Saturday, April 18, 2015

వేపంజరి శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం

స్థలపురాణం :

క్రీ.శ. 12వ శతాబ్దంలో చోళవంశానికి చెందిన మూడవ కుళోత్తుంగ రాజువారి పరిపాలనలో.. తొండమండలం అనే గ్రామంలో శ్రీలక్ష్మీనారాయణ స్వయంగా వెలిశాడని చరిత్ర వుంది.

కుళోత్తుంగ చోళుడు పరిపాలిస్తున్న కాలంలో... ఒక వైష్ణవ భక్తుడు వుండేవాడు. అతని కళలో ఒకరోజు శ్రీమన్నారాయణుడు వెలిసి.. తాను సమీపంలోనే వున్న పుట్టలో వున్నట్లుగా చెప్పాడు. దీంతో ఆ భక్తుడు తనకు వచ్చిన కలగురించి రాజు దగ్గరకు వెళ్లి వివరిస్తాడు.

రాజు అప్పటికప్పుడే సకలజనుల సమేతంగా ఆ శ్రీమన్నారాయణుడు వున్న పుట్టకోసం వెదకడం ప్రారంభించాడు. చివరకు ఓ చిట్టడవిలో స్వామివారు, అమ్మవారిని తన తొడపై కూర్చోబెట్టుకున్న భంగిమలో శిలాప్రతిమ దర్శనమిచ్చింది.

అప్పుడు రాజు ఆ విగ్రహాన్ని పద్మపీఠంపై ప్రతిష్టింపజేసి, వెంటనే అక్కడ ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మింపజేశాడు. అలా ఆ విధంగా శ్రీమన్నారాయాణుడి ఆలయం నిర్మించబడింది.

ఆలయ విశేషాలు :

శ్రీమన్నారాయణుడి స్వామివారి ఈ విగ్రహం క్రీ.శ. 1178 - 1218 కాలంలో నిర్మించిబడింది. చిత్తూరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనూ, తిరుపతి నుంచి 85 కిలోమీటర్ల దూరంలో వున్న వేపంజరి అనే గ్రామంలో ఈ స్వామివారి ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శనమిస్తుంది.

ముందుగా ఈ క్షేత్రం పేరు ‘‘వేం పంచ హరి’’గా పిలవబడేది. ఇందులో వేం అంటే పాపమని, పంచ అంటే ఐదు, హరి అంటే హరించడం అని అర్థం. అంటే.. భక్తులు చేసే పంచపాపాలను హరించమని శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తుంటారు. కాలక్రమంలో దీని పేరు వేపంజరిగా మారిపోయి, ప్రసిద్ధి చెందింది.

వేపంజరి గ్రామంలో కేవలం శ్రీమన్నారాయణుడి విగ్రహమే కాదు.. చూడదగిన ఆలయాలు, విశేషాలు, ఉపాలయాలు ఎన్నో వున్నాయి. అందులో ప్రధానమైంది అష్టలక్ష్మీ ఆలయం.

దశావతార పుష్కరిణి :

శ్రీమన్నారాయణుడి ఆలయానికి సరిగ్గా ఈశాన్య దిశలో దశాతతార పుష్కరిణి కూడా వుంది. ఇది ఎంతో ఆకర్షణీయంగా, ప్రతిఒక్కరిని ఆకట్టుకునే విధంగా వుంటుంది. ఒక్కొక్క యుగంలో శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క అవతారాన్ని ఎత్తాడని ప్రతిఒక్కరికి తెలిసిందే! ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే.. శ్రీ విష్ణువుని దశావతారాలు ఒకే విగ్రహంలో ఇమిడి వుండి, 21 అడుగుల ఎత్తుగల అద్భుతమైన విగ్రహం కనిపిస్తుంది.

ఈ ఆలయానికి దగ్గరలోనే దేవతలకు వైద్యుడైన ధన్వంతరీ ఆలయం కూడా వుంటుంది. ఇక్కడికి కూడా భక్తులు విచ్చేసి ఆరోగ్యానికి సంబంధించిన మంచి ఫలితాలను పొందుతారు.

శాపవిమోచన వృక్షం :

శ్రీమన్నారాయణుడి దశావతార పుష్కరిణిలోకి ప్రవేశించే దారిలోనే రెండు దశాబ్దాల చరిత్రగల ఒక మర్రిచెట్టు వుంటుంది. ఈ చెట్టుకింద బ్రహ్మదేవుని పూజలు నిత్యం జరుగుతూ వుంటాయని... చనిపోయినవారి ఆత్మలు ఈ చెట్టు చుట్టూ తిరిగి మోక్షాన్ని పొందుతాయని ఒక కథనం వుంది. దాంతో ఈ చెట్టుకు శాపవిమోచన వృక్షం అని పేరు వచ్చింది.

ఇలా ఈ విధంగా రకరకాల విశిష్టతలు కలిగిన ఆలయాలు, నిర్మాణాలు, ఇంకా ఇతరత్ర దేవాలయాలు ఎన్నో వేపంజరి గ్రామంలో చూడడానికి చాలా వున్నాయి.

No comments:

Post a Comment