Saturday, April 18, 2015

అగ్ని పురాణము

ఈ అగ్ని పురాణము గురించి, దీని విశిష్టత గురించి ఇదే పురాణములో 271వ అధ్యాయములో ఈ విధంగా వివరింపబడి వుంది.

శ్లోకము :

అగ్నిరూపేణ దేవాదే ర్మఖం విష్ణు: పరాగతి:

ఆగ్నేయ పురాణస్య వక్తా శ్రోతా జనార్ధన:

తస్మాత్పురాణ మాగ్నేయం సర్వవేదమయం జగత్

సర్వవిద్యామయం పుణ్యం సర్వజ్ఞానమయం పరం

సర్వాత్మహరిరూపం హి పఠతాం శృణ్వతాం నృణాం

విద్యార్థినాం చ విద్యాదం అర్థినాం శ్రీధనప్రదం

సర్వేప్సూనాం సర్వదం తు ముక్తిదం ముక్తికామినాం

పాపఘ్నం పాపకర్తౄణా మాగ్నేయం హి పురాణకమ్.

అనగా.. శ్రీ మహావిష్ణువు అగ్నిరూపముతో దేవదానవ మానవాదులకు ముఖస్థానీయుడై పోషణ చేయుచున్నాడు. అందువల్ల అగ్నిచే చెప్పబడిన ఈ పురాణమును చెప్పేవాడు, వినేవాడు కూడా జనార్ధనుడే. ఆ హేతువు చేత ఈ పురాణము సమస్తమైన వేదమయ జగత్తుగా గ్రహించవలెను. సర్వవిద్యలు, సర్వవిషయ జ్ఞానము, దీనివల్ల పొందవచ్చు. సర్వాత్ముడైన శ్రీహరి విశ్వరూపము కూడా దీనిలో చూడవచ్చు. విద్యార్థులకు విద్యలను, కోరినవారికి ధనాది సంపదలను, ముక్తిని గోరువారికి ముక్తిని, అన్నింటిని కోరుకునేవాటిని ఇచ్చి సర్వపాపాలను దూరము చేసి, మహాపుణ్యమనిచ్చును అని అర్థము. ఈ పురాణమును ఒక విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చు. లౌకికాలౌకిక విషయాలెన్నో దీనిలో వివరింపబడి వున్నాయి. ఈ పురాణమును ఒక మంత్రిశాస్త్రమని కూడా అంటారు. వసిష్టి మహామునికి అగ్నిదేవుడు వినిపించిన పురాణము, నైమిశారణ్యమును సూతుడు శౌనకాది మునులకు వినిపించెను. అగ్నిదేవుడు చెప్పిన పురాణము కావున.. దీనిని అగ్ని (ఆగ్నేయ) పురాణముగా ప్రసిద్ధికెక్కెను.

మహాభారత కథ!

‘‘శ్రీకృష్ణుడు భారత యుద్ధములో పాండవుల పక్షమున నిలిచాడని చెప్పావుగదా, అగ్నిదేవా! ఆ పాండవులెవరు? వారి కథను వినిపించు’’మనగా, అగ్నిదేవుడు వశిష్ఠునికి ఈ విధంగా చెప్పెను. ‘‘బ్రహ్మ మానసపుత్రుడు అత్రి. అతని కొడుకు చంద్రుడు. అతని వంశమున భరతుడు పుట్టెను. వాని వంశములో శంతనుడనువానికి భీష్ముడు పుట్టెను. అతడు పెళ్లి చేసుకోలేదు. శంతమునికి సత్యవంతియందు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనువారు కూడా పుట్టారు. చిత్రాంగదుడు ఒక గంధర్వునితో పోరాడి మరణించాడు. భీష్ముడు విచిత్ర వీర్యునికి కాశిరాజు కూతుళ్లైన అంబిక, అంబాలిక అనువారినిచ్చి పెండ్లి చేసెను. విచిత్రవీర్యుడు క్షయరోగముతో మరణించగా, సత్యవతి ఆ దేశము మీద అంబిక వ్యాసుని వలన ధృతరాష్ట్రుని, అంబాలిక పాండురాజును గనెను. ధృతరాష్ట్రునికి గాంధారియందు దుర్యోధనాదులు వందమంతి కొడుకులు పుట్టిరి. పాండురాజునకు కుంతి, మాద్రి అని అని ఇద్దరు భార్యలు. అతడు శాపగ్రస్తుడు కాగా, అతని అనుమతితో కుంతి యమధర్మరాజు ప్రసాదమున ధర్మరాజును, వాయుప్రసాదమున భీముని, ఇంద్రపసాదమున అర్జునుని గనెను. మాద్రి అశ్వినుల అనుగ్రహమున నకుల సహదేవులను గనెను. పాండురాజు మాద్రిని కలియబోయి మరణించెను.

కర్ణుడు, కుంతికి పెళ్లికాక ముందే సూర్యునివలన పుట్టినవాడు. అతడు దుర్యోధనుడు నాశ్రయించెను. కురుపాండవులు కృపద్రోణుల వద్ద సర్వశస్త్రాస్త్ర విద్యలు నేర్చుకొనిరి. దైవయోగము వలన కురుపాండవుల మధ్య వైరము గలిగెను. దుర్యోధనుడు లక్కయింటిలో బెట్టి పాండవులను దహించెను. పాండవులు తప్పించుకొని ఏకచక్రపురానికి చేరుకున్నారు. మునివేషుములతో నుండి బకాసురుడిని చంపి, పాంచాలదేశమునకు వీరు వెళ్లారు. అక్కడ అర్జునుడు, మత్స్యయంత్రాన్ని కొట్టాడు. ద్రౌపది పాండవులయిదుగురిని భార్య అయ్యెను. పాండవులకు ధృతరాష్ట్రుడు అర్థరాజ్యము అప్పగించెను. శ్రీకృష్ణుడు అర్జునుడిచే ఖాండవ వనమును దహింపజేశాడు. అప్పుడే అగ్నివలన అర్జునునకు గాండీవమను విల్లు, రథము లభించెను. ధర్మరాజు సోదరుల సహాయంతో నలుదిక్కల రాజులను గెలిచి రాజసూయము మహావైభవంగా చేశాడు. అది చూసిన దుర్యోధనునకు కన్నుకుట్టెను. అతడు శకుని, కర్ణ, దుశ్శాసనుల ప్రోత్సాహముతో ధర్మరాజును పిలిచి, శకునితో మాయజూదం ఆడించి రాజ్యాన్ని అపహరించి పాండవులను పన్నెండేళ్లు వనవాసమును, ఒక ఏడు అజ్ఞతవాసము చేయడానికి అడువులకు పంపెను. ధర్మరాజు సోదరులతో, ద్రౌపదితోను ద్వాదశవర్రషములు అరణ్యవాసము చేసి, పదమూడవ యేట అజ్ఞాతవాసము చేయుటకు విరాటనగరమునకు వెళ్లారు. ధర్మరాజు తాను కంకుభట్టయ్యెను భీముల వంటలవాడయ్యాడు. అర్జునుడు బృహన్నలమయ్యెను. నకుల సహదేవులు అశ్వగోపాలకులైరి. ద్రౌపది సైరంధ్రిగా విరటుని భార్య సుధేష్ట దగ్గర చేరెను. అక్కడ కీచకుడను వాడు ద్రౌపదిని కామించి వేధిస్తుండగా.. భీముడొకనాడు రాత్రి వానిని గుట్టురట్టుకాకుండా ముట్టుబెట్టెను. అజ్ఞాతవాసము, పూర్తియగు సమయమున కౌరవులు విరాటుని గోవులను అపహరింపబోయిరి. అర్జునుడు వానిని విడిపించుటకు వెళ్లి బయటపడెను. పాండవులు ఇంద్రప్రస్థమున వున్నప్పుడే అర్జునునికి కృష్ణుని చెల్లెలైన సుభద్రతో పెళ్లి అవుతుంది. వారికి అభిమన్యుడు అనే కుమారుడు పుడతాడు. అజ్ఞాతవాసానంతరము పాండవులను గుర్తించిన విరాటుడు తన కుమార్తె ఉత్తరను అభిమన్యునకిచ్చి వివాహము చేశాడు.

కృష్ణుడు పాండవుల దూతగా కౌరవ సభకు వెళ్లి, ధర్మరాజాదులకు వారి అర్థరాజ్యము వారికి ఇమ్మని అడిగాడు. లేదా ఐదుగురికి ఐదు ఊళ్లైన ఇవ్వవలసిందిగా కోరాడు. దుర్యోధనుడు సూదిమొన మోపినంత భూమికూడా పాండవులకు ఇవ్వనని అంటాడు. అయినచో యుద్ధము తప్పదని శ్రీకృష్ణుడు పలుకగా వాడు కృష్ణున్ని బంధింపబోయెను. అతడు విశ్వరూపము చూపి వారిని నిస్తేజులను చేసెను. తరువాత విదురుని యింట భోజనము చేసి, ధర్మరాజు వద్దకు వచ్చి ‘‘కౌరవులతో యుద్ధము తప్పదు. సన్నాహాలు చేయండి’’ అని చెప్పాడు. యుధిష్టిరునివైపు ఏ డక్షౌహిణుల సేవ సమకూరెను. కౌరవుల వైపు పదునొకం డక్షౌహిణుల సేవ సిద్ధమవుతుంది. యుద్ధమునకు రెండు సేనలను కురుక్షేత్రమునకు చేరినవి. అర్జునుడు భీష్మద్రోణాదులను, ఇతర బంధువులును చూచి, తాను యుద్ధం చేయనంటాడు. శ్రీకృష్ణుడు ‘‘శరీరములు నశించును. ఆత్మనశింపదు. ఆత్మయే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే నేను. అది గ్రహించి జయాపజయములను సమముగా భావించి యోగివై రాజధర్మమును పాలింపు’’ అని బోధించి యుద్ధానికి ఉన్ముఖుని చేస్తాడు. కౌరవ సౌన్యములకు సేనాపతి భీష్ముడు, కౌరవులు, పాండవులు జయాభిలాషతో పోరాడిరి. పాండవ పక్షమున శిఖండి సేనాపతి. పదిరోజుల యుద్ధములో, పదవనాడు శిఖండి భీష్ముడిని పడగొడ్తాడు. స్వచ్ఛంద మరణము వరముగా పొందిగా భీష్ముడు శరతల్పగతుడై, ఉత్తరాయణము కొరరెదురు చూస్తుంటాడు.

తరువాత కౌరవ సేనకు ద్రోణుడు సేనాపతి అవుతాడు. విరాటుడు ద్రుపదుడు కౌరవ సేనకు ద్రోణుడు సేనాపతి అయ్యెను. విరాటుడు ద్రుపదుడు మున్నగువారు ద్రోణసాగరములో మునిగిపోయిరి. ధృష్టద్యుమ్ముడు విజృంభించెను. అశ్వత్థామ చచ్చెనని విని ద్రోణుడు శస్త్రాస్త్రములను విడిచెను. ధృష్టద్యుమ్ముడతనిని బాణములతో కొట్టి చంపెను. తరువాత కౌరవసేనకు కర్ణుడు సేనాని అవుతుడు. పాండవులకును కర్ణునికి ఘోర సంగ్రామం అవుతుంది. రెండవ రోజున ద్వంద్వ యుద్ధములో అర్జునుడు కర్ణుడిని చంపుతాడు. తరువాత శల్యుడు ఒకనాడు సేనాపతిఅయి యుద్ధము చేయగా ధర్మరాజు అతనిని వధిస్తాడు. దుర్యోధననుని తమ్ములను అందరిని పద్దెనిమిదవ రోజు యుద్ధంలో భీష్ముడు చంపుతాడు. తరువాత గదా యుద్ధములో దుర్యోధనుని కూడా చంపేస్తాడు. ఆ రాత్రి కృప కృతవర్మలతో కలిసి అశ్వత్థామ పాండవ శిబిరంలో అందరు నిద్రిస్తుండగా, ఉపపాండవులను, ధృష్టద్యుమ్నని, గజతురగ సైన్యములను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. అర్జునుడు అశ్వత్థామను పట్టుకుని ద్రౌపది దగ్గరకు ఈడ్చుకొని వస్తాడు. ఆమె పుత్రశోకముతో వుండి కూడా, తన పుత్రులను చంపిన అశ్వత్థామను విడిపిస్తుంది. అర్జునుడు అతని శిరోమణిని గ్రహించి విడిచిపెడతాడు. అశ్వత్థామ అస్త్రముతో ఉత్తరా గర్భములో చనిపోయిన పరీక్షిత్తును శ్రీకృష్ణుడు తిరిగి బ్రతికిస్తాడు. భారత యుద్ధములో బ్రతికినవారు, కౌరవ పక్షంలో అశ్వత్థామ కృపకృతవర్మలుగా మారుతారు. పాండవ పక్షములో పాండవులు, సాత్యకి, కృష్ణుడు. ధర్మరాజు చనిపోయిన తన బంధువులకు ఉత్తరి క్రియలు చేస్తాడు. భీష్ముని వలన అనేక ధర్మాలు తెలిసుకుంటాడు. తరువాత అశ్వమేధయాగము చేస్తాడు. ద్వారకలో యాదక వంశక్షయమును అర్జునుని ద్వారా విని చాలా విచారించి, రాజ్యమును పరీక్షిత్తునకు ఇచ్చి భార్య ద్రౌపదితోను, తమ్ములతోను స్వర్గమునకు మహాప్రస్థానము చేస్తాడు. ద్రౌపదియు భీమార్జున నకులసహదేవులను దారిమధ్యలో పడి మరిణిస్తారు. ఇంద్రుడు పంపిన విమానము మీద మానవదేహముతోనే ఎక్కి ధర్మరాజును, తేజోమయ దేహముతో ద్రౌపదీ భీమార్జున నకుల సహదేవులను స్వర్గమును అలంకరిస్తారు.

దేవాలయ నిర్మాణము - దాని పుణ్యము

ఏ దేవునికి సంబంధించిన ఆలయాలను నిర్మించినా దానివల్ల కలిగే పుణ్యం, లాభం ఇంతింత అని లెక్కగట్టలేము. దేవాలయాలను నిర్మించే నిర్మాతల గురించి తన భటులతో ఈ విధంగా వివరిస్తాడు. ‘‘కింకరులారా! ప్రతిమా (విగ్రహ) పూజలు చేస్తున్నవారిని నరకానికి తెచ్చే ప్రయత్నం చేయకుండి. అలాగే దేవాలయాలను నిర్మించినవారి జోలికి కూడా వెళ్లకండి. మంచి చెడ్డలు విచారించి ప్రవర్చించండి. జగద్రక్షకుడై జనార్ధనుని ఆశ్రయించిన వారిని చూసి మీరు దూరం నుండే వెళ్లిపోండి. వారికి నరకలోక బాధలు వుండవుగనుక మీరు వారివైపు చూడనక్కర్లేదు. ఎవరైతే గోవిందనామ స్మరణం చేస్తున్నారో వారిని విడిచి దూరంగానే వుండండి. శ్రీకృష్ణుని భగవానుడిని అర్చన చేసేవారి వద్దకు వెళ్లవద్దు. ప్రతిరోజు ఆలయాన్ని తుడిచి, నీళ్లు చల్లి, ముగ్గులు పెట్టేవారు మహాపుణ్యాత్ములు. వారి జోలికి అస్సలు పోవద్దు. ఆలయ నిర్మాణం చేసిన యజమానియే కాదు... దాని నిర్మాణం కోసం విధులు నిర్వర్తించిన శిల్పులు, కార్మికకులు కూడా పుణ్యాత్ములే. మీరు అటువంటి వారివైపు కన్నెత్తి కూడా చూడొద్దు. ఇది నా ఆజ్ఞ’’. అందువల్ల ఒక దైవమందిరాన్ని శిలలతోగాని, ఇటుకలతోగాని, కొయ్యతోగాని లేదా కనీసం మట్టితోగాని నిర్మించినచో.. సర్వరూప విముక్తుడై ప్రతిదినము యజ్ఞం చేసినంత ఫలాన్ని పొందుతాడు. దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు ఎన్ని సంవత్సరాలైతే నిలిచివుంటాయో.. అన్ని వేల సంవత్సరాలవరకు దేవాలయ నిర్మాత స్వర్గలోకంలో వుంటాడు. విగ్రహనిర్మాత విష్ణులోకంలో స్థానాన్ని పొందుతాడు. ప్రతిష్ట చేసినవారు విష్ణు సాయుజ్యమును పొందుతారు. ఆలయము శిథిలమైనప్పుడు జీర్ణోద్ధరణం చేసినవారు కూడా ఇట్టి ఫలితాన్నే పొందుతారు.దగ్ధయోగములు :

1. ద్వాదశీ భాను (ఆది) వారము దగ్ధయోగము.

2. ఏకాదశీ సోమవారం కూడా దగ్ధయోగము.

3. దశమీ మంగళవారం,

4. తదియా బుధవారం,

5. షష్ఠీ గురువారం,

6. విదియా శుక్రవారములు..

మొదలైనవి దగ్ధయోగాలుగా చెప్పబడినవి. ఈ యోగములలో ఏ పని ప్రారంభించినా అది కొనసాగదు. సప్తమీ ఆదివారం, విదియా ఆదివారం, ద్వాదశీ మంగళవారం, సప్తమీ తృతీయ (తదియ)లతో కూడిన శనివారాలు త్రిపుష్కరాలుగా పిలవబడుతాయి. ఎందుకంటే ఈ దినములలో లాభము, విజయం, వృద్ధి, పుత్రజన్మము, నష్ట, భ్రష్టత్వము, నాశనము.. ఇలా ఏది జరిగినా దాని ప్రభావం మూడురెట్లుగా వుంటుంది.

నవతారలు - వాని ఫలాలు :

జన్మనక్షత్రముగాని, నామనక్షత్రముగాని స్ఫుటముగా నిర్ణయించుకొని, దానినుండి లెక్కపెట్టినచో.. 1. జన్మతార, 2. సంపత్తార, 3. విపత్తార, 4. క్షేమతార, 5. ప్రత్య(రా)క్తార, 6. సాధనతార, 7. నైధనతార, 8. మిత్రతార, 9. పరమమిత్రతార మొదలైనవి వస్తాయి. నక్షత్రాలు 27. తారలు తొమ్మిది. అంటే.. 27/9=3 నవకములు. ప్రతి నవకంలో (9) అవే తారలు వుంటాయి. ఇంకా వీటి ఫలితాలు.

1. జన్మతార ప్రతిఒక విషయానికి, పనికిగాని అంత మంచిదికాదు.

2. సంపత్తార అన్నింటికి చాలా శ్రేష్ఠం.

3. విపత్తర తార అంత మంచి ఫలాలను ఇవ్వదు.

4. క్షేమతార చేసే ప్రతి కార్యములలో మేలు కలిగిస్తుంది.

5. ప్రత్యక్తార ధనాన్ని నాశనం చేస్తుంది.

6. (సా)ధన తార రాజ్యాది లాభాలను కలిగిస్తుంది.

7. నైధనతార సర్వకార్యములను నాశనం చేస్తుంది.

8. మిత్రతార అన్ని పనులలో అనుకూలం కలిగిస్తుంది. మైత్రిని పెంచుతుంది.

9. పరమమిత్రతార అన్ని కార్యాలలో జయాన్ని కలిగించి హితం చేకూరుస్తుంది.

60 సంవత్సరాలు - వాని ఫలితాలు

ప్రభవాది షష్టి (60) సంవత్సరాలకు ఫలాలు ఈ విధంగా వుంటాయి.

1. ప్రభవ యజ్ఞాలు విరివిగా జరుగుతాయి.

2. విభవ జనులు సుఖంగా వుంటారు.

3. శుక్ల : సర్వసమస్యలు సమృద్ధిగా పండుతాయి.

4. ప్రమోద : అందరికీ ఆనందాన్నిస్తుంది.

5. ప్రజాపతి : అన్నిటిలోను అభివృద్ధి కనిపిస్తుంది.

6. అంగీరస : భోగాలు కలుగుతాయి.

7. శ్రీముఖ : లోకంలో సంపద వృద్ధి చెందుతుంది.

8. భావ : ఉన్నత భావములు కలుగుతాయి.

9. యువ : ఇంద్రుడు వర్షాలను కురిపించి, భూమిని (పంటలను) సస్యపూర్ణము చేస్తాడు.

10. ధాత : అన్ని ఔషధాలను (మొక్క ధాన్యాలు) ఫలిస్తాయి.

11. ఈశ్వర : మానవ ఆరోగ్యం, క్షేమాన్ని ఇస్తాయి.

12. బహుధాన్య : దేశం సుభిక్షంగా వుంటుంది.

13. ప్రమాథి (స్వభాను, సుభాను) : వర్షాలు మధ్యస్థముగా వుంటాయి.

14. విక్రమ : సస్యములు, సంపదలు వృద్ధి చెందుతాయి.

15. వృష : వర్షం అన్నిచోట్లా బాగా కురుస్తుంది.

16. చిత్రభాను : చిత్ర విచిత్రమైన అలంకారాలను ఇచ్చును.

17. స్వర్భాను : క్షేమాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.

18. తారణ : మేఘములు అనుకూలంగా వర్షించి శుభాలను కలిగిస్తాయి.

19. పార్థివ : సస్యసంపదలు పెరుగుతాయి.

20. వ్యయ (జయ) : అతి వృషష్టి కలుగుతుంది.

21. సర్వజిత్తు : ప్రజలు అనుకునే విధంగా వర్షాలు ఇచ్చును.

22. సర్వధారి : సుభిక్షంగా వుండును.

23. విరోధి : మేఘాలను హరించి, అనావృష్టిని కలిగిస్తుంది.

24. వికృత : ఇది చాలా భయంకరంగా వుండును.

25. ఖర : పురుషులు వీరులవుతారు.

26. నందన : ప్రజలు ఆనందంతో సుఖంగా వుంటారు.

27. విషయ (విజయ) : శత్రువులను సంహరించును.

28. జయ : శత్రువుల పైనగాని, రోగాలపైనగాని జయాన్ని కలిగించును.

29. మన్మథ : జ్వరాది బాధలు కలిగుతాయి.

30. దుర్మఖ (దుష్కర) : ప్రజలు దుష్కర్మములు చేయవారవుతారు.

31. హేమలంబ : సంపదలు గలుగును.

32. విలంబ : సుభిక్షంగా వుండును.

33. వికారి : శత్రువులకు కోపము కలిగించును.

34. శార్యరి : అక్కడక్కడ సస్యములు ఫలించును.

35. ప్లవ : నీళ్లు సమృద్ధిగా ప్రవహిస్తాయి.

36. శుభకృత్తు : ప్రజలు శుభాలతో వుంటారు.

37. శోభకృత్తు : ప్రజలు శుభాలతో వుంటారు.

38. క్రోధి : మానవునిలో కోప స్వభావము పెరుగుతుంది.

39. విశ్వావసు : ధన సమృద్ధి కలుగుతుంది.

40. పరాభవ : ప్రజలు ఒకరిమీద ఇంకొకరు అనుమానాలను పెంచుకుంటారు.

41. ప్లవంగ : జల సమృద్ధి కలుగుతుంది.

42. కీలక : సస్య సమృద్ధి కలుగుతుంది.

43. సౌమ్య : శుభాలు కలుగుతాయి.

44. సాధారణ : సామాన్యమైన శుభాలు కలుగుతాయి.

45. విరోధికృత్తు : జనాల మధ్య విరోధాలను పెంచుతుంది.

46. పరీధావి : భీతిని కలుగించును.

47. ప్రమాది : ప్రమాదాలు ఎక్కువవుతాయి.

48. ఆనంద : సంతోషకంగా, హాయిగా వుండును.

49. రాక్షస : ప్రజలు కఠిన హృదయాలను కలిగి వుంటారు.

53. సిద్ధార్థం : సర్వకార్యాలు శుభంగా జరుగును.

54. రౌద్ర : ప్రజలకు బాధాకరంగా వుంటుంది.

55. దుర్మతి : వర్షాలు సామాన్యంగానే వుండును.

56. దుందుభి : క్షేమమును, ధాన్యములను ఇచ్చును.

57. రుధిరోద్గారి : రక్తధారలు ప్రవహించును.

58. రక్తాక్ష : రక్తధారలు ప్రవహించును.

59. క్రోధన : జయము కలిగించును.

60. క్షయ : లోకమున ధనము క్షీణించును.

ఆచారాలు :

మానవుడు నిత్యజీవితంలో ప్రతిదినం ఆచరించవలసిన కర్మములనే ‘‘ఆచారాలు’’ అంటారు. బ్రహ్మముహూర్తమయిన అంటే.. తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి దైవప్రార్థన చేయాలి. పగటివేళ ఉత్తర ముఖంగా కూర్చుని మలమూత్రవిసర్జన చేయాలి. రాత్రివేళ దక్షిణ ముఖుడై చేయాలి. అలాగే సంధ్యాకాలంలో ఉత్తర ముఖుడై చేయాలి. అవి కూడా దారిలో గానీ, నీటిలో గానీ చేయరాదు. గడ్డి మొలచిన చోటే విసర్జనము చేయాలి. కాలకృత్యములను తీర్చుకొని దంతధావనము చేసుకోవాలి. తరువాత స్నానం చేసుకోవాలి. స్నానము చేయకుండా పూజలు చేసినా, వ్రతాలు పెట్టినా అవి ఫలాలను ఇవ్వవు. స్నానం చేసుకోవడానికి నూతినీళ్లు, నదినీళ్లు లేదా సరస్సులోని నీళ్లు చాలామంచివి. స్నానం చేసిన తరువాత మన అంతశ్శుద్ది కోసం ఆచమనం చేసుకోవాలి. బ్రాహ్మణులైతే అఘమర్షణ సూక్తాలు జపించుకోవాలి. పురుష సూక్తము కూడా జపించవచ్చును. ఉత్తరీయమును పిండుకొని దేవతా పితృతర్పణము చేయాలి. బట్టలు పిండుకొన్న తరువాత సంధ్య మార్చుకోవాలి. తరువాత అగ్నిహోమం చేయాలి. స్నానాంతరం దైవధ్యానము చేసి, పిదప దైవదర్శనం చేసుకోవాలి. సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు చూడరాదు. (వాటి అల్ట్రా వాయోలెట్ కిరణాలు మనల్ని హానీ చేయవచ్చు). నీళ్లలో కూడా సూర్యబింబాన్ని చూడరాదు. లాగే నగ్నంగా వుండే మహిళను కూడా చూడకూడదు. నీటిలో పడ్డ తన నీడను చూసుకోకూడదు. వధ్యస్థానమును చూడరాదు. పాపాత్మునిని చూడరాదు. ప్రత్తిని, ఎముకను, భస్మమును దాటరాదు. విషమంగా వుండే చెట్లు, కొండలు ఎక్కరాదు. నోటితో ఈల వేయరాదు. కట్టిన బట్టను తిరుగవేసి మరల కట్టుకొనరాదు. ఎప్పుడును శుభమునే పలుకవలెను. అశుభము పలుకరాదు. పెద్దవారి మధ్యనుండి వెళ్లరాదు. రెండు చేతులతో బుర్ర గోకికొనరాదు. నీళ్లలో మలమూత్రములు విడువరాదు. నదులలోగాని, జలాశయములలోగాని నగ్నముగా స్నానము చేయరాదు. ‘‘నాప్పు మూత్రపురీషం కుర్యాత్! నవివసన:స్నాయత్’’ అని వేదము కూడా చెప్పింది. దుష్ట వర్తనం గలవారి పక్కన నివసింపరాదు. వైద్యుడు లేనిచోట, రాజుపాలన లేిచోట, నది లేనిచోట, దుష్ట స్త్రీలున్నచోట నివసింపరాదు. నవ్వినను, తుమ్మినను, ఆవులించినను నోటిని మూసుకోవాలి. తనకుగాని, తన యజమానికి గాని జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోకూడదు. రోగమెంత చిన్నదైన దానిని నిర్లక్ష్యం చేయకూడదు. వేద శాస్త్రములను, దేవతలను నిందించువారి పక్కన కూడా నిలువరాదు. ధర్మాన్ని ఆదరించాలి. దేవపూజలు చేస్తూ వుండాలి. పుట్టినరోజునాడు దేవపూజ చేసి దానధర్మాలు చేస్తే మంచిది. పష్టినాడు, చతుర్దశినాడు (నరక చతుర్దశి తప్ప), అష్టమినాడు, అమావాస్యనాడు అభ్యంగన స్నానము చేయరాదు. పెద్దవారితో ఎప్పుడు విరోదం పెట్టుకోరాదు. స్త్రీలతో కూడా కలహాలు పెట్టుకోకూడదు.నవగ్రహ యజ్ఞము :

ప్రజలు లేదా రాజుల పతనములుగానీ, ఔన్నత్యములుగాని, గౌరవ, అగౌరవాలు గాని, గ్రహాల సంచారము వల్లే ఏర్పడుతుంది. కావున నవగ్రహాలను ఆరాధించాలని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఎప్పుడైతే గ్రహం వలన మనకు పీడ కలుగుతుందో ఆ గ్రహమునకు శాంతి చేయాలి. సంపదలు, శాంతి, వర్షము, ఆయువు, అభివృద్ధి, ఆరోగ్యము కోరుకునే ప్రజలు నవగ్రహ యజ్ఞాన్ని తప్పకుండా పాటించాల్సి వుంటుంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతులు అని తొమ్మిది గ్రహాలున్నాయి. ఈ నవగ్రహాలను ఆయా మంత్రములతో మండలముపై ఆవాహనము చేసి పూజించి, పంచామృతాలతో అభిషేకించాలి. నైవేద్యములు, తాంబులాది ఉపచారము అర్పించి, తరువాత అగ్ని ప్రతిష్టాపనం చేసి సమిథులతో 108 సార్లుగాని, 28 సార్లుగాని యథాశక్తిగా హోమం చేసి ఆయా గ్రహాలకు నిర్ణయింపబడిన ధాన్యములను, వస్తువులను దానములుగా ఇచ్చి ధనాన్ని దక్షిణలుగా ఇవ్వాలి. ఇట్లు నవగ్రహ యజ్ఞం చేసినచో వారు సంతుష్టుల, చేసిన యజమానులకు కోరిన వరాలు ఇస్తారు.

నాడీచక్రము :

నాడీ చక్రము నెరింగినవారు ప్రాణస్వరూపమును, తద్వారా హృదయాంతర్గతుడైన పరమాత్మ స్వరూపమని గ్రహించుకోవాలి. నాభికి కిందిగా నాడుల మూలకందం వుంటుంది. అక్కడి నుంచే నాడులు ప్రారంభం అవుతాయి. నాభి మధ్యమున 72000 నాడులుంటాయి. ఇవ శరీరం అంతా నిలువుగాను, అడ్డంగాను, ఊర్థ్వంగాను వ్యాపించి వుంటాయి. వీటి మధ్య పది ప్రధాన నాడులుంటాయి. అవి ఇబ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తిజిహ్వ, పృథ, యశ, ఆలంబుస, హుహు, శంఖిని అని వాటి పేర్లు. వాయువులు కూడా పది వుంటాయి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయం అని మొదలైనవి. ఈ పదివాయువులలో ప్రాణము మొదటిది.. ప్రధానమైనది. ప్రాణవాయువు ప్రాణాన్ని నిలబెడుతుంది. హృదయ స్థాపం నుండి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములతో జీవనాధారమై వుంటుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి, మలమూత్ర శుక్రరూపంలో తోసేది ఆపానవాయువు. తాగిన వాటిని, తిన్నవాటిని రక్తముగా, పిత్తముగా, శ్లేషముగా, వాయువుగా మార్చి శరీరమునకు, పెదవులను,కన్నులను అదురునట్లు చేయుచు కామక్రోధాదులను ఉత్తేజపరిచేది ఉదానవాయువు. శరీరాన్ని ఎటు కావాలంటే అలా కదులునట్లు, కంఠముదాక వ్యాపించియుండి, ఆహార విహారాదులలో ఏ మాత్రము తేడా వచ్చినా వ్యాధులు కలిగించేది వ్యానవాయువు. వమనం కలిగించునది నాయవాయువు. కన్నులు తెరిచేటట్లు చేసే కూర్మవాయువు. మింగుటలో సహాయపడేది కృకరవాయువు. ఇంద్రియములు విజృంభించునట్లు చేసేది దేవదత్తవాయువు. ప్రాణఘషయందు నిలచేది, ప్రాణమును పోసేది, శరీరమును దహనమయ్యే వరకు అంటిపెట్టుకుని వుండేది ధనుంజయవాయువు. (చెవులలో వేళ్లు పెట్టకున్నచో మనకు శబ్దం వినబడుతుంది. అదే ప్రాణఘోషము). సుషుమ్నవాడి శరీరమధ్యమున వెన్నెముకలో వుంటుంది. ఇడానాడి ఎడమ భాగంలోని, పింగళానాడి కుడిభాగంలో వుంటుంది. గాలిని పీల్చి పొట్టను ఉబ్బటాన్ని ప్రాణయామ అంటారు. ఇడానాడి ద్వారా గాలిని లోనికి పీల్చుట పూరకమంటారు. ఆ గాలిని శక్తిమేరకు లోపల బంధించడాన్ని కుంభకమంటారు. పింగళానాడి ద్వారా గాలిని విడుచుటాన్ని రేచక మంటారు. ఇది ఒక ప్రాణాయామ విధానం. ప్రాణాయామము చేయకపోయిన మనం నిత్యం గాలిని పీల్చి వదులుచునేయుందము. గాలిని పీల్చుచున్నప్పుడు ‘‘సో’’ అను శబ్దం వచ్చును. విడుచున్నప్పుడు ‘‘హం’’ అను శబ్దం వచ్చును. ‘‘సోహం’’ అనుదానికి ‘‘ఆ పరమాత్ముడనే నేను’’ అని అర్థం. అంటే మనం తెలిసీ, తెలియకో ప్రతిరోజు ప్రతిక్షణం పరమాత్ముడ్ని స్మరిస్తున్నామన్నమాట. దీనినే హంసగాయత్ని అందురు. గాయత్రి వఅంటే ప్రాణములను రక్షించుచున్నది అని అర్థం. ఈ పరమార్థమును గ్రహించి ఎవ్వరి హంస గాయత్రిని జపింతురో వారికి పునర్జన్మ వుండదు.ప్రణవము (ఓంకారము) :

వేదాలు ఓంకారంతో మొదలై ఓంకారంతోనే ముగుస్తాయి. ప్రణవం సర్వ వాఙ్మయ రూపం. ఆకారము, ఉకారము, మకారములలోని అర్థమంతా కలిసి ఓమ్ అని ప్రణవ స్వరూపం ఏర్పడింది. అకార, ఉకార, మకారములు మూడు, మూడు వేదాలు, మూడు లోకాలు (భూ: భువ: సువ:), బ్రహ్మ విష్ణు శంకరులు, సత్త్వరజస్తయో గుణములు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు, ప్రద్యుమ్న - శ్రీ లక్ష్మి - వాసుదేవ అనే అర్చామూర్తులు అని భావింపబడుచున్నవి. ఇట్టి ఓంకార స్వరూపాన్ని తెలుసుకొన్నవాడే ముని, తురీయ మాత్ర గాంధాని అని పిలవబడును. అది ఘటము నందలి దీపమువలె దేహమధ్యమున హృదయపద్మములో పరబ్రహ్మ జ్యోతి రూపమున ప్రకాశించుచుండును. దానిని నిత్యము జపించుచు ధ్యానించవలెను. ప్రణవం ధనస్సు. మొదటనే నామరూపరహితమైన పరబ్రహ్మమును ధ్యానింటుచసాధ్యము కాదు. అందుకే విగ్రహారాధన. ఆ రూపము మనసులో హత్తుకొన్న తరువాత క్రమంగా జ్ఞానసిద్ధి కలుగును. ఆ పైన నిర్గుణ బ్రహ్మోపాసనము సాధ్యమగును. ప్రణవ స్వరూపమైన ఈ ఒక్క అక్షరమే బ్రహ్మము. అదే సర్వశ్రేష్ఠము. అదే అందురికి గమ్యస్థానం .. ‘‘ఓమిత్యేకాక్షరం బ్రహ్మ’’.

No comments:

Post a Comment