Monday, August 27, 2012

రామాయణం - కిష్కింధకాండ


కబంధుడు చెప్పిన విధంగా రామలక్ష్మణులు బయలుదేరి పంపా సరస్సుకి చేరుకున్నారు. ఆ పంపా నదిలో అరవిసిరిన పద్మాలు, పైకి ఎగిరి నీళ్ళల్లో పడుతున్న చేపలని చూసి రాముడు బాధపడ్డాడు. ఆయనకి వాటిని చూడగానే సీతమ్మ ముఖము, కన్నులు గుర్తుకొచ్చి భోరున విలపించాడు. అప్పుడాయన లక్ష్మణుడితో " చూశావ లక్ష్మణా! ఈ ప్రాంతం ఎంత బాగుందో, ఈ చెట్లకి విశేషంగా పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు కిందకి పడుతున్నాయి, ఎక్కడ చూసినా పుష్పముల యొక్క గుత్తులు గాలికి అటు ఇటూ కదులుతూ ఉన్నాయి. అలా కిందకి పడుతున్న పువ్వులని, కదులుతున్న గుత్తులని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, వాయుదేవుడు ఎవ్వరికీ కనపడకుండా వచ్చి ఈ పూల గుత్తులతో ఆడుకుంటున్నాడా! అనిపిస్తుంది. ఈ చెట్లకి అల్లుకున్న తీగలు పైకి వెళ్ళి పెద్ద పెద్ద పువ్వులని పుష్పించాయి. ఇవన్నీ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. నాకు ఇవన్నీ చూస్తుంటే, సీత నా పక్కన లేదు అన్న విషయం జ్ఞాపకానికి వచ్చి నేను నా స్వస్థతని కోల్పోతున్నాను.

ఎవరూ అడక్కుండానే మేఘాలు ఆకాశంలో వర్షాన్ని వర్షిస్తాయి. అలాగే ఈ చెట్లు కూడా పుష్పాలని వర్షిస్తున్నాయి. ఇవి చెట్లా, లేకపోతె పుష్పాలని వర్షించే మేఘాల? అని నాకు అనుమానం వస్తుంది. ఈ ప్రాంతం అంతా పుష్పములతో నిండిపోయి ఉంది.

మత్త కోకిల సన్నాదైః నర్తయన్ ఇవ పాదపాన్ |
శైల కందర నిష్క్రాంతః ప్రగీత ఇవ చ అనిలః ||

ఇక్కడ గాలి ఒక విచిత్రమైన ధ్వని చేస్తూ చెట్లని కదుపుతూ వీస్తుంది, అలాగే ఇక్కడ కోకిల పాట పాడుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, వాయువు పాట పాడుతున్నాడు, చెట్లన్నీ నాట్యం చేస్తున్నాయి, కోకిల చెట్టు మీద కూర్చొని పక్కవాయిద్యాలు కూస్తుంది. నేను ఏదన్నా నృత్య కార్యక్రమానికి వచ్చానా? అనిపిస్తుంది. ఈ సమయంలో సీత నా పక్కన ఉంటె ఎంత బావుండేదో. సీత పక్కన లేకపోవడం వలన నేను ప్రాణములతో ఉండలేనేమో అనిపిస్తుంది.

లక్ష్మణా! అలా చూడు, ఆ కొండ మీద మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంటే, ఆడ నెమలి దాని చుట్టూ పరమ సంతోషంగా ఎలా తిరుగుతుందో చూడు. అవునులే, ఎందుకు ఆడవు. ఆ మగ నెమలి భార్య అయిన ఆడ నెమలిని, ఎవరూ ఎత్తుకుపోలేదు కదా? ఎన్ని ఆటలన్నా ఆడతాయి. నా మనస్సు సీత దెగ్గర ఉంటుంది, సీత మనస్సు నా దెగ్గర ఉంటుంది. అందుకని మా ఇద్దరికీ ఉన్నది ఒకటే మనస్సు. ఆ ఒక్క మనస్సు ఆనందించాలంటే, ఒకరి పక్కన ఒకరం ఉండాలి. అలా లేకపోవడం చేత ఇవ్వాళ నా మనస్సు ఆనందపడడం లేదు. ఇది చైత్ర మాసం కనుక సీత కూడా ఇలాంటి దృశ్యాలనే చూస్తూ ఉంటుంది. మగవాడిని నేనే ఇంత బాధ పడుతున్నానంటే, సీత ఇంకెంత బాధ పడుతుందో లక్ష్మణా.

పూర్వం చైత్ర మాసంలో ఇటువంటి గాలి వీస్తుంటే నేను ఎంతో సంతోషించేవాడిని, ఇవ్వాళ అదే గాలి వీస్తుంటే నాకు దుఃఖంగా ఉంది. ఈ అరవిసిరిన తామర పువ్వులని దెగ్గరగా చూస్తుంటే, ఆ పువ్వులలోని గాలి నా ముఖానికి తగులుతుంటే ఎలా ఉందో తెలుసా లక్ష్మణా, సీత ముఖం నా ముఖానికి దెగ్గరగా ఉన్నప్పుడు, సీత ముక్కునుండి విడిచిపెట్టిన నిశ్వాస వాయువు నా బుగ్గలకి తగిలిన అనుభూతి కలుగుతుంది. అక్కడ ఆ తుమ్మెదలు పువ్వుల మీద వాలి, అందులోని మకరందాన్ని తాగి ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు, ఎంత అందంగా ఉంది ఆ సన్నివేశం. కాని నా మనసుకి ఎందుకనో ఆనందం కలగడం లేదు. ఇలాంటప్పుడు సీత నా పక్కన ఉండి, అప్పుడప్పుడు హాస్యం ఆడుతూ, అప్పుడప్పుడు హితమైన మాటలు మాట్లాడుతూ ఉంటె, ఆమె నోటి వెంట వచ్చే ఆ మధురమైన మాటలతో కూడిన ఈ సన్నివేశాన్ని చూస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది.

సీతని చూడకుండా నేను ఉండలేను, నా శరీరం పడిపోతుంది, అందుకని నువ్వు అయోధ్యకి వెళ్ళి భరతుడిని పట్టాభిషేకం చేసేసుకోమను " అని రాముడు అన్నాడు.

ఉత్సాహో బలవాన్ ఆర్య నాస్తి ఉత్సాహాత్ పరం బలం |
సః ఉత్సాహస్య హి లోకేషు న కించిత్ అపి దుర్లభం ||

అప్పుడు లక్ష్మణుడు " అన్నయ్యా! స్నేహము, ప్రేమ ఉండవలసిందే. కాని, మరీ ఇంత పిచ్చి ప్రేమ అయితే భరించడం కష్టం. నువ్వు గుర్తుపెట్టుకో అన్నయ్యా, నీకు ఇంత దుఃఖానికి కారణమైన రావణాసురుడు స్వర్గలోకానికే వెళ్ళని, పాతాళలోకానికే వెళ్ళి దాక్కొనని, మళ్ళి తన తల్లి కడుపులోకి దూరిపోనీ, వాడిని మాత్రం వదలను, చంపితీరుతాను. నువ్వు ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు. దుఃఖం పొందితే ఉత్సాహం నశిస్తుంది. ఉత్సాహం ఉంటె ప్రపంచంలో సాధించలేనిది అన్నది ఏది లేదు. కాని ఉత్సాహం పోతే, తనలో ఎంత శక్తి ఉన్నా అదంతా భయం చేత, దుఃఖం చేత పనికిరాకుండా పోతుంది. అందుకని అన్నయ్యా ఉత్సాహాన్ని పొందు " అని అన్నాడు.

లక్ష్మణుడి మాటలకి రాముడు సంతోషపడినవాడై ఉపశాంతిని పొందాడు. అప్పుడా రామలక్ష్మణులు ఇద్దరూ ఋష్యమూక పర్వతం వైపునకు బయలుదేరారు.

అలా వస్తున్న రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరముల మీద నుండి సుగ్రీవుడు చూసి భయంతో గడ్డ కట్టుకుపోయాడు. నార చీరలు కట్టుకొని, కోదండాలు పట్టుకుని, అరణ్యంలోని చెట్ల వైపు చూస్తూ వస్తున్న రామలక్ష్మణులని చూసి, వాలి తనని చంపడానికని వీళ్ళని పంపాడేమోనని సుగ్రీవుడు భయపడి తన 4 వానర మంత్రుల దెగ్గరికి వెళ్ళి " చూశార, ఎవరో ఇద్దరు నార చీరలు కట్టుకున్న వీరులు వచ్చేస్తున్నారు. వాళ్ళు నన్ను చంపడానికే వస్తున్నారు. రండి పారిపోదాము " అని ఆ నలుగురు వానరములతో కలిసి ఒక శిఖరం మీదనుండి మరొక శిఖరం మీదకి దూకాడు. వాళ్ళు వచ్చేస్తున్నారేమో అన్న భయంతో అలా ఒక్కో శిఖరాన్ని దాటాడు. వాళ్ళు అలా గెంతుతుంటే, చెట్లు విరిగిపోయాయి, ఏనుగులు, పులులు దిక్కులు పట్టి పారిపోయాయి. అలా కొంతసేపు గెంతి గెంతి, తన మంత్రులతో కలిసి ఒక చోట కూర్చున్నాడు. ( సుగ్రీవుడి మంత్రులలో హనుమంతుడు ఒకడు ).

సంభ్రమః త్యజతాం ఏష సర్వైః వాలి కృతే మహాన్ |
మలయోఽయం గిరివరో భయం న ఇహ అస్తి వాలినః ||

అప్పుడు వాక్య కోవిదుడైన హనుమంతుడు సుగ్రీవుడితో " సుగ్రీవా! ఎందుకయ్యా ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు, ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు. నీకు కనపడినవాడు వాలి కాదు, మరి ఎందుకీ గెంతులు. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఏమిటయ్యా ఈ చపలత్వం. నడక చేత, అవయవముల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్ధత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదివి ఎలా నిర్వహిస్తావు సుగ్రీవా " అని అడిగాడు.

అప్పుడు సుగ్రీవుడు " హనుమా! నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా. రాజులైనవారు చాలా రహస్యంగ ప్రవర్తిస్తారు. వాలికి నేను శత్రువుని కనుక, నన్ను రాజ్యం నుండి బయటకి పంపాడు కనుక, తాను ఈ కొండమీదకి రాలేడు కనుక, నన్ను సంహరించడం కోసమని తనతో సమానమైన, బలవంతులైన ఇద్దరు క్షత్రియులని ముని కుమారులలా ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వాళ్ళు నిర్భయంగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. వాళ్ళ చేతుల్లో కొదండాలు ఉన్నాయి, అందుకని నేను భయపడుతున్నాను. అంతగా చెబుతున్నావు కాబట్టి, హనుమా! నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొందు. ఆ రూపంతో ఆ ఇద్దరి దెగ్గరికి వెళ్ళు, నా వైపుకి తిరిగి మాట్లాడు. వాళ్ళు నాయందు ప్రేమతో వస్తున్నారా, శత్రుత్వంతో వస్తున్నారా అన్న విషయాన్ని బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్నవారైతే వాళ్ళని తీసుకురా, లేకపోతె మనం వేరె మార్గాన్ని ఆలోచిద్దాము. అందుకని నువ్వు తొందరగా వెళ్ళు " అని సుగ్రీవుడు అన్నాడు.

కపి రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః |
భిక్షు రూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః ||

అప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని విడిచిపెట్టి, భిక్షు రూపాన్ని( సన్యాసి రూపాన్ని) పొంది, శఠ బుద్ధితో బయలుదేరి రాముడి దెగ్గరికి వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దెగ్గరికి వెళ్ళి నమస్కరించి " మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు రాజర్షుల లాగ, తాపసుల లాగ ఉన్నారు. విశేషమైన కాంతితో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే, మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి ఇక్కడున్న సర్వ భూతములు భయపడుతున్నాయి. మీ యొక్క కాంతి చేత ఇక్కడున్న నదులలోని జలములు శోభిస్తున్నాయి. మీరు నడుస్తుంటే, సింహాలు నడుస్తున్నాయా? అన్నట్టుగా ఉంది. సింహాల యొక్క బలాన్ని అధిగమించిన స్వరూపంతో ఉన్నారు. మీ చేతులలో కొదండాలు, బాణాలు ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగిన పరాక్రమము చేత విరాజిల్లుతున్న వారిలా కనపడుతున్నారు. ఠీవిగా నడిచే ఎద్దుల్లా నడుస్తున్నారు. నడుస్తున్న పర్వతాల్లా ఉన్నారు. పద్మములవంటి కన్నులతో ఉన్నారు, జటామండలాలు కట్టుకొని ఉన్నారు. ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. మీరు సూర్య-చంద్రుల్లా ఉన్నారు, విశాలమైన వక్షస్థలంతో ఉన్నారు. మనుష్యరూపంలో ఉన్న దేవతల్లా ఉన్నారు. పెద్ద భుజాలతో ఉన్నారు. మీ బాహువుల చేత ఈ సమస్త పృధ్వీ మండలాన్ని రక్షించగలిగిన వారిలా కనపడుతున్నారు. అటువంటి మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు. దీనికి కారణం ఏమిటి. మీ మొలలకి చాలా పెద్ద కత్తులు కట్టి ఉన్నాయి. ఆ కత్తుల్ని చూస్తే భయం వేస్తుంది.

నేను సుగ్రీవుడి యొక్క సచివుడిని, నన్ను హనుమ అంటారు. అన్నగారైన వాలి చేత తరమబడినటువంటి మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద నలుగురు మంత్రులతో కలిసి ఉంటున్నాడు. ఆయన ధర్మాత్ముడు, మీతో స్నేహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుకని మీరు మా ప్రభువుతో ఎందుకు స్నేహం చెయ్యకూడదు! నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడడంలేదు. మీరు మాట్లాడితే వినాలని ఉంది. మీరు మాట్లాడండి " అని చెప్పి హనుమ నిలబడిపోయాడు.

రాముడిని చూడగానే సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు ఆ సన్యాసి రూపాన్ని విడిచిపెట్టేసి తన నిజ స్వరూపానికి వచ్చేశాడు. ఎందుకంటే, ఆయనకి రాముడు శ్రీ మహా విష్ణువుగా దర్శనమిచ్చారు.

అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు " చూశావ లక్ష్మణ, హనుమ ఎలా మాట్లాడాడో. ఆయన మాటలు విన్నావ. ఇలాగ మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు! ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే, కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఒరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనికి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడంలేదు, లలాటము కదలడం లేదు. వాక్యము లోపలినుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నటు లేదు, గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దెగ్గరి నుంచి చివరి వరకూ ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నారు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి, మన దెగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు కనుక, మనం అనుకున్నటువంటి కోరిక సిద్ధించినట్లే. మనం ఎవరిమో, ఈ అరణ్యానికి ఎందుకు వచ్చామో హనుమకి చెప్పు లక్ష్మణా " అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు " అయ్యా హనుమా! ఈయన దశరథుడి కుమారుడైన రాముడు. ఆ దశరథుడు పరమ ధర్మాత్ముడై రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఉన్నప్పుడు ఎవరూ ఆయనని ద్వేషించలేదు, ఆయనా ఎవరినీ ద్వేషించలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎలా అయితే అందరి చేత గౌరవింపబడతారో, అలా దశరథుడు లోకులందరి చేత గౌరవింపబడినవాడు. అటువంటి తండ్రి మాటకి కట్టుబడి రాముడు అరణ్యానికి వచ్చాడు. అప్పుడు ఎవరో ఒక రాక్షసుడు రాముడి భార్య అయిన సీతమ్మని అపహరించాడు. సీతమ్మని వెతికే ప్రయత్నంలో ఉండగా, మాకు కబంధుడనే రాక్షసుడు కనపడ్డాడు. ఆయనని సంహరించి, శరీరాన్ని దహిస్తే, ఆయన మళ్ళి ధనువు అనే శరీరాన్ని పొంది మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని చెప్పాడు. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. నేను లక్ష్మణుడిని, రాముడి తమ్ముడు అని లోకం అంటుంది, కాని రాముడి గుణములచేత తృప్తి పొందినవాడనై, ఆ గుణములచేత విశేషమైన ఆనందమును పొందినవాడనై రాముడికి దాసుడిని అనుకుంటాను. లోకంలో కష్టంలో ఉన్నవారందరూ రాముడికి శరణాగతి చేశారు, అటువంటి రాముడు ఈనాడు సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. అందుకని మేము సుగ్రీవుడిని మిత్రుడిగా పొందాలని అనుకుంటున్నాము " అన్నాడు.

ఈదృశా బుద్ధి సంపన్నా జితక్రోధా జితేఇంద్రియాః |
ద్రష్టవ్యా వానరేఇంద్రేణ దిష్ట్యా దర్శనం ఆగతాః ||

అప్పుడు హనుమంతుడు " జితేంద్రియులై, ధర్మాత్ములైన రామలక్ష్మణులని చూడడం మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. రండయ్యా మిమ్మల్ని తీసుకెళతాను " అని చెప్పి, రామలక్ష్మణులనిద్దరిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి ఎక్కాడు.

అలా రామలక్ష్మణులని సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చేటప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని వదిలి భిక్షు రూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో

అయం రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢ విక్రమః |
లక్ష్మణేన సహ భ్రాత్రా రామోయం సత్య విక్రమః ||

" సుగ్రీవా! వచ్చినటువంటివాడు మహా ప్రాజ్ఞుడైన, ధృడమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు తప్ప, ధర్మబధమైన నడువడిలేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఈయన తన భార్య అయిన సీతమ్మతో, లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే, ఆయన భార్యని ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. అందుకని ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు, నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని సుగ్రీవా, ఈయనతో స్నేహం చెయ్యవలసింది " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు " రామ! మీ దెగ్గర గొప్ప తపస్సు ఉంది, అనేకమైన గుణములు, విశేషమైన ప్రేమ ఉంది. ఇన్ని గుణములు కలిగిన వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ఈ ప్రపంచంలో దేనినైన పొందవచ్చు. అందుచేత ఇది నాకు దేవతలు ఇచ్చిన వరము అని అనుకుంటున్నాను. రామ! నీకు తెలియని విషయం కాదు, స్నేహం చేసేటటువంటివాడికి ఒక ధర్మం ఉంది. భర్త ఎలాగైతే తన కుడి చేతిని భార్య కుడి చేతితో బాగా రాశి పట్టుకుంటాడో, అలా స్నేహం చేసేవాళ్ళు కూడా పట్టుకోవాలి. అందుకని నువ్వు నాతో స్నేహమును ఇచ్చగించిన వాడివైతే, నా బాహువుని చాపుతున్నాను, నీ బాహువుని నా బాహువుతో కలుపు " అన్నాడు.

వెంటనే హనుమంతుడు తన సన్యాసి రూపాన్ని విడిచిపెట్టి కపి రూపానికి వచ్చేసి గబగబా వెళ్ళి నాలుగు ఎండిపోయిన కట్టెలని తెచ్చి, కర్రతో కర్రని రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించాడు. అప్పుడు రాముడు, సుగ్రీవుడు ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి, ఇద్దరూ తమ చేతులు కలుపుకున్నారు.

అప్పుడు రాముడు " మనిద్దరమూ స్నేహం చేసుకున్నాము కదా, ఇకనుంచి ఇద్దరి కష్టసుఖాలు ఇద్దరివీ " అన్నాడు.

సుగ్రీవుడు వెంటనే వెళ్ళి పుష్పించి ఉన్న పెద్ద సాలవృక్షము కొమ్మని విరిచి రాముడికి ఆసనంగా వేసి కుర్చోమన్నాడు. అలాగే హనుమంతుడు ఒక గంధపు చెట్టు కొమ్మని తీసుకొచ్చి లక్ష్మణుడిని కుర్చోమన్నాడు. రామలక్ష్మణులిద్దరు  కూర్చున్న తరువాత సుగ్రీవుడు " రామ! నన్ను నా అన్నగారైన వాలి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేనివాడినై ఈ కొండమీద మీద జీవితాన్ని గడుపుతున్నాను " అన్నాడు.

ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే |
వాలినం తం వధిష్యామి తవ భార్య అపహారిణం ||

అప్పుడు రాముడు " ఉపకారము చేసినవాడు స్నేహితుడు కాబట్టి, నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి, నేను నీ స్నేహితుడిని కాబట్టి నీకు ఉపకారము చెయ్యాలి. నువ్వు బతికి ఉండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు వాలి, ఈ ఒక్కమాట చాలు ధర్మం తప్పిన వాలిని చంపడానికి. అందుకని వాలిని చంపేస్తాను " అన్నాడు.

ఈ మాటలు విన్న సుగ్రీవుడు, సుగ్రీవుడి మంత్రులు పొంగిపోయారు. ఒకరిని ఒకరు చూపులతో తాగుతున్నార! అన్నట్టుగా చూసుకున్నారు. అలా రాముడు, సుగ్రీవుడు ఒకళ్ళ చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని సంతోషంగా మాట్లాడుతుంటే, ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి. పద్మంలాంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను, బంగారంలాంటి పచ్చటి కన్నులున్న వాలి ఎడమ కన్ను, ఎర్రటి కన్నులున్న రావణాసురుడి ఎడమ కన్ను అదిరాయి.

తరువాత సుగ్రీవుడు " కనపడకుండా పోయిన వేదాన్ని మళ్ళి తీసుకొచ్చి ఇచ్చినట్టు, నీకు నేను సీతమ్మని తీసుకొచ్చి ఇస్తాను. సీతమ్మని పాతాళలోకంలో కాని, స్వర్గలోకంలో కాని దాయని, నేను సీతమ్మని వెతికి తీసుకొస్తాను " అన్నాడు.

సుగ్రీవుడి మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తుకువచ్చి భోరున రోదించాడు.

అప్పుడు సుగ్రీవుడు " రామ శోకించకు. నీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెబుతాను. ఒకనాడు నేను ఈ పర్వత శిఖరాల మీద మంత్రులతో కలిసి కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆకాశంలో ఎర్రటి నేత్రములు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రములు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు. అప్పుడు ఆ తల్లి తన చీర కొంగుని చింపి, అందులో తన ఆభరణములను కొన్నిటిని మూటకట్టి పైనుండి కిందకి జారవిడిచింది. బహుశా ఆ స్త్రీ సీతమ్మ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఆ ఆభరణములు తీసుకొస్తాను, అవి సీతమ్మ ఆభారణాలేమో చూడు " అన్నాడు.

కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణాలని తీసుకొచ్చాడు. ఆ ఆభరణాలని చూసేసరికి, ఒక్కసారి శోకం తన్నుకొచ్చినవాడై రాముడు మూర్ఛపోయి నేలమీద పడిపోయాడు. తరువాత ఆయన తేరుకొని ఆ ఆభరణాలని చూద్దాము అంటె కళ్ళనిండా నీరు ఉండడం చేత, ఎన్నిసార్లు తుడుచుకున్నా ఆ కన్నీరు ఆగడంలేదు కనుక ఆయన లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! ఈ ఆభారణాలని ఒక్కసారి చూడు. ఇవి విరిగిపోయి ముక్కలు అవ్వలేదు, సీత ఈ ఆభరణాలని విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడిఉంటాయి. నువ్వు వీటిని ఒకసారి చూడు " అన్నాడు.

న అహం జానామి కేయూరే న అహం జానామి కుండలే |
నూపురే తు అభిజనామి నిత్యం పాద అభివందనాత్ ||

అప్పుడు లక్ష్మణుడు " అన్నయ్యా! ఈ కేయూరాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలీదు, ఈ కుండలాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలీదు. అన్నయ్యా! ఈ నూపురాలు మాత్రం వదినవే. నేను ప్రతిరోజు వదిన కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని, అప్పుడు ఈ నూపురాలని వదిన పాదాలకి చూశాను " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడి రాముడితో " అయ్యయ్యో, అలా ఏడవకు రామ. నేను కూడా నీలాగే కష్టపడుతున్నాను. నువ్వే ఆలోచించు, నేను నీలా ఏడుస్తున్నాన? నీలాగే నా భార్య కూడా అపహరింపబడింది. నీకు చెప్పగలిగేంత సమర్దుడిని కాదు, కాని ఒక్కసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహ లక్షణంతో చెప్పాను. నీ యొక్క దుఃఖాన్ని ఉపశమింప చేసుకో, నాయందు ఉన్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో " అన్నాడు.

వెంటనే రాముడు స్వస్థతని పొంది " ఉత్తమమైన మిత్రుడు ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాట చెప్పావయ్య సుగ్రీవా. కాని నాకు ఒక విషయం చెప్పు. ఈ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు, నేను వెంటనే వెళ్ళి రాక్షస సంహారం చేస్తాను " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు " నేను సత్యం చెబుతున్నాను, నా మాట నమ్ము. నీ భార్యని తీసుకొచ్చే పూచి నాది. కాని నీ భార్యని అపహరించిన రాక్షసుడి పేరు నాకు తెలీదు. ఎక్కడుంటాడో నాకు తెలీదు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు, ముందు నా కార్యానికి సహాయం చెయ్యి " అన్నాడు.

అప్పుడు రాముడు " ఆ వాలి ఎక్కడ ఉంటాడో చెప్పు, నేను వెంటనే సంహరిస్తాను. ఇంతకముందెన్నడు నేను అసత్యం పలకలేదు, ఇక ముందు కూడా అసత్యం పలకను. నీకు మాట ఇచ్చిన ప్రకారం వాలిని సంహరిస్తాను " అన్నాడు.

ఈ మాటలు విన్న సుగ్రీవుడు " నువ్వు ఇంత మాట అన్నావు, నాకు ఇంకేమి కావాలి. నీలాంటి స్నేహితుడు లభిస్తే స్వర్గలోకమే లభిస్తుంది, ఇక వానర రాజ్యం లభించడం గొప్ప విషయమా " అన్నాడు.

అప్పుడు రాముడు " అసలు ఏమి జెరిగిందో నాకు చెప్పు, నువ్వు ఈ కొండ మీద బతకవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది. నాకు అన్నీ వివరంగా చెప్పు " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు జెరిగిన కథని సంగ్రహంగా రాముడికి వివరించాడు. సుగ్రీవుడు చెప్పిన కథ విన్న రాముడు " అసలు నీకు, నీ అన్న అయిన వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది. నువ్వు నాకు ఆ విషయాన్ని పూర్తిగా చెపితే, నేను మీ ఇద్దరి బలాబలాలని అంచనా వేస్తాను. అప్పుడు మనం వెంటనే వెళ్ళవచ్చు " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు అసలు కథని వివరంగా ఇలా చెప్పాడు " రామ! ఒకానొకప్పుడు మా తండ్రి అయిన ఋక్షరజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఋక్షరజస్సుకి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి ఔరసపుత్రుడిగా జన్మించాడు, సూర్యుడి అనుగ్రహంగా నేను ఔరసపుత్రుడిగా జన్మించాను. పెద్ద కుమారుడైన వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలాకాలం వాలిని ప్రీతితో అనుగమించాను. కొంతకాలానికి ఋక్షరజస్సు శరీరాన్ని విడిచిపెట్టాక, పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం చేశారు. నేను వాలియందు వినయవిధేయలతో, భయభక్తులతో ఉండేవాడిని.

దుందుభి అనే రాక్షసుడి అన్న అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు మాయావి. ఆ మాయవికి, వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కిందా ద్వారం దెగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి ' వాలి బయటకి రా, మనిద్దరమూ యుద్ధం చేద్దాము. ఈరోజుతో నిన్ను సంహరిస్తాను ' అన్నాడు. అప్పటివరకూ తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకి వచ్చాడు. అప్పుడు నేను కూడా బయటకి వచ్చాను. ఆ మాయావి మా ఇద్దరినీ చూసి భయపడి పారిపోయాడు. అక్కడున్న స్త్రీలు ' ఎలాగు వాడు పారిపోతున్నాడు కాదా, ఇంక విడిచిపెట్టు ' అన్నారు. కాని, శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు. అప్పుడు నేను కూడా వాలి వెనకాల వెళ్ళాను.

పరిగెత్తి పరిగెత్తి, తృణముల చేత కప్పబడిన ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను, వాలి నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో ' సుగ్రీవా! నువ్వు ఈ బిల ద్వారం దెగ్గర కాపలాగా ఉండు, నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి నా పాదముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు ' అని చెప్పి వాలి గుహలోపలికి వెళ్ళాడు.

వాలి లోపలికి వెళ్ళి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. అలా చాలాకాలం తరువాత లోపలినుండి రాక్షసుల కేకలు వినపడ్డాయి. ఆ ద్వారం దెగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకి వచ్చింది. ఎక్కడా వాలి మాట కాని, వాలి అలికిడి కాని వినపడలేదు. బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారు అనుకొని, ఈ రాక్షసులు బయటకి వస్తే ప్రమాదము అని, నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టాను. అప్పుడు నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదకక్రియ నిర్వహించి తర్పణలు విడిచిపెట్టాను.

తరువాత నేను రాజ్యానికి వచ్చి, ఎవ్వరికీ తెలియకుండా శాస్త్రం ప్రకారం వాలికి చేయవలసిన కార్యములను చేశాను. నేను అంత జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా చేసినప్పటికీ, మంత్రులు విషయాన్ని కనిపెట్టి, రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు కనుక నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను.

ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగివచ్చాడు. అప్పుడాయన ఎర్రనైన కళ్ళతో నావంక చూశాడు. నా మంత్రులని, స్నేహితులని బంధించి కారాగారంలో వేశాడు. ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కనుక, నాకున్న బలం చేత, నేను వాలి బంధించి కారాగారంలో పెట్టగలను, కాని నేను అలా చెయ్యలేదు. ఆయన నాకు అన్నగారు, ఆయనని నేను గౌరవించాలి అందుకని నేను ఆయనని నిగ్రహించలేదు.

దిష్ట్యా అసి కుశలీ ప్రాప్తో నిహతః చ త్వయా రిపుః |
అనాథస్య హి మే నాథః త్వం ఏకో అనాథ నందనః ||

అప్పుడు నేను ఆయన దెగ్గరికి వెళ్ళి నా రెండు చేతులని జోడించి, శిరస్సు వంచి ' అన్నయ్యా! నువ్వు లేక నేను అనాథనయ్యాను. నువ్వు తిరిగి రావడం వలన ఇవ్వాళ నేను నాథుడున్న వాడిని అయ్యాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నయ్యా! నూరు తీగలున్న ఈ తెల్లటి ఛత్రాన్ని నీ శిరస్సుకి పెడతాను, నీకు చామరం వేస్తాను. నువ్వు మళ్ళి సింహాసనం మీద కూర్చొని పూర్వం ఎలా పరిపాలించేవాడివో అలా పరిపాలించు. నేనెప్పుడూ పట్టాభిషేకం చేసుకుందామని అనుకోలేదు. బలవంతంగా మంత్రులు, పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు. నేను నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను, ఎప్పటికీ నువ్వే వానర రాజ్యానికి రాజువి. అందుకని రాజ్యాన్ని స్వీకరించు ' అన్నాను.

అప్పుడు వాలి ' చి ఛి, పరమ దుష్టుడా నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు. నువ్వు పరమ దుర్మార్గుడివి ' అన్నాడు. మరునాడు జానపదులను, మంత్రులను, ఇతరమైన వానరములను పిలిచి ఒక పెద్ద సభ తీర్చాడు. అప్పుడు నేను వాలి పక్కన నిలబడ్డాను. అప్పుడాయన నన్ను చూసి ' నేను దురాత్ముడైన మాయవిని చంపడం కోసమని ఒక రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఈ మహాపాపి అయిన నా తమ్ముడు నన్ను అనుగమించి వచ్చాడు. నేను రాక్షసులని చంపి వెనక్కి వస్తాను, నువ్వు బిల ద్వారం దెగ్గర కాపలాగా ఉండు అన్నాను. కాని పాపపు ఆలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగానే శిలా ద్వారాన్ని అడ్డు పెట్టాడు. నేను లోపల మరణిస్తాను అని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. కాని నేను లోపలికి వెళ్ళాక మాయావి నాకు కనపడలేదు. ఒక సంవత్సర కాలం వెతికాక ఆ మాయావి తన బంధువులతో, స్నేహితులతో కనపడ్డాడు. నేను వాళ్ళందరినీ సంహరించాను. ఆ గుహ అంతా నెత్తురుతో నిండిపోయింది. నేను బయటకి వద్దాము అనుకున్నాను, కాని వీడు శిలని అడ్డుపెట్టాడు. నేను ఎంతో కష్టంతో ఆ శిలని పక్కకి తోసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు. వీడిని ఎట్టి పరిస్థితులలోను ఆదరించకూడదు. రాజ్యం కోసమని అన్నని హత్య చెయ్యాలని ప్రయత్నం చేసినవాడు ' అన్నడు.

అప్పుడు వాలి నన్ను కట్టుబట్టతో బయటకి తరిమేశాడు. అప్పుడు నేను భయపడుతూ బయటకి వచ్చాను. కాని వాలి నన్ను వదిలిపెట్టకుండా చంపుతాను అని ఈ భూమండలం అంతా తరిమాడు. నేను ఈ భూమండలం అంతా పరిగెత్తాను. ఈ కొండమీదకి వాలి రాలేడు కనుక, చిట్టచివరికి నేను ఈ కొండ మీద కూర్చున్నాను. నాకు అత్యంత ప్రియమైన భార్య అయిన రుమని, నేను బ్రతికి ఉండగా వాలి తన భార్యగా అనుభవిస్తున్నాడు. నేను చెయ్యని పాపానికి నన్ను కట్టుబట్టలతో బయటకి తోసేశాడు. నేను ఎంత చెప్పినా వినలేదు, పైగా నా భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను రామ............." అని సుగ్రీవుడు ఏడిచాడు.

ఈ మాటలు విన్న రాముడు " గ్రద్దల యొక్క ఈకలు కట్టినటువంటి, ఒంపులు లేనటువంటి బంగారు బాణములు నా అమ్ములపొదిలో ఉన్నాయి. నడువడి తెలియక పాపాత్ముడైన వాలి ఎంతకాలం నా కంటికి కనపడడో, అంతకాలమే బతికి ఉంటాడు. వాలి నాకు కనపడగానే మరణిస్తాడు. నువ్వు బెంగ పెట్టుకోకు, వాలిని ఇప్పుడే సంహరిస్తాను. వాలి ఎక్కడ ఉంటాడో నాకు చూపించు " అన్నాడు.

సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాద్ అపి చ ఉత్తరం |
క్రామతి అనుదితే సూర్యే వాలీ వ్యపగత క్లమః ||

అప్పుడు సుగ్రీవుడు " రామ తొందరపడకు, నీకు ఒక విషయం చెబుతాను విను. సూర్యోదయానికి ముందరే వాలి నిద్రలేస్తాడు. అప్పుడు తన అంతఃపురం నుంచి ఒక్కసారి ఎగిరి తూర్పు సముద్రతీరం దెగ్గర దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో పశ్చిమ సముద్రతీరం దెగ్గర దిగుతాడు. మళ్ళి అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో ఉత్తర సముద్రతీరం దెగ్గర దిగుతాడు. మళ్ళి అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో దక్షిణ దిక్కుకి దూకుతాడు. ఇలా నాలుగు సముద్రాల దెగ్గర సూర్యుడు ఉదయించేలోపు సంధ్యావందనం చేస్తాడు. దానితో పాటు నీకు ఇంకొక విషయం చెబుతాను రామ " అని రాముడిని తీసుకువెళ్ళి ఒక పర్వతాన్ని చూపించి, " చూశావ ఈ పర్వతాలు. వాటికి ఎంత పెద్ద శిఖరాలు ఉన్నాయో చూశావ. వాలి సంధ్యావందనం చేశాక ఇంటికి వెళ్ళి కొన్ని పాలు తాగి మళ్ళి ఈ అరణ్యానికి వస్తాడు. ఇక్కడ ఉన్న ఈ పర్వత శిఖరాలని ఊపి విరగ్గొడతాడు. అప్పుడు వాటిని గాలిలోకి విసిరి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు " అని చెప్పి, రాముడిని మరొక్క ప్రదేశానికి తీసుకువెళ్ళి,

" పూర్వం దుందుభి అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత ఒకరోజు సముద్రుడి దెగ్గరికి వెళ్ళి తనతో యుద్ధం చెయ్యమన్నాడు. నీతో నాకు యుద్ధం ఏమిటి, నీ బలం ఎక్కడ నా బలం ఎక్కడ. నేను నీతో యుద్ధ చెయ్యలేను అని సముద్రుడు అన్నాడు. అప్పుడా దుందుభి ' నువ్వు నాతో యుద్ధం చెయ్యలేనంటె నేను నిన్ను వదలను, నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడిని నాకు చూపించు ' అన్నాడు. అప్పుడా సముద్రుడు ' హిమవంతుడని ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉంది, అది మంచు పర్వతం. ఆయన కూతురు పార్వతీ దేవి, ఆ పార్వతీ దేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యాలు, గుహలు ఉన్నాయి. నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చెయ్యి ' అన్నాడు.

అప్పుడా దుందుభి హిమవంత పర్వతం దెగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలని పీకేసి ముక్కలు చేస్తున్నాడు. దుందుభి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చాడు. అప్పుడా దుందుభి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు, నాకు ఎవరితోనూ యుద్ధం చెయ్యాలని లేదు, నేను యుద్ధం చెయ్యను అని హిమవంతుడు అన్నాడు. అప్పుడా దుందుభి ' నువ్వు కూడా ఇలాగంటే ఎలా. సముద్రుడు కూడా నీలాగే యుద్ధం చెయ్యనన్నాడు. పోనీ నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు ' అన్నాడు. అప్పుడు హిమవంతుడు ' నీ ఒంటి తీట తీర్చగలిగినవాడు ఒకడున్నాడు. కిష్కిందా రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు. మంచి బలవంతుడు. ఆయన నీతో యుద్ధం చేస్తాడు ' అని చెప్పాడు.

అప్పుడా దుందుభి సంతోషంగా కిష్కిందకి వెళ్ళి, అక్కడున్న చెట్లని విరిచి, ఆ కిష్కింద ద్వారాన్ని పగులగొట్టి పెద్ద అల్లరి చేశాడు. భార్యలతో కామమోహితుడై రమిస్తున్న వాలి ఈ అల్లరికి బయటకి వచ్చాడు. ఆ దుందుభి వాలిని చూసి ' ఛి, భార్యలతో కామం అనుభవిస్తున్నావా. నా కోపాన్ని రేపటిదాకా ఆపుకుంటాను. పో, నీ భార్యలతో కామం అనుభవించు. నువ్వు ఈ రాత్రి నీ భార్యలతో హాయిగా భోగం అనుభవించు, నీకు స్నేహితులైన వారిని పిలిచి వారికి కానుకలు ఇవ్వు, నీతో సమానమైన వాడికి పట్టాభిషేకం చేసెయ్యి. తాగి ఉన్నవాడిని, కామం అనుభవిస్తున్న వాడిని, అప్రమత్తంగా లేనివాడిని, యుద్ధం నుంచి పారిపోతున్నవాడిని, ఆయుధం లేనివాడిని చంపితే పసిపిల్లాడిని చంపిన పాపం వస్తుంది, అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను. ఎలాగోలా ఈ రాత్రికి ఇక్కడ కూర్చొని ఉంటాను. రేపు పొద్దున్న రా, నిన్ను చంపి అవతల పడేస్తాను ' అన్నాడు.

అప్పుడా వాలి ' నువ్వు నా గురించి అంతగా బెంగ పెట్టుకోమాకు. నేను తాగి ఉన్నా కూడా, అది వీరరసం తాగినవాడితో సమానం, రా యుద్ధానికి ' అని, అడ్డువచ్చిన భార్యలని పక్కకు తోసేసి దుందుభి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఇచ్చిన మాలని వాలి తన మెడలో వేసుకుని దుందుభి తల మీద ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి దుందుభి ముక్కు నుండి, చెవుల నుండి నెత్తురు కారి కిందపడిపోయాడు. ఆ హొరాహొరి యుద్ధంలో వాలి దుందుభిని సంహరించాడు. అప్పుడాయన ఆ దుందుభి శరీరాన్ని గిరగిర తిప్పుతూ విసిరేశాడు. అప్పుడది గాలిలో యోజన దూరం ఎగురుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమం దెగ్గర పడింది. అలా పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురితో తడిసిపోయింది. అప్పుడా మతంగ మహర్షి బయటకి వచ్చి దివ్య దృష్టితో చూసి ' ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుభి కళేబరాన్ని ఇటు విసిరినవాడు, ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి వ్రక్కలయ్యి మరణిస్తాడు ' అని చెప్పి, ' ఇక్కడ మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాలికి సంబంధించినవాడు ఎవడైనా సరే ఇక్కడి చెట్లని పాడుచేస్తూ తిరిగితే, రేపటి తరువాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను. నేను శపించే లోపల మీ అంతట మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి ' అన్నాడు.

అప్పుడు అక్కడున్నటువంటి వానరాలు ఆ పర్వతాన్ని ఖాళీ చేసి వాలి దెగ్గరికి పారిపోయి మతంగ మహర్షి యొక్క శాపం గురించి వివరించారు. అందుకని వాలి ఈ పర్వతం వైపు కనీసం చూడను కూడా చూడడు. నేను బతకాలంటే ఈ బ్రహ్మాండంలో వాలి రాని ప్రదేశం ఇదే, అందుకని నేను ఇక్కడ ఉంటున్నాను. ఇంతకీ నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకోచ్చానో తెలుసా, అదిగో అక్కడ ఎదురుగుండా కనపడుతుందే పెద్ద తెల్లటి పర్వతంలాంటిది, అదే దుందుభి యొక్క కాయం. ఆ అస్థిపంజరం ఇప్పుడు పర్వతంలా అయిపోయింది " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు " రామ! నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు. మా వాలి పౌరుష పరాక్రమాలు అంటె ఏమిటో విన్నావు కదా. ఇది విన్న తరువాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా? చంపగలిగే ధైర్యం ఉందా? వాలి ఎన్నడూ ఎవరి చేత ఒడింపబడినవాడు కాదు, జీవితంలో ఓటమి అన్నది తెలీదు వాలికి. వాలి పేరు చెబితేనే పారిపోతారు. 15 సంవత్సరాలు రాత్రి-పగలు గోలభుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆయనకి సంహరించాడు. నీను ఇంకొక విషయం చూపిస్తాను, ఇక్కడ 7 సాల వృక్షములు వరుసగా ఉన్నాయి కదా. మా వాలి రోజూ సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాల వృక్షాన్ని చేతులతో కదుపుతాడు. ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మోడుగా నిలబడుతుంది. వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉందా రామ? " అన్నాడు.

సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి " మీ వాలి చాలా గొప్పవాడు అని చెబుతున్నావు కదా. వాలిని మా అన్నయ్య చంపగలడు, అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు " అని అడిగాడు.

అప్పుడా సుగ్రీవుడు " మా వాలి ఈ ఏడు చెట్లని కుదిపెయ్యగలడు. రాముడు పోని అంత చెయ్యక్కరలేదు, బాణం పెట్టి ఒక సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఆనాడు దుందుభి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళి పడింది. రాముడిని ఈ అస్థిపంజరాన్ని తన కాలితో తన్నమనండి, 200 ధనుస్సుల దూరం కాని రాముడు తంతే నేను నమ్ముతాను " అని లక్ష్మణుడితో అన్నాడు.

అప్పడు రాముడు " సరేనయ్యా అలాగే చేస్తాను. నీకు నమ్మకం కలిగించడం కోసం నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను " అన్నాడు.

రాఘవో దుందుభేః కాయం పాద అంగుష్ఠేన లీలయా |
తోలయిత్వా మహాబాహుః చిక్షేప దశ యోజనం ||

సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందుభి కళేబరాన్ని తన బొటను వేలితో తంతే అది 10 యోజనాల దూరం వెళ్ళి పడింది. అప్పుడు రాముడు సుగ్రీవుడి వంక నమ్మకం కుదిరిందా అన్నట్టు చూశాడు. కాని సుగ్రీవుడు " ఆనాడు వాలి ఈ కళేబరాన్ని విసిరినప్పుడు ఇది రక్తమాంసాలతో పచ్చిగా, చాలా బరువుగా ఉంది. అప్పటికే మా అన్నయ్య ఈ దుందుభితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు, దానికితోడు తాగి ఉన్నాడు, తన భార్యలతో రమిస్తూ బయటకి వచ్చాడు, కావున అనేకరకములుగా బడలిపోయిన శరీరంతో ఉన్నాడు. కాని రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, మద్యాన్ని సేవించి లేడు, పరీక్షకి నిలబడుతున్నాను అనే పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరం, అది ఒక యోజనం వెళ్ళి పడింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం, దానిని 10 యోజనాలు తన్నడంలో పెద్ద గొప్పేముంది. ఆ సాల వృక్షాన్ని కూడా కొట్టమను, అప్పుడు నాకు కొంత నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం వాలిని సంహరించడానికి వెళదాము " అన్నాడు.

అప్పుడు రాముడు ఒక బంగారు బాణాన్ని చేతితో పట్టుకొని, వింటినారికి సంధించి, గురి చూసి ఆ 7 సాల వృక్షముల వైపు విడిచిపెట్టాడు. కనురెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణం 7 సాల వృక్షాలనీ పడగొట్టేసి, ఎదురుగా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసి, భూమిలో పాతాళ లోకం వరకూ వెళ్ళి, మళ్ళి తిరిగొచ్చి రాముడి యొక్క అమ్ములపొదిలో కూర్చుండిపోయింది.

రాముడి శక్తి ఏమిటో చూశిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకి తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు. అప్పుడాయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది. అప్పుడా సుగ్రీవుడు " రామ! నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను, ఇంక వాలి ఏమిటి. నువ్వు బాణ ప్రయోగం చేస్తే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు, వాలి దెగ్గరికి వెళదాము పద " అన్నాడు.

"తప్పకుండా సుగ్రీవ, బయలుదేరదాము", అని అందరూ బయలుదేరారు. ముందు సుగ్రీవుడు వేగంగా వెళుతున్నాడు, ఆయన వెనకాల రామలక్ష్మణులు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వారు వెళుతున్నారు.

సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలినః పురీం |
వృక్షైః ఆత్మానం ఆవృత్య హి అతిష్ఠన్ గహనే వనే ||

ముందు వెళుతున్న సుగ్రీవుడు కిష్కింద పట్టణంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ దట్టమైన చెట్ల చాటున, పైకి కనపడకుండా దాగి ఉన్నారు. లోపలికి వెళ్ళిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటకి రమ్మన్నాడు. సుగ్రీవుడు ఇంత ధైర్యంగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటకి వచ్చి " ఏరా బుద్ధిహీనుడా మళ్ళి వచ్చావు, నా ప్రతాపం ఏమిటో చూద్దువు కాని, రా " అన్నాడు. అప్పుడా వాలి తన పిడికిలిని బిగించి సుగ్రీవుడి శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడి నవరంధ్రముల నుండి రక్తం ఏరులై పారింది. సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడం ప్రారంభించాడు, వాలి కూడా సుగ్రీవుడిని కొడుతున్నాడు. ఇద్దరూ అలా మోచేతులతో పొడుచుకుంటున్నారు, పాదాలతో కొట్టుకుంటున్నారు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. అలా కొంత సేపు కొట్టుకున్నాక, ఇంకా బాణం వెయ్యడం లేదు, రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటూ ఇటూ చూశాడు. కాని రాముడు కనపడలేదు. ఇంక వాలితో యుద్ధం చెయ్యలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయాడు. అప్పుడు వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు.

సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక శిల మీద కూర్చొని, ఒంట్లోనుండి కారిపోతున్న రక్తాన్ని తుడుచుకుంటూ, ఆయాసపడుతూ, ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు. వాళ్ళని చూడగానే సుగ్రీవుడు " ఏమయ్యా! నేను నిన్ను వాలిని చంపు, అని అడిగాన. నువ్వు వాలిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తేనే కదా నేను యుద్ధానికి వెళ్ళాను. నేను వాలిని చంపను అని నువ్వు ఒకమాట చెబితే నేను వెళతాన. ఎందుకు కొట్టించావయ్య నన్ను ఇలాగ " అని రాముడిని ప్రశ్నించాడు.

అప్పుడు రాముడు " సుగ్రీవ! నేను ఇంతకముందెన్నడూ వాలిని చూడలేదు. నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని అనుకొని వచ్చాను. తీరా వాలి బయటకి వచ్చాక నేను విస్మయం చెందాను. ఎందుకంటే నువ్వు, వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్విని దేవతలు దెబ్బలాడుకున్నట్టు ఉంది. మీలో ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడో నాకు తెలీలేదు. పోని కంఠ స్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను, కాని ఇద్దరూ ఒకేలా అరిచారు. ఇద్దరూ ఒకేలా పరిగెడుతున్నారు, ఒకేలా అలంకారం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే వేగంతో కొట్టుకున్నారు. నేను ఎలాగోలా నిర్ణయించుకొని, ఇతడే వాలి అయ్యుంటాడు అని బాణ ప్రయోగం చేశానే అనుకో, సుగ్రీవా! అది తగిలినవాడు ఈ లోకమునందు ఉండడు. ఒకవేళ ఆ బాణము పొరపాటున నీకు తగిలిందనుకో, నువ్వు నేను కూడా ఉండము.

గజ పుష్పీం ఇమాం ఫుల్లాం ఉత్పాట్య శుభ లక్షణాం |
కురు లక్ష్మణ కణ్ఠే అస్య సుగ్రీవస్య మహాత్మనః ||

నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే లక్షణం ఉంది. లక్ష్మణా! అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది. నువ్వు దానిని పీకి సుగ్రీవుడి మెడలో కట్టు. అప్పుడు పెద్ద పెద్ద పువ్వులచే విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు, అటువంటి మాల లేనివాడై వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను. సుగ్రీవ! ఆ మాల వేసుకొని మళ్ళి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు " అన్నాడు.

సుగ్రీవుడు సరే అని బయలుదేరాడు. ఆయన వెనకాల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వారు బయలుదేరారు. అలా వారు వెళుతూ లోయలని, నదులని, పర్వతాలని, చెట్లని చూసుకుంటూ వెళుతున్నారు. అప్పుడు వాళ్ళకి పక్కన నుంచి అక్షర సముదాయము చేత అవ్యక్తమైనటువంటి గంధర్వ గానం ఒకటి వినపడింది. అది వింటున్నప్పుడు వాళ్ళ మనస్సులకి ఆనందం కలుగుతోంది. అక్కడ ఉన్న చెట్లపైకి పావురాల రంగులో పొగలు చుట్టుకొని ఉన్నాయి. అప్పుడు రాముడు, ఈ వనం ఏమిటి? అని సుగ్రీవుడిని అడిగాడు. కాని సుగ్రీవుడు ఆగకుండా ముందుకి వెళ్ళిపోతూ " రామ! ఇక్కడ సప్తజనులు అనేటటువంటి 7 ఋషులు ఉండేవారు. వారు తలలు కిందకి పెట్టి, కాళ్ళు పైకి పెట్టి 700 సంవత్సరాలు తపస్సు చేశారు. అలా 700 సంవత్సరాలు తపస్సు చేస్తూ ప్రతి 7 రాత్రులకి ఒకసారి గాలిని తినేవారు. వాళ్ళ తపస్సుకి ఇందుడు ఆశ్చర్యపోయి, సశరీరంగా స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ తపోశక్తి ఇప్పటికీ ఈ వనంలో ఉంది, అందువలన క్రూరమృగం ఈ వనంలోకి వెళ్ళదు, వెళితే ఇక తిరిగిరాదు. నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారం చెయ్యి " అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడితో కలిసి రాముడు ఆ సప్తజనుల ఆశ్రమం వైపుకి తిరిగి నమస్కారం చేశాడు. అలా వారు నమస్కారం చెయ్యగానే వాళ్ళ మనస్సులో గొప్ప ఉత్సాహం పుట్టింది.

వాళ్ళందరూ కిష్కింద చేరుకున్నాక సుగ్రీవుడు వెళ్ళి గట్టిగా తొడలు కొట్టి, కేకలు వేసి వాలిని పిలిచాడు. అప్పుడు వాలి గబగబా బయటకి వస్తుండగా ఆయన భార్య అయిన తార (తార సుషేణుడి కుమార్తె) ఆపి " ఎందుకయ్యా అలా తొందరపడి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడే ఒక గంట క్రితం వచ్చాడు కదా సుగ్రీవుడు. నవరంధ్రములనుండి నెత్తురు కారేటట్టు నువ్వు కొడితే దిక్కులు పట్టి పారిపోయాడు కదా. నువ్వు ఇంట్లోకి వచ్చి ఎంతో సేపు కాలేదు, సుగ్రీవుడు వచ్చి నిన్ను మళ్ళి యుద్ధానికి రమ్మంటున్నాడు, నీకు అనుమానం రావడం లేదా.

సుగ్రీవుడు మళ్ళి వచ్చి ' వాలి యుద్ధానికి రా ' అంటున్నాడంటే నాకు శంకగా ఉందయ్యా. సుగ్రీవుడు నిన్ను ఇప్పుడు పిలవడంలో తేడా నీకు కనపడడం లేదా, చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు నిన్ను. ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళినవాడిలో ఉండే బలహీనతలు కనపడడం లేదు. ఆ స్వరంలో ఒక పూనిక, ఒక గర్వం కనపడుతోంది. సుగ్రీవుడికి వెనకాల ఎవరిదో సహాయం ఉంది, నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు నీకు వేరొకరితో ప్రమాదం పొంచి ఉంది. సుగ్రీవుడికి స్నేహం చెయ్యడంలో మంచి తెలివితేటలు ఉన్నాయి. నేను గూఢచారుల ద్వారా, అంగదుడి( అంగదుడు వాలి-తారలు కుమారుడు ) ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అపారమైన శౌర్యమూర్తులైన దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులతో ఇవ్వాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు. నువ్వు నీ బలాన్ని నమ్ముకున్నావు, కాని సుగ్రీవుడి బుద్ధి బలాన్ని గూర్చి ఆలోచించడంలేదు.

సుగ్రీవుడు నీ తమ్ముడన్న విషయాన్ని మరిచిపోయి, నీ తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడిని పక్కన పెట్టుకోవడం మానేసి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి రావలసిన అవసరమేమిటి, ఇది నీ ఇంటి సమస్య. నా మాట వినీ సుగ్రీవుడిని ఆహ్వానించి యువరాజ పట్టాభిషేకం చెయ్యి, అప్పుడు నీ బలం పెరుగుతుంది. ఇవాళ నీ తమ్ముడు రాముడి నీడలో ఉన్నాడు, రాముడిలా నీడ ఇవ్వగలిగే చెట్టు ఈ ప్రపంచంలో లేదు " అనింది.

వాలి శరీరం పడిపోవలసిన కాలం ఆసన్నమయ్యింది, ఈశ్వరుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించాడు కనుక ఇంతకాలం తార మాటలు వినడానికి అలవాటుపడ్డ వాలి ఆమె మాట వినడం మానేసి సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళాడు.

ఇద్దరూ హొరాహొరిగా యుద్ధం చేసుకుంటున్నారు. ఈసారి సుగ్రీవుడు చెట్లని పెరికించి వాలిని తుక్కుగా కొట్టాడు. కాని వాలి మెడలో ఇంద్రుడి మాల ఉండడం వలన, మెల్లగా సుగ్రీవుడి శక్తి నశించింది, వాలి బలం పెరిగింది. సుగ్రీవుడు ఇంతకముందులా పారిపోకుండా ఈసారి రాముడి కోసం మళ్ళిమళ్ళి అన్ని వైపులా చూశాడు.

సుగ్రీవుడి శక్తి తగ్గిపోవడం గమనించిన రాముడు వెంటనే బాణాన్ని తీసి వింటినారికి తొడిగించి వెనక్కి లాగాడు. అలా లాగడం వలన ఆ వింటినారి నుండి వచ్చిన ధ్వని యుగాంతమునందు ప్రళయం చేసేటప్పుడు హరుడు చేసే శబ్దంలా ఉంది. ఆ శబ్దము చేత మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి, పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి.

రాఘవేణ మహా బాణో వాలి వక్షసి పాతితః |

రాముడి బాణం యొక్క శబ్దం వినపడి, ఆ శబ్దం ఎక్కడినుంచి వచ్చిందో అని వాలి అటువైపుకి తిరిగెలోగా ఆ బాణం అమితమైన వేగంతో వచ్చి వాలి గుండెల మీద పడింది. ఆ దెబ్బకి వాలి కిందపడిపోయాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడి మంత్రులు అక్కడికి వచ్చారు. పక్కనే చేతులు కట్టుకొని సుగ్రీవుడు నిలబడ్డాడు. అప్పుడు వాలి రాముడితో " రామ! నువ్వు చాల గొప్పవాడివి, ధర్మం తెలిసినవాడివి, పరాక్రమము ఉన్నవాడివి అంటారు. నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే, ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుంచి నా మీద బాణం వెయ్యడానికి సిగ్గుగా లేదా. నా చర్మము ఒలిచి వేసుకోడానికి, మాంసము తినడానికి పనికిరావు. యుద్ధం అంటూ వస్తే బంగారం వల్ల, వెండి వల్ల, భూమి వల్ల రావాలి, కాని నీకు నాకు ఈ విషయాలలో తగాదా లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖా మృగాన్ని. నువ్వు మనిషివి, ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి. చేతిలో కోదండం పట్టుకొని కనపడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీయందు కామము విపరీతంగా ఉంది, అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను కొట్టి చంపావు. నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే, ఆ యుద్ధంలో నేను నిన్ను యమసదనానికి పంపించి ఉండేవాడిని.

అయిదింటి మాంసాన్ని మాత్రమే బ్రాహ్మణులు, క్షత్రియులు తినాలని ధర్మశాస్త్రం చెబుతుంది. ( త్రేతా యుగంలో బ్రాహ్మణులు కూడా మాంసాన్ని తినేవారు, కలికాలంలో అది నిషిద్దము. అరణ్యకాండలో అగస్త్య మహర్షి వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులని చంపేముందు మాంసాహారాన్ని తిన్నారు). అయిదు గోళ్ళున్న వాటిల్లో ముళ్ళపంది మాంసాన్ని తినచ్చు, చెవుల పిల్లి మాంసాన్ని తినచ్చు, ఉడుము మాంసాన్ని తినచ్చు, తాబేలు మాంసాన్ని తినచ్చు, కుక్కలని తరిమి చంపే ఏదుపంది మాంసాన్ని తినవచ్చు. ఇంక ఆరవదాని మాంసం తినకూడదు. ఒకవేళ అలా తిన్నా, రాజ్యం చేస్తున్న రాజుని చంపినా, గోవుని చంపినా, బ్రాహ్మణుడిని చంపినా, అలా చేసిన వారికి పాతకం చేసిన పాపం వస్తుంది. నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి. నువ్వు చేసినవి దోషాలు కావా? నాకు జవాబు చెప్పు.

ఏమయ్యా, నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావంట కదా, నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో చెప్పి ఉంటె, పశువుని ఈడ్చుకు వచ్చినట్టు రావణుడిని మెడలో పాశం వేసి నీ కాళ్ళ ముందు పడేసేవాడిని. అటువంటిది నాకు చెప్పకుండా, నన్నే గెలవలేని సుగ్రీవుడిని ఆశ్రయించి నువ్వు సీతని ఎలా తెచ్చుకోగలవు. సుగ్రీవుడి కోసం నన్ను చంపావు, ఇది కిరాయి హత్య కాదా? నువ్వు ఈ పని చెయ్యొచ్చా " అని రాముడిని ప్రశ్నించి, ఇక మాట్లాడడానికి ఓపిక లేక, అలా ఉండిపోయాడు.

ధర్మం అర్థం చ కామం చ సమయం చ అపి లౌకికం |
అవిజ్ఞాయ కథం బాల్యాత్ మాం ఇహ అద్య విగర్హసే ||

అప్పుడు రాముడు " నీకు అసలు ధర్మం గురించి కాని, అర్ధం గురించి కాని, కామం గురించి కాని తెలుసా? నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి, నీకు ఏమి తెలుసని నామీద ఇన్ని ఆరోపణలు చేశావు. నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే, ఆచారం తెలిసినవారిని, పెద్దలైనవారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నువ్వు అవేమి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశంవారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జెరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు, అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురూ తండ్రులతో సమానం. అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తన దెగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు, ఈ ముగ్గురూ కుమారులతో సమానము.

నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానము. కాని సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు ( వాలి బిలంలో ఉండిపోయినప్పుడు, వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడం కాదు. కాని సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే, మనుష్యులకి కాదు. అలాగే వాలికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే, వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు, ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే, వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం. అలాగే వాలికి రావణాసురుడికి స్నేహం ఉంది, వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించచ్చు, వాలికి శత్రువు రావణుడికి శత్రువే........అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు ).

అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మ శాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింప బడుతున్నవాడివి, సంధ్యావందనం చేస్తున్నవాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది. ఇది తప్పు అని తెలిసికూడా నేను నిన్ను శిక్షించకపోతే, నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది. ఈ పాపం అవతలవాడు చేశాడని ప్రభువైనవాడికి తెలిసి వాడిని శిక్షిస్తే, వాడి పాపం పోతుంది. కాని ప్రభువు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకి వెళుతుంది. అందుకే మా వంశంలో ఇంతకుపూర్వం మాంధాత అనే రాజు ఒక శ్రమణికుడు ఇటువంటి దోషం చేస్తే శిక్ష వేశాడు. ఇంక నాతో ఎందుకు స్నేహం చెయ్యలేదు, నాతో స్నేహం చేసి ఉంటె సీతమ్మని తీసుకు వచ్చేవాడిని అన్నావు కదా, నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నన్ను చెట్టు చాటునుండి చంపావు, వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, అది దోషం కాదా? అని నన్ను అడిగావు, దానికి నేను సమాధానం చెబుతాను విను.

తప్పు చేసినవాడిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. నేను నిన్ను చంపడం వల్ల నువ్వు ఏ పాపము లేని స్థితికి వచ్చావు, నీ పాపం ఇక్కడితో పోయింది, అందుకని నువ్వు ఉత్తమలోకాలకి వెళ్ళిపోతావు.

న మే తత్ర మనస్తాపో న మన్యుః హరిపుంగవ |
వాగురాభిః చ పాశైః చ కూటైః చ వివిధైః నరాః ||

నేను మానవుడిని, నువ్వు వానరానివి. నేను మనిషిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు, మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి పట్టుకొని కొట్టచ్చు, పాశం వేసి పట్టుకొని కొట్టచ్చు, అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకొని ఉన్నప్పుడు కొట్టచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, ఎప్పుడైనా కొట్టచ్చు, కాని ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణ ప్రయోగం చెయ్యకూడదు. నువ్వు మైధున లక్షణంతో లేవు, అందుకని నిన్ను కొట్టాను. నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కాని నువ్వు చనిపోయేముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు. నాయందు ఎటువంటి దోషము లేదు " అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు.

రాముడు మాటలు విన్న వాలి తన రెండు చేతులతో రాముడికి నమస్కారం పెట్టి " మహానుభావ! ధర్మాత్మ! రామచంద్ర! నువ్వు చెప్పినది పరమయదార్ధము. దోషం నాయందే ఉంది. నువ్వు నన్ను చంపడంలోకాని, నాయందు దోషం ఉన్నదీ అని చెప్పడంలోకాని కించిత్ సందేహం లేదు. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత, నీకు ఉన్న జ్ఞానం చేత, పూర్వాపరములను బాగా పరిశీలించిన మీదట, ఏమిచెయ్యాలో నిర్ణయించుకుని, నిర్ణయించుకున్నదానిని అమలుచేసి, అమలుచేసిన దానిమీద స్థిరంగా నిలబడగల వ్యక్తిత్వం ఉన్నవాడివి, అటువంటి నిన్ను చూసి పొంగిపోతున్నాను. ఇటువంటి నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే రామ " అన్నాడు.

న చ ఆత్మానం అహం శోచే న తారాం న అపి బాంధవాన్ |
యథా పుత్రం గుణశ్రేష్ఠం అంగదం కనకాంగదం ||

కిందపడిపోయిన వాలి అన్నాడు " రామ! నేను నా ప్రాణములు పోతున్నాయి అని బాధపడడం లేదు, తార గురించి విలపించడం లేదు, కాని నా ప్రియాతిప్రియమైన కుమారుడు అంగదుడు సుఖాలకి అలవాటుపడి బతికినవాడు, ఈ ఒక్క కొడుకు భవిష్యత్తు ఏమవుతుందా అని బెంగపడుతున్నాను. నా కొడుకు యొక్క శ్రేయస్సుని, అభివృద్ధిని నువ్వే సర్వకాలముల యందు చూడాలి రామ " అన్నాడు.

అప్పుడు రాముడు " దండించవలసిన నేరము ఏదన్నా ఒకటి చేయబడినప్పుడు, ఆ దండనని అవతలి వ్యక్తి ప్రభుత్వం నుంచి కాని, రాజు నుండి కాని పొందితే, వాడి పాపం అక్కడితో పోతుంది. ఒకవేళ దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత, వాలి నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు చేసిన మహా పాపానికి ఎప్పుడైతే శిక్ష అనుభవించావో, అప్పుడే నీయందు ఉన్న దోషం పోయింది. అందుకని ఇప్పుడు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టాక స్వర్గలోకాన్ని పొందడానికి నీకెటువంటి ప్రతిబంధకం ఉండదు. ఇప్పుడు అంగదుడు నిన్ను ఎలా చుసేవాడో, నీ తరవాత సుగ్రీవుడియందు, నాయందు అలాగే ఉంటాడు. పిన తండ్రివల్ల నీ కుమారుడికి సమస్య వస్తుందని అనుకోమాకు, అప్పుడు కూడా నీ బిడ్డని తండ్రిగా కాపాడడానికి నేను ఉన్నాను " అన్నాడు.

అలా వాలి కిందపడిపోయి ఉండడం వల్ల చుట్టూ ఉన్న వానరాలు పరుగులు తీశాయి. జెరుగుతున్న ఈ గందరగోళం విన్న తార బయటకి వచ్చి " మీరందరూ ఇలా ఎందుకు పరిగెడుతున్నారు " అని అడిగింది.

అప్పుడు ఆ వానరాలు " రాముడికి, వాలికి యుద్ధం జెరిగింది. వాలి పెద్ద పెద్ద చెట్లని, పర్వతాలని తీసుకొచ్చి రాముడి మీదకి విసిరాడు. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుద్ధం లాంటి బాణాలతో రాముడు ఆ చెట్లని, పర్వతాలని కొట్టేసాడు. ఆ యుద్ధంలో ఆఖరున రాముడు వాలిమీద బాణమేసి కొట్టేసాడు, అందుకని నీ కొడుకుని రక్షించుకో, పారిపో " అన్నారు.
( ఇదే లోకం యొక్క పోకడ అంటె. గొంతు మారుతున్న కొద్దీ నిజం అంతర్ధానమవుతుంది. )

అప్పుడు తార " భర్తపోయిన తరువాత నాకెందుకు ఈ రాజ్యము, ఈ కొడుకు " అని వాలి దెగ్గరికి పరిగెత్తింది.

అప్పుడా తార వాలితో " నేను నీకు చెప్పిన మాటలు నువ్వు వినలేదు, ఇప్పుడు ఈ పరిస్థితిని తెచ్చుకున్నావు. సుగ్రీవుడి భార్యని అపహరించి తెచ్చావు, కామమునకు లోంగావు " అని చెప్పి, కొన ఊపిరితో ఉన్న వాలిని చూసి విలపించింది. తండ్రి మరణిస్తున్నాడని అంగదుడు నేల మీద పడి భోరున ఏడుస్తున్నాడు.

అప్పుడు వాలి సుగ్రీవుడితో " సుగ్రీవా! నా దోషాలని లెక్కపెట్టకయ్యా. కాలం బలవత్తరమైన స్వరూపంతో తన ఫలితాన్ని ఇవ్వడానికి నా బుద్ధిని మొహపెట్టి, నీతో నాకు వైరం వచ్చేటట్టు చేసింది. ఈ ఫలితాన్ని అనుభవించడం కోసమని నీ నుండి నన్ను దూరం చేసింది. అన్నదమ్ములమైన మనిద్దరమూ కలిసి ఏకాకాలమునందు సుఖం అనుభవించేటట్టు భగవంతుడు రాయలేదురా సుగ్రీవా. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమయ్యింది, నీకు ఒక్క మాట చెప్పుకుంటాను సుగ్రీవ, ఇది మాత్రం జాగ్రత్తగా విను. నాకు ఒక్కడే కొడుకు అంగదుడు, వాడు ఇవ్వాళ నాకోసం భూమి మీద పడి కొట్టుకుంటున్నాడు. వాడు సుఖంతో పెరిగాడు, వాడికి కష్టాలు తెలియవు. నేను వెళ్ళిపోయాక వాడికి సుఖాలు ఉండవు కదా. నీ దెగ్గర, పిన్ని దెగ్గర ఎలా ఉండాలో వాడికి తెలియదు కదా. తార బతుకుతుందో లేదో నాకు తెలియదు. అందుకని నా కొడుకుని జాగ్రత్తగా చూడు, వాడికి నువ్వే రక్షకుడివి. తారకి ఒక గొప్ప శక్తి ఉంది సుగ్రీవా. ఎప్పుడైనా ఒక గొప్ప ఉత్పాతం వస్తే, అప్పుడు మనం ఏమిచెయ్యాలో నిర్ణయించుకోలేని స్థితి వస్తే, సూక్ష్మ బుద్ధితో ఆలోచించి చెప్పగలిగిన ప్రజ్ఞ తార సొత్తు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే తార సహాయం తీసుకో. నువ్వు ఎప్పుడైనా కాని రాముడిని అవమానించావ, రాముడి పని చెయ్యడంలో ఆలస్యం చేశావ, నేను వెళ్ళిన మార్గంలో నువ్వు కూడా వచ్చేస్తావు సుగ్రీవా. అందుకని జాగ్రత్తగా ఉండు.

నాయనా సుగ్రీవ, నా తండ్రి అయిన మహేంద్రుడు ఇచ్చిన మాల నా మెడలో ఉంది, నా ప్రాణం కాని వెళ్ళిపోతే, ఈ శరీరం శవం అయిపోతుంది, అప్పుడీ మాల అపవిత్రం అవుతుంది. ఈ మాల జయాన్ని తీసుకొస్తుంది అందుకని నీకు ఇస్తున్నాను, తీసుకో " అని ఆ మాలని సుగ్రీవుడికి ఇచ్చి ప్రాణములను వదిలేశాడు.

అప్పుడు తార అనింది " ఎప్పుడూ నీ నోటివెంట ఒక మాట వచ్చేది. ' సుగ్రీవుడా, వాడిని చితక్కొట్టేస్తాను ' అనేవాడివి. చూశావ దైవ విధి అంటె ఎలా ఉంటుందో, ఇవ్వాళ ఆ సుగ్రీవుడు నిన్ను కొట్టేశాడు. ఒంట్లో బలం ఉందని లేచింది మొదలు సంధ్యావందనానికి నాలుగు సముద్రాలు దూకావు. ఇంటికొచ్చి మళ్ళి ఎవరినో కొట్టడానికి వెళ్ళేవాడివి. నీతో యుద్ధం చేసిన ఎందరో వీరులని ఇలా భూమి మీద పడుకోపెట్టావు, ఇవ్వాళ నువ్వు కూడా అలా పడుకున్నావు. శూరుడన్న వాడికి పిల్లని ఇస్తే, ఆమెకి హఠాత్తుగా వైధవ్యం వస్తుంది. అందుకని శూరుడికి ఎవరూ పిల్లని ఇవ్వద్దు.

పతి హీనా తు యా నారీ కామం భవతు పుత్రిణీ |
ధన ధాన్య సమృద్ధా అపి విధవా ఇతి ఉచ్యతే జనైః ||

మాటవినే కొడుకులు ఎంతమంది ఉన్నా, అపారమైన ఐశ్వర్యం ఉన్నా, నేను గొప్ప పండితురాలినైనా, నువ్వు వెళ్ళిపోవడం వల్ల లోకం నన్ను చూడగానే మాత్రం విధవ అనే అంటుంది " అనింది.

అప్పుడు సుగ్రీవుడు రాముడితో " నువ్వు చేసిన ప్రతిజ్ఞకి అనుగుణంగా వాలిని సంహరించావు. అన్నని చంపమని నేను నిన్ను అడిగాను, నేను దుర్మార్గుడిని. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను ఎంత అకృత్యం చేశానో అని. అన్నయ్య బతికి ఉన్నంతకాలం, అన్నయ్య పెట్టిన కష్టాలు తట్టుకోలేక, అన్నయ్య పొతే బాగుండు, పొతే బాగుండు అని నిన్ను తీసుకొచ్చి బాణం వెయ్యమన్నాను. అన్నయ్య భూమి మీద పడిపోయాక, అన్నయ్య అంటె ఏమిటో నాకు అర్ధం అవుతుంది రామ.

నేను వాలి మీదకి యుద్ధానికి వెళితే, నన్ను కొట్టి, ఇంకొక్క గుద్దు గుద్దితే నేను చచ్చిపోతాను అన్నంతగా అలిసిపోయాక, ' ఇంకెప్పుడూ ఇలాంటి పని చెయ్యకే, పో ' అని వెళ్ళిపోయేవాడు, కాని నన్ను చంపేవాడు కాదు. ఒకతల్లి బిడ్డలమని నన్ను ఎన్నడూ వాలి చంపలేదు. నేను చచ్చిపోతానని వాలి నన్ను అన్నిసార్లు వదిలేశాడు, కాని నేను వాలిని చంపించేసాను. నీతో వాలిని చంపమని చెప్పినప్పుడు నాకు ఈ బాధ తెలియలేదు, కాని జెరిగినప్పుడు తెలుస్తుంది. అందుకని నాకు ఈ రాజ్యం వద్దు రామ.

పెద్ద చెట్టు కొమ్మని విరిచి తీసుకొచ్చి, దానితో నన్ను కొట్టి, ఇంక నేను ఆ దెబ్బలు తట్టుకోలేక పడిపోతే, ' ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పనులు చెయ్యకు, పో ' అనేవాడు. ఇవ్వాళ నన్ను అలా అనే అన్నయ్య ఎక్కడినుంచి వస్తాడు. ఇక నేను ఉండను, నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను. రామ! మిగిలిన ఈ వానరులు నీకు సీతాన్వేషణలో సహాయం చేస్తారు " అన్నాడు.

సుగ్రీవుడు అలా ఏడుస్తుంటే చూడలేక రాముడు ఏడిచాడు. తార వాలిని కౌగలించుకొని ఎడుద్దాము అంటె, రాముడి బాణం వాలి గుండెలకి గుచ్చుకొని ఉంది. అప్పుడు నలుడు వచ్చి ఆ బాణాన్ని తీసేసాడు. అప్పుడా తార భర్త యొక్క శరీరం దెగ్గర ఏడిచాక, రాముడి దెగ్గరికి వచ్చి " రామ! నీగురించి ఊహించడం ఎవరి శక్యం కాదు. నువ్వు అపారమైన కీర్తికి నిలయమైన వాడివి. భూమికి ఎంత ఓర్పు ఉందో, రామ! నీకు అంత ఓర్పు ఉంది. నువ్వు విశాలమైన నేత్రములు కలిగినటువంటివాడివి. నీ చేతిలో పట్టుకున్న కోదండం, నీ అవయవముల అందమైన పొందిక, దానిలో ఉన్న కాంతి చూసిన తరువాత నువ్వు అందరివంటి మనుష్యుడవి కావని నేను గుర్తించాను. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప దానం, భార్యా దానం. నేను లేకపోతె వాలి అక్కడ కూడా సంతోషాన్ని పొందలేడు. అందుకని వాలిని ఏ బాణంతో కొట్టావో, నన్ను కూడా ఆ బాణంతో కొట్టు, నేనూ వాలి దెగ్గరికి వెళ్ళిపోతాను " అనింది.

అప్పుడు రాముడు " నువ్వు అలా శోకించకూడదమ్మా. కాలం అనేది ఒక బలమైన స్వరూపం, అది పుణ్యపాపాలకి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ వాలి శరీరం ఇలా పడి ఉండగా మీరందరు ఇలా మాట్లాడకూడదు. జెరగవలసిన క్రతువుని చూడండి " అన్నాడు.

తరువాత వాలి శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు.

తదనంతరం సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానరములు రాముడి దెగ్గర కూర్చున్నారు. అప్పుడు హనుమంతుడు " ఇంతగొప్ప రాజ్యాన్ని సుగ్రీవుడు పొందేతట్టుగా నువ్వు అనుగ్రహించావు. అందుకని నువ్వు ఒక్కసారి కిష్కిందా నగరానికి వస్తే నీకు అనేకమైన రత్నములను బహూకరించి, నీ పాదాలకి నమస్కరించి సుగ్రీవుడు కృతకృత్యుడు అవుతాడు " అని అన్నాడు.

అప్పుడు రాముడు " 14 సంవత్సరాలు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యంలో ఉంటాను. నేను గ్రామంలో కాని, నగరంలో కాని ప్రవేశించి నిద్రపోను. పెద్దవాడైన వాలి యొక్క కొడుకైన అంగదుడు యోగ్యుడు, మీరు అతనికి యువరాజ పట్టాభిషేకం చెయ్యండి. సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యండి. మీరందరు సంతోషంగా కిష్కిందలో ఉండండి. ఈ వర్షాకాలంలో రావణుడిని వెతుకుతూ వెళ్ళడం కష్టం. సుగ్రీవా! పట్టాభిషేకం చేసుకొని 4 నెలలు యదేచ్ఛగా సుఖాలు అనుభవించు. కొండల మీద తిరిగి ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డావో. 4 నెలల తరువాత కార్తీక మాసం వచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతవరకు నేను ఊరి బయట ప్రస్రవణ పర్వత గుహలో ఉంటాను " అని చెప్పి సుగ్రీవుడిని పంపించాడు.

కిష్కిందకి వెళ్ళాక సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడు మళ్ళి తారని పొందాడు. అలా తార, రుమలతో బయట వర్షాలు పడుతుండగా సుగ్రీవుడు ఆనందంగా కాలం గడపసాగాడు.

ఆలా సుగ్రీవుడు తార, రుమలతో హాయిగా, సంతోషంగా కాలం గడపసాగాడు.

బాల ఇంద్రగోప్తా అంతర చిత్రితేన విభాతి భూమిః నవ శాద్వలేన |
గాత్ర అనుపృక్తేన శుక ప్రభేణ నారీ ఇవ లాక్ష ఉక్షిత కంబలేన ||

ఆ వర్షాకాలాన్నీ చూసి రాముడన్నాడు " ఈ వర్షాకాలంలో వర్షాలు విశేషంగా పడడం వలన భూమి మీద గడ్డి బాగా పెరిగింది. అందువలన భూమి అంతా ఆకుపచ్చగా ఉంది. ఆ ఆకుపచ్చ భూమి మీద ఎర్రటి ఇంద్రగోప పురుగులు అక్కడక్కడ తిరుగుతున్నాయి. భూదేవి ఎర్రటి చుక్కలు కలిగిన ఆకుపచ్చ చీర కట్టుకుందా అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. నదులన్నీ నీళ్ళతో ప్రవహిస్తున్నాయి, మేఘాలు కురుస్తున్నాయి, ఏనుగులు పెద్ద శబ్దాలు చేస్తున్నాయి, వనాల యొక్క మధ్య భాగాలు ప్రకాశిస్తున్నాయి. భార్యలు పక్కన లేనివారు ధ్యానం చేస్తున్నారు, వర్షం పడుతుంటే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, వానరములన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. ఆకాశంలో వెళుతున్న ఆ మబ్బులు యుద్ధానికి వెళుతున్న రథాలలా ఉన్నాయి, మెరుపులు ఆ రథానికి కట్టిన పతాకాలలా ఉన్నాయి, ఆ మబ్బులు వస్తుంటే గాలికి దుమ్ము రేగిపోతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకేమి జ్ఞాపకం వస్తుందో తెలుసా లక్ష్మణా. ఎప్పుడెప్పుడు రావణాసురిడి మీద యుద్ధం చేద్దామా అని పొంగిపోతున్నటువంటి వానరుల యొక్క శక్తి జ్ఞాపకం వస్తుంది.

మార్గ అనుగః శైల వన అనుసారీ సంప్రస్థితో మేఘ రవం నిశమ్య |  
యుద్ధ అభికామః ప్రతినాద శంకీ మత్తో గజేంద్రః ప్రతిసంనివృత్తః ||

ఒక పెద్ద మదగజం ఆ వర్షంలో తడుస్తూ హాయిగా పడుకొని ఉంది. ఇంతలో పిడుగు పడినట్టు ఒక మేఘం పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దాన్ని విన్న ఏనుగు ' ఆహా, ఇంకొక మదగజం కూడ ఎక్కడో అరుస్తుంది, దాని మదం అణిచేస్తాను ' అనుకొని, తన తొండాన్ని పైకెత్తి పెద్దగా ఘీంకరిస్తూ ఆ శబ్దం వినపడ్డ వైపుకి బయలుదేరింది. కొంతదూరం వెళ్ళాక మళ్ళి ఆ మేఘం శబ్దం చేసింది. ' ఓహొ, మేఘమా ఉరుముతున్నది. మరొక మదగజం కాదన్నమాట ' అని తన తొండాన్ని దింపేసి మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వచ్చి, తాను ముందు పడుకున్న చోటనే పడుకుంది. రంగురంగుల కప్పలు, తోకలున్న కప్పలు, పొడుగు కప్పలు అలా రకరకాల కప్పలు ఇప్పటిదాకా ఎక్కడున్నాయో తెలీదు, కాని ఎప్పుడైతే మేఘం నుంచి పడిన వర్షధారలు ఈ కప్పలని కొట్టాయో, ఆ కప్పలన్నీ బెకబెక అనే ఒకేరకమైన శబ్దం చేశాయి. ఈ వర్షాలు పడే కాలంలోనే సామవేదాన్ని నేర్చుకునేవారికి పాఠం ప్రారంభిస్తారు.

నిద్రా శనైః కేశవం అభ్యుపైతి ద్రుతం నదీ సాగరం అభ్యుపైతి |
హృష్టా బలాకా ఘనం అభ్యుపైతి కాంతా స కామా ప్రియం అభ్యుపైతి ||

నిద్ర మెల్లమెల్లగా కదిలి కేశవుడిని చేరుకుంటుంది, నది వేగంగా ప్రవహిస్తూ సాగరానికి వెళ్ళిపోతుంది, ఆకాశంలో కొంగలు బారులు బారులుగా వెళ్ళిపోతున్నాయి, పతివ్రత అయిన కాంత ఈ ఋతువు యొక్క ప్రభావం చేత మెల్లమెల్లగా భర్త కౌగిటిలోకి చేరిపోతోంది. ఈ వర్షాకాలం ఇంత గొప్పదయ్యా లక్ష్మణా. సుగ్రీవుడు చాలా కష్టాలు పడ్డాడు, అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాకు సుగ్రీవుడి మీద విశ్వాసం ఉంది. ఈ వర్షాకాలం వెళ్ళిపోయి కార్తీక మాసం వస్తుంది, అప్పుడు వర్షం కురవదు. అప్పుడు సుగ్రీవుడు మనకి తప్పకుండా ఉపకారం చేస్తాడు " అని రాముడు అన్నాడు.

అలా వర్షాకాలం పూర్తయిపోయింది, కార్తీక మాసం మొదలయ్యింది. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి " సుగ్రీవా! నువ్వు రాముడి అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు. ఇప్పుడు నువ్వు మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలి. నాలుగు విషయాలలో రాజు ఎప్పుడూ కూడ అప్రమత్తుడై ఉండాలి. తన కోశాగారం ఎప్పుడూ నిండుగా ఉండాలి, తగినంత సైన్యం ఉండాలి, మిత్రులయందు పరాకుగా ఉండకూడదు, ప్రభుత్వాన్ని నడిపించడంలో శక్తియుతంగా ఉండాలి, ఈ నాలుగు విషయాలలో రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం గడిచిపోయింది, ఇప్పుడు నువ్వు రాముడి దెగ్గరికి వెళ్ళాలి, కాని నువ్వు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చెయ్యాలి. రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది. అలా జ్ఞాపకం చెయ్యకపోవడం రాముని యొక్క ఔదార్యం. పోనిలే అని రాముడు ఓర్మి వహించి ఉన్నాడు, ఆ ఓర్మి దాటిపోకముందే నీ అంతట నువ్వు వెళ్ళి రామ దర్శనం చెయ్యడం మంచిది.

నువ్వు వానరాలని దశదిశలకి వెళ్ళి సీతమ్మని అన్వేషించమని ఆదేశించు. ఈ మాట నువ్వు ముందు చెపితే నీ మర్యాద నిలబడుతుంది. రాముడు వచ్చి నా కార్యము ఎందుకు చెయ్యలేదు అని అడిగితే, ఆనాడు నువ్వు ఈ మాట చెప్పినా నీ మర్యాద నిలబడదు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. రాముడు నీకు రెండు ఉపకారములు చేశాడు, నీకు బలమైన శత్రువైన వాలిని సంహరించాడు, అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడు ఆయన నీతో ' నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు సీతని అన్వేషించి పెట్టు ' అన్నాడు. ఆయన నీకు చేసినంత ఉపకారం యదార్ధమునకు నీ నుంచి ఆయన ఆశించలేదు. అన్ని దిక్కులకి వెళ్ళగలిగిన బలవంతులైన వానరములు నీ దెగ్గర ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు, కాని నీ ఆజ్ఞ లేదు కనుక వారు వెళ్ళలేదు. నువ్వు కామమునందు అతిశయించిన ప్రీతితో ఉన్నావు కనుక వారికి నీ ఆజ్ఞ లేదు. రాముడే దుఃఖపడి కోదండాన్ని పట్టుకుంటే, ఇక ఆయనని నిగ్రహించగలిగేవారు ఎవ్వరూ లేరు. అప్పుడు నీకే కాదు లోకానికి కూడ ప్రమాదమే " అన్నాడు.

హనుమంతుడి మాటలని అర్ధం చేసుకున్న సుగ్రీవుడు వెంటనే నీలుడిని పిలిచి " నువ్వు వెంటనే వెళ్ళి ఈ పృధ్వీ మండలంలో ఎక్కడెక్కడ వానరములు ఉన్నా, లాంగూలములు ఉన్నా, భల్లూకములు ఉన్నా, అన్నిటినీ కూడా సుగ్రీవ ఆజ్ఞ అని వెంటనే చేరమని చెప్పు. ఇవన్నీ కూడా 15 రోజుల లోపల ఇక్కడికి రావాలి, 15 రోజుల తరవాత ఏ వానరము ఇక్కడికి చేరుతుందో ఆ వానరము కుత్తుక కత్తిరించబడుతుంది. ఇది సుగ్రీవ ఆజ్ఞగా ప్రకటించు " అన్నాడు.

సుగ్రీవుడు చెప్పిన విధంగా అందరికీ ప్రకటించారు, సుగ్రీవుడు మళ్ళి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు.
కార్తీకమాసం వచ్చినా సుగ్రీవుడి నుండి ఒక్కమాట కూడా రాకపోవడం చేత రాముడు లక్ష్మణుడిని పిలిచి " పరస్పర వైరం ఉన్న రాజులందరూ కూడా ఒకరిని ఒకరు దునుమాడుకోడానికి సైన్యంతో యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆకాశం అంతా నిర్మలంగా అయిపోయింది. నీటి ప్రవాహములన్నీ పరిశుద్ధము అయ్యాయి, నేల మీద ఉండే బురద ఇంకిపోయింది, చంద్రుడు విశేషమైన వెన్నెల కురిపిస్తున్నాడు, శరత్ ఋతువు వచ్చేసింది. కాని సుగ్రీవుడికి మాత్రం ఈ కాలం వచ్చినట్టుగా లేదు. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తరువాత చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని చేసినవాడిగా కనపడడం లేదు.

లక్ష్మణా! సుగ్రీవుడు ఎందుకు ఉపకారం చెయ్యడంలేదో, ఈ గుహ దెగ్గరికి ఎందుకు రావడంలేదో, నాతో ఎందుకు మాట్లాడడం లేదో తెలుసా.

ప్రియా విహీనే దుఃఖ ఆర్తే హృత రాజ్యే వివాసితే |
కృపాం న కురుతే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ ||

నాకు ప్రియమైన భార్యని రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అపారమైన దుఖంతో ఉన్నాను, ఉన్న రాజ్యమా పోయింది. అటువంటి దీనుడిని కదా, ఇవ్వాళ నా దెగ్గర ఏముంది లక్ష్మణా, గుహలో పడుకొని ఉన్నాను కదా, అందుకని సుగ్రీవుడికి నా మీద కృపలేదయ్యా. నన్ను రక్షిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు, ఇవ్వాళ ఆయన ఆ సంగతి మరిచిపోయాడు, నేను ఇప్పుడు అనాథని, రావణుడేమో నన్ను అవమానించాడు, దీనుడిని, ఇంటికి చాలా దూరంగా ఉన్నాను, నేను నా భార్యని పొందాలనే స్థితిలో ఉండి సుగ్రీవుడిని శరణాగతి చేశాను, అయినా సుగ్రీవుడు నాకు ఉపకారం చెయ్యడం లేదు.

ఈ కారణాల వల్లే సుగ్రీవుడు నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నాడు. నాకు ఏమిచెయ్యాలో తెలుసు, ఆ సుగ్రీవుడు చేసుకున్న ఒడంబడిక మరిచిపోయాడు. సీతని ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాని ఇప్పుడు తన భార్యలతో కామ సుఖాన్ని అనుభవిస్తున్నాడు.

అర్థినాం ఉపపన్నానాం పూర్వం చ అపి ఉపకారిణాం |
ఆశాం సంశ్రుత్య యో హంతి స లోకే పురుషాధమః ||

ఎవడైతే చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడో, వాడు పురుషాధముడు అని శాస్త్రం చెబుతుంది. ఒకమాట నోటివెంట వస్తే ఆ మాటకి ఎవడు కట్టుబడిపోతాడో, వాడిని పురుషోత్తముడు అంటారు. తమ పనులు పూర్తి చేసుకొని, తన మిత్రులకి అక్కరకు రాకుండా జీవితాన్ని గడుపుకుంటున్నవాడి యొక్క శరీరం పడిపోయిన తరువాత కుక్కలు కూడా వాడి శరీరాన్ని తినడానికి ఇష్టపడవు. ఇవ్వాళ సుగ్రీవుడు అటువంటి కృతఘ్నతా భావంతో ప్రవర్తిస్తున్నాడు. నేను మళ్ళి కోదండాన్ని పట్టుకొని వేసే బాణముల యొక్క మెరుపులని చూడాలని, నా వింటినారి యొక్క ధ్వనిని వినాలని సుగ్రీవుడు అనుకుంటున్నట్టు ఉన్నాడు. రాముడికి కోపం వచ్చి యుద్ధ భూమిలో నిలబడిననాడు, రాముడి స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మరిచిపోయినట్టున్నాడు. అందుకని, లక్ష్మణా! నువ్వు ఒకసారి కిష్కిందకి వెళ్ళి ' మా అన్నగారు కోపం వచ్చి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచిపెడుతున్నప్పుడు ఆయన రూపం చూడాలని అనుకుంటున్నావా సుగ్రీవా ' అని అడుగు.

న స సంకుచితః పంథా యేన వాలీ హతో గతః |
సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పథం అన్వగాః ||

అలాగే నేను చెప్పానని ఈ మాట కూడా చెప్పు ' వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసేయ్యలేదని చెప్పు. చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండమని చెప్పు. లేకపోతె నీ అన్న వెళ్ళిన దారిలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడుతున్నాడు ' అని చెప్పు. ఆనాడు ధర్మము తప్పిన వాలిని ఒక్కడినే ఒకే బాణంతో చంపాను, ఈనాడు సుగ్రీవుడు ధర్మం తప్పినందుకు ఒక బాణంతో సపరివారంగా అందరినీ పంపించేస్తానని చెప్పు " అని రాముడన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు " ఎందుకన్నయ్యా అన్ని మాటలు, వాడు రాజ్యం పరిపాలించడానికి అనర్హుడు. నీ వల్ల ఉపకారం చేయించుకొని రాజ్యం పొందాడు. ఇప్పుడే వెళ్ళి సుగ్రీవుడిని చంపేస్తాను. అన్నయ్య! ఇంక నేను నా కోపాన్ని ఆపుకోలేను. నీదాకా ఎందుకు, నేనే సుగ్రీవుడిని చంపేస్తాను. సుగ్రీవుడిని చంపేసి అంగదుడికి పట్టాభిషేకం చేస్తాను. ఆ అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపించి సీతమ్మని అన్వేషిస్తాడు. సుగ్రీవుడి యొక్క తప్పిదం తలుచుకుంటుంటే, నీ బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వచేస్తోంది, అందుకని నేను ఇప్పుడే బయలుదేరిపోతాను " అన్నాడు.

ఒకవేళ లక్ష్మణుడు నిజంగానే సుగ్రీవుడిని చంపెస్తాడేమో అని రాముడు శాంతించి లక్ష్మణుడితో " లక్ష్మణా! మనం ఇంతకముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకోరా. ఆ స్నేహాన్ని జ్ఞాపకం పెట్టుకొని, సుగ్రీవుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారి నుండి మంచి దారిలోకి మళ్ళించు. అంతేకాని, చంపేస్తాను అని అమంగళకరమైన మాటలు మాట్లాడకు నాన్న " అని చెప్పాడు.

రాముడు అన్ని మాటలు చెప్పినా కాని లక్ష్మణుడి మనసులో కోపం తగ్గలేదు. ఇవ్వాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకొని ఆగ్రహంతో కిష్కిందా నగరం వైపు అడ్డదారి గుండా బయలుదేరాడు. లక్ష్మణుడు వెళుతున్న దారిలో ఒక చెట్టు యొక్క కొమ్మ దారికి అడ్డంగా ఉంది, ' నేను వెళుతున్న దారికి అడ్డం వస్తావా ' అని ఆ చెట్టుని పెకలించి అవతలపడేసాడు. అలా ఆయన దారిలో అడ్డువచ్చిన వృక్షాలని, రాళ్ళని పెకలిస్తూ, ముక్కలు చేస్తూ ముందుకి వెళ్ళాడు, అలా ఆయన కిష్కింద నగరానికి చేరుకున్నాడు. అలా వేగంగా వస్తున్న లక్ష్మణుడిని చూసి కొంతమంది వానరములు చెల్లాచెదురై పారిపోయారు, లక్ష్మణుడు యుద్ధానికి వస్తున్నాడని తలచి కొంతమంది మహానాదం చేశారు. ఆ సమయానికి సుగ్రీవుడు అంతఃపురంలో తారతో, రుమతో, వానర కాంతలతో విశేషమైన మధుపానం చేసి, హారములన్నీ చెదిరిపోయి, కామభోగమునందు రమిస్తూ ఉన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు అక్కడే బయట ఉన్న అంగదుడితో " నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయిన సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. ' రాముడు శోకంతో ఉన్నాడు. రాముడి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణుడు వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు '. ఈ మాటలని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి, ఆయన ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు " అన్నాడు. అప్పుడు అంగదుడితో పాటు ప్లక్షుడు, ప్రభావుడు అనే ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళారు. అంగదుడు లోపలికి వెళ్ళి సుగ్రీవుడికి, తారకి, రుమకి పాదాభివందనం చేసి లక్ష్మణుడు చెప్పిన మాటలని సుగ్రీవుడికి చెప్పాడు. బాగా మత్తులో ఉండడం వలన అంగదుడు చెప్పిన మాటలు సుగ్రీవుడి మనస్సులోకి వెళ్ళలేదు.

కాని అప్పటికే లక్ష్మణుడిని చూసి భయ భ్రాంతులకి గురైన మిగిలిన వానరములు ఒక పెద్ద నాదం చేశాయి. ఆ నాదానికి సుగ్రీవుడు ఉలిక్కి పడి అక్కడే ఉన్న మంత్రులని పిలిచి " ఆ వానరాలు ఎందుకు అలా అరుస్తున్నారు " అని అడిగాడు. అప్పుడు వాళ్ళు కూడా లక్ష్మణుడు చెప్పిన మాటలని చెప్పారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు " నేను రాముని పట్ల ఎటువంటి అపచారము చెయ్యలేదు. బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి, నేనంటే గిట్టనివాళ్ళు రామలక్ష్మణులకి చాడీలు చెప్పి ఉంటారు. నాగురించి ఎవరో అలా చెబితే రామలక్ష్మణులు నమ్మకూడదే, వాళ్ళకి ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది. స్నేహం చెయ్యడం తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. రాముడు నాకు చేసిన మేలుని నేను ఎన్నడూ మరువను, రాముడికి సహాయం చెయ్యకపోవడం నా తప్పే " అన్నాడు.

సర్వథా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో న అత్ర సంశయః |
భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మి వర్ధనం ||

అప్పుడు హనుమంతుడు అన్నాడు " సుగ్రీవా! నీకు ఇంకా బోధపడలేదు. నీయందు రాముడికి ఉన్నది ప్రతీకారేచ్ఛ కోపం కాదు, ఆయనకి నీయందున్నది ప్రేమతో కూడిన కోపం. నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, వేళ దాటిపోయినా సుఖాలు అనుభవిస్తున్నావు. కాని రాముడికి భార్య లేదు, రాజ్యం లేదు, నీకు ఉపకారం చేశాడు, నీకు సమయం ఇచ్చాడు, నగరానికి కూడా రాకుండా బయట ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇంతకాలం ఎదురు చూశాడు, కాని నీ నుండి సహకారం లభించకపోవడం వలన బాధపడ్డాడు. కాబట్టి ఆ బాధలోనుండి వచ్చే మాట నువ్వు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కాని, నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు వినవలసింది, అవతలివాడి కష్టం ఎంతుంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. నువ్వు బాగా తప్పతాగి ఉన్నావు కాబట్టి ' రాముడు నన్ను ఇంతమాట అంటాడ ' అని వినవద్దు. ఇప్పుడు లక్ష్మణుడు కోపంగా మాట్లాడితే, అంజలి ఘటించి విను తప్ప కోపగించుకోమాకు " అన్నాడు.

బయట లక్ష్మణుడు నిలబడి ఉండగా, లోపలినుండి స్త్రీల ఆభరణముల, కంకణముల, వడ్డాణముల శబ్దములు వినపడ్డాయి. అప్పుడు లక్ష్మణుడు సిగ్గుపడి లోపలికి వెళ్ళలేదు, కాని లోపలినుండి వస్తున్న కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి తన వింటినారి యొక్క ఠంకార ధ్వని చేశాడు. పిడుగు పడినట్టు వచ్చిన ఆ శబ్దానికి లోపల భార్యలతో పడుకుని ఉన్న సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి గంతేసి ఓ ఆసనంలో కూర్చున్నాడు. ఆ సమయంలో సుగ్రీవుడి ఒంటిమీద ఉన్న ఆభరణాలు అటుఇటు తొలిగిపోయాయి. ఒక కోతి తన పిల్లని పట్టుకున్నట్టు, సుగ్రీవుడు రుమని తన ఒళ్లో పెట్టుకొని ఆ ఆసనంలో కూర్చున్నాడు. పైకి నిలబడలేక అటుఇటు తూలుతున్న సుగ్రీవుడికి వెంటనే వాలి చెప్పిన మాట గుర్తుకు వచ్చి తారని పిలిచాడు.

అప్పుడు సుగ్రీవుడు తారతో " తార! ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగినదానివి నువ్వు ఒక్కదానివే. ఎలాగోలా నువ్వే బయటకి వెళ్ళి లక్ష్మణుడితో మాట్లాడు. లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నవో అలాగే బయటకి వెళ్ళు ( ఆ సమయంలో తార కూడా మద్యం సేవించి తూలుతూ ఉంది, ఆమె ఒంటిమీద గుడ్డ సరిగ్గా లేదు, ఆభరణాలు సరిగ్గా లేవు ). నిన్ను అలా చూడగానే అంత కోపంతో ఉన్న లక్ష్మణుడు కూడా తల దించేసుకుంటాడు. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడం కాని, స్త్రీతో గట్టిగా మాట్లాడడం కాని, స్త్రీ జోలికి వెళ్ళడం కాని ఇక్ష్వాకు వంశీయులు చెయ్యరు. నువ్వు నీ మాటలతో లక్ష్మణుడిని ప్రసన్నుడిని చెయ్యి, అప్పుడు నేను మెల్లగా బయటకి వస్తాను " అన్నాడు.

సుగ్రీవుడి చేత అనుభవించిన సుఖం వల్ల, తాగిన మద్యం వల్ల తార కనుగుడ్లు ఎర్రగా అయ్యి తిరుగుడుపడుతున్నాయి. ఒక చోట స్థిరంగా నిలబడలేక అటుఇటు తూలిపోతుంది. ఆమె వేసుకున్న వడ్డాణం కిందకి జారిపోయింది, పైకి కనపడకూడని హారాలు పైకి కనపడుతూ జారిపోయి ఉన్నాయి, ఒంటి మీద బట్ట కూడా జారిపోయింది. లక్ష్మణుడి కోపం తగ్గించడానికి అలా ఉన్న తార బయటకి వచ్చి లక్ష్మణుడికి కనపడింది.

స తాం సమీక్ష్య ఏవ హరి ఈశ పత్నీం తస్థౌ ఉదాసీనతయా మహాత్మా |
అవాఙ్ముఖో ఆభూత్ మనుజేంద్ర పుత్రః స్త్రీ సన్నికర్షాత్ వినివృత్త కోపం ||

ఎప్పుడైతే తన దెగ్గరికి ఆ సుగ్రీవుడి భార్య అటువంటి స్వరూపంతో వచ్చిందో, 14 సంవత్సరముల నుండి భార్యకి దూరంగా ఉన్న లక్ష్మణుడు, యవ్వనంలో ఉన్న లక్ష్మణుడు, కోపంతో ఉన్న లక్ష్మణుడు ఏ భావము లేనివాడిగా నిలబడ్డాడు. అప్పటివరకూ కోపంతో బుసలు కొడుతూ ఉన్న లక్ష్మణుడు ఆమెని చూడగానే భూమి వంక చూస్తూ, ఆమెతో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే తన కోపాన్ని విడిచిపెట్టేసాడు.

అప్పుడు తార " లక్ష్మణా! ఎందుకయ్యా అంత కోపంగా ఉన్నావు. నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు ఎవరు. ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే, దానికి ఎదురు వెళ్ళగల మొనగాడు ఎవడయ్యా " అనింది.

అప్పుడు లక్ష్మణుడు " నీ భర్త యొక్క ప్రవర్తన ఆయన భార్యవైన నీకు తెలియడం లేదా. నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలం కామమునందే కాలాన్ని గడుపుతున్నాడు. ( మనకి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు అని 4 పురుషార్ధాలు ఉంటాయి. ధర్మబద్ధమైన అర్ధము{ కష్టపడి సంపాదించినది}, ధర్మబద్ధమైన కామము{ కేవలం తన భార్య అందే కామసుఖాన్ని అనుభవించడం} వలన మోక్షం వైపు అడుగులు వేస్తాము. ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా ప్రమాదమే వస్తుంది ). మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. 4 నెలల సమయం గడిచిపోయింది.

న చింతయతి రాజ్యార్థం సః అస్మాన్ శోక పరాయణాన్ |
స అమాత్య పరిషత్ తారే కామం ఏవ ఉపసేవతే ||

రాజన్నవాడు అనుభవించాల్సింది కేవలం కామము ఒక్కటే కాదు. రాజు మొట్టమొదట మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చెయ్యాలి. ఇవన్నీ నీ భర్త చేస్తున్నాడా?. వర్షాకాలంలో వెతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు సుఖములను అనుభవించి నాలుగు నెలల తరువాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం సహాయం చెయ్యమంటే, ఇచ్చిన సమయం గడిచిపోయినా ఇంకా కామసుఖాలని అనుభవిస్తూ ఉన్న సుగ్రీవుడిది దోషం కాదా?. ఇవ్వాళ నీ భర్త నిరంతర మధ్యపానం చేస్తుండడంవలన ఆయన బుద్ధియందు వైక్లవ్యం ఏర్పడింది. అందుచేత ఆ మధ్యపానమునందు రమిస్తున్న సుగ్రీవుడు పురుషార్ధములయందు చెడిపోయాడు " అన్నాడు.

అప్పుడు తార " నాయనా! ఇది కోపగించవలసిన కాలం కాదయ్యా. ఎవరో బయటివాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలు వెయ్యచ్చు, నిగ్రహించచ్చు, చంపచ్చు. కాని ఇవ్వాళ నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు కామానికి బానిస అయ్యాడు. అటువంటి సుగ్రీవుడి మీద నీకు ఇంత కోపం తగదయ్యా. 'సుగ్రీవుడిది దోషము' అని నువ్వు చెప్పినది పరమ యదార్ధము. నువ్వు గుణములు ఉన్నవాడివి కనుక సుగ్రీవుడిని క్షమించవయ్య. లక్ష్మణా! నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివి, అందుకే నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్త చాలా అల్పమైన గుణములు ఉన్నవాడు, అందుకని కామమునకు లొంగిపోయాడు. మరి నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమయ్యా?

లక్ష్మణా! నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు కాని, రాముడు బాణం వేస్తే ఆ ప్రభావం ఎలా వుంటుందో నాకు తెలుసు, సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో నాకు తెలుసు, దానివల్ల రాముడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఈ మూడు తప్పులు జెరిగాయి కనుక మీకు ఉపకారం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. మన్మధుడి బాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, ఆ బాణాల దెబ్బకి కామానికి ఎంత తొందరగా పడిపోతారో నాకు తెలుసు. ఏ కాముని బాణాల దెబ్బకి సుగ్రీవుడు ఇలా ఉన్నాడో నాకు తెలుసు, ఆ సుగ్రీవుడు ఎవరి పొందుయందు సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు. శత్రువులని చంపే ఓ లక్ష్మణా! ఇవ్వాళ సుగ్రీవుడు తన ఇంద్రియాలకి లొంగిపోయాడు. అంతేకాని ఆయనకి రాముడి మీద ఎటువంటి ద్వేషభావము లేదు, అందుకని నువ్వు ఆయనని క్షమించి తీరాలి.

మహర్షయో ధర్మ తపోభిరామాః కామా అనుకామాః ప్రతి బద్ధ మోహాః |
అయం ప్రకృత్యా చపలః కపిః తు కథం న సజ్జేత సుఖేషు రాజా ||

ఏమయ్యా లక్ష్మణా, నేను కొత్తగా చెప్పాల, నీకు తెలీదా, సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకునే మహర్షులు ఇంద్రుడు పంపిన అప్సరసలని చూసి కామానికి లొంగి తమ తపస్సులను భ్రష్టు పట్టించుకున్నవారు చాలామంది ఉన్నారు. అంత గొప్ప మహర్షులే కామానికి లొంగిపోయినప్పుడు, చపలబుద్ధి కలిగిన వానరుడు కామంతో చెయ్యవలసిన పనిని కొన్ని రోజులు మరిచిపోవడం పెద్ద విషయమా. సుగ్రీవుడు ఇంతగా కామానికి లొంగిపోయినప్పటికీ కూడా, మీకు ఇచ్చిన మాటని నెరవేర్చడానికి ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించాడు.

లక్ష్మణా! ఇక్కడే నిలబడి ఉన్నావు, నువ్వు అంతఃపురంలోకి రాకూడదా, నువ్వేమన్నా పరాయివాడివా. సుగ్రీవుడు పడుకున్న మందిరంలోకి వస్తే అంతఃపుర కాంతలు కనిపిస్తారని సందేహిస్తున్నావా. మిత్రుడైన వాడు, అన్యభావన లేకుండా మిత్రుడితో మాట్లాడేవాడు, చారిత్రం ఉన్నవాడు, నడువడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చయ్యా. ఏమి దోషంలేదు, లోపలికి రా " అనింది.

బంగారు కన్నుతో మెరిసిపోతున్న సుగ్రీవుడు, తన తొడ మీద రుమని కూర్చోపెట్టుకొని గట్టిగా కౌగలించుకొని ఉన్నాడు. తెర తీసుకొని లక్ష్మణుడు లోపలికి రాగానే సుగ్రీవుడికి తన దోషం జ్ఞాపకం వచ్చి గబ్బుక్కున ఎగిరి లక్ష్మణుడి దెగ్గర వాలి, శిరస్సు వంచి అంజలి ఘటించాడు.

కాని సుగ్రీవుడి చూడగానే లక్ష్మణుడికి కోపం వచ్చి " సుగ్రీవా! రాజన్నవాడు ఉత్తమమైన అభిజనంతో కూడి ఉండాలి, జాలికలిగినవాడై ఉండాలి, ఇంద్రియములను గెలిచినవాడై ఉండాలి, చేసిన ఉపకారాన్ని మరిచిపోనివాడై ఉండాలి, మాట తప్పనివాడై ఉండాలి. అటువంటివాడిని ఈలోకం రాజని గౌరవిస్తుంది. మిత్రుడి దెగ్గర సహాయం పొంది, ఆ మిత్రుడికి తిరిగి ఉపకారం చెయ్యనివాడిని ఈ లోకం క్రూరుడు అని పిలుస్తుంది.

శతం అశ్వ అనృతే హంతి సహస్రం తు గవ అనృతే |
ఆత్మానం స్వ జనం హంతి పురుషః పురుష అనృతే ||

ఎవడైనా గుర్రం విషయంలో అసత్యం చెబితే ( అంటె ఎవరికన్నా గుర్రం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడం), నూరు గుర్రాలని చంపిన పాపం వస్తుంది. ఆవు విషయంలో అసత్యం చెబితే, వెయ్యి ఆవుల్ని చంపిన పాపం వస్తుంది. అలాగే, ఉపకారం చేస్తానని చెప్పి ఆ మాటకి కట్టుబడనివాడు తన బందువులందరిని చంపి, వారిని తినేసి, తననితాను చంపుకున్నవాడితో సమానమవుతాడయ్య సుగ్రీవా. ఒకరిదెగ్గరికి వెళ్ళి ' అయ్యా మీరు నాకు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను ' అని మాట పుచ్చుకొని, వారి దెగ్గరినుండి ఉపకారం పొందేసి, దాని ఫలితాన్ని అనుభవిస్తూ, తాను ఇచ్చిన మాట మరిచిపోయినవాడిని లోకం అంతా కలిసి చంపేస్తుంది.

బ్రహ్మఘ్నే చ ఏవ సురాపే చ చౌరే భగ్న వ్రతే తథా | 
నిష్కృతిర్ విహితా సద్భిః కృతఘ్నే న అస్తి నిష్కృతిః ||

బ్రహ్మహత్య చేసినవాడికి, మధ్యపానం చేసినవాడికి, దొంగతనం చేసినవాడికి, ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడం మానేసినవాడికి ప్రాయశ్చిత్తం ఉండచ్చు, కాని క్రుతఘ్నుడికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు రాముడికి ఉపకార్తం చేస్తానని ఒప్పుకున్నావు, కాని ప్రత్యుపకారం చెయ్యలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు, కాని నువ్వు కప్పలా అరుస్తున్న పామువని మా అన్నయ్య కనిపెట్టలేకపోయాడయ్యా. నువ్వు మా అన్నయ్యకి చేసిన దోషానికి నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నీ మాట మీద నువ్వు నిలబడు, లేకపోతె వాలి వెళ్ళిన దారిలో వెళ్ళిపోవలసి ఉంటుంది " అని లక్ష్మణుడు అన్నాడు.

లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు నక్షత్రముల మధ్యలో ఉన్న చంద్రుడిలా సుగ్రీవుడు తన భార్యల మధ్యలో చేతులుకట్టుకొని నిలబడిపోయి ఉన్నాడు.  

అప్పుడు తార " లక్ష్మణా! నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు కుటిలుడు కాదు, అసత్యవాది కాదు, ఇంద్రియనిగ్రహం లేనివాడు కాదు, శఠుడు కాదు. రాముడు చేసిన ఉపకారాన్ని సుగ్రీవుడు ఎన్నడూ మరిచిపోలేదు. రాముడు చేసిన ఉపకారం వల్లనే సుగ్రీవుడు ఈనాడు ఇంత గొప్ప రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రుమని, నన్ను పొందగలిగాడు. చాలా కాలం సుఖాలకి దూరంగా ఉండడం వలన సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడు. ఏమయ్యా, నా భర్తేన అలా మరిచిపోయినవాడు? విశ్వామిత్రుడంతటివాడు కూడా కామానికి లొంగి సమయాన్ని మరిచిపోయాడు కదా. ఏ రుమయందు, ఏ రాజ్యమునందు, నా యందు ఆనందముతో సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడో, అదే సుగ్రీవుడు రామకార్యం కోసం అవసరమైతే నన్ను, రుమని, రాజ్యాన్ని వదిలేస్తాడు. రావణుడు యుద్ధంలో నిహతుడవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు, కొద్దికాలంలోనే సీతమ్మ రాముడితో కలవడం సుగ్రీవుడు చూస్తాడు.

శత కోటి సహస్రాణి లంకాయాం కిల రక్షసాం |
అయుతాని చ షట్ త్రింశత్ సహస్రాణి శతాని చ ||

నాయనా! లంకలో నూరు వేల కోట్ల రాక్షసులు(1 ట్రిలియన్), మరియు 36 వేల సంఖ్యలో( ఒక్కొక్క సంఖ్యలో 100 మంది సైనికులు) బలగాలు ఉన్నాయి. వాలి బతికి ఉన్నప్పుడు ఈ విషయాలని నాకు చెప్పాడు, కాని నాకు పూర్తిగా తెలియదు. అంతమంది రాక్షసులని మట్టుపెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల కోట్ల వానర సైన్యం అవసరముంది. అందుకని సుగ్రీవుడు వానర సైన్యం కోసం కబురుపెట్టాడు. నువ్వు పద్దాక బాణ ప్రయోగం చేస్తాను అంటుంటే, ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకువచ్చి ఇక్కడున్నటువంటి స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నీ కోపాన్ని విడిచిపెట్టు " అనింది.

అప్పుడు లక్ష్మణుడు " అమ్మా! నువ్వు చెప్పిన మాట యదార్ధమే, నేను అంగీకరిస్తున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను, నేను ప్రసన్నుడను అయ్యాను " అన్నాడు.

లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందంతో తన మెడలో ఉన్న పుష్పహారాలని పీకేసి " లక్ష్మణా! నేను రాజ్యాన్ని, భార్యని పోగొట్టుకున్నాను. మళ్ళి రాముడి అనుగ్రహంతో వాటిని పొందాను. కేవలం తన చూపు చేత, బాణ ప్రయోగం చేత రాముడు లంకని కాల్చేయగలడు, అటువంటి రాముడికి సహాయం చెయ్యడానికి నేను ఎంతటి వాడిని. ' నా రాముడే కదా ' అని ప్రేమ చేత కాలాన్ని మరిచిపోయానో, లేకపోతె ' వానర సైన్యానికి కబురు పంపించాను కదా ' అన్న విశ్వాసంతో మరిచిపోయానో, నేను కాలాన్ని మరిచిపోయిన మాట యదార్ధమే లక్ష్మణా. ప్రపంచంలో పొరపాటు చెయ్యనివాడు అంటూ ఉండడు కదా, అందుకని నన్ను క్షమించు " అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు " నువ్వు మా అన్నయ్యకి నాథుడిగా ఉన్నావు. నీవంటి వాడి నీడలో ఉన్న రాముడి పని జెరిగి తీరుతుంది. అపారమైన శక్తి ఉండికూడా, తిరగబడకుండా, తప్పు జెరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దెగ్గర ఉంది, సుగ్రీవ నీ దెగ్గర ఉంది. ఆ ప్రస్రవణ పర్వత గుహలో బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య బాధాపడుతున్నాడన్న బాధతో కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏమైనా నేను అని ఉంటె, సుగ్రీవా! నన్ను క్షమించు " అన్నాడు.

తరువాత సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి " ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్న వానరాలు ఇక్కడికి రావాలని చెప్పాను. వాళ్ళని కేవలం 10 రోజులలో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర, వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్నవాళ్లు ఇక్కడికి వచ్చెయ్యాలి. కాటుక రంగులో ఉన్నవారు, బంగారు రంగులో ఉన్నవారు, వెయ్యి ఏనుగుల బలం కలిగినవారు, పది ఏనుగుల బలం కలిగినవారు, నీటిమీద నడిచేవారు, నీళ్ళల్లో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు మొదలైన వానరాలన్నిటికి కబురు చెయ్యండి " అని చెప్పాడు.

సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం మంత్రులు మొదలైనవారు వానరాలని తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళినవారు అన్ని ప్రాంతాలలోని వానరాలని కూడగట్టుకొని కిష్కిందకి పయనమయ్యారు.  

తరువాత సుగ్రీవుడు పల్లకిలో తనతోపాటు లక్ష్మణుడిని ఎక్కించుకొని ప్రస్రవణ పర్వతానికి చేరుకున్నాడు. ఇంతకాలానికి ప్రభువు బయటకి వచ్చాడని అక్కడున్న వానరాలు కూడా బయటకి వచ్చాయి. అప్పుడాయన రాముడి దెగ్గరికి వెళ్ళి, తన శిరస్సు రాముడి పాదాలకి తగిలేటట్టు పాదాభివందనం చేశాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడిని కౌగలించుకొని " ధర్మము, అర్థము, కామము వీటికోసం కాలాన్ని విడదీసుకోవడంలోనే ఎవరిదైనా ప్రాజ్ఞత ఉందయ్యా. కేవలం కామమునందే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు, చెట్టు చివ్వరి కొమ్మమీద నిద్రపోతున్నవాడితో సమానం " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు " రామ! నువ్వు ఇచ్చినదే ఈ రాజ్యం, ఈ భార్య, కాని నేను కృతఘ్నుడను కానయ్యా. కొన్ని కోట్ల వానరాలు, భల్లూకాలు మొదలైనవి వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో ఏ కార్యము చెయ్యాలో నన్ను శాసించు " అన్నాడు.

రాముడన్నాడు " నీవంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం సుగ్రీవ. సీత ఈ భూమండలం మీద ఎక్కడ ఉంది? ప్రాణములతో ఉన్నదా, ప్రాణములు తీయబడినదా. అసలు ఏ పరిస్థితులలో ఉన్నదో అన్న జాడ ముందు కనిపెట్టాలి. అందుకోసం వానరాలని అన్నిదిక్కులకి పంపించి అన్వేషణ జెరిగేటట్టు చూడు " అన్నాడు.

ఇంతలో అక్కడికి కోట్ల కోట్ల వానరములు వచ్చాయి. అవి రావడం వలన ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. అంతా గోలగోలగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, కొంతమంది నమస్కారాలు చేస్తున్నారు, కొంతమంది చెట్లమీద ఉన్నారు, కొంతమంది నీళల్లో ఉన్నారు, కొంతమంది పర్వతాలమీద ఉన్నారు.

అప్పుడు వానర రాజైన సుగ్రీవుడు అందరినీ సరిగ్గా నిలబడమన్నాడు. అప్పుడా వానరాలు తమని ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ దెగ్గరికి వెళ్ళి నిలబడ్డాయి. " ఎవరు ఎంతమందిని తెచ్చారో నాకు చెప్పండి " అని సుగ్రీవుడు ఆదేశించాడు.

అప్పుడు వాళ్ళు అన్నారు " సూర్యాస్తమయ పర్వతం నుండి 10 కోట్ల వానరాలు వచ్చాయి, శతబలి అనే వానరుడు 10 వేల కోట్ల వానరములతో వచ్చాడు. సుషేణుడు లెక్కపెట్టలేనన్ని వానరాలతో వచ్చాడు. రుమ తండ్రి కొన్ని వేల కోట్ల వానరాలతో వచ్చాడు. హనుమంతుడి తండ్రి అయిన కేసరి కొన్ని వేల కోట్ల వానరములతో వచ్చాడు. గవాక్షుడు 1000 కోట్ల కొండముచ్చులతో వచ్చాడు. ధూమ్రుడు 2000 కోట్ల భల్లూకములతో వచ్చాడు, పనసుడు 3 కోట్ల వానరాలతో వచ్చాడు, నీలుడు 10 కోట్ల నల్లటి దేహం కలిగిన వానరాలతో వచ్చాడు, గవయుడు 5 కోట్ల వానరాలతో వచ్చాడు, దరీముఖుడు 1000 కోట్ల వానరాలతో వచ్చాడు, మైంద-ద్వివిదులు అశ్విని దేవతల్లా 1000 కోట్ల వానరాలని తెచ్చారు, గజుడు 3 కోట్ల వానరాలని తెచ్చాడు, జాంబవంతుడు 10 కోట్ల భల్లూకాలని తెచ్చాడు, రుమణుడు 100 కోట్ల వానరాలని తెచ్చాడు, గంధమాదనుడు 10 వేల కోట్ల వానరములతో వచ్చాడు, ఆయన వెనకాల లక్ష కోట్ల వానరాలు వస్తున్నాయి, అంగదుడు 1000 పద్మ వానరాలని, 100 శంకు వానరాలని తీసుకొచ్చాడు, తారుడు 5 కోట్ల వానరాలని తీసుకొచ్చాడు, ఇంద్రజానువు 11 కోట్ల వానరాలని తెచ్చాడు, రంభుడు 1100 ఆయుత వానరాలని తెచ్చాడు, దుర్ముఖుడు 2 కోట్ల వానరాలని తెచ్చాడు, హనుమంతుడు కైలాశ శిఖరాల్లా ఎత్తుగావున్న 1000 కోట్ల వానరాలని తెచ్చాడు, నలుడు 100 కోట్ల 1000 మంది 100 వానరాలతో వచ్చాడు, దధిముఖుడు 10 కోట్ల వానరాలతో వచ్చాడు.

10,000 కోట్లయితే ఒక ఆయుతం, లక్ష కోట్లయితే ఒక సంకువు, 1000 సంకువులయితే ఒక అద్భుదం, 10 అద్భుదములయితే ఒక మధ్యం, 10 మధ్యములయితే ఒక అంత్యం, 20 అంత్యములయితే ఒక సముద్రం, 30 సముద్రములయితే ఒక పరార్థం, అలాంటి పరార్థాలు కొన్ని వేలు ఉన్నాయి ఇక్కడ " అని అన్నారు.

అప్పుడు సుగ్రీవుడు వినతుడు అనే వానరాన్ని పిలిచి " వినతా! నువ్వు లక్షమంది వానరాలతో బయలుదేరి తూర్పు దిక్కుకి వెళ్ళు. నీకు నెల రోజుల సమయం ఇస్తున్నాను, నెల రోజులలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. మీరు ఇక్కడినుండి తూర్పు దిక్కుకి బయలుదేరి గంగ, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు మొదలైన నదులని, వాటి తీరములలో ఉన్న ప్రాంతాలని అన్వేషించండి. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశి, కోసల, మాగధ, పుణ్డ్ర, అంగ దేశములలో ఉండే పట్టణాలని, జనపదాలని వెతకండి. వెండి గనులు కలిగిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి, ఆ ప్రదేశాలన్నీ వెతకండి. సముద్రాలలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మందరాచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్న జనుల యొక్క ఇళ్ళు, అక్కడ కొంతమందికి చెవులు ఉండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకూ వ్యాపించి ఉంటాయి, కొంతమంది జుట్టు చెవుల వరకూ పడి ఉంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైన నరభక్షకులు, వాళ్ళు నీళ్ళల్లో ఉంటారు. మీరందరూ ప్రతి చోట సీతమ్మని వెతకండి. అలా కొంతదూరం వెళితే యవద్వీపం కనపడుతుంది, అది రత్నములతో నిండి ఉంటుంది, మీరు అక్కడ వెతకండి. తరువాత సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపము ఉంటాయి. అవి బంగారము, వెండి గనులకు నిలయమైనటువంటివి. అది దాటితే శిశిరం అనే పర్వతం కనపడుతుంది, ఆ పర్వతం అంతా వెతకండి.

కొంతదూరం వెళ్ళాక శోణానది కనపడుతుంది. ఆ నది చాలా లోతుగా, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశంలో సిద్ధులు, చారులు విహరిస్తూ ఉంటారు. అక్కడున్న ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మని ఉంచాడేమో వెతకండి. తరువాత ఇక్షు సముద్రం వస్తుంది, అందులో మహాకాయులైన అసురులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోడానికి ప్రాణుల నీడని పట్టి బక్షిస్తుంటారు. అది దాటాక లోహితము అనే మధు సముద్ర తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగు వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి, అందుకని ఆ ద్వీపాన్ని శాల్మలీ ద్వీపం అంటారు. అక్కడున్న గిరి శిఖరాలకి మందేహులు అనే రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వాళ్ళు సూర్యుడు ఉదయించే సమయంలో, సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే, ఆ జలముల యొక్క శక్తి చేత, సూర్యుడి శక్తి చేత ఆ మందేహులు అనే రాక్షసులు సముద్రంలో పడిపోతుంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళి లేచి ఆ పర్వతానికి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. ఆ సముద్ర మధ్యలో ఋషభము అనే పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద సుదర్శనము అనే పేరుగల గొప్ప సరోవరం వెండి కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. దానిని దాటితే క్షీర సముద్రం వస్తుంది, దానిని కూడా దాటితే మధుర జలములు కలిగిన మహా సముద్రం వస్తుంది. అందులో ఔర్వుడు అనే మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది, దానికి హయముఖము అని పేరు.

దానిని దాటి ముందుకి ఒక 13 యోజనముల దూరం వెళితే ఒక బంగారు పర్వతం కనపడుతుంది. దానికి జాతరూప శిలము అని పేరు. దానిమీద సర్పాకృతి కలిగిన అనంతుడు నల్లటి బట్టలు ధరించి కూర్చొని ఉంటాడు, ఆయనే ఆదిశేషుడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ధ్వజం పెట్టబడి ఉంది. దాని పక్కనే ఒక వేదిక ఉంది, దానిని దేవతలు నిర్మించారు. మీరు ఆ ఆదిశేషుడిని దర్శించి ముందుకి వెళితే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనపడుతుంది. ఆ పర్వతం 100 యోజనముల వరకూ విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. దానిని దాటి వెళితే సౌమనసం అనే ధృడమైన బంగారు శిఖరము ఉంటుంది. అక్కడే బ్రహ్మగారు భూమండలానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే సూర్యుడి మొదటి కిరణ ప్రసారం ప్రారంభమవుతుంది. అది దాటి వెళితే కటిక చీకటి. ఇక్కడిదాక అంగుళం విడిచిపెట్టకుండా సీతమ్మ జాడ వెతకండి. కాబట్టి తూర్పు దిక్కుకి వెళ్ళే వానరాలు సిద్ధం కండి " అన్నాడు.

తరువాత సుగ్రీవుడు " నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, మైందుడు, ద్వివిదుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అనంగుడు, హుతాశరుడు మొదలైనవారందరికి నాయకుడిగా యువరాజైన అంగదుడు బయలుదేరి దక్షిణ దిక్కుకి వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరాలని తీసుకువెళ్ళండి. వెయ్యి శిఖరములు కలిగిన వింధ్య పర్వతానికి వెళ్ళి ఆ పర్వతం అంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి నదిలలో వెతకండి, తరవాత వరదా నదిలో వెతకండి. తరువాత మేఖల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరము, అబ్రవంతీ, అవంతీ నగరాలని వెతకండి.

నదీం గోదావరీం చైవ సర్వం ఏవ అనుపశ్యత |
తథైవ ఆంధ్రాన్ చ పుణ్డ్రాన్ చ చోలాన్ పాణ్డ్యాన్ కేరలాన్ ||

విదర్భ, ఋష్టిక, మాహి, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుణ్డ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాజ్యాలన్నీ వెతకండి. కావేరి నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది, ఆ ప్రాంతాన్ని వెతకండి. తరువాత మొసళ్ళతో ఉన్న తామ్రపర్ణీ నదిలో వెతకండి. ఆ తరువాత సముద్రం వస్తుంది, ఆ సముద్రంలోకి చొచ్చుకుపోయిన శిఖరములతో మహేంద్రగిరి పర్వతం కనపడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉంది, దానిని కాంచనలంక అంటారు. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే పది తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతము కనపడుతుంది. అది దాటితే సూర్యవత్, వైద్యుతం అనే పర్వతాలు కనపడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి, అవి తినండి. ఆ తరువాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది, దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా ముందుకి వెళితే భోగవతి అనే నగరం వస్తుంది, అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే సర్పాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తరువాత ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దానిమీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అనే మూడు రకాల చందనం కనపడుతుంది. ఇవి కాకుండా అగ్నితుల్యము అనే చందనం కూడా ఉంటుంది, కాని మీరు పొరపాటున కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, శకుడు, బభ్రువు అనే 5 గంధర్వ రాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారం చేసి ముందుకి వెళితే, పృద్వికి చివరన పుణ్యం చేసుకున్నవారు స్వర్గానికి వెళ్ళేవారు కనపడతారు. అదికూడా దాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యం ఉంటుంది, అక్కడ పాపులు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడిదాకా వెళ్ళి వెతికిరండి " అన్నాడు.

తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, ఆయనకి నమస్కరించి  " మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిష్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలని తీసుకొని పడమర దిక్కుకి వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, చిత్ర, కురు, పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు వెతకండి. అలాగే మురచిపురం, జటాపురం కనపడతాయి, వాటిని కూడా వెతకండి. సిందు-సాగర సంగమ స్థానంలో, 100 శిఖరాలతో, పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనపడుతుంది. మీకు ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనపడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి, సముద్రంలోని తిమింగలాలని ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రం అనే పర్వతం ఉంది, అది 100 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. దానిమీద 24 కోట్ల గంధర్వులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం చేసి ముందుకి వెళ్ళండి. అప్పుడు మీకు 100 యోజనాల ఎత్తయిన వజ్ర పర్వతం కనపడుతుంది. సముద్రంలో నాలుగోవంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది, దానిమీద విశ్వకర్మ వెయ్యి అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చేస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు, అలాగే పంచజనుడు అనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని తీసుకున్నారు.

అక్కడినుంచి ముందుకి వెళితే మీకు ప్రాక్ జ్యోతిషపురం అనే ప్రాంత కనపడుతుంది, దానిని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. దాని తరువాత సర్వ సౌవర్ణ అనే పర్వతం కనపడుతుంది. ఆ పర్వతాల మీద ఏనుగులు, పందులు, పులులు, సింహాలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. అదికూడా దాటిపోతే మేఘనం అనే పర్వతం కనపడుతుంది, ఈ పర్వతం మీదనే ఇంద్రుడు పాకశాసనుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతల చేత అభిషిక్తుడయ్యాడు. ఆ తరువాత 60,000 బంగారు పర్వతాలు కనపడతాయి, వాటి మధ్యలో మేరు పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరం మీద ఉన్న ఏ వస్తువైనా బంగారంలా మెరిసిపోతుంది. ఈ మేరు పర్వతం నుండి అస్తమయ పర్వతం 10,000 యోజనాల దూరంలో ఉంది, ఇంత దూరాన్ని సూర్య భగవానుడు అర ముహూర్తంలో దాటి వెళ్ళిపోతాడు. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడ్డ భవనంలో పాశము పట్టుకొని ఉన్న వరుణుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడినుంచి ముందుకి వెళ్ళాక బ్రహ్మగారితో సమానమైన మేరు సావర్ణి అనే మహర్షి కనపడతారు, ఆయనకి నమస్కారం చేసి సీతమ్మ ఎక్కడుంది అని అడగండి. ఇక అక్కడినుండి ముందుకి వెళ్ళడం కష్టం. కావున మీరందరూ అక్కడిదాకా వెతికి రండి " అన్నాడు.

తరువాత ఆయన శతబలి అనే వానరుడిని పిలిచి " శతబలి! నువ్వు లక్ష వానరములతో కలిసి ఉత్తర దిక్కుకి వెళ్ళు. నువ్వు మ్లేచ్ఛ, పులింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, కౌరవ మొదలైన ప్రాంతములలో వెతకండి. ఆ తరువాత సుదర్శన పర్వతాన్ని, దేవసఖ పర్వతాన్ని వెతకండి. ఆ తరువాత 100 యోగానాల నిర్జనమైన ప్రదేశం ఉంటుంది. ఆ తరువాత విశ్వకర్మ నిర్మితమైన తెల్లటి భవనంలో యక్షులకు రాజైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడున్న క్రౌంచ పర్వతానికి ఒక కన్నం ఉంటుంది, అందులోనుండి దూరి అవతలివైపుకి వెళ్ళండి. అప్పుడు మీకు మైనాక పర్వతం కనపడుతుంది, అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తుంటారు, మయుడు అక్కడే నివాసం ఉంటాడు. అక్కడే మీకు సిద్ధుల, వైఖానసుల, వాలఖిల్యుల ఆశ్రమాలు కనపడతాయి. అది కూడా దాటితే వైఖానస సరస్సు కనపడుతుంది, అందులో కుబేరుడి వాహనమైన సార్వభౌమము అనే ఏనుగు ఆడ ఏనుగులతో కలిసి స్నానం చేస్తుంది. ఆ తరువాత ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటితే శైలోదం అనే నది వస్తుంది. ఆ నదికి అటూ ఇటూ కీచకములు అనే వెదుళ్ళు ఉంటాయి, ఆ వెదుళ్ళ మీద ఋషులు అటూ ఇటూ దాటుతుంటారు. అక్కడినుండి ముందుకి వెళితే సిధ్దపురుషుడు కనపడతాడు. అది కూడా దాటితే పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తరకురు దేశం కనపడుతుంది. అక్కడ ఎన్నో వేల నదులు ప్రవహిస్తుంటాయి, అన్ని నదులలోను వెండి పద్మాలు ఉంటాయి. వాటినుండి రజస్సు నీళ్ళల్లో పడుతూ ఉంటుంది, అందువలన ఆ నీరు సువాసనలు వెదజల్లుతుంటుంది. అక్కడ చిత్రవిచిత్రమైన చెట్లుంటాయి, ఆ చెట్ల కింద నిలుచుని ఒక కోరిక కోరితే, ఆ కోరికలకి సంబంధించినది ఆ చెట్టుకి వస్తుంది. అక్కడినుంచి ముందుకి వెళితే మీకు సంగీత ధ్వనులు వినపడతాయి, అక్కడ ఎందరో సంతోషంగా తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక మీకు దుఃఖం అన్నది ఉండదు. అది దాటిపోతే ఉత్తర సముద్రం కనపడుతుంది, ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనే పర్వతం ఉంటుంది. సూర్యుడు లేకపోయినా ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అదికూడా దాటి వెళ్ళిపోతే ఒక పర్వతం మీద బ్రహ్మాండమైన, రమ్యమైన మందిరం కనపడుతుంది.

భగవాన్ తత్ర విశ్వాత్మా శంభుః ఏకాదశ ఆత్మకః | 
బ్రహ్మా వసతి దేవేశో బ్రహ్మ ఋషి పరివారితః ||

అక్కడ శంకరుడు11 రుద్రులుగా వచ్చి కూర్చుంటాడు. ఆ పక్కనే బ్రహ్మగారు వేదాన్ని బ్రహ్మర్షులకి చెప్తుంటాడు. ఇక అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేదు. మీరు అక్కడిదాకా వెళ్ళి సీతమ్మని వెతకండి. ఒక నెల సమయంలో సీతమ్మ జాడ కనిపెట్టండి " అని చెప్పాడు.

తరువాత సుగ్రీవుడు హనుమంతుడితో " హనుమా! నీకున్న పరాక్రమము, నీకున్న తేజస్సు, నీకున్న వేగము, నీకున్న బుద్ధి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నీ తండ్రి వాయుదేవుడికి ఎటువంటి గమన శక్తి ఉందో నీకు అటువంటి గమన శక్తి ఉంది. అందుకని నేను నీమీదే ఆశ పెట్టుకుంటున్నాను, ఎలాగైనా సీతమ్మ జాడ నువ్వు కనిపెట్టాలి " అన్నాడు.

ఇన్ని కోట్ల వానరాలు ఉండగా సుగ్రీవుడు కేవలం హనుమంతుడితో ఇలా చెప్పడం వల్ల రాముడికి హనుమంతుడి మీద నమ్మకం ఏర్పడింది. అప్పుడాయన హనుంతుడితో " నాయనా! నువ్వు సీత దెగ్గరికి వెళ్ళగానే వానర రూపంలో ఉన్న నిన్ను చూసి రాక్షసుడు అనుకొని బెంగపెట్టుకుంటుందేమో. అందుకని నీకు ఈ ఉంగరం ఇస్తున్నాను, ఈ ఉంగరాన్ని సీతకి చూపిస్తే ఆమె సమాస్వాసం పొందుతుంది " అని హనుమంతుడికి రాముడు తన ఉంగరాన్ని ఇచ్చాడు.

అప్పుడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని తన తల మీద పెట్టుకొని, రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరడానికి సిధ్దపడ్డాడు. సుగ్రీవుడు వానరులందరినీ " బయలుదేరండి " అని ఆదేశించాడు.

అప్పుడు ఆ వానరాలు చాలా సంతోషంగా కేకలు వేశారు. వాళ్ళల్లో ఒకడు ' ఒరేయ్! మీరందరూ ఎందుకురా నేనొక్కడినే సీతమ్మ జాడ కనిపెట్టేస్తాను ' అని అంటున్నాడు. మరొకడు ' నేను భూమిని చీల్చేస్తానురా ' అని అంటున్నాడు. ఇంకొకడు ' నేను సముద్రాల్ని కలిపెస్తాను ' అని, మరొకడు ' నేను పర్వతాలని కుదిపెస్తాను ' అని అంటున్నాడు. ' నేను వెళ్ళిన త్రోవలో ఇక చెట్లు ఉండవు, నా తొడల వేగానికి విరిచేస్తాను రా ' అని ఒకడు అంటున్నాడు. ' మీరందరూ విశ్రాంతి తీసుకొండిరా, ఆ పదితలల పురుగుని తీసుకొచ్చి రాముడి పాదాల దెగ్గర పడేస్తాను ' అని ఒకడు అంటున్నాడు. అలా అందరూ తొడలు కొట్టుకుంటూ, తోకలకి ముద్దులు పెట్టుకుంటూ, పైకి కిందకి ఎగురుతూ సంతోషపడిపోతున్నారు. అలా అందరూ సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం నాలు దిక్కులకి వెళ్ళిపోయారు.

అప్పుడు రాముడు సుగ్రీవుడితో " ఇన్ని దిక్కులలో ఉన్న విశేషాలు నీకు ఎలా తెలుసయ్య సుగ్రీవా? " అన్నాడు.

సుగ్రీవుడు అన్నాడు " నన్ను చంపుతానని వాలి వెంటపడితే ఈ భూమి చుట్టూ తిరిగాను, ఇవన్నీ అప్పుడు చూశాను. నేను ఎక్కడికి వెళ్ళినా వాలి నావెంట పడ్డాడు. ఆఖరికి హనుమంతుడు వాలికి ఉన్న శాపం గురించి చెబితే అప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్నాను " అన్నాడు.

అలా వానరాలన్నీ నాలుగు దిక్కులకి వెళ్ళడం వల్ల రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు సంతోషించారు.

సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి వెళ్ళిన వానరములలో 3 దిక్కులకి వెళ్ళిన వానరములు నెల రోజుల తరువాత వెనక్కి తిరిగి వచ్చేశాయి. వాళ్ళు అన్ని ప్రాంతాలని వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు.

దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరములు వింధ్య పర్వతం దెగ్గరికి వెళ్ళి, ఆ పర్వతంలో ఉన్న చెట్లని, గుహలని, సరస్సులని, మార్గమధ్యంలో ఉన్న నదులని, పట్టణాలని, గ్రామాలని అన్వేషిస్తూ వెళుతున్నారు. అలా కొంతదూరం వెళ్ళాక నిర్జనమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ చెట్లకి ఒక పండు లేదు, ఆకులు లేవు, ఒక జంతువు కూడా కనబడడం లేదు. అక్కడ తినడానికి కనీసం మూలములు కూడా కనపడలేదు. ఒకప్పుడు కణ్డువు అనే మహర్షి ఈ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. ఆయన తపఃశక్తికి దేవతలు కూడా భయపడేవారు. అటువంటి సమయంలో కణ్డువ మహర్షి కుమారుడు ఈ అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు కణ్డువ మహర్షికి ఈ అరణ్యంపట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడి ఈ అరణ్యంలో మనుష్యులు కాని, పక్షులు కాని, చెట్లు కాని, జంతువులు కాని ఏమి ఉండవు అని శపించారు.

వాళ్ళు ఆ అరణ్యాన్ని దాటి ముందుకి వెళ్ళగా, ఒక గుహ నుండి భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుడు బయటకి వచ్చి వానరాల మీదకి పరుగులు తీశాడు. ఆ రాక్షసుడిని చూసి దేవతలు కూడా భయపడతారు. అలా వస్తున్న రాక్షసుడిని చూసిన అంగదుడు వస్తున్నది రావణుడే అనుకొని, తన శక్తినంతా కూడబెట్టి అరిచేతితో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి రాక్షసుడి నవరంధ్రములనుండి రక్తము కారి కిందపడిపోయి మరణించాడు. అప్పుడు వారు ఆ రాక్షసుడు ఉన్నటువంటి గుహని వెతికారు, కాని ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు.

అలా వారు ఎన్ని ప్రాంతాలని వెతికినా ఏమి ప్రయోజనం లేకపోయింది. వాళ్ళకి ఎక్కడా నీరు, ఆహారము దొరకలేదు, దాంతో వాళ్ళకి విపరీతంగా ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళు తడిరెక్కలతో ఎక్కడినుంచన్నా పక్షులు వస్తున్నాయేమో అని వెతుకుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక బిలం నుండి తడి రెక్కలతో పక్షులు రావడం కనపడింది, వాటి వెనకాల కొన్ని జంతువులు తడి శరీరాలతో బయటకి వస్తున్నాయి. అప్పుడా వానరాలు గడ్డితో, లతలతో కప్పబడి ఉన్న ఆ బిలంలోకి ప్రవేశించారు. లోపలికి వెళితే అంతా చీకటిగా ఉంది, అందుకని ఆ వానరాలు ఒకరి చేతులని ఒకరు పట్టుకొని మెల్లగా లోపలికి వెళ్ళారు.

తీరా లోపలికి వెళ్ళి చూస్తే, అక్కడ లేని వృక్షం లేదు, అక్కడ లేని లత లేదు, చెట్లన్నీ పండ్లతో, పుష్పాలతో పరమ శోభితంగా ఉన్నాయి. ఆ చెట్లకి పెద్ద పెద్ద తేనెపట్లు ఉన్నాయి, అక్కడున్న సరోవరాలలో బంగారంతో చెయ్యబడ్డ తామరపువ్వులు వికసించి ఉన్నాయి. ఆ బంగారు పువ్వు నుండి పడిన పుప్పుడి చేత ఆ సరస్సులలోని నీరు చాలా తీయగా ఉంది. అక్కడ అంతస్తులతో కూడిన మేడలు ఉన్నాయి, ఒక అంతస్తు బంగారంతో, మరొక అంతస్తు వెండితో, మరొక అంతస్తు బంగారంతో, అలా అంతస్తులన్ని బంగారం, వెండితో తాపడం చెయ్యబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా వజ్రాలు పొదగబడ్డ బంగారు శయనాలు, ఆసనాలు ఉన్నాయి. ఆ వానరాలు ఈ ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ సరోవరాలలో ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకున్నారు.

అప్పుడు వాళ్ళకి కొద్ది దూరంలోనే ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ కృష్ణాజినం కట్టుకొని, నారచీర కట్టుకొని, తేజస్సుతో, తపోశక్తితో మెరిసిపోతూ ఉంది. ఆ తల్లి దెగ్గరికి ఈ వానరాలు వెళ్ళి నమస్కరించి " మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బయట నుంచి చూస్తే చిన్న బిలంలా ఉంది, లోపలికి వస్తే ఇంత అద్భుతంగా ఉంది. అసలు ఈ గుహ ఎవరిది, ఈ మేడలు ఎవరివి. మాకు చాలా చిత్రంగా ఉంది " అన్నారు.

అప్పుడా స్త్రీ " పూర్వం దానవ రాజు దెగ్గర మయుడనే శిల్పి ఉండేవాడు. ఆ మయుడికి అనేక మాయా శక్తులు ఉన్నాయి. ఆయన బంగారంతో ఈ ప్రాంతాన్ని నిర్మించాడు. ఆ మయుడు బ్రహ్మని గూర్చి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మయుడి తపస్సుకి ప్రీతి చెందిన బ్రహ్మదేవుడు ఆయనకి విశేషమైన వరాలని ఇచ్చాడు. తదనంతరం శుక్రాచార్యుల యొక్క ధనమంతా తీసుకొచ్చి మయుడికి ఇచ్చారు. కాని ఆ మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడని తెలిసి, ఇంద్రుడు ఆయనని తన వజ్రాయుధంతో సంహరించాడు. మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడు కనుక, ఈ గుహలో ఉన్న సమస్త ఐశ్వర్యము కూడా హేమకి చెందుతుందని బ్రహ్మగారు తీర్పు ఇచ్చారు. అప్పుడా హేమ ఈ ఐశ్వర్యానికి కాపలాగ ఉండడానికి నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని, నా పేరు స్వయంప్రభ. నాకు స్నేహితురాలైన హేమ నృత్యమునందు, సంగీతమునందు ప్రావీణ్యము కలిగిన స్త్రి. ఆమె నన్ను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని, గుహని కాపాడమని అడిగింది. స్నేహము మీద ఉన్న అనురక్తి చేత నేను ఈ గుహని కాపాడుతూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు కనుక మీకు కావలసిన కందమూలాలని, ఫలాలని ఆరగించండి. నీళ్ళు, తేనె కావలసినంత తాగి విశ్రాంతి తీసుకోండి. విశ్రమించిన తరువాత మీరు ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు చెప్పండి " అనింది.

అప్పుడా వానరాలు కడుపునిండా కావలసిన పదార్ధాలని తిని విశ్రమించారు. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో " దశరథ మహారాజు కుమారుడైన రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన భార్య అయిన సీతమ్మతో, తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. కాని సీతమ్మని రావణాసురుడనే రాక్షసుడు అపహరించాడు. అపహరింపబడ్డ సీతమ్మని వెతుకుతూ వాళ్ళు కిష్కిందకి చేరుకున్నారు. అక్కడ వారు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకున్నారు. సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నాలుగు దిక్కులకి వానరాలని పంపించాడు, సీతమ్మని వెతకడం కోసం. దక్షిణ దిక్కుకి యువరాజైన అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానర సమూహములో నేను ఒకడిని, నన్ను హనుమ అంటారు. సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వెతుకుతున్న మాకు ఎక్కడా ఆహారం, నీరు దొరకలేదు. అటువంటి సమయంలో తడి రెక్కలతో పక్షులు ఈ గుహ నుండి బయటకి రావడం చూశాము. ఇక్కడ నీళ్ళు దొరుకుతాయనే ఆశతో మేము ఈ గుహలోకి ప్రవేశించాము. సీతమ్మ జాడ మాకు చెప్పగలవా " అని అడిగాడు.

అప్పుడా స్వయంప్రభ " ఈ గుహలోకి మృగములు తప్ప మిగిలినవి ఎవన్నా ప్రవేశిస్తే, ప్రాణాలతో బయటకి వెళ్ళడం కుదరదు. కాని మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది, అందుకని మీ అందరినీ నా తపఃశక్తి చేత బయటకి పంపిస్తాను. మీరు కళ్ళు మూసుకొని, కళ్ళ మీద చేతులు పెట్టుకోండి " అనింది.

అప్పుడా వానరాలు మృదువైన కనురెప్పల్ని మూసి, తమ మృదువైన చేతులతో ఆ కన్నులని మూసుకున్నారు. మళ్ళి ఉత్తర క్షణంలో కనులు తెరిచేసరికి వాళ్ళందరూ వింధ్య పర్వతం మీద ఉన్నారు. ఆ ప్రాంతంలోని చెట్లు పువ్వులతో, పండ్లతో శోభిల్లుతుంది. అప్పుడా స్వయంప్రభ " మీరు ఈ గుహలో 4 నెలలపాటు ఉండిపోయారు " అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయింది. ( ఆ గుహలో వానరాలు గడిపింది కొంత సమయమే అయినా, ఆ గుహలో ఉన్నంత సేపు వాళ్ళకి కాలం తెలీలేదు.)

అప్పుడు అంగదుడు " మనం ఆశ్వయుజ మాసంలో బయలుదేరాము. కాని ఇప్పుడు వసంత కాలం వచ్చింది. మనని ఒక నెలలోపు తిరిగి వచ్చెయ్యమని సుగ్రీవుడు చెప్పాడు. కాని మనం కొన్ని నెలలు దాటిపోయాము. ఆలస్యం అయితే అయ్యింది కాని ఇందులో సీతమ్మ జాడ తెలిసినవాడు ఎవడన్నా ఉన్నాడా?, ఎవడూ లేడు. సుగ్రీవుడు చాలా క్రోధ స్వరూపుడు, సుగ్రీవుడు ఎలాంటివాడో నాకు తెలుసు. ఆయన నన్ను ఇష్టంగా యువరాజుని చెయ్యలేదు, రాముడు చెయ్యమన్నాడని నన్ను యువరాజుని చేశాడు. నేనంటే ఆయనకి చాలా కడుపుమంట. ఇప్పుడు నేను వెనక్కి వెళితే శత్రుత్వం తీర్చోకోవడానికి మంచి అవకాశం దొరికిందని మనందరి కుత్తుకలు కత్తిరిస్తాడు. అందుకని మనం అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడే ప్రాయోపవేశం (దర్భలని{గడ్డిని} దక్షిణ దిక్కుకి ఉండేలా పరుచుకొని, తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి దానిమీద పడుకుంటారు. అప్పుడు అటుగా వెళుతున్న ఏ ప్రాణి అయినా వాళ్ళని తినచ్చు) చేసి చనిపోదాము. నేను వెనక్కి రాను " అన్నాడు.

అప్పుడు మిగిలిన వానరాలన్నీ అంగదుడి బాధ చూడలేక కళ్ళు తుడుచుకొని, మనమూ ఇక్కడ ప్రాయోపవేశం చేసేద్దాము అన్నాయి.

అప్పుడు వాళ్ళల్లో ఒకడైన తారుడు అన్నాడు " అంగదుడు చెప్పిన మాట నిజమే, మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసేసి చనిపోదాము. లేదా నాకు ఒక ఆలోచన వస్తుంది, మనం ఆ స్వయంప్రభ గుహలోకి వెళ్ళిపోదాము. అందులో బోలెడన్ని చెట్లు, ఫలాలు, తేనె ఉన్నాయి. అవి తింటూ మనం అందులోనే ఉండిపోవచ్చు " అన్నాడు.

స చతుర్ణాం ఉపాయానాం తృతీయం ఉపవర్ణయన్ |
భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్య సంపదా ||

సామ, దాన, బేధ, దండోపాయములలో ఈ వానరముల మీద సామము కాని, దానము కాని, దండోపాయము కాని పనికిరాదు. అందుకని వీళ్ళ మీద బేధము అనే ఉపాయమును మాత్రమే ప్రయోగించాలి అని హనుమంతుడు అనుకొని, అంగదుడితో " నాయనా అంగదా! నువ్వు చాలా గొప్పవాడివి. ఈ రాజ్యభారాన్ని అంతా వహించగలిగిన శక్తి కలిగినవాడివి. కాని ఇవ్వాళ నీ బుద్ధియందు చిన్న వైక్లవ్యం కనిపిస్తుంది. నువ్వు ప్రాయోపవేశం చేస్తాను, లేకపోతె ఈ గుహలోకి వెళ్ళిపోతాను అంటున్నావు, నీతో పాటు ఈ మిగిలిన వానరాలు కూడా అలాగే చేస్తాము అంటున్నాయి. కాని జెరగబోయే పరిణామం ఎలా ఉంటుందో నేను చెబుతాను, నువ్వు కొంచెం ఆలోచించుకో, ఆ తరువాత నిర్ణయం తీసుకో.

ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళిపోయినా మీతో నేను రాను, జాంబవంతుడు రాడు, నీలుడు రాడు, సుహోత్రుడు రాడు. వెయ్యి పిడుగుల శక్తితో సమానమైన బాణములు లక్ష్మణుడి దెగ్గర చాలా ఉన్నాయి, ఒకవేళ మీరు గుహలోకి వెళ్ళినా లక్ష్మణుడి బాణాలు ఈ గుహని ముక్కలు చేస్తాయి. అప్పుడు మీరు ఎలా బ్రతుకుతారు. ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళినా కొంతకాలానికి మిగిలిన వానరాలకి తమ భార్యాపిల్లలు గుర్తుకొస్తారు. అప్పుడు వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు బంధువు అన్నవాడు లేకుండా ఒక్కడివే అయిపోతావు, ఆనాడు ఒక చిన్న గడ్డిపరక కదిలినా నువ్వు భయపడతావు. నువ్వు అన్నట్టు సుగ్రీవుడు అసత్యవాది కాదు, ఆయన కూడా సమ్మతించాడు కనుకనే నీకు యువరాజ పట్టాభిషేకం చేశాడు. నువ్వు తిరిగొచ్చి పరిపాలనచెయ్యి. అన్నిటినీమించి సుగ్రీవుడికి సంతానం లేదు, నువ్వే ఈ రాజ్యానికి వారసుడివి. నామాట నమ్ము, సుగ్రీవుడు నీకు ఎన్నడూ అపాయం కల్పించడు. తిరిగి వెళ్ళి జెరిగిన విషయాలని సుగ్రీవుడికి చెబుదాము " అన్నాడు.

అప్పుడు అంగదుడు " ఆనాడు మా నాన్న దుందుభిని చంపడానికని ఒక బిలంలోకి ప్రవేశించాడు. కాని సుగ్రీవుడికి రాజ్యము మీద ఉన్న కాంక్ష చేత మా నాన్న తిరిగిరాకుండా ఉండడం కోసమని ఆ బిలద్వారానికి ఒక శిలని అడ్డుపెట్టాడు. మా నాన్న బతికున్నాడని తెలిసి కూడా మా అమ్మని తన భార్యగా అనుభవించాడు. నాయందు కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎన్నడూ లేదు. నేను తిరిగొస్తే సాకు దొరికిందని నన్ను చంపుతాడు. సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా ప్రాయోపవేశం చేసి మరణించడం నాకు ఇష్టం. మీరు వెళ్ళి నేను నా పినతండ్రికి, నా తల్లికి, నా పినతల్లికి, పెద్దలకి నమస్కారం చేశానని చెప్పండి " అని చెప్పి, ప్రాయోపవేశం చెయ్యడం కోసమని దర్భల మీద పడుకున్నాడు.

అప్పుడా మిగతా వానరాలు కూడా అంగదుడిలాగానే దర్భల మీద పడుకున్నారు. అలా కింద పడుకున్నవాళ్ళు రామ కథని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు.

సాంపాతిః నామ నామ్నా తు చిర జీవీ విహంగమః |
భ్రాతా జటాయుషః శ్రీమాన్ ప్రఖ్యాత బల పౌరుషః ||

వీళ్ళందరూ రామ కథ చెప్పుకుంటూ ఉండగా అక్కడున్న కొండ శిఖరం మీదకి ఒక పెద్ద పక్షి వచ్చింది, కాని దానికి రెక్కలు లేవు. ఆ పక్షి ఇంతమంది వానరాలని చూసి ' ఆహా ఏమి నా అదృష్టము, ఒకడిని తింటే మిగిలిన వారు పారిపోతారు, కాని వీళ్ళు ప్రాయోపవేశం చేస్తున్నారు కనుక ఎవరూ కదలరు. మెల్లగా ఒక్కొక్కరిని తినచ్చు ' అని ఆ పక్షి అనుకుంది.

ఆ వానరాలు చెప్పుకుంటున్న రామ కథ వింటున్న ఆ పక్షి గట్టిగా ఒక మాట అనింది " నా మనస్సు కంపించిపోయేటట్టుగా, నా సోదరుడైన జటాయువు రావణాసురుడి చేత వధింపబడ్డాడన్న మాట చెప్పినవాడు ఎవడురా ఇక్కడ. అసలు నా తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు. దశరథ మహారాజు జటాయువుకి స్నేహితుడు, దశరథుడు ఏ కారణం చేత మరణించాడు. నా రెక్కలు కాలిపోయాయి, నా అంతట నేను మీ దెగ్గర కుర్చోలేను. ఎవరన్నా వచ్చి నన్ను దించండిరా " అనింది.

కాని కింద పడుకున్న వానరాలు ఒకరితో ఒకరు " అదంతా ఒట్టిదే, మనన్ని తినెయ్యడానికి అలా అంటుంది. మనం అక్కడికి వెళితే అది మనన్ని తినేస్తుంది " అన్నారు.

వాళ్ళల్లో ఒకడు అన్నాడు " అది మనన్ని నిజంగా చంపేసిందే అనుకో, మనం ప్రాయోపవేశం చేస్తున్నాము కదా మరి దానిని తేవడానికి భయం ఎందుకు, వెళ్ళి తీసుకురండి " అన్నాడు.

అప్పడు అంగదుడు వెళ్ళి ఆ పక్షిని తీసుకొచ్చాడు. అప్పుడా వానరాలన్నీ ఆ పక్షి చుట్టూ చేరాయి. అప్పుడాయన " అసలు మా జటాయువు ఏమయ్యాడు? " అని అడిగాడు.

అంగదుడు మళ్ళి రామ కథ చెప్పడం ప్రారంభించాడు. అంగదుడు రామ కథ మొత్తం చెప్పి ' నువ్వు ఎవరు? ' అని ఆ పక్షిని ప్రశ్నించాడు.

అప్పుడా పక్షి " సంపాతి అనబడే నేను, జటాయువు సోదరులము. సూర్యుడు ఉదయించినప్పటినుంచి అస్తమించేలోపు ఆయనతో సమానంగా ప్రయాణం చెయ్యాలని మేము ఒకనాడు పందెం కాసుకున్నాము. అనుకున్న ప్రకారం నేను, జటాయువు సూర్యుడి వెనకాల వెళ్ళిపోతున్నాము. అలా వెళుతుండగా మిట్ట మధ్యాహ్నం వేళ మేము సూర్యుడికి దెగ్గరగా వచ్చాము. అప్పుడా సూర్యుడి వేడిని భరించలేక జటాయువు స్పృహతప్పి కిందపడిపోతున్నాడు. పెద్దవాడిని కనుక తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలని జటాయువుకి అడ్డంగా పెట్టాను. అప్పుడా సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడిపోయాను. కాని నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలీలేదు. మళ్ళి ఇంతకాలానికి మీవల్ల నా తమ్ముడి గురించి విన్నాను. నా తమ్ముడు చనిపోయాడన్న వార్త వినడం వల్ల నాకు చాలా బాధ కలుగుతోంది. చనిపోయిన నా తమ్ముడికి జలతర్పణ ఇవ్వాలి అనుకుంటున్నాను, కాని నేను ఎగరలేను. మీరు నన్ను తీసుకెళ్ళి ఆ సముద్ర జలాల దెగ్గర దింపండి, నేను నా తమ్ముడికి తర్పణలు ఇస్తాను " అన్నాడు.

సంపాతి కోరిక మేరకు వాళ్ళు  ఆయనని సముద్ర తీరానికి తీసుకువెళ్ళారు, ఆయన అక్కడ జటాయువుకి తర్పణలు సమర్పించాడు.

మళ్ళి వెనక్కి తిరిగొచ్చాక ఆ వానరాలు సంపాతితో " జటాయువు రామకార్యంలో సహాయం చేశాడు, నువ్వు కూడా రామకార్యంలో ఏమన్నా సహాయం చెయ్యగలవా. నీకు సీతమ్మ జాడ ఏమన్నా తెలుసా " అని అడిగారు.

నిర్దగ్ధ పక్షో గృధ్రో అహం గత వీర్యః ప్లవం గమాః |
వాఙ్ మాత్రేణ తు రామస్య కరిష్యే సాహ్యం ఉత్తమం ||

అప్పుడా సంపాతి " రెక్కలు కాలిపోయాయి నాకు, ఇవ్వాళ ఇలా పడి ఉన్నాను, ఇంతకన్నా ఏమి చెయ్యగలను. కాని రామకార్యానికి నేను మాటమాత్రం సహాయం చేస్తాను. సీతమ్మని రావణుడు ఆకాశ మార్గంలో తీసుకెళుతున్నప్పుడు ఆమె ఆభారణాలని కొంగుకి చుట్టి విడిచిపెట్టడం నేను చూశాను. ఆ రావణాసురుడు విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు, సాక్షాత్తు కుబేరుడి తమ్ముడు. ఆయన లంకా నగరానికి అధినేత. ఈ సముద్రానికి దక్షిణ దిక్కున 100 యోజనముల అవతల లంక ఉంటుంది. ఆ లంకలో ఎక్కడ చూసినా బంగారు స్తంభములతో నిర్మింపబడ్డ భవనాలు ఉంటాయి. అటువంటి లంకా నగరంలో దీనురాలై,  పచ్చని పట్టు పుట్టం కట్టుకుని, ఏడుస్తూ, చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ ఉంది. నాకు ఇవన్నీ ఎలా తెలుసని అడుగుతారేమో, నేను ఇక్కడే కూర్చుని సీతమ్మని చూడగలను. నేను దివ్య దృష్టితో చూడగలను, మాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే, భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరములో తమ కాళ్ళ దెగ్గర ఉన్న ధాన్యాన్ని ఏరుకొని తినే కులింగములు అనే పక్షులు ఎగురుతాయి. రెండవ అంతరంలో చెట్ల మీద ఉండే ఫలాలని తినే పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో భాసములు, క్రౌంచములు ఎగురుతాయి. నాలుగవ అంతరంలో డేగలు ఎగురుతాయి. అయిదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో వినతా పుత్రులమైన వైనతేయులము కాబట్టి  మేము ఎగురుతాము. అందుకని మేము తినే తిండి చేత, సహజంగా మేము జన్మించిన జాతి చేత 100 యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే ఉండి చూడగల దృష్టిశక్తి మా కంటికి ఉంటుంది.

అదుగో దూరంగా లంకా పట్టణంలో, అశోక వనంలో సీతమ్మ కూర్చుని ఉండడం నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడు ఉంటె, సీతమ్మ యొక్క దర్శనం చెయ్యవచ్చు.

తీక్ష్ణ కామాః తు గంధర్వాః తీక్ష్ణ కోపా భుజంగమాః | 
 మృగాణాం తు భయం తీక్ష్ణం తతః తీక్ష్ణ క్షుధా వయం ||

గంధర్వులకి కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకని నాకు ఆకలి ఎక్కువగా ఉండేది, కాని వెళ్ళి తిందామంటే నాకు రెక్కలు లేవు. నా కొడుకైన సుపార్షుడు రోజూ వెళ్ళి ఆహారం తీసుకోచ్చేవాడు. కాని ఒకనాడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన నా కొడుకు ఎంతసేపటికీ వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడుతూ నేను ఎదురుచూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులతో నా కొడుకు వచ్చాడు, అది చుసిన నాకు కోపం వచ్చి నా కొడుకుని నిందించాను. అప్పుడు సుపార్షుడు అన్నాడు ' నాన్నగారు! నా దోషంలేదు, నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద కూర్చొని సముద్ర జలాలలోకి చూస్తున్నాను, ఏదన్నా పెద్ద ప్రాణి కనపడగానే తీసుకొచ్చి మీకు పెడదాము అనుకున్నాను. కాని ఇంతలో ఆకాశంలో, నల్లటి స్వరూపంతో ఉన్న రాక్షసుడు, మెడలో తెల్లటి ముత్యాల హారం వేసుకొని, తెల్లటి బట్ట కట్టుకొని వెళుతున్నాడు. మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో, అలా ఒక స్త్రీ అతని చేతులలో తన్నుకుంటుంది. హ రామ, హ లక్ష్మణా అని అరుస్తుంది. నేను వాడిని చూసి మంచి ఆహారం దొరికింది అనుకున్నాను. కాని వాడు నా దెగ్గరికి వచ్చి నమస్కరించి ' మహానుభావ! నాకు దారి విడిచిపెట్టవయ్య ' అన్నాడు. ఎంతటివాడైన అలా బతిమాలుతు సామంతో మాట్లాడితే, ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటివాడిని దిక్కరించకూడదు కదా, అందుకని నేను వాడిని వదిలిపెట్టేశాను. కాని వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవగణాలు, ఋషిగణాలు నా దెగ్గరికి వచ్చి ' అదృష్టవంతుడివిరా బతికిపోయావు, వాడు దుర్మార్గుడు, వాడి పేరు రావణాసురుడు. వాడు చాలా బలవంతుడు, వాడికి విశేషమైన వరాలు ఉన్నాయి ' అని చెప్పి వెళ్ళారు.

ఈ విషయాన్ని నా కొడుకు చెప్పడం వల్ల నాకు సీతమ్మ గురించి తెలిసింది. సీతమ్మని రావణాసురుడే అపహరించి లంకకి తీసుకువెళ్ళాడు.

నేను వింధ్య పర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. 6 రోజుల తరువాత తెలివొచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు, నాకేమో రెక్కలు కాలిపోయాయి, అందుకని ఆ పర్వతం మీద నుండి కిందకి దూకి మరణిద్దాము అనుకున్నాను, కాని ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో నేను నా తమ్ముడు కామరూపులము కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళము. అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళము. అందుకని ఒక్కసారి ఆ మహర్షి పాదాలకి నమస్కరించి ప్రాణాలు విడిచిపెడదాము అనుకొని మెల్లగా డేకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడా మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఎలా ఉందంటే, అభిషేకం చెయ్యబడ్డ బ్రహ్మగారు వెళుతున్నట్టు ఉన్నారు. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో, అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఆయన చుట్టూ ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి. తరువాత ఆయన బయటకి వచ్చి నన్ను చూసి ' నిన్ను చాలాకాలం నుండి చూస్తున్నాను, నువ్వు, నీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా. నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేంటి ' అని అడిగారు. అప్పుడు నేను జెరిగిన కథంతా చెప్పాను. అప్పుడాయన అన్నారు ' సంపాతి! బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జెరగవలసి ఉంది. నువ్వు కొంతకాలానికి సీతాపహరణాన్ని చూస్తావు. ఈ సీతమ్మని అన్వేషిస్తూ వానరులు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను, అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళి వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలని ఉంది, కాని అంతకాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దాము అనుకుంటున్నాను. నువ్వు మాత్రం ఈ కొండమీదే వేచి ఉండు.

నీకు ఇంకొక విషయం చెబుతాను, సీతమ్మని అపహరించిన తరువాత ఆమెని వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు, దివ్యమైన భోజనము పెడతాడు. కాని ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక మెతుకు ముట్టదు. ఆ తల్లికోసం దేవేంద్రుడు ప్రతి రోజూ దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు. కాని సీతమ్మ ఆ పాయసాన్ని తినదు. ఆమె, పైన ఉన్న పాయసాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బతికుంటే, ఈ పాయసం వారికి చెందుగాక, ఒకవేళ రామలక్ష్మణులు శరీరాలని విడిచిపెట్టి ఉంటె, ఉర్ధలోకములలో ఉన్నవాళ్ళకి ఈ పాయసం చెందుగాక, అని భూమి మీద పైన ఉన్న పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. ఈ విషయాన్ని ఆ వానరులు వచ్చాక వాళ్ళకి చెప్పు ' అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకని కొన్ని వేల సంవత్సరముల నుండి ఇలా బతికి ఉన్నాను.

తస్య తు ఏవం బ్రువాణస్య సంహతైః వానరైః సహ ||
ఉత్పేతతుః తదా పక్షౌ సమక్షం వన చారిణాం ||

సంపాతి ఈ మాటలని వానరాలకి చెప్పగానే కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళి పుట్టాయి. అప్పుడాయన తన ఎర్రటి రెక్కలని అటూ ఇటూ ఊపి చూసుకున్నాడు. ఆనందంతో ఆ సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

ఇంక అక్కడున్న వానరాలకి ఇది చూడగానే చాలా సంతోషంవేసింది. సముద్రాన్ని దాటుదామని వాళ్ళందరూ కలిసి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు " ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళగలిగినవాడు ఎవడు. మిగిలిన వానర జాతికి ఎవడు ప్రాణప్రదానం చెయ్యగలిగినవాడు. ఈ సముద్రం దెగ్గర నిలబడిపోయిన వానరాలు సంతోషంగా తిరిగి వెళ్ళి తమ భార్యాపిల్లలని చూసేటట్టు చెయ్యగలిగినవాడు ఎవడు. ఎవరివల్ల ఈ కార్యం జెరుగుతుంది, ఎవరు అంతటి సమర్ధుడు " అని అడిగారు.

అప్పుడు శరభుడు లేచి, నేను 30 యోజనములు వెళతాను అన్నాడు, అలాగే ఋషభుడు 40 యోజనములు వెళతాను అన్నాడు, గంధమాదనుడు 50, మైందుడు 60, ద్వివిదుడు 70, సుషేణుడు 80. అప్పుడు జాంబవంతుడు లేచి అన్నాడు " నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడిని. పరమేశ్వరుడు త్రివిక్రమావతారంతో(వామన) పెరిగిపోతుంటే నేను ఆయనకి 21 సార్లు ప్రదక్షిణ చేశాను. కాని ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఇప్పుడు 90 యోజనాలు ఎగరగలను " అన్నాడు.

అప్పుడు అంగదుడు అన్నాడు " నేను 100 యోజనాలు వెళ్ళగలను, కాని తిరిగి మళ్ళి ఈ 100 యోజనాలు రాలేను " అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు " అయ్యో, అది మహా పాపం. ప్రభువు వెళ్ళి పని చేస్తుంటే, ఆయనని సేవించేవారు హాయిగా కూర్చుంటే అది చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు మాకు పనిని పురమాయించాలి. ఎవరిని పంపాలో నాకు తెలుసు, వాడిని నేను పంపిస్తాను, మీరందరూ చూడండి " అని ఒక్కడిగా కూర్చున్న హనుమంతుడి దెగ్గరికి వెళ్ళి " ఏమయ్యా హనుమా! ఏమి తెలియని వాడిలా ఇలా కూర్చున్నావు. ఒకానొకప్పుడు అప్సరసలలో శ్రేష్టురాలైన పుంజికస్థల అనబడే ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడు అనే వానరానికి కుమార్తెగా జన్మించింది. ఆమెకి అంజనా అని పేరు పెట్టారు. ఆమె నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య. నీ తల్లి కామరూపి అవడంచేత ఒకనాడు మనుష్య రూపం దాల్చి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయువు ఆమెని చూసి మోహించి, తన దీర్ఘమైన బాహువుల చేత గట్టిగా కౌగలించుకున్నాడు. అప్పుడా తల్లి ' ఎవడురా దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నవాడు ' అనింది. అప్పుడా వాయువు అన్నాడు ' అమ్మా! బ్రహ్మగారు మా తేజస్సులని వానర స్త్రీలయందు ప్రవేశపెట్టి వానరాలని సృష్టించామన్నారు. అందుకని నీ పాతివ్రత్యానికి భంగం కలగకుండా గొప్ప పరాక్రమము ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానంగా దూకగలిగినవాడు, ఎగరగలిగినవాడైన పుత్రుడు కేవలం నిన్ను నేను మానసికముగా చూసినంత మాత్రాన నీ కడుపుయందు జన్మించనున్నాడు ' అన్నాడు. ఆ కారణం చేత నువ్వు జన్మించావు.
 
నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి తినే ఫలం అనుకొని ఆయనని పట్టుకోబోయావు. సూర్య పధానికి అడ్డు వస్తున్నావని కోపమొచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే, నీ ఎడమ దవడ చొట్టపడి కింద పడ్డావు. సొట్టపడ్డ హనుములు కలిగినవాడివి కనుక నిన్ను హనుమ అని పిలిచారు. నువ్వు అలా పడిపోవడం చేత నీ తండ్రి అయిన వాయుదేవుడికి కోపం వచ్చి భూమిమీద వీచడం మానేశాడు. అప్పుడు బ్రహ్మగారు పరుగు పరుగున వచ్చి, గాలి వీచకపోతే సృష్టి ఆగిపోతుందని " హనుమా! ఏ అస్త్రము చేత, ఏ శస్త్రము చేత నిన్ను ఎవరూ బంధించలేరు " అని వరం ఇచ్చారు. అలాగే ఇంద్రుడు నీకు స్వచ్ఛంద మరణ వరం ఇచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి కాని, నిన్ను పడగొట్టగలిగే పురుషుడు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఉండడు.

నేను ఎన్నో సందర్భాలలో సముద్రంలో ఉన్న పాముల్ని గరుగ్మంతుడు తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి అయిన వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే పెద్ద పెద్ద చెట్ల యొక్క కొమ్మలని విరిచేస్తాడు. అటువంటి శక్తిమంతుడైన వాయుదేవుడి కుమారుడవైన నీకు ఆ గమన శక్తి ఉంది, గరుగ్మంతుడికి ఆ గమన శక్తి ఉంది. ఇవ్వాళ కొన్ని కోట్ల వానరముల భవిత, సౌభాగ్యము, ప్రాణములు నీ చేతులలో ఉన్నాయి. నీ వీర్యమును, తేజస్సును, పరాక్రమమును ఒక్కసారి పుంజుకో. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి సీతమ్మ జాడ కనిపెట్టి ఇక్కడికి రా. హనుమా! నీ శక్తిని చూపించు " అని జాంబవంతుడు అన్నాడు.

జాంబవంతుడి మాటలు విన్న హనుమంతుడు మేరు పర్వతం పెరిగినట్టు తన శరీరాన్ని పెంచేశాడు. గుహలో నుండి సింహం ఆవలిస్తూ బయటకి వస్తుంటే దానిని చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతాయో, అలా అప్పటివరకూ తమతో తిరిగిన హనుమంతుడు అటువంటి స్వరూపాన్ని పొంది, ఒక్కసారి ఆవలించి, బాహువులని పైకి ఎత్తి ఒక్కసారి విదిల్చి భూమి మీద కొట్టేసరికి వానరములన్నీ భయపడిపోతూ, శ్రీమహా విష్ణువు దర్శనం అయితే ఎలా నిలబడతారో అలా హనుమంతుడిని చూసి అంజలి ఘటించి నిలబడిపోయారు.

అప్పుడు హనుమంతుడు అక్కడ ఉన్న వృద్ధులైన వానరాలకి నమస్కరించి " నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుడి యొక్క సఖుడు. వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళతాడో నేను అటువంటి గమనంతో వెళతాను. నేను వెళుతున్నప్పుడు నాకు అడ్డొచ్చిన ఏ ప్రాణినైనా నా వక్షస్థలంతో గుద్ది చంపేస్తాను. పర్వతాలని చూర్ణం చేస్తాను, సముద్రాల్ని కలయ తిప్పుతాను. నా బాహువుల శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగ తోడుతాను. 100 యోజనములే కాదు 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుండి ఇటువైపుకి వెళతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుండి ఆకాశంలోకి వెళతాను, సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను. సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కుకి వెళుతుంటే ఆయన దెగ్గరికి వెళ్ళి మళ్ళి నమస్కరించి వస్తాను. గరుగ్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా ఆయనకి కొన్ని వేలసార్లు ప్రదక్షిణం చేస్తాను. ఇక్కడ నుండి లేచి దక్షిణ దిక్కున ఉన్న సముద్రాన్ని ముట్టుకుంటాను. రావణాసురుడిని కొట్టి చంపేస్తాను, లేదా లంకని ఫెల్లఘించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకువచ్చి రాముడి పాదాల దెగ్గర పడేస్తాను. ఇక నా పరాక్రమము ముందు నిలబడగలిగినవాడు లేడు. బ్రహ్మగారు, దేవేంద్రుడు చెరొక ఆసనం మీద కుర్చూని మధ్య ఆసనంలో అమృతాన్ని పెడితే, ఇద్దరి మధ్యలోకి వెళ్ళి, చెరొక చేతితో ఇద్దరినీ అడ్డగించి అమృతాన్ని తీసుకురాగలను. ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతుంది, అందుకని మహేంద్రగిరి పర్వతం మీద నుంచి బయలుదేరతాను " అన్నాడు.

అలా హనుమంతుడు ఆ మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కుతుంటే, అక్కడున్న గంధర్వులు, విద్యాధరులు ఎగిరి పారిపోయారు. అనిల కుమారుడి పద ఘట్టనకి ఆ పర్వతం కంపించిపోయింది, చెట్లు నేలరాలిపోయాయి, మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి. హనుమంతుడిని చూసిన వానరాలు "
మహానుభావ! ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనము చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడు వస్తావ అని ఒంటి పాదం మీద నిలబడి ఉంటాము. ఇన్ని కోట్ల వానరాలకి ప్రాణము పెట్టిన వాడిగా కీర్తి గడించెదవుగాక. నీకోసం పుణ్య కర్మలను చేస్తూ ఇక్కడ నిలబడి ఉంటాము " అన్నారు.

హనుమంతుడు మానసిక ఉత్సాహమును పొంది లంకా పట్టణాన్ని మనస్సుతో చేరిపోయి ఉన్నాడు.

No comments:

Post a Comment