Sunday, April 19, 2015

తిరుమల కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి?

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తెలియనివారు ఎవ్వరూ వుండరు. ఆ ప్రాంతం నిత్యం భక్తులతో నిండి వుంటుంది. లక్షలాదిమంది భక్తులు దేశ, విదేశాల నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం వస్తారు. ఈ దేవస్థానంలో ఎన్నోరకాల అద్భుతాలు వెలిసి వున్నాయి. అందులో మొదటగా అక్కడున్న ఏడుకొండలు. ఈ ఏడుకొండలలో వున్న ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరు వుండటమే కాకుండా.. వాటికి విశిష్టమైన ఆధ్మాత్మిక చరిత్రలు కూడా వున్నాయి. ఆ ఏడుకొండల పేర్లు.. అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అంటూ వాటికి పేర్లు వున్నాయి. అయితే ఈ పేర్లు ఆ కొండలకు ఎలా వచ్చాయో ఒకసారి మనం తెలుసుకుందాం...

అంజనాద్రి... త్రేతాయుగంలో అంజనాదేవి పుత్రసంతానం కోసం మాతంగ మహర్షుల సలహా కోరింది. వారి సలహా మేరకు అంజనాదేవి ఆకాశగంగ సమీపంలో పన్నెండు సంవత్సరాలవరకు ఘోరమైన తపస్సు చేసింది. దాంతో ఆమె తపస్సును మెచ్చుకున్న వాయుదేవుడు ఆమెకు కుమారుడు పుడతాడని వరం ప్రసాదిస్తాడు. ఆ వరప్రసాదంతో అంజనాదేవి వాయువునికి సమాన బలవంతుడైన హనుమంతునిని కుమారునిగా పొందుతుంది. ఆ విధంగా అంజనాదేవి తపం ఆచరించిన పర్వతం కావడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది.

వృషభాద్రి... కృతయుగంలో వృషభాసురుడు అనే ఒక రాక్షసుడు వుండేవాడు. అతడు మహాశిష్ణువు భక్తుడు. వృషభుడు, విష్ణువుకు ఘోర తపస్సు చేయగా.. శ్రీహరి అతనికి దర్శనమిచ్చి, వరాన్ని కోరుకోకంటాడు. అయితే ఈ రాక్షసుడు మాత్రం శ్రీహరితోనే యుద్ధం చేయాల్సిందిగా వరాన్ని కోరుకున్నాడు. దాంతో వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. వృషభుడిని చంపడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం మహిమ గురించి తెలుసుకున్న ఆ రాక్షసుడు.. ఇక్కడ వెలిసిన కొండకు తన పేర్లు వచ్చేలా చూడమని వరాన్ని కోరుకున్నాడు. విష్ణువు ఆ వరాన్ని కూడా అంగీకరించి, వృషభాసురుడిని వధించాడు. దాంతో ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది.

నీలాద్రి... పూర్వం నీలాద్రి కొండమీద క్రూరజంతువులు విపరీతంగా సంచారం చేస్తుండేవి. దాంతో నీలాదేవికి ఇబ్బందికరంగా వుందని, ఆమె శ్రీనివాసునిని వేడుకుంటుంది. ఆమె కోర్కెమేరకు స్వామి.. నీలాద్రి కొండమీద వున్న క్రూరజంతువులను వధిస్తాడు. అలాగే అలసిపోవడం వల్ల అక్కడే నిద్రపోతాడు. అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందరరూపాన్ని నీలాదేవి చూస్తుండగా.. ఆయన నుదుటిపై కొంతభాగం వెంట్రుకలు లేకపోవడం గమనిస్తుంది. అంతటి మనోహరునికి వెంట్రుకలు లేకపోవడం పెద్ద లోపంగా భావించి.. తన కురులలో కొంతభాగం తీసి శ్రీహరి తలకు అతికిస్తుంది. దాంతో శ్రీనివాసుని నిద్ర భగ్నం అయి మెలకువ వస్తుంది. తన ఎదురుగా వున్న నీలాదేవి నుదుటిపై రక్తం కారుతూ వుండడాన్ని గమనించాడు. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి.. తన కొండకు వచ్చే భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని, అవి నేరుగా నీలాదేవికి చేరుతాయని వరమిచ్చాడు. ఆ కారణంతో ఆ కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది.


శేషాద్రి... మహావిష్ణువు ఆదేశం ప్రకారం.. శేషుడు స్వామి విహారం కోసం ఈ పర్వతరూపాన్ని ధరించడం వల్ల దీనికి శేషాచలం అనే పేరు వచ్చింది. పూర్వం శ్రీహరి.. వాయువుకు, శేషునికి పందెం పెడతాడు. శేషుడు వెంకటాద్రిని చుట్టుకుంటాడు. వాయువు మహావేగంతో వీస్తాడు. దాంతో శేషుడు స్వర్ణముఖి తీరం వరకు వెళతాడు. మహావిష్ణువు ఆజ్ఞతో వెంకటాద్రి విడివడుతుంది. శేషుడు ఆ ప్రాంతంలోనే తపస్సు చేయడంవల్ల దానికి శేషాద్రి అనే పేరు వచ్చింది. ఈ కొండకు గరుడాద్రి అనే మరో పేరు కూడా వుంది. శ్వేత వరాహకల్పంలో.. వరాహస్వామి ఆజ్ఞప్రకారం గరుత్మంతుడు శ్రీవైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని తీసుకురావడం వల్ల ఈ కొండకు గరుడాద్రి అనే పేరు వచ్చింది.

నారాయణాద్రి... సాక్షాత్ నారాయణుడే ఈ కొండమీద నివసించడం వల్ల దీనికి నారాయణాద్రి అనే పేరు వచ్చింది. పూర్వం నారాయణుడు అనే భక్తుడు, నారాయణుని సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చుకున్న నారాయణస్వామి మొట్టమొదటగా ఈ కొండలమీద తన పాదాలను మోపుతాడు. ఆ నారయణుడనే బ్రాహ్మణుని ప్రార్థనను మన్నించి, శ్రీనివాసుడు వాసం చేయడం వల్ల ఈ కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చింది.

శ్రీశైలం... శ్రీ అంటే.. లక్ష్మీదేవి నివసించే కొండ కాబట్టి దీనికి శ్రీశైలం అనే పేరు వచ్చింది. దీనికి శ్రీనివాసాద్రి అనే మరొక పేరు కూడా వుంది. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించినప్ుడు.. అందులోనుంచి లక్ష్మీదేవి పుట్టింది. ఆ సమయంలో లక్ష్మీదేవి, నారాయణుడిని పెళ్లి చేసుకుంటుంది. నారాయణుడు, లక్ష్మీతో.. ‘‘నాకు ఇళ్లంటూ ఏదీ లేదు. ఎక్కడబడితే అక్కడ నివసిస్తుంటాను. భక్తులు నన్ను ఎక్కడ పూజిస్తారో అక్కడ వుంటాను. కాబట్టి నువ్వు నా వక్షస్థలంలో వుండు’’ అని చెబుతాడు. శ్రీ నివసించే చోటు కాబట్టి స్వామిని శ్రీనివాసుడని, తిరుమలకు శ్రీనివాసాద్రి అనే పేరు వచ్చింది. దీనికి వృషాద్రి అనే పేరు కూడా వుంది. వృష అంటే.. ధర్మం అని అర్థం. ధర్మదేవత తన అభివృద్ధి కోసం ఈ కొండమీద తపస్సు చేయడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.

వెంకటాద్రి... పూర్వం శ్రీకాళహస్తిలో పురందరుడు అనే ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు వుండేవాడు. పుత్రసంతానం కోసం అనేక ప్రయత్నాలు, వ్రతాలను ఆచరిస్తాడు. చివరకు అతని ముసలితనంలో మాధవుడు అనే పుత్రుణ్ని కంటాడు. మాధవుడు వేదవేదాంగాది విద్యలను నేర్చుకుని మహాపండితుడు అవుతాడు. యుక్తవయస్సు రాగానే చంద్రలేఖ అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకున్నాడోగాని.. తన భార్యను, బ్రాహ్మణ విధులను విడిచిపెట్టి, కామంతో పరుల స్త్రీలను కోరుకునేవాడు. అంతటితో ఆగకుండా కుంతల అనే వేశ్యను మోహించి తన జంధ్యాన్ని తెంచేస్తాడు. మద్యమాంసాలను స్వీకరిస్తూ ఆమెతో సుఖించేవాడు. కొంతకాలం తరువాత ఆమె మరణించగా.. అతడు తట్టుకోలేక పిచ్చివానిలాగా మారిపోయి దేశదిమ్మరి అయిపోతాడు. అలా వెళుతుండగా.. ఒకరోజు వెంకటాద్రి యాళ్లకు వెళుతున్న భక్తులను చూసి, వారితో వెంకటచలానికి బయలుదేరాడు. అక్కడికి చేరుకున్న తరువాత అతడు మొదట చక్రతీర్థంలో స్నానం చేస్తాడు.

దాంతో అతని కల్మషాలన్నీ తొలగిపోతాయి. తరువాత పితృదేవలకు మట్టి పిండప్రదానం చేశాడు. దాంతో వాళ్లు ముక్తిని పొందుతారు. ఆ విధంగా వెంకటాచల మహత్యంవల్ల అనిని పాపాలన్నీ దహించుకునిపోతాయి. ఆ విశేషాన్ని చూడటంకోసం దేవతలంతా వచ్చి వెంకటాద్రి మహత్యాన్ని కొనియాడారు. అప్పుడు బ్రహ్మదేవుడు, మాధువునికి.. ‘‘ఓ బ్రాహ్మణుడా! నువ్వు వెంకటాచలం మహిమవల్ల పాపాలను పోగొట్టుకున్నావు. వెంటనే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకో. నీ తరువాతిజన్మలో పాండవ వంశంలో ఆకాశరాజుగా పుడతావు. లక్ష్మీదేవి నీకు కూతురుగా పుడుతుంది. శ్రీనివాసుడు నీకు అల్లుడు అవుతాడు. నీ సమస్త కోరికలు తీరి, వైకుంఠానికి చేరుకుంటావు. ఈ పర్వతం వెంకటాద్రి అనే పేరుతో వర్ధిల్లుతుంది’’ అని చెప్పి అదృశ్యమవుతాడు. సర్వపాపాలను ఈ పర్వతం దహిస్తుంది కాబట్టి దీనికి వెంకటాద్రి అనే పేరు వచ్చింది. ‘‘వెం’’ అంటే అమృతం, ‘‘కటం’’ అంటే ఐశ్వర్యం.. దీంతో వెంకటాద్రి అంటే అమృతాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అని భావించి భక్తులకు ఇక్కడికి వస్తారు.


No comments:

Post a Comment