Saturday, August 18, 2012

ముని కార్తీక నోము

ఆది దంపతుల పుణ్యమాయని మనకు ఎన్నో నోములు ,వ్రతాలు, పూజలు ఈ భూమండలం పై ప్రచారం అయ్యాయి . ఆ పార్వతీ పరమేశ్వరులలో ,ఉపకార దృష్టితో ,పరోపకార బుద్దితో కలియుగ మానవులకు ఈ వ్రతాలు , పూజలు, నోములు వివరించి చెప్పారు. వారందించిన ఈ సత్కార్యా చరణతో ఎందరెందరో సుఖపడి మోక్షం పొందారు.

ఆ కోవకి చెందినదే ఈ ముని కార్తీక నోము . దీనిని శివుడు పార్వతికి ఉపదేశించాడు . పురాణాలు చదివి ప్రజలకు ఉపన్యాసాల ద్వారా ఒక ఆలయమున విని ఇక్కడ పొందుపరచాను.

పూర్వ కాలం నాటి మాట .ఆ కాలాన ఒక అగ్రహారం .అందొక బ్రాహ్మణ కుటుంబం . పాపం ఆ దంపతులకు బిడ్డలు పుట్టి మరణిస్తున్నారు .సంతానం నిలుచుట లేదు. మరొక ప్రక్క దారిద్ర్యం .రెంటితో విసిగి పోయారు. ఆ దంపతులు అందుకు కారణం తెలిసికోవాలని బ్రహ్మ వద్దకు బయలు దేరారు.

వారిద్దరూ సత్యలోకం చేరారు. బ్రహ్మను సమీపించి నమస్కరించి తమ స్థితి గతులు చెప్పుకుని దీనికి కారణం తెలియ చేయమని కోరారు. విన్నాడు ప్రజాపతి . వారి పూర్వ జన్మ కర్మలు తెలిసికొని - ఓ బ్రాహ్మణ దంపతులారా ! సావధానంగా వినండి .మీరిరువురు పూర్వ జన్మయందు ముని కార్తీక నోము నోచి వదలివేశారు. అందువల్లనే మీకీ దారిద్ర్యం ,సంతానం లేకపోవటం .మీరీ జన్మ యందైనా ఆ నోము నాచరించి సుఖపడండి.

అని పలికి వ్రత విధానం తెలిపి వారిని పంపాడు. అ దంపతులు తమ అపరాధం తెలిసికొని బ్రహ్మ చెప్పిన విధంగా వ్రత మాచరించారు. దారిద్ర్యం తొలగి సంతానం పొందారు. ఇహమందు సుఖపడి పరమందు మోక్షమందారు.

ఇక వ్రత విధానం ఉద్యాపన వినండి. మంచిరోజున ఇంటిని ఒంటిని శుబ్రపరుచు కొనవలెను. పరిశుబ్రంగా ఉండవలెను. దేముడి గది కడిగి ముగ్గులు పెట్టవలెను. అక్కడ 2 1 /2 గజముల అంగ వస్త్రము పరచవలెను . నేతితో దీపం పెట్టవలెను. అనంతరం ఇష్ట దేవతను ఆరాదించ వలెను. తరువాత ఉత్తముడైన బ్రాహ్మణునకు ఆ మొత్తం దానం చేయవలెను. దక్షిణ తాంబూలం సమర్పించ వలెను.

వాయన మందీయ వలెను. కార్తీక మాసమంత ఈ దీపారాధన చేయవలెను. వరుసగా 3 సంవత్సరాలు అలా చేసి యదా శక్తి బ్రాహ్మణ సంతర్పణ చేయవలెను .

చక్కని ఫలితం , అర్ధం , పురుషార్ధం కలుగుతాయి. ఆలోచన వద్దు ఆచరించండి .సిరి సంపదలు భోగ భాగ్యాలు కలుగుతాయి .బ్రహ్మ చెప్పిన , శివుడు చెప్పిన లోక కల్యాణం కొరకే సుమండీ.

No comments:

Post a Comment