Saturday, April 18, 2015

శ్రీకాకుళంలోని మల్లికార్జున స్వామి ఆలయ విశేషాలు

ఆలయ విశేషాలు :

శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో గల టెక్కలి మండలం రావివలసలో ఎండల మల్లికార్జునస్వామి దేవాలయం వుంది. ఈ దేవాలయానికి విశేష చరిత్రతోపాటు కొన్ని ప్రత్యేకతలు కూడా వున్నాయి. శివునిని సంబంధించిన ఆలయాలలో అన్ని ప్రదేశాలలో వున్నప్పటికీ.. ఈ మల్లికార్జునస్వామికి మాత్రం ప్రత్యేకించి ఆలయం అంటూ లేదు. కొండమీద కొలువైన ఈ శివలింగం ఎంత పెద్దదంటే... మన భారతదేశంలోని ఏ ఆలయాలలోనూ ఇంత పెద్ద శివలింగం వుండదు... లేదు.

క్రీ.శ. 1870 సంవత్సర ప్రాంతంలో టెక్కలి జమీందార్ ఈ స్వామి దేవాలయాన్ని నిర్మించాడు. కానీ కొంతకాలానికే అది శిథిలమైపోయింది. తరువాత మరికొంతకాలానికి ఆలయ నిర్మాణం చేపట్టాలని ఎంత ప్రయత్నించినా.. అది సాధ్యం కాలేదు. అప్పటి పురోహితుల ప్రకారం... మల్లికార్జునుడు భక్తుల కలలోకి కనబడి తనకు ఆలయం వద్దనీ... వాతావరణ మార్పులలో వుండటమే తనకు ఇష్టమనీ చెప్పాడట. అంతేకాదు.. అదే లోకకళ్యాణం అని చెప్పినట్లు వారు పేర్కొంటున్నారు. ఇలా ఈ విధంగా ఎండకు, వానకు తడవడంతో ఈ స్వామిని ఎండల మల్లికార్జున స్వామిగా పిలువబడుతున్నట్టు వారు చెబుతున్నారు.

స్థలపురాణం :

పూర్వం శ్రీరాముడు రావణుడిని సంహరించిన తరువాత తిరిగి అయోధ్యకు ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఆ ప్రయాణంలోని మార్గమధ్యంలో ఒక మహా అరణ్య ప్రాంతంలో ఒక పర్వత శిఖరం వుండేది. శ్రీరాముడు తన అనుచరులతో కలిసి ఆ అరణ్య ప్రాంతానికి చేరుకోగానే కొద్దిసేపు అక్కడే సేద తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఆ అనుచరగణంలో సుశేణుడు అనే ఒక దైవవైద్యుడు ఆ పర్వత ప్రాంతంలోనే వున్న ఔషధ మౌళిక వృక్షాలను చూసి చాలా సంతోషిస్తాడు.

అయితే అంతటి ఔషధాలున్న వృక్షాలు ఆ ప్రాంతంలో లభిస్తున్నప్పటికీ.. ఆ ప్రాంతంలో వున్న ప్రజలు మాత్రం అనారోగ్యానికి గురయ్యేవారు. అది చూసిన సుశేణుడు ఆశ్చర్యానికి గురయ్యి.. తీవ్ర దిగ్ర్భాంతి చెందుతాడు. అప్పుడు అతను ఎలాగైనా ప్రజలను అనారోగ్యాల నుంచి నివారించేందుకు ఏదైనా చేయాలని నిశ్చయించుకుంటాడు. కైలాసానికి చేరుకోవాలనే తన పూర్వ వాంఛను తీర్చుకునేందుకు కూడా ఈ ప్రాంతమే ఇదే అనువైన ప్రదేశంగా అతను భావిస్తాడు. దాంతో సుశేణుడు తన మనసులో వున్న నిర్ణయాన్ని శ్రీరాముడికి చెబుతాడు. శ్రీరాముడు అతని అనుచరుడిలో వున్న మంచి గుణాలకు మెచ్చుకుని.. అతని కోరిక మేరకు అతని కైలాస వాంఛ తీరాలని ఆశీర్వదించి... అతనిని అక్కడే వదిలేసి తన అనుచరులతో కలిసి అయోధ్యవైపు బయలుదేరుతాడు.

శ్రీరాముడు వెళ్లిపోయిన తరువాత సుశేణుడు ఆ సుమంత పర్వతంపై పరమశివుని కోసం ఘోరతపస్సు చేయడం ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత.. శ్రీరాముడు, సుశేణుడి బాగోగులు తెలుసుకుని రావాల్సిందిగా హనుమంతుడిని అతనున్న పర్వతప్రాంతాలకు పంపిస్తాడు. శ్రీరాముని ఆజ్ఞమేరకు హనుమంతుడు ఆ పర్వత ప్రాంతానికి వెళ్లి.. సుశేణుడు గురించి వెతకడం మొదలుపెడతాడు. ఎంత గాలించినా హనుమంతునికి సుశేణుడు కనిపించలేదు. కానీ అతని కళేబరం మాత్రం కనిపిస్తుంది.

అప్పుడు హనుమంతుడు తన మనసులో.. ‘‘సుశేణుడు తపం ఆచరిస్తూ.. శివసాయుజ్యం పొందినట్లున్నాడు’’ అంటూ భావించుకుంటాడు. వెంటనే అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వుతాడు. సుశేణుని కళేబరాన్ని ఆ గొయ్యిలో పూడ్చేసి.. ఆ గొయ్యికి గుర్తుగా అక్కడే వున్న మల్లెపూలను, దానిపై జింక చర్మాన్ని కప్పేస్తాడు. అనంతరం ఈ విషయాన్ని శ్రీరాముడికి చెప్పాలని హనుమంతుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు.

హనుమంతుడు, శ్రీరాముడికి మొత్తం విషయం చెప్పగా... శ్రీరామువు వెంటనే సీత, లక్ష్మణ, హనుమంతునితో కలిసి సుమంత పర్వతానికి బయలుదేరుతాడు. అక్కడికి చేరుకున్న వెంటనే హనుమంతుడు, శ్రీరాముడికి సుశేణుడి కళేబరాన్ని చూపించడానికి జింక చర్మాన్ని పైకి లేపుతాడు. అయితే అక్కడ సుశేణుడి కళేబరానికి బదులు శివలింగం కనిపించింది. అప్పుడు శ్రీరాముడు, సీతాలక్ష్మణులతో కలిసి పక్కనే వున్న కొలనులో స్నానం ఆచరిస్తాడు. ఆ శివలింగానికి పూజా కార్యక్రమాలను మొదలుపెడతాడు.

శివలింగాన్ని పూజించడం ప్రారంభించగానే.. ఆ లింగం క్రమక్రమంగా పెరిగి పెద్దదవడం మొదలయ్యింది. దాంతో ఆ ప్రాంతంలో వున్న ఔషధ, మూలికలు తిరిగి పూసి, సువాసనలతో కూడిన గాలి ఆ శివలింగాన్ని తాకి, పవనాలుగా మారి.. వీచినంతమేర అనారోగ్యాలుగా వున్నవారు ఒక్కసారిగా తిరిగి ఆరోగ్యవంతులుగా మారిపోతారు. ఆ శక్తిని గమనించిన శ్రీరాముడు మొదట్లో ఆ లింగానికి దేవాలయం నిర్మించాలని నిర్ణయించుకున్నా.. ఆ లింగం పెరిగి పెద్దదవ్వడంతో తన నిర్ణయాన్ని విరమించుకున్నాడు.

అలా ఆ విధంగా ఈ శివలింగం పెరిగి పెద్దదవుతూ మహాశివలింగంగా ఏర్పడింది. శ్రీరాముని ద్వారా మల్లెపూలతో పూజించిబడి, జింక చర్మంతో కప్పబడి వున్నప్పుడు వెలసిన స్వామి కాబట్టి... మల్లికాజిన స్వామిగా పిలవడం జరిగింది. తరువాత క్రమక్రమంగా అది మల్లికార్జున స్వామిగా మార్చబడింది.

అదేవిధంగా పూర్వం ద్వాపరయుగంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ.. ఈ శివలింగం వెలిసిన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయంలో సీతా కుండంగా అనే పిలువబడే కొలనులో స్నానం ఆచరించి, స్వామిని పూజిస్తూ, అక్కడే వున్న గుహలో నివాసం వుండేవారు. అదే సమయంలో ఆ పర్వతంపై అర్జునుడు కూడా శివుని కోసం ఘోరతపస్సు చేశాడు. శివుడు అర్జుని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమని చెప్పాడు. అప్పుడు అర్జునుడు... ‘‘నీ పేరు మీద ఈ క్షేత్రం ఖ్యాతి చెందాలి’’ అని కోరుకున్నాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి మల్లికార్జునస్వామి దేవస్థానంగా పేరు వచ్చింది.

No comments:

Post a Comment