Thursday, February 7, 2013

ధ్యానంలో ఏకాగ్రతను ఎంచుకోవాలి

ఆధ్యాత్మిక జీవితంలో ధ్యానానికి అత్యంత ప్రముఖమైన పాత్ర ఉంది. ధ్యానం యొక్క ప్రాధాన్యత గురించి చాలామందికి అనేక అభిప్రాయాలున్నాయి. భక్తి, ఆకాంక్ష, సమర్పణ, పవిత్రత, జీవితం పట్ల సానుకూలమైన వైఖరి, ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితానికి ముఖ్యాంగాలే. ఇవి లేకుండా ఆధ్యాత్మిక జీవితం సాధ్యం కాదు కూడా.

ధ్యానం చేయాలనుకుంటే అందుకోసం కొంత పూర్వ సన్నాహం అవసరం. ఓ అరగంట ధ్యానం చేయాలనుకుంటే అందుకు ఇరవై మూడున్నర గంటల సన్నాహం అవసరమంటారు. ఆధ్యాత్మిక జీవితాన్ని పటిష్టంగా గడపాలంటే, శ్రీమాతను లిప్తకాలమైనా మరువకుండా సదా గుర్తులో ఉంచుకోవాలని శ్రీ అరవిందులంటారు. ఒకవేళ అది కుదరని పక్షంలో పనిని ప్రారంభించేముందు, ఆ పని పూర్తి అయిన తరువాత అయినా శ్రీమాతకు ఆ పనిని సమర్పించుకోవాలి.

ఆ పని అలా కొనసాగుతున్నప్పుడు పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో జ్ఞాపకం చేసుకోవడమనేది ధ్యానానికి పూర్వ సన్నాహంలా ఉపయోగపడి చివరకు అదే ధ్యానంగా మారే స్థితి ఒకటి వస్తుంది.

ధ్యానం.. పద్ధతి
ధ్యానం పట్ల ఒక సుస్థిరమైన వైఖరి కలిగి వుండాలి. తన బలం మీదనే ఆధారపడి ఎవరూ ధ్యానం చేయలేరు అనేది ముందుగా తెలుసుకోవడం అవసరం. ధ్యానం అనే దాన్ని శ్రీమాతకు అర్పించుకోవాలి. ఆమె సహాయాన్ని ఆకాంక్షించాలి.

ధ్యానం యొక్క లక్ష్యం క్రియోశీలమైనదిగా ఉండాలా లేక అచలంగా ఉండాలా అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. అచలమైన ధ్యానం ద్వారా దైవంతో ఏకమై శాంతి, సామరస్యం, ఆనందాన్ని అనుభవిస్తూ ఉండి పోవచ్చు. ఇక అది క్రియాశీలమైన ధ్యానం అయినప్పుడు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఏమాత్రం పొరబాట్లకు తప్పటడుగులకు ఆస్కారం లేని, దైవానికి చెందిన మంచి ఉపకరణంగా ఉండేందుకు ఆస్కారముంటుంది.

శ్రీమాతారవిందుల బిడ్డలుగా జీవించదలచుకున్నవారికి క్రీయాశీలమైన ధ్యానం తప్పనిసరి. ఒకపక్క కర్మ సాగిపోతూ ఉండగానే మరోపక్క వారిని గురించిన ఎరుక దేదీప్యమానంగా ఉండనే ఉంటుంది.

శిరస్సుకు పైన, రెండు కనుబొమ్మల మధ్య ( త్రిపుటి, బొట్టు పెట్టుకొనే చోటు), చైత్య జ్వాల నిరంతరం వెలుగుతూ ఉండే హృదయం మధ్య... ఈ మూడు కేంద్రాలలో ఏదో ఒకచోట ధ్యానంలో ఏకాగ్రత కోసం ఎంచుకోవాలి. చైత్య పురుషునితో ఏకమై అతనిని ముందుకు తీసుకువచ్చేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి హృదయం మధ్యలో ఏకాగ్రత చాలా మంచిదని శ్రీమాతారవిందుల సందేశం.

ధ్యానంలో ఆలోచనలు వచ్చి భంగం కలిగిస్తున్నప్పుడు వాటితో మమేకం కాకుండా, సచేతనంగా వాటిని సాక్షీభూతంగా చూడడం అలవరచుకోవాలి. నెమ్మదిగా ఆలోచనలు ఆగిపోతాయి. ధ్యానం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. వృథా ప్రసంగాలలో తలదూర్చగూడదు. అది మన చేతనను దిగజారుస్తుంది. వీలైనంతవరకు మాటలు తగ్గించి మౌనం పాటించాలి. అంతర్మౌనం మరింత అవసరం. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అంతరంగంలో ప్రశాంతంగా, మౌనంగా ఉండగలగాలి. ఏ పరిస్థితులలో కూడా నిగ్రహం కోల్పోకూడదు.

ఇప్పుడు చెప్పుకొన్నవన్నీ కొన్ని మార్గదర్శకాలు మాత్రమే. అన్నింటికన్నా ముఖ్యం శ్రీమాతతో అంతరంగంలో ఏకం కావడం. ప్రతివారికి శ్రీమాత చేతనతో తనదైన అనుసంధానం ఉంటుంది. ఈవిధమైన అనుసంధానంతోనే శ్రీమాత చేతన వారిని ముందుకు నడిపిస్తుంది. జీవితంలో వాటిని సందర్భానుసారంగా సమకూరుస్తుంది.

No comments:

Post a Comment