల్ల ఇతడిని కన్నాను’’ అని అతడు చెప్పగా.. వారిని సత్కరించి దశరథుడు విడిచిపెట్టేస్తాడు.

ఆ తర్వాత దశరథుడు కూడా ఏకాదశీవ్రతం చేసి పూర్ణాహుతి చేయగా... చతుర్భుజుడైన యజ్ఞపురుషుడు ఆ అగ్నింకుండంలో నుంచి బయటకు వచ్చి వరం కోరుకోమని చెబుతాడు. అప్పుడు దశరథుడు ‘‘నాకు నలుగురు కొడుకులు కావాలి’’ అని కోరుకుంటాడు.

అతడు ఆ వరాన్ని ఆ రాజుకు ప్రసాదించి, చరు (అన్నం) పాత్రలో లీనమైపోతాడు. అది తిన్న రాణులు నలుగురు పుత్రులను కంటారు. కౌసల్యను రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, సురూపకు భరతుడు, సువేశకు శత్రఘ్నుడు అని నలుగురు కొడుకులు పుడతారు.

అలా పుట్టిన ఆ నలుగురు పెరుగుతుంటారు. ఒకనాడు వీరందరూ కలిసి ఆడుకుంటుండగా.. రామునికి ఒక బ్రహ్మరాక్షసుడు ఆవహిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు మంత్రోదకం రాముడిపై చల్లగా.. అతడు ఈవలకు వచ్చి, నమస్కరించి.. ‘‘నేను వేదశాస్త్రాలు చదువుకొన్న విప్రుడిని. అడిగిన విద్యార్థులకు చెప్పక.. ఇలా బ్రహ్మరాక్షసుడినయ్యాను. రాముడిని ఆవహించడం వల్ల నాకు మోక్షం లభిస్తుందని ఇలా చేశాను. నన్న అనుగ్రహించు’’ అని అంటాడు.

వశిష్ఠుడు.. ‘‘గంగలో మునిగి విశ్వనాథుడిని సేవించు. నువ్వు ముక్తి పొందుతావు’’ అని అంటాడు. తరువాత దశరథుడు తన బిడ్డలను ఉపనయనం చేసి, వేదశాస్త్రాలు, క్షత్రియోచిత విద్యలను నేర్పిస్తాడు.

రాముడికి పెళ్లి చేయాలని అనుకుని అందరి రాజులకు విషయాన్ని పంపుతాడు. మిథిలాపతియైన విదేహుడు, తనకు యజ్ఞాగ్ని కుండంలో దొరికిన సీతను ఇచ్చి వివాహం చేస్తానని బ్రాహ్మణులను పంపిస్తాడు. వారికి పెళ్లి నిశ్చయమౌతుంది. దశరథాధులు వివాహం చేయడం కోసం తరలి వెళ్లారు.

ఆ సమయంలో నారదుడు విదేహుని దగ్గరకు వచ్చి.. ‘‘మీ వంశాచారం ప్రకారం స్వయంవరం నిర్వహించాల్సింది పోయి ఇలా చేశావేంటి? ఇలా చేయడం ఆచారానికి తప్పు’’ అని అంటాడు. అప్పుడు దశరథుని అనుమతితో విదేహుడు తన కుమార్తెకు స్వయంవరం చాటిస్తాడు. రామునికి పిల్లనిచ్చే భాగ్యాన్ని కలిగించు, గౌరవం కాపాడు అని శంకురన్ని ప్రార్థిస్తాడు.

శంకరుడు ప్రసన్నుడై ఒక విల్లును ఇచ్చి.. ‘‘దీనిని ఎక్కుపెట్టిన వారికి సీతనిచ్చి పెళ్లి చేయు’’ అని అదృశ్వయమవుతాడు.

సీతను మనువాడడానికి స్వయంవరానికి వచ్చిన రాజులందరూ వచ్చి ఆ విల్లును కదిలించలేక భంగపడతారు. చివరికి విశ్వామిత్రుడు కూడా ఆ విల్లును కదిలించలేకపోతాడు. కానీ శ్రీరాముడు విల్లును ఎక్కుపెట్టగా సీత అతనికి వరిస్తుంది. అది చూసిన దేవ, దానవ, మానవనాథులందరూ రాముడి మీద దాడిచేస్తారు. రాముడు వారందరినీ ఓడించి, సీతను పెండ్లాడి, తన స్వనగరానికి చేరుకుంటాడు.

దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేస్తుండగా.. సురూప దశరథునితో ఒక వరాన్ని కోరుకుంటుంది. వశిష్ఠుడు రాజుతో.. ‘‘నీ కొడుకు భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన మాధవుడే’’ అని చెప్పి, రామునికి వనవాసానికి అనుమతించు అని కోరుకుంటాడు.

అలా రాముడు, సీతా లక్ష్మణులతో వనవాసానికి బయలుదేరుతాడు. అక్కడ రావణుడు సీతను అపహరిస్తాడు. ఆమెకోసం వెదుక్కుంటూ వెళ్లిన రాముడు.. మార్గమధ్యంలో ఒక చెట్టుమీద కూర్చున్న కోతిని చూసి.. ‘‘నువ్వెవరివి’’ అని అడుగుతాడు. ఆ వానరుడు ‘‘నేను హనుమంతుడిని. సుగ్రీవుడనే వానరాజుకు బంటును’’ అని చెబుతాడు. అప్పుడు రాముడు ‘‘మీ రాజును చూడాలి’’ అని అంటాడు. అప్పుడు హనుమ రాముడిని సుగ్రీవుడి దగ్గరకు తీసుకెళ్తాడు. ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకుంటారు. అప్పుడు సుగ్రీవుడు దగ్గర వున్న సీత నగలను రాముడికి చూపిస్తాడు. పరస్పరం సహాయం చేసుకోవడానికి ప్రతిజ్ఞ చేసుకుంటారు.

మొదట వాలి, సుగ్రీవుల యుద్ధంలో రాముడు వాలిని కొడతాడు. అప్పుడు తార వచ్చి రామునిని చూసి.. ‘‘నువ్వు క్షత్రియ ధర్మాన్ని ఎలా పాడు చేశావు? సుగ్రీవుని రాజ్యాన్ని, భార్యను అపహరించినందుకు వాలిని శిక్షించావు కదా! సుగ్రీవుడు చేసింది మాత్రమేమి? అరవైవేల ఎనభై సంవత్సరాల కిందట, వాలి దుందుభితో పోరాడుతూ ఒక బిలంలో వుండిపోయాడు. సుగ్రీవుడు గుహను మూసేసి వచ్చి నన్ను, వాలిరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఏడాది గడిచింది. వాలి దుందుభిని చంపి తిరిగి వచ్చాడు. ఆనాడే నీ తండ్రి దశరథుడు కూడా రాజ్యాభిషిక్తుడయ్యాడు. వాలి, సుగ్రీవుడు చేసిన దానికి ప్రతీకారంగా, వాడి భార్యను,రాజ్యాన్ని అపహరించాడు. ఇప్పుడు వాలిది తప్పైతే. అప్పుడు సుగ్రీవుడిది కూడా తప్పు కాదా? అతనినెందుకు చేరదీశావు?’’ అని నిలదీస్తుంది.

రాముడు.. ‘‘ఆనాడు రాజు చేయవలసిన పని అది. ఇప్పుడీ అధర్మాన్ని చేసిన వాలిని శిక్షించుట నా ధర్మం’’ అని ఆమెకు సమాధానం ఇచ్చి.. వాలికి మోక్షమిచ్చి.. సుగ్రీవునికి రాజ్యమిస్తాడు. అతడు హనుమంతుడిని పిలిచి, సీత ఎక్కడుందో తెలుసుకొని రమ్మని పంపిస్తాడు.

అప్పుడు హనుమంతుడు ఒక్క గంతులోనే సముద్రాన్ని దాటి, లంకలో వున్న సీతను వెదికి, ఆమెకు ధైర్యం చెబుతాడు. లంకనుండి తిరిగి వస్తూ.. లంకను కాల్చి, అక్కడున్న రాక్షసులను చంపి సీతగురించి రామసుగ్రీవులను చెబుతాడు.

రాముడు వానరసేనతో సముద్రానికి వచ్చి, ఈశ్వరుడిని ప్రార్థిస్తాడు. అతడు ప్రత్యక్షంకాగా.. లంకకు చేరుకోవడానికి ఉపాయం చెప్పమని అడుగుతాడు. శివుడి చేతిలో వున్న వింటిని సముద్రం మీద వంతెనగా వేసి, దానిపై నుంచి నడిచి లంకకు వెళ్లవచ్చు అని చెబుతాడు. రాముడు అలాగే చేస్తాడు. లంకకు చేరుకున్న, వానరులకు, రాక్షసుల మధ్య ఘోరయుద్ధం జరుగుతుంది. ఇంద్రజిత్తుడు లక్ష్మణుడి చేతిలో చనిపోతాడు. అలా ఆ విధంగా రాముడు రావణుడ్ని సంహరించి, సీతను తీసుకుని వెళతాడు.

శ్రీరాముని అశ్వమేధం :

శ్రీరాముడు అపవాదం భయంవల్ల సీతను అడవిలో విడిచిపెట్టేస్తాడు. అలాగే తాను రావణుడ్ని చంపి, బ్రహ్మహత్య చేసినందుకు పాపపరిహార్థంగా అశ్వమేధయాగం చేయడానికి నిశ్చయించుకుంటాడు. స్వర్ణసీతాప్రతిమతో సంకల్పం జరుగుతుంది. అశ్వమును పూజించి, విడుస్తారు. దానివెనుక శత్రుఘ్నుడు, అతని కుమారులు కూడా వెళతారు. రుక్మాందగుడు అనే ఒకడు గుర్రాన్ని పట్టుకోగా.. శత్రఘ్నుడు వానిని జయిస్తాడు. తరువాత ఆ అశ్వం రేవానదిలో మునిగిపోతుంది.

హనుమంతుడు, శత్రుఘ్నుడు పాతాళానికి వెళతారు. అక్కడ ఒక కన్య వీరికి కనబడి.. ‘‘రామకార్యం కోసం సహాయం అందించడానికి నేను ఈ అశ్వాన్ని తీసుకొచ్చాను. వాడీశ్వరుని వరంవల్ల ఎవరైతే అజేయుడుగా వుంటాడో.. అతనిని జయించడానికి నేనొక మంత్రం నీకిస్తాను’’ అని శత్రఘ్నుడికి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తుంది. ఆమె ఇచ్చిన అశ్వం వీరమణి పట్టుకుంటాడు. అతనితో యుద్ధం చేస్తుండగా.. శివుడు అడ్డమొస్తాడు. శత్రుఘ్నుడికి శివుడికి యుద్ధం జరుగుతుంది.

శివుని త్రిశూలం దెబ్బకు శత్రఘ్నుడు మూర్ఛపోగా.. అతనితో వచ్చిన హనుమంతుడు శివుడితో యుద్ధానికి దిగుతాడు. శివుని రథాన్ని, శూలాన్ని విరగగొట్టి, రాళ్ల వర్షం కురిపిస్తాడు. అప్పుడు శివుడు అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. హనుమంతుడు తన తోకతో అతడిని కొడతాడు.

శివుడు ఇతని శక్తిని మెచ్చి.. ‘‘నీకేం వరం కావాలో కోరుకో’’ అని చెబుతాడు. అప్పుడు హనుమంతుడు ‘‘శత్రుఘ్నుడ్ని బ్రతికించు’’ అని కోరుకుంటాడు. అప్పుడు శివుడు సంజీవని గురించి హనుమంతుడికి వివరిస్తాడు. హనుమంతుడు.. ‘‘నేను అక్కడికి వెళ్లి తిరిగివచ్చేవరకు ఈయనను కాపాడు’’ అని చెప్పి, ద్రోణపర్వతానికి వెళ్లి, అక్కడ అడ్డుపడేవారందరినీ జయించి.. సంజీవని ఔషదాన్ని తీసుకొచ్చి రామానుజుని కాపాడుతాడు. శత్రఘ్నుడు కన్య ఇచ్చిన సమ్మోహనాస్త్రం ద్వారా వీరమణిని వశపరుచుకుంటాడు.

వాల్మీకి ఆశ్రమానికి అశ్వం వెళ్లగా... కుశలవులు వారిని పట్టుకుంటారు. శత్రఘ్నుడు వారిని అశ్వంనుంచి పంపివేయడానికి యుద్ధం చేయసాగాడు. కానీ కుశుని బాణంవల్ల అతడు మూర్ఛపోతాడు. ఆంజనేయుడు కుశునినిమీద చెట్టునొకదానిని వేయగా.. కుశుడు దానిని భగ్నంచేసి, సంహారాస్త్రంతో హనుమంతుడిని కొడతాడు. దాంతో హనుమంతుడు కూడా మూర్ఛపోతాడు.

సుగ్రీవుడు అతనిమీద దాడిచేయడానికి ముందుకురాగా, వారుణాస్త్రంతో అతడిని బంధించేస్తాడు. అశ్వ రక్షణకు వచ్చిన అంగదపుష్కలాదులను పడగొట్టి.. కుశలవులు అశ్వాన్ని తీసుకొచ్చి సీతకు చూపిస్తారు. అప్పుడు ఆమె వారిని మందలించి, రామయాగానికి భగ్నం కలిగించరాదని చెప్పి, సూర్యుని ప్రార్థించి, రణంలో చనిపోయినవారిని బ్రతికించి, అశ్వాన్ని ఇప్పిస్తుంది.

వారు అశ్వంతో అయోధ్యకు చేరుకుని, సీతాకుశలవుల వృత్తాంతం అని చెప్పగా.. రాముడు వారిని అయోధ్యకు పిలిపిస్తాడు. సకలజనుల ఆమోదం పొంది, సీతతో కలిసి యాగం పూర్తిచేయడానికి అశ్వాన్ని సంహరించబోగా.. రాముని చేయి తగిలి అధి దివ్యరూపం ధరిస్తుంది. అది.. ‘‘తాను ఒక బ్రాహ్మనుడని, ఆడంబరంతో జనాలను వంచించి, ధనసంపాదన చేస్తుండగా.. దుర్వాసుడు శపించాడు. రాముడి చేయి తగలి విముక్తి పొందాను’’ అని చెప్పి దేవలోకానికి వెళ్లిపోతాడు.

రాముడు వసిష్ఠాదిమహామునులతో ఆలోచించి.. కర్పూరంతో హోమాన్ని చేసి, దేవతలను ఆహ్వానించిగా.. వారు వచ్చి హవ్యాలు స్వీకరించారు. పూర్ణహుతియు, అవతృథ స్నానాలు చేసుకుంటారు.

ఈ యాగం పూర్తయిన తరువాత రాముడు మూడశ్వమేధయాగాలు చేసి, బ్రహ్మహత్యదోష విముక్తడై.. సీతతో, కుశలవులతో, సోదరులతో సుఖంగా కలిసి వుంటాడు.

విభూతి మహిమ :

శంకరుడు ఒకనాడు కైలాసం నుండి విప్రవేషంలో రాముని వద్దకు వెళ్తాడు. రాముడు అతనిని చూసి.. ‘‘నీ పేరు, నివాసం గురించి చెప్పు’’ అని అడగగా.. శివుడు రాముడితో.. ‘‘నా పేరు శంభుడు. నా నివాసం కైలాసం’’ అని అంటాడు. దాంతో రాముడు విప్రవేషంలో వున్న అతనిని శంకరుడే అని గ్రహించి.. ‘‘విభూతి మహిమ గురించి వివరించండి’’ అని అడుగుతాడు.

దాంతో శివుడు.. ‘‘రామా! భస్మ మహత్యం గురించి చెప్పడానికి బ్రహ్మదులకు కూడా శక్యం కాదు. బట్ట మీద చారలను అగ్ని కాల్చినట్లు.. మన నుదుట బ్రహ్మ రాసిన రాతలను కూడా తుడిచివేసే శక్తి ఆ భస్మంకు వుంది. విభూతిని మూడు రేకులుగా పెట్టుకుంటే.. త్రిమూర్తులను మన దేహం మీద ధరించినట్లే అవుతుంది.

ముఖం మీద భస్మాన్ని ధరిస్తే నోటిద్వారా చేసిన పాపాలు, చేతులపై ధరిస్తే చేతిద్వారా చేసిన పాపాలు, హృదయంపై ధరిస్తే దురాలోచనలు, నాభిస్థానంలో ధరిస్తే వ్యభిచార దోషాలు, ప్రక్కలలో ధరించట వల్ల పరస్త్రీ స్పర్శదోషాలు పోగొట్టుకుపోతాయి. మనం చేసే సర్వపాపాలను బెదిరించి, పోగొడుతుంది కాబట్టి దీనికి భస్మం అనే పేరు కలిగింది.

భస్మం మీద పడుకొన్న, తిన్నా, శరీరానికి పూసుకున్నా.. పాపాలన్ని భస్మం అయిపోతాయి. ఆయుష్షు కూడా పెరుగుతుంది. గర్భిణీస్త్రీలు సుఖంగా ప్రవసం చేయగలుగుతారు. భూతపిశాచాలను పారదోలుతుంది. సర్ప, వృశ్చికాది విషములను కూడా ఇది సంహరిస్తుంది.

పూర్వం వశిష్ఠ వంశంలో ధనుంజయుడు అనే ఒక విప్పుడు వుండేవాడు. అతనికి వందమంది భార్యలు, వందమంది కొడుకులు వుండేవారు. వారందరికి సమానంగా తన ధనాన్ని పంచి.. ఆ విప్రుడు గతించాడు. అయితే అతని కొడుకులు అత్యాశతో ఒకరి ధనం కోసం ఆశపడుతూ జీవితాన్ని కొనసాగించేవారు.

వారిలో కరుణుడు ఒకడు. శత్రువులతో విజయం సాధించాలనే నెపంతో గంగాతీరంలో కేగిస్నానమాడి, తపము చేసుకోవాలని మునులు సేవచేస్తుండగా.. ఒక విప్రుడు నరసింహదేవునికి ఎంతో ప్రీతియైన ఒక నిమ్మపండును తెచ్చి అక్కడ పెడతాడు. దానిని కరుణుడు వాసన చూస్తాడు. దాంతో మునులు ఆగ్రహించి కరుణుడిని ఈగ రూపం దాల్చాల్సిందిగా శపించారు. అయితే కరుణుడు వారిని ప్రార్థించి, వేడుకోగా.. పూర్వస్మృతిని ఇచ్చారు.

కరుణుడు ఏడుస్తూ తన భార్యతో జరిగిన విషయం గురించి వివరిస్తాడు. అతని భార్య మహాపతివ్రత. ఆమె తన భర్త గురించి చాలా విచారిస్తుంది. ఒకనాడు ఈమె సోదరులకు ఈ సంగతి తెలిసి.. ఈగ దేహంలో వున్న కరుణిడిని పట్టి చంపేశారు. అతని భార్య ఈగ దేహాన్ని తీసుకుని.. అరుంధతి దగ్గరకు వెళ్లి ప్రార్థిస్తుంది. దాంతో అరుంధతి దేవి మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రితమైన విభూతిని జల్లి, కరుణుడిని బ్రతికిస్తుంది.

మరొకసారి దాయాదులు కరుణుడిని చంపి.. తన ఇంటి ముందు విసిరేశారు. అతని భార్య శుచిస్మిత భర్త దేహంతో వనంలో తిరుగుతుండగా.. దధీచ ముని కనిపిస్తాడు. ఆమె అతని దగ్గరకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించి, ప్రార్థిస్తుంది. అందుకు దధీచముని.. ‘‘ఈ భస్మంతో నా బ్రహ్మహత్యాపాపాలను పరమశివుడు పోగొడతాడు. దానినే నేను ఇతనిపై జల్లుతున్నాను’’ అని చెప్పి.. అతనిపై జల్లుతాడు.

అతను ఆ భస్మాన్ని కరుణుడిపై చల్లగా.. అతడు శాపం నుంచి విముక్తి పొంది.. తిరిగి జీవిస్తాడు. దాంతో దేవతలు కూడా భస్మం ప్రభావం గురించి పొగిడారు. కరునదంపతులు దధీచమునిని తమ ఇంటికి పిలిచి, అతిథి మర్యాదలు చేసి భోజనాలు పెట్టారు. దానిని ఆ ముని ఎంతో సంతోషించి, వారిని దీవించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

గాయత్రి చరిత్ర :

పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసం పుష్కరతీర్థంలో యజ్ఞం చేయాలని శ్రీపతితో చెబుతాడు. ఆయన.. ‘‘శివుడు, నేను అన్ని చూసుకుంటాము. కానివ్వండి’’ అని అంటాడు. వెంటనే ముహూర్తాన్ని నిశ్చయించారు. అందరికీ ఆహ్వానాన్ని పంపించారు. ముహూర్త సమయం దగ్గర పడుతుండడంతో.. బ్రహ్మ, సావిత్రిని పిలుచుకుని రావల్సిందిగా ఇంద్రునిని పింపిస్తాడు.

ఇంద్రుడు, సావిత్రి వున్న చోటుకు చేరుకుని, ఆమెను బ్రహ్మ నిర్వహిస్తున్న యజ్ఞం గురించి వివరిస్తాడు. అప్పుడు ఆమె.. ‘‘నావాళ్లు ఇంకా ఎవ్వరూ రాలేదు. వారు రాగానే నేను వచ్చేస్తాను’’ అని సమాధానం చెబుతుంది. దాంతో ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్లి, తిరిగి బ్రహ్మ దగ్గరకు చేరుకుని, ఈ విషయం చెబుతాడు.

అయితే ముహూర్త సమయం దగ్గరపడుతుండడంతో బ్రహ్మ... ‘‘ముహూర్తం సమయం దాటిపోకూడదు. అంతలోపే ఈ శుభకార్యాన్ని ముగించాలంటే ఎవరైనా ఒక కన్యను చూడండి. ఆమెను భార్యగా గ్రహించి.. సంకల్పాన్ని పూర్తి చేద్దాం’’ అని ఇంద్రునికి ఆజ్ఞాపిస్తాడు.

బ్రహ్మ చెప్పిన మాటలు విని ఇంద్రుడు భూలోకానికి వెళ్లి ఒక కన్య కోసం వెదుకులాట మొదలుపెడతాడు. అప్పుడు అతను పెరుగు అమ్ముకుంటున్న ఒక కన్యను చూసి, ఆమె చేయిపట్టుకొని బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళతాడు.

వెంటనే విష్ణువు, రుద్రులు పెద్దలుగా వుండి, గాంధర్వవివాహం జరిపించారు. వివాహం అయిన మరుక్షణమే బ్రహ్మదేవుడు సంకల్పం చేసుకుని, యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. అయితే తమ పిల్లను ఎవరో ఎత్తుకువెళ్లారని విని గొల్లలందరు బ్రహ్మలోకానికి వచ్చి ఏడ్వడం మొదలుపెట్టారు.

వీరిని చూసిన విష్ణువు అక్కడికి చేరుకుని, వారితో.. ‘‘మీ అమ్మాయి సాక్షాత్తూ బ్రహ్మదేవుడిని పెళ్లి చేసుకుంది. నేను శ్రీమన్నారాయణుడిని. నేను కృష్ణుడిగా అవతరించినప్పుడు మీ మధ్యనే వుంటాను. మీరు నన్ను దర్శించుకోవడంతో మీ వంశాలు పవిత్రమయ్యాయి’’ అని వారితో చెబుతాడు.

బ్రహ్మదేవుణ్ణి పెళ్లి చేసుకున్న గాయత్రి గొల్లలందరితో.. ‘‘నేను చాలా సంతోషంగా వున్నాను. నా గురించి విచారించకండి’’ అని చెప్పగానే.. వారందరూ తమ ఇళ్లకు చేరుకున్నారు.

ఈ వ్యవహారం మొత్తం అయిపోయిన తరువాత సావిత్రదేవీ, లక్ష్మీపార్వతులతో కలిసి అక్కడికి విచ్చేస్తుంది. అక్కడున్న పరిస్థితులను గమనించి, జరిగిన సంగతిని తెలుసుకుంది. దాంతో ఆమె ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతుంది. ఆమెను చూసి అక్కడే వున్న బ్రహ్మాది దేవతలందరూ, మునులు చాలా భయపడిపోయారు.

సావిత్రిదేవి కోపంతో బ్రహ్మను.. ‘‘ఒక్క కార్తీక పౌర్ణమినాడు తప్ప.. మరెప్పుడు నిన్ను ప్రజలు పూజించరు’’ అని శపిస్తుంది. అలాగే ఇంద్రునికి.. ‘‘నువ్వు శత్రువుల చేతిలో ఓడిపోయి, సిరిసంపదలన్నీ పోగొట్టుకుంటావు. అవమానాలు పొందుతావు’’ అని శపిస్తుంది.

అదేవిధంగా శ్రీహరిని చూసి.. ‘‘నువ్వు శ్రీరాముడిగా అవతరించినప్పుడు భార్యతో విడిపోతావు. అంతేకాదు.. కృష్ణుడిగా జన్మించినప్పుడు పశువులతో బ్రతుకు’’ అని శపిస్తుంది. శివునిని చూసి.. ‘‘దారుకావనంలో ముని శపించడంవల్ల నీ లింగం భూపతనమై నపుంసకుడిగా మారిపోతావు’’ అని శపిస్తుంది. అగ్నిని చూసి.. ‘‘నువ్వు సర్వమలభక్షకుడిగా మారి రుద్రవీర్యము తాగుతావు’’ అని శపిస్తుంది.

తరువాత అక్కడే వున్న విప్పులను చూసి.. ‘‘మీరు పరాన్నభోజనులై, తీర్థక్షేత్రాల దగ్గర దుర్దానములు గ్రహిస్తూ.. అనర్హులైన వారితో యజ్ఞాదులు చేయిస్తూ.. చివరకు ప్రేతత్వము పొందుతారుగాక’’ అని శపిస్తుంది.

శచీదేవిని చూసి.. ‘‘మీరు ఆలస్యం చేయడం వల్ల ఈ అనర్థం జరిగింది. నువ్వు నహుషుని వల్ల బాధపడుతావు’’ అంటూ.. పార్వతీదేవిని చూసి.. ‘‘దేవతా స్త్రీలందరిలో నువ్వు గొడ్రాళ్లుగా వుండిపోతావ్’’ అని శపిస్తుంది. ఇలా కోపావేశంలో శపించిన తరువాత వెంటనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయి.. కొండల మధ్యలో యజ్ఞం చేయడం మొదలుపెడుతుంది.

శ్రీమహావిష్ణువు ఆమె దగ్గరకు వెళ్లి.. అనేక విధాలుగా స్తుతించి ఆమెను ప్రసన్నురాలిని చేస్తాడు. తిరిగి ఆమెను బ్రహ్మదేవుడు చేపట్టిన యజ్ఞంలో యజమానురాలుగా చేయడం వల్ల.. గాయత్రికి దేవతామహిమలు కలుగుతాయి.

గాయత్రిదేవి, సావిత్రీ శాపంతో చింతిస్తున్న దేవతలను, ఋషులను చూసి.. ‘‘ఓ మహాత్ములారా! సావిత్రి మీకిచ్చిన శాపాల గురించి ఆలోచించకండి. నేను బ్రహ్మను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన ప్రభావంతో మీకు వరాలిస్తాను. బ్రహ్మను పూజించినవారు అన్ని సౌఖ్యాలు పొందుతారు. కార్తీక పౌర్ణమినాడు పూజించి ముక్తి పొందుతారు’’.

‘‘దేవేంద్రా... నీకు తాత్కాలికంగా శత్రుబాధ కలిగిన.. తిరిగి మళ్లీ నువ్వు త్రిలోకాధిపత్యాన్ని పొందుతావు. మాధవా.. నువ్వు రామావతారంలో నీ భార్యను హరించిన రాక్షసుడ్ని సమూలంగా నాశనం చేస్తావు. కృష్ణుడిగా పుట్టినప్పుడు సకలలోక పూజ్యుడవుతావు. శంకరా... జారిపడిన నీ లింగమే పూజార్హమై అభిషేకించబడుతూ.. భక్తులకు కోరిన వరాలను ఇస్తావు. అగ్నిదేవా... ఎన్నిటిని భక్షించినా నువ్వు పవిత్రుడివిగానే వుంటావు. నీవల్ల దేవతలు యజ్ఞహవిస్సులను పొందుతారు. బ్రాహ్మణులారా... మీరు నన్ను ఎంతగా తలచుకుంటే.. అంతగా మీరు పాపవిముక్తులవుతారు. ఎన్ని దుర్దానాలు పట్టినా.. గాయత్రీ మంత్ర, జపంవల్ల దోషాలు పోయి, పవిత్రులుగా మారుతారు.

లక్ష్మీ... నీ దయ ఎవరిమీద ప్రసరించబడుతుందో వాడు శ్రమంతుడవుతాడు. పార్వత్యాది దేవకాంతలారా! మీకు సంతానం లేకపోయినా.. ఆ దు:ఖం మిమ్మల్ని ఎప్పుడూ బాధించదు’’ అని అందరికీ గాయత్రీదేవి వరాలు సమకూరుస్తుంది. అందరూ ఆమెను దేవతవని స్తుతించారు. అంతలోనే యజ్ఞం కూడా సమాప్తం అవుతుంది. అందరూ తమతమ చోటుకు చేరుకుంటారు.

కొత్త భార్య రావడం వల్ల బ్రహ్మకు మొదటి భార్యపై బెంగ కలుగుతుంటుంది. అతను శ్రీహరిని పిలిచి.. ‘‘ఆమెను ఎలాగైనా నువ్వు ప్రసన్నురాలిని చేసి తీసుకుని రా’’ అని పంపిస్తాడు. ఆయన లక్ష్మీతోపాటు వెళ్లి, సావిత్రి పాదాలమీద పడతాడు. ఆమె లేవమన్నా.. వారు లేవలేదు. ‘‘నేను జరిగిన దానికి క్షమిస్తున్నాను లేవండి’’ అనగానే.. మాధవుడు ఆమెను స్తుతించాడు.

సావిత్రి దేవి, శ్రీహరిని చూసి.. ‘‘కేశవా! ఈ లక్ష్మీ నీ హృదయం మీదే వుంటుంది. నువ్వు ఏ అవతారమెత్తినా.. ఆమె నీ వెంటే వుంటుంది. ఇంకేమైనా వరం కావాలంటే కోరుకో’’ అని అడుగుతంది. దాంతో శ్రీహరి.. తల్లీ! నీ విరహంతో నేను విరింగి వేగిపోవుతున్నాను. నిన్ను తీసుకుని రమ్మని బ్రహ్మదేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. నువ్వు వస్తే.. అంతకంటే మించిన వరం నాకు అక్కరలేదు’’ అని అంటాడు.

ఇంతలోనే శంకరుడు, ఉమతో కలిసి అక్కడికి చేరుకుంటాడు. సావిత్రిదేవిని స్తుతిస్తాడు. అప్పుడు సావిత్రి.. ‘‘శంకరా! నీకు ఈ శైలజా అర్థశరీరమై వుంటుంది. మిమ్మల్ని సేవించనవారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇంకేమైనా వరం కావాలంటే కోరుకో’’ అని అంటుంది. దాంతో శివుడు.. ‘‘తల్లీ! బ్రహ్మ కోరికను తీర్చి ఆయన్ని ఆనందపర్చండి’’ అని అంటాడు. దానికి ఆమె అంగీకరిస్తుంది.

లక్ష్మీపార్వతలు, సావిత్రికి చెరియొక చెయ్యి పట్టుకుని నడిపిస్తుండగా.. ఆమె బ్రహ్మ దగ్గరకు చేరుకుని నమస్కరిస్తుంది. బ్రహ్మ ఆమెను చూసి ఎంతో సంతోషంగా ఆదరిస్తాడు. గాయత్రిని చూపిస్తూ.. ‘‘ఈమె నీ చెల్లెలు’’ అని చెబుతాడు.

సావిత్రి, గాయత్రిని కౌగిలించుకుని.. ‘‘మనమిద్దరం మన నాథునికి రెండువైపులా నిలిచి.. సృష్టి వున్నంతవరకు ఈ పుష్కరక్షేత్రంలో వుందాం’’ అని చెబుతుంది. దీంతో గాయత్రి ఎంతో సంతోషించ, ఆమెను మొక్కుతుంది.

శ్రీకృష్ణుడు తన భార్యలను శపించుట :

పూర్వం శ్రీకృష్ణుడు ద్వారలో పదహారువేలమంది భార్యలతో సుఖంగా జీవనం కొనసాగిస్తుండేవాడు. ఒకనాడు కృష్ణుని కొడుకైనా సాంబుడు విహారానికి వెళుతుండగా.. పరమసుందరుడైన అతనిని చూసి.. ఆ పదహారువేలమంది కృష్ణభార్యలు మదనతాపం పడతారు. కృష్ణుడు తన దివ్యదృష్టితో అది గ్రహించి.. ‘‘మీరందరూ మీ తరువాత చోరుల ద్వారా అపహరించబడతారు’’ అని శపిస్తాడు. వారు ‘‘మాదాల్భ్యుడు అనే ముని కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు. ఆ ప్రకారం చేసి విముక్తి పొందుతారు’’ అని చెబుతారు.

ముసలితనం వచ్చి యాదవవంశం నశిస్తుంది. శ్రీకృష్ణుడు అవతారం చాలించగా.. అష్టమహిషులు అగ్ని ప్రవేశం చేశారు. అర్జునుడు పదహారువేలమందిని తీసుకుని హస్తినాపురానికి వెళుతుండగా.. చోరులు అతనికి ఓడించి ఆ స్త్రీలను అపహరిస్తారు. దాల్బ్యుడు, ఆ స్త్రీలు వున్న చోటుకి రాగా వారు అతనిని చూసి.. ‘‘స్వామీ! మేము శ్రీకృష్ణుని భార్యలమయి అంత బతుకు బతికినా.. మాకు ఈ చోరుల చేతిలో పరాభవం కలగడానికి కారణమేంటి’’ అని అడుగుతారు.

అప్పుడు ఆ ముని.. ‘‘కాంతలారా! పూర్వం మీరు వైశ్వానరుని పుత్రికలు. యవ్వనమదంతో వుండి, ఒకసారి జలక్రీడలు ఆడుతుండగా.. అటువైపు వచ్చిన ఒక నారదునిని ఆపి ‘‘మేము నారాయణునికి భార్యలము కావాలని కోరుకుంటున్నాము. దానిని ఉపాయం చెప్పు’’ అని అన్నారు. వినయవిధేయతలు లేని మీ అందరినీ చూసి, ఆ నారదుడు కోపంతో తన మనసులో ఇలా అనుకుంటాడు.. ‘‘చైత్రవైశాఖ మాసంలో శుద్ధ ద్వాదశీ దినంలో వ్రతం ఆచరించి, బంగారు పరికరంతో రెండు శయ్యలను విప్రులకు దానమిస్తే.. మీరు రాబోయే 28వ మహాయుగంలో శ్రీకృష్ణునికి భార్యలు అవుతారు. మీ మర్యాదలేని ప్రవర్తన వల్ల వేశ్యలవుతారు’’ అని పలికి వెళ్లిపోయాడు.

అలా ఆ విధంగా నారదుడు చెప్పిన విధంగా, రెండు శాపాలతో మీరు చోరుల చేతిలో పడి వేశ్యాత్వం పొందారు. ఇప్పుడైనా మీ ఇళ్లకు వచ్చే విటులని శ్రీహరి రూపంగా భావించి, వేశ్యాధర్మాన్ని పాలించి, తరించండి’’ అని దాల్భ్యుడు బోధించగా.. శ్రీకృష్ణుని భార్యలు వేరే గతిలేక వేశ్యలుగానే బ్రతికి, తమ దేహాలు చాలించి ముక్తి పొందారు.

మార్కండేయునకు చిరాయువు :

పూర్వం కల్పంలో మృకండు అనే ఒక ముని వుండేవాడు. అతనికి మార్కండేయుడు అని పిలువబడే ఒక కొడుకు వుండేవాడు. వాడు 5 సంవత్సరాల వయస్సులో ఇంటిముందు ఆడుకుంటుండగా.. ఒక సిద్ధుడు అతనివైపు చూస్తూ నిలబడిపోయాడు. మృకండు ముని ఆయన్ని నమస్కరించి.. ‘‘స్వామీ! ఇతను నా కొడుకు. వీనికి ఆయుష్షు ఎంత? అని అడిగాడు. సిద్ధుడు.. ‘‘ఇప్పుడు వీని వయసెంత?’’ అని ప్రశ్నించాడు. మృకండుడు ‘‘ఐదేళ్లు’’ అని సమాధానం ఇచ్చాడు. దాంతో సిద్ధుడు.. ‘‘అయితే ఇక ఆరుమాసాలే ఇతని ఆయువు’’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మృకండుడు అతను చెప్పిన మాటలకు భయపడిపోతాడు. తరువాత ధైర్యాన్ని తెచ్చుకుని, ఒక మంచి ముహూర్తంలో అతనికి ఉపనయనం చేస్తాడు. తరువాత అతనితో.. ‘‘నాయనా! నువ్వు విప్రులుగాని, మహర్షులుగాని ఎవ్వరు కనిపించినా.. వారిని నమస్కరించి ఆశీస్సులు పొందు’’ అని చెబుతాడు. మార్కండేయుడు తన తండ్రి చెప్పిన మాటలను విని, దీవెనలను అందుకొంటుంటాడు.

ఒకనాడు సప్తమహర్షులు తమ మార్గంలో వెళుతుండగా.. మార్కండేయుడు వున్న చోటుకి చేరుకుంటారు. అప్పుడు ఆ మార్కండేయుడు ‘‘అహంభో అభివాదమే’’ అని వారిని నమస్కరిస్తాడు. ఆ మహర్షులు ఇతనిని ‘‘దీర్ఘాయుష్మాన్ భవ’’ అని దీవిస్తారు. కానీ వెంటనే వారు తమ దివ్యదృష్టితో అతను అల్పాయుష్కుడు అని గ్రహించి.. ‘‘అరెరె.. అల్పాయుష్కునిని దీర్ఘాయుష్మంతునిగా దీవించాము. మన దీవెన వ్యర్థమవుతుందా?’’ అని విచారణలో పడిపోతారు. వెంటనే ఆ మహర్షులు ఆ బాలునిని తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటారు.

మహర్షులు బ్రహ్మదేవునికి ఏదో చెప్పాలనేలోపు ఆ బాలుడు ముందుకు వెళ్లి, బ్రహ్మదేవుని పాదాలకు నమస్కరిస్తాడు. బ్రహ్మ అతనిని ‘‘దీర్ఘాయుష్మాన్ భవ’’ అని దీవిస్తాడు. దాంతో అక్కడున్న మహర్షులు సంతోషించి, తామెందుకు వచ్చామోనన్న విషయం గురించి వివరిస్తారు. బ్రహ్మ బాలుని గురించి మహర్షులకు చెబుతూ.. ‘‘ఈ బాలుడు పెద్దలకు నమస్కరించి ఆయుష్మంతుడవుతున్నాడు. ఇతడు చిరంజీవియై రాబోయే ఏడు కల్పములలో నాకు జగత్సష్టి కార్యక్రమాలలో సహాయం చేస్తాడు. తపం చేసి మహాయోగి అవుతాడు’’ అని చెబుతాడు. దాంతో సప్తమహర్షులు ఆ బాలుడిని తిరిగి ఇంటికి చేరుస్తారు. ఈ విషయం మొత్తం మార్కండేయుడు తన తండ్రికి వినిపించగా.. అతను పరమానందం పొందుతాడు.

No comments:

Post a Comment