Sunday, August 19, 2012

శ్రీలక్ష్మీ నృసింహ స్తోత్రము

శ్రీ శంకర భగవత్పాదులు శిష్యులతో దేశ సంచారము చేయుచూ శ్రీశైలమునకు వచ్చినపుడు శ్రీ సంకరులను ఒక కాపాలికుడు చంప నిశ్చయించెను. ఒక గొప్ప రాజును గాని, యోగిని గాని బలి యిచ్చినచో కపాలి (ఈశ్వరుడు) తనకు కోరిన వరములిచ్చునని కాపాలికుని విశ్వాసము. శ్రీ శంకరులు దీనికి అంగీకరించి, నాశిష్యులవలన నీకు అపాయము కలుగకుండా చూచుకొనుము అని చెప్పిరి. కాపాలికుడు కత్తి నెత్తిన పెట్టు సమయమున శ్రీ శంకరులు అంగరక్షకులైన పద్మపాదు అను శిష్యునకు తమ గురువు ఆపదలో ఉన్నట్లు స్పురించి, అతడు నృసింహ మంత్రమును జపించుచూ గురుసన్నిధికి రాసాగెను. ఇంతలో భగవంతుడు నృసింహరూపమున వచ్చి ఆ కాపలికుని చీల్చి చంపి, శంకరులను కాపాడెను. ప్రత్యక్షమైన శంకరుని చూచి పరవశులై శ్రీ శంకరులవారు స్తుతించుచూ ఈ స్తోత్రమును చెప్పిరి. ఈ స్తోత్రమును పటించువారికి ఎట్టి ఆపదలు కలుగవని భక్తుల విశ్వాసము.

శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రమ్

శ్లో|| శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే! భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే !
యోగీ శ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత! లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||
తా: పాలసముద్రము నివాసముగాగల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దేహము కలవాడా! యోగులకు ప్రభువైన వాడా! శాశ్వతుడా! సంసార సాగరమునకు నావ యగువాడా! లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.

శ్లో || బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క కిరీటకోటి - సంఘటి తాఘ్రి కమలామల కాంతికాంత
లక్ష్మీ ల సత్కుచ న రో రు హరాజహంస - లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలమ్బమ్ ||
తా: బ్రహ్మ, దేవేంద్రుడు, శివుడు, వాయుదేవుడు, సూర్యుడు అను దేవతల కిరీటముల అంచులచే తాకబడిన పాదపద్మముల కాంతిచే ప్రకాశించు వాడా! లక్ష్మీ దేవి యొక్క అందమైన  స్తనములనెడి తామర మొగ్గలకు రాజహంస యైన వాడా! ఓ లక్ష్మీ నృసింహాదేవా! నాకు చీయూత నొసగుము.

శ్లో || సంసార సాగర విశాలాక రాళ కాల - నక్ర గ్ర హగ్ర సన నిగ్ర హ విగ్ర హాస్య |
వ్యగ్ర స్య రాగర సనో ర్మి నిపీడిత స్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ దేవా నేను సంసారమనెడి సముద్రములో మునిగి, భయంకరములై, పెద్ద వైన కోరికలనెడి మొసళ్ళు మున్నగు క్రూర జల చరములచే మ్రింగ బడుచున్నాను. రాగ మనెడి ధ్వనించు అలలచే బాదింపబడుచున్నాను. ఓ నృసింహ దేవా! అట్టి నాకు చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.

శ్లో || సంసార ఘోర గహనే చరతో మురారే ! మారో గ్రభీ కర మృగ ప్రచురార్ధి తస్య |
ఆర్తస్య మత్సర నిదాఘుణి పీడితస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
తా: ఓ మురారీ! నేను సంసార మనెడి ఘోరమైన అరణ్యములో సంచరించుచున్నాను. అందు మన్మథుడనెడి భయంకరమైన క్రూర మృగము నన్ను పట్టి మిక్కిలి పీడించుచున్నది. మత్సరమను మండువేసవి బాధింపగా మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ నృసింహ దేవా! ఆర్తుడైన నాకు రావలంబన మిచ్చి కాపాడుము.

శ్లో|| సంసార కూప మటి ఘోర మగాధ మూలం - సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య ,
దీన స్య దేవ కృపాయా పద మాగాతస్య  - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
తా: ఓ నరసింహస్వామీ! సంసారమనునది భయంకరమును, మిక్కిలి లోతైనదియును అగు పాడునుయ్యి . నేను ఆ కూపములో పడిపోయితిని. వందల కొలదిగా ఉన్న దుఃఖములనెడి సర్పములు నన్ను చుట్టుముట్టినవి. గొప్ప ఆపదలో ఉన్నాను. ఓ నృసింహదేవా! దీనుడనైన నాకు చేయూతనిచ్చి యుద్ధరింపుము.

శ్లో|| సంసార భీకర కరీన్ద్ర కరాభి ఘూత - నిష్పిష్ట మర్మవ వపుషః సకలార్తి నాశః
ప్రాణ ప్రయాణ భవ భీతి సమాకులస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి  కరావలమ్బమ్ ||
తా: దుఃఖములన్నింటిని నశింపజేయునట్టి దేవా! నేను సంసారమనెడి భయంకరమగు ఏనుగునకు చిక్కితిని. అది తొండముతో కొట్టి నా శరీరమును మిక్కిలి పీడించుచున్నది. ప్రాణములు పోవునేమో యను భయముతో మిక్కిలి తల్లడిల్లుచున్నాను. ఓ లక్ష్మీ నరసింహస్వామీ కరావలంబన మొసగి, ఈ సంసార గజబాద నుండి తప్పించుము.

శ్లో || సంసార సర్ప ఘనవక్త్ర భాయోగ్ర తీవ్ర - దంష్ట్రా కరాళ విష దగ్ధ వినష్ట మూర్తే :
నాగారి వాహన! సుదాబ్ది నివాస! శౌరే ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి  కరావలమ్బమ్ ||
తా: గరుడవాహనుడవు, పాలకడలి నివాసముగా కలవాడవు, అగు ఓ శౌరీ, సంసారము క్రూరమై, కోరలయందు విషము నిండి యున్న సర్పమువంటిది. దాని కాటువలన విషము శరీరము వ్యాపించి ప్రాణము పోవుచున్నది. నీవు నా ప్రాణములు కాపాడి నన్నుద్దరింపుము.

శ్లో|| సంసార జాలపతిత స్య జగన్నివాస - సర్వేంద్రి యార్ధ బడి శాగ్ర ఝుషోపమస్య |
ప్రోత్ఖండిత ప్రాచుర తాలిక మస్తకస్య - లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్  ||
తా: సర్వలోకములు నివాసముగా కల ఓ ప్రభూ! నేను సంసారమనెడు వలలో పడితిని. ఇంద్రియార్ధములనెడు గాలమునకు చిక్కిన చేపవంటివాడును. గాలమున చిక్కిన చేప దవడలు విచ్చి తలపై కెగసి యుండునట్లు - నేనునూ బయటకు రాలేక తపించుచున్నాను. నన్నీ సంసార బాధ నుండి తొలగించి యుద్ధరింపుము.

శ్లో|| సంసార వృక్ష మఘబీజ మనంత కర్మ- శాఖాయుతం కరణ పత్ర మనజ్గ పుష్పమ్ ||
ఆరుహ్య దుఃఖ ఫలినం పతితో దయాళో - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్  ||
తా: సంసార వృక్షమునకు పాపమే బీజము. సమస్త కర్మలును శాఖలు, ఇంద్రియము లే ఆకులు. మన్మథుడే పూవులు. దుఃఖములే ఫలములు. అట్టి వృక్షము నెక్కి క్రింద పడిపోయితిని. దయాళువగు ఓ నృసింహదేవా! చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.

శ్లో || సంసార దావద హనాతురభి కరోరు - జ్వాలావలీ భి రాతి దగ్ధ తనూరు హాస్య,
త్వత్పాద పద్మ సరసీం శరణాగతస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్  ||
తా: సంసారమనెడి కారుచిచ్చు భయంకరములగు గొప్ప జ్వాలలతో నిండి పోయినది. నేను దాని నడుమ చిక్కుకొంటిని. ఆ మంటలు నా శరీర మందలి రోమములను కాల్చి వేయుచున్నవి. ఇక నా శరీరము కూడా దహింపబడును. కాన నిన్ను శరణు జొచ్చితిని. నీ పాద పద్మములనెడి సరస్సు తప్ప తాపము నేదియు చల్లార్చజాలదు. ఓ నృసింహ దేవా! కరుణించి చేయూత నొసగి, ఆ దావాగ్ని నుండి రక్షింపుము.

శ్లో|| సంసార సాగర నిమజ్జన ముహ్య మానం దీనం విలోకయ విభో! కరుణానిదే! మామ్|
ప్రహ్లాద భేద పరిహార పరావతారః లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
తా: దయానిధి వైన ఓ ప్రభూ! ప్రహ్లాదుని దుఃఖము పోగొట్టుటకు నరహరి రూపమును ధరించిన దేవా! నేను సంసార సముద్రమున పడి, మునిగి పోయి, ఉక్కిరి బిక్కిరి యగుచున్నాను. దీనావస్థలో నున్న నన్నుద్ధరింపుము.

శ్లో|| సంసార యూద గజ సంహతి సింహదంష్ట్రా - భీత స్య దుష్ట మతి దైత్య భయంకరేణ |
ప్రాణ ప్రయాణ భవభీ తినివారణే న లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
తా: ఓ నృసింహ మూర్తీ! నీ స్వరూపము దుష్ట బుద్ధులగు రాక్షసులకు మిగుల భయము కల్గించుచున్నది. సంసార సమూహములనెడి భయమును పోగొట్టునది. అట్టి రూపము ధరించి నాప్రాణములు కాపాడుమ

శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -
సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
తా: ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో  చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.

శ్లో|| బద్ద్వాగళే యమ భటా హుతర్జయన్తః కర్షంతి యత్ర భవపాశశ తైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో | లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
తా: దయాళువైన ఓ పభూ! యమ భటులు పెక్కు పాశములతో నా మెడను బంధించి, బెదరించుచూ, ఏదారిలోనో నన్నీడ్చుకొని పోవుదురు. అపుడు పరులకు లొంగి, ఒంటరినై, దిగులుపడుచుండు నాకు దిక్కెవ్వరు? నీవే నాకు చేయూత నిచ్చి రక్షింపవలయును.

శ్లో|| అన్దస్యమే హృత వివేక మహాధన స్య చొ రైర్మ హ బలిభి రిన్ద్రియ నామ దే యై:
మోహన్ద కారకుహరే వినిపాతిత స్య లక్ష్మీ నృసింహ!  మమ దేహి కరావలమ్బమ్ ||
తా:  ఓ నరసింహ ప్రభూ! మహాబలవంతులగు ఇంద్రియములనెడి దొంగలు నా వివేక ధనమును దొంగిలించుకొని, అజ్ఞానమును అంధకారపు గుహలో త్రోసివేసిరి. కన్నులు కాన రాకున్నవి. నాకు చేయూత నిచ్చి, ఆ గుహ నుండి బయటకు తీసి నన్నుద్ధరింపుము.

శ్లో|| లక్ష్మీ పతే! కమలనాభ! సురేశ! విష్ణో ! యజ్ఞేశ ! యజ్ఞ! మధు సూదన! విశ్వరూప
బ్రహ్మణ్య ! కేశవ! జనార్ధన! వాసుదేవ! లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||
తా: ఓ లక్ష్మీ పతీ ! నీవు పద్మమును నాభి యందు కలవాడవు. దేవతలకు నాయకుడవు. సర్వవ్యాపకుడవు. యజ్ఞములకు అధిపతివి. యజ్ఞ రూపుడవు. మధువను రాక్షసుని  శిక్షించినవాడవు. విశ్వరూపుడవు. బ్రాహ్మణ ప్రియుడవు. బ్రహ్మ, రుద్రుల అంశలు కలవాడవు. జన్మము లేకుండ చేయువాడవు. వసుదేవునకు పుత్రుడవై అవతరించినవాడవు. ఓ నృసింహదేవా! నాకు చేయూత నిమ్ము.

శ్లో || ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక వ్యాసాది భాగవత పుంగవ వృన్నివాస|
భక్తా సురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||
తా: ఓ దేవా ! నీవు ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, అనువారి హృదయములందు నివసించుచుందువు. భక్తులను, నీపై ప్రేమ కలవారిని కాపాడుటలో కల్పవృక్షము వంటివాడవు. ఓ నరసింహస్వామీ, నాకు చేయూత నొసగి కాపాడుము.

శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
తా: ఓ దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడు చేతితో అభయము నిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము.

శ్లో|| ఆద్యన్త శూన్య మజమవ్యయ మప్రమేయ - షూదిత్య రుద్రా నిగమాది నుత ప్రభావమ్|
త్వామ్భోది జాన్య మధులోలుప మత్త భ్రుజ్గం - లక్ష్మీ నృసింహ !  మమ దేహి కరావలమ్బమ్ ||
తా: ఓ దేవా! నీవు మొదలు, తుది లేనివాడవు, పుటకయు, నాశనమును లేనివాడవు ఇంతవాడని ఊహింప సాధ్యము సనివాడవు. వేదములు, సూర్యుడు, రుద్రుడు, మున్నగువారు నీ ప్రభావమును కీరించుచుందురు. నీవు లక్ష్మీ దేవి ముఖ పద్మము నందలి మధువు నందు ఆసక్తి గల కొదమ తుమ్మెదవు. నరసింహ స్వరూపుడవగు నీవు నాకు చేయూత నొసగి రక్షింపుము.

శ్లో|| వారాహరామ నరసింహమాది కాన్తా - క్రీడా విలోల శూలి ప్రవన్ద్య
హంసాత్మకం పత్పరమ హంస విహార లీలం - లక్ష్మి నృసింహ! మమ  దేహి కరావలమ్బమ్ ||
తా: ఓ దేవా! నీవు వరాహ, వామన, నృసింహావ తారముల నెత్తినవాడవు. లక్ష్మీదేవి మున్నగు కాంతలతో క్రీడించుట యందు ఆసక్తి కలవాడవు. బ్రహ్మ, రుద్రాది దేవతలు నీ కేప్పుడునూ నమస్క రించుచుందురు. నీవు పరమహంస రూపుడవు. ఉత్తములగు యోగుల హృదయములందు విహరించుచుందువు. ఓ లక్ష్మీ నృసింహస్వామీ! నాకు చేయూత నిమ్ము.

శ్లో|| ప్రహ్లాద మానస సరో జవిహార భ్రుజ్గ - గాజ్గ తర జ్గ ధవళాజ్గ రామా స్థితాజ్గ |
శ్రుజ్గర సజ్గర సకిరీట ల సద్వరాజ్గ - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||
తా: ఓ నరసింహదేవా! నీవు ప్రహ్లాదుని మనస్సనెడు కమలమున విహరించు తుమ్మెదయైన వాడవు. గంగాతరంగములవలె తెల్లని దేహము కలవాడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షః స్థలము కలవాడవు. శ్రుంగారము కలవాడవు. మేలైన కిరీటముతో ప్రకాశించు శిరస్శు కలవాడవు. నీవు నాకు చేయూత నిమ్ము.

శ్లో|| మాతా నృశింహశ్చ పితా నృసింహః - భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః |
విద్యా నృసింహొ ద్రవిణం నృసింహః - లక్ష్మీ నృసింహ ! మమ  దేహి కరవలమ్బమ్ ||

తా: నాకు నృసింహుడే తల్లి, నృసింహుడే తండ్రి, నృసింహుడే సోదరుడు, నృసింహుడే మిత్రుడు, నృసింహుడే విద్య, నృసింహుడే ధనము, నృసింహుడే ప్రభువు నాకు సమస్తమును ఆ నృసింహుడే !

శ్లో|| శ్రీ శజ్కరార్యర చితం సతతం మనుష్యః - స్సోత్రం పటేది హతు సర్వగుణ ప్రసన్నమ్ |
సద్యో విముక్త కలుషో మునివర్య గన్యో - లక్ష్మీ నృసింహ ! మమ  దేహి కరవలమ్బమ్ ||
తా: సమస్త గుణములతో కూడి, శంకర భాగవత్పాదులచే రచింపబడిన యీ స్తోత్రమును ఎ మనుష్యుడు ఎల్లప్పుడునూ పటించుచుండునో అతడు వెంటనే పాపములు నశించి పరిశుద్ధుడై, మునులచే పొగడబడు విష్ణులోకమగు వైకుంటమును పొందును.

శ్లో|| యన్మాయార్జిత భవ ప్రచుర ప్రవాహా - మగ్నార్త మర్త్యనివ హేషు కరావలమ్బమ్,
లక్ష్మీ నృసింహ చరనాబ్జ మధువ్రతేనా - లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలమ్బమ్ ||
తా: మాయా ప్రభావమున అజ్ఞానమునందు పడి, పెక్కు జన్మములను పొందుచూ, బాధల ననుభవించుచూ మనుష్యులకు ఈ స్తోత్రము తరించుటకు చేయూత అయినది. దీనిని లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మములకు తుమ్మెద వంటి వారగు శ్రీ శంకరాచార్యులు రచించిరి.

శ్లో|| శ్రీమాన్న్రుసింహ విభవే గరుడ ధ్వజాయ - తాపత్ర యో పశామనాయ భావౌషదాయ |
త్రుష్ణారి వృశ్చిక జలాగ్నిభుజ జ్గరోగ - లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||
తా: ఓ లక్ష్మీ నరసింహస్వామీ ! నీవు సమస్త లోకములకు ప్రభువువు. గరుడధ్వజుడవు. తాపత్రయమును నశింపజేయువాడవు. సంసారములనెడి రోగములకు ఓషదము వంటివాడవు. ఆకలి దప్పులు, తేళ్ళు, అగ్ని, జలము, పాములు, రోగములు మున్నగు వానివలన కలుగు బాధలను నశింపజేయువాడవు. పాపములు హరించు వాడవు. గురువైన వాడవు. అట్టి నీకివే మా నమస్కారములు.

                                        ఇతి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణమ్

4 comments:

  1. భుజంగ ప్రయాత నరసింహ స్తోత్రములు ఒక సారి చూసాను మీ అందుబాటులో ఉంటే పెట్టండి.

    ReplyDelete
  2. ప్రహ్లాద వరద గోవిందా..
    ఆపదోద్ధార శ్రీ లక్ష్మీనృసింహా నమో నమో _/\_

    ReplyDelete
  3. ప్రహ్లాద వరద గోవిందా..
    ఆపదోద్ధార శ్రీ లక్ష్మీనృసింహా నమో నమో _/\_

    ReplyDelete
  4. అయ్యా, శ్రీ రామ ఆపదద్ధారక స్తోత్రము నకు తాత్పర్యము నివ్వవలసినదిగా వినతి.

    ReplyDelete