Saturday, August 18, 2012

మహా లక్ష్మి నోము

ఆసియా ఖండమున భారత దేశం ఒకటి .పరమ పవిత్రమైన భారత దేశ మందు పుణ్య క్షేత్రమైన కాశీ నగరంలో ఒక సామాన్య కుటుంబీకుడు ఒకడు జీవించే వాడు. అతడు ఏ పని చేసినా నష్టమే గాని లాభం రావడం లేదు. పూర్వీకు లిచ్చిన సిరి సంపదలు , ఆస్తిపాస్తులు కూడా అయిపోయాయి. దాంతో కటిక పేద వాడయ్యాడు. దారిద్ర్యం అనుభవించ సాగాడు . విదియో ,కర్మయో, ప్రారబ్ధమో గాని ఏ విధంగాను కలసి రావడం లేదు. కాలం దొర్లి పోతోంది .ఆగదుగా ,ఆగడానికి వీలులేదుగా దాని పని అది చేసుకుని పోతోంది. పోవాలి .

ఒకనాడు ఒక యోగి బిక్షకై కాశీ నగరం వచ్చాడు. అతడు ఆ సామాన్య కుటుంబీకుని గుమ్మం ముందు నిలబడి బిక్ష అని అడిగాడు. అంత అతడు లోపల నుండి బయటకు వచ్చి - స్వామీ !లోపలకు రండి అని లోనికి ఆహ్వానించి సకల మర్యాదలు చేసి భోజనం పెట్టి తన విషయం వివరించి చెప్పి - అయ్యా ! కష్టాలు గట్టెక్కే మార్గం చెప్పండి. నేను కటిక పేదను. దరిద్రం అనుభవిస్తున్నాను. పట్టినదల్లా మట్టే అవుతోంది .

అన్నీ తెలిసిన వారు ఏదేని ఉపాయం చెప్పి నా దారిద్ర్యం పోగొట్టండి. అని అడుగగా ఆయన మహాలక్ష్మీ వ్రతం చేయమని అంతా వివరించి వెళ్ళిపోయాడు.

గృహస్థుడు పరమానంద భరితుడై మహాలక్ష్మీ వ్రతం అత్యంత శ్రద్దా భక్తులతో ఆచరించాడు. అంత ఆ తల్లి కరుణించింది. సకల సంపదలు యిచ్చింది . ఇహమందు సుఖ మనుభవించి పరమందు మోక్షం పొందాడు.

ఇక ఉద్యాపన వినండి . ఈ వ్రతానికి బాద్రపద మాసం చక్కని మాసం . శుద్ధ అష్టమి రోజున ఈ వ్రతం ఆచరించాలి .తెల్లవారు జామున లేచి స్నానం చేయాలి .శుచిగా శుబ్రంగా ,మాదిగా ఉండాలి. గృహమంతా పరిశుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టుకోవాలి . పవిత్రమైన పూజా మందిరాన వినాయకుని ప్రతిష్టించాలి . అనంతరం పసుపు, కుంకుమ ఉపయోగించి దరిద్ర దేవత బొమ్మను తయారు చేయాలి .చక్కగా పులిహోర తయారుచేసి నైవేద్యం పెట్టాలి .ఆ నైవేద్యం అందరికి పెట్టి తాను తినాలి. దరిద్ర దేవత బొమ్మను నీటిలో (నుయ్య, చెరువు, కాలువ ,నది ఏది అందుబాటులో ఉంటె అది ) కలిపి వేయాలి . అలా 17 రోజులు చేయాలి .బాద్ర పద బహుళ నవమి నాడు మడిగా పూర్ణ కలశం సిద్దం చేసుకోవాలి . లక్ష్మీ ప్రతిమను బంగారంతో చేయించాలి. 3 లేక 5 గురు పేరంటాళ్ళను ఇంటికి ఆహ్వానించి గౌరవించి మర్యాదలు చేసి పులిహోర ,రవికల గుడ్డ ,పుష్పములు ,దక్షిణ ,తాంబూలం సిద్దం చేసుకుని వాయన మీయాలి. వారికి భోజనం పెట్టాలి.

మహాలక్ష్మి కరుణించి దయ చూపి సకల సంపదలు ప్రసాదిస్తుంది .భోగ భాగ్యాలు అందిస్తుంది .ఆ చల్లని తల్లి కరుణ ఉండాలే గాని సిరి, సంపదలకు లోటు ఉండదు. దారిద్ర్యం దరిచేరదు. సుఖ శాంతులు కలుగుతాయి.

నియమ నిష్టలతో చేయాలి .భక్తి శ్రద్దలు అవసరం . నమ్మకం ,విశ్వాసం ఉండాలి. కటిక పేదవాడు కూడా అష్టైశ్వర్యాలతో తుల తూగుతాడు. నాస్తికులు ఎవరూ ఈ పూజలు చేయవద్దు . ఫలితముండదు. చిత్త శుద్ధి కలిగి భక్తితో ఆచరించిన వారికి పట్టే దశ అంతా ఇంతా కాదు. ఆచరించండి ఫలితం పొందండి .

No comments:

Post a Comment