Saturday, April 18, 2015

గజేంద్రుని మోక్షం

పూర్వం త్రికూట పర్వత అరణ్యంలో ఒక గజరాజు వుండేవాడు. అతనికి పదిలక్ష్మలమంది భార్యలు కూడా వుండేవారు. గజరాజు ఒకరోజు తన భార్యలతో కలిసి అడవిలో తిరుగుతుండగా అతనికి తీవ్రంగా దాహమేస్తుంది. ఆ అరణ్యంలోనే వున్న ఒక చెరువులో నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంటాడు. ఆ చెరువులోనే తన కరిణులతో జలక్రీడలు ఆడి, చెరువునంతటిని కలచివేస్తాడు.

చెరువులోనే ఒక పెద్ద మొసలి వుంటుంది. గజరాజును చూసిన మొసలి, అతని కాలును పట్టుకుంటుంది. అప్పుడు వెంటనే గజరాజు తన తొండంతో విదిల్చి ఆ మొసలిని కొట్టి, తప్పించుకుంటాడు. అయినప్పటికీ మొసలి ఆ గజరాజ కాలుని మళ్లీ పట్టుకుంటుంది. గజరాజు తనను తాను కాపాడుకోవడానికి చెరువు ఒడ్డుకు వెళుతుండగా.. ఆ మొసలి మాత్రం పట్టువీడకుండా చెరువు లోపలికి లాక్కుని వెళుతుంటుంది. ఇలా ఈ విధంగా వీరిద్దరి మధ్య పోరు వెయ్యి సంవత్సరాలవరకు సాగుతుంది.

మొసలి స్థానబలంతో మరింత విజృంభించి గజరాజును చెరువులోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. గజరాజు మాత్రం శక్తిహీనువయిపోయి.. మొసలితో గెలుస్తానా..? లేదా..? అనే సందేహాన్ని కలిగి వుంటాడు. అప్పుడు తన స్థిరబుద్ధితో గజరాజు, భగవంతుడైన శ్రీ మహావిష్ణువును కాపాడమని మొరపెట్టుకుంటాడు.

శ్రీహరి గజరాజు పడుతున్న బాధను చూసి ఒక్కసారిగా కరిగిపోతాడు. ఎలాగైనా తనను కాపాడాలనే దృఢ నిశ్చయంతో సంకల్పిస్తాడు. పక్కనే వున్న తన సతీమణి లక్ష్మీతో కూడా చెప్పకుండా.. శ్రీహరి గజరాజును కాపాడటానికి పరుగులు తీసుకుంటూ వచ్చాడు. తన చేతిలో వున్న చక్రాయుధాన్ని ఉపయోగించి మొసలిని చంపి, గజరాజును కాపాడాడు.

కథలోని పాత్రలు :

విష్ణువు చేత రక్షించబడిన గజేంద్రుడు.. పూర్వ జన్మలో శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడైన ఇంద్రద్యమ్నుడు అనే ఒక రాజు. ఒకనాడు రాజు, శ్రీహరి ధ్యానంలో వుండగా.. అగస్త్యుడు అక్కడికి చేరుకుంటాడు. ధ్యానంలో వున్న రాజు అతనిని చూడలేకపోయాడు. అందువల్ల అగస్త్య ముని కోపాద్రిక్తుడై.. ‘‘నువ్వు మదంతో నాకు మర్యాదలు చేయడం మరచిపోయావు. కాబట్టి నువ్వు వచ్చే జన్మలో మదగజవై పుట్టుగాక’’ అని శపించాడు. ఆ విధంగా ముని శాపంతో ఇంద్రద్యుమ్నుడు, గజరాజుగా జన్మనెత్తాడు. పూర్వజన్మలో అతను విష్ణువు మీద చూపించిన భక్తి తన మనసులో అంకురించి, గజరాజుగా వున్నప్పుడు విష్ణువు అనుగ్రహాన్ని పొందాడు.

మొసలి కూడా ‘‘హుహు’’ అనే ఒక గంధర్వుడు. పూర్వం దేవలుని శాపంతో అతను మొసలిగా మారిపోయాడు. తరువాత శ్రీహరి చక్రధారణతో చచ్చి.. పుణ్యగతిని పొందాడు.

No comments:

Post a Comment