సుందరే సుందరో రామ: సుందరే సుందరీ కథ:
సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?
పెద్దలైనవారు సుందరకాండ గురించి ఈ మాట అన్నారు, ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు.
రాముడు సుందరాతి సుందరుడు, సీతమ్మ గురించి చెప్పనవసరం లేదు, ఆత్మ దర్శనం చేసిన యోగి స్వరూపుడైన సౌందర్యరాశి హనుమంతుడు, ఆ అశోకవనము అంతా సౌందర్యము, లంకా పట్టణం సౌందర్యము, మంత్ర్రం సౌందర్యం. మరి ఈ సుందరకాండలో సుందరం కానిది ఏముంది?
సుందరకాండ తత్ తో ప్రారంభమయ్యి తత్ తో ముగుస్తుంది. తత్ అంటె పరబ్రహ్మము. సుందరకాండని ఉపాసనకాండ అంటారు. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది.
తతొ రావణనీతాయాహ్ సీతాయాహ్ శత్రుకర్షనహ్ |
ఇయెష్హ పదమన్వెష్హ్టుం చారణాచరితె పథి ||
రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసం చారణులు(భూమికి దెగ్గరగా ఉండి, సర్వకాలములయందు సుభవార్తలను చెప్పే దేవతా స్వరూపులు) వెళ్ళే మార్గంలో వెళ్ళడం కోసం హనుమ సంకల్పించాడు. ఎవ్వరూ చెయ్యని పనిని చెయ్యడానికి వెళుతున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప ఎద్దు నిలబడినట్టు నిలబడి ఉన్నాడు. వైఢూర్యములలా మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడాయన బయలుదేరేముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి, సమస్త భూతములకు నమస్కారం చేసి ప్రయాణానికి సన్నధుడు అవుతున్నాడు. ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కు వంక ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరాలని తొక్కాడు. అప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయి ఆయన మీద పడిపోయాయి. ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకుపోయాయి.
హనుమంతుడు తన పాదములతో ఇంకా గట్టిగ ఆ పర్వతాన్ని తొక్కారు. అప్పుడు ఎన్నాళ్ళనుంచో ఆ పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోతుందని బయటకి వచ్చేలోపే, ఆ కలుగు నొక్కుకుపోయింది. అప్పుడు కొంత భాగం బయట, కొంత భాగం లోపల ఉండిపోయింది. అప్పుడా పాములు ఆ బాధని తట్టుకోలేక అక్కడున్న శిలలకి కాట్లు వేశాయి. అప్పుడు ఆ విషంలోనుండి పుట్టిన అగ్ని ఆ మహేంద్ర పర్వత శిఖరాలని కాల్చివేసింది. అప్పటిదాకా ఆ పర్వత శిఖరం మీద తమ భార్యలతో ఉన్నటువంటి గంధర్వులు ఒక్కసారి లేచి ఆధారము లేని ఆకాశంలోకి వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయారు.
ఎష్హ పర్వతసంకాషొ హనూమాన్ మారుతాత్మజహ్ |
తితీర్ష్హతి మహావెగహ్ సముద్రం మకరాలయం ||
అక్కడికి దేవతలు, మహర్షులు మొదలైనవారు వచ్చి ఆకాశం అంతా నిండిపోయారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు " ఏమి ఆశ్చర్యం రా, పర్వత స్వరూపమైన శరీరం ఉన్న హనుమంతుడు ఇవ్వాళ ఈ సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు " అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు.
అప్పుడు హనుమంతుడు తన తోకని ఒకసారి పైకి ఎత్తి అటూ ఇటూ ఊపి, ఊపిరిని తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి, గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి, తొడలని విశాలంగా పక్కకు పెట్టి, ఒకసారి అక్కడున్న వానరాల వంక చూసి " రాముడి కోదండం నుండి విడువబడ్డ బాణంలా నేను లంకా పట్టణం చేరుకుంటాను, అక్కడ సీతమ్మ దర్శనం అయితే సరే, లేకపోతె అక్కడినుండి స్వర్గలోకానికి వెళ్ళి సీతమ్మని వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గలోకంలో కనపడకపోతే, అదే వేగంతో లంకకి తిరిగొచ్చి రావణుడిని బంధించి రాముడి పాదాలకి సమర్పిస్తాను " అని ప్రతిజ్ఞ చేసి, తన పాదాలని పైకెత్తి ఆ పర్వతం మీదనుండి బయలుదేరాడు.
హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి, కొన్ని వేల సంవత్సరాలనుండి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహా వృక్షాలు వేళ్ళతో సహా ఆయనతో పాటు పైకి లేచిపోయాయి. ఆకాశంలో వెళుతున్న హనుమంతుడి మీద ఆ చెట్లు పుష్పాలని కురిపించాయి. తేలికయిన చెట్లు చాలా దూరం వెళ్ళాయి, బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి. అలా వెళిపోతున్న హనుమంతుడిని చూసినవారికి " ఈయన ఆకాశాన్ని తాగుతున్నాడ, సముద్రాన్ని తాగుతున్నాడ? " అని అనుమానం వచ్చింది. పసుపుపచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు. ఎర్రటి నోరుతో సూర్యమండలం వెలిగిపోతున్నట్టు ఆయన ముఖం వెలిగిపోతుంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టి పైకి ఎత్తేసాడు. అప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న తిమింగలాలు, తాబేళ్లు, చేపలు, రాక్షసులు పైకి కనపడ్డారు. హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాలలోకి వెళ్ళిపోయి మళ్ళి బయటకి వస్తూ ముందుకి వెళుతున్నాడు.
హనుమంతుడు అంత వేగంతో వెళిపోతుంటే కిందనుంచి సాగరుడు చూసి " సాగరములు ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం కనుక, అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళుతున్నాడు కనుక, ఆయనకి ఆతిధ్యం ఇవ్వడం మన ధర్మం " అని అనుకొని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి " నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్రమార్గం నుండి భూమి మీదకి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు. ఇక కింద వాళ్ళు పైకిరారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కాని నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి, కిందకి, పక్కలకి పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిధ్యం ఇవ్వడం కోసమని ఒకసారి పైకి లె, ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు " అన్నాడు.
అప్పుడు ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రము నుండి పైకి వచ్చాయి. బయటకి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే, ఆకాశం అంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాలని చూసిన హనుమంతుడు " ఓహొ, ఇప్పటివరకూ ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డువస్తున్నారు " అని అనుకొని, తన వక్ష స్థలంతో ఆ శిఖరాలని ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమయ్యి కింద పడిపోయాయి.
అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదనే నిలబడి " అయ్యా! మామూలువాడే అతిధిగా వస్తే విడిచిపెట్టము, మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిధివి. ఉపకారం చేసినవాడికి ప్రత్యుపకారం చెయ్యడం అనేది చెయ్యవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది, నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారము పొందాము. (కృత యుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, జనాలు బెంగపెట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలని నరికేశాడు. ఇంద్రుడు ఈ మైనాకుడి రెక్కలని కూడా నరకబోతుంటే, మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేశాడు. ' పోనిలే సముద్రంలో పడితే పడ్డాడు కాని, రాక్షసులు బయటకి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు ' అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు.) అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరముల మీద కూర్చొని కాస్త తేనె తాగి, పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళి హాయిగా వెళ్ళిపో " అన్నాడు.
అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని చేతితో ముట్టుకుని " నేను చాలా ప్రీతి పొందాను, నువ్వు నాకు ఆతిధ్యం ఇచ్చినట్టె, నేను పొందినట్టె, నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను చెయ్యవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను, మధ్యలో ఎక్కడా ఆగకూడదు " అని చెప్పి వెళ్ళిపోయాడు.
బయటకి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి " ఓహొ! ఇన్నాళ్ళకి నువ్వు పాతాళం నుండి బయటకి వచ్చావు కదా " అన్నాడు.
అప్పుడు మైనాకుడు " ఈ ఇంద్రుడు నా రెక్కలని తరిగేస్తే తరిగేశాడు. ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చెయ్యకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను " అనుకున్నాడు.
అప్పుడు ఇంద్రుడు అన్నాడు " నాయనా మైనాక! ధైర్యంగా హనుమకి సహాయం చెయ్యడం కోసం బయటకి వచ్చావు. రామకార్యం కోసం వెళుతున్నవాడికి ఆతిధ్యం ఇవ్వడం కోసం బయటకి వచ్చావు కనుక నీ రెక్కలు కొయ్యను " అని అభయమిచ్చాడు.
అప్పుడు దేవతలు నాగమాత అయిన సురసతో(సురస దక్షుని కుమార్తె) " చూశావ తల్లి, హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి, మింగేస్తానని భయపెట్టి, ఆయన సామర్ధ్యాన్ని పరీక్ష చెయ్యి " అన్నారు.
అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది, సముద్రం నుండి బయటకి వచ్చి హనుమంతుడితో " నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను, కనుక నువ్వు నా నూట్లోకి దూరు " అనింది.
అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామ కథని సురసకి చెప్పి " నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి, వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. కాని ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లీ. నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను " అన్నాడు.
అప్పుడా సురస " అలా కుదరదురా, నాకు బ్రహ్మగారి వరం ఉంది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే " అని తన నోరుని పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు 100 యోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటను వేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటకి వచ్చి " అమ్మా! నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను " అన్నాడు.
" ఎంత బుద్ధిబలం రా నీది, రాముడితో సీతమ్మని కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందెదవుగాక " అని సురస హనుమంతుడిని ఆశీర్వచనం చేసింది.
అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రంలోనుంచి చూసింది. ఆ సింహిక కామరూపి, ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉంది. అప్పుడామె హనుమంతుడి నీడని పట్టి లాగడం మోదలుపెట్టింది. తన గమనం తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళి హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటిద్వార లోపలికి ప్రవేశించి ఆమె గుండెకాయని తెంపేసి బయటకి వచ్చేశాడు. గిలగిల తన్నుకొని ఆ సింహిక మరణించింది.
అలా ముందుకి వెళ్ళిన హనుమంతుడు లంకా పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు.
ఆ లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం వంక చూసి " రాముడి అనుగ్రహం ఉండాలి కాని ఇలాంటి యోజనముల ఎన్ని అయినా దాటి వస్తాను " అన్నాడు.
ధృతి-దృష్టి-మతి-దాక్ష్యం అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకుంటున్నారో వారికి జీవితంలో ఓటమి అన్నది లేదు అని వాల్మీకి మహర్షి చెప్పారు. ధృతి అంటె పట్టుదల, దృష్టి అంటె మంచి బుద్ధితో ఆలోచించగల సమర్ధత, మతి అంటె బుద్ధితో నిర్ణయించవలసినది, దాక్ష్యం అంటె శక్తి సామర్ధ్యాలు.
ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ నిర్మితమైన లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లంకా పట్టణాన్ని సొంతం చేసుకోవడం ఆ దేవతల వల్ల కూడా కాదు అని అనుకొని, ఈ రూపంతో సీతమ్మని వెతకడం కష్టం కనుక పిల్లంత రూపంలో సీతమ్మని వెతుకుతాను అనుకున్నాడు. చీకటి పడ్డాక ఆయన పిల్లంత స్వరూపాన్ని పొంది లంక యొక్క రాజద్వారము దెగ్గరికి వెళ్ళాడు.
అక్కడికి వెళ్ళేసరికి వికటాట్టహాసం చేస్తూ పర్వతం అంత ఆకారంతో ఒక రాక్షస స్త్రీ కనపడింది. ఆమె హనుమంతుడిని చూడగానే " నువ్వు ఎవరు?. అరణ్యములలో తిరిగే కోతివి, నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడికి ఎందుకొచ్చావు? " అని అడిగింది.
హనుమంతుడు అన్నాడు " ఓ వికృతమైన కన్నులున్నదాన! నేను ఎందుకు వెళుతున్నానో తెలుసా? ఒకసారి ఆ వనాలని, ఉపవనాలని, చెట్లని, భవనాలని, సరస్సులని చూసి వచ్చేస్తాను. నాకు అనుమతి ఇవ్వు " అన్నాడు.
అప్పుడు ఆవిడ అనింది " నేను అనుమతి ఇవ్వడం కాదు, నన్ను గెలిచినవాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు. నువు లోపలికి వెళ్ళడానికి వీలులేదు " అనింది.
" సరే ఇంతకీ నువ్వు ఎవరు? " అని హనుమంతుడు ఆ స్త్రీని ప్రశ్నించాడు.
అప్పుడామె " నేను లోపలున్న మహాత్ముడైన రావణుడి పనుపున ఈ లంకా పట్టణానికి కాపలా కాస్తుంటాను " అని చెప్పి చట్టుకున్న హనుమంతుడిని తన చేతితో ఒక దెబ్బ కొట్టింది.
ఆ దెబ్బకి హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కుడి చేతితో కొడితే ఈమె చనిపోతుందని, తన ఎడమ చేతితో ఆమెని ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి ఆమె కళ్ళు తేలేసి కిందపడిపోయింది.
అప్పుడామె అనింది " నన్ను లంక అంటారు. నువ్వు నన్ను గెలిచావు, నేను ఈ రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాను, కొన్ని వేల సంవత్సరాల నుండి నన్ను విసిగిస్తున్నాడు. ' ఒక వానరుడు వచ్చి నిన్ను గెలిచిననాడు, నీకు ఈ రావణుడి గొడవ వదిలిపోతుంది ' అని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్ధమయ్యింది, ఈ లంకలోని రాక్షసుల పని, రావణుడి పని అయిపోయింది. ఇక నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మని కనిపెట్టు " అని రాజద్వారం తెరిచింది.
అప్పుడు హనుమంతుడు అక్కడున్న గోడమీద నుంచి ఎగిరి లోపలికి ఎడమకాలు పెట్టి దూకాడు. లోపలికి వెళ్ళి ఆ లంకా పట్టణాన్ని చూడగా, ఇది గంధర్వ నగరమా అన్నట్టుగా ఉంది. అక్కడున్న మేడలు, స్తంభాలు బంగారంతో చెయ్యబడి ఉన్నాయి. అన్నిటికీ నవరత్నాలు తాపడం చెయ్యబడి ఉన్నాయి. స్ఫటికములతో మెట్లు కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా దిగుడుబావులు, సరోవరాలతో ఆ ప్రాంతం సోభిల్లుతుంది. ఆ ప్రాంతం చెట్లతో, పక్షులతో, పళ్ళతో, నెమళ్ళ అరుపులతో, ఏనుగులతో, బంగారు రథాలతో అత్యంత రమణీయంగా ఉంది. ఆ రాత్రి పూట ఆకాశంలో ఉన్న చంద్రుడు వెన్నెల కురిపిస్తూ, లోకం యొక్క పాపం పోగొట్టేవాడిలా ఉన్నాడు. ఆ చంద్రుడి ప్రకాశంతో హనుమంతుడు ఆ లంకా పట్టణంలోని వీధులలో సీతమ్మ కోసం వెతుకుతున్నాడు.
ఆ లంకా పట్టణంలో ఉన్నవాళ్లు దీక్షితులు, కొంతమంది తల మీద వెంట్రుకలన్ని తీయించుకున్నారు, కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకొని ఉన్నారు, కొంతమంది దర్భలని చేతితో పట్టుకొని ఉన్నారు, కొంతమంది అగ్నిగుండాలని చేతితో పట్టుకొని ఉన్నారు. ఒకడు పక్కవాడికి తన ఛాతిని చూపిస్తున్నాడు, కొంతమంది తమ శరీరాలని కనపడ్డ స్త్రీల మీద పడేస్తున్నారు, కొంతమంది ఎప్పుడూ తమ చేతులలో పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని ఉన్నారు, కొంతమంది పరస్పరం ఒకడిని ఒకడు తోసుకుంటూ ఉన్నారు, తమ భుజాల బలాలని చూపించుకుంటు ఉన్నారు, ఒకడిని మరొకడు అధిక్షేపించుకుంటు మాట్లాడుకుంటున్నారు. ఆ లంకలో ఒకడు శూలం పట్టుకొని, ఒకడు ముద్గరం, ఒకడు పరిఘ, అలా రకరకములైన ఆయుధములు పట్టుకొని ఉన్నారు.
అక్కడున్న రాక్షసుల పేర్లు ఏంటంటే, ప్రహస్త, కుంభకర్ణ, మహొదర, విరూపాక్ష, విద్యున్మాలి, వజ్రదంష్ట, సుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రస్మికేతు, సూర్యకేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్తిముఖ, కరాళ, పిశాచ, మత్త, ధ్వజగ్రీవ, సుకనాస, వక్ర, శట, వికట, బ్రహ్మకర్ణ, దంష్ట్ర, రోమస.
హనుమంతుడు ఆ రాక్షసుల అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికారు, ఆ సమయంలో రాక్షస స్త్రీలు తమ భర్తలతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారు.
ఆ స్త్రీలందరినీ చూసిన హనుమంతుడు అనుకున్నాడు " మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. మా సీతమ్మ కనిపించి కనపడకుండా ఉండే చంద్రరేఖలా ఉంటుంది, మట్టిపట్టిన బంగారు తీగలా ఉంటుంది, బాణపు దెబ్బ యొక్క బాధలా ఉంటుంది, వాయువు చేత కొట్టబడ్డ మేఘంలా ఉంటుంది " అంటూ, ఆ లంకా పట్టణాన్ని వెతుకుతూ రావణాసురుడి యొక్క ప్రాసాదం దెగ్గరికి వెళ్ళాడు.
అది రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురం. దానికి మొదటి కక్ష్యలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు. రెండవ కక్ష్యలో ఏనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఆ వెనక కక్ష్యలో కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు. ఆ తరువాత కక్ష్యలో, ప్రభువు నిద్రలేవగానే ఒంటికి రాయడానికి కొంతమంది చందనం తీస్తుంటారు. తరువాత కక్ష్యలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి, ఆ వెనకాల ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వాద్యపరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు.
' ఇంకా అందరూ నిద్రపోలేదు కనుక కొంతసేపయ్యాక రావణ అంతఃపురంలోకి వెళ్ళి చూస్తాను ' అని హనుమంతుడు అనుకొని, బయటకి వచ్చి మళ్ళి కొన్ని ఇళ్ళల్లోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్ళల్లో ఉన్న రాక్షసులు లంకకి పూజ చేస్తూ శంఖాలు, భేరీలు, గంటలు మోగిస్తున్నారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి " ఇది ఇంద్రపురా, గంధర్వ నగరమా, పొరపాటున నేను స్వర్గలోకానికి వచ్చానా?. అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ ఈ లంకా పట్టణంలో కనిపిస్తున్నాయి " అనుకున్నాడు. అక్కడున్న ఇళ్ళల్లో ఎంత గొప్ప పండితుడైనా ఒక దోషాన్ని కూడా చూపలేడు, అంత అద్భుతంగా అక్కడి ఇళ్ళు ఉన్నాయి. దేవతలకి కూడా ఆ ఇళ్ళల్లోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్ర వైడుర్యాలతో అలంకరింపబడి చాలా అందంగా ఉన్నాయి. ఆ లంకా పట్టణం యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు (లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి, తాను వచ్చిన కార్యాన్ని మరిచిపోకుండా ఉండాలని, హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలనే విషయాన్ని మనస్సులో బలంగా పెట్టుకొని ఉన్నాడు). ఆ రాక్షసుల ఇళ్లన్నీ వెతికిన తరువాత హనుమంతుడు మెల్లగా రావణ అంతఃపురంలోకి ప్రవేశించాడు.
అప్పుడాయన రావణ అంతఃపురంలో ఉన్న పుష్పక విమానంలోకి ప్రవేశించాడు. ( పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకి ఇచ్చాడు. కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మని గురించి తపస్సు చేస్తే, బ్రహ్మదేవుడు కుబేరుడికి పుష్పక విమానాన్ని ఇచ్చాడు. కుబేరుడి తమ్ముడైన రావణుడు ఆయనని చావగొట్టి ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు). ఆ పుష్పక విమానంలో కూర్చుని మనస్సులో ఒక ప్రదేశాన్ని ఊహించుకుంటే, అది వాళ్ళని కన్నుమూసి తెరిసేలోగా అక్కడికి తీసుకువెళుతుంది. ఆ పుష్పకానికి వజ్ర వైడుర్యాలతో నగిషీలు పెట్టబడి ఉంటాయి, అందులో సరోవరాలు, పద్మాలు, ఉద్యానవనాలు, బంగారంతో చెయ్యబడ్డ వేదికలు, కూర్చోడానికి ఆసనాలు, పడుకోడానికి తల్పాలు, విహరించడానికి ప్రదేశాలు ఉంటాయి. అందులోకి ఎంతమంది ఎక్కినా, ఇంకా ఒకడికి చోటు ఉంటుంది. అందులో ఉన్న తివాచి మీద ఈ భూమండలం అంతా చిత్రీకరించబడి ఉంది. ఈ భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయో, అవన్నీ ఆ తివాచి మీద చెక్కబడి ఉన్నాయి. అలాగే ఏ పర్వతం మీద ఎన్ని చెట్లు ఉన్నాయో, అన్ని చెట్లు అందులో ఉన్నాయి. వాటితో పాటు ఆ చెట్లకి ఉన్న పువ్వులే కాకుండా ఆ పువ్వులలో ఉన్న కేసరములు కూడా చెక్కబడి ఉన్నాయి. దానికి కొంచెం పక్కనే లక్ష్మీదేవి పద్మములలో పద్మాసనం వేసుకొని, నాలుగు చేతులతో కూర్చున్నట్టుగా, రెండు ఏనుగులు బంగారు కలశములు పట్టుకొని, పద్మపు రేకులతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా అక్కడ ఒక చిత్రం ఉంది.
అప్పుడు హనుమంతుడు " మా అమ్మ ఇలాంటి స్థలంలో, ఇలా రాక్షసులతో మధ్యం సేవించి, ఆనందంగా ఉండదు. మా అమ్మ కన్నులవెంట వేడి నీరు కారుతూ వక్షస్థలం మీద పడిపోతూ ఉంటుంది, రాముడి చేత కట్టబడిన దీర్ఘమైన మంగళసూత్రం మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది, మా అమ్మ కన్నులకు ఉన్న వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా ఉంటాయి, పరిపూర్ణమైన ప్రేమ కురిపించే కన్నులతో మా అమ్మ ఉంటుంది, వనంలో ఉన్న నెమలిలా మా అమ్మ ఉంటుంది " అనుకుంటూ, పుష్పక విమానం నుంచి కిందకి దిగి, రావణాసురుడు పడుకున్న శయనాగారం వైపు వెళ్ళాడు.
రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టబడి ఉన్నాయి. ఆయన పడుకున్న తల్పము బంగారంతో చెయ్యబడింది, అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణములు ఎర్రటి బంగారంతో చెయ్యబడినవి, రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చెయ్యబడిన ఆభరణములు. గోడలకి ఉన్న కాగడాల నుండి వస్తున్న కాంతి, అక్కడ ఉన్న స్త్రీల ఆభరణముల నుండి వస్తున్న కాంతితొ కలిసి, ఏదో మండిపోతుందా అన్నట్టుగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది. అక్కడ వెలుగుతున్న కాగడాలు అటూ ఇటూ కదలకుండా అలాగె నిలబడి వెలుగుతున్నాయి. ఆ కాగడాలని చూస్తుంటే, జూదంలో ఓడిపోయినా కాని ఇంటికి వెళ్ళకుండా, పక్కవాడి ఆటని దీక్షగా చూస్తున్న జూదరిలా ఉన్నాయి.
అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని, ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేకుండా పడుకొని ఉన్నారు. అందరి ముఖాలు పద్మాలలా ఉన్నాయి. అలా కొన్ని వేల స్త్రీలు మదవిహ్వలులై, రావణాసురుడితో కామోప భోగాన్ని అనుభవించి, విశేషమైన మధ్యపానం చేసి, మత్తెక్కి, బడలి నిద్రపోతున్నారు. అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించినవారు కాదు, ఎవరూ సౌందర్యం తక్కువైనవారు కాదు, ఇంతకముందు వేరొక పురుషుడిని పొందినవారు కాదు, నడువడి తెలియనివారు కాదు, వీళ్ళందరూ రావణుడిని కోరుకుని వచ్చినవారు.
రావణుడు పడుకున్న తల్పం బంగారంతో చెయ్యబడింది, దానికి వైడుర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి. పడుకుని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేకరకములైన పరిమళద్రవ్యాలని చేర్చి, జాగ్రత్తగా వీస్తున్నారు. ఆ తల్పం మీద, ఉత్తమమైన పరుపు మీద రావణుడు పడుకొని ఉన్నాడు. హనుమంతుడు రావణుడి తల్పం దెగ్గరికి వెళితే, రావణుడి రోమ కూపాల నుండి కొడుతున్న బ్రహ్మతేజస్సు చేత హనుమంతుడు అవతలకి తొలగతోయబడ్డాడు. అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీదనుండి రావణుడిని చూస్తే, ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో, రావణుడు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకున్న కుండలములు ప్రకాశిస్తున్నాయి. ఆయన అనుభవించి సుఖము చేత, తాగిన మధ్యము చేత తిరుగుడుపడుతున్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడు. అరమోడ్పు కన్నులతో(సగం మూసిన కన్నులతో), పెద్ద చేతులతో, ఉత్తమమైన వస్త్రములు కట్టుకొని నిద్రపోతున్నాడు. దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతములచేత కుమ్మితే ఏర్పడిన గాయములు రావణుడి శరీరం మీద కనపడుతున్నాయి, అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి, దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనపడుతున్నాయి. ఆ రావణుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు, ఆయన చేతి గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. ఆయన ఆ తల్పం మీద, పడుకొని ఉన్న పాములా ఉన్నాడు, ఆయన చేతులు పరిఘలలా ఉన్నాయి, ఆయన చేతులకి ఉన్న వేళ్ళు రెండు అయిదు తలల పాముల్లా ఉన్నాయి.
తరువాత హనుమంతుడు అక్కడ పడుకొని ఉన్న స్త్రీలని వెతికాడు. అక్కడ పడుకుని ఉన్న స్త్రీలలో ఒకామె మృదంగాన్ని గట్టిగా పట్టుకొని పడుకుంది, ఒకామె వేణువు ఊదుతూ నిద్రపోయింది, ఒకామె వీణ వాయిస్తూ నిద్రపోయింది, ఒకామె పక్కన ఉన్న స్త్రీ మీద చీరని తీసి తన మీద దుప్పటిగా కప్పుకుంది. ఆ స్త్రీలు అక్కడున్న సంగీత వాయిద్యాలని గట్టిగా కౌగలించుకొని, వాటిని రావణుడిగా భావించి చుంబిస్తున్నారు. అక్కడ ఒక్క స్త్రీ ఒంటి మీద ఆభరణము కాని, వస్త్రము కాని సరిగ్గా లేదు. అలా పడుకొని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు.
రావణుడికి కొంత దూరంలో, బంగారు తల్పం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకొని ఉంది. ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి. ఆవిడని చూడగానే ' ఈవిడే సీతమ్మ ' అని హనుమంతుడు అనుకొని, తన భుజాలని కొట్టుకుని, తోకని ముద్దు పెట్టుకుని, విచిత్రమైన పాటలు పాడి, పిల్లిమొగ్గలు వేసి, గెంతులు వేసి, స్తంభాల పైకి ఎక్కి, కిందకి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు. కొంతసేపటికి ఆయన అనుకున్నారు " మా అమ్మ సీతమ్మ, రాముడు పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టు పుట్టం కట్టుకొని, పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా. అరరే నా బుద్ధి ఎంత వైక్లవ్యాన్ని పొందింది. ఈమె సీతమ్మ కాదు " అనుకొని ముందుకి సాగిపోయాడు.
అక్కడినుండి ముందుకి వెళ్ళగా, రకరకాలైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు, పువ్వులనుండి తీసిన సుర, పళ్ళనుండి తీసిన సుర, తేనెనుండి తీసిన సురలు మధురమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ తాగేసిన పాత్రలు, సగం తాగి కిందపడేసిన పాత్రలు, స్త్రీ-పురుషులు ఒకరిమీద ఒకరు ఉండరాని విధంగా మత్తులో పడి ఉన్నారు. హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పుడాయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నెమళ్ళ మాంసం, కోళ్ల మాంసం, మేకల మాంసం, గొర్రెల మాంసం, అడవిపందుల మాంసం అలా రకరకాలైన పదార్ధాలు ఉన్నాయి. హనుమ ఆ ప్రాంతాన్నంతటినీ వెతికారు. మళ్ళి పుష్పక విమానంలోకి వెళ్ళి, అందులో వెతికి కిందకి దిగుతూ అనుకున్నారు " ఈ లంకా పట్టణం అంతా వెతికాను, ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలు, రాక్షసులు కనపడుతున్నారు కాని సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను " అని బాధ పడ్డాడు.
కాని వెంటనే " ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహముతొ ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్ళి సీతమ్మని అన్వేషిస్తాను, మళ్ళి ఈ లంకా పట్టణం అంతా వెతికేస్తాను " అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణం అంతా వెతికి కూర్చున్నాడు.
అప్పుడాయన అనుకున్నాడు " ఇంత లంకా పట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండ నేను వెతికాను, అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు. బహుశా ఒంటి మీద వస్త్రము లేని స్త్రీలని ఎందరినో ఈ లంకా పట్టణంలో నేను చూశాను, అందువలన నాయందు ధర్మమునకు లోపం వచ్చిందేమో. నేను వెతుకుతున్నది సీతమ్మని, ఆమె ఒక స్త్రి. అందువలన ఆమెని వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలని అలా చూశాను కాని, నా మనసునందు ఎటువంటి వికారము కలగలేదు, నాకు ఎవరూ గుర్తులేరు. నేను పవిత్రముగానే ఉన్నాను " అని హనుమంతుడు తన మనస్సులో భావన చేసి, " నేను సీతమ్మ దర్శనం చెయ్యలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరాలు నన్ను ' సీతమ్మ దర్శనం చేశావా? ' అని అడుగుతారు. ' నాకు సీతమ్మ జాడ తెలియలేదు ' అని చెప్తాను. సీతమ్మ జాడ తెలీకుండా వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రాయోపవేశం చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెబితే, మిత్రుడైన రాముడికి సహాయం చెయ్యలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణము వదిలేస్తాడు. రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు. అప్పుడు అక్కడున్న వానరకాంతలందరూ ప్రాణములు వదిలేస్తారు. తదనంతరం వానరులందరు మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకి చేరి కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు, తరవాత అయోధ్యలొ అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్ళే వార్త వల్ల ఇంత మంది మరణిస్తారు. ఈ వార్తని నేను తీసుకువెళితే ఎంత వెళ్ళకపోతె ఎంత.
బహుశా రావణుడు సీతమ్మని తీసుకువస్తున్నప్పుడు, ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది, కాదు కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. తన పాన్పు చేరడంలేదని, రావణుడే సీతమ్మని ముక్కలుగా నరికి ఫలహారంగా తినేసుంటాడు, కాదు కాదు, కాముకుడైనవాడు తాను కామించిన స్త్రీని సంహరించడు. లేకపోతె రాక్షసులు సీతమ్మని తినేసుంటారు, కాదు కాదు, రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడి పది తలలు గిల్లేసి, వాడి మృతకళేబరాన్ని రాముడి పాదాల దెగ్గర పడేస్తాను, లేదా ఈ లంకని పెల్లఘించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం ఎందుకు, అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికేవరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను " అనుకున్నాడు.
కాని ఆయన వెంటనే " ఛి! మరణించడం ఏమిటి, ఆత్మహత్య మహా పాపం. మళ్ళి ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను " అనుకొని,
నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, |
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ||
(దీనిని రామాయణానికి ప్రార్ధనా శ్లోకంగా చెబుతారు)
" లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికి నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరు కాటాక్షించెదరుగాక " అని నమస్కారం చేశాడు.
అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనపడింది. అప్పుడాయన ఒక ధనుస్సు నుండి విడవబడిన బాణంలా ముందుకి వెళ్ళి అశోకవనంలో దిగారు. హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీదనుంచి అటూ ఇటూ దూకుతూ సీతమ్మని వెతికాడు. ఆ అశోకవనంలో రావణుడు తన తపఃశక్తితో నిర్మించిన క్రుతికమైన ఒక కొండ, ఆ కొండ మీదనుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి.
అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకి దూరంగా వెయ్యి స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం కనపడింది. అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మంటపం, దాని మీదకి శింశుపా వృక్షం ఉంది. అప్పుడాయన ఆ శింశుపా వృక్షం మీదకి దూకి, ఆ చెట్టు కొమ్మల నుంచి కిందకి చూస్తే, చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రి పట్టుపుట్టం కట్టుకుని ఉంది. ఆమె సీతమ్మే అయి ఉంటుందని, ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో, చుట్టూ అనేకమంది రాక్షస స్త్రీలతో, ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న, కన్నులనిండా నీరు ఉన్న, మళ్ళి మళ్ళి వేడి నిట్టూర్పులు వదులుతున్న, శుక్ల పక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖలా, ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో, పొగతో కప్పబడిన అగ్నిజ్వాలలా, నలిగిన పసుపచ్చ బట్ట కట్టుకొని, అంగారకుడి చేత పీడింపబడిన రోహిణిలా, పెరిగిన వృద్ధి తగ్గిన దానిలా, శ్రద్ధని కోల్పోయిన దానిలా, ఆశ నెరవేరని దానిలా, అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు.
అలా ఉన్న సీతమ్మని చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనందబాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూసిన హనుమకి, ఆవిడ అంగ ప్రత్యంగములయందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు ( సీతమ్మని చూడడం అంటె ప్రకృతిని చూడడం, ఆ ప్రకృతియందు పురుషుడిని{రాముడిని} చూడడం, అంటె హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు).
సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు " మా రాముడి గుండె చాలా గట్టిది, ఎవ్వరూ చెయ్యలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. అదేంటంటే, పది నెలలనుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ, తపస్సు చేసుకుంటూ, రాముడి గురించి శోకిస్తూ ఇక్కడ ఉంటె, అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలలనుంచి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు, కనుక రాముడు ఎవ్వరూ చెయ్యలేని పని చేశాడు. రాముడి మనస్సు సీతమ్మ దెగ్గర ఉంది, సీతమ్మ మనస్సు రాముడి దెగ్గర ఉంది, అందుకని ఇద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంత కాలం బతకగలిగారు. మూడు లోకములలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి ఒకపక్క పెట్టి, మరోపక్క సీతమ్మని పెడితే, సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతుతో కూడా ఆ ఐశ్వర్యము, వైభవము సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవితో, సన్నటి నడుముతో, పద్మములవంటి కన్నులతో ఆ తల్లి శింశుపా వృక్షం కింద కూర్చుని ఉంది. గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ, ముందు రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కూతురైన సీతమ్మ ఇవ్వాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా, పది నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉందంటే,
యది సీతాపి దుఃఖార్తా కాలోహి దురతిక్రమః|
ఈ కాలం అన్నది ఏదన్నా చెయ్యగలదు, ఈ కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు.
ఈ సీతమ్మ కోసమే 14,000 రాక్షసులు మరియు ఎంతో మంది రాక్షసులు చనిపోయారు. ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు, వాలి తెగటారిపోయాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాని, నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మ. నీకు నీ అమ్మ(భూదేవి) పోలిక వచ్చిందమ్మా, అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి, ఇలా వికృతమైన రాక్షస స్త్రీల మధ్యన చెట్టుకింద కూర్చున్నావ అమ్మ. శీలం, వయస్సు, నడువడి, వంశాలు, శరీరాలు అనే ఈ అయిదు లక్షణాలలో(వివాహం చేసేముందు వధువు, వరుడు ఈ 5 లక్షణాలలో సరిపోతారో లేదో చూడాలి) నువ్వు రాముడికి తగినదానివి, మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిలుచున్నా ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే, శాంతంగా ఉంటాయి. కాని రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి " అని అనుకున్నాడు.
హనుమంతుడు సీతమ్మని అలా చూస్తుండగా, మెల్లగా తెల్లవారింది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లంకా పట్టణంలో బ్రహ్మరాక్షసులు(యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా, పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో, వారు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులుగా పుడతారు) వేద మంత్రాలను పఠింస్తుండగా, మంగళవాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేచాడు. రావణుడు నిద్రలేస్తూ, జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. ఆ సమయంలో ఆయనకి సీతమ్మ గుర్తుకు వచ్చి విశేషమైన కామం కలిగింది. ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణములని ధరించి, స్నానం కూడా చెయ్యకుండా అశోకవనానికి బయలుదేరాడు. రాత్రి రావణుడితో క్రీడించిన కాంతలు కూడా ఆయన వెనకాల బయలుదేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసం బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకొని వెళ్ళింది , ఇంకొక స్త్రీ రావణుడు ఉమ్మి వెయ్యడం కోసమని ఒక పాత్ర పట్టుకొని వెళ్ళింది , కొంతమంది ఆయనకి గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళవాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు, అలాగే కొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చారు. ఇంతమంది పరివారంతో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చెయ్యడానికి తెల్లవారుజామున రావణుడు బయలుదేరాడు.
అప్పటివరకూ శింశుపా వృక్షం కింద కూర్చుని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడాన్ని గమనించి, ఇటువంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవములు కనపడితే ఏ ప్రమాదమో అని, స్త్రీ అవయవములు ఏవి కనపడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అటువంటి అవయవములు కనపడకుండా జాగ్రత్తపడి, తన తొడలతో, చేతులతో శరీరాన్ని ముడుచుకొని కూర్చుంది. అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజలా, అపవాదాన్ని భరిస్తున్నదానిలా, శ్రద్ధ నశించిపోయినదానిలా, యజ్ఞ వేదిలో చల్లారిపోతున్న దానిలా ఉంది. అలా ఉన్న సీతమ్మ దెగ్గరికి తెల్లటి పాలనురుగులాంటి వస్త్రం ధరించి రావణుడు వచ్చాడు. అప్పుడాయన తేజస్సుని చూడలేక హనుమంతుడు కొంచెం వెనక కొమ్మలలోకి వెళ్ళి, ఆకులని అడ్డు పెట్టుకొని రావణుడిని చూశాడు.
రావణుడు సీతమ్మతో " సీత! నీకు అందమైన స్తనములు ఉన్నాయి, ఏనుగు తొండాల్లాంటి తొడలు ఉన్నాయి. పిరికిదాన! నీకు ఎందుకు భయం, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే, నేను రాక్షసుడినే. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకాలని ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు, ఇక్కడ తప్పు చెయ్యడానికి భయపడతావు ఎందుకు. ఎవరన్నా ఉత్తమమైన స్త్రీలు కనపడితే వాళ్ళని తీసుకొచ్చి మాదిగా అనుభవించడం రాక్షసుల ధర్మం. నేను రాక్షసుడిని, నేను నా ధర్మాన్ని పాటించాను. ఏదో నేను తప్పు చేసినట్టు చుస్తావేంటి. మనిషికి శరీరంలో యవ్వనం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది, నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కామించాను, నువ్వు ఇలాగె చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది, అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అని అనుకుని ఉండుంటే అది నాకు క్షణంలో పని, కాని నేను నిన్ను బలవంతంగా పొందను. నీఅంతట నువ్వు నా పాన్పు చేరాలి.
ఎందుకు ఇలా ఒంటిజెడ వేసుకొని, మలినమైన బట్ట కట్టుకొని, భూమి మీద పొడుకుని ఉపవాసాలు చేస్తూ ఉంటావు. నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, ఆభరణములు ఉన్నాయో, వస్త్రములు ఉన్నాయో చూడు. 7000 మంది ఉత్తమకాంతలు నీకు దాసీ జనంగా వస్తారు. ఆ రాముడు దీనుడు, అడవులు పట్టి తిరుగుతున్నాడు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. దేవతలు కూడా నన్ను ఏమి చెయ్యలేరు, అలాంటిది ఒక నరుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు. నువ్వు హాయిగా తాగు, తిరుగు, కావలసినది అనుభవించు, ఆభరణాలు పెట్టుకో, నాతో రమించు. నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యమే, నీ బంధువులని పిలిచి ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళకి ఇవ్వు " అన్నాడు.
రావణుడి మాటలను విన్న సీతమ్మ శుద్ధమైన నవ్వు నవ్వి, ఒక గడ్డిపరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి " రావణా! నీ మనస్సు నీవారి యందు పెట్టుకో. నీకు అనేకమంది భార్యలు ఉన్నారు, వాళ్ళతో సుఖంగా ఉండు, పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటె ఎలాగన్నా బతకవచ్చు, కాని చనిపోవడం నీ చేతులలో లేదు. నువ్వు సుఖంగా బతకాలన్న, చనిపోవాలన్న నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు, కాని ఆ పాపాన్ని అనుభవించవలసిననాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు, శరణు అన్నవాడిని రాముడు ఏమి చెయ్యడు. ' నేను సీతని తీసుకొచ్చాను ' అంటావేంటి, నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సుర్యుడికాంతిని వేరు చేసి తేగలవా, వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా, పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా, ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో, ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక.
ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు, ఇక నీ పాపం పోదు. దీనికి ఒకటే మార్గం, నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు, బతికిపోతావు. నేను నిన్ను ఇప్పుడే నా తపఃశక్తి చేత బూడిద చెయ్యగలను, కాని నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను. అసలు ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారు లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా? " అని ప్రశ్నించింది.
ఈ మాటలు విన్న రావణుడికి ఆగ్రహం వచ్చి " ఏ స్త్రీయందు విశేషమైన కామం ఉంటుందో ఆ స్త్రీయందు ఉపేక్షించే స్వభావం కూడా ఉంటుంది. నన్ను చూసి ఇంతమంది స్త్రీలు కామించి వెంటపడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, సింహాసనం మీద కుర్చోపెడతాను, నా పాన్పు చేరు అంటె ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు, నీకు నా గొప్పతనం ఏంటో తెలియడం లేదు " అని చెప్పి, అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి " ఈమెయందు సామమును, దానమును, బేధమును ప్రయోగించండి అని నేకు మీకు చెప్పాను, కాని ఈమె లొంగలేదు, 10 నెలల సమయం అయిపోయింది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది, ఆ సమయంలో సీత నా పాన్పు తనంతట తాను చేరితే సరి, లేకపోతె మీరు సీతని దండించండి " అన్నాడు.
( ఇంట్లో తనని ప్రేమించి, అనుగమించే భార్య ఉన్నాకూడా, ఆ భార్యయందు మనస్సు ఉంచకుండా పరస్త్రీయందు మనస్సు ఉంచుకొని, పరస్త్రితో సంగమించిన పురుషుడికి ఆ దోషం పోవాలంటె, 6 నెలలపాటు తిరిగిన వీధి తిరగకుండా, మిట్టమధ్యానం వేళ, చీకటి పడ్డాక, పాత్ర పట్టుకొని ఇళ్ళ ముందుకి వెళ్ళి ' నాయందు మనస్సున్న ఆరోగ్యవంతురాలైన భార్య ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో సంగమించిన మహాపాతకుడిని. నేను ఆ పాప విముక్తుడిని అవ్వాలి, అందుకని మీ చేతితో ఇంత అన్నం తీసుకొచ్చి పడెయ్యండమ్మా ' అని ముష్టి ఎత్తుకున్న అన్నం తింటే వాడి పాపం పోతుంది. ఇది పురుషులకి వర్తిస్తుంది, స్త్రీలకి వర్తిస్తుంది.)
అప్పుడు రావణుడి భార్య అయిన ధాన్యమాలిని రావణుడిని గట్టిగా కౌగలించుకొని " నీయందు మనస్సున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందము, నీయందు మనస్సులేని స్త్రీతో ఎందుకు ఈ భోగము. మనము క్రీడిద్దాము పద " అనేసరికి ఆ రావణుడు నవ్వుకుంటూ తన భార్యలతో వెనక్కి వెళ్ళిపోయాడు.
అప్పుడు అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి " సీత! దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటె సామాన్యుడు కాదు, బ్రహ్మ కుమారులలో నాలుగో ప్రజాపతి అయిన పులస్త్యబ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు రావణబ్రహ్మ. సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు, బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు, ఎన్నో గొప్ప వరములను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి ఈ మూర్ఖత్వం. పోనిలె మెల్లగా మనస్సు మార్చుకుంటావు అని ఇంతకాలం చూశాము, కాని మనస్సు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి, ఎంత చెప్పాలి నీకు " అని గద్దించారు.
అప్పుడు సీతమ్మ అనింది " ఐశ్వర్యం ఉంటె భర్తగా చూడడం, రాజ్యం ఉంటె భర్తగా చూడడం, ఒంట్లో ఓపిక ఉంటె భర్తగా చూడడం నాకు తెలియదు. ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, కాని నా భర్త నాకు గురువు, సమస్తం. సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, సచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో, సుకన్య చ్యవన మహర్షిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో నేను కూడా అలా రాముడిని అనువర్తిస్తాను. మీరు నన్ను చంపి, నా శరీరాన్ని ముక్కలు చేసి తినెయ్యండి, నేను మాత్రం రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను. రావణుడిని నా ఎడమ కాలితో కూడా ముట్టుకోను. మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు, నేను వినకూడదు " అనింది.
అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి " ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటినుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతుంది. ఈమెని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను " అనింది.
ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి అనింది " నేను బయట పడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను. కాని హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను, ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో, అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ప్రభువు ఎలాగు అనుమతి ఇచ్చాడు కదా ఈమెని దండించమని, కాబట్టి ఈమె పీక పిసికేసి తినేద్దాము. ఈమె హృదయమునకు కిందన ఉండే భాగము, గుండె, మెదడు నాది " అనింది.
అప్పుడు మిగతా రాక్షస స్త్రీలు, నావి కాళ్ళు, నావి తొడలు, నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు.
తరువాత అజముఖి అనే స్త్రీ అనింది " ఈమెని అందరమూ సరిసమానంగా వాటాలు వేసుకుందాము. తొందరగా కల్లు తీసుకురండి. ఈమెని తింటూ, కల్లు తాగుతూ, నికుంబిలా నాట్యం చేద్దాము" అనింది.
అప్పుడు సీతమ్మ ఏడుస్తూ " ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేఛ్చ లేదు " అని అనుకొని, ఆ రాక్షస స్త్రీలని చూసి భయపడుతూ కూర్చున్న చోట నుంచి లేచి శింశుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది.
ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి " ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. వెయ్యి హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించి, మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకుని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు. అప్పుడు వాళ్ళు నాలుగు దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దెగ్గరికి వెళ్ళింది, ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టు పుట్టం కట్టుకుని ఉంది. రాముడు సీతమ్మకి తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు. అప్పుడు వాళ్ళు వృషభములు పూన్చిన రథంలోకి మారారు. ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరిని తన చేతితో నిమిరింది. తరువాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు.
పాల సముద్రం మధ్యలో ఒక కొండ ఉంది, ఆ కొండ మీద హేమసింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద రాముడు కూర్చుని ఉన్నాడు, ఆయన ఎడమ తొడ మీద సీతమ్మ కూర్చుని ఉంది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాముడు రెండు చేతులతో కనపడలేదు, ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలోనుంచి వస్తున్నాయో, ఎవరివల్ల నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమయిపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా, నాలుగు చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు.
ఇక్కడ లంకా పట్టణంలో రావణాసురుడు మాత్రం గాడిదలు పూన్చిన రథం ఎక్కి, ఎర్రటి వస్త్రములు ధరించి, నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథం దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. కొంతదూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు. తరువాత పైకి లేచి మెడలో గన్నేరు పూల మాలలు వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ, నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపుకొట్టే మురికి గుంటలో పడిపోయాడు. అప్పుడు వికటాట్టహాసం చేస్తూ, ఎర్రటి వస్త్రములు ధరించి, బోడి గుండుతో ఉన్న ఒక స్త్రీ పాశం వేసి రావణుడిని బయటకి లాగింది. అప్పుడామె రావణుడిని పశువుని తీసుకెళ్ళినట్టు దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళింది. ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ, నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు, ఇంద్రజిత్ మొదలైనవారు ఒంటె, మొసలి మొదలైన వాహనములను ఎక్కి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయారు.
ఒక్క విభీషణుడు మాత్రం నాలుగు దంతములు ఉన్న ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. నలుగురు మంత్రులచేత సేవింపబడుతున్నాడు. ఎక్కడినుంచో ఒక మహావానరము వచ్చి లంకా పట్టణంలోని ఇళ్ళన్నిటినీ అగ్నికి బలిచేసింది. ఎక్కడ చూసినా ' ఓ తల్లి!, ఓ అక్క!, ఓ తండ్రి!, ఓ చెల్లి! ' అనే కేకలు వినపడ్డాయి, లంకంతా బూడిదయిపోయింది.
నేను అటువంటి కలని చూశాను. ఈ సీతమ్మకి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉన్నది. అదుగో నిష్కారణంగా సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది, కట్టుకున్న పట్టు పుట్టం తనంతట కొంచెం కిందకి జారింది. ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని కూస్తోంది, పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ తొందరలోనే భర్తు సమాగమాన్ని పొందుతుంది. సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది కాని ప్రస్ఫుటంగా సుభశకునములు ఆవిడ శరీరమునందు కనపడుతున్నాయి. ఈమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మీరు బతకాలి అనుకుంటె, ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలనుకుంటె, మీ మీదకి రామ బాణాలు పడకుండా ఉండాలంటె ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణిపాతం చెయ్యండి. ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది " అని త్రిజట చెప్పింది.
ఆ త్రిజట కల విన్న రాక్షసులు శాంతించారు.
అప్పుడు సీతమ్మ " నన్ను 10 నెలల నుండి ఇంత బాధ పెట్టారు కనుక, నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక అంతా ఏడుస్తుంది. ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి " అని, ఈ లంకని పాలిస్తున్న రావణుడికి, ఇక్కడున్న వాళ్ళకి ధర్మమునందు పూనిక లేదు అందుకనే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ 2 నెలల గడువు తరువాత రావణుడి చేతిలో మరణించడం కన్నా ఇప్పుడే మరణించడం ఉత్తమం అనుకొని ' కాలమే మృగ స్వరూపంలో వచ్చి నన్ను మొహపెట్టింది, నేను అల్ప భాగ్యం ఉన్నదానిని అందుకనే ఆ మృగాన్ని చూసి మొహపడి రాముడిని వదిలేశాను. రాముడు పక్కన ఉంటె అన్నీ ఉండేవి, రాముడిని వదిలేశాను అన్నీ పోయాయి. రాముడి తరవాత పుట్టిన వాడిని వదిలాను, లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరం అయ్యాడు. రామా! రావణుడు 10 నెలల నుండి తన ఐశ్వర్యాన్ని చూపిస్తూ నన్ను లోభాపెట్టాలని చూశాడు, కాని నేను లొంగలేదు. నా భర్తే నాకు దైవం అని నమ్మాను, భూమిమీద పడుకున్నాను, ఉపవాసాలు చేశాను, ధర్మాన్ని పాటించాను, ఇన్ని చేస్తే నాకు రామానుగ్రహం కలుగుతుందని అనుకున్నాను. కాని నువ్వు రాలేదు, నన్ను కరుణించలేదు. నా పాతివ్రత్యం విఫలమయ్యింది. కృతఘ్నుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారము ఎలా మరువబడుతుందో, అలా నేను చేసిన ఉపాసన, నేను పాటించిన పాతివ్రత్యం అన్నీ కూడా నిష్ప్రయోజనం అయ్యాయి. ఇక్కడ పొడుచుకొని చనిపోదామంటే కత్తి ఇచ్చేవాళ్ళు లేరు, విషం తాగి చనిపోదామంటే విషం ఇచ్చే వాళ్ళు లేరు ' అనుకొని, తన కేశపాశములని(జుట్టుని) చెట్టు కొమ్మకి తాడులా బిగించి ఉరి వేసుకొని చనిపోవాలని నిర్ణయించుకుంది.
సీతమ్మ తన జుట్టుని ఆ శింశుపా వృక్షం యొక్క కొమ్మకి గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణంలో ఆమెకి శుభశకునములు కనపడ్డాయి. సరోవరంలో నీటి పైభాగమునందు అరవిసిరిన తెల్ల పద్మమునకు నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలోకి ఉండిపోయిన కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడింది. ఆ చాప అక్కడినుంచి వెళ్ళిపోయేముందు తన తోకని కదిపి వెళ్ళిపోయింది, అప్పుడా తోక వెళ్ళి ఆ పద్మము యొక్క కాడకి తగలడం వలన ఆ కాడ కదిలింది, కాడతోపాటు పైన ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటూ ఇటూ కదిలింది.
అప్పటిదాకా పైన ఉండి సీతమ్మని చూస్తున్న హనుమంతుడు అనుకున్నాడు ' ఈశ్వరానుగ్రహం చేత నాకు సీతమ్మ దర్శనం అయ్యింది. రావణుడిని చూశాను, రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను, త్రిజటా స్వప్నం విన్నాను. సీతమ్మని జగన్మాతగా తెలుసుకున్నాను. నేను సీతమ్మని చూశాను అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను, ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరి పోసుకుంటుంది. నేను ఇప్పుడు సీతమ్మని ఓదార్చాలి. ఇప్పుడు నేను అమ్మని ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతె, రేపుపొద్దున్న సీతమ్మ ఉరి పోసుకొని చనిపోయిందన్న విషయం రాముడికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింప చేస్తాడు. నేను చాలా పండితుడని అనుకున్న వివేచనాశీలత లేని మంత్రి చేత, దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు నా మాటలని విని, నా మీదకి వస్తారు. అప్పుడు నాకు వాళ్ళకి యుద్ధం జెరుగుతుంది. జయాపజయములను విధి నిర్ణయిస్తుంది. కాని రాముడు లంకా పట్టణాన్ని చేరేలోపల నేను చేసిన అల్లరి చేత సీతమ్మని రావణుడు వేరొకచోట దాచవచ్చు.
ఇప్పుడు నేను వానర బాషలో మాట్లాడితే సీతమ్మకి ఆ బాష అర్ధం కాదు. మనుష్య బాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తు పడతారు. వానరరూపంలో ఉన్న నేను మనుష్య బాషలో మాట్లాడితే, ఇది కచ్చితంగా రావణ మాయె అని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరి బిగించుకుంటుంది. నా కారణంగా సీతమ్మ ప్రాణాలను విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఏమి మాట్లాడి సీతమ్మని ఒదార్చాలి? " అని అనుకుంటూ, " సీతమ్మ ఉరి పోసుకోవడం మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గము. సీతమ్మకి చాలా ఇష్టమైన రామ కథని చెబుతాను " అని అనుకొని హనుమంతుడు రామ కథ చెప్పడం ప్రారంభించాడు.
" పూర్వకాలం కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించివాడు, ఇంద్రుడితో సమానమైనవాడు, ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైన దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్టు చెయ్యడం కోసమని, ఆయనని సత్యవాక్యమునందు నిలపడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు వెళ్ళాడు. రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయనని నిరంతరము అనుగమించేటటువంటి స్వభావము కలిగిన లక్ష్మణుడు రాముడి వెనకాల వెళ్ళాడు. పతిసేవ తప్ప వేరొకటి నాకు అవసరంలేదు అనే స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాల వెళ్ళింది. అలా రాముడు లక్ష్మణుడితో, సీతమ్మతో దండకారణ్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులని సంహరించాడు. దానిచేత కినుక చెందిన పదితలల రావణుడు మాయ జింకని ప్రవేసపెట్టి రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. తదనంతరం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళిన రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి, వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆనాడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకీ వానరములు పంపబడ్డాయి. దక్షిణ దిక్కుకి వచ్చిన వానరములలో ఒకడినైన హనుమ అనే పేరుగల నేను 100 యోజనముల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రంతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడో, అలాంటి సీతమ్మని ఈ శింశుపా వృక్షం మీదనుంచి ఇక్కడే కిందకి చూసి నేను ధన్యుడనయ్యాను " అని చెప్పి ఆగిపోయాడు.
ఇంతవరకూ వినపడని రామనామం వినపడేసరికి సీతమ్మ అప్రయత్నంగా తన మెడకి చుట్టుకున్న జుట్టుని విప్పేసింది. ఆ కథని విన్న ఆనందంలో పరమ సంతోషంగా సీతమ్మ శింశుపా వృక్షం వైపు చూసింది. సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా, దెగ్గర దెగ్గరగా వచ్చి, కాళ్ళతో కొమ్మని పట్టుకొని, చేతులతో ఆకులని పక్కకి తొలగించి, తెల్లటి వస్త్రములను ధరించినవాడై, పింగళ వర్ణంతో, పచ్చటి నేత్రాలతో, పగడాల మూతిలాంటి మూతితో రామ కథ చెబుతున్న సుగ్రీవుడి సచివుడైన హనుమంతుడు సీతమ్మకి దెగ్గరగా కనబడ్డాడు. అలా ఉన్న హనుమని చూడగానే సీతమ్మ స్పృహ కోల్పోయి నేలమీద పడిపోయింది.
తనకి కలలో వానరము కనపడిందనుకొని సీతమ్మ భయపడి( స్వప్నంలో వానరము కనపడితే కీడు జెరుగుతుందని అంటారు) " లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి, నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి " అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది ' అసలు నాకు నిద్ర వస్తేకద కల రావడానికి, నేను అసలు నిద్రేపోలేదు. కాబట్టి ఇదంతా నేను నిరంతరం రాముడిని తలుచుకుంటూ ఉండడం వలన రామ కథని విన్నానన్న భ్రాంతికి లోనయ్యాను ' అనుకుని మళ్ళి పైకి చూసింది. చూసేసరికి హనుమంతుడు అక్కడే ఉన్నాడు.
అప్పుడు సీతమ్మ అనింది " ఇంద్రుడితో కూడుకుని ఉన్న బృహస్పతికి నమస్కారం, అగ్నిదేవుడికి నమస్కారం, బ్రహ్మగారికి నమస్కారం, ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమగుగాక " అని సీతమ్మ దేవతలని ప్రార్ధన చేసింది.
అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందకి వచ్చి " అమ్మా! నేను అబద్ధం చెప్పలేదు. నేను యదార్ధం చెప్పాను. నేను రామదూతని, సుగ్రీవుడి సచివుడిని, నన్ను నమ్మమ్మా " అన్నాడు.
సీతమ్మ అనింది " ఎవడు 100 సంవత్సరముల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహంతో నిలబడతాడో, వాడు ఏదో ఒకనాటికి జీవితంలో శుభవార్త వింటాడు. నేను బహుశా ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను " అనింది.
అప్పుడు హనుమంతుడు " అమ్మా! నువ్వు దేవతలకి చెందినదానివా, యక్షులకు చెందినదానివా, గంధర్వులకు చెందినదానివా, కిన్నెరులకు చెందినదానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా, అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా. నీ పాదములు భూమి మీద ఆనుతున్నాయి, కనుక నువ్వు దేవతా స్త్రీవి కావు. నీలో రాజలక్షణాలు కనపడుతున్నాయి కనుక నువ్వు కచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించిన ఒక రాజు ఇల్లాలివి అయ్యి ఉంటావు అని నేను అనుకుంటున్నాను. నువ్వు కాని జనస్థానంలో రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మవి కాదు కదా? " అన్నాడు.
సీతమ్మ " ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన రాజులలో చాలా గొప్పవాడైన, శత్రుసైన్యాలని చీల్చి చెండాడగల దశరథ మహారాజు పెద్ద కోడలని నేను. విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజుకి కూతురిని, నన్ను సీత అంటారు. బుద్ధిమంతుడైన రాముడికి ఇల్లాలిని. నేను అయోధ్యలో 12 సంవత్సరాలు హాయిగా గడిపాను. కాని 13వ సంవత్సరంలో దశరథుడి ఆజ్ఞ మేర దండకారణ్యానికి వచ్చాము. రాముడు లేనప్పుడు రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకొచ్చాడు " అనింది.
' సీతమ్మకి నా మీద నమ్మకం కలిగింది ' అని హనుమంతుడు అనుకొని ఆమె దెగ్గరికి గబగబా వెళ్ళాడు. అలా వస్తున్న హనుమని చూసి సీతమ్మ మళ్ళి మూర్చపోయింది. కొంతసేపటికి తేరుకొని అనింది " నువ్వు దుర్మార్గుడవైన రావణుడివి, మళ్ళి రూపం మార్చుకొని వచ్చావు " అనింది.
కాని సీతమ్మ మనస్సులో ' ఏంటో ఈ వానరాన్ని చూస్తే అలా అనిపించడం లేదు. మనస్సులోనుంచి ప్రీతి పొంగుతుంది. ఈయన అటువంటివాడు కాదు అనిపిస్తుంది. ఈయనని చూస్తే పుత్ర వాత్సల్యం కలుగుతుంది ' అని అనుకొని, " నాయనా! నువ్వు ఎవరివో యదార్ధంగా నాకు చెప్పు " అనింది.
అప్పుడు హనుమంతుడు " అమ్మా! నువ్వు అపహరించబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు, తరువాత జటాయువు ప్రాణములు వదిలాడు. తరువాత కబంధుడు కనబడ్డాడు, ఆ తరువాత సుగ్రీవుడి దెగ్గరికి వచ్చారు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసినతరువాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. నిన్ను వెతకడం కోసం సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరాలని పంపించాడు. దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరములు సముద్రాన్ని చేరుకొని ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు, సంభరాసురుడు అనే రాక్షసుడిని చంపిన కేసరి నా తండ్రి, మా తల్లి అంజనా దేవి క్షేత్రాముగా వాయుదేవుడికి ఔరస పుత్రుడిని నేను. నేను నీ కుమారుడివంటి వాడను. నేను రామ దూతని తల్లి. రాముడు నీకోసం బెంగపెట్టుకుని ఉన్నాడు తల్లి, నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లీ " అన్నాడు.
అప్పుడు సీతమ్మ అనింది " నువ్వు వానరుడివి, రాముడు నరుడు. నరవానరములకి స్నేహం ఎలా కుదిరింది? నా శోకము పోవాలంటె నేను రాముడి గుణములు వినాలి. నువ్వు అంత రామ బక్తుడివి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు? " అనింది.
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా|
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ||
హనుమంతుడు అన్నాడు " రాముడంటే మూర్తీభవించిన ధర్మం, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు.
రామః కమల పత్రాక్షః సర్వసత్వ మనోహరః|
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే ||
రాముడు పద్మముల వంటి కన్నులున్నవాడు, అన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి, ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లి.
తేజసా ఆదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః|
బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః ||
తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు, క్షమించడంలో భూమితో సమానమైనవాడు, బుద్ధియందు బృహస్పతితో సమానమైనవాడు, కీర్తినందు ఇంద్రుడితో సమానమైనవాడు. రాముడికి యజుర్వేదము, ధనుర్వేదము, వేదవేదాంగములు తెలుసు " అని చెపుతూ, రాముడి కాలిగోళ్ళ నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకూ ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. (ఆ సమయంలోనే రాముడు 96 inches(8 feet) ఉంటాడని హనుమంతుడు చెప్పాడు.)
అలానే " అమ్మా! రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఎవరిని, ఎప్పుడు, ఏ లోకంలో, ఎలా కాపాడాలో తెలిసున్నవాడు, నడువడి ప్రధానమైనవాడు రాముడంటె. ఆయన కర్త, కారణమై ఈ సమస్త జగత్తునందు నిండిపోయాడు.
వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః|
రామనామాంకితం చేదం పశ్య దేవ్యంహుళీయకం||
ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా|
సమాశ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖఫలా హ్యసి||
( ఈ శ్లోకాలు పరమ పావనమైనవి, వీటిని సుందరకాండలో మంత్రం అంటారు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు, 10 నెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది)
అమ్మా! నేను వానరుడిని, రాముడి పలుకున వచ్చిన రామదూతని. రామ రామనామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను, నీకు నమ్మకం కలగడం కోసమని రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవ్వాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి, ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు " అన్నాడు.
హనుమంతుడు ఇచ్చిన ఆ ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది. రాముడినే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై, ఆ ఉంగరాన్ని కన్నులకి అద్దుకొని పరవశించిపోయింది.
హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ " నాయన హనుమ! లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా " అని పలు ప్రశ్నలు అగిగాక, " రాముడికి నాకన్నా ఎక్కువైనవారు ఎవరూ లేరు, నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలొ అలా ప్రవర్తించడంలొ వైక్లవ్యాన్ని పొందలేదు కదా?. రాముడు కేవలము తన పౌరుషము మీదనే ఆధారపడి, దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడ, లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడ? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నాన, నన్ను తలుచుకుంటున్నాడ. రావణుడిని, రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడినుండి అస్త్రప్రయోగం చెయ్యలేడా? రాముడు అస్త్రప్రయోగం చెయ్యకుండా నాయందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు, అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇంక 2 నెలలు మాత్రమే వాడు నన్ను బతకనిస్తాడు. కాని నేను ఒక నెల మాత్రమే బతికి ఉంటాను. ఈ ఒక నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి, ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. నేను ఇంక ఒక నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు " అనింది.
సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలని విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకొని " ఎందుకమ్మా అలా ఖేద పడతావు. మలయము, వింధ్యము, మేరు మొదలైన పర్వతముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మా వానరములు తినే కందమూలముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, రాముడు నీయందు విశేషమైన ప్రేమతొ ఉన్నాడు. ఆయన ఎంతగా తపిస్తుంటాడంటె, ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనపడితే ' హ సీత, హ సీత' అంటున్నాడు. వానప్రస్థులలాగ రాముడు కూడా సూర్యాస్తమం అయ్యాక సాధ్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీగురించే ధ్యానము చేస్తున్నాడు, ప్రతిక్షణం శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రస్రవణ పర్వతం గుహలో పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్ళు, జర్రులు, పాములు పాకినా కాని ఆయనకి స్పృహ ఉండడం లేదు. 100 యాగములు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దెగ్గర సచీదేవి ఉన్నట్టు, ప్రస్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దెగ్గరికి నిన్ను తీసుకెళ్ళి దింపుతానమ్మా. యజ్ఞంలో వేసిన హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడ ఎంత పరమపవిత్రంగా తీసుకెళతాడొ, అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దెగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కుర్చో " అన్నాడు.
కాని హనుమంతుడు అప్పటిదాక చాలా చిన్నగా ఉండడం వలన, సీతమ్మ హనుమని చూసి ఫక్కున నవ్వి " ఎంతమాట అన్నావోయి హనుమ. నువ్వే ఇంత స్వరూపం, ఆ వీపు మీద నేను కూర్చోన, నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళతావ. నీ వానర బుద్ధిని బయటపెట్టావు కదా " అనింది.
సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకొని, మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఎలా ఉంటాయో, అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు పెద్ద పాదాలతొ, బలిసిన తొడలతొ, సన్నటి నడుముతొ, విశాలమైన వక్షస్థలంతొ, శంఖంలాంటి కంఠంతొ, కాల్చిన పెనంలాంటి ముఖంతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతొ, పరిఘలవంటి భుజములతొ నిలబడ్డాడు.
హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి " నాయనా! నాకు తెలుసు నువ్వు ఎవరివో. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుగ్మంతుడికి ఉంది, నీ తండ్రి వాయుదేవుడికి ఉంది, నీకు ఉంది. నువ్వు ఇంత సమర్ధుడవు కాకపోతె రాముడు నిన్ను నా దెగ్గరికి పంపరు. నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేకపోతె రాక్షసులు నీ దారికి అడ్డురావచ్చు, అప్పుడు నీకు వాళ్ళకి యుద్ధం జెరగచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావ లేక నన్ను కాపాడుకుంటావ. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళి రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు. అందుచేత నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు. అమ్మా! నేను యుద్ధం చెయ్యగలను, నిన్ను క్షేమంగా రాముడి దెగ్గరికి తీసుకువెళతాను అని అంటావేమో, నేను స్పృహలో ఉండగా, తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి " ఆనింది.
అప్పుడు హనుమంతుడు " ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ, ఇటువంటప్పుడు కూడా ' నేను రాను ' అనడం నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా, పోని రాముడి దెగ్గరికి నేను వెళ్ళి విజ్ఞాపన చెయ్యడానికి ఏదన్నా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి " అన్నాడు.
అప్పుడు సీతమ్మ అనింది " ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రామడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకొని, తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దెగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. (రాముడికి రావణుడికి అప్పటి వరకూ ఎటువంటి శత్రుత్వం లేదు. ఇంకా కొన్ని సంవత్సరాలలో అరణ్యవాసం పూర్తయ్యి రాముడు అయోధ్యకి వెళ్ళిపోతాడు. అవతార ప్రయోజనం కోసం రావణుడు సీతమ్మని ఎలాగు అపహరిస్తాడు, కాని సీతమ్మకి ఏదన్నా అపకారం జెరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకసురుడిని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు) ఆ సమయంలో నేను కొన్ని మాంసపు ఒరుగులు(వడియాలు) అక్కడ ఎండపెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు.
అప్పుడు కాకసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఒరుగులని తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను. అప్పుడా పక్షి నా వక్షస్థలం మీద వాలి, తన ముక్కుతో గాడి వేసి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన నా వడ్డాణం జారింది, నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి ' సీత! కాకి మీదకి బంగారు వడ్డాణం విసురుతావ ' అన్నాడు. తరువాత నేను ఆ బాధని ఓర్చుకొని రాముడి ఒడిలో తల పెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకొని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళి కొంతసేపటికి నేను నిద్రలేచాను, అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళి ఆ కాకసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, మళ్ళి గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తినింది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురుకారి రాముడి నుదిటి మీద పడింది. అప్పుడు రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చేసేసరికి, వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ, ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడాయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది ' ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు ' అని గద్దించాడు. (సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు) అప్పుడాయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనపడింది.
అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని(గడ్డిని) తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి(మంత్రపూరితమైన అస్త్రాలని ప్రయోగించేటప్పుడు బాణాలె అవసరంలేదు, దేనిమీదన్నా ఆ మంత్రాన్ని అభిమంత్రించి ప్రయోగించచ్చు) విడిచిపెట్టాడు. అప్పుడా బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది, ఆ కాకి మూడు లోకములు తిరిగి అందరి దెగ్గరికి వెళ్ళింది, కాని అందరూ ' రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో ' అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి తిరిగి రాముడున్న చోటకి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది (మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్నవాడిని ఆ అస్త్రం కొట్టదు, ఎదురుతిరిగి యుద్ధం చేసినవాడినే అది కొడుతుంది. కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురుతిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయనని సంహరించలేదు).
రాముడు ఆ కాకిని చూసి ' నా దెగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టె. అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కాని ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణములతో సమానమైనదానిని ఇచ్చెయ్యాలి, మరి నువ్వు ఏమిస్తావు ' అని ఆ కాకసురుడిని రాముడు అడిగాడు.
అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి, దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవ్వాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు " అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకి చెప్పింది.
తరువాత సీతమ్మ అనింది " శత్రువులను సంహరించగలిగిన సమర్ధత కలిగిన ఓ హనుమా! నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జెరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్య దేవి లోకమునంతటిని రక్షించే కొడుకుని కనింది, ఆ రాముడి పాదాలకు సాంజలి బంధకంగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధని పొందలేదు అంటె లక్ష్మణుడు పక్కన ఉండడమే కారణం. వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు, ఆ లక్ష్మణుడిని కుశలమడిగానని చెప్పు. సుగ్రీవుడిని కుశలమడిగానని చెప్పు. హనుమా! నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనస్సులో నాయందు ఉన్నటువంటి ప్రేమని ఉద్దీపింప చేసి నన్ను తొందరలో తీసుకువెళ్లేటట్టు చెయ్యి " అనింది.
అప్పుడు హనుమంతుడు " అమ్మా! కాకాసుర వృత్తాంతం చెప్పావు, దీనితోపాటుగా ఇంకొక అభిజ్ఞానాన్ని ఇస్తావా, తీసుకువెళతాను " అన్నాడు.
అప్పుడు సీతమ్మ తన పవిట కొంగుకి కట్టి ఉన్న మూటని విప్పి, అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. (చూడమణి సముద్రజలాల నుండి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహూకరించాడు) ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సుయందు మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికి ఇవ్వు, అప్పుడు రాముడికి ఏకకాలంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు, మా అమ్మ, దశరథుడు, నేను రాముడికి జ్ఞాపకం వస్తాము " అనింది.
హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకి అద్దుకుని, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో, అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకి విశేషమైన శక్తి, ధైర్యం కలిగింది.
మళ్ళి సీతమ్మ అనింది " ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగునపడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలని అరగదీసి నా బుగ్గమీద చుక్క పెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి " అనింది.
అప్పుడు హనుమంతుడు " నేను బయలుదేరతాను " అంటె, " నాయన! 10 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను, కాని ఒక్కనాడు రామనామం వినలేదు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామ కథ చెప్పావు. నా మనస్సు పొంగిపోయింది. అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటె నాకు చాలా బెంగగా ఉంది. ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవ్వాళ ఉండి, రేపు నాకు కనపడి మళ్ళి ఒక్కసారి ఆ రామకథ నాకు చెప్పవయ్యా. ఇవ్వాల్టికి ఉండిపోవా హనుమా " అని, ఇంటినుంచి దూరంగా వెళ్ళిపోతున్న కొడుకుని కన్నతల్లి అడిగినట్టు సీతమ్మ హనుమంతుడిని అడిగింది.
అప్పుడు హనుమంతుడు అన్నాడు " అమ్మ! నువ్వు బెంగపడవద్దు. రాముడు కూడా నీమీద బెంగ పెట్టుకుని శోకిస్తున్నాడు " అన్నాడు.
అప్పుడు సీతమ్మ " నువ్వు చెప్పిన మాట నాకు మళ్ళి శోకం కలిగిస్తోంది. రాముడు నాకోసం శోకిస్తున్నాడన్న మాట చాలా బాధగా ఉంది. హనుమ! నువ్వు వస్తావు, గరుగ్మంతుడు వస్తాడు, వాయుదేవుడు వస్తాడు 100 యోజనముల సముద్రాన్ని దాటి. ఇంక ఎవరూ ఇక్కడికి రాలేరు, మరి రావణ సంహారం ఎలా జెరుగుతుంది? " అనింది.
మత్ విశిష్టాహ్ చ తుల్యాహ్ చ సంతి తత్ర వన ఒకసహ్ |
మత్తహ్ ప్రత్యవరహ్ కశ్చిన్ న అస్తి సుగ్రీవ సన్నిధౌ ||
హనుమంతుడు అన్నాడు " సుగ్రీవుడి దెగ్గర నాతో సమానమైన బలం ఉన్నవాళ్లు ఉన్నారు, నాకన్నా అధికమైన బలం ఉన్నవాళ్లు ఉన్నారు, కాని నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు సుగ్రీవుడి దెగ్గర లేడమ్మా. (ఈ మాట హనుమంతుడి వినయానికి నిదర్సనం) నేను వెళ్ళి రాముడికి చెప్పి తొందరలోనే వానర సైన్యంతో లంకా పట్టణానికి వచ్చి, రావణుడిని సంహరిస్తాము " అన్నాడు.
హనుమంతుడు సీతమ్మ దెగ్గర సెలవు తీసుకొని ఉత్తర దిక్కుకి వచ్చి " లంకా పట్టణానికి రావడమూ అయిపోయింది, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడమూ అయిపోయింది. ఆ రావణుడికి ఒక మాట చెబుదాము, ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో. కాని దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఎలాగు ఇవ్వడు, అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమదా వనాన్ని(అశోక వనం) నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు " అని అనుకొని, భీమరూపుడై ఆ అశోక వనం మీద ఎగిరాడు. అప్పుడాయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోయాయి. అలాగే హనుమ చేసిన మహా నాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కిందపడిపోయాయి. ఆయన అక్కడున్న సరోవరారలోని నీళ్ళని బయటకి తోసేశాడు.
అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు.
అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ దెగ్గరికి వచ్చి " ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చుని ఉండడం చూశాము. ఆ కోతి నీ దెగ్గరికి వచ్చి కిచకిచలాడినట్టు మాకు అనుమానం, ఆ కోతి ఎవరు? " అని అడిగారు.
అప్పుడు సీతమ్మ అనింది " పాము కాళ్ళు పాముకి తెలియాలి. ఆయన రాక్షసుడో, వేరొకడో తెలుసుకునే శక్తి నాకెక్కడ ఉంది. ఆయనెవరో మీకే తెలియాలి, నాకు తెలియదు " అనింది.
అప్పుడా రాక్షస స్త్రీలు పరుగు పరుగున రావణుడి దెగ్గరికి వెళ్ళి " ఎక్కడనుంచి వచ్చిందో కాని మహా వానరము ఒకటి వచ్చింది. అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలీదు. అది అశోక వనం అంతటినీ నాశనం చేసింది, కాని సీత కూర్చున్న శింశుపా వృక్షాన్ని మాత్రం అది వదిలిపెట్టేసింది. అలసట చేత వదిలిపెట్టిందో, కావాలని వదిలిపెట్టిందో తెలీదు. అలసట అని అనుకోడానికి వీలులేదు, ఎందుకంటే ఇంత అశోక వనాన్ని నాశనం చేసిన వానరానికి శింశుపా వృక్షాన్ని నాశనం చెయ్యడం పెద్ద లెక్కా, అది కావాలనే వదిలిపెట్టింది. నువ్వు ఏ కాంత మీదైతే నీ మనస్సుని, కామాన్ని ఉంచావొ, ఆ సీతతో ఈ వానరం మాట్లాడింది " అని చెప్పారు.
అప్పుడు రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చి 80,000 రాక్షస కింకరులని పిలిచి " మీరందరూ వెళ్ళి ఆ మహా వానరాన్ని పట్టి బంధించండి, లేకపోతె సంహరించండి " అని చెప్పి పంపించాడు.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||
(ఈ శ్లోకాలని జయ మంత్రము అంటారు)
ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని ఈ జయ మంత్ర శ్లోకాలని చెప్పాడు " రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను, ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు " అని జయ మంత్రాన్ని చెప్పాడు.
అప్పుడా 80,000 కింకరుల మూక హనుమంతుడి మీదకి రకరకములైన ఆయుధములను వేశారు. చండ ప్రచండుడైన హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిఘని ఒకదాన్ని పీకి వాళ్ళందరినీ దానితో కొట్టాడు. కళ్ళు మూసి తెరిసేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మళ్ళి ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు, అప్పుడాయనకి దూరంగా వెయ్యి స్తంభాలతోటి ఒక ప్రాసాదం కనపడింది. అప్పుడాయన ఆ ప్రాసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు. ఆ నాదం వినేసరికి లంకా పట్టణంలో కొన్ని వేలమంది గుండెలు బద్దలయ్యి, చెవుల వెంట, ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు. అప్పుడాయన తొడలు కొట్టాడు, ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు. తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిర తిప్పితే, ఆ వేగానికి అందులోనుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది. ఆ ప్రాసాదానికి కాపలా ఉన్న 100 మంది రాక్షసులని కూడా కొట్టి చంపేశాడు.
అప్పుడాయన " మా వానరములలో 10 ఏనుగుల బలం కలిగినవారు, 100 ఏనుగుల బలం కలిగినవారు, 1000 ఏనుగుల బలం కలిగినవారు, 10,000 ఏనుగుల బలం కలిగినవారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగినవారు ఉన్నారు. భూమికి అడ్డంగా ఎగరగలిగేవాళ్ళు, నిలువుగా ఎగరగలిగేవాళ్ళు ఈ భూమండలం అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు, వాళ్ళెవరూ మిమ్మల్ని విడిచిపెట్టరు. సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టిననాడు, ఈ లంక లేదు, మీరు లేరు, ఆ రావణుడు లేడు. ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు " అని చెప్పి మళ్ళి తోరణం మీదకి వచ్చి జయ మంత్రం చెప్పాడు.
80,000 మంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు. గాడిదలు పూన్చిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలి మీదకి ఒక పెద్ద రాయిని విసిరాడు. బాణములతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు ఒక సాల వృక్షాన్ని పీకి విసిరాడు, కాని ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండ ఖండములుగా కొట్టాడు. తరువాత ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద, వక్షస్థలం మీద బాణములతో కొట్టాడు, ఆ దెబ్బలకి ఆయన శరీరం నుండి రక్తం కారింది. హనుమంతుడు మళ్ళి ఒక పరిఘని పీకి, గిరగిర తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్టు ఆకాశంలోకి ఎగిరి వాడిమీద పడి ఆ పరిఘతో కొట్టాడు. ఆ దెబ్బకి జంబుమాలి రథం, శిరస్సు, చేతులు, గాడిదలు మొదలైనవి ఏమి కనపడలేదు. మళ్ళి ఆయన తోరణం ఎక్కి జయ మంత్రం చెప్పడం ప్రారంభించాడు. అక్కడున్న రాక్షసులందరినీ కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు, మోకాళ్ళతో కుమ్మేశాడు, చేతులతో గుద్దేసి అక్కడున్న రాక్షసులందరినీ సంహరించాడు.
" జంబుమాలి, జంబుమాలి వెనక వెళ్ళిన సైన్యము అంతా మరణించారు " అని రావణుడికి కబురు వెళ్ళింది. అప్పుడు రావణుడు తన 7 మంత్రుల కొడుకులని హనుమ పైకి యుద్ధానికి పంపించాడు. వాళ్ళు అన్ని వైపులనుండి హనుమ మీదకి బాణ ప్రయోగం చేశారు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు. ఆయన కింద పడిపోయి చాలామంది చనిపోయారు, మిగిలినవారి గుండెల్ని తన గోళ్ళతో గిల్లేసి చంపేశాడు. కొంతమందిని పళ్ళతో కొరికి చంపేశాడు. అప్పుడా ప్రాంతం తెగిపోయిన తలలతో, చచ్చిపోయిన ఏనుగులతో, పచ్చడైపోయిన శరీరాలతో, విరిగిపోయిన రథాలతో ఉంది.
వెళ్ళిన మంత్రుల సుతులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది, అప్పుడాయన 5 సేనాగ్ర నాయకులని పిలిచి " మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి, అది సామాన్యమైన వానరం కాదు. నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను, వాళ్ళందరూ తమ తపోశక్తులని ధారపోసి సృష్టించిన మహా భూతం అయ్యి ఉంటుంది " అన్నాడు. విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘస, భాసకర్ణ అనే 5 సేనా నాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళల్లో దుర్ధరుడు వేసిన మూడు ఇనుప బాణములు హనుమంతుడి తలలో తగిలాయి. ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు. ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనా నాయకులు అలా చూశారు అంతే, ఆయన గబుక్కున ఆ దుర్ధరుడి రథం మీద పడిపోయాడు. హనుమంతుడి శరీరం కింద దుర్ధరుడు, ఆయన రథం, అన్నీ పచ్చడయిపోయి ఉన్నాయి. మిగిలిన వారిలో ఇద్దరు ఆయన వైపు పరుగులు తీసారు, అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద చెట్టుని పెకలించి దానితో ఆ ఇద్దరినీ కొట్టాడు. ఆ దెబ్బకి ఆ ఇద్దరూ మరణించారు. తరువాత మిగిలిన ఇద్దరినీ సంహరించాడు.
ఈ వార్త విన్న రావణుడు సభలో అటూ ఇటూ తేరిపారి చూసి తన చిన్న కుమారుడైన అక్ష కుమారుడి మీద ఆయన చూపులు ఆగాయి. తండ్రి తన వంక చూడగానే ఆ అక్ష కుమారుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే ' ఈ పిల్లవాడు ఎంత బావున్నాడు రా, చిన్నవాడే కాని చూస్తుంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు. కాసేపు వీడిని యుద్ధం చెయ్యనిద్దాము ' అని హనుమంతుడు అనుకున్నాడు. అక్ష కుమారుడు వేసిన బాణ పరంపర నుండి హనుమంతుడు సూక్ష్మ రూపంలో దొరకకుండా తిరుగుతున్నాడు. అక్ష కుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు. అప్పుడు హనుమంతుడు ' దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు, కాని ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటె ఇల్లు అంటుకుంటుంది. ఇక వీడిని చంపవలసిందే ' అనుకొని, ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్దద్ది చేసి కింద పడ్డాడు. అప్పుడు గుర్రాలు, రథం, సారధి చనిపోయారు కాని అక్ష కుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయి, ఆకాశం నుండి యుద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆ అక్ష కుమారుడి పాదాలని పట్టుకొని వేగంగా కిందకి లాగి నేలకేసి బాదాడు. ఆ దెబ్బకి అక్షకుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి, తలకాయి వెయ్యి ముక్కలయ్యింది, కడుపు బద్దలయిపోయి పేగులు బయటకి వచ్చాయి.
తన చిన్న కుమారుడు మరణించాడన్న వార్త విన్న రావణుడికి జీవితంలో మొదటిసారి బాధ అంటె ఏంటో, భయం అంటె ఏంటో తెలిసొచ్చింది. అప్పుడాయనకి ఎవరిని పంపాలో అర్ధం కాక ఇంద్రజిత్ వంక చూసి " నిన్ను పంపకూడదు, కాని ఇవ్వాళ నిన్ను పంపక తప్పడంలేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళు, లంకా పట్టణం భద్రత అంతా నీ చేతులలో ఉంది. ఒకసారి అస్త్రాలన్నిటిని మననం చేసుకుంటూ వెళ్ళు. ఎలాగైనాసరే ఆ వానర వీరుడి వేగం తగ్గించి పట్టుకొ, అవకాశం దొరికితే వాడిని సంహరించు " అని చెప్పి పంపాడు. ఇంద్రజిత్ రావణుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు.
ఇంద్రజిత్, హనుమంతుడు ఒకరికి ఒకరు దొరకకుండా యుద్ధం చేసుకుంటున్నారు. ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి, అనుకొని ఇంద్రజిత్ హనుమ మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరం( ఏ అస్త్రము నిన్ను ఏమి చెయ్యలేదు) జ్ఞాపకం వచ్చి ' ఇది బ్రహ్మాస్త్రం, బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రం, నేను దీనిని గౌరవించాలి. నేను ఆయనని తలుచుకొని నమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది. కాని నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను ' అనుకున్నాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వలన హనుమంతుడు నేల మీద పడిపోయాడు. ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనపడ్డ గుడ్డ ముక్కలతో హనుమంతుడి కాళ్ళు, చేతులు కట్టేసి, కర్రలతో కొట్టారు. అప్పుడు హనుమంతుడు ' ఇలా ఈ రాక్షసులని ఎంతసేపు చంపుతాను, ఒకసారి రావణుడిని చూస్తాను ' అనుకొని అలా ఉండిపోయాడు.
కాని ఇంద్రజిత్ అనుకున్నాడు ' ఈ రాక్షసులు బుద్ధిహీనులు. బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాడులతో కట్టారు. బ్రహ్మాస్త్రం చేత నిర్భంధింపబడ్డ వ్యక్తిని వేరొకదానితో కడితే ఆ బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. ఒకసారి బ్రహ్మాస్త్రం వెయ్యబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళి సూర్యోదయం అయ్యేవరకు పనిచెయ్యదు. ఇప్పుడీయన తలచుకుంటె ఏమన్నా చెయ్యగలడు. కాని ఆ వానరానికి అస్త్రం వదిలేసిందన్న విషయం తెలీలేదు, వీళ్ళు కట్టేయడం వలన ఇంకా ఆ బ్రహ్మాస్త్రమే పట్టుకుని ఉందనుకుంటున్నాడు " అని అనుకొని సంతోషపడ్డాడు.
వాళ్ళు హనుమంతుడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రావణుడి దెగ్గర నిలబెట్టారు. ఒక నల్లని మబ్బుని కాని, ఒక కాటుక కొండని కాని తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో, అలా రావణుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. రత్నములు, వజ్రములు, స్ఫటికములు తాపడము చెయ్యబడ్డ ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు. రావణుడికి వానరమైన హనుమంతుడితో మాట్లాడడం సిగ్గుగా అనిపించి తన మంత్రైన ప్రహస్తుడి వంక చూసి " ఎక్కడినుంచి వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఎవరివాడు? నాకు ఇష్టమైన అశోక వనాన్ని ఎందుకు నాశనం చేశాడు? సీతతో ఎందుకు మాట్లాడాడు? ఏమి మాట్లాడాడు? ఈ విషయాలు మీరు ఆ వానరాన్ని అడిగి కనుక్కోండి. నిజం చెబితే వాడి ప్రాణాలు ఉంటాయి, అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి " అన్నాడు.
అప్పుడు ప్రహస్తుడు లేచి " నువ్వేమి భయపడకు. మా ప్రభువు ధర్మాత్ముడు. నిజం చెప్పు, నిన్ను పంపించేస్తాము. నిన్ను అగ్ని పంపించాడ? యముడు పంపించాడ? కుబేరుడు పంపించాడ? విష్ణువు పంపించాడ? ఎవరి ప్రమేయం వల్ల నువ్వు ఈ లంకా పట్టణానికి వచ్చావు? ఎందుకు అశోక వనాన్ని నాశనం చేశావు? " అని ప్రశ్నించాడు.
అప్పుడు హనుమ రావణుడి వంక చూసి " ఏమి కాంతి, ఏమి ద్యుతి, ఏమి పరాక్రమం, నిజంగా వీడి దెగ్గరే కాని మహా పతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాతకం లేకపోతె వీడు మూడు లోకములను శాసించగలిగినవాడు కదా " అన్నాడు.
హనుమని చూసిన రావణుడు భయపడి ' ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు, ఇంతకముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని, సుషేణుడిని, నీలుడిని చూశాను, కాని వాళ్ళెవరికి ఇంత పరాక్రమము, సామర్ధ్యం లేవు. బహుశా ఆనాడు నేను కైలాశ పర్వతాలని కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు, ' వానరులు నా కొంప ముంచుతాయని '. బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో ' అనుకొన్నాడు.
అప్పుడు హనుమంతుడు అన్నాడు " నేను రామ దూతగా ఇక్కడికి వచ్చాను. నా యదార్ధ స్వరూపము వానర స్వరూపమే. నన్ను హనుమ అంటారు, సుగ్రీవుడి సచివుడిని. కిష్కిందా రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా, ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. నీకు వాలికి ఉన్న స్నేహబంధం వల్ల సుగ్రీవుడు నీకు సోదరుడి వరస అవుతాడు, ఆ సుగ్రీవుడు నీ కుశలమడిగానని చెప్పమన్నాడు. నేను రాక్షసుడిని కాదు, రాముడిలా నరుడిని కాదు. నేను తటస్థమైనవాడిని, వానరుడిని. అందుకని నీ మంచి కోరి నాలుగు మంచి మాటలు చెబుతాను, విన్నావ బాగుపడతావు, లేకపోతె నాశనమయిపోతావు. నిన్ను చూడడానికి వేరొక ఉపాయము లేదు, అందుకని దండోపాయంతో అశోక వనాన్ని నాశనం చేశాను. అప్పుడు నీ వాళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చారు, దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో నాలుగు గుద్దులు గుద్దాను, వాళ్ళు చనిపోయారు.
పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన నలుగురు కుమారులలో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసమని 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడం కోసం లక్ష్మణుడు, సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. రాముడి భార్య అయిన సీతమ్మని నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకలొ పెట్టావు, సీతమ్మ ఎవరో నాకు తెలీదు, నేను చూడలేదు అని అబద్ధాలు చెప్పమాకు. నేను సీతమ్మని అశోకవనంలో చూశాను, నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు. సీతమ్మ అయిదు తలల పాము, నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు. రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నిన్ను చంపడానికి రాముడి దాకా ఎందుకు, సుగ్రీవుడు నిన్ను చంపేస్తాడు. రాముడికి సుగ్రీవుడికి అగ్ని సాక్షిగా స్నేహం ఉంది, కనుక రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువే. నువ్వు ఆనాడు ' నర వానరములతో తప్ప ' అని బ్రహ్మగారిని వరం అడిగావు కదా, సుగ్రీవుడు గంధర్వుడు కాదు, కిన్నెరుడు కాదు, యక్షుడు కాదు, దేవత కాదు, రాక్షసుడు కాదు, ఆయన కేవలం వానరుడు. మనం చేసిన పుణ్యపాపాలకి సంబంధించిన ఫలితాలని పరమాత్మ ఏకకాలంలో ఇస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలకి కాంచన లంకని పొందావు, వేల మంది కాంతలతో సుఖాలని అనుభవించావు, ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కాని నువ్వు ఇవ్వాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు, ఆ పాపం వల్ల నువ్వు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నావు. రాముడికి ధనుర్వేదంలో సమస్త అస్త్ర శస్త్రములు తెలుసు, ఋషుల దెగ్గర శిక్షణ పొందినవాడు, మహా ధర్మాత్ముడు, అటువంటి రాముడు లంకలో నిలబడి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు. ఆ సమయంలో నీలాంటి రావణులు లక్ష మంది వచ్చినా రాముడి ముందు నిలబడలేరు.
ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతుంటె, శివుడు తన కాలి బొటను వేలితొ ఆ పర్వతాన్ని తొక్కగా నీ 20 చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి. అటువంటి శివుడి ధనుస్సుని రాముడు హేలగా విరిచేశాడు. నిన్ను ముప్పతిప్పలు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టేశాడు. ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు. 14,000 మంది రాక్షసులని జనస్థానంలో రాముడొక్కడే సంహరించాడు. అటువంటి రాముడు వస్తే నువ్వు బతకగలవా. అయినా నిన్ను చంపడానికి రాముడు ఎందుకు, నేను చాలు. మర్యాదగా సీతమ్మని రాముడికి అప్పగిస్తే బతికిపోతావు, లేదా చచ్చిపోతావు " అన్నాడు.
ఒక నిండు సభలొ తనని హనుమంతుడు ఇంతలా అపేక్షించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహం వచ్చి " ఈ వానరాన్ని చంపెయ్యండి " అన్నాడు.
అప్పుడు విభీషణుడు లేచి " అన్నయ్య! నువ్వు వేదాలు చదువుకున్నావు, ధర్మాలు చదువుకున్నావు. ఇలా దూతని చంపమని నువ్వు అనడం సరికాదు. దూతకి వెయ్యబడే శిక్షలు కొన్ని ఉన్నాయి, అవి తల గొరిగించడం, అవయవాన్ని తీసెయ్యడం, వాత పెట్టడం. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతలివారికి ఎలా తెలుస్తుంది. అందుకని వచ్చిన దూతని చంపద్దు " అన్నాడు.
విభీషణుడి మాటలు విన్న రావణుడు " వానరాలకి తమ తోక అంటె చాలా ఇష్టం. అందుకని వీడి తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తనని పంపినవారి దెగ్గరికి వెళుతుంది, అప్పుడు ఈ వానరం యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి ' తోకలేని కోతి, తోకలేని కోతి ' అని ఏడిపిస్తారు " అన్నాడు.
అప్పుడు వాళ్ళు పాట బట్టలు పట్టుకొచ్చి హనుమ తోకకి చుట్టి, నెయ్యి పోసి మంట వెలిగించారు. హనుమంతుడిని కట్టేసి, రథం ఎక్కించి నాలుగు కూడళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి కర్రలతో కొడుతూ ' గూఢచారి, గూఢచారి ' అని ప్రకటించారు. ఆ లంకా పట్టణంలో మేడల మీద మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు.
అప్పుడు హనుమంతుడు ' వీళ్ళు నన్ను కొడితే కొట్టారులే కాని, రాత్రి వేళలొ ఈ లంకా పట్టణాన్ని అన్వేషించాను. ఒకసారి పగటిపూట ఈ రావణుడి బలం ఏమిటో, లంక యొక్క గొప్పతనం ఏమిటో చూసి సుగ్రీవుడికి చెబుతాను ' అనుకున్నాడు. వాళ్ళు హనుమని ఆ లంకా పట్టణం అంతా తిప్పాక ఆయన ఒక్కసారి కట్లని విడిపించుకొని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకని పట్టుకున్నాడు.
అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దెగ్గరికి వెళ్ళి " నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు " అన్నారు.
సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్ధన చేసి " నేను సర్వకాలములయందు రాముడికే సేవ చేసిన దాననయితే, రాముడినే మనసులో పెట్టుకున్న దాననయితే, నాకు భాగ్యవిశేషం మిగిలి ఉంటె, రాముడికి నామీద ప్రేమ ఉంటె, సుగ్రీవుడు నన్ను తీసుకెళ్ళి రాముడితో కలపడం యదార్ధమయితే, హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్ని చల్లబడుగాక " అనింది.
వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్నముద్దలా చల్లగా అయిపోయింది. అప్పుడాయన అనుకున్నాడు ' అవునులే నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిధ్యం ఇచ్చాడు, సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు, సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది. నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు ' అని అనుకుని, ' ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను ' అనుకొని, మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ళ మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలం కడుపుమండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్ని దేవుడు కాల్చేస్తున్నాడు, వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ళమీద వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కాలిపోతుంది. ఆ లంకలో అందరూ " హా తాత, హా పుత్ర, హా తల్లి " అని అరుచుకుంటూ దిక్కులుపట్టి పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి, ఎదురుగా లంక లంకంతా కాలిపోతూ కనిపించింది.
అప్పుడాయన " అరరే ఎంతపని చేశాను. అగ్నిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేసినట్టు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు. పాము కుబుసాన్ని విడిచినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకని అగ్ని కాల్చలేదొ, అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుంద. సీతమ్మే అగ్ని, అగ్నిని అగ్ని కాలుస్తుంద " అని అనుకున్నాడు.
ఇంతలో అటుగా వెళుతున్న చారణులు(భూమికి దెగ్గరగా ఆకాశంలొ ఎగురుతూ శుభవార్తలు చెప్పే దేవ గాయకులు) " ఏమి ఆశ్చర్యం, ఇవ్వాళ ఒక వానరుడైన హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ లంక అంతా కాలిపోతుంది, కాని శింశుపా వృక్షము, ఆ వృక్షము కింద కూర్చున్న సీతమ్మకి ఎటువంటి అపకారము జెరగలేదు. అలాగే విభీషణుడి ఇల్లుకి కూడా ఏమి జెరగలేదు " అన్నారు.
అప్పుడు హనుమంతుడు శింశుపా వృక్షం కిందన కూర్చున్న సీతమ్మ దెగ్గరికి వచ్చి " అమ్మా లంకంతా కాల్చేశాను. రావణుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను, నువ్వేమి బెంగపెట్టుకోకు. వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు. రాముడి కోసం వాడిని వదిలేశాను, లేకపోతె వాడి పది తలకాయలు గిల్లేసేవాడిని. అమ్మా! నేను బయలుదేరతాను, తొందరలోనే నీకు పట్టాభిషేకం జెరుగుతుంది, శోకమునకు గురికాకు " అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి నల్లటి వనాలతో, ఎర్రటి మచ్చలు కలిగిన ఏనుగులతో ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి, అక్కడినుంచి బయలుదేరాడు. హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది.
ఆకాశంలోని మేఘాల్ని తాగుతున్నాడ, అన్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురుచూస్తున్న వానరముల దెగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు. అక్కడున్న వానరాలు ' ఆకాశం బద్దలయ్యిందా ' అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ జాంబవంతుడి దెగ్గరికి వచ్చి " తాత, అంత పెద్ద అరుపు వినిపిస్తోంది, అది హనుమదేనా? " అన్నారు.
జాంబవంతుడు అన్నాడు " అది కచ్చితంగా హనుమే. హనుమకి ఒక కార్యం చెబితే అవ్వకపోవడం అన్నది ఉండదు. తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టే ఇంత పెద్ద మహానాదం చేశాడు " అన్నాడు.
హనుమని అంత దూరంలో చూడగానే వానరులంతా పరుగులు తీశారు, అప్పుడు హనుమంతుడు " చూడబడెను సీతమ్మ " అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగారు. అప్పుడు జాంబవంతుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైనవారు తప్ప మిగిలిన వానరములన్నీ తమ తోకల్ని కర్రలలా నిలువుగా పెట్టి, ఆ తోకల్ని చేతులతో పట్టుకుని హనుమ దిగిన కొండ ఎక్కి, ఆయనని ముట్టుకొని పారిపోతున్నారు. అప్పుడు హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు. " నిజంగా ఆ రావణుడికి ఎంత తపఃశక్తి ఉందో, సీతమ్మని ముట్టుకుని కూడా వాడు బూడిద కాలేదు. కాని సీతమ్మ పాతివ్రత్యం చేత రావణుడు ఎప్పుడో మరణించాడు, రాముడు నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి చంపడమే " అన్నాడు.
అప్పుడు అంగదుడు " అంతా తెలిసిపోయింది కదా, ఇంక రాముడికి చెప్పడం ఎందుకు. ఇలాగె వెళ్ళిపోయి ఆ రావణుడిని సంహరించి, సీతమ్మని తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాము " అన్నాడు.
అప్పుడు జాంబవంతుడు " తప్పు, అలా చెయ్యకూడదు, పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు. ఈ విషయాలని రాముడికి చెప్పి రాముడు ఎలా చెబితే అలా చేద్దాము " అన్నాడు.
అప్పుడు వాళ్ళందరూ ముందుకి బయలుదేరారు. అలా వాళ్ళు వెళుతుండగా వాళ్ళకి మధువనం కనపడింది. ఆ మధువానాన్ని దదిముఖుడనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ మధువనంలోని చెట్ల నిండా తేనె పట్లు ఉన్నాయి. అక్కడంతా పువ్వుల నుండి తీసిన మధువు, పళ్ళనుండి తీసిన మధువు, రకరకాలైన మధువు పాత్రలలో పెట్టి ఉంది. ఆ వానరములన్నీ అంగదుడి దెగ్గరికి వెళ్ళి " ఆ మధువనంలోని మధువుని తాగుదాము " అన్నారు. అంగదుడు సరే అనేసరికి అందరూ లోపలికి వెళ్ళి తెనేపట్లు పిండేసుకుని తేనె తాగేశారు, అక్కడున్న పాత్రలలోని మధువు తాగేశారు, అక్కడున్న చెట్లకి ఉన్న పళ్ళని తినేశారు. వారందరూ విపరీతంగా తేనె తాగడం వలన మత్తెక్కి, కొంతమంది చెట్లకింద కూర్చుని పాటలు పాడడం మొదలుపెట్టారు, పాటలు పాడుతున్నవారి వీపు మీద కొంతమంది గుద్దుతున్నారు, కొంతమంది నాట్యాలు చేస్తున్నారు, కొంతమంది కనపడ్డవారికి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నారు, కొంతమంది పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారు, కొంతమంది అటూ ఇటూ నడుస్తున్నారు, కొంతమంది చెట్ల మీద నుంచి కింద పడిపోతున్నారు, కొంతమంది నిష్కారణంగా ఏడుస్తున్నారు.
ఆ వానరాలు చేస్తున్న అల్లరికి దదిముఖుడి సైన్యం వస్తే, వాళ్ళని చావగొట్టి తమ వెనుక భాగాలు చూపించారు. ఆ తరువాత వచ్చిన దదిముఖుడిని కూడా చావగొట్టారు. అప్పుడాయన ఏడుస్తూ సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి జెరిగిన విషయం అంతా చెప్పాడు. దదిముఖుడు సుగ్రీవుడితో వానర బాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, మధ్య మధ్యలో హనుమ అంటున్నాడు. దదిముఖుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతుంది(వానరాలు ఏదన్నా సంతోషకరమైన వార్త వింటె తోకలు పెంచుతారు). ఒకపక్క దదిముఖుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచడం గమనించిన లక్ష్మణుడు కంగారుగా " అసలు ఏమయ్యింది " అన్నాడు.
" ఏమిలేదయ్య, దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరాలు మధువానాన్ని నాశనం చేశాయంట. దక్షిణ దిక్కుకి వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసుంటాడు " అని లక్ష్మణుడితో అని, " వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను " అని సుగ్రీవుడు దదిముఖుడితో అన్నాడు.
దదిముఖుడు ఆ వానరాలకి " సుగ్రీవుడు రమ్మంటున్నాడు " అని చెప్పగానే అందరూ ఆకాశంలోకి ఎగిరిపోయి కిష్కిందకి చేరిపోయారు. వాళ్ళందరూ రాముడి దెగ్గరికి వెళ్ళి " రావణుడు సీతమ్మని లంకలో శింశుపా వృక్షం కింద ఉంచాడు. సీతమ్మ చాలా బాధ పడుతుంది, మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చెయ్యాలి " అన్నారు.
అప్పుడు రాముడు " సీత నాయందు ఎలా ఉంది? " అని అడిగాడు.
అప్పటిదాకా రాముడి చుట్టూ ఉన్న వానరాలు, ఈ ప్రశ్నకి హనుమంతుడే సమాధానం చెప్పగలడు అని ఆయనకి దారిచ్చాయి. అప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకి నమస్కరించి " సీతమ్మ తపస్సుని పాటిస్తుంది, నీయందు పరిపూర్ణమైన ప్రేమతో ఉంది " అని, సీతమ్మ చెప్పిన ఆనవాళ్ళన్ని చెప్పి చూడామణిని ఇచ్చి " సీతమ్మ కేవలం ఒక నెల మాత్రమే ప్రాణాలని నిలబెట్టుకుంటానంది, మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుడిని సంహరించి, సీతమ్మని తీసుకురావాలి " అన్నాడు.
అప్పుడు రాముడు " సీత జాడ తెలిశాక నేను ఒక్క రోజు కూడా ఉండలేను " అని ఏడ్చి, సీత ఎలా ఉందని అడిగిగాడు. అప్పుడు హనుమంతుడు సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని, పాతివ్రత్యాన్ని వివరించి " నీకు సుగ్రీవుడికి కలిగిన స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందింది. సుగ్రీవుడిని, మిగిలిన వానరములని కుశలమడిగింది. శోకముర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను, నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ ఇవ్వాళ శోకమును వదిలిపెట్టి తన కోసం నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తోంది " అని చెప్పాడు.
అలా హనుమంతుడు తన వాక్ వైభవంతో సీత రాములని సంతోషపెట్టాడు.
No comments:
Post a Comment