Sunday, April 19, 2015

గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు?

గుడికి వెళ్లిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం - ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తాం. అయితే చాలామందికి ఇది ఒక జవాబు దొరకని అంతుచిక్కని ప్రశ్నగా మారవచ్చు. గుడిలో వున్న దేవుడికి నమస్కారం పెడుతూ మనస్సులో మనం ఏదైనా కోరిక కోరుకుంటాం. ఆయనకు నైవేద్యం కింద కొబ్బరికాయలు లేదా పువ్వులను సమర్పిస్తాం. అయితే దేవుడితో నేరుగా సంబంధం లేని మనకు ఈ ప్రదక్షిణలు చేయావలసిన ఏముందని కొంతమందికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబుగా పండితులు ఈ విధంగా విశ్లేషిస్తారు. ‘‘మనకు కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఈ విధంగా ప్రదక్షిణలు చేయడం వల్ల తనకు శక్తి వస్తుందా లేక తన శక్తిని నిలబెట్టుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తోందా..? అనే విషయం పక్కన బెడితే, భూమి ప్రదక్షిణ చేయకుండా వుంటే మరుక్షణమే ఏమైనా జరగవచ్చు. సృష్టి మొత్తం నాశనం కావచ్చు. అదేవిధంగా సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యునినుంచి శక్తిని పొందుతోంది. ఈ విధంగా భూమి ఆత్మప్రదక్షిణలు చేస్తూ, సూర్యుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అలాగే భక్తులు కూడా ఆత్మప్రదక్షిణలు చేయటం, విగ్రహం చుట్టూ తిరగడం పైన చెప్పిన విషయాలే సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం చేయడం వల్ల దేవును నుంచి అతీతమైన జ్ఞానశక్తిని పొందడమే గాక, మనస్సుకు - శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే కొన్ని తరాల నుండి కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణలు చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు.

ఎన్నిసార్లు చేయాలి?

ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలనే విషయంపై ఇంతవరకు ఎవ్వరూ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు, చేయలేదు కూడా. కొందరు మూడుసార్లు చేయాలని చెబితే, మరికొందరేమో అయిదు లేదా పదకొండు సార్లు చేయాలని సూచిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే.. ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసిసంఖ్యలో మాత్రమే వుంటాయి. అంటే 3, 5, 11, ఇలా అన్నమాట! ఇలా ఎందుకు నిర్ణయించారనేది ఇంతవరకు జవాబు దొరకని ప్రశ్న! ఏ దేవుడి గుడికెళ్లే, ఆ గుడికి సంబంధించిన స్త్రోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యం! అలాగే స్త్రోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి వారు తమకు తెలిసినంతవరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. అలౌకిక విషయాలను పక్కనబెడితే... ప్రదక్షిణ శరీరానికి, మనస్సుకు కూడా ఉపయోగకరంగానే వుంటుంది.

1 comment:

  1. శివాలయంలో ప్రదక్షిణలవిషయంలో సోమశిల వరకే అని చదివాను.నిజమేనా.

    ReplyDelete