Saturday, August 18, 2012

ఉప్పుగౌరీ నోము

అదో గ్రామం. ఆ గ్రామము నందు ఒక బ్రాహ్మణుడు. ఆయనకు వివాహమైనది. అ దంపతులకు వరుసగా ఆరుగురు ఆడపిల్లలు. ఐదుగురికి వివాహాలయ్యాయి. అత్త వారింటికి వెళ్ళిపోయారు. ఇక ఆరవ కుమార్తెకు వివాహం చేయాలి. బ్రాహ్మణుని వద్ద ధనం లేదు. పెండ్లి చేసేందుకు శక్తి లేదు. ఎలాగరా భగవంతుడా యని విచారిస్తూ కూర్చునేవాడు.

రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు గౌరీ దేవి వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి అంతా తెలిసికొని వారింట భోజనం చేసి వారికి ధైర్యం కలుగజేస్తూ - బ్రాహ్మణ దంపతులారా! విచారించకండి. మీ కుమార్తె వివాహం అత్యంత వైభవంగా జరుగుతుంది. మీరు మీ కుమార్తె చేత ఉప్పు గౌరీ నోము ఆచరింపజేయండి. ధనం అవసరం లేదు. ఖర్చు అవదు. భక్తి శ్రద్ధలతో నోయించండి. చక్కని వరుడు వస్తాడు. బిడ్డ అత్తింట సుఖపడుతుంది. సిరి సంపదలకు లోటురాదు అని వ్రతవిధానం చెపుతూ - బ్రాహ్మణ దంపతులారా! శ్రద్ధగా వినండి 5 సోలల ఉప్పు కావాలి, ఆ ఉప్పును కొత్త కుండలో పోయాలి. ఉప్పుతో ఉన్న కుండను (నూతన వస్త్రం) రవికెల గుడ్డలతో మూయాలి. అనంతరం మంచి మనసుగల ముత్తయిదువునకు తాంబూలమిచ్చి దక్షిణనిచ్చి భక్తితో ఆ ఉప్పుకుండ నీయాలి. శ్రద్ధా భక్తులతో ఈ వ్రత మాచరించండి. అని చెప్పి గౌరీ దేవి అంతర్ధాన మైనది. యధావిధిగా విధానంగా వ్రతం చేయించారు. ఆ బ్రాహ్మణ దంపతులు. ఆమెకు చక్కని వరునితో వివాహమైనది. సిరి సంపదలతో సుఖంగా జీవించింది. ఈ ఉప్పు గౌరీ వ్రతం స్త్రీ లందరూ చేయవచ్చును.

No comments:

Post a Comment