Saturday, August 18, 2012

కుందేటి అమావాస్య నోము


చాల విచిత్రమైన కధ యిది. విచిత్రమైన నోము. పవిత్రమైన వ్రతం వినండి . అదో గ్రామం .ఆ గ్రామ మందు ఒక చాకలి రేవు . ఆ రేవులో ఎన్నో బానలు .అందులో ఒక బాన యందు ఒక కుందేలు తన పిల్లలను ఉంచి మేతకని వెళ్ళింది . ఇంతలో రేవు వద్దకు చాకలి వచ్చినది. బానను సరిగా చూడకుండా మామూలుగా నీరు పోసి మంట పెట్టినది.ఇంతలో కుందేలు తన పిల్లల కోసం బాన చుట్టూ తిరుగుతూ బాధ పడుతోంది .బాన లోపల యున్న కుందేలు పిల్లలు ఎంత పని చేసితివమ్మా ! ఎంత పనిచేసితివి .చచ్చితిమమ్మా చచ్చితిమి అని అరువసాగాయి .విని కుందేలు చలిమిడి వాయన మిచ్చాను కదా మీకు చావు రాదు అని అరచినది . అంత కుందేలు పిల్లలు వేడికి మగ్గి పోవుచున్నామమ్మా అని అరవ సాగాయి. విని కుందేలు చక్కని బెల్లం వాయన మిచ్చాను మీకు బాధ ఉండదు అని పలికింది .అంత కుందేలు పిల్లలు - బ్రతికితిమి అమ్మా ! బ్రతికితిమి అని అరచాయి . విని కుందేలు బియ్యము వాయన మిచ్చాను బ్రతుకక ఏమౌతారు అని అరచినది .

ఇంతలో పని ఉండి ఎక్కడికో వెళ్ళిన చాకలి అక్కడకు వచ్చి కుందేలును చూచి -నీవిక్కడ ఎందుకున్నావు? చాకిరేవు దగ్గర నీకు పని ఏమిటి అని అడుగగా కుందేలు విషయమంతా వివరించి చెప్పినది .చాకలి కంగారుగా బానలో చూడగా కుందేలు పిల్లలు హాయిగా సుఖంగా ఉన్నాయి .ఎంత విడ్డూరము ! ఏమి ఆశ్చర్యము ,చాలా వింతగా ఉన్నదే ,అని చాకలి విస్తు పోయినది .దీనికి కారణం ఏమిటని అడుగగా కుందేలు చాకలీ విను -

నేను మేతకని బయలు దేరి వెళ్లాను .ఇంతలో ఒక చోట అమావస్య వ్రతం జరుగుతోంది . చూడాలని ,కధ వినాలని వెళ్లాను .చూసాను విన్నాను ఆ పుణ్య వ్రత ఫలం .ఆ పవిత్రమైన నోము చూసి విన్నందు వల్ల నాకు ఫలం కలిగింది . నా బిడ్డలు బ్రతికారు అని కుందేలు వివరించి చెప్పింది. చాకలి శ్రద్దగా వింది. కుందేలు ద్వారా విన్న ఆ అమావస్య నోము ఆనాటి నుండి కుందేటి అమావస్య నోముగా ప్రసిద్ది కెక్కింది. ఈ నోము నోచిన వారికి ,ఈ వ్రత మాచరించిన వారికి ప్రమాదాలు రావని పెద్దలు నిర్ణయించారు. ఎందరో నోచి ఫలం పొందారు, పొందు తున్నారు. ఇక ఉద్యాపన విషయం వినండి .

3 శేర్ల బియ్యంతో చలిమిడి చేయాలి .ఆ చేసిన చలిమిడితో కుందేలు పిల్లల ఆకారంలో ముద్దలు చేసికోవాలి .ఆ చేసిన ముద్దలను ఒక బానలో ఉంచాలి. పసుపు,కుంకుమ ,రవికెల గుడ్డ ,నల్ల పూసలు సిద్దం చేసుకుని దక్షిణతో తాంబూల మిచ్చి ముత్తైదువులకు వాయన మీయాలి .అలా 13 అమావాస్యలు జరుపుకోవాలి . అనంతరం యదా శక్తి వేడుక చేసికోవాలి .ఆపదలు రావు. సుఖం, సౌఖ్యం, శాంతి కలుగుతాయి. ఫలం సిద్దించును.

స్త్రీలందరూ తమ బిడ్డల క్షేమం కొరకు ఆచరించ వచ్చును. శ్రద్దగా భక్తితో చేయాలి . బిద్దలందరూ సుఖంగా ఉందురు. బాధలు ఆపదలు తొలగి పోవును.
నమ్మకం లేనివారు చేసిన ప్రయోజన ముండదు. నమ్మికతో చేసిన ఫలం సిద్దిస్తుంది . ఆచరించి నోము నోచి ఫలం పొందండి. మీ బిడ్డల క్షేమం కోరుకోండి.ఉద్యాపన తెలిసి కున్నారు కదా ఆలస్యం దేనికి ఈ ఏటి నుంచే ప్రారంబించు కుని సుఖ శాంతులు పొందండి.


No comments:

Post a Comment