వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలొ సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు.
మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఆ ఋషుల దెగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటె, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.
తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||
వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె................
కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||
ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.
నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........
ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.
చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||
ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.
ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ బ్రాహ్మణుడా! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి......
"నిషాద" అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటె లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.
బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు.
వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంబించారు. తరవాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశలతో పాడించారు. వాళ్ళు తరవాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు.........
కథ ప్రారంభం
రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు.............
పూర్వకాలంలొ కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలొ. ఏ ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలొ లేడు.
దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలొ పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.
ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు.
దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలా అన్నాడు...........
సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం |
ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||
పూర్వకాలంలొ ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు............ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతొ అన్నాడు.ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలొ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు.
అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటె, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.............పూర్వకాలంలొ విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దెగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటె విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలొ వర్షాలు పడడం మానేశాయి. దేశంలొ క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలొ అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.
వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.
ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే..........
తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||
ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జెరిపించారు.
కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితొ ఇలా అన్నాడు...మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా, అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.
అలా కొంత కాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దెగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.......అయ్యా! నేను సంతానహీనుడిని, నాకు చాలా దిగులుగా ఉంది, నాకు సంతానం కలగకుండ ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందొ, ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేథ యాగాన్ని మీరు నాతొ చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్ధించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు......యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందొ ఆనాడే నీకు మంచి జెరగడం మొదలయ్యింది. కావున నీకు శూరులు, లోకముచేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు.
చైత్ర మాసంలొ చిత్రా నక్షత్రంతొ వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి, దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది, దాని వెనకాల మహా శూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటె ఫాల్గుణ మాసంలొ వచ్చె అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టారు. పల్లెటూర్లనుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు.
సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః |
న చ అవజ్ఞా ప్రయోక్తవ్యా కామ క్రోధ వశాత్ అపి ||
పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకిలోనై అనరాని మాటలు మాట్లాడితే, మీరు నవ్వి వచ్చెయ్యండి, పట్టించుకోమాకండి. భోజనం చెయ్యడానికి పంక్తిలొ కూర్చున్నవాడు అతిధి రూపంలొ ఉన్న సాక్షాత్తు భగవంతుడు, కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశి రాజు, రోమపాద రాజు, కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి, అందరికి విడిది ఏర్పాటుచెయ్యండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెడుతున్నారు....
వృద్ధాః చ వ్యాధితాః చ ఏవ స్త్రీ బాలాః తథా ఏవ చ |
అనిశం భుంజమానానాం న తృప్తిః ఉపలభ్యతే ||
అక్కడికి వచ్చినవాళ్ళల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా, ఆహ! భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళి ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరిని చూసి, ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికి ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు. వచ్చినవాళ్ళందరూ "ఆహ! ఎంతచక్కని భోజనం పెట్టావు రాజ, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్య, నీ కోరిక తీరి, నీకు సుపుత్రులు కలిగి, నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు.
ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు, ఆ యాగశాలలొ 21 యూప స్తంభాలని పాతారు, మారేడు కర్రలతొ చేసినవి 6, మోదుగు కర్రలతొ చేసినవి 6, ఛండ్ర కర్రలతొ చేసినవి 6, దేవదారు కర్రలతొ చేసినవి 2 మరియు శ్లేష్మాతక కర్రతొ చేసినది ఒకటి ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందిన వాడు కనుక, దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జెరుగుతుంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య మూడు కత్తులతొ ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలొ కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి.
మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి, రాజు 4 భార్యలని దానం చెయ్యాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ నలుగురు భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని(ధనం) దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలోనుంచి వప(జంతువుల కడుపులొ బొడ్డు కింద వుండే ఉల్లిపొర వంటి కొవ్వు) ని తీసి ఆ అగ్నిలొ వేశారు. ఆ వప అగ్నిలొ కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి, దీనినె అశ్వమేథయాగం అంటారు. అలా పీలిస్తే, తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందొ, ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలొ హవిస్సుగా సమర్పిస్తారు.
దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేథయాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు, అప్పుడు వాళ్ళు మేము ఈ భూభారాన్ని వహించాలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణలేని యాగం జెరగకూడదు కనుక, దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలని దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి....ఓ రాజా! నీకు సంతానం కలగడం కోసం, నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన యిష్టిని చేయిస్తాను. అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ యిష్టి చెయ్యడం ప్రారంభించారు.......
తతో దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమ ఋషయః |
భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి ||
ఆ యిష్టి జెరుతున్నప్పుడు, అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దెగ్గరికి వెళ్లి, " పితామహ! మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు, మీరు ఇచ్చిన వరముల వలన గర్వంపొంది వాడు ఈనాడు.....
నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః |
చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ||
రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దెగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది, ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జెరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించె మార్గం చెప్పవలసింది" అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు " నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు" అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు.
ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలొ తనంతట తానుగా వచ్చారు....
ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః |
శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః ||
ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందొ, అందమైన రూపంతొ, మెడలొ వైజయంతి మాలతొ, శంఖ చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు......
హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం |
దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ ||
వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం |
ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్ ||
మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అక్రుత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు.
తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం |
పితరం రోచయామాస తదా దశరథం నృపం ||
నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు.
అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలొ వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమిచెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు " నాయనా దశరథా! నన్నుప్రాజాపత్ర్య పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు, ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతొ ఉంటారు" అని చెప్పి వెళ్ళిపోయాడు.
వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలొ సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు.
యాగం పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. రుష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా రుష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరిని తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు.
కొంత కాలానికి దశరథ మహారజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు.
తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |
నక్క్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు ||
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ |
ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ||
జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కారింపబడే వాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి, చైత్ర మాసంలొ, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలొ, కర్కాటక లగ్నంలొ రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలొ కైకేయకి పుష్యమి నక్షత్రంలొ, మీన లగ్నంలొ భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.
తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జెరుపుకున్నారు. అదే సమయంలొ బ్రహ్మ గారు దేవతలతొ ఒక సభ తీర్చారు......" శ్రీమహా విష్ణువు భూలోకంలొ రాముడిగా అవతరించారు, రావణసంహారంలొ రాముడికి సహాయం చెయ్యడానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యలవల్ల సంతానం కలగదు, కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీలందు కనండి" అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు.
అప్పుడు బ్రహ్మ " ఒకసారి నాకు ఆవలింతవచ్చింది, అప్పుడు నా నోట్లోనుంచి ఒకడు కిందపడ్డాడు, అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి" అని అన్నారు. ఇంద్రుడి అంశతొ వాలి జన్మించాడు, సూర్యుడి అంశతొ సుగ్రీవుడు జన్మించాడు, బృహస్పతి అంశతొ తారుడు జన్మించాడు, కుబేరుడి అంశతొ గంధమాదనుడు జన్మించాడు, అశ్విని దేవతల అంశతొ మైందుడు, ద్వివిదుడు జన్మించారు, అగ్ని అంశతొ నీలుడు జన్మించాడు, వాయువు అంశతొ హనుమంతుడు జన్మించాడు, పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుషేణుడు జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చుసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరాలని సృష్టించారు.
అతీత్య ఏకాదశ ఆహం తు నామ కర్మ తథా అకరోత్ |
జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీ సుతం ||
సౌమిత్రిం లక్ష్మణం ఇతి శత్రుఘ్నం అపరం తథా |
వసిష్ఠః పరమ ప్రీతో నామాని కురుతే తదా ||
రాముడు పుట్టిన 11 రోజులకి జాతాసౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు కులగురువైన వశిష్ఠ మహర్షి, సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయెదరు కనుక ఆయనకి రామ (రా అంటె అగ్ని బీజం, మ అంటె అమృత బీజం) అని, సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు (రామ సేవే ఆయన లక్ష్మి) కనుక ఆయనకి లక్ష్మణ అని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని, శత్రువులను (అంతః శత్రువులు) సంహరించగలవాడు కనుక శత్రుఘ్ను అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి.
తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటె వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడు గురువులని పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవాళ్ళు. రాముడు జులపాల జుట్టుతొ రాజమార్గంలొ వెళుతుంటె చూసిన దశరథుడికి తను యవ్వనంలొ ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక లేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు.
అలా కొంతకాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు సభలొ ఇలా అన్నారు " నా పిల్లలకి 12 సంవత్సరాల వయస్సు దాటింది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, కాబట్టి వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం, మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు, కాబట్టి మీ కోరికేదైన నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు " దశరథ! నీకు సామంత రాజులందరూ లొంగి ఉన్నారా, దానధర్మాలు సక్రమంగా చేస్తున్నావా, మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా అని పలు కుశల ప్రశ్నలు వేసి, నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి" అన్నాడు.
స్వ పుత్రం రాజ శార్దూల రామం సత్య పరాక్రమం |
కాక పక్ష ధరం శూరం జ్యేష్ఠం మే దాతుం అర్హసి ||
నీ పెద్దకొడుకైన రాముడిని నాతో పంపిస్తావా, మా యాగాలకి అడ్డువస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకు వెళతాను, అని విశ్వామిత్రుడు అన్నాడు. ఈ మాట విన్న దశరథుడు కిందపడిపోయాడు.
ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః |
న యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసైః ||
మెల్లగా తేరుకొన్న దశరథుడు, ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు, ఆ రాక్షసులని ఎలా సంహరించగలడ, కావాలంటె నేను నా చతురంగ బలాలతొ వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను, పోనీ రాముడే రావాలంటె, రాముడితొ నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు.
రాముడు పిల్లవాడు, ఏమిచెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు, కాని రాముడంటె ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగివస్తాడు. నువ్వు తండ్రివి కనుక, నీకు రాముడిమీద ఉన్న పుత్రవాత్సల్యంవల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు.
అప్పుడు దశరథుడు " లేక లేక పుట్టిన నా కొడుకుని, నన్ను విడిచిపెట్టు " అన్నాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడుకి ఆగ్రహం వచ్చి, " చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక, మాట తప్పిన ధర్మం తెలియని దశరథా, పుత్ర పౌత్రాదులతో సుఖముగా, శాంతిగా జీవించు" అని వెళ్ళిపోతున్నాడు. వెంటనే వశిష్ఠుడు లేచి, విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితొ ఇలా అన్నాడు " ఇంత కాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడవని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి, దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అనిపించుకుంటావ? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటె ఎవరో తెలుసా......
ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః |
ఏష విద్య అధికో లోకే తపసః చ పరాయణం ||
ఈ లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు, ఈ లోకంలోని తపస్సు అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, ఈ లోకంలోని బుద్ధి అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాసించింది, కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్ర-శస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కాని రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి ధారపొయ్యాలని ఆయన ఆశ, ఎందుకు అడ్డుపడతావు" అని అన్నాడు.
దశరథుడు అంతఃపురంలోకి వెళ్లి రాముడిని తీసుకురా అని కౌసల్యతో చెప్పాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. స్వస్తి వాచకం చేసి, కౌసల్య రాముడిని పంపింది. సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముడి మూర్ధ్ని భాగం మీద ముద్దు పెట్టాడు. చాలా సంతోషంతొ నా కొడుకుని మీ చేతులలొ పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటె అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరారు.
విశ్వామిత్రుడి వెనక రాముడు, లక్ష్మణుడు కోదండాలు పట్టుకుని వెళుతున్నారు. బ్రహ్మగారు అశ్విని దేవతలతొ వెళితె ఎలా ఉంటుందొ, స్థాణువైన శివుడి వెనకాల విశాఖుడు, స్కందుడు వెళితె ఎలా ఉంటుందొ, అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు వెళుతున్నారని వాల్మీకి పోల్చారు. వాళ్ళు అలా సరయు నది దక్షిణ తీరంలొ కాలినడకన ఒకటిన్నర యోజనాలు ప్రయాణించాక చీకటి పడడం వల్ల ఒక ప్రాంతంలొ విశ్రమించారు.
అప్పుడు విశ్వామిత్రుడు......
గృహాణ వత్స సలిలం మా భూత్ కాలస్య పర్యయః ||
మంత్ర గ్రామం గృహాణ త్వం బలాం అతిబలాం తథా ||
బ్రహ్మ దేవుని కుమార్తెలైన బల, అతిబల అనే రెండు మంత్రాలని రాముడికి ఉపదేశించాడు. ఈ రెండు విద్యల వల్ల ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు, నువ్వు నిద్రపోతునప్పుడు కాని నిద్రపోనప్పుడు కాని రాక్షసులు నిన్ను ఏమి చెయ్యలేరు, దీనితో పాటు నీకు సమయస్పూర్తి, జ్ఞాపక శక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు. తరవాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలని ఉపదేశించాడు. దర్భగడ్డి పరిచి ఇద్దరినీ దాని మీద పడుకోమన్నాడు. ఇద్దరు హాయిగా పడుకున్నారు.
విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దెగ్గరికి వచ్చి చూశాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆహా! ఏమి నా అదృష్టం అనుకొని......
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||
కౌసల్య యొక్క కుమారుడైన రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున్న చేసే పూర్వ సంధ్యా వందనం చెయ్యాలి. రాక్షసులను సంహరించె నువ్వు నరులలొ శార్దూలం వంటివాడివి, దైవీ సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు, అందుకని రామా నిద్రలే.
రామలక్ష్మణులిద్దరూ నిద్ర లేచి చెయ్యవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్ళి బయలుదేరి గంగ-సరయు సంగమ స్థానం దాక వెళ్లారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి, అది ఎవరిదని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణ ప్రయోగం చెయ్యబోతే, శివుడు తన మూడవ కంటితొ మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే, మన్మధుడి అంగములన్ని కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు. శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసినవాళ్ళ దెగ్గరినుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేనివాళ్ళు. కాబట్టి రామ ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకొ " అని చెప్పాడు.
మరుసటి రోజున ఆ ఆశ్రమంలొ ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మనులకి పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురూ ఆ పడవలొ ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగా నదిలొ వెళుతుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు '' ఒకనాడు బ్రహ్మ గారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుంచి ప్రవహించినదె సరయు నది. పవిత్రమైన ఆ సరయు నది ఈ ప్రాంతంలొ గంగా నదితో సంగమిస్తుంది, కాబట్టి ఒకసారి ఆ నదీ సంగమానికి నమస్కరించమన్నాడు". అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యంగుండా తమ ప్రయాణం కొనసాగించారు.
అలా వాళ్ళు వెళుతుంటె అక్కడున్న అరణ్యంలొ ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి, పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా, ఆయన ఇలా చెప్పారు " పూర్వము ఇక్కడ మలదము, కరూషము
అని రెండు జనపదాలు ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ, ఆమె ఒక యక్ష కాంత, రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది, అందుకనే ఇక్కడ ఎవరూ లేరు" అన్నాడు . అప్పుడు రాముడు, అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు, వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఆ బ్రహ్మహత్యా పాతకం వల్ల ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి, ఆయనకి శరీరంలొ మలం పుట్టడం ప్రారంభమయ్యింది, అలాగె ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ రెండు లక్షణాలని తొలగించారు. కాని ఆ రెండు భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కరూషము అనే రెండు జానపదములుగా వర్ధిల్లుతాయి, ఇక్కడున్న ప్రజలు సుఖసంతోషాలతొ ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు.
అలాగే పూర్వ కాలంలొ సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతె బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను, ఒక కూతురుని ఇస్తాను, ఆమె కామరూపి, మహా అందగత్తె, ఆమెకి 1000 ఏనుగుల బలముంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడుకి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి మారీచుడు జన్మించాడు. 1000 ఏనుగుల బలం ఉండడం వలన, గర్వంతొ, అరణ్యంలొ ఇష్టమొచ్చినట్టు తిరిగేవాళ్ళు. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించారు. ఇది గమనించిన తాటక తన కుమారుడితొ కలిసి అగస్త్య మహర్షి మీదకి వచ్చింది, అప్పుడాయన తాటకని, ' నీకు వికృతరూపంవచ్చుగాక ' అని, మారీచుడిని ' ఇవ్వాల్టినుంచి రాక్షసుడివి అవుతావని ' శపించారు. ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తుంది, ఆమె నరమాంస భక్షనకి అలవాటుపడింది, అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి రామ, నువ్వు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి. నువ్వు చేసే పని దోషమే అయినా, ప్రజాకంటకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి. పూర్వకాలంలొ మందర అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు, అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీమహా విష్ణువు ఆమెని సంహరించారు. నువ్వు కూడా ఈ తాటకని సంహరించు " అని విశ్వామిత్రుడు అన్నాడు.
అప్పుడు రాముడు.......
పితుర్ వచన నిర్దేశాత్ పితుర్ వచన గౌరవాత్ |
వచనం కౌశికస్య ఇతి కర్తవ్యం అవిశఙ్కయా ||
గో బ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ |
తవ చైవ అప్రమేయస్య వచనం కర్తుం ఉద్యతః ||
"మా తండ్రిగారు మీరు ఏది చెయ్యమంటె అది చెయ్యమన్నారు, గురువుగారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం, బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడనైన నేను తాటకని తప్పక సంహరిస్తాను" అని రాముడు అని తన ధనుస్సు తీసుకొని ధనుష్టంకారం చేశాడు, ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందొ అటు వైపు బయలుదేరింది. తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది. తాటకని చూసిన రాముడు లక్ష్మణుడితొ, ఈ తాటకని ఓ మోస్తారు వాళ్ళు చూస్తే గుండె ఆగి చనిపోతారు లక్ష్మణా " అన్నాడు.
ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకి దూకింది, అప్పుడాయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది, వెంటనే తన మాయతొ రాళ్ల వర్షం కురిపించింది, ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితొ ఇంక ఉపేక్షించి లాభం లేదు, తొందరగా ఆమెని సంహరించు అన్నాడు. ఎంతైనా ఆడది కదా, ముందు దీని గమన శక్తిని కొట్టేద్దాము, అప్పుడన్నా మారుతుందేమో చూద్దాము అని రాముడు కాళ్ళు, చేతులు, లక్ష్మణుడు ముక్కు, చెవులు నరికారు. అప్పుడు ఆ తాటక మాయారూపం పొంది మాయం అయిపోయింది. అదృశ్యమైన ఆ తాటక భారి శరీరంతొ రాముడి మీద పడబోతుంటే, రాముడు ఒక బాణం ప్రయోగించి ఆ తాటకని సంహరించగా, దాని రక్తం ఏరులై ప్రవహించింది. పైనుండి దేవతలు చూసి, హమ్మయ్య! తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు. వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దెగ్గరకి వచ్చి, ఇంత ధైర్యం ఉన్న వాడి దెగ్గర అన్ని అస్త్ర-శస్త్రాలు ఉండాలి, కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణులకి ఉపదేశించు అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయశిరోనామం అనే అస్త్రాన్ని, క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు. అలాగే కంకాళం, ఘోరం, కాపాలం, కంకణం అనే నాలుగు ముసలముల మంత్రోపదేశం చేశాడు. అలాగే ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, మానవాస్త్రం, వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, ఐషీకాస్త్రం, గాంధర్వాస్త్రం, నారాయణాస్త్రం, రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి, రెండు అద్భుతమైన గధలని, నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఈ అస్త్రాలన్నీ పురుష రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి, మేము మీ కింకరులము, మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని అడిగాయి. మీరందరూ నా మనస్సులోకి వెళ్లి అక్కడ తిరుగాడుతూ ఉండండి, నేను పిలిచినప్పుడు బయటకి రండి అని ఆదేశించాడు. అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి.
మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితొ....... మీరు నాకు ఇన్ని అస్త్రాలని ఉపదేశించారు, అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు. విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలని చెప్పాక ఇంకొన్ని అస్త్రాలని కూడా ఉపదేశించాడు. అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వెళుతుండగా అక్కడొక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా, విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి తన ప్రరాక్రంతొ ఇంద్రుడిని నిర్బంధించాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు వామన మూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు. ఆ వామన మూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం, దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు, ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా, ఉపేంద్రుడిగా పుట్టారు. నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే " అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోకి వెళ్లారు.
ఆ సిద్ధాశ్రమంలొ యాగం ప్రారంభించారు, ఈ యాగం 6 రాత్రుళ్ళు 6 పగళ్ళు జెరుగుతుంది, కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగం చక్కగా జెరిగింది, 6 వ రోజున ఆ అగ్నిహొత్రం ఒక్కసారి భగ్గున పైకిలేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుండి మారీచ సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహొత్రంలోకి రక్తం పోశారు. వెంటనే రాముడు మానవాస్త్రంతొ మారీచుడిని కొట్టాడు, ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరం వెళ్లి పడ్డాడు. సుబాహువుడిని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితె, వాడు గుండెలు బద్దలై, నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు. మిగతా రాక్షసులందరిని వాయువ్యాస్త్రంతో నిర్జించారు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు.
మిథిలా నగరంలొ జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు, కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి, అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితొ చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు.
అలా వాళ్ళు ప్రయాణిస్తూ శోణానది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు, ఆ ప్రాంతం ఫలాలు, పుష్పాలతొ చాలా శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత ఆనందంగా, అందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వకాలంలొ బ్రహ్మ కుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసురాజు అనే నలుగురు కుమారులు కలిగారు. ఆ నలుగురు యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, " మీరు నలుగురూ నాలుగు నగరాలని నిర్మాణం చెయ్యండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి " అని ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు కౌశాంబీ, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజపురము అనే నాలుగు నగరాలని నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరివ్రజపురములొ. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలొ ఉంది, శోణానది ఈ 5 పర్వతాల మధ్యలొ ప్రవహిస్తుంది, అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది.
కుశుడి రెండవ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరుకుడా ఘ్రుతాచి అనే అప్సరసకి, కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు, మెరుపుతీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్లి పాటలు పాడుకుంటూ, వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలొ అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు, కాని మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలొ ఎంతోకాలం ఉండలేరు, కొంత కాలానికి మీ యవ్వనంతొ పాటు మీ అందం కూడా నశిస్తుంది, కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నన్ను పెళ్ళిచేసుకుంటె మీరు కూడా నిత్య యవ్వనంలొ ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు ఏక కంఠంతో.........
కుశనాభ సుతాః దేవం సమస్తా సుర సత్తమ |
స్థానాత్ చ్యావయితుం దేవం రక్షామః తు తపో వయం ||
మా భూత్ స కాలో దుర్మేధః పితరం సత్య వాదినం |
అవమన్యస్వ స్వ ధర్మేణ స్వయం వరం ఉపాస్మహే ||
పితా హి ప్రభుర్ అస్మాకం దైవతం పరమం చ సః |
యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||
మాదెగ్గర అపారమైన తపఃశక్తి ఉంది, కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము, మేము తలుచుకుంటె నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి నిన్ను తొలగించగలము. మాకు పెళ్ళంటూ జెరిగితె, అది ధర్మాత్ముడైన మా తండ్రిగారు ఎవరిని చూపించి చేసుకోమంటె వాళ్లనే చేసుకుంటాము కాని మా అంతట మేము నిర్ణయించుకోము, ఈ దేశంలొ ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏక కంఠంతొ చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరములలోకి ప్రవేశించి వారి అవయవములందు సంకోచత్వం కల్పించాడు, దానివల్ల వారందరూ అవయవముల పటుత్వం కోల్పోయారు.
తరవాత ఆ కన్యలందరూ కుశనాభుడి దెగ్గరికి వెళ్లి జెరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, " అమ్మా! మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని...............
క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః |
క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్ ||
స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. అమ్మా! నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు, మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు, అందం అంటె ఇది. ఓర్పె దానం, అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పె, ఓర్పుకి మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఆ ఓర్పు వల్లనె ఈ భూమి నిలబడుతోంది " అని చెప్పాడు.
అదే సమయంలొ చూళి అనే ఒక మహర్షికి, ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతొ....... నేను నీకు ఏమిచెయ్యగలను అని అడిగారు. అప్పుడామె.......నేను ఎవరికీ భార్యని కాను, కాని అపారమైన తపఃశ్శక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన, శారీరిక సంపర్కం లేకుండా, మానసికమైన తపఃఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానస పుత్రుడిని సోమదకి ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు, కాపిల్యము అనే నగరంలొ ఉండేవాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జెరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటె ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి, వాళ్ళు మళ్ళి పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది" అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.
ఈ వృత్తాంత్తం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు. అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగా నదిని సమీపించారు, అందరూ గంగని చూడగానె ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు మొదలగువారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి, అగ్నిహొత్రం చేసి ఒడ్డున కూర్చొని, మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు...." కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు, కాని కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు, ఆ యాగం జెరుగుతుండగా కుశనాభుడి తండ్రైన కుశమహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, గాధి అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశ పేరు నిలబెడతాడు" అన్నాడు.
నేను ఆ గాధి యొక్క కుమారుడినే రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు.
స పితా మమ కాకుత్స్థ గాధిః పరమ ధార్మికః |
కుశ వంశ ప్రసూతో అస్మి కౌశికో రఘునందన ||
అప్పుడు విశ్వామిత్రుడు..... " నేను కుశ వంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు ఋచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద, మా అక్కకి దెగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చెయ్యడానికి వచ్చాను, నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను " అని రాముడితొ చెప్పాడు.
అక్కడే ఉన్న ఋషులు అప్పుడు.........
విశేషేణ భవాన్ ఏవ విశ్వామిత్ర మహాయశః |
కౌశికీ సరితాం శ్రేష్ఠః కుల ఉద్యోతకరీ తవ ||
నీవంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది, మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అయ్యింది అని అన్నారు.
అప్పుడు రాముడు గంగకి త్రిపథగ అన్న నామం ఎలా వచ్చిందొ చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు...... " పూర్వకాలంలొ హిమవంతుడు అనే పర్వత రాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవాహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలొ ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయ్యి, హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది, 3 లోకములలొ ప్రవహించినది కనుక గంగని త్రిపథగ అని పిలుస్తారు" అని విశ్వామిత్రుడు చెప్పాడు.
మీరు విషయాలని మనస్సుకి అతుక్కున్నేటట్టు చెప్పగలరు, కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు...." పార్వతి పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది, పార్వతీదేవి - శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి, కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటకి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామీ! మీరు పార్వతీదేవితో 100 దివ్యసంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు, మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే, మేము ఎవరము దానిని తట్టుకోలేము, కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు.
వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు, కాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు.....
యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి |
మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున.....
అపత్యం స్వేషు దారేషు న ఉత్పదయితుం అర్హథ |
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||
ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |
అవనే న ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||
న చ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||
మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి, ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు, భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.
వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.
శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు, తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలీక బ్రహ్మగారి దెగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు - మనోరమల కుమార్తెలైన గంగా - పార్వతులకి తేడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే, పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడా దేవతలు గంగమ్మ దెగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దెగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది.
అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి, ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము, సీసము పుట్టాయి, ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి, మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్ని పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా, శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా, పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు( కృత్తికల పుత్రుడు ) అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము అన్నారు. దేవతలు సరే అన్నారు.
తతః తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ |
పుత్రః త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః ||
ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు, ఏక కాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్నిసంభవహా అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక, స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక, అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్ధాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు" అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.
గంగ అసలు భూమి మీదకి ఎందుకొచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడు, ఆయనకి కేశిని, సుమతి అని ఇద్దరు భార్యలు. సుమతి గరుక్మంతుడి సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు స్రవణాన్ని చేరుకొని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగు స్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న ఇద్దరు భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు, రెండవ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేశిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగగా, ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు. పెద్ద భార్య అయిన కేశిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది, నాకు మహొత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు.
కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనే వాడు పుట్టాడు, రెండవ భార్యకి ఒక సొరకాయ పుట్టింది, ఆ సొరకాయ కిందపడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు, వాళ్ళందరిని కలిపి సగరులు అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రొజూ రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయు నదిలోకి తీసుకెళ్ళి, నీళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి.....
ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః ||
పౌరాణాం అహితే యుక్తః పిత్రా నిర్వాసితః పురాత్ ||
తప్పు చేసినవాడు కొడుకైనా సరే, అతనివల్ల ప్రజలకి కీడు జెరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడిని తన దెగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి. అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేథ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడా సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది, కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండని చెప్పి పంపాడు. వజ్రాల్లాంటి తమ గొళ్ళతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దెగ్గరికి వెళ్లి................దేవా! సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మ దేవుడు..........మీరెవరు కంగారు పడమాకండి, ఈ భూమంతా శ్రీమహా విష్ణువుది, కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు, ప్రస్తుతం ఆయన పాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు.
కాపిలం రూపం ఆస్థాయ ధారయత్య అనిశం ధరాం |
తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజా ||
ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వాళ్ళు సగరుడికి వద్దకు వెళ్ళి జెరిగినది చెప్పారు. నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళం దాక తవ్వెయ్యండని చెప్పి వాళ్ళని మళ్ళి పంపాడు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి, ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశా గజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్ళగా, వాళ్ళకి మహా పద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది, అలాగే పడమర దిక్కున సౌమనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు. నాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు. ఈ సారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలొ సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగాలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగుతీసారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక 'హుం'కారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు.
ఎంతకాలమైన సగరులు రాకపోయేసరికి, ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జెరగలేదు కనుక నీళ్ళు తీసుకువద్దామని బయలుదేరగా, ఆ సగరుల మేనమామ అయిన గరుక్మంతుడు ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. సరే అని ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధ పడ్డాడు. తరవాత ఆయన ఒక 30,000 వేల సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు, ఆయన తరవాత అంశుమంతుడు రాజయ్యాడు, ఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తరవాత వచ్చిన దిలీపుడు 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు కాని గంగని తీసుకురాలేకపోయాడు. దిలీపుడి తరవాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పి, గోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరాలు తపస్సు చేయగా, ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు. అప్పుడు భగీరథుడు " నాకు కుమారులు లేరు, కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అన్నాడు, అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు" అన్నాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు " నీ మొదటి కోరికని నేను తీరుస్తాను, కాని గంగని భూమి మీదకి వదిలితే, దాన్ని పట్టగలిగేవాడు ఎవడూ లేడు, కేవలం శివుడు తప్ప. కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి, ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను" అని అన్నాడు.
అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బొటనువేలి మీద నిలబడి ఒక సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి, నీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరస్సు మీద పడతాను అన్నాడు. అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి, రెండు చేతులు నడుము మీద పెట్టుకొని, కాళ్ళని చాపి, తన జటాజూటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. నా ప్రవాహంలో ఈ శంకరుడిని కూడా పాతాళం దాకా తీసుకుపోతాను, ఈయన నన్నేమి పట్టగలడు అనుకుంది గంగ. అలా అనుకొని ఆకాశం నుంచి శంకరుడి జటాజూటంలోకి జారింది. అలా ఆ గంగ ఒక సంవత్సరం పాటు పడుతూనే ఉంది, కాని శంకరుడి శిరస్సు నుండి ఒక చుక్క నీరు కూడా నేల మీద పడలేదు. అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు శంకరుడిని ప్రార్ధించగా, ఆయన ఆ గంగని బిందుసరోవరంలో వదిలాడు. అప్పుడు ఆ గంగ హ్లాదినీ, పావనీ, నళిని అని మూడు పాయలుగా తూర్పుదిక్కుకి వెళ్ళింది, సుచక్షువు, సీతా, సింధువు అని మూడు పాయలుగా పడమరదిక్కుకి వెళ్ళింది, ఆ ఏడవ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది. రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించింది. గంగతో పాటు మొసళ్ళు, తాబేళ్లు, చేపలు ఆ గంగలో ప్రవహించాయి. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూడడానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు, పాపాలు చేసిన వాళ్ళు ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారు. కొందరు శంకరుడి పాదాల దెగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్ళు తల మీద జల్లుకొని తమ పాపాలు పోగొట్టుకున్నారు.
అలా వెళుతున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతా మింగేశారు. భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమి లేదు. వెంటనే భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ళ మీద పడి ప్రాధేయపడగా, ఆయన గంగని తన చెవులలోనుంచి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవులనుంచి వచ్చింది కనుక గంగని జాహ్నవి అని పిలిచారు. అలా భగీరథుడి వెనకాలే ప్రయాణించి పాతాళ లోకంలో ఉన్న ఆయన పితృదేవతల భస్మాల మీద నుంచి ప్రవహించింది. గంగ యొక్క ప్రవాహం తగలగానే ఆ సగరులు స్వర్గానికి వెళ్ళారు.
స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని మందాకినీ అని, భూమి మీద భాగీరథి అని, పాతాళ లోకంలో భోగవతి అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగావతరణం గూర్చి చెప్పాడు.
ఆ రాత్రి అక్కడే గడిపి, మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గూర్చి చెప్పమంటే, విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు " పూర్వం కృత(సత్య) యుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలైన అదితి మరియు దితి సంతానమైన దేవతలు, దైత్యులు ఎంతో సఖ్యతగా, ధార్మికంగా జీవించేవారు. అలా కొంత కాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది. కాబట్టి క్షీర సాగరాన్ని మధిస్తే అందులోనుంచి అమృతం పుడుతుంది, అది తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు, కావున ఆ సాగర మధనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా అందులోంచి ముందు హాలాహలం పుట్టి అది దేవతలని, రాక్షసులని, మనుషులని, ఈ జగత్తు మొతాన్ని నాశనం చెయ్యసాగింది. అప్పుడా దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్లి ఆయనను రక్షించమని ప్రార్ధించారు. శంకరుడు బయటకి రాగా, ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చినదాన్ని అందరికన్నా పూజ్యనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేలగా తాగాడు. అన్ని లోకాలని కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక పొక్కు రాలేదు, కళ్ళు ఎరుపెక్కలేదు, ఆయన మెడలో ఉన్న పిల్ల పాములు కూడా అటూ ఇటూ కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. సంతోషించిన దేవతలు మళ్ళి ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతోపాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు. అప్పుడాయన కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపు పై పెట్టుకొని పైకి తెచ్చారు. అప్పుడు మళ్ళి చిలకడం ప్రారంభించారు. అప్పుడు అందులోంచి నురగలు వచ్చాయి, ఆ నురగల నుంచి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకి సేవ చేసే పరిచారికలు కూడా కొన్ని కోట్లమంది వచ్చారు.
అప్సు నిర్మథనాత్ ఏవ రసాత్ తస్మాత్ వర స్త్రియః |
ఉత్పేతుః మనుజ శ్రేష్ఠ తస్మాత్ అప్సరసో అభవన్ ||
షష్టిః కోట్యో అభవన్ తాసాం అప్సరాణాం సువర్చసాం |
అసంఖ్యేయాః తు కాకుత్స్థ యాః తాసాం పరిచారికాః ||
అలా వచ్చిన అందమైన అప్సరసలని, దేవత రాక్షసులలో ఎవరూ కోరలేదు. అందుకని వాళ్ళు దేవ వేశ్యలు అయ్యారు. తరువాత అందులోనుంచి వరుణుడి కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు కాబట్టి వాళ్ళని సురులు అని పిలుస్తారు, రాక్షసులు ఆ సురరాసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అంటారు. ఆ వారుణిని సేవించలేదు కనుక రాక్షసుల మనస్సులు ఎప్పుడు సంతోషంగా ఉండవు. తరువాత వచ్చిన ఉచ్చైఃశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు, అలానే కౌస్తుభాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించారు. తరవాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు, చివరగా విష్ణు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు.
కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా అనింది.........నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులని చంపారు. నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, దీనికంతటికి దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం. కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది. అయితే నువ్వు సౌచంగా( భౌతికంగా, మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండడం) ఒక 1000 సంవత్సరాలు ఉండగలిగితే, నీకు ఈ లోకాలని శాసించగల, ఇంద్రుడిని సంహరించగల కొడుకు పుడతాడు అని కశ్యపుడు అన్నాడు.
దితి సరే అని శుక్లప్లవనము అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చెయ్యడం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దెగ్గరికి ఇంద్రుడు వచ్చి, నేను నీకు సేవ చేస్తాను అమ్మ అన్నాడు. దితి సరే అనడంతో రోజూ ఫలాలు తీసుకోచ్చేవాడు, రోజు తన తల్లి కాళ్ళు పట్టేవాడు. అలా 990 సంవత్సరాలు పూర్తయ్యాయి.
ఒక రోజు, మిట్ట మధ్యాహ్నం వేళ, దితి తన జుట్టుని విరబోసుకొని కూర్చుంది. బాగా అలసిపోవడం చేత ఆమె శిరస్సు కొంచెం ముందుకి వంగింది, అప్పుడామె జుట్టు పాదాలకి తగిలింది. అలా తగలడం చేత ఆమె సౌచం పోయింది. ఇలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని 7 ముక్కలు చేశాడు. అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకద్దు నరకద్దు అని అరిచింది, ఆ ఏడుపు దితికి వినబడి, దితి కూడా నరకద్దు అని అనింది. అప్పుడు ఇంద్రుడు బయటకి వచ్చి, నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అని అన్నాడు. నాయందు సౌచం పోయింది కనుక నువ్వు నా పిండాన్ని నరకడంలో తప్పులేదు, కాని నా పిండాలకి దేవతా స్వరూపం ఇచ్చి వాటిని వాయు స్కంధాలకి అధిదేవతలగా ఉండే వరం ఇవ్వమని దితి కోరింది. ఇంద్రుడు సరే అని బ్రహ్మలోకంలోని, ఇంద్రలోకంలోని, అంతరిక్షంలోని వాయు స్కంధాలతో పాటు నాలుగు దిక్కులకి వాయు స్కంధాలుగా ఉండే వరం ఇస్తున్నాను అని అన్నాడు. ఆ ఏడుగురిని మరుత్తులు అని పిలుస్తారు.
రామా! ఆనాడు దితి 990 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం. ఈ నగరాన్ని మొదట ఇక్ష్వాకు రాజు పరిపాలించాడు. ఆయన భార్య అయిన అలంబుష వల్ల వాళ్ళకి విశాలుడు జన్మించాడు. ఆ విశాలుడికి హేమచంద్రుడు, హేమచంద్రుడికి సుచంద్రుడు, సుచంద్రుడికి ధూమ్రాశ్వుడు, ధూమ్రాశ్వుడికి సృంజయుసుడు, సృంజయుసుడికి సహదేవుడు, సహదేవుడికి కుశాశ్వుడు, కుశాశ్వుడికి సోమదత్తుడు, సోమదత్తుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి సుమతి జన్మించాడు, ఆ సుమతి ఇప్పుడు ఈ విశాలా నగరాన్ని పరిపాలిస్తున్నాడు.
తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకొన్న సుమతి ఆయనని సగౌరవంగా ఆహ్వానించాడు. సకల మర్యాదలు చేశాడు. అప్పుడు సుమతి విశ్వామిత్రుడితొ నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, సూర్యచంద్రులులాగ ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు అన్నాడు. వాళ్ళని రామలక్ష్మణులంటారు, దశరథుని కుమారులు, నా యాగ సంరక్షణ కోసం వచ్చారు అని చెప్పి, కుశల ప్రశ్నలు అడిగాక అక్కడినుంచి బయలుదేరారు. అలా మిథిలా నగరానికి దెగ్గరగా వచ్చాక వాళ్ళకి ఒక ఆశ్రమం చాలా శోభాయమానంగా కనిపించింది, కాని అది నిర్జనంగా ఉంది. అప్పుడు రాముడు ఈ ఆశ్రమం ఎవరిదని అడుగగా, విశ్వామిత్రుడు ఇలా చెప్పెను......
గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వం ఆసీత్ మహాత్మనః |
ఆశ్రమో దివ్య సంకాశః సురైః అపి సుపూజితః ||
ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది, ఆయన దర్శనం కోసం ఈ ఆశ్రమానికి దేవతలు వచ్చేవాళ్ళు. ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తాపసిగా ఇక్కడ ధార్మికమైన జీవనం గడిపేవారు. అహల్య బ్రహ్మదేవుడి మానస పుత్రిక, అద్భుతమైన సౌందర్యం కలిగినది. ఇంద్రుడికి అహల్య మీద ఉన్న కోరిక వలన, ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనాది క్రతువులు నదిలో చేసుకునే సమయంలో, ఆయన ఇంటి వద్ద లేని సమయంలో, గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశించి నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అని అహల్యతో అన్నాడు.
ముని వేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన |
మతిం చకార దుర్మేధా దేవ రాజ కుతూహలాత్ ||
అహల్యకి వచ్చింది గౌతముడు కాదు ఇంద్రుడని తెలుసు, కాని ఆమె కన్యత్వంలో ఉండగా ఆమెకి ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉండేది, అందువలన ఇంద్రుడితో సంగమించింది.
అహల్య ఇంద్రుడితో ఇలా అనింది " నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను, కృతార్థురాలినయ్యాను, నువ్వు ఇక్కడినుంచి తొందరగా వెళ్ళిపో. నిన్ను నువ్వు గౌతముడి నుండి రక్షించుకో " అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి, నేను చాలా ఆనందంపొందాను, ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటకి రాగానే......
గౌతమం స దదర్శ అథ ప్రవిశంతం మహామునిం |
దేవ దానవ దుర్ధర్షం తపో బల సమన్వితం ||
దేవతలని, దానవులని నిగ్రహించగలిగే, శాసించగలిగే అపారమైన తపఃశక్తి ఉన్న గౌతమ మహర్షి బయటకి వస్తున్న ఇంద్రుడిని చూశారు. ఇంద్రుడి ముఖం మాడిపోయింది. అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు " నా రూపం ధరించి నువ్వు చెయ్యరాని పాపం చేశావు. స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండడానికి కారణం నువ్వు పురుషుడవన్న అహంకారం, కావున పురుషత్వానికి చిహ్నములైన నీ అండములు నేల జారి పడిపోవు గాక " అని ఇంద్రుడిని శపించారు.
పేతతుః వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్ |
అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు " నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు, ఆహరం తీసుకోకు, గాలిని భక్షించు. నీ మీద బూడిద కప్పబడుతుంది, కావున నువ్వు ఎవరికీ కనబడవు. కొంతకాలానికి ఈ ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు. ఆయన ఈ ఆశ్రమ ప్రవేశం చెయ్యగానే నీకు శాపవిమోచనం కలుగుతుంది. నీకు శాపవిమోచనం కలగగానే నువ్వు నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటిదాకా నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంతలో ఇంద్రుడు దేవలోకంలో దేవతలకి జెరిగినదంతా చెప్పాడు. నేను కామంతో ఈ పని చెయ్యలేదు, గౌతమ మహర్షి తపఃశక్తి పెరిగిపోతుంది, ఆయనని నేను ఏమి చెయ్యలేను, అందుకనే అపచారం అహల్య పట్ల చేశాను, ఆగ్రహించిన గౌతమ మహర్షి నన్ను, అహల్యని శపించడం వల్ల కొంత తపఃశక్తిని కోల్పోయారు. మిమ్మల్ని రక్షించడం కోసం నేను నా అండాలని పోగొట్టుకున్నాను, కావున మీరే నాకు అండాలని తీసుకొచ్చి పెట్టాలి అన్నాడు. అప్పుడు వాళ్ళు గొర్రె వృషణములను తీసుకొచ్చి ఇంద్రుడికి పెట్టారు. అలా పోగొట్టుకున్న పుంసత్వాన్ని ఇంద్రుడు పొందాడు. అప్పుడు ఆయనని మేష వృషణుడు అని పిలిచారు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. రాముడు ఆ ఆశ్రమం లోకి వెళ్ళగానే, ఇన్ని వేల సంవత్సరాల నుండి శాపగ్రస్తురాలైన అహల్య దుర్నిరీక్షమైన తేజస్సుతో పైకి లేచింది. ఆవిడని చూడగానే రాముడు ఆమె కాళ్ళకి నమస్కారం చేశాడు. గౌతమ మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి, వచ్చిన వాడు రాముడని గ్రహించిన అహల్య రాముడికి నమస్కారం చేసింది. వాళ్ళకి భోజనం పెట్టింది. అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి అహల్యతో కలిసి తపస్సు చేసుకోడానికి వెళ్ళిపోయాడు.
తరువాత వాళ్ళు మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ నగరం వాహనాలతో, మహర్షులతో, యజ్ఞయాగాలు చేసుకునేవాళ్ళతో ఉంది. విశ్వామిత్రుడు తన రాజ్యంలోకి ప్రవేశించాడన్న విషయం తెలుసుకున్న జనకుడు పరుగు పరుగున తన పురోహితుడైన శతానందుడితో వచ్చాడు. మీరు రావడంతో నా యాగం ఫలించిందని విశ్వామిత్రుడిని గౌవరంగా పూజించాడు. పక్కనే ఉన్న రామలక్ష్మణులని చూసిన జనకుడు, ఈ పిల్లలిద్దరూ ఎవరు, ఖడ్గాలు, కొదండాలు పట్టుకున్నారు, సూర్యచంద్రుల వలె ఉన్నారు, అపారమైన తేజస్సుతో ఉన్నారు, ఈ పిల్లలు నీతో ఉన్నారు, ఇంతకి వాళ్ళు ఎవరు అని అడిగారు.
వాళ్ళిద్దరూ దశరథ మహారాజు కుమారులు, నా యాగ రక్షణ కోసం తీసుకొచ్చాను. రామలక్ష్మణుల రక్షణలో నా యాగం పూర్తయ్యింది అని విశ్వామిత్రుడు చెప్పాడు.
అయితే మీరు ఇటు వస్తున్నప్పుడు ఆశ్రమంలో నా తల్లిని చూశార అని శతానందుడు వాళ్ళని అడిగాడు.
పతితపావనుడైన రాముడు ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగానే మీ అమ్మగారికి శాపవిమోచనం అయ్యింది, ఆవిడ తన భర్త అయిన గౌతముడితో కలిసి వెళ్ళింది అని చెప్పారు.
శతానందుడు ఎంతో సంతోషించాడు......... "రామ! నీ దర్శనం నాకు కలగడం నా అదృష్టం. మా అమ్మ జీవితంలో ఒకసారి కామానికి లొంగింది, అందువలన ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడింది. మా అమ్మ పెట్టిన విందు స్వీకరించావ. మా అమ్మ సంతోషంగా ఉందా " అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు రాముడు.....మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు, గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోడానికి వెళ్ళారు అని చెప్పాడు.
రాముడి మాటలు విని సంతోషించిన శతానందుడు ఇలా అన్నాడు.......
న అస్తి ధన్యతరో రామ త్వత్తో అన్యో భువి కశ్చన |
గోప్తా కుశిక పుత్రః తే యేన తప్తం మహత్ తపః ||
" విశ్వామిత్రుడు నీకు గురువు కావడం చేత నువ్వు ధన్యుడవి అయ్యావు, ఆయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. నేను ఇప్పుడు నీకు ఆయన కథ చెబుతాను " అని విశ్వామిత్రుడి జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడు.
శతానందుడు రాముడితో ఇలా చెప్పసాగాడు " గాధి కుమారుడైన విశ్వామిత్రుడు చాలాకాలం రాజ్యపాలన చేశాడు. ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణీ సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరిచి జీవిస్తుంటాయి. పులి-జింక, ఎలుక-పాము, కుక్క-పిల్లి ఒకదానిని ఒకటి తరమదు, చంపదు. ఆ ఆశ్రమంలో కొన్ని వేల మంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆ ఆశ్రమం శోభాయమానంగా ఉండేది. ఆ ఆశ్రమంలో శబళ అనే కామధేనువు ఉండేది, అది అమృతంతో సమానమైన క్షీరాన్ని(పాలు) ఇస్తుండేది. ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి, ఆశ్రమంలోకి వెళ్ళారు.
అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడితో......అయ్యా! మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయా, మీ యజ్ఞయాగాది క్రతువులు బాగా జెరుగుతున్నాయా, మీ ఆశ్రమంలోని ఋషుల తపస్సులు ఎటువంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా, మీరంతా సంతోషంగా ఉన్నారా అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు.
సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు.......నాయనా! నేను కుశలంగా ఉన్నాను, నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా ( రాజధర్మం అంటె, ఎంత పన్ను ప్రజల దెగ్గర నుండి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి. ఆ పుచ్చుకున్న ద్రవ్యంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం చెయ్యకుండా, ఆ ధనాన్ని వృద్ధి చెయ్యాలి. అప్పుడు దాన్ని అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి దేశ క్షేమాన్ని కోరుకోవాలి), సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా, శత్రువులను జయించావా, నీ మంత్రులు నీకు సహాయపడుతున్నార అని పలు విషయాలని ప్రస్తావించిన తరువాత కొంతసేపటికి విశ్వామిత్రుడు ఇక నేను వెళతాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు.........
సత్క్రియాం తు భవాన్ ఏతాం ప్రతీచ్ఛతు మయా కృతాం |
రాజన్ త్వం అతిథి శ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః ||
ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్టుడివి, కనుక నా ఆతిధ్యం తీసుకోవాలన్నాడు.
మీరు నాకు చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్ళు ఇచ్చారు, మీరు తినే తేనె, కందమూలాలు నాకు పెట్టారు, అలాగే నాకు మీ దర్శనం కూడా అయ్యింది. ఇంతకంటే నాకు ఏమి కావాలి, ఇక మీరు శ్రమతీసుకోవద్దు అని విశ్వామిత్రుడు అన్నాడు. అలా కాదు మీరు నా ఆతిధ్యం స్వీకరించాల్సిందే అని వశిష్ఠ మహర్షి అన్నారు. సరే, మీ ఇష్టం అని విశ్వామిత్రుడన్నాడు.
అప్పుడు వశిష్ఠ మహర్షి శబళని పిలిచి, చూశావా మన ఆశ్రమంలోకి ఈ రోజు విశ్వామిత్ర మహారాజుగారు వచ్చారు, నువ్వు ఆయనకి, ఆయన అక్షౌహిణీ సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చెయ్యాలి. ఎవరెవరికి ఏది కావాలో నువ్వు అది ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ శబళ ఎవరెవరు మనస్సులలో ఏమి కావాలని అనుకుంటున్నారో గ్రహించి, చెరుకు కర్రలు, తేనె, పానీయములు, కొండలంత ఎత్తున్న సన్నటి అన్నరాసులని, కొరుక్కు తినేవి, తాగేవి, నాకేవి, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పళ్ళరసాలు, పాలు, తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసింది.
శబళ సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ భుజించారు, అందరూ ఈ భోజనం ఎంత బాగుందో అనుకున్నారు, మళ్ళి మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో అని ఆవురావురుమని తిన్నారు. ఒక గోవు ఉత్తరక్షణంలో ఇంతమందికి సరిపడా భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకి మెల్లగా ఆ శబళ మీద వ్యామోహం పెరిగింది, ఆ శబళని తన సొంతం చేసుకోవాలనిపించింది. అప్పుడాయన ఆ వశిష్ఠ మహర్షితో........
గవాం శత సహస్రేణ దీయతాం శబలా మమ |
నేను మీకు ఒక లక్ష ఆవుల్ని ఇస్తాను, మీరు నాకు శబళని ఇవ్వండి అన్నాడు.
అయితే ఈ విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి గ్రహించారు. వశిష్ఠుడు నవ్వి, నేను నీకు శబళని ఇవ్వలేను అన్నారు.
విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు, ...........రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటె అవి రాజుకే చెందుతాయి. రాజు దెగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నమైతే, ఇంత విలువైన శబళ కూడా రత్నమే. నా సొత్తు అయిన ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు, అందుకే ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకెళుతున్నాను అని అన్నాడు.
నాయనా విశ్వామిత్రా! ఈ ఆవు ఒక రత్నము, దీనిని విలువగా దాచుకోవాలని అనుకుంటున్నావు. కాని ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకి, పితృదేవతారాధనకి పాలు ఇస్తుంది, నా ప్రాణయాత్ర దీనితో జెరుగుతుంది. ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు, విద్యాభ్యాసం సమస్తము ఈ శబళ మీద ఆధారపడి ఉంది, కాబట్టి నేను ఈ ధేనువుని నీకు ఇవ్వలేను అని వశిష్ఠ మహర్షి అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు,........నేను నీకు మెడలో బంగారు తాడులున్న పద్నాలుగు వేల ఏనుగులని ఇస్తాను, ఎనిమిది వందల బంగారు రథాలని ఇస్తాను, ఆ ఒక్కో రథానికి స్వర్ణాభరణములతో అలంకరింపబడ్డ నాలుగు గుర్రాలు ఉంటాయి, అలాగే గొప్ప గొప్ప జాతులకి చెందిన పదకొండు వేల గుర్రాలు ఇస్తాను, ఒక కోటి గోవుల్ని ఇస్తాను, బంగారము, వెండి ఎంత కావాలో నువ్వే అడుగు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి, నేను ఇంక ఏమి మాట్లాడను అన్నారు.
ఆగ్రహించిన విశ్వామిత్రుడు, ఈయన ఇవ్వడమేంటి నేను పుచ్చుకోవడమేంటి, అడిగినకొద్ది బెట్టు చేస్తున్నాడు, ఈ రత్నం నాకు చెందినది అని ఆ శబళ మెడలో తాడు కట్టి, సైనికులకిచ్చి తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు దాన్ని ఈడ్చుకెళుతుంటె ఆ శబళ ఏడ్చింది. ఇంత జెరుగుతున్నా వశిష్ఠుడు మాత్రం అలానే నిశబ్దంగా ఉన్నారు. అప్పుడా శబళ........ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడ, లేకపోతే విశ్వామిత్రుడు తీసుకెళుతున్నాడ, వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటె విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్ళగలడా, వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేను ఏదో పాపం కాని, పొరపాటు కాని చేసి ఉండాలి, ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను, ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారు అని తాడు విడిపించుకొని వశిష్ఠుడి దెగ్గరికి పరుగుతీసి వెళ్ళింది.
అప్పుడు వశిష్ఠుడు.......
న త్వాం త్యజామి శబలే న అపి మే అపకృతం త్వయా |
ఏష త్వాం నయతే రాజా బలాత్ మత్తః మహాబలః ||
శబళా! నేను నిన్ని విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకెళుతున్నాడు. ఆయన ఈ భూమికి ప్రభువు, కాని నేడు తప్పు ద్రోవలొ వెళుతున్నాడు, అతను దోషం చేస్తే, ఆ దోషం అతనిని కాలుస్తుంది. నిన్ను ఈడ్చుకెళ్ళి దోషం చేశాడు, ఇక ఆయన అపరాధమే ఆయనని కాలుస్తుందని చెప్పాడు.
అయితే నన్ను నేను రక్షించుకోనా అని శబళ అడుగగా, తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుడు చెప్పాడు.
అప్పుడా శబళ గట్టిగా అంబా అని అరిచి శూలాయుధధరులైన పహ్లవులు కొంతమందిని సృష్టించింది. వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు. ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్ళి చాలామంది పహ్లవులని సంహరించాడు. ఆ శబళ పహ్లవులతో పాటు యవనులని సృష్టించింది, వాళ్ళందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచెయ్యడం ప్రారంభించారు. అప్పుడా శబళ వశిష్ఠుడితో........చూశార! ఆయన నాకు ఎదురుతిరిగాడు, ఇప్పుడు ఓటమి అంచులలో ఉన్నాడు అని అన్నది. అయితే నువ్వు ఇక యదేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుడు అన్నాడు.
అప్పుడా శబళ సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంభోజ వంశీయులని, తన పొదుగు నుండి కొన్ని వేల పహ్లవులని, యోని నుండి యవనులని, గోమయం పడే స్థానం నుంచి శకులు, రోమకుపాల నుండి హారీతులు మరియు కిరాతకులని సృష్టించింది. వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. రథం నుండి కిందకి దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడయ్యాడు. ఇది కదా శబళ గొప్పతనం అనుకొని తన 100 కుమారుల వైపు చూశాడు. తమ తండ్రిని బాధపెట్టిన వశిష్ఠుడిని చంపెయ్యాలని అందరూ కత్తులు పట్టుకొని ఆయన మీదకి పరుగుతీసారు.
కూర్చుని ఉన్న వశిష్ఠుడు తన మీదకి వస్తున్న ఆ నూరుగురు పిల్లల్ని చూసి గట్టిగా "ఆ......" అని హుంకారం చేశారు, ఆ నూరుగురు పిల్లలు భస్మరాసులై కిందపడిపోయారు. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు.
ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటె, ఆయన "ఆ...." అంటె వందమంది బూడిదైపోయారు, ఆ ఆవు తలుచుకుంటె గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృష్టించింది. రాచరికం కన్నా తపఃశక్తి చాలా గొప్పది, ఈ వశిష్ఠుడిని నాశనం చెయ్యాలంటే నాకున్న శక్తి సరిపోదు. కావున నాకు ధనుర్వేదంలోని సమస్త అస్త్ర-శస్త్రాలు తెలియాలి అనుకొని ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి, రాజ్యపాలన చెయ్యమని చెప్పి తాను తపస్సు చేసుకోడానికి హిమాలయ పర్వతాలకి వెళ్ళాడు.
హిమాలయ పర్వతాలమీద మహాదేవుడైన శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై,......నాయనా విశ్వామిత్రా! నీ మనసులో ఏ కోరికుందో చెప్పు, ఆ కోరికని నేను తీరుస్తాను అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు.......
యది తుష్టో మహాదేవ ధనుర్ వేదో మమ అనఘ |
సా అంగ ఉప అంగ ఉపనిషదః స రహస్యః ప్రదీయతాం ||
మహాదేవ! నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందినవాడివైతే, నేను ఎవరి దెగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసిపోయేటట్టు అనుగ్రహించమన్నాడు. శివుడు తధాస్తు అన్నాడు. పౌర్ణమి నాడు సముద్రుడు ఎలా పొంగుతాడో, అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో, పక్షులతో, ఆవులతో, గురువుల దెగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది. ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువయ్యింది. కనీసం ఒకమాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో, అలా అస్త్రాలన్నిటిని ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు. కన్నుమూసి తెరిచేలోగా ఆ ఆశ్రమం అంతా బూడిదయ్యింది. ఆ ఆశ్రమంలోని గురువులు, శిష్యులు, జింకలు, ఆవులు అన్ని తలకోదారి పట్టి అరణ్యంలోకి పరుగు తీశాయి. అప్పుడు వశిష్ఠుడు పారిపోతున్న వారిని ఆగండి, పారిపోకండి, నేను మిమ్మల్ని కాపాడతాను అని అన్నారు. ఆకాశం నుండి పడుతున్న అస్త్రాలని చూసి భయపడి అందరూ పారిపోయారు. ఆశ్రమంలో వశిష్ఠుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదకి వచేస్తోంది.
ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను, ఇవ్వాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు తన బ్రహ్మదండం పట్టుకొని కింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా పట్టుకుని ఉంటె అది ఎలా ఉందంటే, సమస్తలోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నారు. మండుతున్న నిప్పు మీద నీళ్ళు పడితే ఎలా చల్లారిపోతుందో, అలా ఆ ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది.
తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు, కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది. అప్పుడాయన ఒకేసారి వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఇషీకాస్త్రం, మానవాస్త్రం, గాంధర్వాస్త్రం, బ్రహ్మపాశం, కాలపాశం, వారుణపాశం, పినాకాస్త్రం, క్రౌంచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశూలం, కాపాలం అనే కంకణం, రకరకాల పిడుగులు, కంకాలం, ముసలం, పెద్ద పెద్ద గధలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్ఠుడి మీద వేశాడు.
కాని ఆయన వేసినవన్ని వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి.
ఇక తనదెగ్గర ఉన్న ఒకేఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వెయ్యడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనస్సులో క్షోభ పొందాయి. అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు. ఇప్పటిదాకా ఎంతోమంది గొప్పవాళ్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశబ్ధంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు.........
ధిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం |
ఏకేన బ్రహ్మ దణ్డేన సర్వ అస్త్రాణి హతాని మే ||
ఛి! ఆ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది. ఎన్నో అస్త్రాలని నేర్చుకున్నాను, అన్నీ ప్రయోగించాను. కాని ఆయన ఒక కర్రముక్క పట్టుకొని నా అస్త్రాలన్నిటిని మింగేసారు, అని ఆ రథం దిగి వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను, కాబట్టి నేనూ బ్రహ్మర్షిని అవుతానని ఆ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్పందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని నలుగురు కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు " నువ్వు చేసిన ఈ తపస్సు చేత రాజర్షి లోకాలని గెలిచావు, ఇవ్వాళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు " అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇంక బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు.
అదే కాలంలొ ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కాని, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కాని శరీరంతో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైన కొంత కాలానికి పడిపోవాల్సిందే, అది పడిపోయిన తరవాతే స్వర్గలోక ప్రవేశం. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జెరగదు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడా త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కుమారుల దెగ్గరికి వెళ్ళి జెరిగినది చెప్పాడు. మా తండ్రిగారు కుదరదన్నారు, ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు, అది జెరిగేపనికాదన్నారు ఆ నూరుగురు కుమారులు.
అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను అన్నాడు ఆ త్రిశంకుడు. నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రులమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు, నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చణ్డాలుడివి అవుతావని శపించారు.
మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు, ఆయన వేసుకొన్న బంగారు ఆభరణాలన్ని ఇనుమ ఆభరణాలయ్యాయి, జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు.
వశిష్ఠుడిని ఎలాగు అస్త్రాలతో ఓడించలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని, కనుక ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడాయన తన శిష్యుల్ని, కొడుకుల్ని పిలిచి.......మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరిగండి, వశిష్ఠుడు చెయ్యలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణుల్ని, ఋషుల్ని తీసుకురండి. ఎవరన్నా ఆ యాగం చెయ్యలేరు, మేము రాము అంటె, వాళ్ళ వివరాలు తీసుకోండని చెప్పాడు. విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు. తరువాత ఆయన కొడుకులు వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు, అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు, కాని ఆయన ఒక మాటన్నాడు, అదేంటంటే, యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక చణ్డాలుడు, ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు, అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు, అందుకని రానన్నాడు అని చెప్పారు.
విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చి, వశిష్ఠ మహర్షి కొడుకులని, మహోదయుడిని, మీరు భస్మరాశులై పడిపోయి నరకానికి వెళతారు, ఆ తరవాత 700 జన్మలపాటు శవ మాంసం తిని బతుకుతారు, ఆ తరవాత ముష్టికులన్న పేరుతో పుట్టి, కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాలలోని జనాలచేత ద్వేషింపపడి నిషాదుడై బతుకుతాడని శపించాడు.
అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు, యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవతా రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపఃశక్తితొ త్రిశంకుడికి పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన.......
త్రిశంకో గచ్ఛ భూయః త్వం న అసి స్వర్గ కృత ఆలయః ||
త్రిశంకా, నువ్వు గురు శాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు అని, తలక్రిందులుగా కిందకిపో అన్నాడు. ఆ త్రిశంకుడు అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు. కిందకి పడిపోతు ఆయన విశ్వామిత్రుడిని ప్రార్ధించగా, విశ్వామిత్రుడు మిగిలిన తపఃశక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తర్షులని సృష్టించాడు. కాని దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి, దేవతలని కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు.
మహానుభావ! శాంతించు. ఎంత తపఃశక్తి ఉంటె మాత్రం ఇలా వేరె స్వర్గాన్ని సృష్టిస్తావ, మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవరిని స్వర్గానికి పంపలేము. మీలాంటివారు చెయ్యవలసిన పని కాదు అన్నారు. మీరు మీ తపఃశక్తిని ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది, అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు అని వరం ఇచ్చారు దేవతలు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు. తనకి ఇక్కడ మనస్సాంతి లేదని, ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కుకి వెళ్ళారు.
పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహొగ్రమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేథ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జెరగదు అని మహర్షులు చెప్పారు. కాని అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తిచెయ్యచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు.
ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద, ఋచీకుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దెగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకుగాను నాకు ఒక యాగపశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడా ఋచీకుడు ఇలా అన్నాడు " పెద్దకొడుకు ధర్మసంతానం( పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు) కావున నేను వాడిని ఇవ్వలేను, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడా మధ్య కొడుకైన శునఃశేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు.
రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి, యాగం పూర్తి చెయ్యడానికి తన కొడుకుని పంపాడు ఆ ఋచీకుడు. అంబరీషుడు ఆయనకి లక్ష గోవుల్ని దానంగా ఇచ్చాడు. శునఃశేపుడిని తీసుకెళుతున్న అంబరీషుడు కొంతదూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడకి దెగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు " నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామ అవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వననింది, మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేసారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది. కాబట్టి మీరు నన్ను రక్షించాలి " అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులని పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ శునఃశేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అన్నాడు.
కథం ఆత్మ సుతాన్ హిత్వా త్రాయసే అన్య సుతం విభో |
అకార్యం ఇవ పశ్యామః శ్వ మాంసం ఇవ భోజనే ||
నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొకడి కొడుకుని రక్షిస్తావ, మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు........
శ్వ మాంస భోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు |
పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యాం అనువత్స్యథ ||
మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళలాగ కుక్క మాంసం తింటూ బతకండని శపించాడు.
అప్పుడాయన శునఃశేపుడితో.........నువ్వు బెంగపెట్టుకోమాకు, నిన్ను తీసుకెళ్ళి యూప స్తంభానికి కడతారు. ఇప్పుడు నేను నీకు రెండు మంత్రాలని చెప్తాను, నిన్ను అలా యూప స్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ రెండు మంత్రాలని జపించు, అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి, నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగ ఫలితం ఇస్తాడని చెప్పి ఆ రెండు మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు.
తరవాత శునఃశేపుడిని యూప స్తంభానికి కట్టారు, అప్పుడాయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు.
కోపంలో తన కొడుకులని శపించానని విశ్వామిత్రుడు బాధ పడ్డాడు. ఈ సారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు.
మేనక! నేను నీయందు కందర్ప వశుడనయ్యాను( అంటె మన్మధ ఆవేశం కలిగింది), అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు. మేనక సరే అనింది. అలా మేనకతో క్రీడిస్తూ క్రీడిస్తూ పదేళ్ళు గడిచిపోయాయి.
సర్వం సురాణాం కర్మ ఏతత్ తపో అపహరణం మహత్ |
అహో రాత్రా అపదేశేన గతాః సంవత్సరా దశ ||
పది సంవత్సరాల తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ఈ మేనకతో ఏదో, ఒక రోజు లేకపోతే రెండు రోజులు అనుకున్నాను, కాని ఇలా పది సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు అనుకొని కోపంగా మేనక వైపు చూశాడు, కాని ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్ళిపోమన్నాడు. ఈ సారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతిఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను, ఇక నుంచి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కాని సంతోషం కాని కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి మహర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో అనుకొని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రియాలని గెలిచాన అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలని గెలవలేదు, ఇంద్రియాలని గెలవడం అంత తేలిక కాదు అన్నాడు.
మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచోకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు.
మళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఈ సారి ఎండాకాలంలో తన చుట్టూ నాలుగు పక్కల అగ్నిని పెట్టుకొని, తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుముదాకా నీళ్ళల్లో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. రంభ భయపడి వెళ్ళనంటే నానారకాలుగా నచ్చ చెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది, చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కళకళలాడుతున్నాయి, కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతోంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభగ్నానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు.....
యత్ మాం లోభయసే రంభే కామ క్రోధ జయ ఏషిణం |
దశ వర్ష సహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే ||
నన్ను ప్రలోభపెడదామని వచ్చిన ఓ రంభా! నువ్వు పదివేల సంవత్సరాలు రాయివై పడుండు అని శపించాడు.
తరవాత కొంతసేపటికి శాంతించి, అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్ళి క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకొని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు అని అన్నాడు.
విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు, నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము, కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం, ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడిఉంది. అందుకని ఊపిరిని తీసి బయటకి వదలను, కుంభకం(యోగాలో ఒక ప్రక్రియ) చేస్తాను, అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం ధృడత్వం ఉండడంవలన, కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలొ వచ్చి, అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది, మీదెగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చిన వాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్ధమయ్యింది, కాని ఈ సారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు, ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళి కుంభకంలోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుంచి ఆయన తపఃశక్తి పొగగా బయలుదేరింది. ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది, సముద్రాలు కదలడం ఆగిపోయాయి, సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు, ఆయనకి శత్రువు లేడు మిత్రుడు లేడు, ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి.........
బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సు తోషితాః |
బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక ||
ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితొ.......నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము, వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు( ఓంకారము, వషట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు, అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు.
అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు.
ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు.
బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.
రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోయాడు.
జనక మహారాజుగారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు.......వీళ్ళ ఇద్దరికీ నీ దెగ్గరున్న శివ ధనుస్సుని చూపిద్దామని తీసుకొచ్చాను, నువ్వు ఒకసారి ఆ శివ ధనుస్సుని చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు. అప్పుడు జనకుడు తనకి ఈ శివ ధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు.
పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి(పార్వతీదేవి) యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, వెంటనే దేవతలు ప్రార్ధించగా ఆయన శాంతించాడు.
ఆ ధనుస్సుని జనక మహారాజు వంశంలొ పుట్టిన దేవరాతుడు అనే రాజు దెగ్గర న్యాసంగా( అంటె కొంతకాలం ఉంచారు) ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజూషలొ(పెద్ద పెట్టె) పెట్టాడు. చక్రాలున్న ఆ మంజూషలొ శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివ ధనుస్సుని రోజూ పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు.
అథ మే కృషతః క్షేత్రం లాంగలాత్ ఉత్థితా మమ |
క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతా ఇతి విశ్రుతా ||
అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీతా అని పిలిచాము(జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతిలేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేర్లు). ఆమె అయోనిజ, ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్యరాశి. ఆమెని చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెని తమ భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెని వీర్య శుల్కగా( అంటె పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది) ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివ ధనుస్సుని ఎక్కుపెట్టడానికి, కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు, ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్నహృదయాలతో వెనుదిరిగేవాళ్ళు.
ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము, ఆ ధనుస్సుని ఎవరమూ ఎక్కుపెట్టలేము, కనుక మనందరమూ ఒకటై, జనకుడి మీదకి యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగడ్త(భుమిని తవ్వి దానిని నీళ్ళతో నింపుతారు) తవ్వి, ద్వారాలు మూసేశాము. ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దెగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు నేను తపస్సు చేశాను. నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు.
అప్పుడు జనకుడు " ఒకవేళ ఈ రాముడు శివ ధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే, నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తాను" అన్నాడు.
ఆ శివ ధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడా ఎనిమిది చక్రాలు కలిగిన మంజూషని లాక్కొని వచ్చారు.
ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి, వింటినారిని లాగి కట్టడం జెరుగుతుందా, సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకోచ్చాము చూడండి, అని జనకుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజూషని తెరువగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుస్సు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు.
ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు.
ఆరోపయత్ స ధర్మాత్మా స లీలం ఇవ తత్ ధనుః |
ఆరోపయిత్వా మౌర్వీం చ పూరయామాస వీర్యవాన్ |
తత్ బభంజ ధనుర్ మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః ||
రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా, కష్టం లేకుండా పైకి ఎత్తి, నారి కడదామని లాగేసరికి, వంగిన ఆ ధనుస్సు మధ్యలో "ఫడేల్" అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివ ధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్చపోయారు.
భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథ ఆత్మజః |
అతి అద్భుతం అచింత్యం చ అతర్కితం ఇదం మయా ||
అప్పుడు జనకుడు " మహానుభావ విశ్వామిత్రా! నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ తీసుకొచ్చావు, రాముడు దశరథాత్మజుడు, ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి, తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది " అన్నాడు.
అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజుగారి దెగ్గరికి పంపించి, రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని వీర్య శుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా, వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. అక్కడకి చేరుకున్నాక, మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా, వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు జెరిగినదంతా చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దెగ్గరున్న శివ ధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా, శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే, మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు.
వెంటనే దశరథుడు తన గురువులతొ, పురోహితులతొ సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, " మహానుభావ దశరథ! విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు, శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు" అన్నారు.
వెంటనే దశరథుడు మనం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా రేపే బయలుదేరదామన్నాడు. కోశాధికారులని పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనపు మూటలు పట్టుకొని ముందు బయలుదేరండన్నాడు, రథాలని, చతురంగ బలాలని సిద్ధం చెయ్యమన్నాడు, పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామన్నాడు. మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్ష్వాకువంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన 3 పత్నులని దశరథుడు తీసుకెళ్ళలేదు.
దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే, జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి, మీరు రావడం వల్ల నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు. నా కూతురైన సీతమ్మని వీర్య శుల్కగా ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టినవాడికి ఇస్తానన్నాను, నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు, అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు అన్నాడు.
ప్రతిగ్రహో దాతృ వశః శ్రుతం ఏతత్ మయా పురా |
యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్ కరిష్యామహే వయం ||
అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు " అయ్యయ్యో జనకా, అలా అంటావేంటి, అసలు ఇచ్చేవాడు ఉంటె కదా పుచ్చుకునేవాడు ఉండేది, పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు, ఔదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను" అని అన్నాడు.
ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామన్నారు. దశరథుడితో పాటు వచ్చిన భరతశత్రుఘ్నులు రామలక్ష్మనులతో కలిసారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురూ సంతోషంగా మాట్లాడుకున్నారు. దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వాళ్ళు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది.
మరుసటి రోజూ ఉదయాన్నే దశరథుడు జనకా మహారాజుతో ఇలా అన్నాడు " మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న, మా వంశాభివృధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు" అన్నారు.
అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజుగారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు........
మొదట బ్రహ్మగారు జన్మించారు, ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు, మరీచికి కాశ్యపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువ, పృథువకి త్రిశంకువు, త్రిశంకువుకి ధుంధుమారుడు, ధుంధుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు, పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, ఈ అసితుడ వరకు రాజ్యపాలనం చేశారు, ఈ అసితుడు హైహయ, తాలజంఘా, శశబింద్వ అనే వంశాల వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయాడు, తరువాత ఆయన హిమాలయాల పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు, ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది మరొక భార్యకి సంతానం కలగలేదు. వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విష ప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చ్యవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విష ప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జెరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని ( గరము అంటె విషం) పేరు పెట్టారు. ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులని కపిల మహర్షి భస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు( ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయనని శపించాడు, అప్పుడా రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కుల గురువుని శపించద్దు అనింది, కాని అప్పటికే తన కమండలంలోని నీళ్ళు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్ళని తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు, అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు), ప్రవృద్ధుడికి శంఖణుడు, శంఖణుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం, ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి, యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు" అని వశిష్ఠుడు చెప్పాడు.
ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు " మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి, నిమికి మిథి( ఈయన నిర్మించినదే మిథిలా నగరం), మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధణుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతుకి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి శూరుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు, మహావీరుడికి సుధృతి, సుధృతికి ధృష్టకేతువు, ధృష్టకేతువుకి హర్యశ్వుడు, హర్యశ్వుడికి మరుడు, మరుడికి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢ, దేవమీఢకి విబుధుడు, విబుధుడికి మహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు, జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది, తరవాత ఊర్మిళ పుట్టింది" అని జనకుడు చెప్పుకున్నాడు.
సాంకాశ్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. కుశధ్వజుడు వచ్చాక.......
వీర్య శుల్కాం మమ సుతాం సీతాం సుర సుత ఉపమాం |
ద్వితీయాం ఊర్మిలాం చైవ త్రిః వదామి న సంశయః ||
నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని, ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శ్రుతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము, పితృకార్యము చెయ్యమన్నాడు.
నేటికి రెండు రోజుల తరువాత ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు.
దశరథుడు గోదానము, పితృకార్యము మొదలైన కర్మలను పూర్తిచేసాడు. తరువాత ఆయన నాలుగు లక్షల గోవులు,(బంగారు కొమ్ములు కలిగినవి) ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారము, వెండి దానం చేశాడు. వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చెయ్యమన్నారు.
దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు.
మిమ్మల్ని అక్కడెవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా, దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు, మీరు తిన్నగా వచ్చేయండని జనకుడన్నాడు.
అగ్నివేది సిద్ధం చేశాక, అందులో అగ్నిహొత్రాన్ని నిక్షేపించారు, అక్షతలని సమాహొరణం చేయించారు, గంధ పుష్పాలని వేశారు. జనక మహారాజు ఆ అగ్నిహొత్రం దెగ్గర నిలబడ్డారు, రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహొత్రం దెగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు. అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు..................
ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ |
ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయ ఇవ అనుగతా సదా ||
రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు, నీతోపాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామ. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు, ఈమెని నువ్వు పుచ్చుకో, నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో( సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం, మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి), ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది, నా భర్త అని నీ కోసమే చేస్తుంది. రామ! మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే, అది నీ వల్లే రామ, ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి, ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది, ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది. [ఇదంతా పై శ్లోకం యొక్క రహస్యార్ధం.]
అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోను, భరతుడికి మాండవితోను, శత్రుఘ్నుడికి శృతకీర్తితోను వివాహం జెరిపించారు.
అలా వివాహం జెరగగానే, దివ్యదుందుభిలు మ్రోగాయి, పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజూ జెరిగిన సీతారాముల కల్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి.
మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరిని ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు.
అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది, మంగళ ప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి, కాని మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి, ఏమి జెరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు. ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, ఏదో దైవీసంబంధమైన విపత్తు వస్తోంది, కాని మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావన్నారు.
ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈ రోజే విన్నాను, శివ ధనుస్సుని విరిచావంట, నీ గురించి విన్నాను రామ, ఏమిటి నీ గొప్పతనం, నువ్వు అంతటివాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి, పరుగెత్తుకుంటూ పరశురాముడి దెగ్గరికి వచ్చి.......
మహానుభావ! ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ సంహరించావు. ఇవ్వాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేకలేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు. నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు.
అప్పుడు రాముడు ఇలా అన్నాడు " పరశురామ! నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు, ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలినవాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా, తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. నేను తప్పకుండా ఎక్కుపెడతాను " అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి, ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. " నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కాని ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, అందుకని నేను నీ గమన శక్తిని కొట్టెస్తాను " అన్నాడు.
అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు " రామ! నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను, అప్పుడాయన నన్ను రాత్రి పూట ఈ భూమండలం మీద ఉండద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతోంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడినవుతాను " అని అన్నాడు. అయితే నీ తపఃశక్తితో సంపాదించిన తపోలోకాలు(తపస్సు) ఉన్నాయి, వాటిని కొట్టెస్తాను అన్నాడు. పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేసాడు. వెంటనే పరశురాముడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామ, నువ్వు ఆ శ్రీమహావిష్ణువే, ఇక ఈ భూలోకంలో నా అవసరంలేదని మహేంద్రగిరి పర్వతాలవైపు వెళ్ళిపోయాడు పరశురాముడు.
దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్ళని చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్ళని ఆ వంశ కులదైవాలున్న దేవతాగృహాలకి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చెయ్యాలని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు.
సీతారాముల అలా ఆనందంగా ఉండడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు..........
ప్రియా తు సీతా రామస్య దారాః పితృ కృతా ఇతి |
గుణాత్ రూప గుణాత్ చ అపి ప్రీతిః భూయో అభివర్ధతే ||
రాముడికి సీతమ్మ అంటె చాలా ఇష్టమంట, ఎందుకు ఇష్టమంటే, మా తండ్రిగారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది, అలాగే అపారమైన సంస్కారము, గుణములు ఉన్నాయట.
సీతారాములు కొంతకాలం సంసారం చేశాక, సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట, అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట, హృదయాలతో నిశబ్ధంగా మాట్లాడుకునేవాళ్ళట. తన తండ్రిగారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట, కాని సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట.
అలా ఆనందంగా కాలం గడిచిపోతుంది..................

No comments:
Post a Comment