Saturday, April 18, 2015

మత్స్య పురాణం

మత్స్య పురాణం - సృష్టి ప్రారంభం

పూర్వం శౌనకాది మహామునులు మత్స్యవతారం గురించి అడిగి తెలుసుకోవడం కోవడం కోసం సూతుడిని ఇలా అడిగారు. ‘‘ఓ సూతపౌరాణికా! విష్ణువు మత్స్యావతారం ఎత్తడానికి కారణమేమి? మత్స్యవతారం గురించి మత్స్యపురాణం గురించి తెలుసుకోవాలనుంది కాబట్టి మాకు సవివరంగా వివరించు’’ అని కోరుకుంటారు. దాంతో సూతుడు మత్స్యపురాణం గురించి ఇలా వివరిస్తాడు.

‘‘నీళ్లు నారములుగా చెప్పబడుతుంది. అవే నీళ్లు నరులకు ప్రాణాధారం కూడా. అటువంటి నీటిలో నివాసస్థానాన్ని ఏర్పరుచుకున్న ఆ పరబ్రహ్మమూర్తియే నారాయణుడగా చెప్పబడతాడు.’’

మొదట అంటే.. సృష్టికి పూర్వం ఏమీ వుండేది కాదు. అనివైపులా ఒక్క వస్తువుగాని, ప్రాణం కాని వుండేది కాదు. అయితే ముందు సత్తు (ఒక వస్తువు రూపం) పుట్టింది. దాని నుంచి మహత్తు. దాని నుంచి అహంకారం, దాని నుంచి గుణాలు. అక్కడి నుంచి బ్రహ్మాదుల సృష్టి జరిగింది. బ్రహ్మసృష్టికి పూర్వం అంతా జలవర్ణమే వుండేది. ఆ జలవర్ణంలో పరమాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్రశాయియై వుండేవాడు. బ్రహ్మసృష్టి జరిగిన తరువాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది.

జలవర్ణంలో శయనించి వున్న ఆది పరబ్రహ్మం.. తన చుట్టూ వున్న నీటిని తన పొడవైన చేతులతో కలియబెట్టగా అందులో నురుగుపుట్టి, రెండు బుడుగలు లేచాయి. ఆ బుడుగుల నుంచే భూమి, ఆకాశాలు కల్పించబడ్డాయి. అలాగే భూమి మీద మన్ను, రాళ్లు, కొండలు కూడా కల్పించబడ్డాయి.

ఆ సమయంలో మహాపురుషుని నాభినుంచి ఒక కమలం జన్మించింది. నారాయణుడు ఒక తుమ్మెద అయి ఆ కమలం చుట్టు తిరుగుతూ.. చివరకు అందులో ప్రవేశించాడు. తన తేజస్సును దానిలో ప్రవేశపెట్టి, బయటకు వచ్చాడు. తరువాత కమలం నుంచి ఎనిమిది భుజాలతో, నాలుగు మొహాలతో బ్రహ్మ జన్మించాడు.

అతను తన చుట్టూ వున్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ.. ఓంకారనాదం వినిపించాడు. ఏమి చేయాలో తోచక.. ఆ తామర తాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు. లోపల నారాయణుని గర్భకుహరంలో బ్రహ్మాండమంత సముద్రాలతో, నదులతో, కొండలతో కనిపించిగా.. కలవరపడి మళ్లీ బయటకు వచ్చేశాడు. ఆ కమలంలో ఏమీ చేయాలో తోచక నిష్ర్కియుడై ఒక చోట కూర్చుని వుంటే.. ‘‘తపస్సు చేయు, తపస్సు చేయు’’ అనే మాటలు వినిపించాయి.

బ్రహ్మ తన చుట్టూ వినిపిస్తున్న ప్రణవాన్నే ఉచ్ఛరిస్తూ కొన్ని వేల సంవత్సరాలవరకు తపస్సు చేయసాగాడు. అప్పుడు తనను నాభి కమలం నుంచి ఉద్భవింపజేసిన నారాయణుడు ప్రత్యక్షమై.. ‘‘ఓ బ్రహ్మా! సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను. కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయడంవల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు. స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. సృష్టిని ప్రారంభించు’’ అని చెప్పి, అదృశ్యమయ్యాడు.

ప్రకృతి అతనికి సరస్వతీ రూపంలో కనిపించింది. బ్రహ్మ పురుషుడు కాబట్టి... ప్రకృతి, పురుషుడు ఏకమయ్యారు. అసాంగత్యం వల్ల బ్రహ్మ ముఖం నుంచి ఆరేసి అక్షరాలు చొప్పున పుట్టాయి. అంటే.. శక్తీస్వరూపిణీ అయిన గాయత్రీ (సావిత్రి) జన్మించింది.

తరువాత బ్రహ్మ కనుబొమ్మలనుంచి దక్షప్రజాపతి, మనస్సు నుంచి సకనసనంద సనత్కుమార, సనత్సుజాతుఅనే వారు, కశ్యపాది ప్రజాపతులు జన్మించారు. వీరందరికీ నివసించడానికి ఒక చోటు కావల్సిందిగా బ్రహ్మ, శ్రీ విష్ణువును ప్రార్థించాడు. అతడు కోటిసూర్యుల తేజస్సుతో జలాలను ఇంకింపచేశాడు.

అప్పడు బ్రహ్మ భూర్ఛువస్సురాది ఊర్థ్వలోకాలు ఏడు, అతల, వితల, సుతలాది అధోలోకాలను ఏడు నర్మించాడు. ఈ లోకాలన్నింటిలో దేశాలు, రాజ్యాలు, నదీనదులు, సముద్రాలు, పల్లెలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైనవి ప్రాణులకు అవసరమైన వస్తువులను, జీవరాసులను సృష్టించాడు.

ఆ విధంగా సృష్టించబడిన జీవులందరికీ ఆ లోకంలో స్థితికి తగ్గట్టుగా కాలప్రమాణాలు ఏర్పరిచాడు. ఆ జీవుల ఆయుర్దాయములు నూరు సంవత్సరాలుగా నిర్ణయించబడ్డాయి. అవి పరమని, పరార్థమని, పరార్థారామని చెప్పబడుతాయి. పదిహేను రెప్పలపాటు కాలము ఒక కాష్ట, ముప్పై కాష్టలు ఒక కల, ముప్పై కలలు ఒక ముహూర్తము, ముప్పై ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి దినం. (ముహూర్తం అంటే రెండు గడియలు, గడియకు అరవై విఘడియలు).

పదిహేను ముహూర్తాలు ఒక పగలు, పదిహేను ముహూర్తాలు ఒకరాత్రి, పదిహేను దినాలు ఒక పక్షం లేదా అర్థమాసం. ఇది మానవ లోక కాలప్రమాణంగా నిర్ణయించబడింది. ఇలా మానవ సంవత్సరం ఒకటి గడిస్తే.. దేవతలకు ఒక అహోరాత్రులు కలిసి దినం అవుతుంది.

17,28,000 మానవ సంవత్సరాలు కృతయుగ ప్రమాణం... 12,96,000 మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం... 8,64,000 మానవ సంవత్సరాలు ద్వాపరయుగ ప్రమాణం. 4,32,000 మానవ సంవత్సరాలు కలియుగ ప్రమాణం. ఈ నాలుగు యుగాలను కలిపి మహాయుగం అంటారు.

ఇటువంటి మహాయుగాలు వేయి గడిస్తే.. బ్రహ్మకు పగలు. మరొక వేయి మహాయుగాలు గడిస్తే.. రాత్రి. అంటే.. రెండువేల మహాయుగాలు గడిచిచిన తర్వాతే బ్రహ్మకు ఒక అహోరాత్రులు కలిసిన దినం అవుతుంది. ఇటువంటి దినాలు ముప్పై అయితే ఒక మాసం. పన్నెండు మాసాలు ఒక సంవత్సరం. అటువంటి నూరు సంవత్సరాలు బ్రహ్మకు ఆయుర్ధాయువు.

బ్రహ్మకు ఒక పగలు గడిస్తే.. ఆయనకు నిద్ర వచ్చి సృష్టిని ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టంతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది. దీనినే నైమిత్తిక ప్రళయం అంటారు. ఆ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచిన తరువాత బ్రహ్మ మళ్లీ సృష్టిని యథాపూర్వకంగా ప్రారంభించి.. అన్నింటిని సృష్టిస్తాడు.

పూర్వం ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు వుండేవాడు. అతను విష్ణువు భక్తుడైన మహా ధర్మాత్ముడు. అతని రాజ్యంలో వున్నవారందరూ కేవలం సత్యం మాత్రమే పలుకేవిధంగా శాసించేవాడు. అందువల్ల అతనికి ఆ సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది.

సత్యవ్రతుడు ప్రతిరోజు సమీపంలో వున్న కృతమాలా నదికి పోయి, స్నాన సంధ్యాది కృత్యాలను ముగించుకుని వచ్చేవాడు. ఇలాగే ప్రతిరోజు జరుగుతుండగా.. ఒకనాడు రాజు స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యమిస్తుండగా.. అతని చేతిలో ఒక చేప పడుతుంది. దానిని అతను నీటిలో వదిలేస్తాడు. మళ్లీ తాను నీటిని చేతిలో తీసుకున్నప్పుడు ఆ చేప కనిపిస్తుంది. అప్పుడు చేప.. ‘‘రాజా! ఇక్కడున్న పెద్ద చేపలు నన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాయి. దయచేసి నన్ను కాపాడు’’ అని వేడుకుంటుంది. దాంతో ఆ రాజు చేపను తన పాత్రలో వేసి తీసుకెళతాడు.

అలా చేపను తీసుకువెళ్లిన తరువాతి రోజే అది పాత్రలో పట్టనంత పెద్దదిగా మారిపోతుంది. దాంతో రాజు దానిని ఒక గంగాళం వంటి పెద్ద పాత్రలో వేయిస్తాడు. అది కూడా పట్టలేదు. అలాగే అది పెరిగి పెద్దదవుతుండడంతో దానిని ఒక చెరువులో విడిచేస్తాడు. మరుసటిరోజు చూస్తే.. ఆ చెరువు కూడా పట్టలేదు. రాజు ఇక చేసేదేమీ లేక దానిని అతికష్టం మీద సముద్రంలో విడిచిపెడతాడు.

అప్పుడు ఆ చేప.. ‘‘ఓ సత్యవ్రతుడా! నేను శ్రీమన్నారాయణుడిని. నేను మత్స్యవతారాన్ని ఎత్తి నీ దగ్గరకు చేరుకున్నాను. నువ్వు నన్ను ఎంతో భక్తిశ్రద్ధలతో, కారుణ్యంతో కాపాడావు. ఇంకో పదిహేను రోజులలో ఒక ప్రళయం రాబోతోంది. దాంతో ఈ లోకమంతా మహాసముద్రపు నీటితో నిండిపోగా.. సర్వజీవరాసులు చనిపోతాయి. కానీ నీలాంటి సత్యవ్రతుడు ఆ ప్రళయంలో చనిపోవడానికి వీలులేదు. కాబట్టి నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించి, అందులో పునసృష్టికి అవసరమయ్యే ఓషధులను, బీజాలను వేసుకొని సిద్ధంగా వుండు. నీతోపాటు సప్తమహర్షులు కూడా ఆ నౌకలో ఎక్కుతారు. అప్పుడు నేను మీ అందరిని మహాసముద్రంలో మునిగిపోనివ్వకుండా, పడవ త్రాడును నా నోటితో పట్టుకుని లాగుకుంటూ తీసుకెళతాను. ప్రళయం సమాప్తం అయ్యేంతవరకు మీకు తోడుగానే వుండు కాపాడుతాను’’ అని చెబుతాడు.

మత్స్యావతారంలో వున్న శ్రీకృష్ణుడిని మాటలు విని ఆ రాజు పరమానందం అవుతాడు. మత్స్యం చెప్పినట్లుగానే రాజు అన్ని విధాలుగా సిద్ధం చేసుకుని, ప్రళయం కోసం ఎదురుచూస్తుంటాడు. ప్రళయ సమయం ఆసన్నమయింది. ద్వాదశ ఆదిత్యులు ఆకాశంలోకి ప్రవేశించారు. ఆ ఎండకు, వేడికి సర్వజీవరాసులు జలమంతా నిప్పుల్లో వసిన తిలలలాగా మాడి మసైపోతున్నాయి. అగ్నిహోత్రుడు విజృంభించి, తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

కొంతకాలం ఇలాగే గడిచిన తరువాత పుష్కలావర్తనాలు అనే మహామేఘాలు ఘోరంగా మహావర్షాన్ని కురిసేలా చేశాయి. దాంతో విశ్వమంతా జలమయం అయిపోయింది. నారాయణుడి అనుగ్రహం పొందడంతో సత్యవ్రతుడు, విత్తనాలతో నిండి వున్న ఓడ సురక్షితంగానే వుంది. ఆ సమయంలో మహామీనం వచ్చి ఆ పడవ త్రాడును పట్టుకుంటుంది. ఆ సమయంలో సప్తమహర్షులు పడవలోకి దిగుతారు. ఆ మత్య్సం వారందరూ వున్న ఆ పడవను లాగుకుంటూ తీసుకెళతుంది.

అనుకోకుండా నలువైపులా మహా అంధాకారం అలుముకుంటుంది. కేవలం ఆ మీనం (మత్స్యం) తేజస్సు, సప్త మహర్షుల తప తేజస్సు తప్ప.. ఎటువైపు చూసినా చిమ్మచీకటి అలుముకుని వుంది. అలాగే ప్రళయం అంతమయ్యేవరకు మహామత్స్యమ ఆ పడవను, అందులో వున్నవారందరిని కాపాడుకుంటూ వస్తుంది. తరువాత బ్రహ్మం తిరిగి భూమిపై సృష్టిని తయారుచేయడానికి పూనుకుంటాడు.

కానీ బ్రహ్మ నిద్రలేచి చూడగానే.. సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరున్న వేదాలను దొంగిలించుకుపోతాడు. బ్రహ్మ తన దివ్యదృష్టి ద్వారా దీనిని తెలుసుకుంటాడు. కానీ వేదాలు లేకుండా సృష్టిని తయారుచేయడానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మ దగ్గర వుండకపోవడంతో.. శ్రీమన్నారాయణుడిని ఆ వేదాలు తీసుకురావలసిందిగా కోరుకుంటాడు. దాంతో శ్రీహరి తిరిగి మత్స్యవతారాన్ని ఎత్తి, సోమకుడు అనే రాక్షసునితో పోరాడి, ఆ వేదాలను తిరిగి బ్రహ్మ దగ్గరకు చేర్చుతాడు.


నారాయణుడి మత్స్యవతారం :

శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమవ్వగానే అతనిని చూసి.. ‘‘ఓ మహానుభావా! నీకు తెలియంది ఏదీ లేదు. నీ వల్లే ఈ లోకాలన్నీ పుట్టి, పెరిగి చివరకు నశిస్తున్నాయి. నీ మహిమను గ్రహించడానికి మేమెంతటివాళ్లం? సృష్టిని నిర్మించినవాడివైన నీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అయినా నీకు విన్నవించుకుంటున్నాను... నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్ద వున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపవడం వల్ల సృష్టిన తయారుచేసే సామర్థ్యం నాలో తగ్గిపోయింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి, నాకు నుగ్రహించండి’’ అని ప్రార్థించుకుంటాడు.

అప్పుడు శ్రీహరి పదియోజనాల పొడవుగల చేప రూపాన్ని దాల్చి, బ్రహ్మతో.. ‘‘ఓ బ్రహ్మదేవా! విచారించకు. నేను ఈ మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో ఎక్కడ వున్నా ఆ సోమకుడిని వెతికి పట్టుకుని చంపి, వేదాలను నీకు అప్పగిస్తాను’’ అని మాటిచ్చి.. సముద్రంలోకి వెళ్లిపోతాడు.

సోమకాసురుడు అపహరించుకుని తీసుకుపోయిన వేదాలను.. తినే పదార్థాలు అనుకొని వాటిని మింగేస్తాడు. కాని అవి అతని ఆకలి తీర్చలేదు. దీంతో అతను ఆకలి తీర్చుకోవడం కోసం ఆహారాన్ని వెదకడం మొదలుపెట్టాడు. అదే సమయంలో మత్స్యరూపమెత్తిన శ్రీమన్నారాయణుడు కూడా అతనిని వెతుక్కుంటూ, అతను వున్న ప్రాంతానికి చేరుకుంటాడు. సోమకాసురుడు.. ‘‘ఈ చేప ఎంత బాగుంది. దీనిని నా ఆహారంగా మలచుకుంటాను’’ అని తలచుకుని, దానిని మింగడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ చేప అతనిని ఎదుర్కుంటుంది. సోమకాసురుడు మహా బలవంతుడే కాబట్టి వారిద్దరి మధ్య యుద్ధం ఏర్పడుతుంది. ఇలా వారిమధ్య యుద్ధం కొన్ని కాలాలపాటు మహాసంగ్రామంలా జరుగుతుంది.

దానవుడు, మత్స్యాన్ని నొప్పించడానికి అనేక రకాల పథకాలు రచిస్తాడు. తన దగ్గరున్న గదాఘాతంతో కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అయితే విష్ణువు ఆ దెబ్బ నుంచి తప్పించుకుని తోకతో నీటిని బాదుతాడు. ఆ దెబ్బతో నీరు ఒక యోజనం పైకి ఎగరగా.. సోమకాసురుడు కూడా అలాగే పైకి ఎగురుతాడు. దాంతో సోమకుడు కోపాద్రిక్తుడై మత్స్యాన్ని తన రెండు చేతులతో బట్టి పీడించడం మొదలుపెట్టాడు. అయితే మత్స్యం రాక్షసుని పట్టునుంచి విడిపించుకుని, తన కోరలతో చీల్చి చెండాడుతుంది. అనంతరం అతని కడుపులో వున్న వేదాలను, ఒక దక్షిణావర్త శంఖమును తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు.

శ్రీ విష్ణువు, బ్రహ్మకు వేదాలు ఇస్తూ.. ‘‘నాయనా! సోమకుడు ఈ వేదాలను మింగడం వల్ల కొన్ని శిథిలమయిపోయాయి. నీకు జ్ఞాపకమున్నంతవరకు వీటిని శిథిల పురాణం చేసి, స్ఫురించిన చోట ప్రణవంతో పూరించి, సమగ్రంగా పూర్తి చేయు’’ అని చెప్పి అదృశ్యమవుతాడు.

బ్రహ్మ సృష్టి :

వేదాలు తన దగ్గరకు చేరగానే బ్రహ్మ సృష్టి చేయడానికి పూనుకుంటాడు. మొదట సనకనందనాదులను సృష్టించాడు. తనకు జీవులను సృష్టించుటలో సహాయం చేయాల్సిందిగా బ్రహ్మ వారితో అడగగా.. వారు ‘‘తండ్రీ! భార్యలు, పుత్రులు, ధనకనక వస్తు వాహనాది భోగాలన్ని అస్థిరంగా వుంటాయి. వీటిమీద మాకు వ్యామోహం లేదు. శాశ్వతుడైన ఆ శ్రీమన్నారాయణుని స్మరిస్తూ, తపము చేసుకుంటాం. అందుకు మమ్మల్ని ఆజ్ఞాపించు’’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.

తరువాత బ్రహ్మ తన మనస్సంకల్ప సృష్టితో నారుదునిని సృష్టించాడు. బ్రహ్మ అతనితో.. ‘‘నువ్వు వివాహం చేసుకుని నాకు సృష్టి చేయడంలో సహాయం చేయు’’ అని కోరగా.. నారదుడు, బ్రహ్మకు సమాధానంగా.. ‘‘తండ్రీ! సారంలేని ఆ సంసారంలో ఏముంది? అనేక సుఖదు:ఖాలకు నిలయమైన ఆ సంసార సముద్రంలో పడి నేను కొట్టుమిట్టాడలేను. శ్రీ హరి పాదపద్మాలను స్మరించుకోవడంలోనే సుఖం లభిస్తుంది’’ అని చెబుతాడు.

నారదుని మాటలు విని బ్రహ్మ.. ‘‘నీ అన్నలయిన సనకసనందనాదులు కూడా నీలాగే చెప్పి, తపము చేయడానికి వెళ్లారు. నువ్వు నాకు సృష్టి తయారుచేయడంలో సహాయపడక తప్పదు’’ అని చెబుతాడు. నారదుడు.. ‘‘ఆ పని చేయడం నావల్ల కాదు’’ అని అంటాడు. దాంతో బ్రహ్మ ఆగ్రహించి.. ‘‘నువ్వు తండ్రి మాటలనే ధిక్కరించావు కాబట్టి రెండు జన్మలలో రాజుగాను, మరొక జన్మలో శూద్రుడుగాను పుట్టి.. నువ్వు వద్దనుకున్న కష్టసుఖాలన్ని అనుభవించి, ఆ తరువాత నాకు మానస పుత్రుడిగా జన్మిస్తావు’’ అని శపిస్తాడు. తరువాత బ్రహ్మ, దక్ష్కశ్యపాదులను మానసికంగా సృష్టించి, వారి నుంచి సృష్టిని విస్తరింపచేశాడు.

దక్షప్రజాపతికి అరవైమంది కుమార్తెలు వుంటారు. వారిని శివునికి, చంద్రునికి, అగ్నికి, కశ్యప్రజాపతికి మొదలైన ఇటువంటివారికి ఇచ్చి వివాహం చేస్తాడు. కశ్యపునకు అదితికి ఇంద్రాదిదేవతలు, దితికి రాక్షసులు కలిగారు. ఇంద్రుడు స్వర్గానికి అధిపతి అయి దేవతలకు రాజయ్యాడు. మేలు పర్వతం, అష్టదిక్కులు సృష్టించబడ్డాయి. ఆ మేలు పర్వతం దేవతలను నివాసమయ్యింది. తూర్పు దిక్కు ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణాన యముడు, నైరుతి దిక్కు నిరృతియు, పడమటి దిక్కున వరుణుడు, వాయువ్యదిక్కున వాయువు, ఉత్తరదిక్కున కుబేరుడు, ఈశాన్యదిక్కున ఈశానుడు అధిపతులుగా పాలించడం కొనసాగించారు.

దితికి కలిగిన రాక్షస సంతానం పాతాళాది అధోలోకాలకు పోయి, అక్కడే తమ రాజ్యాలను స్థాపించుకుని, పాలించుకునేవారు. వారికి శుక్రాచార్యుడు గురువు. శ్రీహరి ఖగోళంలో ద్వాదశరాసులను, సూర్యచంద్రులను, నక్షత్రాలను సృజించాడు. సూర్యచంద్రులు ఆకాశంలో తిరుగుతూ కాలపరిగణనకు సహాయపడమని నియమించాడు. సూర్యుడు ప్రతిదినం ద్వాదరరాశులలో తిరుగుతాడు. నవనగ్రహాలలో ఒకడుగా వుండి వారితో కలిసి, వారికి నియమించబడిన గమనంలో జీవులకు శుభ ఫలితాలు ఇస్తున్నాడు. చంద్రుడు రోజుకొక నక్షత్రంతో తిరుగుతుంటాడు. ఇరవైఏడు నక్షత్రాలలోను, ద్వాదశరాసులలోను తిరిగితిరిగి మళ్లీ మొదటి మేషరాశికి చేరుకుంటాడు. సూర్యుడు సంచారంతో పగలు, రాత్రులు ఏర్పడుతుంటాయి.

రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అనేవారు నవగ్రహాలు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీనములని పన్నెండు రాసులు. అశ్వని, భరణి మొదలైన ఇరవైఏడు నక్షత్రాలు. ఈ విధంగా గ్రహాల సంచారంతో కాలసృష్టి ప్రారంభమయ్యింది. అది పరమబ్రహ్మంలాగే కాలానికి కూడా ఆది, మధ్య, అంతములు లేవు. ఈ కాలం ఎప్పుడు పుట్టిందో ఎవ్వరికి తెలియదు. వర్తమానం మాత్రమే మనం గమనించగలుగుతున్నాం.


అగస్త్యుని జననం :

పూర్వం విష్ణువు అంశతో పుట్టిన నరనారాయణులు అనే మునీంద్రులు బదరిక ఆశ్రమంలో తపము చేసుకుంటూ వుండేవారు. వారు చేస్తున్న తపస్సును చూసిన మహేంద్రుడు భయపడిపోయి.. వారి తపస్సును భంగం కలిగించడానికి కొందరు అప్సరస స్త్రీలను పంపిస్తాడు. ఆ అస్పరసలు తమ నృత్యగీతాలతో నరనరాయణుల తపమును పాడుచేసి, తమ వశంలో వుంచకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ మునులు ఏమాత్రం వారికి లోనవ్వలేదు. పైగా వారందరికంటే అందమైన ఒక సౌందర్యవతిని తమ తొడల నుంచి సృష్టించారు. ఈ విధంగా ఊరువుల నుంచి పుట్టింది కాబట్టి ఆమెను ఊర్వశి అనే పేరు పెట్టి.. తమ తపస్సును భంగం కలిగించడానికి అప్సరసలను పంపించిన ఇంద్రునికే కానుకగా ఆమెను పంపించారు.

ఊర్వశి ఇంద్రుని వద్దకు వెళుతుండగా సూర్యుడు ఆమెను చూసి మోహపడతాడు. అతడు ఆమెను పలకరించి, తన వాంఛను తెలియజేస్తాడు. ఆమె కూడా సూర్యుని అందచందాలకు ముగ్ధురాలయిపోయి.. అతడు పిలిచిన సంకేత స్థలానికి బయలుదేరుతుంది. ఆమె సూర్యుడు పిలిచిన చోటుకు వెళుతుండగా.. మార్గమధ్యంలో వరుణుడు ఆమెను చూసి మోహనపరవశుడైపోతాడు. ఆమె దగ్గరకు వెళ్లి తన వాంఛను తీర్చమని అడుగుతాడు. అప్పుడు ఊర్వశి.. ‘‘నేను ముందు సూర్యుని వద్దకు వెళ్తాను. ఎందుకంటే మొదట నన్ను అతను కోరుకున్నాడు. కాబట్టి ధర్మం ప్రకారం అతనికి దగ్గరికే వెళతాను’’ అని అంటుంది. అప్పుడు వరణుడు.. ‘‘నువ్వు సూర్యునితో సంగమించేటప్పుడు నన్నే తలచుకుంటుండాలి. అలా అయితే వెళ్లు’’ అని ఆమెను విడిచిపెట్టి వెళతాడు.

ఊర్వశి సూర్యునితో వున్నప్పుడు ఆమె పరధ్యానం (వరుణుని) చేయడం గమనించి.. ‘‘నీవు వేశ్యగా మారిపోవాలి’’ అని శపించి, మధ్యలోనే లేచిపోతాడు. కానీ అతని రేతస్సు పతనమైపోతుంది. అలాగే వరుణుడు కూడా ఊర్వశినే తలచుకొంటుండడంతో అతనికి రేతస్సు పతనమవుతుంది. దీని తేజస్సు భూమి మీద పడటం వల్ల దోషం కలుగుతుందని భావించి, సూర్యావరణులు తమ వీర్యాలను ఒక భాండములో వేసి, వుంచుతారు.

ఇదిలా వుండగా.. ఒకనాడు నిమి అనే విదేహదేశపు రాజు, వరుణుడు ఇద్దరు కలిసి నిమి ఇంట్లో కాలక్షేపం కోసం జూదమాడుకుంటూ వుండేవారు. వారి ఆట ఆడుకుంటుండగా వశిష్ట మహర్షి అక్కడికి చేరుకుంటాడు. మహర్షి నిమి రాజును చూసి.. ‘‘నేను నీ ఇంటిముందు వచ్చినా కూడా అతిథి మర్యాదలు చేయకుండా ఊరికే వున్నావు కాబట్టి నువ్వు విదేహుడు (శరీరం లేనివాడు)గా మారిపోతావు’’ అని శపిస్తాడు. నిమి కూడా... తానున్న పరిస్థితిని గమనించకుండా వశిష్టుడు శపించినందుకు రోషంతో.. ‘‘నువ్వు కూడా నావల్ల విదేహుడిగా మారిపోవుగాక’’ అని శపిస్తాడు. అలాగే నిమిరాజు.. ‘‘నేను శరీరం లేని వాడినైనా.. ప్రాణులకంటి రెప్పలను అంటుకుని వుంటాను’’ అని చెబుతాడు. అందువల్ల కన్నురెప్పపాటును నిమిషం అంటారు.

నిమి రాజు శపించడం వల్ల వశిష్టుడు తన దేహాన్ని కోల్పోతాడు. తన ఆత్మ ఎక్కడ నిలవవుండాలని ఆలోచిస్తుండగా వరుణుడు, వశిష్టునితో.. ‘‘సూర్యావరణులు తమ వీర్యాలను దాచిన కుండిలోకి వెళితే మళ్లీ శరీరంతో జన్మిస్తావు’’ అని సూచిస్తాడు. దాంతో వశిష్టుడు కూడా ఇదే సరైన పని అని భావించి అతని ఆత్మ ఆ భాండంలో చేరిపోతుంది. కొంతకాలం తరువాత ఆ భాండంలో నుంచి వశిష్టుడు, అగస్త్యుడు అనే ఇద్దరు కవల పిల్లలు జన్మించారు.

కొన్నికాలాల తరువాత రాక్షసులు తమ బలంతో లోకాలను బాధిస్తుండగా.. త్రిలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు.. వాయువుని, అగ్నిని తోడుగా వుండమని కోరుకుంటాడు. వారి సహాయంతో రాక్షసులను సంహరించడం ఆరంభించాడు. ఆ రాక్షసులలో తారకుడు, మయుడు, విద్యున్మాలి, కాలదంష్ట్రుడు, పరావస్తువు, విరోచనుడు అనేవారు సముద్రంలోకి వెళ్లి దాక్కుంటారు. అయితే వాయువు, అగ్ని దేవుళ్లు సముద్రంలో వున్నవారిని ఏమీ చేయలేమని తమ అశక్తతను వెల్లడిస్తారు. ఆ సమయంలో ఇంద్రుడు, అగస్త్యుని దగ్గరకు వెళ్లి.. ‘‘మహాత్మా! నువ్వు సూర్యవరణుల అంశతో పుట్టినవాడివి. మహా తపశ్శాలివి. రాక్షసులు కొందరు సముద్రం మధ్యలో దాక్కుని వున్నారు. వారిని అలాగే విడిచిపెడితే.. వారు తిరిగి లోకానికి వచ్చి బాధపెట్టడం మొదలుపెడతారు. కాబట్టి నువ్వు ఆ సముద్రజలాన్ని తాగితే.. వారిని నేను సంహరిస్తాను’’ అని ప్రార్థిస్తాడు.

ఇంద్రుడు చెప్పిన మాటలు విని అగస్త్యుడు తన తపస్సు ప్రభావంతో సముద్రజలాన్ని ఆపోశనం పడతాడు. అప్పుడు దేవేంద్రుడు ఆ రాక్షసుల్ని సంహరిస్తుండగా.. మయుడు, తారకుడు, విద్యున్మాలి అనే రాక్షసులు ఇంద్రునికి దొరకకుండా పారిపోతారు.

త్రిపురాసురులు :

అగస్త్యుని సహాయంతో దేవేంద్రుడు రాక్షసులను సంహరిస్తుండగా.. మయుడు , తారకుడు, విద్యాన్మాలి అనే ముగ్గురు రాక్షసులు యుద్ధం చేస్తుండగానే పారిపోతారు. వీరినే త్రిపురాసులు అంటారు. ఆ విధంగా పారిపోయిన ఆ ముగ్గురు రాక్షసులు కలిసి బ్రహ్మదేవుని కోసం ఘోరంగా తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమే ‘‘మీకేం కావాలో వరాన్ని కోరుకోండి’’ అని అంటాడు. అదే అదునుగా భావించిన ఆ ముగ్గరు రాక్షసులు ఒక్కొక్కరుగా తమ కోరికలను అడుగుతారు.

అందులో ఒకరు బంగారు నగరాన్ని, రెండవవాడు వెండి నగరాన్ని, మూడవవాడు ఇనుప నగరాన్ని కావాలంటూ కోరుకుంటారు. ఆ నగరాలతోపాటు వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి చేరుకోవాలని కోరుకున్నారు. అలాగే తమ మూడు నగరాలను ఏక కాలంలో ఎవరైతే గెలుచుకుంటాడో.. అతని చేతిలోనే తమ మృత్యువు కలగాలని చెబుతారు. ఏ రాజ్యానికి వెళ్లిన విజయం తమకే వరించాలని ప్రార్థిస్తారు. దీంతో బ్రహ్మదేవుడు వారికి వరాలను ప్రసాదిస్తూ.. తథాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరాలతో వారు సువర్ణ, రజిత, లోహ నగరాలకు అధిపతులుగా వుంటూ... తమకు నచ్చిన చోటుకి వెళ్లి అక్కడి ప్రజలను బాధిస్తూ.. ఆ రాజ్యాంగాన్నే తమ అధీనంలోకి తీసుకునేవారు. ఏ నగరంలో ఎప్పుడు, ఎలా చేరుకుంటారోనని ప్రజలందరూ భయపడటం మొదలుపెట్టారు. ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవితాన్ని కొనసాగిచంచేవారు. ఈ ముగ్గురు రాక్షసులు ప్రజలనే కాకుండా.. మునులను, దేవతలను కూడా హింసించడం మొదలుపెట్టారు.

ఈ త్రిపురాసురుల ఆగడాలను తట్టుకోలేక మునులు, దేవతలందరూ కలిసి ఇంద్రుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంటారు. ఇంద్రుడు కూడా చేసేదేమీ లేక.. అతను వారందరిని తీసుకుని బ్రహ్మదేవుని దగ్గరకు వెళతాడు. బ్రహ్మదేవుడే ఆ ముగ్గురికి వరాలను ప్రసాదించాడు కాబట్టి చేసేదేమీ లేక విష్ణుమూర్తితో చర్చలు జరుపుతాడు. కొద్దిసేపు ఆలోచించిన తరువాత ఆ ముగ్గురిని ఆపడానికి పరమశివుని వల్లగానీ లేదా మరొకరి వల్లనో నెరవేరుద్దామని నిశ్చయించుకుంటారు. వెంటనే వారందరూ కైలాసానికి చేరుకుంటారు.

కైలాసానికి వెళ్లిన తరువాత అందరూ పరమశివునిని స్తుతించి.. ‘‘నువ్వు కోపానికి గురయితే సమస్త లోకాలే క్షణాల్లో అంతమయిపోతాయి. అటువంటిది నీకు ఈ త్రిపురాసులు ఒక లెక్కనా? మమ్మల్ని కరుణించి ఈ రాక్షసుల చెరనుంచి మమ్మల్ని విముక్తి కలిగిస్తారని కోరుకుంటున్నాం’’ అని ప్రార్థించుకుంటారు. అయితే పరమశివుడు, బ్రహ్మాది దేవతలను చూసి.. ‘‘నేను ఆ రాక్షసులను అంతమొందించాలంటే మీకు నాకు సమస్త సదుపాయాలను కలిగించాలి. అప్పుడే వారిని నేను వారి నగరాలతో సహా భస్మం చేస్తాను’’ అని చెబుతాడు.

అంతటి పరమశివుడే సదుపాయాల కోసం వేడుకుంటున్నాడేంటా అని బ్రహ్మాది దేవతలు అనుకుంటూనే.. ‘‘నీకేం సౌకర్యాలు కావాలో చెప్పు’’ అని అడుగుతారు. అప్పుడు శివుడు... ‘‘భూమి రథం కావాలి. మేరుపర్వతం విల్లుగా కావాలి. కాళరాత్రి (శేషుడు) నారిగా కావాలి. బ్రహ్ముని రథసారథి కావాలి. సూర్యచంద్రుల రథచక్రాలు కావాలి. నాలుగు వేదాలు గుర్రాలుగా కావాలి. ఆ రథంలో నేను రథకుడినై సమస్త దేవతా సైన్యాలతో ఆ త్రిపురాసురులపై దండెత్తుతాను’’ అని చెప్పగా... బ్రహ్మాది దేవతలంతా శివుడకి అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు.

మహాశివుడు రథంపై కూర్చుని రాక్షసులపై దండెత్తుతాడు. విష్ణుబాణాన్ని ధనస్సులో సంధించి.. ఆ బాణాన్ని లాగి ఆ రాక్షసులపై విడుస్తాడు. ఆ బాణం ఎంతోవేగంగా వెళుతూ.. ముందుగా బంగారు నగరాన్ని, తరువాత వెండి నగరాన్ని, ఆ తరువాత లోహ నగరాలను వరుసగా ధ్వంసం చేస్తుంది. దాంతో త్రిపురాసులతోపాటు ఆ నగరాల్లో వున్న మొత్తం రాక్షసులు కూడా నామరూపాలు లేకుండా అంతమయిపోతారు.

రామశర్మ కథ :

ఒకప్పుడు గౌతమీనదీ తీరంలో ఒక బ్రాహ్మణ అగ్రహారం వుండేది. ఆ అగ్రహారంలో వున్న ఇళ్లలో ఏ ఇంట్లో చూసినా అగ్నిహోత్రాలు.. ఏ అరుగుమీద చూసిన శిష్యులు వల్లిస్తున్న వేదపనసల నాదాలు.. ఏ వాకిట్లో చూసినా శాస్త్రీయచర్చలు కనబడేవి. అసలు ఆ గ్రామంలో యజ్ఞం చేయని బ్రాహ్మణుడు వుండేవాడు కాదు. అగ్రహారపు భూములపై వచ్చే ఆదాయంలో ఇతరులకు కొంచెం పంచిపెడుతూ (కర్మానుష్టానం), తాము ఇంత తీసుకునేవారు. పాడిపంటలకు అస్సలు కొదువ వుండేది కాదు. వచ్చిన అతిథిలకు గౌరవ మర్యాదలు చేస్తూ, తృప్తిగా భోజనాలను వడ్డించి సుఖంగా చూసుకునేవారు.

అదే అగ్రహారంలోనే నారాయణశర్మ అనే ఒక బ్రాహ్మణుడు వుండేవాడు. అతని భార్య అయిన సోమిదమ్మ.. అతనికి అన్నివిధాలుగా సహాయసహకారాలు అందించేది. సోమిదమ్మ.. తన భర్త చేసే యజ్ఞయాగాదికర్మలలో తనవంతు సేవలను అందించి సహధర్మచారణి అని అనిపించుకునేది. అలా గడుస్తున్న వారి జీవితంలో చాలా కాలం తరువాత ఒక కుమారుడు జన్మించాడు. పుట్టిన పదకొండవరోజున జాతక కర్మాదులు, శాంతులు జరిపించి.. ఆ పిల్లాడికి రామశర్మ అనే పేరు నామకరణం చేశారు. ఆ బాలునికి క్రమంగా అన్నప్రాశనాలు, పుట్టు వెంట్రుకలు తీయించడం వంటి సంస్కారాలు జరిపించి.. ఐదవ ఏట అక్షరాభ్యాసం చేయించారు. ‘గర్భాష్టమేఘ బ్రాహ్మణ ముపనయీత’ అనే సూత్రం ప్రకారం అతనికి ఏడు సంవత్సరాలు రాగానే ఉపనయన సంస్కారం చేసి, వేదశాస్త్రాలు చదివించడానికి గురువుల దగ్గరకు పంపించారు.

అలా తమ బ్రాహ్మణ దంపతులు తమ కుమారుణ్ణి గురువుల దగ్గరకు పంపించిన కొంత కాలం తరువాత రోగగ్రస్తులై మరణించారు. అప్పటికీ రామశర్మ చదువు ఇంకా పూర్తి కాలేదు. అతనికి అసలు లోకజ్ఞానం కూడా తెలీదు. అయితే తల్లిదండ్రులు మరణించేముందు రామశర్మను తన మేమమామలకు అప్పగించి.. తన మంచిచెడుల గురించి చూసుకోమని ప్రార్థించుకున్నారు. కానీ మేనమామలకు మాత్రం మేనల్లుని మీద కన్నా.. అతని ఆస్తుపాస్తులపై ఎక్కువ అనురాగాన్ని పెంచుకున్నారు. రామశర్మ మేనమామలు అతని ఆస్తుపాస్తులు సొంతం చేసుకుని.. అతనికి అనేక రకాలుగా బాధపెట్టేవారు. దాంతో రామశర్మ చదువు సంధ్యలు విడిచిపెట్టి, చెడు స్నేహాలు చేసి, స్వేచ్ఛగా ఎవరి ఆజ్ఞను పాటించకుండా తిరిగేవాడు.

ఈ విషయాన్ని గమనించిన రామశర్ముని బంధుమిత్రులు, అతని మేలుకోరి.. ‘‘నాయనా! నువ్వు చదువు సంధ్యలు విడిచిపెట్టి, చెడు అలవాట్లను పాటిస్తున్నావు. నీ వంశం తాతముత్తాతలు, తల్లిదండ్రులందరూ మహాపండితులుగా వున్నారు. కాబట్టి నువ్వు కూడా బుద్ధిమంతుడిగా మారి, నీ వంశ కీర్తి, ప్రతిష్టలు నిలబెట్టు’’ అని బోధిస్తారు. దీనికి రామశర్మ సమాధానం చెబుతూ.. ‘‘బంధుమిత్రులారా! నా క్షేమం కోరి మీరు హితబోధ చేసినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. మీరు చెప్పినట్లే విద్యలు నేర్చుకోవడానికి నేను కాశీకి వెళ్లి మంచి గురువులను ఆశ్రయిస్తాను’’ అని తన బంధువులను, మేనమామలకు చెప్పి కాశీకి పయనమయ్యాడు. కాశీకి వెళ్లిన రామశర్మ, పండితులను ఆశ్రయించి, విద్యలు నేరు్చుకోవడం మొదలుపెట్టాడు.

ఒకనాడు రామశర్మ, శ్రీ విశ్వనాతుని ఆలయాన్ని దర్శించుకోవడానికి అక్కడికి వెళ్లగా.. ఉత్తర ద్వారంపై వున్న ఒక శిలాసాసనాన్ని చూశాడు. ఆ శాసనంపై.. ‘‘ఈ కాశీగంగను తీసుకుని పోయి.. రామేశ్వరంలో వున్న రామేశ్వరునికి అభిషేకం చేసి.. అలాగే అక్కడ గణపతి వద్దనున్న సముద్రజలాన్ని తెచ్చి నాపై అభిషేకం చేస్తే.. వారికి ఒక భూప్రదక్షిణా యాత్ర ఫలం కలుగుతుంది. ఇలా ఈ విధంగా మూడుసార్లు భూప్రదక్షిణాయాత్ర చేసినవారికి నేను ప్రసన్నుడై వరాలను అందిస్తాను.. - కాశీ విశ్వనాథుడు’’ అని దానిపై రాసి వుంది.

శిలాశాసనంపై వున్న దానిని చదివిన రామశర్మ.. యాత్రలు చేయగా వచ్చే పుణ్యఫలంతోపాటు విశ్వేశ్వరుని దయతో విద్యలు, సంపదలు కూడా లభిస్తాయని భావించి వెంటనే వారణాసి నుంచి ప్రయాణమవుతాడు. ఆ శిలాశాసనంపై రాసిన విధంగానే కావడితో రెండు బిందెల గంగా జలాన్ని మోసుకుని పోయి రామేశ్వరునికి యథావిధిగా అభిషేకం చేశాడు. అక్కడే సేతుస్నానం చేసి అక్కడి సముద్రజలాన్ని రెండు బిందెలలో మోసుకునివెళ్లి కాశీ విశ్వనాథునికి అభిషేకం చేయించాడు. ఇలా ఈ విధంగా రెండుసార్లు యాత్ర పూర్తవుతుంది.

మూడవసారి రామశర్మ సేతుసముద్రజలాన్ని తీసుకువని వస్తుండగా.. కాశీనగరానికి కొద్దిదూరంలో వుండగానే కావడి భుజం మీద నుంచి జారి సముద్రజలం మొత్తం నేలపాలవుతుంది. అతడు తిరిగి రామేశ్వరానికి వెళ్లి సాగరజలాన్ని తీసుకుని వస్తుండగా.. అవి మళ్లీ నేలపాలవుతాయి. ఎలాగైనా తన ఆశలను నెరవేర్చుకోవాలని రామశర్మ మూడవసారి కూడా రామేశ్వరం నుంచి నీటిని తెస్తుండగా.. అవి కూడా నేలపాలవుతాయి. దీంతో రామశర్మ కోపాద్రిక్తుడై పోతాడు. ఒక దండాన్ని తన చేతిలో పట్టుకుని విశ్వనాథుని ఆలయానికి వెళ్లి విగ్రహం ముందు... ‘‘నువ్వు కూట నీతితో ఆ శాసనాన్ని వ్రాయించావు. నువ్వు ఎవ్వరినీ మూడు పర్యాయాల అభిషేకం చేయనివ్వవు. వరాలు కూడా ఇవ్వవు. ఇదంతా నీవల్లే జరిగింది. నాకింత అన్యాయం చేసినందుకు నేను నీ తల పగులకొట్టి తరువాత నా తలను కూడా పగులకొట్టుకుంటాను. నన్ను ఇంత మోసం చేసినందుకు ఈ ఫలాన్ని అనుభవించు’’ అని తనలో వున్న ఆవేదనను వ్యక్తం చేస్తాడు.

తరువాత అతని దగ్గరున్న దుడ్డకర్రతో విశ్వనాథుని తలను పగలకొడతాడు. అప్పుడు విశ్వనాథుడు అశీరవాణితో.. ‘‘రామశర్మా! నన్ను కొట్టొద్దు. నువ్వు నాకు రెండుసార్లు చేసిన అభిషేకానికి ఎంతో సంతోషించాను. అందువల్ల నీకు నీ తరువాతి జన్మలో చక్రవర్తిగా జన్మనిస్తాను. సంకోచించకుండా నేను చెప్పింది నమ్మి.. ఇంటికి వెళ్లు’’ అని చెబుతాడు. ఈ విధంగా రామశర్మ విశ్వనాథుని నుంచి వరాన్ని పొంది, తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. తరువాత తను తన నివాసంలో తీవ్రంగా ఆలోచించడం మొదలుపెడతాడు.

తరువాతి రోజు రామశర్మ ఉదయాన్నే లేచి మణికర్ణిరా ఘట్టానికి స్నానం చేయడానికి వెళతాడు. అప్పుడు అక్కడే ఒక స్వామిని అనుష్టానం చేస్తుండగా చూస్తాడు. ఆ స్వామి కాశీనగరంలో అపరశంకరుడిగా ఎంతో ప్రఖ్యాతి పొందినవాడు. రామశర్మ ఆయన దగ్గరికి వెళ్లి.. ‘‘మహాత్మా! నాకు అతుర సన్యాసం ఇప్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను’’ అని విన్నవించుకుంటాడు. అప్పుడు ఆయన రామశర్మకు కొన్ని ప్రశ్నలు వేయగా.. అతను ఎటువంటి తడబాటు లేకుండా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. దాంతో ఆయన సంతృప్తి చెంది.. అతుర సన్యాసం ఇవ్వడానికి అంగీకరించారు. ఉపదేశం చేశారు.

వెంటనే రామశర్మ విశ్వనాథుని ఆలయానికి చేరుకుని.. ‘‘విశ్వనాథా! సన్యాసం మరొక జన్మమని శాస్త్రాలు చెబుతున్నాయి కదా! నేను అతుర సన్యాసం స్వీకరించి ఇంకొక జన్మనెత్తి వచ్చాను. నన్ను నా తరువాతి జన్మలో చక్రవర్తిగా మారుస్తానని వరాన్ని ఇచ్చావు. నాకు వెంటనే ఆ వరాన్ని ప్రసాదించు’’ అని పేర్కొంటాడు.

దాంతో విశ్వనాథుడు.. ‘‘ఓయీ! నువ్వు నన్ను బెదిరించి వరాన్ని పొందుతున్నావు. ఏమైనా నేను మాట తప్పేవాడిని కాను. నువ్వు దండకమండలాన్ని, కాషాయవస్త్రాలను గంగానదిలో పారవేసి.. గంగాప్రవాహానికి కొంత దూరం నడిచి వెళ్లు. అక్కడొక వటవృక్షం కనిపిస్తుంది. దానిక్రింత నన్ను తలచుకుంటూ కూర్చో. అదే నీకు రాజయోగం పట్టడానికి కారణమవుతుంది’’ అని పరమేశ్వరుడు రామశర్మకు చెబుతాడు. రామశర్మ, విశ్వనాథుడు చెప్పినవిధంగా గంగాతీరంలో అన్ని పారవేసి, తీరంగుండా వటవృక్షానికి చేరుకుంటాడు. అక్కడే విశ్వనాథునిని ధ్యానించుకుంటూ వుండిపోతాడు.

రామశర్మ యవనులకు రాజవ్వడం :

గంగానదికి కొంత దూరంలో ఒక మహమ్మదీయ రాజ్యం వుంది. ఆ రాజ్యాన్ని పరిపాలించేవారిని సుల్తానులుగా పేర్కోవడం అక్కడి ఆచారం. అక్కడ ఒక విచిత్రమైన సంప్రదాయం అమలులో వుండేది. రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్న ఏ సుల్తానులైనా.. వారికి వారసులు పుట్టకముందే మరణిస్తే, అతని తరువాత రాజ్యాన్ని పరిపాలించేందుకు ఒక పద్ధతి ద్వారా రాజును ఎన్నుకునేవారు. అదేమిటంటే.. ఒక ఏనుగును అలంకరించి, దాని తొండానికి ఒక పూల మాలను ఇస్తారు. ఏనుగు ఆ పూలమాలను ఎవరి కంఠంలో వేస్తుందో అతనినే సుల్తానుగా అంగీకరించి, పట్టాభిషేకం చేసేవారు. అయితే వంద సంవత్సరాల క్రిందట ఇటువంటి ఎన్నికొకటి జరిగింది. ప్రస్తుతతం వున్న సుల్తానులుగా సంతానం లేకుండానే మరణించారు. కాబట్టి ఆ రాజ్యానికి కావలసిన రాజును ఎన్నుకునే పద్ధతి మొదలుపెడతారు.

అప్పుడు ఆ రాజ్యానికి మంత్రి అయిన సామంత దండనాథాదులు, ప్రముఖులతో కలిసి ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు. తమ సంప్రదాయం గురించి వారికి వివరించి, పట్టపుటేనుగును అలంకరించారు. దాని తొండానికి ఒక పూల దండనిచ్చి.. ‘‘ఓ గజరాజా! మాకు కాబోయే సుల్తానుని ఎన్నికచేసి, సమర్థుడైన పరిపాలకుడిని ఎన్నుకో’’ అని ప్రార్థించారు. ఏనుగు పూలమాలను ఎవరి మెడలో వేస్తుందా అని ఆతృతగా ఎదురుచూడసాగారు. అయితే గజరాజా మాత్రం ఎవరిని కన్నెత్తి కూడా చూడకుండా, తిన్నగా అక్కడి నుంచి పూలదండను తీసుకుని వెళ్తుంది. ఏనుగుతోపాటు రాజోద్యోగులు కూడా వెనకాలే వెళ్లారు. అలా చాలా దూరం నడిచిన తరువాత చివరికి గంగానదీ తీరం తగ్గరకు చేరుకుంటారు.

నదీతీరం దగ్గర వటవృక్షం నీడలో కూర్చుని ధ్యానం చేస్తున్న రామశర్మను ఏనుగు చూసి, తొండమెత్తి అతని మెడలో పూలదండను వేస్తుంది. అతనిని తన వీపు మీద ఎక్కించుకుని నగరంవైపు తిరిగి వెళుతుంది. అక్కడే వున్న ప్రజలందరూ తమ సుల్తానుకి జయ ధ్యానాలు చేస్తూ ఏనుగు వెంట నగరానికి వెళ్లి.. రామశర్మనను సింహాసనం మీద కూర్చోబెట్టి, పట్టాభిషిక్తునిని చేశారు. ఈ విషయాన్ని తమ రాజ్యంలో వున్నవారందరికీ తెలియపరిచి, విందు భోజనాలను ఏర్పాటు చేస్తారు. మంత్రి సామంతాదులు అతనికి సలాములు చేసి.. ‘‘మీ నామధేయం ఏమిటి?’’ అని అడిగారు. రామశర్మకి వారు మాట్లాడుతున్న భాష కొత్తగా అనిపించినప్పటికీ.. అందులో కొన్ని సంస్కృత పదాలు కలిసుండడాన్ని గ్రహించి, తన పేరు ‘‘రామానందస్వామి’’ అని చెబుతాడు.

అయితే వారికి ఏమీ అర్థం కాక తమ సుల్తానుకు ‘‘గజనీ మహ్మదు’’ అనే పేరు పెట్టుకుని రాజ్యవ్యవహారాలను నడపడం మొదలుపెట్టారు. ఫకీరులను పిలించి, తమ మహ్మదీయ మత సిద్ధాంతాల గురించి రామశర్మకు చెప్పించి, అతనిని పరిపూర్ణంగా యవనునిగా చేసేస్తారు. తెలివితేటలు ఎక్కువగా వున్న రామశర్మ కూడా.. గజనీ మహ్మదు పేరుతో ఫకీరుల నుంచి మత సిద్ధాంతాలను బాగా నేర్చుకుని, తన సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి, వారిలో కలిసిపోయి రాజ్యపాలన చేస్తుంటాడు. తాను కోరుకున్న విధంగా రాజాభోగ్యాలను అనుభవించాడు. కానీ తనకు భార్య లేదనే లోటు అతనికి విచారానికి గురిచేసేది. అలా విచారణలో వుండగా.. వారి ఆచారవ్యవహారాలు అతనికి తెలుస్తాయి.

ఆ రాజ్యానికి ఇంతకుముందు వున్నటువంటి సుల్తానుకు రెండువందలమంది భార్యలుండేవారు. రామశర్మ ఆ మహిళలందరినీ తనకు భార్యలుగా అవ్వాలని కోరుకుంటాడు. వారు కూడా ఏమి చెప్పలేక.. అతని సౌందర్యానికి ముగ్ధురాళ్లయిపోయి.. రామశర్మను భర్తగా అంగీకరించడానికి సిద్ధమయ్యారు. వారందరు అభిషేక స్నానాలను ఆచరించి, రామశర్మ రాకకోసం ఎదురుచూడసాగారు. ముస్లింగా మారిపోయిన రామశర్మ.. పరదా సంగమంలో వెళ్లడం దోషమని తెలియక ఆ 200 మంది భార్యలతో అహోరాత్రులు గడుపుతాడు. రోజులను, క్షణాలుగా భావిస్తూ.. భోగభాగ్యాలను అనుభవిస్తుంటాడు. ఇలాగే కొంతకాలం వరకు రామశర్మ తన జీవితాన్ని గుడపుతాడు.

కొన్నాళ్ల తరువాత రామశర్మకు పశ్చాత్తాపం కలుగుతుంది. ఒకనాడు ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చుని... ‘‘నేను ఎటువంటి వంశంలో పుట్టా..? చివరకు ఎలా మారిపోయాను..? వేదశాస్త్రాలను అభ్యసించిన తల్లిదండ్రులకు నేను జన్మించి కూడా వారి కీర్తిని పాడు చేశాను. యవన ప్రభువుగా మారి ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాను. నా పాలనలో దోషం లేకపోయినా.. మనసులో ఏదో తపనగా వుంది. ఆ విశ్వేశ్వరుడే నాకు ద్రోహం చేశాడు. రాజ్యం కావాలని కోరుకున్నందుకు నా మంత సంప్రదాయాలను నానుంచి దూరం చేసి, ఈ మహ్మదీయ మతంతో నాకు రాజ్యమిచ్చాడు. నా పితృలకు శ్రాద్ధం పెట్టడానిక్కూడా వీలులేకుండా మతభ్రష్టుడిగా మారిపోయాను. బలాత్కారంతో నేను ఈ వరాన్ని అందుకున్నాను కాబట్టి.. విశ్వేశ్వరుడు కోపంతో నాకీ దుర్గతి కలిగించాడు’’ అంటూ తన మనసులో బాధపడుతుంటాడు. ఆ సమయంలోనే వేదాలకు, దేవతలకు, సజ్జనులకు విరోధులైన రాక్షసులు కొందరు.. పశ్చాతాపంతో వేగిపోతున్న రామశర్మను ఆవహించారు. దీంతో రామశర్మ పూర్తిగా మ్లేచ్ఛుల భావనతో నిండిపోయి.. తాను వైధిక మత విరోధిగా మారిపోతాడు.

ఒకనాడు రామశర్మ, మంత్రి సామంత దండనాథ మహాజనుల సమక్షంలో ఒక మహాసభను ఏర్పాటు చేసి.. ‘‘మహాజనులారా! హిందువులు దేవాలయాలు కట్టించుకుని, విగ్రహారాధన చేస్తున్నారని మీ అందరికీ తెలుసు. అయితే మనకు విగ్రహారాధన, యజ్ఞయాగాదులు సరిపడవు కాబట్టి.. వాటిని ఆచరించే వారిని హింసించండి. దేవాలయాలను కూలగొట్టి, విగ్రహ లింగాలను నాశనం చేయండి. ఇందుకు మీలో వున్న శక్తిసామర్థ్యాలను ఉపయోగించండి’’ అని ఆజ్ఞాపిస్తాడు. తాను అంత:పురంలోనికి వెళ్లి.. యవన కాంతులతో ఇష్టవిహారాలు చేసుకుంటూ.. వినోదిస్తూ.. జీవితాన్ని గడపుతాడు. సుల్తాను ఆజ్ఞతో మహమ్మదీయ సైనికులు హిందువులను చావగొడతారు. వారి దేవాలయాలలోకి ప్రవేశించి, విగ్రహాలను ధ్వంసం చేసి, ధనాన్ని కొల్లగొట్టుకున్నారు.


మహ్మదు, వెంకటేశ్వరునికి సత్కారం చేయడం :

పూర్వం గజనీ మహ్మదు అనే రాజు వుండేవాడు. అతనికి ఒక కుమార్తె పుట్టింది. ఆమె ఎంతో అందగత్తురాలవడంతో అతిలక సుందరిగా పేరు పొందించి. కొన్నాళ్ల తరువాత ఆమె యుక్తవయస్కరాళ్లయింది. కన్యాంత:పురానికి రాజభటులు చాలా జాగ్రత్తగా కావలి కాస్తుండేవారు. ఆమె కన్యత్వాన్ని కాపాడటం కోసం రాజభటులు రాత్రివేళ్లలో ఒక్క క్షణం కూడా నిద్రించేవారు కాదు. ఇంత భద్రత వున్నప్పటికీ.. ఒకనాడు అర్థరాత్రి సమయంలో శ్రీ వెంకటేశ్వరుడు మానవరూపంతో కన్యాంత:పురంలోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న సుల్తాను కూతురిని లేపి.. తన గురించి అన్ని విషయాలను చెప్పాడు. ఆమె అతనిని చూసి ముగ్ధురాలయిపోతుంది. అతడు, ఆమెతో.. ‘‘నేను ఇలా నిన్ను కలవడానికి వచ్చినట్లు ఎవ్వరితో చెప్పకు’’ అని చెప్పగా.. దానికి ఆమె అంగీకరిస్తుంది.

కొన్నాళ్లవరకు ఇలా జరగగా... ఒక కావలి ఈ తతంగం మొత్తాన్ని తెలుసుకుంటాడు. వెంటనే అతను సుల్తాన్ దగ్గరకు వెళ్లి.. ‘‘హుజూర్! మేము ఎంతో జాగ్రత్తగా యువరాణిని కాపాడుతున్నప్పటికీ.. ఎవరో ఒక వ్యక్తి కన్యాంత:పురంలోకి ప్రవేశించి, యువరాణితో మాట్లాడుతున్నాడు’’ అని చెబుతాడు.ఈ మాట విని సుల్తాను కోపాద్రిక్తుడై వెంటనే తన కూతురు వద్దకు వెళ్లి... ‘‘నీ దగ్గరకు వస్తున్న ఆ పురుషుడు ఎవరో చెప్పు’’ అని ఆమెను నిర్బంధిస్తాడు. అయినా ఆమె నోరు మెదపకుండా అలాగే వుండిపోయింది. దాంతో సుల్తాను ఆగ్రహంతో తన ఖడ్గాన్ని తీసి, కూతురి తల నరబోతుండగా.. అక్కడే విగ్రహ రూపంలో వున్న శ్రీనివాసుడు వెంటనే సుల్తాను ముందకొచ్చి నిలబడ్డాడు.

శ్రీనివాసుడు, సుల్తాను చేయి పట్టుకొని.. ‘‘ఓయీ మహ్మదూ! ఆనాడు నువ్వు బలాత్కారంతో నా వరాన్ని పొందావు. ఇది సాధుమార్గం కాకపోవడం వల్ల నువ్వు స్వధర్మ భ్రష్ఠుడివై యవన రాజువయ్యావు. ఇంకా నీ అజ్ఞానం తొలగలేదు. ఒకప్పుడు నువ్వు ఆదరించిన సనాతన హిందూమతాన్ని కూలద్రోయటానికి ప్రయత్నిస్తున్నావు. మతధర్మాలు వేరైనప్పటికీ దైవం ఒక్కటేనని గ్రహించలేకపోతున్నావ్. నేను నీకు జ్ఞానోపదేశం చేయడానికే ఇక్కడికి వచ్చాడు. నువ్వు హింసించిన అర్చకులు నీ దయకోసం ప్రాకులాడుతూ నీ కోటముందుకు చేరుకున్నారు. నువ్వు ధ్వంసం చేయించిన దేవాలయాలను తిరిగి నిర్మించి.. అందులో విగ్రహాలు, లింగాలను పున:ప్రతిష్టించు. అర్చకులందరికీ జీవనోపాధికి సరిపోయే జీతాలిచ్చి పంపించు. లేకుంటే నీ దగ్గరున్న సర్వసంపదలు నాశనం అవుతాయి’’ అని హెచ్చరించి, తిరిగి విగ్రహంగా మారిపోయాడు.

అక్కడున్న వారందరూ అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసి, ఆశ్చర్యపోయి అలాగే వుండిపోయారు. గజనీ మహ్మదు.. తనకు స్వయంగా వెంకటేశ్వరుడే కనిపించి, హితబోధ చేసినందుకు ఎంతగానో సంతోషించాడు. గతంలో తాను చేసి అకార్యాల గురించి విచారించసాగాడు. అర్చకులందరినీ పిలిపించి, వారికి తగిన సత్కారాలు, భోజనాలు వడ్డించి.. ‘‘మీమీ ఆలయాలను తిరిగి నిర్మించుకుని, దేవతావిగ్రహాలను ప్రతిష్టించుకోండి’’ అని చెప్పాడు. అందుకు కావలసిన ధనాన్ని ఉదారంగానే ఇచ్చి.. వారి జీవనోపాధికి అవసరమయ్యే మూల్యం ఇచ్చి, అక్కడి నుండి పంపివేశాడు. అలా చివరికి తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి అర్చకులు అక్కడ మిగిలిపోయారు.

వారు సుల్తాను దగ్గరికి వెళ్లి.. ‘‘మహాప్రభో! మీరు అర్చకులందరిని సమ్మానించి పంపించేశారు. మేము కూడా వెంకటేశ్వర స్వామి వారి అర్చకులం. మాక్కూడా దేవుని విగ్రహాన్నిచ్చి పంపండి’’ అని ప్రార్థించసాగారు. అప్పుడు గజనీ మహ్మదు తన ఇంట్లో వున్న వెంకటేశ్వర విగ్రహాన్ని వారికి సమర్పించాడు. తను చేసిన అపరాధాలకు పరిహారంగా తన కుమార్తెను ఆయన సేవకు సమర్పించాడు. రథాలు, ఏనుగులు, గుర్రాలను, ఇంకా ఇతర సామాగ్రిని వెంకటేశ్వరునికి కానుకగా ఇచ్చి.. నిత్యం ధూపదీప నైవేద్యాలకోసం కొన్ని గ్రామాలను రాసిచ్చి, సాగనంపాడు. సుల్తాను కుమార్తె జీవనోపాధికోసం రెండు గ్రామాలను, వాటిని రక్షించడానికి సైన్యాన్ని పంపించాడు. సుల్తాను కుమార్తె కూడా కొంత దూరం వెళ్లి.. తిరిగి వెనకకు మరలి వచ్చేసింది.

No comments:

Post a Comment