Saturday, April 18, 2015

మహాశివుడు వెలసిన మధుకేశ్వరాలయం విశేషాలు

భారతదేశంలో కొలువైవున్న అత్యంత పురాతన దేవాలయాల్లో ‘మధుకేశ్వరాలయం’ ఒకటి! శ్రీకాకుళం జిల్లాలో వంశధారానదికి ఎడమ గట్టున వుండే ముఖలింగం గ్రామంలో ఈ ఆలయం వుంది. మహాశివుడు కొలువై వున్న ఈ ఆలయానికి ‘మధుకేశ్వరుడు’ అనే పేరు రావడానికి ఓ పురాణకథనం వుంది.

స్థలపురాణం :

పూర్వం ఒకనాడు హిమాలయాలమీద ‘వైష్ణవయాగం’ జరిగింది. ఆ యాగాన్ని చూసేందుకు గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. అలాగే.. ఆ హిమాలయాలమీద వుండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు. అప్పుడు శబరకాంతల సౌందర్యాన్ని చూసిన గంధర్వులు కామవశీభూతులయ్యారు. ఆ సమయంలో అక్కడే వున్న వామదేవ మహర్షి వారిలో రగులుతున్న కామాన్ని గ్రహించి ఒక్కసారిగా కోపాద్రిక్తుడయ్యాడు. అప్పుడు ఆయన కోపంతో.. ‘సభామర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబరజాతిలో జన్మించండి’ అని గంధర్వులు శపించాడు. అతని శాపంతో గంధర్వులంతా శబరులుగా జన్మించారు. ఇక వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడుగా జన్మించాడు.

Madhukeshwara-story-news

చిత్రగ్రీవుడికి ఇద్దరు భార్యలు వుండేవారు. ఒక భార్య పేరు చిత్తి కాగా.. రెండవ భార్య పేరు చిత్కళ. ఈమె శివభక్తురాలు. వీరిద్దరికీ ఒక్క క్షణం పడేదికాదు. ప్రతిసారీ ఏదో ఒక విషయంపై కీచులాడుకునేవారు. ఈ క్రమంలోనే ఒకరోజు చిత్తి తన భర్త చిత్రగ్రీవుడి దగ్గరకు చేరి.. ‘నీతో ఉంటే నేనైనా ఉండాలి... లేదా చిత్కళైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చి చెప్పు’ అని నిలదీసింది. దీంతో అయోమయంలో పడిపోయిన అతడు.. పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవరాణి అయిన ఛిత్కళను వదులుకోవడానికి సిద్ధమవుతాడు. అప్పుడు అతడు ఛిత్కళను పిలిచి... ‘మన వాకిలిలో వున్న ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి, రాలిన పువ్వులు ఏరుకుని, వాటిని అమ్ముకుని బతుక్కో’మని అన్నాడు. అది విన్న ఛిత్కళ తీవ్ర మనోవేదనకు గురవుతుంది. అయితే మహాసాధ్వి అయిన ఆమె తన భర్త మాటకు ఎదురు చెప్పలేక, అతను చెప్పినట్లుగానే జీవితాన్ని కొనసాగించేది.

అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. చిత్కళ ఆ బంగారు పువ్వులను అమ్ముకుంటూ కాలం గడిపేది. ఈ సంగతి తెలుసుకున్న చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది. అప్పుడు విసుగు చెందిన చిత్రగ్రీవుడు... సవతుల గొడవకు ఆ ఇప్పచెట్టే కారణమని తలచి, ఆ చెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు ముందు ప్రత్యక్షమయ్యాడు. అది చూసి చిత్రగ్రీవుడు ఒక్కసారిగా మూర్ఛబోయాడు. అప్పుడు అతడు ఈ వివాదానికి కారణం చిత్కళయేనని గ్రహించి.. అతనితోపాటు శబరులంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధబడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబరరూపులైన ఆ గంధర్వులకు శాపవిముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధూక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలసాడు.

No comments:

Post a Comment