Saturday, February 9, 2013

కార్తీకమాసంలో దీపదానం చేస్తే పాపం నశించి పుణ్యం వస్తుంది

కార్తీకమాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగదినాలే. అందులోను ఈ కార్తీకమాసం ఈశ్వరాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్షబిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై సంతోషం కలిగిస్తాడు.

ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. అత్యంత మహిమాన్వితమైన కాలం "ప్రదోషకాలం". సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు (ఒకగంట) "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతినిత్యము వచ్చు ప్రదోషాన్ని నిత్యప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు.

1. నిత్య ప్రదోషం, 2. పక్షప్రదోషం 3. మాస ప్రదోషం, 4. మహాప్రదోషం అని చెప్తారు.

ఇక ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. ఆ సమయమందు ముగ్గురమ్మల తల్లి స్వర్ణరత్న సింహాసనంపై ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి "అధ్యక్షురాలు"గా అధిరోహించియుండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారట. ఆ సమయంలో తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతి దేవి వీణవాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట.

శ్రీమహాలక్ష్మీ గానంచేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడట. ఇక ఇంద్రుడు వేణునాదంతో పులకింపచేస్తూ ఉంటాడట. అట్టి ప్రదోష సమాయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ, అట్టి పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కనుక ప్రదోష సమాయాల్లో ఇతర దేవతలసాన్నిధ్యం కొరకు వేరే ఆలయాలకు పోనక్కరలేదు. కావున అట్టి సమయమందు శివుని ఆరాధిస్తే మనకు శివుని ఆశీస్సులతోపాటు మిగతాదేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొంద గలుగుతామని చెప్పబడినది.

ఇక మన భారతీయ సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధాంనంశం. ఈ దీపదానం చేయుటవల్ల స్త్రీ పురుషులు ఇరువురు పుట్టినది మొదలు వివిధ దశలలో వారు చేసిన పాపాలు అన్నియు ఈ దీపదానముతో అగ్నిలోపడిన మిడుతలవలె పటాపంచలవుతాయని చెప్పబడినది.

No comments:

Post a Comment