Saturday, February 9, 2013

'ఓం నమః శివాయ'ను స్మరించండి!

ప్రస్తుత శ్రావణమాసంలో నాలుగు సోమవారాలు వస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ నెలలో సోమవారంనాడు శివభక్తులు శివనామ స్మరణలో తరించిపోతుంటారు. శ్రావణమాసంలో సోమవారవ్రతాన్ని పాటిస్తే సకల ఐస్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు సూచిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాలలో శివాలయాలలో అందునా శ్రావణమాసం ప్రారంభంనుంచే ప్రత్యేక పూజలు జరుపుతారు. కాని సోమవారంనాడు విశేషమైన పూజలు జరుగుతాయి. సోమవారంనాడు వివిధ ద్రవ్యాలతో శివుడిని అభిషేకం చేస్తుంటారు.

భక్తాగ్రేశరులు శివాలయాలతోపాటు తమ తమ ఇండ్లలోకూడా రుద్రాష్టకాలు, శివమహిమస్తోత్రాలు మొదలైనవాటిని పఠిస్తుంటారు. సాయంత్రంపూట శివాలయాలలో భోలాశంకరుడిని పుష్పాలు, పండ్లు, పలహారాలు మొదలైనవాటితో అలంకరించి పూజలు చేస్తుంటారు.

శ్రావణమాసంలో శివారాధన మహత్యం: శ్రావణమాసంలో శివభగవానుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రత్యేకంగా శ్రావణమాసంలోనే సాగర మథనం జరిగిందని పురాణాలు చెపుతున్నాయి. సాగర మథనం జరిగే సందర్భంలోనే సముద్రంలోనుంచి విషం బయటకు వచ్చింది. ఆ సమయంలో శివభగవానుడు విషాన్ని తన కంఠంలోనింపుకుని ప్రపంచాన్ని కాపాడాడు. కాబట్టి ఈ నెలలో శివారాధన చేయడంతో భోలాశంకరుని కృప కలుగుతుందని పురాణాలు చెపుతున్నాయి.

అత్యద్భుత ఫలితాలనిచ్చే సోమవార వ్రతం: శ్రావణమాసంలో వచ్చే సోమవారాలలో సోమవార వ్రతం పాటిస్తే భక్తులు అమోఘమైన ఫలితాలు పొందుతారని శాస్త్రాలు, పురాణాలు చెపుతున్నాయి.

వివాహిత స్త్రీలు సోమవారపు వ్రతాలను పాటిస్తే కుటుంబంలో శుఖశాంతులు, కీర్తిప్రతిష్టలు సమృద్ధిగా లభిస్తాయి. అదే పురుషులు ఈ వ్రతాన్ని పాటిస్తే కార్యసిద్ధి, వృత్తిలో ఉన్నతి, చదువులో ఉన్నతి, ఆర్థికంగాకూడా బలపడతారని పురాణాలు చెపుతున్నాయి. అదే కన్యలు శ్రావణమాసంలో ప్రత్యేకంగా సోమవార వ్రతాన్ని పాటించి శివకుటుంబపు విధివిధానాలను పూజిస్తే వారికి యోగ్యమైన వరుడు, గౌరవప్రదమైన అత్తగారిల్లు లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.

బిల్వపత్రము మరియు రుద్రాక్ష పూజలు: శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రము, రకరకాల పుష్పాలతో అలంకరించిన దుకాణాలు శివాలయాలకు ఇరువైపులా మనకు దర్శనమిస్తుంటాయి. శివుని పూజలో రుద్రాక్షకుకూడా ప్రత్యేకమైన స్థానం ఉంది.

రుద్రభగవానుని కళ్ళనుంచి జాలువారిన కన్నీటినుంచి రుద్రాక్షలు పుట్టాయని, కాబట్టి ఇవి శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనవని పురాణాలు చెపుతున్నాయి. దీంతో శివునికి ప్రీతిపాత్రమైన రుద్రాక్షలు మరియు బిల్వపత్రాలతో శివుని ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. 

No comments:

Post a Comment