Saturday, August 18, 2012

మార్గ శిర లక్ష్మీ వారాల నోము


పాటకులకు మనవి పూజలకు ,వ్రతములకు ,నోములకు ,దేవతారాధనకు వయసుతో నిమిత్తం లేదు. ఏ వయసు వారైనా చేయవచ్చు. నమ్మకం ముఖ్యం .భక్తి ప్రదానం ,విశ్వాసం ఉండాలి . ఫలితం తప్పక లభిస్తుంది . ఈ అనంత కాల గమనంలో కనపడని, వినపడని ఆకారం దైవం, శబ్దం ఆ భగవంతుడే సుమండీ .మనకు జరిగే మంచి, ఉపకారం దైవమే నని నమ్మండి . ప్రతి నిత్యం దైవారాధన ముఖ్యం .దైవ శక్తి ముందు ఏ శక్తి నిలువదు. ఇక వ్రత విషయం లోనికి వద్దాం -

ముందుగా ఉద్యాపన వివరిస్తాను .ఈ వ్రతమునకు మార్గ శిరం సర్వోత్కృష్ట మైనది. అందునా ఆ మాసమందలి లక్ష్మీ వారములు మంచివి .గురువారాలలో ఉపవాసముండాలి. కధ చదువు కోవాలి .పత్రాక్షతలు శిరసున జల్లుకోవాలి .పేరంటాళ్ళను ఆదరించి ,గౌరవించి పంచ బక్ష పరమాన్నములతో భోజనం పెట్టవలెను. 1 వ వారం దేవికి పులగం ,2 వ వారం పరమాన్నం ,3 వ వారం ముద్దా కుడుములు , 4 వ వారం బత్తాయి పండ్లు ,క్షీరాన్నము నివేదన చెల్లించవలెను. శ్రద్ధతో ,భక్తితో ఆరాధన చేసిన తప్పక ఫలం సిద్దించ గలదు.

ఇక నోము గురించి కధ వినండి. పూర్వకాలం ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు ఆయనకు ఇద్దరు భార్యలు .పెద్ద భార్య అమ్ములు. రెండవ భార్య సుబ్బులు. ఒకనాడు రెండవ భార్య తన కూతురును సవతి బిడ్డకు యిచ్చి ఆడించ మంది .ఆమె చేతిలో బెల్లం ముక్క పెట్టింది. అంత ఆ చిన్నది పిల్లను ఆడిస్తూ బెల్లం ముక్క నైవేద్యంగా ఉపయోగించి మట్టితో మహాలక్ష్మిని తయారుచేసి పూజ చేయ సాగింది .అది చూసి రెండవ భార్య సుబ్బులు చీదరించుకుని చీపురుతో పిల్లలను కొట్టి ఆ విగ్రహాన్ని తోసి పారేసింది పాపం.

కొన్నాళ్ళకు ఆ చిన్నదానికి పెండ్లి అయ్యింది. అత్తవారింటికి వెళ్ళినది. వెళ్ళేటప్పుడు తన వెంట దేవతా ప్రతిమను తీసుకుని వెళ్ళింది . అత్తింట అడుగు పెట్టింది .అంతే పాదం పెట్టిన వేళా విశేషం ఏమిటో గాని వారింట లక్ష్మి తాండవ మాడ సాగింది. పుట్టింట దరిద్ర దేవత తిష్ట వేసింది . పుట్టింటి వారు దరిద్రం అనుభవిస్తున్నారని తెలిసికొని ఆమె ఎవరికీ తెలియ కుండా తమ్ముని పిలిపించి బంగారు నాణెములు ఇచ్చి పంపించింది . పాపం అదేమి కర్మమో దారిలో దొంగలు ఆ ద్రవ్యం దోచుకున్నారు .మరల ఆ విషయం చెప్పగా మరల ఇచ్చింది. మరల దొంగలు దోచుకున్నారు. విధి - కర్మ ప్రారంభం వెంతాడితే అంతే సుమండీ .

ఇక చేసేది లేక ఆమె తల్లి దండ్రులను తన ఇంటికి పిలిపించి వారి చేత నోము నోయించింది . పిన తల్లి తన తల్లికి క్షమాపణ చెప్పుకుంది .దేవిని ఆరాధించింది . తాను చేసిన తప్పిదము నకు క్షమించమని దేవిని అడిగింది . దేవిని నిర్లక్ష్యం చేసి కదా దారిద్ర్యం అనుభవించాం ఇక నిరంతరం ఆ దేవిని ఆరాదిస్తామని అందరికందరూ ప్రతి ఏటా వ్రతం ఆచరించి నోము నోచి పూజ చేసి భక్తి శ్రద్దలతో జీవించారు.

ఆ తల్లి దయ వల్ల వారికి సిరి సంపదలు పాడి పంటలు అవీ ఇవీ అన నేల అన్నీ అబ్బాయి . ఇహమందు సుఖపడి పరమందు మోక్ష మందారు.

అందరూ పురోహితుని సహాయంతో ఈ వ్రతం ఆచరించ వచ్చు సుమండీ .

No comments:

Post a Comment