Saturday, August 18, 2012

కన్నె తులసమ్మ నోము

చాలా ప్రాచీన కాలము నాటి మాట. ఆ కాలమున ఒక గ్రామం ఆ గ్రామ మందు ఒక బ్రాహ్మణుడు. వివాహమైనది. వారిద్దరూ చక్కగా కాపురం చేసి కొంటున్నారు. వారికి ఒక కుమార్తె జన్మించింది. కాని పాపం ఆ బిడ్డ పుడుతూనే తల్లిని పోగొట్టుకుంది. తల్లి చనిపోయిన ఆ బిడ్డను తండ్రి కడు గారాబంగా పెంచి పెద్ద చేయ సాగాడు. దగ్గర బందువులు ఆయనకు మరల వివాహం చేసికోమని బలవంతం చేసి రెండో పెళ్లి చేశారు. ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. బాగానే ఉంది. కాని ఆ సవతితల్లి పాపమా బ్రాహ్మణుని మొదటి భార్య కుమార్తెను నానా బాధలు పెట్టేది. హింసించేది.

దాసీ పిల్లలా చూసేది .నీచంగా చూసేది. అన్నీ తెలిసి ఏమీ చేయలేని అసమర్దుడయ్యాడా పిల్ల తండ్రి. కాలం గడుస్తోంది. కార్తీక మాసం వచ్చింది. శుద్ధ ఏకాదశి. ఆ రోజున ఆ బ్రాహ్మణుని భార్య తులసి పూజ చేసుకుంటోంది. పిల్లవాడిని ఆ అమ్మాయికి ఇచ్చి ఆడించ మంది. తాను చేసి ఉంచిన ఒక అరిసె ఆ అమ్మాయి కిచ్చింది. ఆమె తులసి పూజలో నిమగ్న మైంది. ఆ పిల్ల పిల్లవాడిని ఆడిస్తూ సవతి తల్లి చేసే తులసి పూజను జాగ్రత్తగా చూసింది. అనంతరం తానూ చేసి తన దగ్గర ఉన్న అరిశెను నైవేద్యం పెట్టింది. మనసులోనే తన కష్టములు బాధలు తోలిగేలా వరం ప్రసాదించమని తులసమ్మను కోరింది. మరునాడు ఆపిల్లతల్లి తండ్రి వచ్చారు. అంటే తాతగారన్నమాట. ఆయన పిల్లను తన వెంట తీసుకుని వెళ్లి చక్కని వరుని చూసి ఆమెకి వివాహం జరిపించాడు. దంపతులు చక్కగా సిరి సంపదలతో నిండు నూరేళ్ళు జీవించారు. అపుడా పిల్ల ఇదంతా తులసి పూజ మహాత్యమని అనుకుంది. ఇక ఉద్యాపన వినండి.

ఒక కన్యకకు తలంటి నీరు పోయాలి. కొత్త లంగా వోణి ఇవ్వాలి. ఇరువది ఆరు అరిశెలు పళ్ళె మందుంచి వాయన మీయాలి. దక్షిణ తాంబూలం సమర్పించాలి. తులసి పూజ చేసి అరిశెలు నైవేద్యం పెట్టాలి, ప్రసాదం అందరికి పంచి పెట్టాలి. ఈ పూజ చేసిన వారికి సిరి సంపదలు కలిగి భోగ భాగ్యాలు చేకూరుతాయి .భక్తితో శ్రద్దగా చేయాలి. తప్పక ఫలం సిద్దిస్తుంది.

No comments:

Post a Comment