Saturday, February 9, 2013

పితృదేవతలకు ప్రియం మహాలయం!

మానవుడు మోక్షాన్ని పొందడానికి దేవయానం, పితృయానం అనే రెండు మార్గాలున్నాయని వేదం చెప్పింది. అలాగే జన్మించిన ప్రతి మానవునికీ దేవఋణం, ఋషిఋణం, పితృఋణం అనే మూడు ఋణాలు ఉంటాయని, వాటి నుంచి విముక్తులైన వారికి మాత్రమే ముక్తి లభిస్తుందనీ వేదం శాసిస్తోంది.

యజ్ఞయాగాదులు, తపోధ్యానాలతో దేవఋణాన్ని, సంతానవంతులై తాతముత్తాలకు పిండప్రదానాలు చేసి పితృ ఋణాన్ని, వేద శాస్త్రాధ్యయన ప్రవచనాలతో ఋషి ఋణాన్ని తీర్చుకోవాలి. అనుశాసనిక పర్వంలో భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజు పితృయజ్ఞం గురించి అడిగినప్పుడు భీష్ముడు

ధర్మరాజు! పితృపూజతోనే దేవపూజ సంపూర్ణం అవుతుంది. దేవతలు కూడా పితృదేవతలనే భక్తితో పూజిస్తారు అని చెప్పారు. భాద్రపద కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అనువైనది. ఆషాడ కృష్ణపక్షం నుండి లెక్కిస్తే అయిదవదైన భాద్రపద కృష్ణపక్షాన్ని వారంతా ఆశ్రయించుకుని ఉంటారు. అన్నానికి, మంచినీళ్లకు ఇబ్బంది పడుతూ వాటికోసం ఎదురుచూస్తూ ఉంటారు. కనుక ఆ పదిహేనురోజులు శ్రాద్ధకర్మతో వారికి అన్నోదకాలు కల్పించాలి.

మొత్తం వీలుకాకపోతే మొదటి అయిదురోజులు వదిలి చివరి పదిరోజులు, కుదరకపోతే మొదటి పదిరోజులు వదిలి చివరి అయిదు రోజులు చెయ్యాలి. కనీసం నువ్వులు, నీళ్లు వదిలినా అమావాస్యనాడు మాత్రం తప్పకుండా అన్నశ్రాద్ధం పెట్టితీరాలి. పదిహేను రోజుల్లో ఒక్క రోజయినా శ్రాద్ధం పెట్టాలి. తస్య సంవత్సరం యావత్ సంతృప్తాః పితరోధ్రువమ్ (మహాలయంలో ఒక్కరోజు శ్రాద్ధం పెడితే సంవత్సరం పొడుగునా పెట్టినంతగా పితృదేవతలు సంతృప్తి చెందుతారు).

మహాలయ పక్షానికి ఉత్తరకార్తె వస్తుంది. ఆ కార్తెలో పితృయజ్ఞం చేస్తే పితృదేవతలు సంతానాన్ని అనుగ్రహిస్తారు. రవి కన్యారాశిలో ఉండే సమయం ఇది. పార్వణవిధి (అన్నంతో చేసేది)తో చేసే శ్రాద్ధం పితృదేవతల అనుగ్రహంతో ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

మహాలయపక్షంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా ఒక్కరోజయినా పితృదేవతలకు పిండప్రదానంతో శ్రాద్ధం చేస్తే వారు సంతోషంతో ఆశీర్వదిస్తారు. అష్టమి, ద్వాదశి, అమావాస్య తిథులలోను, భరణి నక్షత్రం ఉన్న నాడు తిథివారనక్షత్ర విచారణ లేకుండా మహాలయ శ్రాద్ధం పెట్టవచ్చునని హేమాద్రిఖండం చెబుతోంది.

తండ్రి మరణించిన తిథి నిషిద్ధ దినమైనా ఆరోజు శ్రాద్ధం పెట్టవచ్చు. తిథినాడు కుదరకపోతే అష్టమి ఎవరికైనా పనికి వస్తుంది. కొత్తగా పెళ్లి అయిన వారు కూడా మహాలయంలో పిండ దానం చేయవచ్చునని బృహస్పతి చెప్పాడు.

No comments:

Post a Comment