Saturday, April 18, 2015

కార్తీక పురాణం

పూర్వం వ్యాసుడు శిష్యుడైన సూతుడు నైమిశ్యారమునకు రాగా.. శౌనకాది మునులు ఆయనను సత్కరించి, అతిథి మర్యాదలు ఆయన్ని సంతోషపరిచారు. తరువాత కౌవల్యదాయకం అయిన కార్తీకమాస మహత్యం గురించి వినిపించి మమ్మల్ని ధన్యులను చేయండి అని కోరుకున్నారు. వారి కోరికను మన్నించిన సూతుడు వారితో ఇలా అంటాడు...

‘‘శౌనకాదులారా! మా గురువుగారయిన వేదవ్యాసులవారు ఈ కార్తీక మహత్యం గురించి అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మ పురాణాలలో విశదీకరించారు. ముందుగా స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం గురించి వినిపిస్తాను వినండి’’ అంటూ చెప్పాడు.

జనకుడు వశిష్టుని కార్తీక వ్రత ధర్మం గురించి అడుగుట :

పూర్వం ఒక వశిష్ఠ మహర్షి తన సిద్ధాశ్రమంలో జరుగుతున్న యోగానికి కావాలసిన ద్రవ్యార్థి (డబ్బులు) కోసం జనకమహారాజు ఇంటికి వెళ్లాడు. అప్పుడు జనక మహారాజు ఆ మహర్షికి సకల మర్యాదలు చేసి లోనికి ఆహ్వానించాడు. మహర్షి తన యోగానికి సంబంధించి అవసరమైన ద్రవ్యం గురించి ప్రస్తావించాడు.

అందుకు జనకుడు ద్రవ్యం ఇవ్వడానికి సిద్ధపడి ఆనందంగా... ‘‘హే బ్రహ్మార్షి! నీకు ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా అడుగు.. ఇస్తాను. కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వ మాసముల కంటే కూడా కార్తీకమాసం అత్యంత మహిమాన్వితమైనది. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదని, చెప్తూ ఉంటారు. ఈ నెలకు అంత ప్రాముఖ్యత ఎలా కలిగింది.. ఆ వ్రతం ఉత్క్రుష్ట ధర్మం ఏ విధంగా అయింది'' అని మహర్షితో అడుగుతాడు.

అప్పుడు వశిష్టుడు చిరునవ్వుతో... ‘‘జనక మహారాజా! పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గానీ సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీలాంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైంది. విన్నంతమాత్రంచేత అన్ని పాపాలనూ అణచివేసేది. అయినా కార్తీక మహాత్యాన్ని వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు అడిగిన సంగతులను చెప్తాను’’ అని అంటాడు.

‘‘కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో.. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమనాడిగా గానీ, శుద్ధ పాడ్యమి నుండి గానీ ప్రారంభించాలి. ముందుగా - ''సర్వపాప హారం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే'' ఓ దామోదరా! నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేయుము తండ్రీ'' అని నమస్కరించుకుని స్కారపూర్వకంగా సంకల్పించుకుని కార్తీక స్నానం ఆచరించాలి.’’

‘‘కార్తీకమండలి సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం చేసినవారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే, గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలకు చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశాయాల్లో కూడా విష్ణువు వ్యాపించి వుంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీకమాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై కాళ్ళూచేతులూ కడుక్కుని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. తర్వాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి.’’

‘‘అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలితో నీటిని చెలికి మూడు దోసిళ్ళ నీళ్ళను గట్టుమీదికి జల్లి తీరం చేరాలి. చేరగానే కట్టుబత్తలను పిండాలి. దీన్నే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకుని తెల్లటి పొడి మది వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వ పున్ద్రాలను ధరించి, సంధ్యావందనం, గాయత్రీ జపాలను ఆచరించాలి.’’

‘‘తర్వాత ఔపోసన చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి, తోటలోంచి తెచ్చిన మంచి తాజా పుష్పాలను, శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామంలో ఉంచి భక్తితో షోడశోపచారాలతో పూజించాలి. ఆ తరువాత కార్తీక పురాణం చదివి గానీ, విని గానీ స్వగృహం చేరి దేవతార్చన చేసి భోజనం చేయాలి. ఆపైన ఆచమించి పునః పురాణ కాలక్షేపం చేయాలి.’’

‘‘సాయంకాలం కాగానే ఇతర పనులన్నిటినీ విరమించుకుని శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ యథాశక్తి దీపాలను వెలిగించి, దేవుని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి... శుద్ధ వాక్కులతో హరిణి స్తుతించి నమస్కరించుకోవాలి.’’

‘‘కార్తీకమాసం అంతా ఇలాగే వ్రతాన్ని చేసినవారు పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితమైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగావయో బేధరహితంగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే, వాళ్ళు మొక్షార్హులు కావడం నిస్సంశయం.’’

‘‘జనకరాజా! తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా, ఇతరులు చేస్తుండగా చూసి, అసూయారహితుడై ఆనందించేవారికి ఆరోజు చేసిన పాపాలన్నీ విశ్నుక్రుపాగ్నిలో ఆహుతైపోతాయి.’’ అని మహర్షి అంటాడు.

కార్తీక సోమవార వ్రతం :

వశిష్ఠుడు సోమవారం వ్రతం గురించి చెబుతూ... ‘‘హే జనకమహారాజా! వినినంత మాత్రంచేతనే మనోవాక్కాయకర్మల ద్వారా చేసిన సర్వ పాపాలనూ హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను.. ఈ కార్తీకమాసంలో శివునికి ఇష్టమైన కార్తీక సోమవార వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజయినా సరే స్నాన, జపాడులను ఆచరించినవారు వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు. ఈ సోమవారా వ్రాత విధి 6 రకాలుగా ఉంది.’’

1. ఉపవాసం : చేయగలిగిన వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనంగా ఉంది, సాయకాలం శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనానంతరం తులసితీర్థం మాత్రమే సేవించాలి.

2. ఏకభక్తం : సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నానజపాదులు యథావిధిగా ముగించి, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్ధమో తులసి తీర్ధమో తీసుకోవాలి.

3. నక్తం : పగలంతా ఉపవాసం ఉంది, రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం కానీ తీసుకోవాలి.

4. అయాచితం : భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం పెడితే మాత్రమే భోజనం చేయాలి. దీన్నే అయాచితం అంటారు.

5. స్నానం : పైన సూచించిన వాటికి వేటికీ శక్తి లేనివారు సమంత్రక స్నానజపాదులు చేసినట్లయితే సరిపోతుంది.

6. తిలాపాపం : మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది.

పై ఆరు పద్ధతుల్లో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ, తెలిసి ఉండి కూడా ఏ ఒక్క పద్ధతినీ ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుమ్బీపాక రౌరవాది నరకాలని పొందుతారని ఆర్షవాక్యం. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనాధలు, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడూ కూడా పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భాగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు.

సోమవార వ్రతాన్ని చేసేవారు నమక చమక శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి.

ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తాను, వినండి.

నిష్టురి కథ :

పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి ''నిష్టురి'' అనే కూతురు ఉండేది. ఆమె అందంగా, ఆరోగ్యంగా, విలాసంగా ఉండేది. అయితే సద్గుణాలు మాత్రం లేవు. అనేక దుష్ట గుణాలతో గయ్యాళిగా, కాముకురాలిగా ఉండే ఈ నిష్టురిని ఆమె చెడ్డ గుణాలకారణంగా ''కర్కశ'' అని పిలిచేవారు.

నిష్టురి తండ్రి తన బాధ్యత ప్రకారం కర్కాషను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వ్యక్తితో పెళ్ళి జరిపించి, చేతులు దులుపుకున్నాడు. మిత్రశర్మ చదువు, సదాచారాలు ఉన్నవాడు. సద్గుణాలు ఉన్నాయి. సరసమూ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు కావడాన్ని కర్కశ ఆడింది ఆటగా, పాడింది పాటగా కొనసాగింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ, కొడుతూ ఉండేది. అయినప్పటికీ భార్యపై మనసు చంపుకోలేకపోయాడు. పైగా పరువు పోతుందని ఆలోచించాడు. కర్కశ పెట్టే బాధలన్నీ భరించాడే తప్ప, ఆమెను ఎన్నడూ శిక్షించలేదు. ఆమె ఆఖరికి పర పురుషులతో సంబంధం పెట్టుకుని భర్తను, అతని తల్లితండ్రులను హింస పెట్టేది.

ఒకరోజు ఆమెతో నేస్తం చేసిన ఒక దుర్మార్గుడు ''నీ భర్త కారణంగా మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం'' అంటూ రెచ్చగొట్టగా ఆ రాత్రి కర్కశ భర్త నిద్రిస్తుండగా బండరాతితో తల పగలగొట్టి చంపింది. శవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుబడ్డ బావిలో వేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె దుర్గుణాలు, దుష్ట స్నేహాలు ఎక్కువ కనుక అత్తమామలు ఆమెను ఏమీ అనకుండా, తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.

అంతటితో కర్కశ మరీ రెచ్చిపోయింది. కామంతో కన్నుమిన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుంది. పైగా దాన్నో వ్యాపారం కింద చేయసాగింది. చివరికి ఆమె జబ్బులపాలయింది. పూవు లాంటి శరీరం పుళ్ళతో జుగుప్సాకరంగా తయారైంది. విటులు అసహ్యంతో రావడం తగ్గించారు. సంపాదన పోయింది. అప్పటిదాకా భయపడినవారంతా ఆమెను అసహ్యించుకోసాగారు. ఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదు. చివరికి తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ఒంటినిండా రోగాలతో వీధిలో దిక్కులేని చావు తెచ్చుకుంది. యమదూతలు ఆమెను నరకానికి తీసికెళ్ళి శిక్షించారు.

భర్తను హింసించినందుకు కర్కశకు నరకం :

భర్తను విస్మరించి, పర పురుషులను చేరిన కర్కశ పాపాలకు ఆమె మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలి. ముళ్ళ గదలతో తల పగిలేట్లు కొట్టారు. రాతిమీద వేసి చితక్కొట్టారు. సీసం చెవుల్లో వేశారు. కుంభీపాక నరకానికి పంపారు. ఆమె చేసినా పాపాలకు గానూ ముందు పది తరాలు, వెనుక పది తరాలు, ఆమెతో కలిసి 21 తరాలవాళ్ళను కుంభీపాక నరకానికి పంపారు. ఆ తర్వాత ఆమె 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వ సారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది.

సోమవార వ్రత ఫలంవల్ల కుక్క కైలాసం చేరుట :

ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి, శివాభిషేకం మొదలైనవి చేసి, నక్షత్ర దర్శనానంతరం నకట స్వీకారానికి సిద్ధపడి, ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆరోజంతా ఆహారం దొరకక పస్తు ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వల్ల డానికి పూర్వ స్మృతి కలిగి ''ఓ విప్రుడా! నన్ను రక్షించు'' అంటూ మూలిగింది. ఆ కుక్క మూలుగులు విన్న విప్రుడు కుక్క మాట్లాడటాన్ని చూసి విస్తుపోతూనే ''ఏం తప్పు చేశావు.. నిన్ను నేను ఎలా రక్షించగలను?!'' అనడిగాడు.

అప్పుడు కుక్క ''ఓ బ్రాహ్మణుడా! పూర్వజన్మలో నేనొక విప్ర వనితను. కామంతో ఒళ్ళు తెలీక జారత్వానికి ఒడికట్టాను. పతితను, భ్రష్టను అయి, భర్తను కూడా చంపాను. ఆ పాపాలవల్ల నరకానికి వెళ్ళాను...'' అంటూ మొదలుపెట్టి అంతా వివరంగా చెప్పింది. చివరికి నాకు ఇలా పూర్వ జన్మలు ఎందుకు గుర్తొచ్చాయో మాత్రం బోధపడటంలేదు.. దయచేసి చెప్పు..'' అంది.

బ్రాహ్మణుడు జ్ఞాన చక్షువుతో తెలుసుకుని ''శునకమా! ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకూ పస్తు ఉండి నేను విడిచిన బలి భక్షణం చేశావు కదా. అందువల్ల పూర్వజన్మ జ్ఞానం కలిగింది..'' అన్నాడు.

దానికి కుక్క ''కరుణామయుడివైన ఓ బ్రాహ్మణా! నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో చెప్పు'' అని అడిగింది.

దయాళుడైన భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే కుక్క తన శునక దేహాన్ని వదిలి దివ్య స్త్రీ సరీరిని అయి, ప్రకాశ మానహార వస్త్ర్ర విభూషిత అయి, పితృ దేవతా సమంవితయై కైలాసం చేరింది. కనుకనే ఓ జనక మహారాజా! నిస్సంశయంగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించు'' అంటూ చెప్పాడు వశిష్టుడు.

వశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకునికి ఈ విధంగా చెప్పసాగాడు... ‘‘ఓ రాజా! ఈ కార్తీకమాసంలో స్నాన, దాన, జపాల్లో దేన్నైనా ఆచరించినా సరే.. అది మంచి ఫలితాలనిస్తుంది. ఎవరైతే నిత్యం సుఖాన్ని కోరుకుని, కార్తీకమాసాన్ని ఆచరించడం కష్టంగా భావిస్తారో.. వారు వందలజన్మలవరకు కుక్కలుగా పుడతారు’’ అంటూ.. ఉదాహరణగా ఒక కథను వివరిస్తాడు.

కథ :

పూర్వం ఆంధ్రదేశంలో సకల శాస్త్ర పారంగతుడు, అసత్యాలను పలకనివాడు, తీర్థాతన ప్రియుడు అయిన తత్వనిష్టుడు అనే ఒక బ్రాహ్మణుడు వుండేవాడు. ఒకరోజు ఇతను తీర్థయాత్ర గురించి ప్రయాణిస్తూ.. గోదావరీ తీరంలో వున్న మర్రిచెట్టు మీద ముగ్గురు భయంకరమైన రాక్షసులను చూస్తాడు.

ఆ రాక్షసుల భయంవల్ల చుట్టుపక్కల వున్న సుమారు 12 మైళ్ల దూరప్రాంతం వరకు ఏ ఒక్క ప్రాణి సంచారం చేసేది కాదు. అటువంటి భయంకర రాక్షసులను అల్లంత దూరం నుండే చూసిన ఈ తత్వనిష్టుడు భయపడిపోతాడు. ఆ రాక్షసులు కూడా ఇతడిని చూడడంతో మరింత భయపడిపోయి శ్రీహరిని స్మరిస్తూ, అక్కడి నుండి పరుగులు తీయడానికి సిద్ధమయ్యాడు.

తత్వనిష్టుడిని ఎలాగైనా పట్టుకుని చంపాలనే నెపంతో ఆ రాక్షసులు కూడా ఇతని వెంట పరుగెత్తడం మొదలుపెట్టారు. రాక్షసులు ఇతడికి దగ్గరవుతున్నకొద్దీ.. సాత్వికమైన విప్ర తేజస్సు ద్యోతకం అవ్వడం వల్ల ఎడతెరిపి లేకుండా హరినామాన్ని స్మరించడంతో వారికి వెంటనే జ్ఞానోదయం అయింది.

అదే తడువుగా.. ఆ ముగ్గురు రాక్షసులు ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా వెళ్లి దండప్రమానం చేసి.. అతడికి తాము ఎలాంటి హాని తలపెట్టమని నమ్మబలుకుతారు. వారు అతనితో.. ‘‘ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనంతో మా పాపాలన్నీ నశించిపోయాయి’’ అంటూ అతడిని మళ్లీ నమస్కరించుకుంటారు.

అలా వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్టుడు... ‘‘మీరెవ్వరు? మీరేం పాపం చేసి ఇలా అయ్యారు? మిమ్మల్ని చూస్తుంటే బుద్ధిమంతుల్లా కనిపిస్తున్నారు. ఈ వికృత రూపాలు ఏమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయాలు, బాధలు తొలిగేలా సహాయం చేస్తాను’’ అని వారితో చెబుతాడు.

రాక్షసుల కథ :

ఆ ముగ్గురిలో ఒకడు తమ జరిగిన కథ గురించి వివరంగా చెబుతాడు.....

‘‘ఓ విప్రోత్తమా! నేను ద్రావిడిని. ద్రవిడ దేశంలో మంధర అనే గ్రామంలో వుండేవాడ్ని. నేను బ్రాహ్మణుడినే అయినా.. గుణానికి కుటిలుడిని, వంచించే చమత్కారిగా వుండేవాణ్ణి. నా కుటుంబం బాగుండాలని అనుకుని అనేకమంది విప్రులవిత్తాన్ని హరించాను. బంధువులకు, బ్రహ్మాణులకు ఏనాడు పట్టెడు అన్నం కూడా పెట్టలేదు. నయవాంఛనాలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడంవల్ల నా కుటుంబంలోని ఏడుతరాలవారు అథోగతి పాలయ్యారు. నేను మరణించిన తరువాత అనేక నరకయాతనలు అనుభవించి చివరికి ఇలా రాక్షసుడినయ్యాను. కాబట్టి నామీద దయదలచి.. నాకు ముక్తినిచ్చే మార్గాన్ని చెప్పు’’ అని వివరించాడు.

ఆ ముగ్గురిలో రెండవ రాక్షసుడు తన కథను ఇలా వివరించాడు...

ఓ బ్రాహ్మణోత్తమా! నేను ఆంధ్రుడిని. నిత్యం నా తల్లిదండ్రులకు ఇబ్బంది పెడుతూ.. వారిని దూషిస్తూ వుండేవాడ్ని. నేను నా భార్యాభర్తలతో కలిసి మంచి భోజనాలను సేవించేవాడ్ని.. కానీ నా తల్లిదండ్రులకు మాత్రం చద్దిఅన్నం పెట్టేవాడ్ని. నా దగ్గర ఆస్తులు చాలా వున్నప్పటికీ.. ఏనాడు ఒక్క బ్రాహ్మణుడికి కూడా భోజనం పెట్టలేదు. నేను నా మరణానంతరం నరకానికి చేరి... ఘోరాతిఘోరమైన బాధలను అనుభవించి.. చివరికి ఇలా రాక్షసుడినయ్యాను. నాక్కూడా ముక్తినిచ్చే మార్గాన్ని బోధించు’’ అని విన్నవించుకుంటాడు.

ఆ ముగ్గురి రాక్షసులలో మూడవవాడు తన కథను ఇలా చెబుతాడు...

‘‘ఓ సంపన్నుడా! నేను విష్ణు ఆలయంలో పూజారిగా వుండేవాడిని. కాముకుడిని అయి, అహంభావిగా మారి పరుషంగా మాట్లాడేవాడ్ని. భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలను వేశ్యలకు ఇచ్చి, విష్ణు సేవలను సక్రమంగా చేసేవాడ్ని చేయకుండా గర్వంగా తిరిగేవాడిని. చివరకు గుడి దీపాలలో వుండే నూనెను దొంగిలించి, వేశ్యలకు ధారపోసి వారితో సుఖంగా వుండేవాడ్ని. చివరికి నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి.. ఈ భూమిపై హీనజన్మలను ఎత్తి.. ఇలా బ్రహ్మరాక్షసుడిగా అయ్యాను. కాబట్టి నన్ను మన్నించి.. ఇంకో జన్మంటూ లేకుండా నాకు మోక్షం కలిగే మార్గాన్ని వివరించు’’ అని ప్రార్థించుకున్నాడు.

ఇలా ఈవిధంగా ఆ రాక్షసులు తమ విషమగాధల గురించి ఆ విప్పుడుకు చెప్పుకుంటారు. ఎంతో పశ్చాత్తాపం పడుతున్న ఈ రాక్షసులను చూసి విప్రుడు.. ‘‘మీరు భయపడకండి. నాతో కలిసి కార్తీక స్నానం చేయడానికి రండి. మీ సమస్త దోషాలు నశించిపోతాయి’’ అని చెప్పి వారిని తనవెంట తీసుకుని వెళతాడు.

అందరూ కలిసి కావేరి నదికి చేరుకుంటారు. అక్కడ తత్వనిష్టుడు బ్రహ్మరాక్షసులతో కలిసి సంకల్పం చేసుకుని, మొదట తను స్నానం చేసి.. వారికి స్నానం చేయించాడు. ఇలా విధివిధానాలుగా స్నానం చేసిన తరువాత... తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోస్తాడు. దీంతో వారు తమ దోషాలనుండి విముక్తి పొంది, దివ్యరూపాలుగా మారి తక్షణమే వైకుంఠానికి ప్రయాణం చేశారు.

ఈ విధంగా కథను వివరిస్తూ.. మహర్షి జనకునితో ఇలా అంటాడు....

‘‘విదేహరాజా! అజ్ఞానంవల్ల కానీ, మోహం వల్ల కానీ, ఏ కారణం వల్ల అయినా కార్తీకమాసం వేళ కావేరీనదిలో స్నానం చేసుకుని, విష్ణువును పూజించినవారికి పదివేల యజ్ఞాలు చేసేంత ఫలితం దక్కుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసి.. కార్తీకమాసంలో తప్పకుండా కావేరీ స్నానం చేయాలి. ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాత: స్నానం చేయరో.. వారు పదిజన్మల వరకు ఛండాలపు జన్మలు ఎత్తి.. అనంతర ఊరపందులుగా జన్మిస్తారు. కాబట్టి ఎటువంటి మీమాంసాలు లేకుండా స్త్రీలుగానీ, పురుషులుగానీ కార్తీకమాసంలో త్పకుండా స్నానం చేయాలి’’.

అప్పుడు జనకుడు.. ‘‘హే బ్రహ్మార్షి! నువ్వు ఇంతవరకు కార్తీకమాసం మహత్యం గురించి అసాధారణ ధోరణిలో వివరించావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతాన్ని ఆచరించాలి? ఏయే దానాలు చేయాలో వివరంగా తెలియజేయు’’ అని అడిగాడు.

వశిష్టుడు.... ‘‘కార్తీక మాసం ఆచరించడం వల్ల నశించని పాపం అంటూ ఈ ప్రపంచంలో ఎక్కడ పుట్టలేదు. ఈ వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదం. ఇంత మహత్తరమైన ఈ వ్రత ధర్మాలను, ఫలితాల గురించి వివరిస్తాను విను’’....  అంటూ ఈ విధంగా వివరిస్తాడు

‘‘కార్తీకమాస సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము లభిస్తుంది. శివాలయ గోపురద్వారా, శిఖరాలయందు గానీ శివలింగ సన్నిధిలో గానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలూ అంతరించిపోతాయి. ఎవరయితే కార్తీకంలో శివాలయంలో ఆవు నేతి, తో కా, నీ విప్ప నారింజ నూనెలతో గానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలౌటారు. ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించినవాళ్ళు అత్యంత పుణ్యవంతులౌతారు. దీనికి సంబంధించిన కథను చెబుతాను విను’’... అని ఒక కథను చెబుతాడు.

దీపారాధన మహిమ :

పూర్వం పాంచాలదేశాన్ని పాలించే మహారాజు కుబేరుడిని... హోదాకు మించిన ఆస్తులు వున్నప్పటికీ అతనికి కుమారులు లేని కారణంగా కుంగిపోతూ, ఆవేదనతో తపస్సు చేశాడు. అలా చేస్తున్న మధ్యకాలంలో పిప్పలుడు అనే ముని అటుగా వస్తాడు.

అతడు ఆ తపస్సు ఎందుకు చేస్తున్నాడు అడిగి తెలుసుకుంటాడు. అప్పుడా ముని... ‘‘ఓ రాజా! ఈ మాత్రం దానికి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కార్తీకమాసంలో వ్రతాన్ని ఆచరించి, బ్రాహ్మణులకు దీప దాన, దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది’’ అని చెబుతాడు.

ఆ మాటలు విన్న కుబేరుడు తక్షణమే తన పట్టణానికి చేరుకుని, కార్తీక వ్రతాన్ని ఆచరించి.. దీపాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. దాంతో అతని మహారాణి నెలతప్పి యుక్తకాలంలో మగశిశువుకు జన్మినచ్చింది. ఆ రాజా దంపతులు వారి పుత్రుడికి ‘‘శత్రుజిత్తు’’ అనే పేరు పెట్టారు.

శత్రుజిత్తు చరిత్ర :

శత్రుజిత్తుడు యువకుడైన తరువాత... వీరుడై వేశ్యాంగనకు లోనవుతాడు. దాంతో తృప్తి చెందకుండా పరులస్త్రీలతో అనురక్తిత యుక్తాయుక్త విచక్షణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడు. హితువు చెప్పినవారికి చంపేస్తానని బెదిరించేవాడు.

ఇలా వుండగా... ఒక మహా సౌందర్యరాశి అయిన విప్రుని భార్యను చూసి ఇతడు మోహితుడయ్యాడు. ఆమె కూడా ఇతని పట్ల మోజుపడుతుంది. భర్త నిద్రించగానే ఆమె.. రాజు పిలిచిన స్థలాలకు వెళ్లేది. ఇద్దరూ ఆనందించేవారు.

ఒకరోజు భర్త అయిన విప్పుడుకు ఈ విషయం తెలిసిపోతుంది. అయితే అతడు మాత్రం పైకీ ఏమి తెలియనట్లు నటిస్తుంటాడు. ఇద్దరూ కలిసి వున్న సమయంలో చంపాలనుకుని చేతిలో కత్తి పెట్టుకుని తిరుగుతుండేవాడు. ఈ విషయం గురించి ఆ రాజు, విప్పుడు భార్యకు అస్సలు తెలియదు.

ఒక కార్తీకపౌర్ణమినాడు సోమవారం కలిసివచ్చింది. ఆరోజు కాముకులిద్దరూ పాడుపడ్డ శివాలయ స్థలాన్ని ఎంచుకున్నారు. అపరాత్రివేళ ఇద్దరూ కలుసుకున్నారు. ఆలయంలో వున్న చీకటిని పోగొట్టేందుకు విప్ర స్త్రీ తన చీర కొగును చించి, ఒత్తిని తయారుచేసింది. రాజు ఆముదాన్ని తెచ్చి అక్కడున్న ఒక ఖాళీ ప్రమిదంలో పోశాడు. మొత్తానికి దీపాన్ని వెలిగించి... వారిద్దరూ ఒకటయ్యారు.

ఆ సమయంలో విప్పుడు అక్కడకు చేరుకుని... మొదట వారిద్దరిని చంపేసి, ఇతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అటు యమదూతలు, ఇటు శివదూతలు ఇద్దరూ వచ్చారు. శివదూతలు విప్ర స్త్రీని, రాజును కైలాసానికి తీసుకువెళ్లారు. యమదూతలు విప్రుని నరకానికి లాక్కెళ్లడానికి సిద్ధమవుతారు.

విప్పుడిని నరకానికి తీసుకెళుతుండగా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.... ‘‘పాపం చేసినవారికి కైలాసం... నాకేమో నరకమా?’’ అన్నాడు. అందుకు యమదూతలు... ‘‘వీరెంతా పాపాత్ములు అయినా... ఈరోజు కార్తీకపౌర్ణమి. పైగా సోమవారం కూడా. ఏ కారణం అయినా వీరు దీపాన్ని వెలిగించారు. అందులోనూ ఆలయంలో వెలిగించారు కాబట్టి వీరు పుణ్యాత్ములయ్యారు. అలాంటివారిని చంపి నువ్వు పాపాత్ముడివి అయ్యావు. అందుకే వారికి కైలాసం.. నీకు నరకం’’ అని అంటారు.

వీరిమధ్య జరిగిన ఈ సంభాషణను విని శత్రుజిత్తుడు ఈ విధంగా చెబుతాడు... ‘‘అయ్యా! దోషం చేసింది మేము. మాకు కైవల్యమిచ్చి... ఈ పుణ్యరోజున మమ్మల్ని చంపి, మాకు స్వర్గప్రాప్తి కలిగించిన ఆ విప్రుడిని నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీకమాసం గొప్పదయితే సోమవారం ఇంకా గొప్పది. ఆరోజు దీపారాధన చేయడం మరీ పుణ్యప్రదమైందయితే... మాతో కలిసి మరణించిన ఆ బ్రాహ్మణుడికి కూడా కైలాసం ఇవ్వక తప్పదు’’ అని వాదిస్తాడు.

ఫలితంగా శత్రుజిత్తు, తన ప్రేయసి చేసిన ఒత్తులు, ఆముదం పుణ్యాన్ని వుంచుకుని... దానిని వెలిగించిన పుణ్యాన్ని విప్పునికి ధారపోయగా అతడిని కూడా దూతలు కైలాసానికి తీసుకువెళ్లారు.

ఈ విధంగా బ్రహ్మార్షి.. జనకునికి దీపారాధన కథ గురించి వివరించి ఇలా చెబుతాడు.... ‘‘ఓ నగరాధీశ్వరా! కార్తీకమాసంలో తప్పనిసరిగా శివాలయంలో గానీ, విష్ణు ఆలయంలో గానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై, మోక్షాన్ని పొందగల్గుటారు. నా మాట విని కార్తీకమాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి'' అని అతడికి ప్రార్థించుకుంటాడు.

ఓ జనక మహారాజా! మనం చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి కేవలం ఈ ఒక్క కార్తీకమాస వ్రతానికి మాత్రమే వుంది. ఎవరైతే కార్తీకమాసంలో విష్ణుసన్నిధిలో భగవద్గీత పారాయణ చేస్తారో.. వారి పాపాలన్నీ తొలగిపోతాయి. తులసీ దళాలతోగానీ, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతోగానీ విష్ణు పూజ చేస్తారో వాళ్లు వైకుంఠానికి చేరి... విష్ణువుకి సమానంగా భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఏ పురాణాన్ని అయిన ప్రవచించేవారు సర్వకర్మ బంధం నుంచి విముక్తి పొందుతారు.

కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనం చేసినవారు సర్వపాపాల నుంచి విముక్తి పొంది.. విష్ణు దామాన్ని పొందుతారు. జప, హోమ, పూజా, భోజన, తర్పణ ఫలాలతో పాపీ క్షుద్ర చందాలాదుల సంభాషణలను విన్న పాపం తుడిచిపెట్టుకుపోతుంది. ఓ జనక మహారాజా! ఈ కార్తీక మహత్యాన్ని భక్తీశ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు.. దుర్యోనీ సంకటం నుంచి రక్షించబడ్డాడు.. ఆ కథను కూడా చెబుతాను విను..

దేవదత్తోపాఖ్యానం :

పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు వుండేవాడు. అతనికి పరమ దుర్మార్గుడైన ఒక కొడుకు పుట్టాడు. అతని పేరే దేవదత్తుడు. అతడు చేసే దుష్ట ప్రవర్తనలను గుర్తించిన ఆ బ్రాహ్మణ తండ్రి... అతన్ని పాపవిముక్తిడిని చేయాలన్న సంకల్పం అతనికి కలుగుతుంది.

దాంతో ఒకరోజు ఆ బ్రాహ్మన తండ్రి తన కొడుకుతో.. ‘‘నాయనా! నువ్వు రోజూ కార్తీక ప్రాత: స్నానాన్ని ఆచరించు. సాయంకాలం వేళ శ్రీహరి సన్నిధిలో దీపారాధన చేస్తూ వుండు. ఇలా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి అవు’’ అని చెప్పాడు.

కానీ ఆ కొడుకు తన తండ్రికి వ్యతిరేకంగా... తాను అటువంటి కథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని చేయనని చెప్పాడు. అందుకు బ్రాహ్మణ తండ్రి తీవ్ర మనస్తాపానికి గురి అయి, బాధపడుతూ.. ‘‘అలా అయితే నువ్వు చెట్టు తొర్రల ఎలుకవై పడి వుండు’’ అని కొడుకును శపించాడు.

శాపానికి భయపడిపోయిన ఆ కొడుకు.. తండ్రి కాళ్లమీద పడి.. శాపం నుంచి తప్పించుకునే ఉపాయం చెప్పమని కోరుకున్నాడు. దీంతో తండ్రి.. ‘‘బాబు! నువ్వు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని పూర్తిగా వింటావో.. అప్పుడే నువ్వు ఎలుక రూపం నుండి విముక్తి పొంది, సాధారణ రూపానికి చేరుకుంటావు’’ అని శాపవిముక్తిని అనుగ్రహించాడు.

ఓ జనక మహారాజా! పవిత్రమైన కార్తీకమాసంలో పుష్పార్చన, దీపారాధన గురించి వివరించి చెబుతాను విను...

పుష్పార్చన, దీపారాధన విశేషాలు :

కార్తీకమాసంలో శ్రీహరిని కమలాలతో పూజిస్తే.. కమలంలో వుండే లక్ష్మీదేవి ప్రసన్నురాలై, భక్తుల ఇళ్లలో నివాసం ఏర్పరుచుకుంటుంది. తులసీదళాలతోగాని, జాజిపూలతోగాని, మారేడు దళాలతోగాని పూజించేవారు తిరిగి భూమి మీద జన్మించకుండా, మోక్షాన్ని పొందుతారు. కార్తీకమాసంలో ఫలాలను దానం చేస్తే వారు చేసిన పాపాలు చెదిరిపోతాయి.

ఉసిరిచెట్టు కింద ఉసిరికాయలతో విష్ణవును పూజించేవారిని కన్నెత్తి చూడడానికి యముడు కూడా భయపడతాడు. కార్తీకమాసంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలత పూజిస్తారో.. వారిని మంచిన ధన్యులు మరెవ్వరూ వుండరు.

ఎవరైతే కార్తీకమాసంలో విష్ణువుని ఆలయాల్లో మావిడాకుల తోరణం కడతారో... వారు పరమపదాన్ని పొందుతారు. పూలతో, అరటి స్తంభాలతో మండపం కట్టినవారు వైకుంఠానికి చేరి.. విష్ణువు సామీప్యాన్ని పొందుతారు.

ఒక్కసారి అయినా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామం చేసినవారు అశ్వమేధ పుణ్యవంతులు అవుతారు. విష్ణువుకు ఎదురుగా జప, హోమ దేవతార్చనలు చేసేవారు పితృలతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానం చేసి తడి బట్టలతో ఉన్నవానికి పొడి బట్టలు దానం చేసినవారు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతారు. ఆలయ శిఖరం పై ధ్వజారోహణం చేసినవారి పాపాలు గాలికి ఎగిరిపోతాయి.

నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరి పూజను చేసినవారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీకమాసంలో స్త్రీ బృందావన గోమయంతో అలికి, పంచ రంగులతో, శంఖ, పద్మ, స్వస్తికారి నందా దీపాన్ని సమర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వేయినోళ్ళ ఆదిశేషుడు కూడా పొగడలేడు.

కార్తీకమాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయు అయి, మోక్షాన్ని పొందుతాడు. విష్ణు ఆలయంలో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరంలో చిరస్థాయిగా ఉంటారు. హరిణి మల్లెపూలతో పూజించిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యాన్ని చేసినవారి పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై అన్నదానం చేసేవారి పాపాలు గాలికి మంచుతునకల్లా ఎగిరిపోతాయి.

ప్రత్యేకించి కార్తీకమాసంలో నువ్వుల దానం, మహానదీ స్నానం, బ్రహ్మపత్ర భోజనం, అన్నదానం - ఈ నాలుగూ ఆచరించడం ధర్మంగా చెప్పారు. స్నాన దానాడులను ఆచరించని లోభులు నూరు జన్మలు కుక్కలుగా పుట్టి, చివరికి చండాలునిగా పుడతారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి, తదుపరి నూరు జన్మలు శునకంగా పుడతారు.

No comments:

Post a Comment