Saturday, April 18, 2015

శివపురాణం

పూర్వం మహామునులంతా కలిసి యాగం చేయాలనే నెపంతో ఒక ప్రాంతానికి చేరుకుంటారు. అదే చోటుకు మునులందరికంటే ఎంతో శ్నేష్టుడయిన సూతమహాముని అక్కడికి విచ్చేస్తాడు.

వేదాలను విభజించి, పందచమవేదమైన మహాభారతాన్ని, ఉపనిషత్తుల్ని, మరెన్నో గ్రాంథాలను అందించిన వ్యాసమహర్షి శిస్యుడే ఈ సూతుడు. అటువంటి సూతుడు అక్కడికి రావడంతో మునులంతా సంతోషంచి, తమ జన్మ ధన్యమైందని భావిస్తారు.

మునీశ్వరులంతా కలిసి సూతమహామునికి అతిథి సత్కారాలు చేసి.. అర్ఘ్యపాద్యాదులను సమర్పించి పూజిస్తారు. దాంతో సూతుడు చాలా సంతోషించి వారందరినీ ఆశీర్వదిస్తాడు.

అనంతరం మునులంతా కలిసి సూతుడిని... ‘‘మేము యాగం చేయాలని సంకల్పించగానే మీరు ప్రత్యక్షం కావడంతో మాకు చాలా సంతోషంగా వుంది. మీ దయవల్లే మేము అనేక పురాణాలు విని మనస్సును పునీతం చేసుకున్నాం. అదేవిధంగా పవిత్రమైన మీ వాణితో శివుని గురించి, ఆయన మహత్యం గురించి వినాలని అనుకుంటున్నాము. కాబట్టి మమ్మల్ని కనికరించి ఆ కథలను చెప్పి.. మమ్మల్ని తరింపచేయండి’’ అంటూ ప్రార్థిస్తారు.

సూతుడు శివుని గురించి వివరిస్తూ కథను మొదలుపెడతాడు..

నారదుని దీక్ష :

‘‘ఎంతో పవిత్రమైన హిమాలయ పర్వతశ్రేణుల్లో వున్న మానస సరోవరం వద్ద ఒక పర్ణశాలను నిర్మించుకుని.. నారదుడు శివుని గురించి తపస్సు చేయడం ఆరంభించాడు. తగువులమారి, కలహాభోజనుడు వంటి అనేక పేర్లున్నా.. ఆయన చేసే పనులన్నీ చివరకు జగత్కల్యాణంగా పరిణమించడంతో అందరూ ఆయన్ను కొనియాడుతారు. అటువంటి నారదుడు తపస్సు చేయడం చూసి.. స్వర్గాధిపతి అయిన ఇంద్రునికి భయం పుట్టుకుంది.

సాధారణంగా లోకంలో ఎవరు తపస్సు చేసినా.. ముందుగా భయపడేది దేవేంద్రుడే. ఎందుకంటే తన పదవికి ఎక్కడ గండం వస్తుందోనని భయపడుతుంటాడు. ఇప్పుడు కూడా అదే భయంతో నారదుని తపస్సుని చెదరగొట్టేందుకు తన రాచసభలో నాట్యమాడే రంభ, ఊర్వశి, మేనక వంటి అస్పరసల్ని భూలోకానికి పంపిస్తాడు. ఎలాగైనా నారదుని తపస్సుని భగ్నం చేయాలని వారిని ఆదేశిస్తాడు ఇంద్రుడు.

ఇంద్రుని ఆజ్ఞమేరకు ఆ అప్సరసలు నారదుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి చేరుకుంటారు. తమ నటనతో, సౌందర్యంతో నారదుని దృష్టిని తపస్సు నుంచి తప్పించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తారు. చివరికి తమ ఒంపుసొంపుల్ని సైతం ఆజన్మం బ్రహ్మచారి అయిన నారదుని మేనుకు తగిలేలానాట్యం చేస్తూ.. అతనిలో శృంగార పిపాసను రేకెత్తించేందుకు పూనుకుంటారు.

ఆ ముగ్గరు నారీమణుల నాట్యంచూసి చుట్టుపక్కల వున్న పశుపక్షాదులు కూడా పరవశిస్తాయి గానీ.. నారదునిలో మాత్రం ఎటువంటి చలనం వుండదు. వీళ్ల ప్రలోభాలకు ఏమాత్రం ఆకర్షితుడు కాడు. అయితే.. కన్నులు మూసుకున్నట్టే నటించి, వీళ్లేం చేస్తున్నారో అనుగ్రహిస్తూ వుంటాడు.

ఎంతసేపటికీ నారదునిలో ఎటువంటి చలనం లేకపోవడాన్ని గమనించిన ఈ ముగ్గురు నారీమణులు అలిసిపోయి... ‘‘ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఈ జడధారి ముందు మన ప్రయత్నమంతా వృథాయే’’ అనుకుంటూ తిరిగి ఇంద్రలోకానికి వెళ్లిపోతారు.

No comments:

Post a Comment